Wednesday, December 7, 2011

శ్రీరామరాజ్యం పాటలు - 1

(గమనిక: ఎప్పటినుండో వ్రాద్దామనుకుంటూ ఉంటే ఇప్పటికి కుదిరింది -- అందుచేత మొన్నటి వార్తలు విన్నట్టనిపిస్తే చదువర్లు మన్నించాలి)

శ్రీరామరాజ్యం చిత్రంలో పటలు అద్భుతంగా ఉన్నాయి అని సర్వత్రా వినబడుతోంది. ఈ పాటల రచయిత పండితులు శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావ్ గారు. ఆయన కవితాపటిమను గురించి నేను ఈ రోజు ప్రత్యేకించి చెప్పవలసిన పని లేదు. తక్కువ పాటలు వ్రాసినప్పటికీ అన్నీ ఎప్పటికీ గుర్తుండిపోయే పాటలు వ్రాశారు ఆయన. సంస్కృతంలో disco పాట (మహర్షి చిత్రంలో "ఊర్వశి - అస్మద్విద్వత్విద్యుత్ దీపిక త్వం ఏవ"), తెలుగు తిట్లదండకం (ష్...గప్ చుప్ లో "ఒరేయ్ త్రాపి") లాంటి ప్రయోగాలెన్నో చేసారు. గతంలో కుంకుమపూల తోటలో కులికే ఓ కుమారి  పాట గురించి కూడా చెప్పాను.

శ్రీరామరాజ్యంలో వీరు పాటలు వ్రాస్తున్నారు అనగానే ఎంతో సంతోషం కలిగింది. పాటలు విన్నాక మొదట్లో కొంచెం "అరెరే, simple గా వ్రాసారే" అనుకున్నాను కానీ, అలాగ చెయ్యడమే ఈ పాటలను అందరికీ దగ్గరగా చేసింది అని త్వరలోనే గుర్తించాను. పాటలు సులువుగా అనిపించినప్పటికీ మంచి భావంతో ఉన్నాయి. ఈ టపలో ఈ చిత్రగీతాలలో నాకు నచ్చిన కొన్ని వాక్యాలను గురించి చెప్తాను.

1. జగదానందకారక, జయ జానకీప్రాణనాయక!

ఈ పాటలోనే కాక, ఈ గీతసమూహంలోనే మొట్టమొదట నచ్చింది అపరరామభక్తుడు, కర్ణాటకసంగీతకళానిధి, శ్రీ త్యాగరాజుల వారి పంచరత్నకృతులలో మొదటిదైన "జగదానందకారక జయ! జానకీప్రాణనాయక" అనే కృతి పల్లవితో ఈ పాటలకు శ్రీకారం చుట్టడం. ఇలాగ జరగడానికి దర్శకులు, రచయిత, స్వరకల్పకులు, కవి -- అందరూ కారకులు. అందరికీ త్యాగరాజు మాటల్లోనే "ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు". ఈ పాటలో నాకు నచ్చిన వాక్యాలు:
  • "రామపాలనము కామధేనువని వ్యోమసీమ చాటే" - మకారంతో వేసిన అనుప్రాస.
  • "రామశాసనం తిరుగులేనిదని జలధి బోధ చేసె" - రాముడు సముద్రుడిపై బాణాన్ని వేసిన ఉదంతం గుర్తు చెయ్యడం.
  • "రామనామమే అమృతం, శ్రీరామకీర్తనం సుకృతం" - భక్తియోగాన్ని రెండు ముక్కల్లో వివరించడం.
  • "శ్రీరామచంద్రుడే లోకరక్షయని అంతరాత్మ పలికే" - భక్తులకు మనసులో కలిగే భావాన్ని కూడా ఒక్క ముక్కలో చెప్పడం.
పాట మొదటి చరణం ముందు వచ్చే వాయిద్యాల సంగీతం మనసుకు ఎంతో ఉల్లాసాన్ని కలిగించింది. ఇళయరాజకు తప్పితే ఇంత ఆర్ద్రత కలిగించే సంగీతం ఎవరికి సాధ్యపడుతుంది అనిపించేలాగ ఉంది.

2. శ్రీరామ లేరా ఓ రామ!
    ఈ పాటలో ఒక్క వాక్యాన్ని విడిచిపెట్టడానికి వీలు లేకుండా చేసేసారు జొన్నవిత్తుల. వాల్మీకి రామాయణం చదివితే రాముడి గురించి ఏమనిపిస్తుందో అలాగే ఉంది ఈ వర్ణన. ఒక్కో వాక్యమూ కడిగిన ముత్యం.
    • "దరిసనమును కోర దరికే చేరే దయగల మారాజు దాశరథి"  - ఎవరైనా (ప్రజలు/భక్తులు) పిలువగానే రాముడు ఆలస్యం లేకుండా వెళ్తాడు.
    • "తొలుతనె ఎదురేగి కుశలమునడిగి హితమ్ను గావించే ప్రియవాది" - తాను రాజుననే గర్వం లేకుండా ఎవరైనా వస్తే తానే ముందుగా వెళ్ళి వారికి కావలసినవి సమకూర్చి, "ప్రియం కలిగే విధంగా" మాట్లాడేవాడు రాముడు.
    • "ధీరమతియై, న్యాయపతియై ఏలు రఘుపతియే, ప్రేమస్వరమై స్నేహకరమై మేలునొసగునులే" - శ్రీరాముడు స్థిరమతి (స్థితప్రజ్ఞుడై) న్యాయం నిలబెడతాడు, అలాగే అనురాగం నిండిన గొంతుతో మంచి చేస్తాడు. ఇక్కడ స్నేహకరం అనడంలో నాకు శ్లేష గోచరిస్తోంది. స్నేహం కలిగించే విధంగా ఉండేది స్నేహకరం. రాముడు స్నేహకరమయ్యాడు అంటే స్నేహాన్ని పెంపొందించే విధంగా నడుచుకున్నాడు అని. అలాగే, కరం అంటే చెయ్యి అనే అర్థం ఉంది. కనుక రాముడు స్నేహంతో నిండిన చెయ్యిగా మారి మేలు చేస్తాడు అనే ధ్వని కూడా ఉంది. అద్భుతం!
    • "అందరునొకటేలే, రాముడికి ఆదరమొకటేలే, సకలగుణధాముని రీతిని రాముని రీతిని ఏమని తెలుపుదులే" - రాముడికి తన-పర భేదం లేదు (స్థిరమతి), అందరినీ ఒకేలాగ ఆదరించేవాడు. ఆయన విధానాలని వర్ణించడం కష్టం!
    • "తాంబూలరాగాల ప్రేమామృతం తమకించి సేవించు తరుణం, శృంగారశ్రీరామచంద్రోదయం ప్రతిరేయి వైదేహి హృదయం" - ప్రతీ రోజూ రాత్రి అమ్మవారు తాంబూలంలో ప్రేమామృతం కలిపి అందిస్తుంటే శ్రీరామచంద్రుడి శృంగారరూపం ఆమె హృదయంలో ఉదయిస్తోందట. ఇక్కడ గమనించాల్సిన విషయం రేయిలో శ్రీరామ "చంద్రుడు" ఉదయిస్తున్నాడు అని. చక్కని భావుకత.
    • "మౌనం కూడా మధురం" - శ్రీరామచంద్రుడి మాట లాగే మౌనం కూడా తీయగా ఉంటుందట. మొదటి చరణంలో చెప్పిన "ప్రియవాది" కి జోడుగా ఇది రెండొ చరణంలో చెప్పారు.
    • "పిలిచే సమ్మోహన సుస్వరమా!" - రామ అనే పదానికి అర్థం "ఆకర్షించగలిగేది" అని. రాముడి మాట, రూపం సమ్మోహనాస్త్రం లాగా ఉన్నాయని కవి భావం.
    •  "సీతాభామ ప్రేమారాధనమా, హరికే హరిచందన బంధనమా?" - సీతాదేవికి భర్తపైన ఉన్న ఆరాధన పరమాత్ముడికే (హరి) హరిచందనంతో (పసుపురంగు గంధం) వేసిన బంధంలాగ ఉందిట. "హరి" అంటూ యమకం వేసారు కవీశ్వరులు.
    • "శ్రీరాముడు రసవేదం, శ్రీజానకి అనువాదం. ఏనాడు వీడిపోని బంధము" - రాముడు వేదాలకు సారం ఐతే అమ్మవారు దానికి అనువాదం అట. ఎంత చక్కని భావుకత! కాళిదాసు వాగర్ధావివను స్ఫురింపజేసింది ఈ వాక్యం.

    3. ఎవడున్నాడీ లోకంలో

    ఇది హరికథ లాగా కూర్చిన పాట. నిజమే ఇది హరి కథే కదా, అందుచేత ఒక్కటైనా అలాంటి పాట ఉండాలి. బాలు నారదుడికి, వాల్మీకికీ గొంతు మార్చి చక్కగా పాడారు. వాల్మీకికి పాడేటప్పుడు వినయంతో, నారదుడికి పాడినప్పుడు ఆనందంతో పాడారు.

    వాల్మీకికి ఒక ఇతిహాసం వ్రాయాలనిపించినప్పుడు నారదుడిని ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పమంటూ కొన్ని లక్షణాలను సూచించాడు (బాలకాండ 2-4 శ్లోకాలు). వాటిని జొన్నవిత్తుల చక్కగా అనువదించారు.

    • "ఎల్లరికీ చలచల్లనివాడు" - అందరితోనూ ప్రియంగా ఉండేవాడు అంటూ రాముడి గురించి ప్రతీ పాటలోనూ చెప్పడం చాలా బాగుంది.
    • "ఒకడున్నాడీ లోకంలో ఓంకారానికి సరిజోడు" - ఓంకారం బ్రహ్మస్వరూపం. "రామ" శబ్దం కూడా బ్రహ్మస్వరూపం అని శంకరాచార్యులు చెప్పినట్టుగా చదివాను. అందుకని వారిద్దరికీ పోలికను చెప్పడం చాలా బాగా కుదిరింది. ఇది అందరు కవులకీ సాధ్యపడే ఊహాశక్తి కాదు. 
    • "విలువలు కలిగిన విలుకాడు" అంటూ మఱో యమకం వేసారు. విల్లుంటే బలవంతుడు అవుతాడు, కానీ విలువలుంటేనే గొప్పవాడౌతాడు. రాముడికీ రెండూ ఉన్నాయి. అది చక్కని ప్రాసతో చెప్పారు.
    • "పలు సుగుణాలకు చెలికాడు" - సుగుణాలను స్త్రీతో పోల్చడంతో స్త్రీలను గౌరవించడమే కాక సుగుణాలు మిత్రులు, అవగుణాలు శత్రువులని గుర్తుచేయడం బాగుంది.
    4. గాలి నింగి నీరు

    "ఏడుపు పాట" అని తీసేద్దామనుకున్నా గుండెను పదే పదే తట్టేలాగ ఈ పాటను ఇళయరాజ, జొన్నవిత్తుల, బాలు, నటుడు శ్రీకాంత్ చేసారు. ఎంత ఆర్ద్రత ఉన్న పాట!

    "గాలి నింగి నీరు భూమి నిప్పు" అంటూ పంచభూతాలను (భూమికి బదులుగా నేల అని ఉంటే అన్నీ తెలుగుపదాలయ్యుండేవి), "రారే మునులు, ఋషులు? ఏమైరి వేదాంతులు?" అంటూ తత్త్వజ్ఞులను (వీరందరూ రాముడు అడవులకు వెళ్తున్నప్పుడు అడ్డుకొందామని ప్రయతించినవారే. ఒకాయనైతే ఏకంగా రాముడికి నాస్తికత్వాన్ని బోధించబోయి నాలుక కరుచుకున్నాడు), "కొండ, కోన, అడవి, సెలయేరు, సరయూనదీ" (ఇవన్నీ సీతారాముల అనురాగాన్ని గమనించినవి) అంటూ ప్రకృతిని, ప్రశ్నించడం ఎంతో లోతుగా ఉంది.

    "విధినైనా కానీ ఎదిరించేవాడే విధి లేక నేడు విలపించినాడే" అనడంలో విధికి రెండు అర్థాలు ఉన్నాయి. మొదట తలరాత/బ్రహ్మదేవుడు (destiny) అనే అర్థంలో వాడితే రెండవసారి మార్గం అనే అర్థంలో వాడారు. అందుకని ఇది మఱొక యమకం. అలాగే "ఏడేడు లోకాలకీ సోకేను ఈ శొకం"  అనడంలో కూడా శబ్దాలు యమకానికి దగ్గరగా ఉన్నాయి (సోకు, శొకం).

    "అక్కడితో ఐపోకుండా ఇక్కడ ఆ ఇల్లాలే రక్కసి విధికి చిక్కిందా? ఈ లెక్కన దైవం ఉందా" -- అబ్బబ్బా, గుండె పిండేసారు కదండి. ప్రతిసారి సీతమ్మవారిని అదే అపవాదు అనే రక్కసి ఏడిపిస్తోంటే జగద్రక్షకుడైన శ్రీరాముడే ఏమీ చెయ్యలేక విలపిస్తున్నాడు. "ఈ లెక్కన అసలు దైవం అంటూ ఉందా?" అనే సందేహం ఎవరికి మాత్రం కలిగి ఉండదు? కొన్నిసార్లు ఊహ కంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడంలోనే బరువు ఎక్కువ ఉంటుంది!

    "సుగుణంతో సూర్యుని వంశం వెలిగించే కులసతిని ఆ వెలుగే వెలివేసిందా, ఈ జగమే చీకటి అయ్యిందా" -- మఱొక అద్భుతమైన ప్రయోగం. సూర్యుని (సహజంగా వెలుగున్నవాడు) వంశాన్ని తన సుగుణంతో వెలిగించిన (భర్తతో అడవులకు వెళ్ళింది, అగ్నిప్రవేశం చేసింది) ఈ కోడలిని ఆ సూర్యవంశ వెలుగే (ప్రతిష్టే) వెలివేస్తే ఈ లోకంలో ఇక వెలుగు ఎక్కడిది?

    5. సీతా సీమంతం

    పండుగని సన్నాయితోనే పలికించారు ఇళయరాజ. కోకిల, పల్లవి, పున్నమి, ఆమని అంటూ జొన్నవిత్తుల ప్రకృతివర్ణనతో వ్రాసారు.

    ఈ పాటలో "కాశ్మీరం నుండి కుంకుమ", "కర్ణాటక నుండి కస్తూరి" అన్నారు కవి. రామాయణం జరిగినప్పటికి ఇంకా కర్ణాటక రాజ్యం ఏర్పడలేదు. ఈ పొఱబాటుని "ఇంత చక్కని గీతసమూహానికి ఇది దిష్టిచుక్క" అనుకుని మనం వదిలేయాలి.

    "ముత్తైదుల ఆశీస్సులతో అంతా నీకు శుభమే, అటూ ఇటూ బంధం ఉన్న చుట్టాలంతా మేమే" అనడంలో ఆశ్రమంలోని ప్రేమ వాతావరణాన్ని చక్కగా వర్ణించారు. పాట మొత్తానికి నాకు నచ్చిన వాక్యం "ఎక్కడున్నా నువ్ గానీ, చక్కనైన కల్యాణి రామరక్ష నీకు ఎప్పుడూ" అంటూ రాముడిలో సగానికి మఱో సగాన్ని గురించి చెప్పడం ఎంతో ముద్దుగా ఉంది.

    6. రామ రామ రామ అనే రాజమందిరం

    చిన్నప్పుడు రాముడు చేసిన అల్లరి గురించి చెప్తూ సాగే ఈ పాటలో, "మర మర మర" అనడం వాల్మీకి గురించిన కథని గుర్తు చేసింది.

    నేను ఒక సారి సోదరుడు రాఘవని "రామచక్కని" అంటే ఏమిటి అని అడిగితే "రాఁవుడు ఆంధ్రుల ఆరాధ్యదైవం, అందమైనవాటికి ముందర రాముణ్ణి చేర్చుకుని చెప్పుకోవడం మనకు అలవాటు", అన్నాడు. నాకు ఆ వివరణ ఎంతగానో నచ్చింది. అలాగే ఈ "రామసుందరం" అనే పదం ముద్దుగా ఉంది. తదనుగుణంగానే "ముద్దుగారి పోతడంట" అనడంలో ఎంతో నిండుదనం ఉంది.

    ఈ పాటలో జొన్నవిత్తుల అనుకుని చేసారో లేక నా మనసుకే అనిపిస్తోందో మొదటి చరణంలో ప్రతీ వాక్యం రామాయణకథల్లో ఒక ఘట్టాన్ని/పాత్రని గుర్తుచేస్తోంది.
    • "బాణముతో గోడ మీద కోతి బొమ్మ గీస్తడంట" - హనుమంతుడు, వానరసేన
    • "వజ్రపుటుంగరము తీసి కాకిపైకి విసురునంట" - కాకిపైన రాముడు బ్రహ్మాస్త్రం సంధించిన కథ
    • "సిలకెంగిలి జాంపండే కోరి మరీ తింటడంట" - శబరి ఎంగిలి తినడం (అన్నట్టు, "రామచిలక" అనడం కూడా మన తెలుగువాళ్ళే అందమైన చిలకకు ఇచ్చిన బిరుదు)
    • "ఖజ్జురాలు ద్రాక్షలూ ఉడతలకీ పెడతడంట" - ఉడతలు రాముడికి సాయపడడం
    • "దాక్కుంటడంట చెట్టుచాటుకెళ్ళి" - వాలి వధ
    • "రాళ్ళేస్తాడంట చెరువులోకి మళ్ళీ" - సేతు బంధనం
    రెండవ చరణంలో అద్దాన్ని సంచిలో దాచిన కథ కూడా సరదాగా ఉంది. పల్లవిలో "తేప తేప తీయన" అన్నారు. "తేప" అనేది ఒక తీయని వంటకం అని చదివిన గుర్తు, దాని గురించి ఒక సరదా కథ కూడా విన్నాను. మఱి ఇది అదో కాదో తెలియదు. చదువర్లు చెప్పాలి.


    ఇంకా ఉంది...

    Wednesday, November 30, 2011

    దృష్టాంతాలంకారము


    వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> దృష్టాంతాలంకారము


    లక్షణం: చేద్బింబ ప్రతిబింబత్వం దృష్టాంతస్తదలంకృతః
    వివరణ: వాక్యములు ఒకదానికొకటి బింబప్రతిబింబాలుగా (reflections) గా ఉంటే దాన్ని దృష్టాంతాలంకారం అందురు.

    ఉదా:- (చంద్రాలోకం, రచన: ఆడిదము సూరకవి)
    త్వమేవ కీర్తిమాన్ రాజన్! విధురేవ కాంతిమాన్

    భా:- ఓ రాజా, నువ్వే కీర్తిమంతుడవు; చంద్రుడే కాంతిమంతుడు.
    వి:- గతంలో ఉపమాలంకరాములో ఉపమేయము, ఉపమానము, సమానధర్మము చూసాము. దృష్టాంతాలంకారంలో సమానధర్మం ఉండదు! కాకపోతే ధర్మాలకు మధ్యన పోలిక ఉంటుంది. ఉదాహరణ కీర్తికి, కాంతికి కొంత పోలిక ఉంది -- రెండూ అన్నివైపులా ప్రాకుతాయి. అందుచేత వీటికి పొసిగింది. సూటిగా రాజుని చంద్రుడు అని కానీ, కీర్తి కాంతి వంటిది అని కానీ అనకపోయినా -- రెండు వాక్యాల నిర్మాణం దాదాపు ఒకేలాగ ఉండటం వలన ఇది అర్థమౌతోంది.


    దృష్టాంతాలంకారం కేవలం కవిత్వప్రయోజనాలకే కాక, తర్కానికి కూడా మన దేశంలో ఎక్కువగా వాడారు. శంకరాచార్యులు వివేక చూడామణిలో దృష్టాంత పద్ధతి ద్వారా చాలా విషయాలను బోధపరిచారు.

    63-64:- శత్రువులను జయించకుండా "నేను రాజుని" అన్నంత మాత్రాన రాజువు కావు. మాయని నశింపజేసి ఆత్మ తత్త్వం తెలుసుకోకుండా "బ్రహ్మం" అన్నంత మాత్రాన ముక్తి రాదు.

    65:- దాచిపెట్టి ఉన్న నిధి "నువ్వు రా" అన్నంత మాత్రాన వచ్చిపడదు. మాయ అడ్డుగా నిలబడిన ఆత్మతత్త్వం  వాదనల వలన తెలియదు.

    348:- చూస్తున్నది పాము కాదు, తాడు అని తెలిస్తే భయం పోతుంది. ఎదుటనున్నది సత్యం కాదు మాయ అని తెలిస్తే బంధం పోతుంది, మోక్షం కలుగుతుంది.

    243-244:- ఈశ్వరుడి ఉపాధి మహత్, జీవుడి ఉపాధి పంచకోశం -- ఉపాధి తీసేస్తే ఉన్నది ఒక్కటే -- అది బ్రహ్మం. సింహాసనం మీద కూర్చున్నవాడు రాజు, డాలు పట్టుకున్నవాడు భటుడు. సింహాసనం, డాలు తీసేస్తే అక్కడ ఉన్నది మనిషి మాత్రమే.


    శంకరాచార్యుల కవిత్వం పక్కనే వేఱే ఎవరిదీ వ్రాయకూడదనో ఏమో, నాకు ఈ అలంకారం ఉన్న చలనచిత్రగీతాలు గుర్తుకు రావట్లేదు. మీకు తెలిస్తే చెప్పగలరు.

    పొడిగింపు:
    మందాకిని గారి వ్యాఖ్య చూసాక నాకు మఱొక మంచి పాట గుర్తొచ్చింది.
    ఉదా:- (చిత్రం: ప్రణం ఖరీదు, రచన: కీ. శే. జాలాది రాజ రావ్)
    యాతమేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు.
    ఉదా:- (చిత్రం: మాతృదేవోభవ, రచన: కీ. శే. వేటూరి సుందరరామమూర్తి) 
    కన్నీటికి కలువలు పూచేనా? కాలానికి ఋతువులు మారేనా?
    మబ్బులెంతగా కురిసినా ఆకాశం తడిసేనా? మాటలతో మరపించినా మనసున వేదన తీరేనా?

    Monday, November 7, 2011

    అదేం పలకరింపు స్వామీ?

    ఎవరినైనా పలకరించేటప్పుడు "హలో" అనడం సాధారణం. "నమస్కారం, బాగున్నారా?" అనడం గౌరవసూచకం. కొంతమంది పలకరింపు మాత్రం కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఇది కొన్నిసార్లు హాస్యానికి, కొన్ని సార్లు వ్యంగ్యానికి మఱికొన్ని సార్లు ఎలాగ మాట్లాడాలో తెలియక ఇబ్బంది వలన, ఇంకొన్ని సార్లు... ఆ వ్యక్తి తీరే అంత. ఎందుకో ఈ రోజు అవన్నీ గుర్తొచ్చాయి.

    మా ఊరు విశాఖ జిల్లా తాండవ జంక్షన్ (తునికి, నర్సీపట్నానికి మధ్యలో) దగ్గర "ఎఱ్ఱవరం" లోపల సీతారామపురం. అక్కడ దాదాపు రెండు వందల ఎకరాల మామిడి, జీడి తోటల మధ్యలో ఐదారు కుటుంబాలుండేవి. ఉప్పు కావాలంటే ఐదు కిలోమీటర్లు ప్రయాణం చెయ్యాలి. మేము తునిలో ఉండి చదువుకునే రోజుల్లో ఒక్కోసారి రెండు మూడు రోజులు సెలవలు వస్తే మా ఊరు వెళ్తూ ఉండేవాళ్ళం. ఎఱ్ఱవరంలో దిగి కబుర్లు చెప్పుకుంటూ ఐదు కిలోమీటర్లు నడిచేవాళ్ళం. అప్పుడప్పుడు ఎవరైనా తెలిసినవాళ్ళు ఎడ్లబండి మీదనో, సైకిల్ మీదనో వెళ్తూ చూసి ఎక్కించుకుని తీసుకుపోయేవారు.

    ఒక సారి ఏడో తఱగతిలోననుకుంటా, నేను ఒక్కడినే వెళ్ళాను. మిట్టమధ్యాహ్నం ఎండలో తారు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎవరైనా తెలిసినవాళ్ళు తగలకపోతారా అని మధ్యమధ్యలో వెనక్కి చూస్తూ నడుస్తూ ఉంటే, నాకు తెలిసిన ఒక తాతగారు Luna మీద వస్తూ కనబడ్డారు. మా ఊళ్ళో ఉండే ఐదు కుటుంబాలలో ఆయన ఒక కుటుంబానికి పెద్ద. సరే ఆయన పెద్ద మనిషి, నేను చిన్న పిల్లాణ్ణి, ఇది మిట్టమధ్యాహ్నం -- ఈ సమీకరణంలో ఎలాగ చూసుకున్నా ఆయన నాకు "lift" ఇచ్చే తీరాలి అనుకుని సూర్యుడి కంటే వెలిగిపోతున్న మొహంతో "బాగున్నారా?" అని అడిగాను. ఆయన గంటకు ఇరువై కిలోమీటర్ల వేగంతో వెళ్తూ, నన్ను గమనించి, దాటి ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి కన్నడ కంఠీరవ రాజ్కుమార్ లాగా ఒక ముసిముసి నవ్వు నవ్వి "వస్తున్నావా? రా రా..." అంటూ వెళ్ళిపోయారు.

    నాకు మహాకోపం వచ్చింది. పొఱబాట్న ఆయన ఊళ్ళో కనబడితే "నువ్వేం పెద్దమనిషివయ్యా? చిన్నపిల్లాడు ఎండలో నడుస్తున్నాడు? కాస్త ఎక్కించుకుని తీసుకెళ్ళలేవు? పోనీ నీ షష్టిపూర్తైన బండికి అంత ఓపిక లేకపోతే ఒక్క నిముషం ఆగి, ఆ విషయం చెప్పి పోకూడదు? పైగా ఆ ప్రశ్నేమిటి, "వస్తున్నావా? రా రా!", అని. నేను ఇక్కడిదాక వచ్చి ఊరు చివర అత్తిపత్తి మొక్కలతో (touch-me-not) ఆడుకుని, బోరింగు పంపులో కిలుం పట్టిన నీళ్ళు తాగేసి, bus stand లో పడుకుని తిరిగి రేతిరికి తుని వెళ్ళిపోతాననుకున్నావా? (బ్రహ్మానందం styleలో) అసలు మాట్లాడితే meaning ఉండాలి. ఈ ఊళ్ళో నువ్వు తద్దినం పెట్టినప్పుడల్లా వచ్చే ఏకైక భోక్త మా నాన్నగారే. ఆ విషయం మరిచిపోకు.", అందాం అనుకున్నాను. మహానుభావుడు ఆ రెండుమూడు రోజులూ మళ్ళీ కనబడలేదు.

    ఇదేదో పల్లెటూరు, అందుకే ఇలాగ జరిగింది అనుకోవడానికి లేదు. ఇది పెద్ద నగరాల్లో కూడా జరుగుతూ ఉంటుంది. మొన్నీ మధ్యన నా స్నేహితుణ్ణి కలవడానికి California వెళ్ళాను. వాడు నన్ను విమానాశ్రయం నుండి తన బండిలో ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడ దిగుతూనే ఒక అమ్మాయి ఎదురొచ్చింది. ఆమె వీడిని చూసి సిగ్గుతో నవ్వుతూ తల దించుకుని తన car వైపు వెళ్ళింది. వీడు ఆమెను చూసి ఒక విరక్తిభరితమైన నవ్వు నవ్వాడు. సరేలే "ఆళ్ళిద్దరికీ ఏఁవండర్ష్టాండింగుందో మనకేటి తెలుసు", అనుకుని మా వాడితోటి నడిచాను.

    మరునాడు apartment basement లో lift లో మాతో పాటు ఒకాయన ఎక్కాడు. అప్పుడు జరిగిన సంభాషణ నాకు విచిత్రంగా తోచింది. అందరం భారతీయులమేనని గమనించి ఆయన నా మిత్రుడికి shake-hand ఇచ్చి పరిచయం చేసుకున్నాడు. మా వాడు "హలో, నా పేరు ప్రసాద్" అని నా మిత్రుడు చెప్తే, అదేదో ఇళయరాజ అని చెప్పినట్టు అతడు కళ్ళు పెద్దవి చేసి, "ఓ, ప్రసాదా? అంటే మీరూ, మా ఆవిడా - ఆఁ, ఆఁ, ఆఁ", అని కనుబొమలెగరేసి సిగ్గుతో కూడిన ఆశ్చర్యం వలన కలిగిన నవ్వును ప్రసరింపజేశాడు. వెంటనే నా మిత్రుడు విజయోత్సాహంతో కూడిన జాలి వలన కలిగిన నవ్వు ఒకటి విసిరాడు. ఇద్దరూ నవ్వుకున్నాక ఎవరి దారిన వాళ్ళు వచ్చేసాము.

    అనకూడదు కానీ, ఎంతటి పత్నీవ్రతుడి గురించి అయినా సందేహం కలిగేలాగ ఉన్నాయి వాళ్ళ సంభాషణ, మొహాలలో హావభావాలు. నా కుతూహలం కట్టలు తెంచుకుని గొంతులోంచి "ఒరేయ్, ఏం జరుగుతోందిరా? నాకు తెలియాలి...నాకు తెలియాలి...నాకు తెలియాలి! " అని అడిగేలాగ చేసింది. వాడు నవ్వుకుని అసలు కథ చెప్పాడు, "మా ఆవిడ parking లో car నడుపుతుంటే, వాళ్ళావిడ చూసుకోకుండా car reverse చేసి accident చేసింది. మొదట్లో వాళ్ళావిడ మా ఆవిడదే తప్పని వాదిస్తే నేను వెళ్ళి తగులుకున్నాను. ఆ సమయంలో వీడు ఊళ్ళో లేడనుకుంటాను. చివరికి ఆవిడ ఒప్పుకుని insurance వాళ్ళ చేత డబ్బులు ఇప్పించింది",  అన్నాడు. "ఓహో, వాడి మొహంలో సిగ్గు, ఆశ్చర్యం ఏమిటో, నీ మొహంలో విజయోత్సాహం, జాలి ఏమిటో ఇప్పుడు అర్థమయ్యాయి. నాయనా, ఇలాంటి దిక్కుమాలిన expressions తో పలకరించుకోవడం చూడటం ఇదే మొదటి సారి.", అనుకున్నాను.

    పెద్దయ్యాక ఈ పలకరింపులు ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో ఎదురౌతాయి. కానీ బాల్యంలో (సరదాగా) ఇబ్బంది కలిగించడానికి ఇలాంటి పలకరింపులు ఎదురౌతూ ఉంటాయి. చిన్నప్పుడు మేము ఏటా వేసవి సెలవులకు విజయవాడ వెళ్ళేవాళ్ళం. మా తాతయ్య మమ్మల్ని ఉడికించడానికి ఎప్పుడూ వెటకారంగానే ఆహ్వానించేవారు. "ఒసేయ్ అమ్మాయ్, మాఁవిడి పళ్ళన్నీ దాచెయ్ వే. తూర్పోళ్ళొచ్చారు. దొరికితే పరకలు పరకలు లాగించేస్తారు.", అని గట్టిగా అరవడం. "బాబు, ఎందుకొచ్చారు నాయనా? మా ఇంట్లో ఏమీ లేవు. మీ సీతారాంపురం వెళ్ళి జీడిపిక్కలేరుకోండి", అనడం. మేము అది విని పౌరుషపడటం -- ఇది రివాజు. చాలా గంభీరంగా, "అమ్మ, వెనక్కెళ్ళిపోదాం పద!" అన్నా అందరూ నవ్వడం చూసి చాలా కోపం కలిగేది.

    అదేమిటో ఎప్పుడు మా అన్నయ్య విజయవాడ వెళ్ళినా అదో రకం పలకరింపే ఎదురయ్యేది. ఒక సారి ఆత్రంగా మధ్యాహ్నం పన్నెండికి వెళ్ళి తలుపు కొడితే, మా అమ్మమ్మ వచ్చి తలుపు తెరిచి, తీక్ష్ణంగా చూసి, "ఆయనిప్పుడే భోజనానికి కూర్చున్నారండి. కాస్త చల్లబడ్డాక రండి.", అని చెప్పి తలుపు వేసేసింది. మా అమ్మమ్మ కళ్ళజోడు పెట్టుకోవడం మరిచిపోయిందన్నమాట. దానికి తోడు అంతకు ముందు వేసవి మా అన్నయ్య విజయవాడ వెళ్ళలేదు. ఎదిగే వయసు కద! ఉన్నట్టుండి ఒక అడుగు ఎదిగేసరికి మా అమ్మమ్మకు కనీసం "వీడు మనవాడేమో",   అని అనుమానం కూడా కలగలేదు.

    ఒక సారి మా అన్నయ్య వెళ్తూనే మా అమ్మమ్మ కనబడింది. "అమ్మమ్మ, నాకూ బియ్యం పెట్టేయ్" అన్నాడు. (మా వైపు "నాకూ అన్నం వండు", అనడానికి అలాగ అంటారు. సరిగ్గా అన్నం వండే సమయానికి ఇంటికి వచ్చాడు కాబట్టి వంట చేసేవాళ్ళకు మళ్ళీ రెండు ఎసర్లు పెట్టడం ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో రాగానే తన రాకను declare చేసాడు.). పక్కనే అలమర తలుపు మూసి వెలుగులోకి వచ్చిన మా తాతయ్య, "ఏఁవిటి నాయనా? మిట్టమధ్యనం వచ్చి బియ్యం పెట్టమంటున్నావు? సన్న్యాసమేమైనా పుచ్చుకున్నావా?", అన్నారు. వెంటనే మా అన్నయ్య ఒక వంకర నవ్వు నవ్వితే, "వేద్ధవ, బావున్నావా? తాతయ్యేడి అని అడగడం మానేసి అదేం పలకరింపు" అన్నారు. ఇంక అప్పటినుండి మా అన్నయ్య రావడం చూసినప్పుడల్లా మా తాతయ్య, "ఒసేవ్, చిన్నాడొచ్చాడు. బియ్యం పెట్టేయ్", అని చెప్తుంటారు.

    మఱొక సారి మా తాతయ్యకి ఒంట్లో బాగోక వైద్యశాలలో చేర్పిస్తే మా అన్నయ్య కంగారుగా వెళ్ళాడు. ఆయాస పడుతూ తలుపు తెరిచి చూస్తే మా తాతయ్య నిబ్బరంగా పరుపు మీద కూర్చుని, వెటకారంగా, "ఏరా? అంతలా పరిగెట్టుకుని వచ్చావు, ఏఁవౌతుందనుకునావేంటి?", అన్నారు. అప్పటి దాక కంగారు పడ్డ మా అన్నయ్యకు అప్పుడు మనసు కుదుటపడింది.

    వ్యంగ్యమైన పలకరింపులకి వయసుతో పనేమీ లేదు, వెటకారం చెయ్యడానికి అవతల వ్యక్తి బలహీనత, అలవాట్లనే వాడుకోవక్కరలేదు అని నా బాల్యస్నేహితుడొకడు నిరూపించాడు. వాడు ఆదివారం వాళ్ళ నాన్నకు వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉండేవాడు. అది నా ఎనిమిదో తఱగతి అనుకుంటాను. ఒక సారి pen తెచ్చుకోవడం మరిచిపోయాను. వాడు ఎప్పుడూ మూడు నాలుగు రంగుల pen లు compass box లో పెట్టుకుని తిరిగేవాడు. వాడిని అడుగుదామని విరామంలో "ఒరేయ్", అన్నాను. వాడు వెనక్కి తిరిగి చాలా నిర్లిప్తమైన చూపుతో, "ఆఁ, చెప్పమ్మా" అన్నాడు. ఇదేం పలకరింపురా నాయనా అనుకుని, "నాకు ఒక pen కావాలి - సాయంత్రం ఇచ్చేస్తాను", అన్నాను. వాడు "ఏ color అమ్మ, blue ఆ, black ఆ, red ఆ?", అని అడిగాడు. నేను "blue ఐతే better" అన్నాను. దానికి వాడు, "blue stockలో లేదమ్మ. రేపొచ్చి కనబడు. black ఐతే ఇప్పుడే ఇచ్చేస్తాను. ఐనా black తో ఉన్న look blue కి రాదమ్మ", అన్నాడు. ఏం మాట్లాడాలో తెలియక అలాగ ఉండిపోయాను. వాడు వెంటనే నవ్వి, "black ఏ ఉందిరా. ఇదిగో", అని ఇచ్చాడు.

    సరే అందరి గురించి చెప్పి నా గురించి చెప్పుకోకపోతే ఎలాగ? నా వంతు విచిత్రమైన పలకరింపులు నేనూ చేసాను. చిన్నప్పుడు మా ఉపాధ్యాయుడికి నేనంటే చాలా అభిమానం ఉండేది. ఆయన అంటే నాకూ చాలా గౌరవం ఉండేది. నాలుగో తఱగతిలోనో ఎప్పుడో, ఒక రోజు ఆయన "ఎవరైనా పెద్దలు కనబడితే Good Morning/Afternoon/Evening." చెప్పాలి అన్నారు. చిన్న hint ఇస్తే చెలరేగిపోతాను అని మా పాఠశాలలో నా గురించి మంచి talk ఉండేది. అది నిరూపించుకోవాలన్నట్టు, ఆ రోజు సాయంత్రం పాఠశాల నుండి విడిచిపెట్టాక నడుస్తూంటే రెండు వీధుల అవతల ఆయన్ని చూసి "సార్ సార్" అని అరుచుకుంటూ పరిగెట్టాను. ఆయన ఏదో ఉపద్రవం వచ్చినందుకుని కంగారుగా వెనక్కి తిరిగి "What happened Sandeep?" అంటూ ఆత్రంగా అడిగారు. నేను ఆయసంతో ఊపిరి ఎగబీలుస్తూ, "Good Morning ఛి ఛి... Good Evening sir" అన్నాను. ఆయనకు నవ్వాలో ఏడవాలో తెలియక "OK" అని చెప్పి వెళ్ళిపోయారు. "ఆయన చెప్పింది మనం practical గా చేసి చూపించినా ఈయనకెందుకు ముచ్చటెయ్యలేదు చెప్మా", అనుకుంటూ నేనూ ఇంటికి వెళ్ళిపోయాను.

    నా జీవితంలోనే మరిచిపోలేని ఘోరమైన పలకరింపు చేసింది నా మిత్రుడు కిట్టు. వాడికి intermediate పరీక్షలలో చక్కని marks వచ్చినందుకు విజయవాడ నుండి వాళ్ళ దూరబ్బంధువు ఒకాయన ప్రత్యేకించి phone చేసి శుభాకాంక్షలు తెలిపారు. వాళ్ళ అమ్మ మురిసిపోయింది. వాడి తల మీద తన చెయ్యి పెట్టి దువ్వుతూ ఉంది. వాడికా చదువు తప్పితే ఏఁవీ తెలిసేది కాదు. ఆయన గురించి అసలేమీ తెలియదు. వాళ్ళ అమ్మ చద్దన్నం పెఱుగులో కలిపి పెట్టినప్పుడల్లా వాడు చిఱాకు పడుతుంటే, "నాన్న, రావు తాతయ్య గారు లేరు? ఆయనకు బోళ్ళు డబ్బులున్నా ఇప్పటికీ రోజూ చద్దన్నమే తింటారు. ఆయన్ని చూడు ఈ వయసులో కూడా ఎంత ఆరోగ్యం గా ఉంటారో. చద్దన్నం బలం.", అనేది. కర్మ కాలి వాడికప్పుడు ఆ విషయమే గుర్తొచ్చి, "రావు తాతగారు! మీ గురించి మా అమ్మ చెప్తూ ఉంటుందండి. మీరు ఇప్పటికీ చద్దన్నం తింటూనే ఉంటారుట కదా.", అన్నాడు. వాళ్ళమ్మ ఒక్క సారిగా దువ్వడం మానేసి నెత్తి మీద మొట్టింది. ఎందుకు మొట్టిందో అప్పట్లో వాడికి ఎంతకీ అర్థం కాలేదు.

    ఇలాంటి పలకరింపులు తలుచుకున్నప్పుడల్లా నవ్వాగదు.

    Saturday, October 22, 2011

    ప్రియతమా, నను పలకరించి ప్రణయమా (వేటూరి)

    ఇళయరాజ, వేటూరి అంటే నాకు ఎంత ఇష్టమో నన్నెరిగినవాళ్ళకు ప్రత్యేకించి నేను చెప్పనక్కరలేదు. వారిద్దరి కలయికలో వచిన పాటలన్నీ నాకు ఇష్టం. చిరంజీవి, శ్రీదేవి నటించిన, విజయవంతమైన చిత్రం "జగదేక వీరుడు, అతిలోక సుందరి" లో అలాంటి పాటలు చాలా ఉన్నాయి. నాకు ప్రత్యేకించి నచ్చినది, "ప్రియతమా, నను పలకరించు ప్రణయమా" అనే పాట.

    రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వేటూరి వ్రాసిన చాలా పాటలు (ముఖ్యంగా యుగళగీతాలు) అద్భుతంగా ఉంటాయి. ఈ పాటలో ప్రత్యేకత ఏమిటంటే కథానాయిక దేవకన్య కావడం. ఆ విషయాన్ని వేటూరి పాటలో చాలా సార్లు ప్రస్తావించి, ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకున్నారు అని నాకు అనిపిస్తుంది.

    ఇళయరాజా సంగీతం గురించి వర్ణించడానికి నేను అనర్హుణ్ణి. స్వరజ్ఞానం లేని నా వరకు ఇది ఒక అద్భుతమైన బాణీ, స్వరకల్పన. జానకమ్మ, బాలు గురించి నేను చెప్పేదేముంది -- ఈ పాటలో వారి ఉచ్చారణ కొత్త గాయనీగాయకులకు నిఘంటువు వంటిది అని నా అభిప్రాయం.

    చిత్రంలో ఈ పాట సందర్భం ఏమిటి అంటే: రాజు (చిరంజీవి) అనే యువకుడు కొంతమంది అనాథలను పెంచుకుంటూ ఉంటాడు. అతడు ఒక పని నిమిత్తమై హిమాలయాలకు వెళ్తే అక్కడ ఇంద్రుని కుమార్తె ఇంద్రజ (శ్రీదేవి) చెలికత్తెలతో ఆడుకుంటూ పారవేసుకున్న ఉంగరం దొరుకుతుంది. ఇంద్రజకు ఆ ఉంగరం లేనిదే స్వర్గ ప్రవేశం లేదు. ఆ ఉంగరం సంగ్రహించడానికి భూమిపైకి వచ్చి రాజును ఏదో ఒక లాగ మభ్యపెట్టి అది తీసుకుని పోదామనుకుంటుంది. కాకపోతే రాజు మంచితనానికి, తనతో ఉన్న పిల్లలతో ఏర్పడిన అనుబంధానికి లొంగిపోయి ఉంగరం దొరికినా వెళ్ళలేక ఉండిపోతుంది.

    ఈ లోపు రాజుకు నాయిక ఇంద్రుని కుమార్తె అని తెలిసి, పశ్చాత్తాపంతో ఉంటాడు. వారు ఇద్దరూ కలుసుకుని తమ వలపును తెలుపుకునే సమయంలో వచ్చే యుగళగీతం ఇది.


    గానం: బాలు, జానకి
    రచన: వేటూరి సుందరరామ మూర్తి
    దర్శకత్వం: రాఘవేంద్ర రావు
    సంగీతం: ఇళయరాజ

    ప్రియతమా! నను పలకరించు ప్రణయమా
    అతిథిలా నను చేరుకున్న హృదయమా
    బ్రతుకులోని బంధమా, పలుకలేని భావమా
    మరువలేని స్నేహమా, మరలి రాని నేస్తమా

    నాయిక నాయికుణ్ణి "నను పలకరించు ప్రణయమా" అనడంలో "అతడు ప్రణయానికి మూర్తీభవించిన రూపం" అని భావం. అస్పృశ్యమైన ప్రణయానికి, స్పృశ్యమైన నాయకుడికి సామ్యాన్ని చూపడం వేటూరి ముద్ర.అతిథి అంటే చెప్పకుండా వచ్చేవాడు అని అర్థం (అ+తిథి). దేవకన్యలు మానవులను పెండ్లి చేసుకుందామని అనుకోరు కనుక నాయిక జీవితంలోకి నాయకుడు అనుకోకుండా వచ్చాడు అని కవి భావం.

    పల్లవిలో మూడు ప్రయోగాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. నాయిక నాయకుణ్ణి బ్రతుకులోని బంధం, పలుకలేని భావం, మరువలేని స్నేహం గా వర్ణించడం నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా "పలుకలేని భావమా" అన్నప్పుడు సప్తపదిలో "అనగల రాగమై తొలుత వీనులలరించి, అనలేని రాగమై (అనురాగం) మరలా వినిపించి" అనడం గుర్తొచ్చింది. అలాగే యువరాజు చిత్రంలో "తొలివలపే తీయనిది" అనే పల్లవి తో ఉన్న పాటలో "వేదం లాగా లిపి లేనిది" అని ప్రేమను వర్ణించడం ద్వారా వేటూరి ప్రేమను అనుభవించాలి కానీ, మాటల్లో వివరించలేము అని వర్ణించారు. ఇటీవల వచ్చిన "సూర్య S/O క్రిష్ణ" చిత్రంలో కూడా "అభిమానం అనేది మౌనం, పలకదులే పెదవులపై" అని వ్రాసారు.

    ఇక్కడ ఒక విమర్శ ఏమిటంటే "నాయకుడు తన కోసం వెతుక్కుంటూ వచ్చినప్పుడు, మరలి రాని నేస్తం ఎందుకయ్యాడు? మరలి పోని నేస్తం అయ్యాడంటే అర్థం ఉంది కానీ?". దీనికి సమాధానం ఆ మహానుభావుడికే తెలియాలి. ఇంత అద్భుతమైన పాటలో ఈ చిన్ని విషయాన్ని ఆయన విస్మరించారు అంటే నాకు నమ్మకం కుదరట్లేదు.

    ప్రియతమా ||
    ఎదుట ఉన్న స్వర్గమా, చెదిరిపోని స్వప్నమా
    కనులలోని కావ్యమా, కౌగిలింత ప్రాణమా?

    నాయకుడు ఇంద్రజని "ఎదుట ఉన్న స్వర్గం" అనడంలో శ్లేష ఉంది. స్వర్గంలో ఉన్న అందం అంతా తన కళ్ళ ఎదుట ఉంది అని ఒక అర్థం అయితే, తనతో ఉంటే అతనికి స్వర్గంలో ఉన్నట్టు (హాయిగా) ఉందని మఱొక అర్థం.

    అందాన్ని కావ్యంతో పోల్చడం వేటూరికి కొత్త ఏమీ కాదు. ఛాలేంజ్ చిత్రంలో "ఓం శాంతి" అనే పాటలో, "కన్నె నడుమా కల్పనా? కవులు పాడే కావ్యమా" అని అనడం ద్వారా స్పృశ్యమైన (tangible) వస్తువులని అస్పృశ్యమైన వస్తువులతో పోల్చడం చేశారు. కౌగిలి విడితే ప్రాణాలు పోతున్నాయా అని చిలిపిగా అడగడం నాకు నచ్చింది. గుర్తు రావట్లేదు కానీ, ఇవే మాటలు మఱొక పాటలో కూడా వాడినట్టున్నారు.

    నింగి వీణకేమొ నేల పాటలొచ్చె తెలుగు జిలుగు అన్నీ తెలిసి
    పారిజాత పువ్వు పచ్చి మల్లెమొగ్గ వలపే తెలిపే నాలో విరిసి

    వేటూరికి తెలుగు మీద ఉన్న అభిమానం గురించి నేను చెప్పక్కరలేదు. అందుకేనేమో ప్రత్యేకించి దేవకన్యకు కూడా తెలుగు నచ్చిందని చెప్తున్నారు :) నింగి వీణ సంగీతం ఆలపించాలి -- అలాంటిది నేల మీదటి తెలుగు పాటలు వచ్చాయట. పారిజాతం (చదువర్లకు పారిజాతాపహరణం గుర్తుంటే ఇంద్రుడికి, పారిజాతానికి ఉన్న సంబంధం గుర్తొస్తుంది) కాస్తా పచ్చి మల్లెమొగ్గ (సిగ్గు పడే ఆడపిల్ల) లాగా తనలో విరిసి (తనలో మెదిలి) ప్రేమను తెలిపిందట. రెండు వాక్యాలలోనూ స్వర్గాన్ని గురించి మాట్లాడారు.

    మచ్చలెన్నొ ఉన్న చందమామ కన్న నరుడే వరుడై నాలో మెరిసే
    తారలమ్మ  కన్న చీరకట్టుకున్న పడుచుదనమే నాలో మురిసే

    దేవకన్యలో ఆకాశంలో కదా విహరించేది. ఇంద్రజకు (నాయికకు) మచ్చలున్న చందమామ కంటే (ఈ మాటల్లో కూడా శ్లేష ఉంది) మచ్చలేని (గుణవంతుడైన) నాయకుడే నచ్చాడట. తారల్లో ఒక దానిగా వెలగడం కంటే చీర కట్టుకొని ప్రియుడి కోసం వేచి ఉండటం బాగుందట. (ఇదే చిత్రంలో "యమహో నీ యమ యమ అందం" అనే పాటలో "తెల్లని చీర కట్టి, మల్లెలు చుట్టి కొప్పున పెట్టి" అని అనడం కూడా నాకు నచ్చింది.) ఇందులో నాయిక కూడా ఆకాశం కంటే భూమే బాగుందని చెప్పింది.

    మబ్బులన్ని వీడిపోయి కలిసే నయనం, తెలిసే హృదయం
    తారలన్ని దాటగానె తగిలే గగనం, రగిలే విరహం

    నాయిక తన ఉంగరాన్ని సంగ్రహించాక (తస్కరించాక) స్వర్గానికి వెళ్తూ ఉంటే తారలు దాటగానే విరహం మొదలైందట :) ఈ ప్రయోగం ఘాటు నాకు బాగా నచ్చింది. ఇక్కడ గగనం అంటే శూన్యం (ఏమీ లేకపోవడం) అనే ధ్వని కూడా వినబడుతోంది.

    వ్రాయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలో
    రాయిలాంటి గొంతులో ఎన్ని మూగపాటలో
    అడుగే పడక గడువే గడిచి పిలిచే

    మొదటి రెండు వాక్యాలూ "పలుకలేని భావం" కి కొనసాగింపులు. కన్నుల మధ్యన సాగే రాయబారాలకు వ్రాతలెందుకు. గతంలో "లిపిలేని కంటి బాస" అనే పాట పల్లవిలో, తఱువాత "మాయాబజార్" (రాజ, భూమిక నటించిన కొత్తది) చిత్రంలో "ప్రేమే నేరమౌన బ్రోవ భారమా? మాట మౌనమైన రాయబారమా?" అనే పాటలో ఈ భావాలను వ్రాసారు వేటూరి.

    రాయి లాంటి గొంతు అంటే నా గొంతు లాగా వినడానికి కంకర్రాళ్ళు రుబ్రోల్లో వేసి దంచినట్టు ధ్వనించే గొంతు కాదని, (సిగ్గుతో) చలనం లేని గొంతు అని చదువర్లు గుర్తించే ఉంటారు :)

    ప్రాణవాయువేదొ వేణువూదిపోయే శ్రుతిలో జతిలో నిన్నే కలిపి
    దేవగానమంతా యెంకి పాటలాయే మనసు మమత అన్నీ కలిసి

    దేవతలకు మనకు కొన్ని భేదాలుంటాయి -- వారికి చమట పట్టదు, కళ్ళు రెప్పలు పడవు, పాదాలు నేలను తాకవు, శరీరానికి దుమ్ము అంటదు, వాళ్ళు ధరించిన పూమాలలు వాడవు. బహుశః వాళ్ళకు ప్రాణవాయువు (అదే మన oxygen) పీల్చుకోవలసిన అవసరం లేదు అని వేటూరి ఉద్దేశం అయి ఉండవచ్చును. ఆ ప్రాణవాయువు నాయకుడి శ్వాసతో తనది కలిపి, వేణుగానంలో (ప్రణయంలో) ముంచి పోయింది అని నాయిక భావం. అలాగే, వేటూరి ఎంకి పాటల గురించి ప్రస్తావించడంతో నాయికకు మఱింత తెలుగుదనాన్ని అద్దారు.

    వెన్నెలల్లె వచ్చి వేదమంత్రమాయే బహుశా మనసా వచ్చా వలచి
    మేనకల్లే వచ్చి జానకల్లే మారె కులము గుణము అన్నీ కుదిరి

    నాయిక వెన్నెల వలే (ఆకర్షించి) వేదమంత్రం (పెళ్ళి) గా మారిందట. ఇక్కడ "బహుశా" అనడం బహుశా ఖాళీ-పూరింపు చర్య అయ్యి ఉండవచ్చును. కానీ ఇంత అందంగా వ్రాసిన పాటకు ఇలాంటి ఒకటి రెండు మాటలు దిష్టి చుక్కలుగా భావిస్తాను. లేదా నా అజ్ఞానం అనుకుంటాను.

    నాకు పాటలోకి శ్రేష్ఠమైన వాక్యంగా గోచరించింది పై రెండో వాక్యం. మేనకల్లే (నాయకుణ్ణి ముగ్గులోకి దింపడానికి) వచ్చి జానకల్లే (నిష్ఠగా, సహధర్మచారిణి గా) మారిందట నాయిక.
    ఇక్కడ కులము, గుణము అనడంలో నాయకుడి అనుయాయులు, అలవాట్లు అని ధ్వని.

    నీవు లేని నింగిలోన వెలిగే ఉదయం, విధికే విలయం
    నీవు లేని నేల మీద బ్రతుకే ప్రళయం, మనసే మరణం

    నాయికానాయకులు ఒకరు లేని మఱొకరికి వారి సొంత ప్రపంచం అంటే విరక్తిని చెప్తున్నారు. ఐతే, నాకు నచ్చిన ప్రయోగం "మనసే మరణం" -- మనసు ఉంటే ప్రాణం పోతున్నంత బాధగా ఉంది అనే భావం నాకు నచ్చింది.

    వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో
    అమృతాల విందులో ఎందుకిన్ని హద్దులో
    జగమే అణువై యుగమే క్షణమై రగిలే

    వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో -- తెలుగులో ఇది వేటూరి, సిరివెన్నెల మాత్రమే చేయగలిగిన ప్రయోగం అని నా అభిప్రాయం. వానవిల్లు ఏర్పడాలంటే సూర్యకాంతి మబ్బుల్లోని నీటి పొరల ద్వారా చీలి కనపడాలి. దేవలోకంలోని నాయికకు భూమి చేరగానే గుండెలో ఎన్నో భావాలు (ప్రణయం, సిగ్గు, అభిమానం మొ.) పుడుతున్నాయని పరోక్షమైన ఉపమానంగా నాకు నచ్చింది. నాయకుడు చిలిపిగా "అమృతం పంచేటప్పుడు (సరసంలో) హద్దులు దేనికి?" అని తిరిగి అడిగాడు.

    Sunday, October 2, 2011

    వివేక చూడామణి - 2

    శంకరాచార్యులు బ్రహ్మాన్ని అర్థం చేసుకోవడానికి చిత్తశుద్ధి ఉండాలి అని చెప్పారు. ఉత్తుత్తి వాదాల కోసం బ్రహ్మాన్ని గురించి చర్చించుకోవడం అనవసరం అని అదే విషయాన్ని మఱొక్క సారి చెప్తున్నారు.

    వివేకినో విరక్తస్య శమాదిగుణశాలినః
    ముముక్షోరేవ హి బ్రహ్మజిజ్ఞాసాయోగ్యతా మతా

    భా:- వివేకి, విరక్తుడు, శమం మొదలైన గుణాలు కలవాడు, మోక్షాన్ని కోరుకునేవాడు మాత్రమే బ్రహ్మజిజ్ఞాసకు అర్హుడు.

    సనాతనధర్మంలో పదే పదే చెప్పే విషయం, గురుశుశ్రూష. కృష్ణపరమాత్ముడు కూడా ఆయన గురువు దగ్గర కొంత కాలం ఉండి విద్యలభ్యసించారు. అలాంటిది మామూలు మనుషులెంత? అందుకే శంకరాచార్యులు కూడా గురువును వెతుక్కుంటూ వెళ్ళమన్నారు.

    అతో విచారః కర్తవ్యో జిజ్ఞాసోరాత్మవస్తునః
    సమసాద్య దయాసింధుం గురుం బ్రహ్మవిదుత్తమం

    భా:- ఆత్మ గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగినవాడు ఆలోచించాలి. అటువంటివాడు మొదట బ్రహ్మవిద్యలో నిపుణుడై, దయ కలిగిన ఒక గురువును సమీపించాలి.

    ఒక వ్యక్తి బ్రహ్మాన్ని అర్థం చేసుకోవడానికి అతనికి నాలుగు లక్షణాలు ఉండాలి. వీటిని శంకరాచార్యులు లక్షణాలు అనలేదు, సాధనాలు అన్నారు. వీటిని ఆధారంగా చేసుకుని మన కర్తవ్యం (అద్వైతభావం) పూర్తి చేసుకోవాలి.

    ఆదౌ నిత్యానిత్యవస్తువివేకః పరిగణ్యతే
    ఇహాముత్రఫలభోగవిరాగస్తదనంతరం
    శమాదిషట్కసంపత్తిర్ముముక్షుత్వమితి స్ఫుటం


    ఈ సాధనాల గురించి ఒక్కొక్కటిగా వివరించారు.

    1. నిత్యం, అనిత్యం -- ఈ రెండిటి మధ్యనా భేదాన్ని గుర్తించగలగడం

    నిత్యం, అనిత్యం మధ్యన భేదం సులభంగా తోచుతుంది. కానీ, దాన్ని అనుసరించడం చాలా కష్టం. ఉదాహరణకు మనం ఒక కొత్త వస్తువు కొనగానే పగిలిపోతే మనకు చాలా బాధ కలుగుతుంది.మనకీ తెలుసును, ఆ వస్తువు ఎప్పటికీ ఉండిపోయేది కాదు, ఎప్పుడో ఒకప్పుడు పోయేదేనని. కాకపోతే, తెలియడం వేఱు, దాన్ని జీర్ణించుకోవడం వేఱు. శంకరాచార్యులు చెప్తున్నది అది బుద్ధిలో పూర్తిగా జీర్ణించుకుపోవడం గురించి. 

    2. ఇహంలో, పరంలో భోగాలపై విరక్తి

    ఈ లోకమే కాదు, ఉన్నతలోకాలు కూడా శాశ్వతమైనవి కావు. మోక్షం మాత్రమే శాశ్వతమైన స్థితి. అందుకే పాపపుణ్యాలు రెండూ ముముక్షువుకు ప్రతిబంధకాలని శాస్త్రాలు చెప్తున్నది. అన్నమయ్య అన్నట్టు "భారపు పగ్గాలు, పాపపుణ్యములు". ఒక రూపాయి దానం చేసిన వెంటనే మనసులో ఒక తృప్తి పుడుతుంది, "ఈ రోజు ఒక మంచి పని చేశాను", అని. అంటే ఆ దానానికి ప్రతిఫలం అప్పుడే అనుభవిస్తున్నాము. "నా డబ్బు నేను ఇంకొకడికి దానం చేసాను" అనుకుంటూ చేసిన దానం పుణ్యం అవుతుంది, మఱో జన్మలో మనకు వెనక్కొస్తుంది. ఇది మంచి విషయంలా అనిపిస్తున్నా, ఆ పుణ్యం వెనక్కి రావాలి అంటే మనకు మఱో జన్మ ఉండాలి కదా? అందుకే దానం చేసేటప్పుడు, "ఇది నా ధర్మం. ఈ డబ్బు నాది కాదు.", అనే భావం ఉండాలని కృష్ణుడు భగవద్గీతలో చెప్పినది.

    దాతవ్యం ఇతి యద్దానం, దీయతేऽనుపకారిణే
    దేశే కాలే చ పాత్రే చ, తద్దానం సాత్త్వికం స్మృతం

    భా:- "ఇది ఇవ్వడం నా ధర్మం" అని అనుకుని మనకు ఏ ఉపకారమూ చెయ్యని వాడికి, సరైన సమయంలో, సందర్భంలో ఇచ్చే దానమే సాత్త్వికమైన దానం.

    దానం చేసాను అనే సంతృప్తి కలగడం ఇహంలో భోగం, ఈ డబ్బు నాది అని మనసులో ఉండటం పుణ్యలోకాలలో భోగాన్ని ఆశించడం -- ఈ రెండూ మనను దానం చేసినప్పుడల్లా వేధిస్తూ ఉంటాయి. ఇప్పుడు తెలుస్తోందిగా ఆ రెండవ సాధనం పొందటం ఎంత కష్టమో? ఇది సాధన చేస్తూ ఉంటే కానీ రాదు.

    వైరాగ్యాన్ని శంకరుడు వర్ణించిన తీరు:

    తద్వైరాగ్యం జిహాసా యా దర్శనశ్రవణాదిభిః
    దేహాదిబ్రహ్మపర్యంతే హ్యానిత్యే భోగవస్తుని

    భా:- దేహం మొదలుకొని బ్రహ్మం వరకు అనిత్యమైన వస్తువులందు "నాకు వద్దు" అనే భావం కలగడం వైరాగ్యం.

    మనిషికి అన్నిటికంటే సులువుగా లభించే ఆనందాలు ఇంద్రియాలనుండి వస్తున్నాయి. చూడటం, వినడం, మాట్లాడటం, తినడం, వాసన, స్పర్శ -- ఇవే కదా వస్తువుల ద్వారా వస్తున్న ఆనందం. ఇవి కేవలం శరీరాన్ని సంతృప్తిపరచవచ్చును (తినడం), మనసుని సంతృప్తి కలిగించవచ్చును (ఇష్టమైనవారిని చూడటం), బుద్ధికి సంతృప్తిని కలిగించవచ్చును (కష్టమైన సమస్యను పరిష్కరించడంలో ఉన్న సంతృప్తి). ఇవేవీ శాశ్వతం కావు. అందుకే ఇది వద్దు, ఇది వద్దు అనే వదులుకుంటూ కేవలం శాశ్వతమైన (బ్రహ్మపదం) వాటిని కోరుకోవడమే వైరాగ్యం.

    3. శమాది లక్షణాలు (శమం, దమం, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం)

    శమాది లక్షణాలన్నిటికీ నైఘంటికవివరణలు ఉన్నా శంకరాచార్యులు ప్రత్యేకించి వివరించారు.

    3.1. శమం

    విరజ్య విషయవ్రాతాత్ దోషదృష్ట్యా ముహుర్ముహుః
    స్వలక్ష్యే నియతావస్థా మనసః శమ ఉచ్యతే

    భా:- మనసుకు (లౌకిక) విషయాలను చిన్నచూపుతో (ఇవి పనికిరావు అనే భావంతో) చూపిస్తూ ఎప్పుడూ లక్ష్యం (బ్రహ్మపదం) మీదనే మనసును ఉంచడాన్ని శమ అంటారు. (మనసుని అధీనంలో ఉంచుకోవడం).

    3.2. దమం

    విషయేభ్యః పరావర్త్య స్థాపనం స్వస్వగోళకే
    ఉభయేషామింద్రియాణాం స దమః పరికీర్తితః

    భా:- రెండు రకాల ఇంద్రియాలు ఉంటాయి. కొన్ని విషయాలను తెలిపేవి (చెవులు, కళ్ళు మొ.), కొన్ని పనులు చేసేవి (చేతులు, కాళ్ళు మొ.). ఈ రెండింటినీ కూడా విషయాలనుండి దూరంగా తీసుకొచ్చి వాటి కేంద్రబిందువులలో (అంటే చలించకుండా ఉండే స్థితికి) ఉంచడం దమం అంటారు.

    3.3. ఉపరతిః

    బాహ్య అనాలంబనం వృత్తేరేషోపరతిః ఉత్తమా

    భా:- బయటి విషయాలకు బుద్ధిని ప్రతిస్పందించకుండా ఉంచగలగడం ఉపరతి అంటారు.

    3.4. తితిక్ష

    సహనం సర్వదు:ఖానాం అప్రతీకారపూర్వకం
    చింతావిలాపరహితం సా తితిక్షా నిగద్యతే

    భా:- అన్ని దుఃఖాలనూ అస్సలు బాధాపడకుండా, వాటి గురించి ఆలోచించకుండా సహనంతో ఓర్చుకోవడాన్ని ఉపరతి అంటారు.

    3.5. శ్రద్ధ

    శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యవధారణం
    సా శ్రద్ధా కథితా సద్భిర్యయా వస్తూపలభ్యతే

    భా:- ఆత్మస్వరూపం తెలిపే శాస్త్రాలపై, గురువు మాటలపై సంపూర్ణమైన విశ్వాసంతో అవగాహన చేసుకోవడాన్ని శ్రద్ధ అని పెద్దలంటారు.

    3.6. సమాధానం

    సర్వదా స్థాపనం బుద్ధః  శుద్ధే బ్రహ్మణి సర్వదా
    తత్సమాధానమిత్యుక్తం న తు చిత్తస్య లాలనం

    భా:- ఎల్లప్పుడూ బుద్ధిని శుద్ధబ్రహ్మం పై ఉంచడాన్ని సమాధానం అంటారు. అంతే కానీ మనసుని లాలించుకోవడం (ఆలోచనలు లేకుండా ఉంచడం) సమాధానం కాదు.

    4. ముముక్షుత్వం

    అహంకారాది దేహాంతాన్ బంధానజ్ఞానకల్పితాన్
    స్వస్వరూపావబోధేన మోక్తుమిఛ్ఛా ముముక్షుతా

    భా:- అహంకారం మొదలుకొని ఈ దేహం వరకు అన్నిటిపైనా అజ్ఞానం వలన మనం కల్పించుకున్న బంధాలను, వీటి స్వరూపాలను అర్థం చేసుకుని, తెంచుకోవాలనే కోరికే ముముక్షుత అంటారు.

    ముముక్షుత్వం అంటే "మోక్షం కావాలి" అనే బలమైన కోరిక. ఇది అన్నిటికీ మూలమైనది. మోక్షం కావాలనుకోబట్టే మనకు వివేకం, వైరాగ్యం, శమాది గుణాలు సాధనాలు అవుతున్నాయి.

    "బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి మోక్షానికీ తేడా ఉందా?" అని అడగవచ్చును గాక. బ్రహ్మాన్ని తెలుసుకోవడం ఎంత కష్టమైన పని అంటే మోక్షం గురించి బలమైన కోరిక లేకపోతే మధ్యలో ఆగిపోతారు. ఒక సారి బ్రహ్మైక భావాన్ని అనుభవిస్తే ఇంక ఈ లోకం పైన మక్కువ ఉండదు. అందుచేత బ్రహ్మజ్ఞానం, మోక్షం పక్కపక్కనే ఉంటాయి అని నాకు అర్థమనది.


    చిలక మనం నేర్పిన మాటలనే (ఆ పదాలు అర్థం కాకపోయినా) మళ్ళీ మాట్లాడుతుంది. అలాగే పైన చెప్పినవన్నీ శంకరాచార్యులు చెప్పినవి నేను (నాకర్థమైనంతలో) మళ్ళీ చెప్పాను. ఇవన్నీ జీర్ణించుకోవడానికి నాకు సంవత్సరాలు పడతాయి. ఇలాగ వ్రాయడం వలన కేవలం నాకు మననం చేసుకోవడం సులువౌతుంది, ఈ గ్రంథాన్ని చదువని వారికి పరిచయం ఏర్పడుతుంది.

    Friday, September 30, 2011

    సంగీతమేఘం (ఉదయగీతం)


    తమిళంలో ఇళయరాజ చేసిన శ్రావ్యమైన గీతాల జాబితాను తయారు చేయడం వారికి కూడా అసంభవం అని నా నమ్మకం. ఏ జన్మపుణ్యఫలమో ఆయనకు అనుకోగానే మధురాతిమధురమైన బాణీలు ఇట్టే స్ఫురిస్తాయి. అలాంటి మధురమైన గీతాలలో నాకు నచ్చిన ఒక పాట ఇది. దీన్ని ఉదయగీతం అనే చిత్రానికి ముత్తులింగం అనే రచయిత వ్రాసారు, బాలు పాడారు. చిత్రంలో కథానాయకుడు పాటకాడు. సంగీతం పట్ల తనకు ఉన్న గౌరవాన్ని, ఇష్టాన్ని ఈ పాట ద్వారా చెప్తాడు అని నాకు చూచాయిగా అర్థమైంది. ఆ పాటను తెలుగులో కూడా వ్రాద్దామనిపించి ఈ ప్రయత్నం చేస్తున్నాను.

    పాటలో చాలా వాక్యాలు వేటూరిని, ఇళయరాజ ని దృష్టిలో పెట్టుకుని వ్రాసాను. మొదటి చరణంలో సాహిత్యం గురించి, రెండవ చరణంలో సంగీతం గురించి వ్రాసాను. పాట Commerical గా ఉండకుండా వీలైనంతవరకు ప్రయత్నించాను. రోజంతా కూర్చుని వ్రాయవచ్చును కానీ, అంత సమయం లేదు కాబట్టి రెండున్నర గంటల్లో తోచిందేదో వ్రాసాను. పల్లవి ఆఖరిలో పూర్తి చేసినందుకో ఏమో అంత బలంగా అనిపించలేదు.

    సంగీతమేఘం వర్షించే గానం
    మనసుల్లో పండిస్తుంది ఆనందం
    గానం నా జీవితం, గీతం మీకంకితం
    ఎపుడూ సాగాలి ఈ సంబరం

    మాట పూల తోటలో బాటసారి శ్వాసలో
    తావి కలిసిన తీపి గాలుల మాధుర్యమూ
    భావమేఘమాలలో  ఆస చుక్కల డోలలో
    మేను మరిచిన గుండెజాబిలి సౌందర్యమూ
    ఇలా పాటై తేనె వూటై పొంగెనీ గొంతులో (2)
    పాటే నా గమ్యం...

    తీపి స్వరముల సవ్వడో, స్వాతి చినుకుల తాకిడో
    గుండె ఝల్లని పొంగు క్షణమున నేనెఱుగను!
    భావమెఱిగిన రాగమూ, తాళశ్రుతులకు యోగమూ
    మేళవించిన గీతమందు అదే అనుభవం
    ఈ దేహం మన్నైనా పాటై నిలుస్తా (2)
    పాటే నా జీవం...

    తమిళ పల్లవిలో "సంగీతమేఘం తేన్సిందుం రాగం", మొదటి చరణం చివరిలో వచ్చే "ఇంద దేగం, మరైందాలుం ఇసయాయ్ మళర్వేన్" -- ఈ రెండు వాక్యాలనూ తస్కరించి వాడాను. మొదటిది తమిళ పాట తెలిసినవాళ్ళకు (నాకు కూడా) బొత్తిగా తలా తోకా లేకుండా పూర్తిగా కొత్త పల్లవి ఇష్టం లేక. రెండవది నాకు ఆ వాక్యం బాగా నచ్చింది కనుక. నిజానికి ఆ వాక్యం పాతలో రెండు సార్లు వస్తుంది -- దాన్ని వేటూరికి అన్వయించినప్పుడు "ఈ దేహం మన్నైనా పాటై నిలుస్తా, పాటల్లో భావాన్నై (లై) మీలో వసిస్తా" అని పాడుకునేవాడిని. ఇక్కడ మాత్రం బీజగీతంలో లాగ మొదటి వాక్యం మాత్రమే ఉంచాను.

    Thursday, September 29, 2011

    వివేక చూడామణి - 1

    సనాతన ధర్మానికి వేదాలు మూలం. వేదాలు తిరుగు లేనివన్నది సనాతనధర్మంలో మొదటి సూత్రం. వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, పురాణాలు, ఇతిహాసాలు తరతరాలుగా సనాతనధర్మంలో గురుముఖతః ప్రచారం ఔతూ, పరంపర ద్వారా కొనసాగుతూ వచ్చాయి.

    భారతంలోనే చార్వాకం, బౌద్ధం, జైనధర్మం మొదలైన మతాలు ఉన్నాయి. ఇవన్నీ వేదాల యొక్క పరమోత్కృష్టతని ఉల్లంఘించిన మతాలు. శంకరాచార్యుడు జన్మించిన సమయానికి ఇవన్నీ భారతదేశంలో బలంగా పాతుకుపోయాయి. సనాతనధర్మానికి విలువ లేక, నాస్తికత ప్రజ్వలించింది. అటువంటి సమయంలో శంకరాచార్యులు వాటన్నిటినీ తిరస్కరించి తిరిగి భారతదేశంలో సనాతనధర్మాన్ని పునఃస్థాపించారు అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. వేదాలను, ఉపనిషత్తులను, బ్రహ్మసూత్రాలను అధ్యయనం చేసి, వారి గురువులైన గోవిందభగవత్పాదుల అనుగ్రహంతో అద్వైతాన్ని జగత్తుకు అందించారు. ముప్పై రెండేళ్ళ జీవితంలో ఆయన సాధించిన విజయాలను, ఆయన అందించిన భాష్యాలను, స్తోత్రరత్నాలను పరిశీలిస్తే ఆయన దైవాంశసంభూతులనడంలో, ఆత్మవంచన చేసుకోని ఏ ఒక్కరికీ, సందేహం ఉండదు.

    శంకరాచార్యుల గురించి చెప్పడానికి ఒక జీవితం సరిపోదు. కానీ, ఆయన ఆశించినది, ఆయన గురించి మనం చెప్పుకోవడం కాదు, మనం అద్వైతానుభవాన్ని పొంది విముక్తులమవ్వాలని. అందుకే ఆయన ఆలోచనల సారాన్ని మనకు వివేకచూడామణి గా అందించారు. ఆ వివేకచూడామణి శ్లోకాలను, స్వామీ తురియానంద వ్రాసిన అనువాదాన్ని ఈ మధ్యనే నేను చదివాను.

    వివేకచూడామణికి, భగవద్గీతకి చాలా దగ్గర సంబంధం ఉన్నా వివేకచూడామణి అధ్యాత్మికంగా చాలా పురోగమించినవాళ్ళకు తప్ప జీర్ణం కాదు. భగవద్గీతలో పిల్ల, పెద్ద, పండితుడు, పామరుడు అందరూ అర్థం చేసుకోగలిగిన ఘట్టాలు ఉంటాయి. కృష్ణపరమాత్మ కర్మ, జ్ఞాన, ధ్యాన, భక్తి యోగాలను సూచించి వీటిల్లో భక్తియోగం సులభమైనదని, అందరికీ ఆచరణయోగ్యమైనది అని నిర్దేశించాడు. అది మనందరికీ శిరోధార్యం. ఆది శంకరుడు భారతదేశాన్ని చుట్టినప్పుడు బౌద్ధమతం ప్రాచుర్యంలో ఉంది. బౌద్ధమతం వేదాలను, ఈశ్వరుణ్ణి తిరస్కరిస్తుంది. మఱొక్క అడుగు ముందుకేసి ఏకంగా "ఆత్మ" అనేదే లేదు అంటుంది. అటువంటి వారితో వాదించి సనాతనధర్మ వైశిష్ట్యాన్ని చూపడానికి శంకరుడు కూడా అదే స్థాయి abstraction ని ఉపయోగించి, వారి వాదనాపద్ధతులను కూడా అనుసరించి వారిని ఓడించారు. స్వయంగా భక్తిమార్గాన్ని కూడా అనుసరిస్తూనే, జ్ఞానమార్గంలో వెళ్ళి ఉపనిషత్తులను ఎంతో లోతుగా అధ్యయనం చేసి, వాటి సారం జీవాత్మ-పరమాత్మల యొక్క ఏకత్వమని, ఆ అద్వైతాన్ని ప్రబోధించారు.

    అధ్యాత్మవిద్యను అధ్యయనం చేయడం చాలా కష్టం, దాన్ని ఆచరించడం మరింత కష్టం. అందుకే కృష్ణపరమాత్మ భగవద్గీతలో ఇలా అన్నాడు:

    మనుష్యాణాం సహస్రేషు, కశ్చిత్ యతతి సిద్ధయే
    యతతాం అపి సిద్ధానాం, కశ్చిత్ మాం వేత్తి తత్త్వతః

    దీని భావం, "వెయ్యిమంది మనుషులలో మోక్షం కొఱకు ప్రయత్నించేవాడు ఒక్కడు ఉంటాడు. అలాంటివారిలో ఎవరో ఒకరికి మాత్రమే నేను అర్థమవుతాను", అని.

    కృష్ణుడు చెప్పిన యోగాలన్నీ కూడా, "అనుసరిస్తున్నాము" అనుకుని ఆత్మవంచన చేసుకునేవారు నిత్యజీవితంలో కనిపిస్తూ ఉంటారు. జీవితాంతం తన సంతృప్తి కోసం కర్మలని ఆచరిస్తూ, ఫలితాలను చూసి మురిసిపోతూ చివరికి అంతా భగవంతుడికి అర్పిస్తున్నాను అనుకుంటారు. అది కర్మయోగమని వారు అనుకున్నా, ఒక రకంగా చెప్పాలి అంటే ఎంగిలే. మఱి కొందరు జ్ఞానయోగంలో ఉన్నాము అనుకుంటూ పుస్తకాలు తిరగేస్తూ వాదించుకుంటూ ఉంటారు. పఠనం, వాదన రెండూ తప్పు కావు కానీ, ఆ వాదనలో ఎంత వరకు మోక్షప్రయాస ఉందో కూడా గమనించుకోకుంటే అది పాండిత్యం కాదు, శబ్దప్రచ్చన్నపామరత్వం అవుతుంది. ధ్యానయోగం పేరుతో అంతర్యానం చేసుకోకపోతే అది నిద్రతోనే సమానం. అందుకే అర్జునుడు కూడా ధ్యానయోగాన్ని కృష్ణపరమాత్మ సూచించగానే "నా వల్ల కాదు", అన్నాడు. చివరిగా భక్తియోగం అనుసరిస్తున్నాము అనుకునే వారు కూడా సమదర్శిత్వాన్ని, స్థితప్రజ్ఞని, అనన్యచింతనని ఇవ్వకపోతే భగవంతుడికి కొంచెం దగ్గరవ్వడం, పుణ్యార్జన జరుగుతాయి కానీ, మోక్షాణికి ఒకడుగు ఇటు ప్రక్కన వదిలేసే అవకాశం ఉంది.

    ముఖ్యంగా భక్తిని సరిగ్గా అర్థం చేసుకోని వారు ఆ మార్గంలో వెళ్తున్నాము అనుకుంటారే కానీ పరమాత్ముణ్ణి కూడా తమ దైనందినజీవితంలో ఒక వస్తువు లాగా భావించే ప్రమాదంలో ఉంటారు. భక్తి పేరుతో కొందరు, ప్రజల సొమ్ము దోచుకున్నదంతా దోచుకుని, దేవాలయాలకు కిరీటాలు విరాళంగా ఇచ్చి వారి పాపాలు తొలగిపోయాయి అనుకుంటారు. కొందరు రోజూ పొద్దున్న దణ్ణం పెడుతూనే దేవుడు వారికేదో ఋణపడిపోయినట్టు భావిస్తుంటారు. అడిగితే, "He is my best friend." అంటారు. మఱి కొందరు నామమాత్రంగా పూజలు, జపాలు చేస్తూ ఉంటారు. పూజ, జపం చేసినప్పుడల్లా దృష్టి ఫలితం మీదనే. ఆ ఫలితం ప్రసాదం కావచ్చును, కార్యసిద్ధి కావచ్చును. కొందరు మాత్రమే దైవాన్ని తలుచుకున్నప్పుడు ఆ దైవం సామీప్యతను అనుభవించగలుగుతారు. 

    ఈ విషయాన్ని గుర్తించో ఏమో శంకరులు నిర్ద్వంద్వంగా ఈ విధంగా అన్నారు:

    5. పఠంతు శాస్త్రాణి, యజంతు దేవాన్, కుర్వంతు కర్మాణి, భజంతు దేవతాః
    ఆత్మైకబోధేన వినాపి ముక్తిః న సిద్ధ్యతి బ్రహ్మశతాంతరేऽపి

    13. అర్థస్య నిశ్చయో దృష్టో విచారేణ హితోక్తితః
    న స్నానేన, న దానేన, న ప్రాణాయామశతేన వా

    ఈ శ్లోకాల భావం "శాస్త్రాలు చదివినా, దేవతల ప్రీత్యర్థం యజ్ఞాలు చేసినా, దేవతలను భజించినా, మనిషి తాను ఆత్మ అన్న విషయం తెలుసుకోకపోతే కోటి-కోటి సంవత్సరాలైనా ముక్తిని పొందలేడు. పుణ్యనదీస్నానాలు, దానాలు, ప్రాణాయామాదులు సత్యం తెలుసుకోవడానికి దోహదపడవు. కేవలం గురూక్తులపైన దృష్టిని ఉంచి అర్థం చేసుకోవడం వలనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ", అని.

    భక్తియోగాన్ని నమ్మినవారికి ఈ రెండు పద్యాలూ కర్కశంగా తోచవచ్చును. స్వయంగా కృష్ణపరమాత్ముడే "సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ" అని చెప్పాడు కదా? మఱి దేవుడు మోక్షాన్ని ఇవ్వడంటారేమిటి అని. శంకరాచార్యులు చెప్తోన్నది ఈ దేహంలోని వాసనలు నీకు ఉన్నంత కాలం, "నేను" అన్నప్పుడు "దేహాన్ని" కూడా కలుపుకొంటున్నంత కాలం నీకు ముక్తి లేదు అని. భక్తిమార్గంలో కూడా సరిగ్గా పయనిస్తున్నవారికి ఆత్మైక భావం కలుగుతుంది. అది కలగకుంటే ఎక్కడో పొరబాటు ఉంది అని.

    శంకరుడు వివేకచూడామణిలో రెండుమూడు సార్లు తప్ప దేవుడు అన్న పదాన్ని ప్రస్తావించలేదు. దానికి కారణం ఆయనకు భక్తి లేకపోవడమో, ఆయనకు భక్తియొగంపైన నమ్మకం లేకనో కాదు. కర్మ, జ్ఞానం, ధ్యానం, భక్తి -- ఏ యోగాన్ని అనుసరించిన ముముక్షువుకైనా ఆయన చెప్పిన విషయాలు ఏదో ఒక సమయంలో ఎదురౌతాయి అని.

    (ఇంకా ఉంది...)

    Saturday, September 10, 2011

    విడిపోవడం ఎలా?

    యండమూరి వీరేంద్రనాథ్ వ్యక్తిత్వవికాసం పైన వ్రాసిన పుస్తకం పేరులాగున్నా ఈ వ్యాసంలో అలాంటివి ఏమీ ఉండవని ముందుగానే చెప్తున్నాను. "ఎవరైనా కలిసుండటం ఎలాగ అని వ్రాస్తారు కానీ ఇలాగ విడిపోవడం ఎలాగ అని వ్రాస్తారా?" అని అడిగే చదువర్లకు వివరణ, ఈ వ్యాసానికి ఉపోద్ఘాతం రెండూ ఒకటే.

    మనిషి ఒక విచిత్రమైన జంతువు. తను ఒక్కడూ ఉండలేడు, అలాగని మఱి కొందరితో ఉంటే వాళ్ళందరికంటే పై చేయి తనదవ్వాలని, తనకొక ప్రత్యేకత ఉండాలని కోరుకుంటాడు. (ఈ గోలంతా మనం ఇదివరకే ఒక సారి చెప్పుకున్నామనుకోండి. దానికి ఇది కొనసాగింపు వ్యాసం అనుకోవచ్చునేమో.) ఈ ప్రత్యేకతని సంపాదించుకోవడానికి మొదట తన చుట్టూ ఒక బలగాన్ని ఏర్పరుచుకుని, ఆ బలగానికి తను నాయకుడై, ఆ బలగం బలం పెంచి మిగతావారిని ఓడిస్తాడు. ఓడిపోయినవారిలో గొప్ప ఎవరో పట్టించుకోరు, గెలిచినవాళ్ళలో నాయకుడి పేరే అందరికీ తెలుస్తుంది. ఫలితంగా అతడికి ప్రత్యేకత కలుగుతుంది. భాషలో సవర్ణదీర్ఘసంధి సూత్రం, గణితంలో పైతాగరస్ సూత్రం, భౌతికశాస్త్రంలో న్యూటన్ సూత్రం లాగా మనిషి అనే జంతువు ఆడే, సాంఘిక క్రీడలో ఇది ఒక సూత్రం/ఎత్తు. దీన్నే ముద్దుగా కూడలి-విడుగడ సూత్రం అని పిలుచుకుందాం. చదువర్లెవరైనా ఇంకా మంచి పేరును సూచిస్తే చాలా సంతోషిస్తాను.

    ఇదే సూత్రాన్ని తరతరాలుగా మనుషులు వాడుకుంటూనే ఉన్నారు. సరే ఒకప్పుడు ఛాందసం, మూర్ఖత్వం, సమాచారమాధ్యమాల లేమి కారణం అనుకుందాము. గొప్ప సూత్రం లక్షణం ఏమిటి అంటే అది కాలంతో పాటు మారిపోదు. సర్వకాల సర్వావస్థలలోనూ పని చేస్తుంది. కూడలి-విడుగడ సూత్రం కూడా ఒక గొప్ప సూత్రం. ప్రస్తుతకాలంలో కూడా ఈ సూత్రం వాడకంలో ఉందనడానికి సాక్ష్యాలను చెప్పడానికే ఈ వ్యాసం.

    చైనీయులకు, మనకు చాలా సహస్రాబ్దాల నుండి వాణిజ్యసంబంధాలు ఉన్నాయి. చైనీయులకు చాలా ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉన్నాయి. వాళ్ళ భాష, దేశం మొదలైన విషయాలపై వాళ్ళకు చాలా గౌరవం ఉంది. ప్రపంచమంతా ఉపాధి కోసం ఆంగ్లంలో చదువుకుంటూంటే వీళ్ళు మాత్రం తమ భాషని ఇంకా నిలబెట్టుకుంటూ ఆంగ్లాన్ని దూరంగానే ఉంచుతున్నారు. దానిలో మంచీ ఉంది, చెడూ ఉందనుకోండి. అది కాదు ఇక్కడ విషయం. 1940లలో ఒక చైనీయ శాస్త్రవేత్త ఒక గుహలో కొన్ని అస్తి పంజరాలను చూశాడు. అవి మానవరూపంలో ఉన్నప్పటికీ మానవులకు (Homo Sapiens) చెందినవి కావు. వారి (మన) పూర్వీకులైన Homo Erectus Pekinensis వి అని తెలుసుకున్నాడు. అంటే కోతిజాతిలో మన కంటే పూర్వం ఉన్న జంతువులవి అన్నమాట. వాటి ముఖాలు గుండ్రంగా, ముక్కు చప్పిడిగా ఉండటం గమనించి ఓహో, ఐతే మనందరం (చైనీయులు) వీరి సంతతి అన్నమాట అని "ఊహించాడు". అంతే రాజకీయనాయకులు వచ్చేశారు. దాన్ని దండోరా వేయించారు. అది పెద్ద రాజకీయవిషయమైంది, చైనీయజాతి గౌరవానికి సంబంధించిన విషయమైంది.

    చూసారా? మొదట "మేము వేఱు" అనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించి వాళ్ళను కూడజేసారు. వారిని మిగతా జనాలనుండి విడదీశారు. చిటికెడంత ఆధారం దొరకగానే "మేము మామూలు మనుషులం కాఁవు, మేము మీ అందరికంటే ముందు పుట్టిన జాతినుండి వచ్చాము" అనే భ్రమలోకి ప్రజలను తోసి దాదాపు 50 ఏళ్ళు చిన్నపిల్లలకు పాఠ్యపుస్తకాల ద్వారా అదే మప్పారు. అంతే! నాయకులకు గొప్ప ఆదరణ లభించింది. చివరికి 1999లో జన్యుపరిశోధన ద్వారా ఎంతో దృఢంగా, అసలు చైనీయులకీ Homo Erectus కి ఏమీ పెద్ద సంబంధం లేదు, చైనీయులు కూడా అందరు మనుషులలాంటి వారే అని ఒక చైనీయ శాస్త్రవేత్తే తేల్చి చెప్పాడు. అతను చిన్నప్పటినుండి చదువుకున్న విషయం తప్పని తెలిసి ఎంతో బాధపడ్డానని స్వయంగా అతనే BBC కి ఇచ్చిన interview లో చెప్పాడు. అప్పటిదాకా "మేము వేఱు" అనే అబద్ధం పునాది గా నిర్మించుకున్న రాజకీయభవంతులన్నీ ఒక్క సారిగా చలించడం మొదలెట్టాయి.

    సరే పొరుగు దేశంతో మొదలెట్టాము. ఇప్పుడు పొరుగు రాష్ట్రం. తమిళనాడులో చాలా రోజులు ద్రవిడులు వేఱు, ఆర్యులు వేఱు -- ఆర్యజాతి వారు ఉత్తరం నుండి ద్రావిళ్ళను తరిమి దక్షిణానికి పంపించారని ప్రచారం జరిగింది. దీనికి పాక్షికంగా కారణం ఆంగ్లేయులు. దక్షిణ, ఉత్తర భారతదేశ భాషలలో భేదాలను; పాశ్చాత్య, సంస్కృతభాషలలో సామ్యాన్ని వివరించడానికి వారికి ఈ ఆర్య-ద్రవిడ జాతిభేదం ఒకటే తోచింది. కానీ, అది కేవలం ఊహ. ఆ ఊహ EVR, కరుణానిధి మొదలైన వారికి ఉపయోగపడింది.

    తమిళం భాషలన్నిటిలోకీ పురాతనమైనదని, సంస్కృతం ఈ మధ్యనే పుట్టిందని చాటింపేశారు. కాకపోతే వారికి ఎదురైన రెండు ప్రశ్నలు -- ఒకవేళ ఆర్యులు ద్రవిడులపై దండుకొస్తే అంత పెద్ద విషయం ఆ రెండు భాషలో చారిత్రాత్మక గ్రంథాలలోనూ ఎందుకు ప్రస్తావించలేదు అని. అప్పుడు మళ్ళీ సంస్కృతగ్రంథాలతో పని పడింది. వాటికి వక్రీకరించిన భాష్యాలతో వచ్చారు. రామాయణం కథ అంతా దక్షిణాది వాళ్ళను కోతులుగా, రాక్షసులుగా చూపించి కించపరచడానికి, ఉత్తరాది రాజు ఐన రాముడి ఆధిక్యతను చూపడానికి అని చెప్పారు. అలాగే అగస్త్యుడు ఉత్తరాది నుండి దక్షిణానికి రావడం వేదాలలో ఉంది కాబట్టి అది కూడా ఉత్తరాది నుండి ఆర్యులు దక్షిణాదికి రావడాన్ని సూచిస్తోందని చెప్పారు.

    ఇప్పుడే ఒక చిన్న మెలిక పడింది. అగస్త్యుడు తమిళ వైయాకరణుడని అప్పటిదాకా చెప్పుకున్నవారు అగస్త్యుడు ఆర్యుడని, ఉత్తరం నుండి వచ్చాడని చెప్తే అప్పుడు సంస్కృతమే తమిళంగా కంటే పురాతనమైనది అవ్వాలి కదా? అబ్బే, తర్కం నిజాలపైన ఆధారపడాలి కుతర్కానికి నిజంతో పనేమిటి? పదండి ముందుకు, పదండి తోసుకు అనుకుంటూ బ్రాహ్మలని (వీళ్ళే ఆర్యులట!) తిట్టి, వారిపైన సంఘంలోనే దురభిమానం కల్పించారు. అదిగో మళ్ళీ ద్రవిడులమంటూ కూడిక, ఆర్యులు వేఱంటూ విడతీయడం. ఉన్నట్టుండి EVR మహానేత అనిపించుకున్నాడు. ఇప్పటికీ ద్రవిడ మున్నేట్ర కళగం పేరిట (DMK) అవే భాష్యాలు కొనసాగుతూ ఉన్నాయి.

    ఇక్కడ మఱి కొన్ని మెలికలు. "ద్రవిడ" అనే పదమే సంస్కృతపదం. భాగవతంలో ఆ పదం కనీసం మూడు సార్లు ఉంది. దాని అర్థం "దక్షిణాది దేశం" అని -- అది వేఱే జాతి అని కాదు. (వైదీక గ్రంథాలలో ఎక్కడా ద్రవిడ దేశంలో వేఱే జాతి వారు ఉన్నారు అని లేదు.) ఆ పదాన్ని ఆది శంకరులు ప్రచారంలోకి తీసుకొచ్చారు. "నువ్వెవరు" అని ఉత్తరాదిలో ఎవరో అడిగితే, "ద్రవిడశిశువును" అని చెప్పారట. సరే తీగె లాగితే డొంక కదులుతోంది. అసలు విషయానికి వస్తే 2009లో ఒక బృహత్పరిశోధనా ఫలితంగా తేలింది ఏమిటంటే ద్రవిడ, ఆర్య సంస్కృతులు వేఱుగా ఉన్నాయో లేదో తెలియదు కానీ, రక్తాలైతే వేఱు కాదు అని. జన్యుపరంగా భారతదేశంలో రెండు జాతులు 40,000 సంవత్సరాల క్రితం (అంటే Homo Floresiensis వంటి మానవసంబంధజాతులు ఇంకా బ్రతికి ఉండగానే, శాస్త్రీయ అంచనాల ప్రకారం అప్పటికి మానవుడు ఇంకా మట్టికుండలు కూడా తయారు చేసి ఉండడు!) ఉన్నాయి కానీ ఈ మధ్యన ఏమీ లేవు అనే నిర్ధారణకు వచ్చారు. మొత్తం రెండు జాతుల భూటకం అంతా కూలిపోయే సమయం ఆసన్నమైంది.

    సరే పొరుగు దేశం, పొరుగు రాష్ట్రం అయ్యాయి. ఇప్పుడు వేఱుబడదాం అనుకునే మన రాష్ట్రం వారి గురించి మాట్లాడుకుందాం. చైనీయులు "మేము మనుషులమే కాఁవు" అన్నారు, తమిళులు "మీరు మా జాతి మనుషులు కారు", అన్నారు. అదేదో చిత్రంలో చెప్పినట్టు, "కొట్టుకోవడానికి కారణం ఎందుకు? నిర్ణయించుకున్నాక కొట్టేసుకోవడమే" అన్నట్టు, ఆఖరికి భాష పేరు చెప్పి కొట్టేసుకుందాం అని తెలంగాణలో కొంతమంది సిద్ధమౌతున్నారు. అయ్యా, తెలంగాణాకు అన్యాయం జరిగి ఉండవచ్చును, తెలంగాణను ఆంధ్రనాయకులు దోచుకునీ ఉండవచ్చును, తెలంగాణ వేఱ్పాటు ప్రస్తుతం అత్యవసరం కూడా కావచ్చును -- నాకివేవీ తెలియవు. కానీ, తెలంగాణ అనేది వేఱే భాష అనడం, తెలుగు కవుల విగ్రహాలు పడగొట్టడం, హన్నన్న! ఒక్కసారి గుండెల మీద చెయ్యి వేసుకోని ఆలోచించండి. రాజకీయాలకు భాషకు ముడి ఏముంది? శ్రీకాకుళం యాస, నెల్లూరు యాస, తూర్పు గోదావరి యాస -- వీటన్నిటినీ మనం చూస్తూనే ఉంటాము, చలనచిత్రాలలో హాస్యానికి వాడుకుంటూనే ఉంటారు. ఉన్నట్టుండి భాష వేఱనడం కొంచెం విడ్డూరంగా లేదు? మళ్ళీ చెప్తున్నాను -- నాకు తెలంగాణా వేఱ్పడాలా వద్దా అన్నది తెలియదు. కానీ, భాష వేఱు అనడం మాత్రం నాకే కాదు, పరరాష్ట్రీయులైన నా మిత్రులకు కూడా విచిత్రంగా తోచింది. కూడలి-విడుగడ సూత్రానికి ఎంత చిన్న కీలు సరిపోతుందో చెప్పడానికి ఇది ఒక మచ్చుతునక మాత్రమే.

    ప్రఖ్యాత విదూషకుడు George Carlin, "గర్వం అనేది నాకు కేవలం నా వ్యక్తిగత పురోగతి, సమర్థత, కార్యసిద్ధి వలనే కలుగుతుంది. నా పుట్టుక చేత పొందేది ఏదైనా నాకు సంతోషాన్ని ఇస్తుంది కానీ, గర్వాన్ని కాదు" అని అన్నాడు. అమెరికాలాంటి సంపన్నమైన దేశంలో అతడు, "I am not proud to be an American. How can anyone be proud of an accidental event? I'm just happy to be born in America.", అని చెప్పాడు. అదే మనమూ గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో పుట్టినందుకు  గర్విస్తున్నాను, తమిళనాడులో పెరిగినందుకు గర్విస్తున్నాను, మొదలైనవి కూడా పరుల కార్యసిద్ధిని దోచుకోవడంతోనే సమానం. మాట వరసకు అనవచ్చునేమో కానీ, అదే పట్టుకుని వేళ్ళాడితే బావిలో కప్పలలాగా ఉండిపోయే ప్రమాదం ఉంది. నిజంగా గర్వపడాలి అనుకుంటే ఆ భారతదేశచరిత్రకి, సంస్కృతికి నీవు ఏమైనా గొప్ప విషయాన్ని చేర్చి అప్పుడు గర్వపడాలి కానీ, ఊరికెనే మా తాతలు వేదాలు చదివారు -- మాకు వేదాలెన్నో కూడా తెలియవు -- అయినా మేము గొప్ప అనుకోవడం కేవలం మూర్ఖత్వం అని నా అభిప్రాయం.

    PS:
    1. చదువర్లు నా తెలుగు పదాల వాడుకలో ఏమైనా తప్పులుంటే తప్పక సవరించగలరని మనవి. ముఖ్యంగా "ద్రవిడులు అనాలా? ద్రావిడులు అనాలా?" అన్న విషయంపై నాకు అనుమానం ఉంది.
    2. తెలంగాణ గురించి మాట్లాడితే కోపించి వ్యాఖ్యాస్థలిని రణరంగంగా మార్చేసే కొందరు ఔత్సాహికులు ఉన్నారు అని తెలుసును. సరైన పదాలు, సరైన ఉద్దేశం లేని వ్యాఖ్యలు తొలగించబడతాయి.

    Monday, August 22, 2011

    వ్యాజనింద అలంకారం

    వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> వ్యాజనిందాలంకారం 



    లక్షణం: నిందయా నిందయా వ్యక్తిః వ్యాజనిందా ఇతి గీయతే
    వివరణ: నింద వలన వేఱొక నింద స్ఫురించినట్టైతే అది వ్యాజనింద అవుతుంది.వ్యాజస్తుతికీ వ్యాజనిందా ఉన్న ప్రథమమైన భేదం - వ్యాజస్తుతిలో నిందా, స్తుతి - రెండింటిలో ఒకటి ప్రత్యక్షంగా, మఱొకటి పరోక్షంగా ఉంటాయి. ఐతే వ్యాజనిందలో ప్రత్యక్షంగా ఒక నింద ఉంటే పరోక్షంగా మఱొక నింద ఉంటుంది.


    ఉదా:- (గ్రంథం: చంద్రాలోకం, రచన: ఆడిదము సూరకవి)
    ఏమి అనవలె విధిని మున్నేకశిరము నలియఁజేసిన హరునెన్నవలయుఁ గాక
    సం:- ఒకాయనకు బ్రహ్మ మీద కోపం కలిగింది. ఆయనను నిందించడానికి బలమైన మాటలు వాడఁదలచి ఈ మాటలన్నాడు. శివపురాణంలో బ్రహ్మకు ఉన్న ఐదో శిరస్సును శివుడు ఖండించినట్టుగా చెప్పబడింది. అందుచేత దాని ఆధారంగా బ్రహ్మను నిందిస్తున్నాడు.
    భా:- ఐనా విధిని ఏమీ అనడానికి లేదు. అసలు (నీది) ఒకటే తలను ఖండించి వదిలిన శివుడిని అనాలి. (మిగతా నాలుగు తలలు కూడా నరికి ఉండవలెను, అంటే అంత ఘోరమైన పని చేశావు, అని భావం).
    వి:- ఇక్కడ వాక్యం చూస్తే శివుడిని నిందిస్తున్నట్టుగా ఉంది. కానీ, నిజానికి బ్రహ్మని నిందిస్తున్నాడు. శివుడిని నిందిస్తున్నట్టుగా వ్యాజం చూపించి, వేఱొకరిని నిందించినందుకు ఇది వ్యాజనిందాలంకారం అయ్యింది.



    ఉదా:- (కీర్తన: నగుమోము కనలేని, రచన: త్యాగరాజు)
    ఖగరాజు నీ ఆనతి విని వేగ చనలేదో
    గగనానికి బహుదూరంబనినాడో
    సం:- త్యాగరాజు శ్రీమహావిష్ణువుని "నీ ముఖం చూడాలనుకుంటున్న నాకు ఎందుకు కనిపించట్లేదు" అని అడుగుతున్నాడు.
    భా:- ఒకవేళ గరుత్మంతుడు (ఖగ రాజు) నీ ఆజ్ఞ విని త్వరగా రావట్లేదా? లేక ఆకాశానికి నేలకీ చాలా దూరం ఉంది, నేను అంత దూరం ఎగరలేను అంటున్నాడా?
    వి:- ఇక్కడ త్యాగరాజు గరుత్మంతుడి మీద అనుమానం వ్యక్తపరుస్తున్నట్టుగా ఉన్నా, విష్ణువు ఆజ్ఞ గరుత్మంతుడు కాదనడు అని అందరికీ తెలిసిన విషయమే. అందుచేత పైకి విష్ణువుని సమర్థిస్తున్నా, కావాలని బలం లేని వాదన చూపించడం ద్వారా నువ్వు రాకపోవడానికి ఇంతకు మించి మంచి కారణం ఏమీ తెలియట్లేదు అంటున్నాడు. అంటే విష్ణువుకే మనసు లేక రావట్లేదు. ఆయనకు తన భక్తుడి మీద జాలి లేదు అని నిందిస్తున్నాడు.


    నిజానికి ఇది వ్యాజనింద కాదు అని కూడా వాదించవచ్చును. ఎందుకంటే ఖగరాజుని సూటిగా నిందించట్లేదు, అలాగే విష్ణువుని నిందిస్తున్నాడు అనడానికి కూడా ఎంతో ఆలోచిస్తే తప్పితే ఆధారం లేదు. కాకపోతే నాకు ఇది వ్యాజనింద అనిపించింది. చదువర్లకు కాదు అనిపిస్తే తప్పక సవరించగలరు.



    ఉదా:- (నిత్యజీవితంలో అనుకునే మాట)
    అసలు నీకు పని చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ.
    వి:- ఇది మనం రోజూ అనుకునే మాటే. ఒకరు మనం చెప్పిన పని సరిగ్గా చెయ్యకపోతే వారిని తిట్టాలనుకుని, అది మంచిది కాదనుకున్నప్పుడు మనల్ని మనం నిందించుకున్నట్టుగా అనుకుంటూ వాళ్ళని నిందించడానికి ఇలాగ అంటాం కదా!



    చదువర్లకు మఱిన్ని ఉదాహరణలు తెలిస్తే తప్పక చెప్పగలరు.

    Saturday, August 20, 2011

    వ్యాజస్తుత్యలంకారం

    వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> వ్యాజస్తుతి అలంకారం




    లక్షణం: ఉక్తిర్వ్యాజస్తుతిర్నిందా స్తుతిభ్యాం స్తుతి నిందయోః
    వివరణ: పైకి నిందిస్తున్నట్టు అనిపిస్తున్నా తరచి చూస్తే పొగుడుతున్నట్టు అనిపించడాన్ని వ్యాజస్తుతి అంటారు. అలాగే పైకి పొగుడుతున్నట్టు ఉన్నా, భావంలో నింద ఉంటే అది కూడా వ్యాజస్తితే అవుతుంది. వ్యాజము అంటే నెపము (excuse), స్తుతి అంటే పొగడ్త. వ్యాజనింద అనే అలంకారానికి వ్యాజస్తుతికి మధ్య భేదం వ్యాజనింద టపలో చర్చించుకుందాము.


    ఉదా:-(గ్రంథం: చంద్రాలోకం, కవి: ఆడిదము సూరకవి)
    తే:- గంగ! నీకు వివేకమెక్కడిది? స్వర్గ మందఁజేసెదు పాపాత్ములైన జనుల
    భా:- ఓ గంగా, నీకు తెలివి ఉందా? ఎన్నో తప్పులు చేసినవారిని కూడా (నీలో స్నానం చేస్తే) స్వర్గానికి పంపుతున్నావు.
    వి:- కవి, గంగ పాపాత్ములను స్వర్గంలోనికి తీసుకువెళ్తోంది అంటుండడం నిందగా గోచరిస్తోంది. కాకపోతే, ఎన్ని పాపాలు చేసినవారైనా నీలో ఒక్క మునక వేస్తే స్వర్గానికి పంపే ఉదారత, దైవత్వం నీలో ఉన్నాయి అనే భావం కూడా నిక్షిప్తమై ఉంది. కనుక ఇది వ్యాజస్తుతి.

    ఉదా:-(చాటువు, కవి: శ్రీనాథుడు)
    కం:- సిరి గల వానికి చెల్లును,
    తరుణులు పదియారు వేలు తగ పెండ్లాడన్,
    తిరిపెమునకిద్దరాండ్రా,
    పరమేశా గంగఁ విడుము పార్వతి చాలున్
    సం:- ఇది బహుశా చదువర్లందరికీ తెలిసిన పద్యమే. శ్రీనాథుడికి ఒక ఊరిలో నీరు కనబడకుంటే పరమేశ్వరుని విగ్రహాన్ని చూసి వ్యంగ్యంగా గంగను (నీటిని)) ప్రసాదించమని అడిగాడు.
    భా:- డబ్బున్నవాడికి పదహారు వేల మందిని పెళ్ళాడినా ఫరవాలేదు, నువ్వు భిక్షువువి (దానం అడిగి తినేవాడు). నీకు ఇద్దరు పెళ్ళాలు ఎందుకయ్యా? పార్వతి సరిపోతుంది, గంగను ఇటు విడిచిపెట్టు.
    వి:- పైపైన శివుడిని భిక్షువు అనడం, నీకు ఇద్దరు భార్యలు ఎందుకు అని ప్రశ్నించడం -- రెండూ నిందలుగా కనిపిస్తున్నా, శివుడు సన్న్యాసి, నిష్కామి, గంగను శిరస్సుపై మోసి నేలకు పంపిస్తున్నవాడు అనే ధ్వని ఉండటం చేత ఇది వ్యాజస్తుతి అవుతోంది.



    ఉదా:- (చిత్రం: సిరివెన్నెల, రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి)
    ఆదిభిక్షువు వాడినేది కోరేది? బూడిదిచ్చేవాడినేమి అడిగేది?
    భా:- ఆదిభిక్షువువి (అంటే మొదటి బిచ్చగాడు - తనకంటూ ఏదీ ఉంచుకోకుండా ఉండేవాడు), బూడిదిచ్చేవాడివి (వైరాగ్యానికి, మోక్షానికి చిహ్నంగా బూడిద ఇస్తాడు) - నిన్నేమి కోరుకోనయ్యా?
    వి:- ఈ పాట మొత్తం, ప్రతి వాక్యంలోనూ, శివుడిని ఉద్దేశించి, కవి నిందిస్తున్నట్టుగా పొగుడుతాడు. సమస్తాన్ని సృష్టించినది శివుడని, కామాన్ని (మన్మథుడిని) దహించినవాడు శివుడని, తనను ఆశ్రయిస్తే యాచించినవాడి పూర్వోత్తరాలను చూడకుండా వరాలని ఇచ్చే భోళాశంకరుడని పొగుడుతున్నాడు కవి. కాకపోతే పాట వింటే నిందిస్తున్నట్టుగా అనిపిస్తుంది.



    ఉదా:- (చిత్రం: శుభోదయం, రచన: వేటూరి)
    రాయైతేనేమిరా దేవుడు? హాయిగా ఉంటాడు జీవుడు.
    ఉన్న చోటే గోపురం, ఉసురు లేని కాపురం, అన్నీ ఉన్న మహానుభావుడు
    భా:- దేవుడు రాయైతేనేమిటి? ఆయనకు ఏ సమస్యా లేదు. ఎక్కడ ఉంటే అక్కడే గోపురం ఉంటుంది. సుఖంగా ఉంటాడు. 
    వి: ఒక పక్కన దేవుడిని రాయంటూ, మఱో ప్రక్కన ఆయన వైభోగాన్ని పొగుడుతూ ఉండటం వలన ఇది వ్యాజస్తుతి అనుకోవచ్చును అని నా అభిప్రాయం.



    ఉదా:- (గ్రంథం: చంద్రాలోకం, రచన: ఆడిదము సూరకవి)
    తే:-
    మంచిదానవు, దూతిక! మంచిదాన
    వింతకంటెను గర్తవ్యమేమి కలదు?
    అతని శిఖ, నఖ, దంత లూనాంగి వైతి
    వెందువలన మదర్థము నందు నహహ!
    సం:- ఒక అమ్మాయి నాయకుడిపై తనకున్న ప్రేమను తెలుపమని ఒక దూతిక (messenger) ని పంపింది. నాయకుడు దూతికనే ప్రేయసి అనుకుని ఆమెతో సరసమాడాడట. దూతిక చక్కగా అతనితో ఆడుకుని వెనక్కి వచ్చిందట. అప్పుడు నాయిక చెప్తున్న మాటలు.
    భా:- ఎంత మంచిదానవే దూతికా! నా కోసం నువ్వు ఇన్ని (పంటి, గోటి) గాట్లు వేయించుకుని వచ్చావా? నీకు ఎంత కర్తవ్యదీక్ష? (లూనము -- కొయ్యబడినది)
    వి:- నిజానికి తన ప్రియుడితో క్రీడించిన దూతిక పైన ఒళ్ళు మండినా నాయిక డొంకతిరుగుడుగా/పొగుడుతున్నట్టుగా నిందించడం వలన ఇది వ్యాజస్తుతి అలంకారం అయ్యింది.

    అలంకారాల జాబితా

    ఈ బ్లాగులో చర్చించుకున్న అలంకారాలకు లంకెలను ఒక టపలో భద్రపరిస్తే ఉపయోగపడుతుంది అనిపించి ఈ జాబితాను ఇక్కడ వ్రాస్తున్నాను.

    శబ్దాలంకారాలు
    అర్థాలంకారాలు

    మనిషికో రోగం, మనసుకో భోగం

    ఆత్మబంధువు అనే అనువాదచిత్రంలో బహుశా రాజశ్రీ అనుకుంటాను ఒక పాట వ్రాశారు - "మనిషికో స్నేహం, మనసుకో దాహం" అని.ఈ రోజు ప్రపంచాన్ని చూస్తే దీన్ని "మనిషికో రోగం, మనసుకో భోగం" అని మార్చాలనిపిస్తోంది.

    ప్రతి మనిషీ తనకో ప్రత్యేకత ఉండాలని కోరుకుంటాడు. అందులో తప్పు లేదు. కొందరు దానికోసం రాత్రింబవళ్ళు శ్రమించి సాధించుకుంటే కొందరు సులభమార్గాలను వెతుక్కుంటారు. నేను బెంగుళూరులో పని చేస్తుండగా నా సహోద్యోగి ఒకాయన అన్నాడు, "Most people are ordinary, and that is by definition." అని. నాకు భలే నచ్చింది. నిజమే! సామాన్యం అనే పదానికి అర్థమే "అత్యధికంగా సంభవించే విషయం" అని. లేకపోతే అమెరికాలో పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళను విచిత్రంగానూ, మన దేశంలో అవైవాహికసహజీవనాన్ని (live-in relationship) విచిత్రంగానూ ఎందుకు చూస్తున్నారు? సరే, అది మఱొక సున్నితమైన విషయం కాబట్టి దాన్ని విడిచిపెడదాము.

    ప్రతి మనిషికీ ఒక అభద్రతాభావం ఉంటుంది. దాన్ని తొలగించుకోవడానికి తన చుట్టూ ఒక సమూహాన్ని (ఇల్లు, ఊరు, మొదలైనవి) ఏర్పరుచుకుంటాడు. ఆ సమూహం బలంగా ఉంటే తనూ బలంగా ఉంటాడని ఒక నమ్మకం. అది స్వార్థమా లేక ఔన్నత్యమా అన్నది ఎవరికిష్టమొచ్చినట్టు వారు అన్వయించుకోవచ్చును.

    ఇంతకీ ఈ వ్యాసానికి కేంద్రబిందువు (central point) ఏమిటయ్యా అంటే, వివాదాస్పదమైన వ్యాఖ్యలతో, పనులతో ఈ రెండూ (తమ ఉనికి చాటుకోవడం, ఒక గుంపులో మెలగడం) సాధించుకునేవాళ్ళను చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది.  అంటే అభద్రత అనే రోగాన్ని కప్పిపుచ్చుకోవడానికి, తమకంటూ ఒక అవాస్తవిక అస్తిత్వాన్ని (false identity), పరపతిని ఏర్పరుచుకుని దాన్నే భోగంగా భావించే వారి గురించే ఈ వ్యాసం. వారి వాదనలోని మూర్ఖత్వాన్ని, అసంగతాన్ని (incoherence) వారికి ఎలాగ తెలియజేయాలో అర్థం కాదు. వారికి నిజం కంటే వారి డొల్ల-పునాదితో ఏర్పడిన అభిప్రాయాలే ముఖ్యం. అలాంటి కొన్ని ఉదాహరణలు చూద్దాము.

    ఇటీవల Ace Ventura - The Pet Detective అనే చలనచిత్రాన్ని చూశాను. Jim Carrey నటించిన ఈ చిత్రం హాస్యరసభరితంగా ఉంటుంది అని విని, ఓపిగ్గా చూశాను. అప్పుడప్పుడు నవ్వు వచ్చింది, కొన్ని చోట్ల జుగుప్స కలిగింది. పతాకసన్నివేశంలో ఒక dolphin ని దొంగిలించినవాడు ఎవరో కాదు, ఆ ఫిర్యాదును పర్యవేక్షిస్తున్న ఆడ police ఏ నని తెలుస్తుంది. ఇదేమిటి ఆ వ్యక్తి ఇంతకీ వాడా, ఆమా౨ అన్న సందేహానికి సమాధానం -- రెండూను. అవును, ఆ వ్యక్తి ద్విలింగి (transgender). కథలో ఏడాగోడానికి (confusion) అదే మూలకారణం. దొంగిలించిన వ్యక్తి మగ అని కొన్ని ఆధారాలు, ఆడ అని కొన్ని ఆధారాలూ దొరికి చివరికి రెండూ అని తెలుసుకుంటాడు నాయకుడు. ఆ ద్విలింగిని శిక్షిస్తారు. ఇక్కడిదాక విషయం ఫరవాలేదు.

    ఈ చలనచిత్రం చూసిన ద్విలింగులు, ఈ చిత్రం ద్విలింగుల పట్ల దుగ్ధతో తీసినదని, ద్విలింగులను తప్పుడు కోణంలో చూపించిందని గొడవకు దిగారు. అయ్యా, ఒక ప్రశ్న: ద్విలింగులని వేఱుగా/వింతగా చూస్తే, "మమ్మల్ని వెలివేస్తున్నారు, మాకు సమానమైన హక్కులు, హోదా కావాలి", అని ధర్నాలకు దిగుతున్నారు. నిజంగా మీ మనసులో సమానభావం ఉంటే, తమరు ద్విలింగులు అనే అభద్రతాభావం లేకుంటే; ఒకవేళ ద్విలింగులు, ఏకలింగులూ సమానం అనే దృక్కోణానికి సమాజం అలవాటు పడి; తరతరాలుగా స్త్రీలనో, పురుషులనో చెడ్డవారిగా చూపించిన చిత్రాలను అన్నిటినీ నిషేధించాలని ఒక ఆరువందలకోట్ల ఆడవారు, మగవారు కూడా ధర్నాకు దిగి, మీరు కూడా వారికి మద్దతును తెలపాలి అంటే ఏం చేస్తారు?

     కథ అన్న తఱువాత మంచిని, చెడుని కొందరు మనుషుల రూపేణ చూపించడం అన్ని సంస్కృతులలోనూ ఉన్న విషయమే కదా? ఎవరికి వారు "మమ్మల్ని తక్కువగా చూపిస్తున్నారు" అంటే ఎలాగ?

    హమ్మయ్య, అందరు NRIల లాగా నేను మొదట జన్మభూమిని అవమానించలేదు. ఆ పాఙ్తేయం (fashion?), పైత్యం నాకు ఇంకా వంటబట్టలేదు అనుకుంటాను. సరే, ఇకనైన మన దేశాన్ని విమర్శించకపోతే నన్ను NRIలు అందరూ అపాఙ్తేయుణ్ణని వెలివేస్తారు కాబట్టి ఒకసారి భారతదేశం కేసి చూద్దాము.

    మన దేశంలో ఆరక్షణ (reservation) చట్టాలు విస్తృతమౌతున్న దశలో నాకో సందేహం. మొదట ఒక విషయం మాత్రం తేటతెల్లం చెయ్యాలి -- దళితులకు అన్యాయం జరిగింది, అవమానం కలిగింది. దీనిలో సందేహం ఏమాత్రం లేదు. వారికి కొంతవరకు, కొన్నాళ్ళు ఆరక్షణ కల్పించడం కూడా సబబే! నా సమస్య అది కాదు. సందేహం ఏమిటయ్యా అంటే లోక్పాల్ చట్టానికి మీకూ సంబంధం ఏమిటి అని. లోక్పాల్ మనువాది ఉద్యమం అని, ఊర్ధ్వకులాల కుట్ర అని వాపోతున్న మహాధ్యాపకులు (professors?) ఆ సంబంధాన్ని సశాస్త్రీయంగా, తర్కించి విశదీకరిస్తే బాగుంటుంది. లోక్పాల్ లో ఎక్కడైనా దళితులు ఫిర్యాదు చేస్తే దాన్ని పరిశీలించక్కరలేదు అని ఉందా? పోనీ, దళిత సంఘాల్లో జరిగే కుంభకోణాలను, రంభకోణాలను (సహస్రావధాని గరికపాటి వారి పాదలాకు మ్రొక్కుతూ ఈ ప్రయోగాన్ని తస్కరించాను :) ) మొదట/ఆఖర వెదకాలని ఏమినా ప్రత్యేకించి ఒక వాక్యం ఉందా? ఓహోహో రాజ్యాంగం వ్రాసిన అంబేద్కర్ దళితుడా? ఆ రాజ్యాంగాన్ని గాంధీ స్ఫూర్తితో మారుస్తున్న హజారే దుష్టుడా? సరే. మీకు ఇప్పుడు ఇంకో చిక్కు ప్రశ్న.

    మన దేశంలో స్వలింగసంపర్కం క్రూరమైన దుష్చర్యగా (criminal offense) నిర్ణయించిన మహానుభావుడు ఎవరయ్యా? అంబేద్కరే కదా? నవీనకులతత్త్వానికి (modern casteism) నిర్వచనం ఏమిటి? ఒకడు పుట్టిన పరిస్థితులని బట్టి వాడి జీవితంలో ఏదైనా చేసి తీరాలి, చెయ్యకూడదు అని చెప్పడం తప్పు అనే కదా? అంటే దళితుడైతే ఎవరినీ ముట్టుకోకూడదనో, బ్రాహ్మడైతే అందరూ కాళ్ళ మీద పడాలనో అంటే ఎందుకు తప్పు? వాడు పుట్టిన కుటుంబాన్ని బట్టి వాడికి గౌరవాన్నో, అవమానాన్నో కల్పించడం అహేతుకం అనేనా? సరేనయ్యా. మరి మగవాడిగా పుడితే ఆడదాన్నే కామించాలని ఎవరు నిర్ణయించారట? దేవుడెక్కడైనా చీటి వ్రాసిపెట్టాడా? మఱి గబ్బిలాల్లో స్వలింగసంపర్కుల సంఖ్య ఎక్కువగా ఉంది, వాటికి ఏ గ్రుడ్డిగుహలోనో చీటీ చదువుకోవడం వీలు కావట్లేదు అనుకుంటాను. వెటకారం అటుంచితే, మఱొక సందేహం. ఇప్పుడు దళిత స్వలింగసంపర్కులు అంబేద్కర్ ని పొగడాలా? తిట్టాలా? అమ్మో, జటిలప్రశ్నే. సరే నేను దళితుణ్ణీ కాదు, స్వలింగసంపర్కుణ్ణీ కాదు - అందుచేత నేను ఏమీ వ్యాఖ్యానించను. (ఈ వాక్యం కూడా దట్టపరిచెయ్యాలని (bold) ఎందుకో మనసు పీకుతోంది :) )

    ఎవరండక్కడ? ఏమిటి? అంబేద్కర్ ఉపవాసాలు మొదలైనవాటిని నిషేధించాడా? మఱి ధర్నాలు ప్రోత్సహించాడా? దండోరాలు, రాస్తా రోకోలూ ప్రబోధించాడా? సరే అదీ వదిలెయ్యండి.

    అయ్యా, మీరు మహాధ్యాపకులు, తాత్వికులు కదా. ఇప్పుడు మఱొక ప్రశ్న. మీరు దళితులు అంటూనే కిరస్తానీలు అంటున్నారు. నాకు అద్వైతం మీద గురి కావడం చేత సోదరులైన కిరస్తానీయులపైన ఏమీ దురభిమానం లేదు. ఐతే దళితులు చాలా మంది క్రైస్తవాన్ని పుచ్చుకుని హైందవాన్ని దూషిస్తున్న పరిస్థితుల్లో నాదొక ప్రశ్న -- క్రైస్తవులు తరతరాలుగా నల్లవారిని (అదే నీగ్రోలు అని కొందరు పిలిస్తూ ఉంటారు) కించపరుస్తూ, వారిని బానిసలుగా తిప్పుకున్నారు. మరి మీకు వారిలో కులోన్మాదం ఉంది అనిపించట్లేదా?

    పురాణాల గురించి, ఇతిహాసాల గురించి ఏం తెలుసని వ్యాఖ్యానిస్తున్నారో కానీ, మీరు వ్యాధగీత (వ్యాధుడు అంటే బోయవాడు - నికార్సైన దళితుడు) గురించి తెలుసునో లేదో. భగవద్గీత లాగానే భారతంలో ఒక బోయవాడు తపస్వికి చేసిన జ్ఞానబోధ గురించి ఉంది. అంటే (జ్ఞానం ఉన్న) యాదవుడైన కృష్ణుడు, శూద్రుడైన వ్యాధుడు కూడా పొగరుబోతు బ్రాహ్మడి కంటే గొప్పవారని చెప్తోంది మన సంస్కృతి. అయ్యో వ్యాసం ప్రవచనం అయిపోతోంది. క్షమించాలి.

    అబ్బెబ్బే, ఈ రోజు నాకేదో ఐంది, ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తున్నాయి. ఈ వివాదాస్పదప్రశ్నావళికి ఇంక ముగింపు పెట్టి మఱొక ఉదాహరణ చూద్దాము.

    ఎంత అద్వైతిని ఐనా పొరుగువాడిని నిందించకపోతే ఈ వెధవ జన్మకు నిద్ర పట్టేలా లేదు. ఈ సారి తమిళనాస్తికమిత్రులకు కొన్ని ప్రశ్నలు. కొందరు ద్రవిడకళగభజనాతత్పరులు రావణుడిని పూజించడం మొదలెట్టారు. అదేమిటి అంటే "రాముడు ఆర్యుడు, ఆయన ఎక్కడో వాయవ్యమ్నుండి వచ్చాడు. అమాయకుడైన మా రావణుణ్ణి, ద్రవిడులని అవ్యాజమైన కక్షతో చంపివేశాడు" అంటున్నారు. అబ్బబ్బ, మళ్ళీ ప్రశ్నావళి.

    రావణ అనే శబ్దమే సంస్కృతపదం. ఆయన అనేకశాస్త్రాలలో పండితుడని రామాయణం చెప్తోంది. బ్రహ్మకు, ఆయనకు బంధుత్వాన్ని సూచిస్తోంది. ఆయన మహాశివభక్తుడు, రాముడు కూడా సైకితలింగాన్ని నిర్మించాడు. మఱి ఒకరు ఆర్యుడు అయ్యి, మఱొకరు వేరే జాతి ఎందుకు అయ్యారు? వదిలెయ్యండి.

    దక్షిణభారతంలోని వారిని కించపరచడానికే వారిని కోతులుగా, రాక్షసులుగా చూపించారని అంటారా? సరే, "హనుమంతుడు చక్కనైన సంస్కృతభాష మాట్లాడుతున్నాడు. ఇలాంటివాడు మనకు తోడుంటే ఎవరినైనా జయించవచ్చును", అని రాముడన్నది దక్షిణభారతీయుడైన హనుమంతుణ్ణే. సోదరసమానుడిగా భావించి గౌరవించిన విభీషణుడు రాక్షసుడే. పతివ్రతగా పరిగణించబడిన మండోదరి కూడా...ఆఁయ్. ఉన్నట్టుండి వీరందరూ మీకు దగ్గర బంధువులు, రాముడికి శత్రువులు ఎలాగయ్యారయ్యా? ఆర్య అయిన కైకని చెడ్డదానిగా ఎందుకు చిత్రీకరించారో? మంథరను ద్రవిడదుర్మతిగా చూపిస్తే కథ ఇంకా రక్తి కట్టేదేమో? అక్కడ నీతి -- వానరుడైనా, మనిషి అయినా, రాక్షసుడైనా, మగైనా, ఆడైనా మనిషి నడవడిని బట్టే గౌరవించాలని. ద్రవిడుడోయంటూ కరుణానిధికి పట్టం కట్టారు. ఏమైంది? ఏ రంగు పూసినా బల్లి బల్లి కాక ఊసరవెల్లి అవుతుందా?

    ఇంకా ఇలాంటి ఉదాహరణలు చాలా గుర్తొస్తున్నాయి. కానీ, వ్యాసం చదివేవారికి వేఱే వ్యాసంగాలు (vocation) కూడా ఉంటాయి కదా. ఇక్కడితో ఆపుతున్నాను. కాకపోతే ఒక చిన్న నివృత్తితో.

    మనిషిని మనిషిగా గుర్తించాలి, అతనిలో మంచిచెడులను విశ్లేషించాలి, తదనుసారం గౌరవించాలి. గుంపుతనం (mob-mentality), కఱుడుఁగట్టిన అభిప్రాయాలు, వితండవాదాలు, అకార్మికంగా కీర్తిని, డబ్బుని, ఆశించడం, సంచలనప్రియత్వం, బహుమతాన్ని (majority) వ్యతిరేకించి గొప్ప అనుకోవడం ఇవన్నీ అభద్రతకు, హృదయదౌర్బల్యానికి సూచనలు. మనిషి ప్రేమించాల్సింది నిజాన్ని. 


    వ్యాసంలో ఎక్కడబడితే అక్కడ కొత్తకొత్త తెలుగు/సంస్కృత పదాలను సృష్టించాను. తప్పులుంటే మన్నించగలరు, సవరించగలరు అని మనవి.

    Friday, July 29, 2011

    కిట్టు కథలు: సంతృప్తి నాకు దిక్సూచి

    కిట్టును చూడటానికి తన తండ్రి రాజు, వాళ్ళ స్వగ్రామం నుండి కలకత్తా వచ్చాడు. కిట్టు అప్పటికే చదువు పూర్తి చేసుకుని ఒక పెద్ద సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అప్పటిదాక వాళ్ళ వ్యవసాయం అంతంత మాత్రంగా నడుస్తుండటం, తండ్రి తన చదువుకోసం అప్పులు చేయడం గమనిస్తూ ఉన్న కిట్టు, ఇప్పటికైనా తన తండ్రికి కాస్త విశ్రాంతి కలిగించాలని, తను అనుభవిస్తున్న సుఖాలను తన తండ్రి కూడా అనుభవించాలని కోరుకున్నాడు. రాజుని ఎంతో అభిమానంగా చూసుకోవడం మొదలు పెట్టాడు. ప్రతి వారం ఏదో ఒక చిత్రానికో, షికారుకో అద్దెగాడీల్లో (taxi) వెళ్ళడం, ఖరీదైన restaurantsలో భోజనం చెయ్యడం మామూలైపోయాయి.

    కిట్టు ఇదంతా తనపై ప్రేమతో చేస్తున్నాడు అని సంతోషించినా, ఖర్చులు కొంచెం మితి మీరుతున్నాయి అని రాజుకు బాధ కలిగింది. సున్నితమైన మాతలతో, "నాకు వద్దు. ఇంట్లోనే ఉండాలని ఉంది.", లాంటి మాటలతో చెప్పినా కిట్టు బలవంతంగా బయటకు తీసుకెళ్ళసాగాడు. ఒక రోజు కిట్టు, రాజు ఒక పెద్ద mall లో pizza center కి వెళ్ళారు. అక్కడ కిట్టు వెళ్ళి ఒక కుఱ్ఱాడికి తన పేరు ఇచ్చి వచ్చాడు. అది జరిగిన పావుగంటకి ఆ కుఱ్ఱాడు కిట్టు పేరు చదవగా, గబగబా తన తండ్రి చేయి పట్టుకుని లోపలకు, ఆ కుఱ్ఱాడు చూపించిన బల్లకు ఇరువైపులా కూర్చున్నారు. కిట్టు జాబితాలో ఉన్న వంటకాలన్నీ రాజుకు వివరిద్దామని చూశాడు. రాజు మాత్రం, "నీకేది నచ్చితే అదే చెప్పరా నాన్న", అని ఊరుకున్నాడు. కిట్టు రెండుమూడు వంటకాలు తెమ్మని చెప్పాడు.

    కాసేపటికి ఆ వస్తువులు వచ్చాయి. కిట్టు ఎంతో సంతోషంగా ఒక ముక్క తుంపి రాజు పళ్ళెంలో వేసి తినమన్నాడు. రాజు దాన్ని తిందామని ప్రయత్నించాడే కానీ, అది ఎక్కట్లేదు. అది ఊతప్పానికి, దిబ్బరొట్టెకి మధ్యలో ఉంది కానీ, ఆ రుచి లేదు. కారంగా లేకపోతే రాజుకు రుచించదు. కిట్టును బాధపెట్టడం ఇష్టం లేక ఎంతో కొంత తిన్నాడు. ఇంతలో bill వచ్చింది, కిట్టు ఇంకా తింటూ ఉండటంతో రాజు దాన్ని తెరిచి చూశాడు. అక్షరాలా ఏడు వందల రూపాయలు అయ్యాయి. రాజుకు తిన్నదంతా బయటకు వచ్చినంత పని అయ్యింది. ముఖం ఎఱ్ఱగా అయ్యింది. కుఱ్ఱదనంలో తానూ బళ్ళ మీద, బట్టల మీదా ఖర్చుపెట్టాడు కానీ, ఇది మరీ ఎక్కువ అనిపించింది. ఏమీ మాట్లాడకుండా కిట్టుతో పాటు ఇంటికి వచ్చేశాడు. తను నెమ్మదిగా చెప్తే వినట్లేదు అని కాస్త గట్టిగా, "ఏడొందలు పెట్టి కొన్నావు. నాకు అది ఏమీ నచ్చలేదు. ఎందుకురా? నాకు పక్కన hotelలో దొరికే రోటీ, దాల్ తడ్కా నచ్చింది." అన్నాడు. కిట్టు, పిజ్జ కొత్త తరం విషయం అని, యువతకు నచ్చుతోందని, రాజు స్వగ్రామానికి వెళ్ళినప్పుడు గర్వంగా చెప్పుకోవచ్చునని నచ్చజెప్పాలని చూశాడు. కిట్టును తను అర్థం చేసుకోవట్లేదని బాధపడుతున్నాడని గమనించి, రాజు అప్పటికి ఊరుకున్నాడు.

    సాయంత్రం ఇద్దరూ coffee తాగుతూ కూర్చున్నారు. రాజు కిట్టు కేసి చూస్తూ, "నిన్ను చూస్తుంటే నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయిరా. మా బాబాయ్ నన్ను అర్థం చేసుకోవట్లేదు అని బాధపడేవాడిని", అన్నాడు . కిట్టు నిట్టూర్చి, "అదేం లేదు నాన్న", అన్నాడు. రాజు, "సరే. మా బాబాయ్ కథ ఒకటి చెప్తాను, వింటావా?", అన్నాడు. కిట్టు ఏంటన్నట్టు చూశాడు.

    "నా చిన్నదనంలో మా నాన్న చనిపోయాక మా బాబాయే నన్ను సాకాడు అని నీకు తెలుసు. మా తాత ఆస్తిని తనే చూసుకుని, నేను ఎదిగాక నాకు నా భాగాన్ని ఇచ్చాడు. ఆస్తి నా చేతికి వచ్చే ముందు, అంటే నేను చదువుకునేటప్పుడు, నాకూ నీ లాగ చాలా సరదాలు ఉండేవి. అంతమంది కూతుళ్ళ మధ్యన ఒక్కడినే కొడుకుని అని మా అమ్మ నన్ను గారంగా చూసుకునేది. కానీ, డబ్బు కావాలంటే మాత్రం బాబాయ్ నే అడగాలి. మిగతా వారందరూ ఏమనుకున్నా, నాకు మటుకు మా బాబాయ్ మంచివాడు. ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా గడ్డ పెరుగేసి  అన్నం కలిపి, అందులో కొత్తావకాయ్ నంజి పెడుతూ ఉండేవాడు. తన బిడ్డలతో సమానంగా చూసేవాడు - ముద్దాడినా, కొట్టినా.

    మా బాబాయ్ వంద ఎకరాల ఆసామి. కానీ, మహా పిసనారి అని మన ఊరంతా చెప్పుకునేది. అయినా, పరుల సొమ్మును ఆశించేవాడు కాదు. ఊరక అణా కూడా ఇచ్చేవాడు కాదు. డబ్బుల కోసం ఆయనని అడగాలంటే నాకూ అదే చిఱాకు, భయం. ఈ సారి కొత్త cycle కోసం అడిగాను. గంభీరంగా ఒక చూపు చూశాడు. వద్దనే దాని అర్థం, అనుకుని నిట్టూర్చాను. నిజానికి కళాశాల ఇంటికి రెండు కిలోమీటర్లకు మించి ఉండదు, మిత్రబృందం అంతా నడుచుకునే వెళ్తున్నారు. ప్చ్...అది చెప్పే వద్దంటాడేమో అనుకున్నాను.

    ఉన్నట్టుండి,  "రేపు తెల్లారుకట్ట నేను పార్వతీపురం వెళ్ళాలి, నువ్వూ వస్తావా?", అన్నాడు. ఆయన చెప్పింది చెయ్యడమే తప్ప వేరు అలవాటు లేదు ఆ ఇంట్లో. సరేనని చెప్పి ఆయన వెంట వెళ్ళాను. కొండల వెంటా, గుట్టల వెంటా తిప్పి తీసుకెళ్తూ ఐదారు కిలోమీటర్లు నడిపించి కొంచెం మనుషులు కనబడే చొటికి చేర్చాడు. అప్పుడే సూర్యుడు బయటకు వచ్చాడు. పొద్దున్న ఒక్క అరటిపండు  పెట్టి ఇంత దూరం నడిపించాడేమిటిరా బాబు అనుకుంటుండగా, ఒకరి ఇంటి దగ్గర ఆగి నన్ను అరుగు మీద కూర్చోమని లోపలికి వెళ్ళాడు. లోపలనుండి ఒకావిడ వచ్చి ఒక లోటాలో మంచినీళ్ళు ఇచ్చింది. బాబాయే పంపించి ఉంటాడు. ఒక గంట తరువాత వెనక్కి వచ్చాడు. మా ఆకలేసింది. బాబాయైతే పెద్దవాడు. ఉపవాసాలు చేసి చేసి అలవాటైంది, మరి నా గతేం కాను అనుకున్నాను. మళ్ళీ యాత్ర కొనసాగింది.

    ఇంక శొష వస్తుంది అనగా ఒక ఇంటి ముందు ఆపాడు. బయట బాల్చీ, చెంబు ఉన్నాయి. కాళ్ళు కడుక్కుని లోపలకి వెళ్తూ, "నువ్వూ రా" అన్నాడు. నేనూ కాళ్ళు కడుక్కుని లోపలకి వెళ్ళాను. ఒకాయన వచ్చి తుండు ఇచ్చాడు. ఇద్దరం చేతులు తుడుచుకున్నాం. "ఏరా అబ్బీ, మీ ఆవిడ ఎలాగుంది? పిల్లలు చదువుకుంటున్నారా? ఏఁవిటి హొటేలు  పెట్టారట?", అన్నారు. "అవునయ్యా, మీరు హొటేలు పెట్టాక  మొదటిసారి వచ్చారు. కడుపు నిండా తినే వెళ్ళాలి", అన్నాడు అతను. "బయటవాళ్ళకు తెలిస్తే మా ఇంట్లో ఆడవాళ్ళకు పరువు తక్కువరా. హ హ. సరే, ఇక్కడే వడ్డించు", అన్నాడు బాబాయ్.

    ఇద్దరం కూర్చున్నాము. రెండు అరటాకులు వేసి ఇడ్డెనలు వడ్డించసాగింది అతడి భార్య. ఆ కాలంలో ఇడ్లీరేకులు దొరికేవి కాదు, saucer అంత ఉండే పళ్ళాల్లో కానీ, పనస ఆకుల్లో కానీ తయారు చేసేవారు ఇడ్డెనలు. "బాగున్నావా అమ్మా", అని నవ్వుతూ అన్నాడు బాబాయ్. అంతే... ఆ తరువాత ఆవిడ వడ్డిస్తూనే ఉంది, బాబాయ్ తింటూనే ఉన్నాడు. మూడు ఇడ్డెనలకే నాకు కూర్చోలేక నడ్డి విరిగినంత పని అయ్యింది. బాబాయ్ మాత్రం డజన్ల కొద్దీ లాగించాడు. బాబాయ్ ఎక్కువ తినడం నేను ఎప్పుడూ చూడలేదు. "ముందురోజు ఉపవాసం ఉన్నాడనుకున్నా, మరీ ఇంతా?" అనుకుంటున్నాను.

    బాబాయ్ మొదటి మూడు ఇడ్డెనలూ తింటుండగా హొటేలు యజమాని ముఖ్యంలో "ఇంత పెద్దాయనకు వడ్డించగలుగుతున్నాం" అనే సంతృప్తిని చూశాను. ఆ తఱువాత మూడు ఇడ్డెనలకు "పెద్దాయనకు మన వంట నచ్చింది", అనే సంతోషం చూశాను. ఆ తఱువాత మూడు ఇడ్డెనలకు "పెద్దాయన మాంచి ఆకలి మీద ఉండి మొహమాటం కూడా లేకుండా టింటున్నాడు", అనే చిరునవ్వు చూశాను. ఆ తఱువాతి మూడింటికి "ఒక మనిషి ఇన్ని ఇడ్డెనలు తినగలడా" అనే ఆశ్చర్యం చూశాను. ఆ తరువాతి మూడింటికి, "వాయంతా ఈయనకే సరిపోతోంది, బయటవాళ్ళకి ఎలాగ వడ్డించాలి" అనే కంగారు చూశాను. ఆ తఱువాత మూడింటికి, "ఇన్నీ తిన్నాడు సరే, ఈయన చిల్లిగవ్వగా ఇవ్వడని ఈయన ఊళ్ళొనే చెప్తారు. ఇరువై ఇడ్డెనలకి ముడిసరుకే రెండు రూపాయలు ఉంటుంది", అనే నిట్టూర్పు చూశాను. బాబాయ్ కి మాత్రం ఏమీ పట్టలేదు. ఇడ్డెనలూ, పచ్చడీ జుఱ్ఱేస్తున్నాడు భాగవతంలో బాలకృష్ణుడిలాగా.

    అంతా అయ్యింది, ఆయన  లేచి దొడ్లోకి వెళ్ళి చేతులు కడుక్కున్నాడు. నా చేతులు ఆరిపోయాయి, పిండి చేతులపై అట్టగట్టుకుపోయింది. బలంగా రుద్దుకుని కడుక్కుని వెనక్కు వచ్చేసరికి నా జీవితంలో చూస్తాను అనుకోనిది ఒకటి చూశాను. మా బాబాయ్ తుండు నా చేతుల్లో పెట్టి తన సంచిలోంచి ఒక కొత్త వందరూపాయల కాగితం తీశాడు. అది ఇంకా నలగలేదు. అప్పట్లో ఒక రూపాయి అంటే ఇప్పుడు dollarకు సమానం. వడ్డించిన ఆమెను పిలిచి, ఆమెకు చూపిస్తూ "అమ్మాయ్, గోప్ఫగా వండావే ఇడ్డెనలు. ఆ పచ్చడో, అమృతంలాగా ఉందే. ఇదిగో మీ ఆయనకు డబ్బులుస్తిన్నాను. బట్టలు కొనిపించుకో", అన్నాడు. హొటేలు యజమాని, అతడి భార్య, నేను తెల్లబోయి చూస్తున్నాము. బాబాయ్ అతని భుజం తట్టి, "ఒరేయ్ అబ్బీ, నీ ఇంట్లో ఈ అన్నపూర్ణే మహాలక్ష్మి కూడా, చక్కగా చూసుకో. ఉంటాను.", అని నాకేసి చూసి పద అని సైగ చేసి బయల్దేరాడు.

    వచ్చేటప్పుడు busలో వచ్చేశాము. దిగి ఇంటికి నడుస్తూ ఉండగా భుజం మీద చెయ్యి వేసి, "ఏరా. cycle కావాలా? ఈ రోజు పొద్దున్న నడిచావు కదా? అంత దూరం నడిచి, ఒక్కోసారి వంతెన పడిపోతే ఏట్లో ఈదుకుంటూ వెళ్ళి నేను పొరుగూరులో బడికి వెళ్ళేవాణ్ణి. ఎక్కువ చదువుకోలేదు అనుకో. cycle ఉండటం మంచిదే. చాలా శ్రమ తగ్గిస్తుంది. విలువ ఉన్న వస్తువు. కొంటాను", అన్నాడు. ఇద్దరం కాళ్ళు కడుక్కుని లోపలకి వెళ్ళాం.

    నేను ఎప్పుడూ మా బాబాయ్ ని ప్రశ్నించలేదు, డబ్బు విషయాల్లో అయితే అసలేమీ మాట్లాడలేదు. ఆ రోజు ఉండలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అడిగాను, "బాబాయ్, మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు కదా? మరి మూడు రూపాయలు ఇవ్వవలసిన చోట వందరూపాయలు ఎందుకు ఇచ్చారు?", అని అడిగాను. బాబాయ్ గంభీరంగా చూసి, "డబ్బు రెండు విధాలుగా ఉపయోగపడుతుంది రా నాన్న. ఒకటి అవసరానికి, రెండు సంతృప్తికి. డబ్బును నేను జాగ్రత్త చేసేది అవసరానికి. తాత్కాలికమైన ఆత్రాన్ని అవసరంగా చూపించి చాలా మంది పెద్ద ఖర్చులు పెడుతూ ఉంటారు. నాకు అది చేతకాలేదు. అవసరమైతే ఖర్చు పెడతాను, లేదా సంతృప్తి కోసం ఖర్చు పెడతాను. పొద్దున్న అంత దూరం నడిచి వెళ్ళేసరికి "ఎప్పుడు, ఏమిటి, ఎందుకు అని అడగకుండా అభిమానంగా పిలిచి పీట వేసి భోజనం పెట్టాడు. ఆ సమయంలో ఆ ఇడ్డెనలు నాకు అమృతప్రాయంగా అనిపించాయి. చాలా తృప్తి కలిగింది. పెళ్ళాంపిల్లలు ఉన్నవాడు, వృద్ధిలోకి రావలసినవాడు, బుద్ధిమంతుడు -- వాడికి సాయం చేయడంలో నాకు తృప్తి ఉంది. అందుకే ఇచ్చాను", అని చెప్పి భాగవతం తెరిచి కూర్చున్నాడు. అక్కడే ఉంటే నన్ను చదవమంటాడేమో అని భయపడి వెంటనే బయటకు వచ్చేస్తుంటే, "నాకు సంతృప్తి కలిగితే ఎంతైనా ఇస్తాను. కలగనప్పుడు ఎంత తక్కువైనా ఇవ్వను. ఊసుపోని వాళ్ళు ఎలా ఉంటే మనకేంటి, ఏమనుకుంటే మనకేంటి?", అన్నాడు. "అవును బాబాయ్", అని చెప్పి బయటకు వచ్చేశాను.

    అప్పుడు నేను ఆలోచించాను, "ఈ cycle నాకు అవసరమా? తాత్కాలికమైన ఆత్రమా? లేక దీర్ఘకాలిక సంతృప్తా?" అని. ఇప్పటికీ విషయాలూ, వస్తువులూ  మారుతూ వచ్చాయి కానీ అదే ప్రశ్న మనసుని తడుతూ ఉంటుంది. ఈ ప్రశ్న నీకూ ఉపయోగపడచ్చేమోనని ఈ కథ చెప్పాను అంతే."

    అని చెప్పాడు రాజు. కిట్టు ఒక చిరునవ్వు నవ్వి, "సాయంత్రం నేనే వంట చేస్తాను నాన్న", అని చెప్పి తన mobile లో taxi వాడికి phone చేసి రావద్దని చెప్పాడు.

    Wednesday, July 27, 2011

    రాముడు కాకిపై బ్రహ్మాస్త్రం సంధించిన కథ

    ఆధారం: ఈ కథ ప్రస్తావన వాల్మీకిరామాయణంలో సుందరకాండలో వస్తుంది. దీని మూలం (సంస్కృతంలో), ఆంగ్ళానువాదం ఇక్కడ చదువవచ్చును.

    సందర్భం: హనుమంతుడు సీతమ్మని అశొకవనంలో చూశాడు. తనను తత్క్షణం రాముని వద్దకు తీసుకువెళ్తానని, తన వీపుపై కూర్చోమని హనుమంతుడు కోరినా అనేక కారణాలను సూచించి, సీతమ్మ రాను అంటుంది. అప్పుడు హనుమంతుడు ఆయన సీతమ్మవారిని కలిసినట్టుగా రుజువు కోసం రాముడికి, సీతమ్మకూ మాత్రమే తెలిసిన ఏదైనా ఒక విషయాన్ని చెప్పమని కోరతాడు. అప్పుడు సీత చెప్పిన కథ ఇది.

    కథ (సీతమ్మ రాముడికి చెప్తున్నట్టుగా హనుమంతుడితో అంటుంది)

    చిత్రకూటానికి ఈశాన్యంలో, గంగానదికి దగ్గరగా సిద్ధులు అనేకులు నివసిస్తుండేవారు. అక్కడ కొండల్లో గుట్టల్లో నువ్వు (రాముడు), నేను సంచరిస్తుండగా నీవు తడిసిపోయి నా సమీపంలో కూర్చున్నావు. అప్పుడు ఒక కాకి మాంసాన్ని ఆశించి తన ముక్కుతో నన్ను పొడవసాగింది. అక్కడే ఉన్న మట్టిగడ్డను తీసి (విసిరి) నేను దానిని ఆపాను. అయినా ఆ కాకి వెళ్ళక అలాగే ఉంది. ఆ కాకి నా బట్టను పట్టుకుని లాగుతుండగా, అది జారకుండా నేను బొందుని లాగిపట్టుకొనుచుండగా నీవు నన్ను చూశావు. అసలే కోపంలో ఉన్నాను, నువ్వు నన్ను చూసి నవ్వుతుండటంతో సిగ్గేసింది. అలిసిపోయి నీ ఒడిలో వాలాను. నీవు నన్ను ఓదార్చగా మళ్ళీ నా ముఖం విరిసింది. కన్నీళ్ళతో నిండిన నా కన్నులను నెమ్మదిగా తుడుచుకుంటూ ఉండగా నువ్వు నన్ను చూశావు. నేను నీ ఒడిలో, నీవు నా భుజాలలో సేద తీరుతున్నాము.

    ఇంతలో మళ్ళీ ఆ కాకి వచ్చింది. రాముడి ఒడిలోంచి లేస్తున్న నన్ను చన్నుల నడుమ పదే పదే గ్రుచ్చసాగింది. అప్పుడే నా రక్తం కనబడుతున్న నా చన్నులను గమనించిన నీవు బుసఁగొడుతున్న పాము లాగా లేచి, "ఎవరు నీ చన్నులను గాయపరిచింది. కోపంలో ఉన్న ఐదు-ముఖాలు గల పాముతో ఆడుకోవాలని చూసే ఆ మూర్ఖుడు ఎవరు?" అని అడిగావు. నేను ఏమీ అనక మునుపే, చుట్టొ చూసి గోళ్ళపై రక్తబిందువులు కలిగి నా ముందు ఉన్న ఆ కాకిని గమనించావు. అక్కడ ఉన్నది ఒక్క ఆ కాకే కనుక, అదే ఈ పని చేసి ఉంటుంది అని అనుకుని దానిని దండించాలని నిశ్చయించుకున్నావు.

    పర్వతాలలో వేగంగా సంచరించే ఆ కాకి ఇంద్రుడి సంతతి అని అనుకుంటాను. అయినా నువ్వు సంకోచించకుండా, నీ పాంపులోంచి ఒక దర్భను తీసి మంత్రించి బ్రహ్మాస్త్రంగా ప్రయోగించావు. ఆ కాలాగ్ని వంటి కాంతిని చూసిన కాకి భయంతో ఎగిరింది. నీ బ్రహ్మాస్త్రం దాన్ని తరిమసాగింది. రక్షణ కోరి ఆ కాకి ఈ లోకమంతా సంచరించింది. ఇంద్రుడు, దేవతలు, మహర్షులూ కూడా కాపాడమని చెప్పగా తిరిగి తిరిగి ఆ కాకి నిన్నే శరణు కోరింది. ఆ కాకి నీకు తెచ్చిన కోపానికి గాను చంపదగినదే. కానీ, నీ కృప వలన రక్షింపబడింది.

    ఆ కాకి అలిసిపోయి నేల మీద పడింది అని గమనించిన నువ్వు, "అలిసిపోయిన నిన్ను నేను చంపను. ఐతే బ్రహ్మాస్త్రం వృధా కాకూడదు. ఇప్పుడు ఏం చెయ్యాలో నువ్వే చెప్పు", అన్నావు. ఆ కాకి, "రామ! నీ అస్త్రం నా కుడికంటిని తాకేలాగా చూడవయ్యా", అంది. అలాగే చేశావు. ఆ విధంగా తన కుడికంటిని వదులుకొని, ప్రాణాలను రక్షించుకుంది. నీ ఔన్నత్యం తెలుసుకొని దశరథునికి, నీకు నమస్కరించి తన ఇంటికి వెళ్ళింది.

    రామ! నా కోసం ఒక కాకి పైకి బ్రహ్మాస్త్రాన్ని సంధించావే. మరి ఈ రోజు నీ నుండి నన్ను దూరం చేసినవాడిని ఎందుకు శిక్షించట్లేదయ్యా? నువ్వు కాక నన్ను ఎవరు రక్షించగలరు? నీ ముందు యుద్ధంలో దేవతలు కూడా నిలువలేరు కదా? మఱి ఎందుకు ఈ జాప్యం? త్వరగా వచ్చి నన్ను రక్షించు.

    Wednesday, July 20, 2011

    మహాభారతంలో యజోపయజుల కథ

    (వ్యాసుడు రచించిన మహాభారతంలో ఆదిపర్వంలో, చైత్రరథపర్వంలో ఈ కథ కనబడుతుంది. దీన్ని ఆంగ్ళంలో ఇక్కడ చదువవచ్చును, సంస్కృతంలో ఇక్కడ చదువవచ్చును.)

    ద్రోణుడి చేతులో పరాభవం పొందిన ద్రుపదుడు ఎలాగైనా ద్రోణుడిపైన పగ తీర్చుకోవాలనే తపనతో దానికి కావలసిన యోగబలం పొందడం కోసం యజ్ఞయాగాదులు తెలిసిన గొప్ప బ్రాహ్మణుల కోసం వెదుకసాగాడు. యమునా, గంగాతీరాలలో వెదుకుతూ ఉండగా ఒకానొక ఆశ్రమంలో కశ్యపుడి వంశంలో జన్మించిన యజుడు, ఉపయజుడు అనే ఇద్దరు బ్రాహ్మలను చూశాడు. వారు ఇద్దరూ ఎంతో గొప్ప తపోబలం కలిగినవారని తెలుసుకుని వారికి సేవలు చేయనారంభించాడు. వారిరువురిలో తమ్ముడే గొప్పవాడని నిర్ణయించుకుని ఉపయజుడితో, "ద్రోణుడు నాకు కలుగజేసిన అవమానానికి ప్రతీకారంగా అతడిని వధించగలిగే ఒక పుత్రుడు నాకు కలిగే విధంగా ఏమైనా యజ్ఞం చేస్తే మీకు 10,000 గోవులను ఇస్తాను", అన్నాడు. మహాజ్ఞాని అయిన ఉపయజుడు "ద్రుపద, ఇటువంటి చెడు ఉద్దేశాలతో నేను పవిత్రమైన యజ్ఞాలను చేయలేను", అన్నాడు.

    అయినా పట్టు వదలకుండా ద్రుపదుడు ఉపయజుణ్ణి మఱొక సంవత్సరం సేవిస్తాడు. అప్పుడు ఉపయజుడు అతడితో, "ద్రుపద, ఒక రోజు అడవిలో సంచరిస్తుండగా నా అన్న యజుడు మలినమయమైన నేల పైన రాలిన ఒక పండుని తీసుకుని సేవించడం నేను చూశాను. జ్ఞానం కలిగినవాడై కూడా అందులో అతనికి ఏమీ తప్పు తోచలేదు. ఒక చోట మలినాన్ని పట్టించుకోనివాడు, మిగతా అన్ని చోట్లా పట్టించుకుంటాడు అని అనుకోలేము. ఇంతకు ముందు మా గురువు గారి వద్దనుండగా అతడు గురుకులంలోని మిగతావారు విడిచిపెట్టిన తినుబండారాలను తినడం నేను చూశాను. అతడికి నచ్చని తిండి గురించి మాట్లాడటం నేను ఎప్పుడూ వినలేదు. తిండి పట్ల ఇంత యావ ఉన్నవాడికి తప్పక ఐహికమైన వాంఛలు బలీయమైనవయి ఉంటాయి. కనుక నీకు కావలసిన యజ్ఞం అతడు చేస్తాడు అని అనిపిస్తోంది", అన్నాడు.

    ఉపయజుని అంత గొప్పవాడు కాడని అనుకున్నా, ద్రుపదుడు యజుణ్ణి సమీపించి ఈ విధంగా అన్నాడు, "గురువర్యా, మీరు నా కోసం ఒక యజ్ఞం చేసినట్టైతే మీకు 80,000 గోవులని ఇస్తాను. ద్రోణుడు చేసిన అవమానం నన్ను దహించివేస్తోంది. బ్రహ్మాస్త్రం సంపాదించిన అతడు మఱో పరశురాముని వలే తన బ్రహ్మతేజంతో క్షత్రియుల నాశనాన్ని తలబెడుతున్నాడు. నా దగ్గర క్షత్రియశక్తి ఉన్నప్పటికీ, అతడిని అడ్డుకొనే బ్రహ్మతేజం లేదు. కానీ, మీరు అతని కంటే గొప్ప బ్రహ్మజ్ఞాని. మీరు తప్పక ఈ యజ్ఞాన్ని జరిపి నాకు బ్రహ్మశక్తిని కూడా జత చేయగలరు.". యజుడు యజ్ఞం చెయ్యడానికి ఒప్పుకుంటాడు.

    యజుడు ఈ యజ్ఞం చాలా కష్టమైనది అని గ్రహించి, ఉపయజుడి సహాయం కూడా అడుగుతాడు. ఉపయజుడు ఏమీ ఆశించకుండానే సహాయం చేయడానికి సిద్ధపడ్డాడు. వారిద్దరూ కలిసి జరిపిన యజ్ఞంలోనే దృష్టద్యుమ్నుడు, ద్రౌపది పుట్టారు. వారికి నామకరణం కూడా యజుడే చేశాడు. (నిజానికి, ద్రౌపది నల్లగా ఉండటం చేత ఆమెకు "కృష్ణా" అనే పేరు పెట్టారు. కానీ, ద్రుపద రాజు కూతురు కావడం చేత ఆమెను ఎక్కువగా ద్రౌపది అని సంబోధించడం చూస్తున్నాము.) ద్రుపదుడు ఎంతో సంతోషించి యజుడికి తాను మాటిచ్చినట్టుగా అనేక గోవులను దానం చేసి సత్కరించాడు.

    ఈ కథలో నీతి ఏమిటంటే, మనిషి వ్యక్తిత్వానికి ఆధారభూతమైన నియమాలు అతను చేసే ప్రతీ పనిలోనూ కనిపిస్తాయి. దీనినే ఆంగ్ళంలో integrity అంటాము. ఒక చోట నియమాన్ని ఉల్లంఘించినవాడు మఱొక చోట దాన్ని గౌరవించకపోయే అవకాశమే ఎక్కువ. అందుకే చిన్నపిల్లలు చెప్పే చిన్న చిన్న అబద్ధాలను, అనే చిన్న చిన్న చెడు మాటలను కూడా సున్నితంగా ఖండించి వారిని సన్మార్గంలో ఉంచాలి అని పెద్దలు చెప్తున్నది.

    Monday, July 18, 2011

    జంతువు - దైవం

    ఇటీవల ఒక గూగుల్ సమూహంలో ఒక కథ చదివాను. ఇది R.K. Narayan రచించిన A tiger of Malgudi అనే పుస్తకం లోనిదని చెప్పారు. ఆ కథ నాలో నిద్రాణమైన ప్రశ్నలని కొన్నింటిని మేలుకొల్పింది. ఆ కథ నేను అసలు పుస్తకం నుండి చదవలేదు కనుక నా మాటల్లో, నాకు అర్థమైనట్టుగా చెప్తున్నాను. మూలకథకుని మాటల్లో వింటే ఇంకా బాగుంటుందనడంలో ఏమీ సందేహం లేదు.

    ఒక పులి ఒక సాధువుని కలిసిందిట. ఆ సాధువు పులికి దేవుడి గురించి బోధ చేశాడట. "దేవుడంటే అద్వితీయమైన శక్తి కలవాడు, ఆయన కనుసన్నలలోనే మనమందరం మెలుగుతున్నాము, ఆయన అనుకున్నదల్లా జరుగుతుంది", ఇలాగ కొంచెం లోతుగా వర్ణించి చెప్పాడట. ఆ పులికి వెంట్రుకలు నిక్కబొడుచుకుని, ఆశ్చర్యం నిండిన కన్నులతో చూడసాగిందట. అలాగ కాసేపు వర్ణించిన తరువాత ఆ సాధువు, పులిని "నేను చెప్పినదాన్ని బట్టి దేవుడు ఎలాగ ఉంటాడు అనుకుంటున్నావు?", అని అడిగాడట. అప్పుడు ఆ పులి, "దేవుడు చాలా పెద్ద ఆకారం కలిగిన పులి. ఆయన తోకతో భూమిని మొత్తం చుట్టేయగలడు. ఆయన ఒక్క చూపు చూస్తే అన్ని జంతువులూ భయపడిపోతాయి.", అంటూ చెప్పుకొచ్చిందట. కథ అంతే.

    కథలోని నీతి ఏమిటయ్యా అంటే, మనుషులు ఏ విధంగా దేవుడు మనిషే అయ్యి ఉంటాడు అనుకుంటున్నారో, అదే విధంగా మిగతా జీవులు కూడా దేవుడిని నమ్మితే తమ లాగే ఉంటాడు అనుకుంటాయి/అనుకోవాలి కదా? సరే, ఇప్పుడు ఇంకొక కథ విందాం. దీనికి ఆధారం నాకు తెలియదు కానీ, ఇది చైనా/భారతదేశాలలో ప్రచారంలో ఉన్న కథే.

    ఒక రోజు ఒక మహర్షి సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ ఉండగా ఒక గాయపడిన ఎలుక మూలుగుతూ కనబడిందట. ఆ మహర్షి ఆ ఎలుకని చూసి జాలిపడి, తనతో తీసుకెళ్ళి పెంచుకోసాగాడట. మహర్షికి ఆ ఎలుక అంటే విపరీతమైన అభిమానం ఏర్పడి, ఆ ఎలుకను తన కూతురుగా భావించసాగాడు. ఒకానొక రోజు ఆ మహర్షికి ఎలుక పెళ్ళీడుకి వచ్చింది అనిపించింది. ఆ ఎలుకకు తగిన భర్త కోసం అన్వేషించసాగాడు.

    ఒక రోజు ఉదయం స్నానం తరువాత సూర్యుడికి నమస్కరించుకుంటూండగా ఆయనకు, "సూర్యుడి కంటే అందగాడు, సులక్షణసంపన్నుడు ఎవరుంటారు? ఈతడే నాకు అల్లుడు కాదగ్గవాడు", అనుకుని వెంటనే తన తపోబలంతో సూర్యుణ్ణి ఆహ్వానిస్తాడు. సూర్యుడు కంగారుగా ప్రత్యక్షమయ్యి విషయం కనుక్కుంటాడు. కనుక్కున్నాక ఖంగు తిని, "ఇదెక్కడి చిక్కురా బాబు, మరీ సూర్యుడి భార్య ఎలుక అంటే ఎలాగ?" అనుకుంటాడు. కొంచెం ఆలోచించి, "మహర్షీ, నాకు నీ కుమార్తెను పెళ్ళి చేసుకోవడంలో ఏమీ ఇబ్బంది లేదు కానీ, ఒక్క సారి ఆలోచించు. నేను ఎంత తేజోసంపన్నుణ్ణైనా, మబ్బు వస్తే మసిబారిపోతాను. నా కంటే మబ్బులే శక్తివంతాలు. అందుచేత నువ్వు వరుణుణ్ణి సంప్రతించు", అని అంతర్ధానమవుతాడు.

    మహర్షి ఆయన తపోబలాన్ని మళ్ళీ ఉపయోగించి ఈ సారి వరుణుణ్ణి రప్పిస్తాడు. ఆయన కూడా కాసేపు ఆలోచించి, "మహర్షీ, నీకు అల్లుడవ్వడం నా అదృష్టమే. కానీ, నీకు అల్లుడు కాదగిన వాడు వాయువు. ఎందుకంటే నేను ఎంత బలవంతుణ్ణైనా స్వతంత్రుణ్ణి కాను. వాయువు నన్ను ఎటు నడిపిస్తే అటు పోతాను. అందుచేత నువ్వు వాయువుని అల్లుణ్ణి చేసుకుంటే బాగుంటుంది", అంటాడు. మహర్షికి ఉన్నపాటుగా హనుమంతుడు, భీముడు మొదలైనవారి బలానికి మూలమైన వాయువు పట్ల మక్కువ పెరిగుతుంది.

    ఈ సారి వాయువుని ఆహ్వానిస్తాడు. వాయువు ప్రత్యక్షమయ్యి, కాసేపు తలగోక్కుని, "మహర్షీ, నాకు నీ కూతుర్ని పెళ్ళిచేసుకోవాలనే ఉంది", అనగానే మహర్షి చిఱాకు పడుతూ, "మఱి ఇంకేమిటి?" అంటాడు. వాయువు, "నేను ఎంత బలవంతుణ్ణైనా కొండలను కదిలించగలనా? అందుకే కదా అవి అచలాలైనాయి? అందుచేత నీకు తగిన అల్లుడు హిమవంతుడని నా అభిప్రాయం.", అంటాడు. ఆలోచిస్తే మహర్షికి అదీ నిజమేననిపించి వాయువుకు సెలవు ఇస్తాడు.

    సరే, ఈ సారి ఏదేమైనా సరే హిమవంతుడితో ఎలుకకు పెళ్ళి చేద్దామని నిర్ణయించుకుని హిమవంతుణ్ణి పిలుస్తాడు. ఆయన ఆలోచించి "మహర్షీ, నువ్వు చాలా గొప్పవాడివి. నీ పిలుపు విని దేవతలందరూ ప్రత్యక్షమవుతున్నారు అంటే వారందరికంటే నీవే బలవంతుడవని విదితమౌతోంది. నీ కూతుర్ని పెళ్ళి చేసుకోవడం నా భాగ్యం గా భావిస్తున్నాను. నేను చాలా బలవంతుణ్ణి అని నువ్వు అనుకోవడం నా అదృష్టం. ఐతే నీకు ఒక నిజం చెప్పాలి. నేను ఎంత బలవంతుణ్ణైనా నన్ను తొలిచేయగల సామర్థ్యం ఒక్క ఎలుకకే ఉంది. అందుచేత నీ మూషికానికి మఱొక మూషికాన్ని ఇచ్చి పెళ్ళి చేస్తే బాగుంటుంది", అని మాయమౌతాడు. ఇది విన్న మహర్షికి ఒక్క సారి వివేకం మేల్కొని, "ఏమిటి నా ఈ ప్రయాస, ప్రకృతి ధర్మాన్ని విడిచిపెట్టి నేను ఎందుకు ఇంత ప్రాకులాడాను?", అని విచారించి, ఆ ఎలుకని మఱొక ఎలుకకు ఇచ్చి వివాహం చేస్తాడు.

    ఈ కథలో నీతి ఏమిటంటే మనకు ప్రేమ ఉంది కదా అని, మన దృష్టిలో శ్రేష్ఠమైనదాన్ని మనకు ప్రియమైనవారికి తగిలించాలని చూడకూడదు, వారికి ఏది సరిపోతుందో, నచ్చుతుందో అదే ఇవ్వాలి. అంతర్లీనంగా ఉన్న మఱొక నీతి ఏమిటంటే ఏ జీవి గొప్పదనం దానిది. ఏదీ మఱొక దాన్ని కంటే సంపూర్ణంగా ఉన్నతం కాదు.

    మొదటి కథకి రెండొ కథకి మధ్యన పెద్ద పొంతన ఏమీ లేదు కానీ, మనిషి జంతువు దృష్ట్యా కూడా ఒక్కసారి ఆలోచిస్తే కానీ దేవుడు అర్థం కాడేమోననే నా అభిప్రాయానికి ఇవి బలాన్ని చేకూరుస్తాయి. సకలచరాచరసృష్టిలో పరమాత్ముడు లేని విషయం ఏముంది? అలాంటప్పుడు ఒక జీవి ఎక్కువ, మఱొక జీవి తక్కువ అనుకుంటే మనకు దైవం అర్థం కానట్టే కదా?