Thursday, June 30, 2011

హాస్యధారావాహిక - అమృతం

ఈ మధ్యన భారతీయులకు పరదేశీ హాస్యధారావాహికల మీద దృష్టి మళ్ళింది. Friends, Two and a half men, Big bang theory, How I met your mother మొదలైన ధారావాహికల గురించి ప్రవాసభారతీయులు మాట్లాడుకోవడం తరచూ నేను వింటుంటాను. నేను చూసిన రెండు మూడు ధారావాహికలు నిజంగానే హాస్యభరితంగా ఉన్నాయి. కాకపోతే వీటితో నాకు రెండు చిరాకులు ఉన్నాయి. మొదటిది అశ్లీలత (కొంచెం కూడా విలువలని చూపించకపోవడం) ఐతే రెండోది బలవంతంగా నవ్వించాలనుకోవడం (తెర వెనుక నవ్వులు, చప్పట్లు గుప్పించడం). అయినప్పటికీ వీటిల్లో చాలా సృజనాత్మకత ఉంటుంది. అది నిజంగా అభినందనీయం.

పశ్చిమదేశాలు ఏం చేస్తే అది అనుసరించడం అలవాటైపోయిన మన దేశంలో అలాంటి చిత్రాలు ఊపందుకున్నాయి కానీ, నాకు తెలిసి ధారావాహికలు మాత్రం ఇంకా మొదలవ్వలేదు. ఉత్తరభారతదేశంలో Laughter challenge పేరిట హాస్యాన్ని పండించగలిగారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొందరు ఆ తరువాత అదే వృత్తిగా ఎంచుకొని విజయం సాధించారు. వాళ్ళల్లో ప్రముఖుడు రాజూ శ్రీవాస్తవ్ చాలా కీర్తి గడించాడు. దక్షిణాదిలో తమిళులని చూస్తే, వాళ్ళూ చాలా హాస్యభరితమైన ధారావాహికను సృష్టించగలిగారు. "లొల్లు సభ" పేరితో వారు చలచిత్రాలకు వ్యంగ్యరూపాలను చిత్రించి ప్రేక్షకుల మెప్పు పొందారు. కాకపోతే ఈ రెండిట్లో కూడా ఎంతో కొంత అశ్లీలత, వ్యంగ్యం ఉన్నాయి.

ప్రపంచం అంతా ముగ్గులు వేసుకున్నాక లేస్తూ ఆవలించడం అలవాటైపోయిన కొత్త తరం తెలుగువాళ్ళకు ఇలాంటిది ఏముందా అని ఆలోచించుకోవలసిన పరిస్థితి లేకుండా ఎంతో చక్కటి అభిరుచి ఉన్న గుణ్ణం గంగరాజు గారు (Just Yellow అనే పతాకంపై) అమృతం హాస్యధారావాహికను మొదలుపెట్టారు. ఈయన ప్రమేయం ఉన్న చిత్రాలు అన్నీ నాకు నచ్చినవే -- Little soldiers, ఐతే, అనుకోకుండా ఒక రోజు, అమ్మ చెప్పింది మొదలైనవన్నీ చక్కటి చిత్రాలు. అమృతంలో ఎక్కువ అంకాలు ఎవరు దర్శకత్వం వహించారో తెలియదు కానీ, మొదట్లో కొన్ని చంద్రశేఖర్ ఏలేటి (ఐతే, అనుకోకుండా ఒక రోజు చిత్రాలకు దర్శకుడు) చివరిలో చాలా భాగాలు హర్షవర్ధన్ (కొన్నాళ్ళు అమృతం పాత్రను పోషించిన చక్కని నటుడు), వాసు ఇంటూరి (సర్వం పాత్రతో సంచలనం సృష్టించిన మరో చక్కని నటుడు) దర్శకత్వం వహించారు. చాలా అంకాలకు రచన చేసింది గుణ్ణం గంగరాజు గారే!

వివిధదశల్లో అమృతం పాత్రను ముగ్గురు నటులు పోషించారు -- శివాజీ రాజా, senior నరేశ్, హర్షవర్ధన్. అలాగే సంజీవని పాత్రను కూడా ముగ్గురు (?) నటులు పోషించారు (ఝాన్సీ, ఉమా మహంతి, సుప్రజ). ఆంజినేలు, శాంతలుగా గుండు హనుమంతురావ్, రాగిణి అద్భుతంగా నటించారు. అమృతరావు మరదలు పద్దుగా స్వాతి, మామగారిగా కనకాల దేవదాస్ నటించారు. అప్పాజీ గా శివన్నారాయన నూటికి నూటొక్కపాళ్ళు న్యాయం చేశారంటే అతిశయోక్తి కాదు. అప్పుడప్పుడూ కనిపించి వెళ్ళిపోతూ ఉండే పాత్రలు చేసినవాళ్ళు (kidnapper గా చేసిన వ్యక్తి, కిరాణా కొట్లో పనిపిల్లగా చేసిన అమ్మాయి, రాధ-మధులో పద్మశ్రీకి సహాయకుడిగా చేసిన అబ్బాయి -- వీళ్ళ పేర్లు తెలియవు కానీ...) కూడా బాగా చేశారు.

ప్రపంచంలో ఎంతో ఖర్చుపెట్టి తీసిన, పేరు పొందిన హాస్యధారావాహికలు కొన్ని మాత్రమే 300 అంకాలు (episodes) పూర్తి చేసుకున్నాయి. అలాంటిది అతి తక్కువ ఖర్చుతో తీసిన అమృతం ధారావాహిక 313 అంకాల పాటు నడిచింది. ఈ అంకాలను ఒక్కొక్కటిగా Just Yellow పతాకం వారు YouTube లో చేరుస్తున్నారు. దాదాపు అన్ని అంకాలు ఎంతో కొత్తదనంతో, నిజాయతీతో ఉంటాయి. ఈ ధారావాహికలో నాకు నచ్చిన విషయాలు:
  • ప్రతి  frameలోనూ హాస్యాన్ని బలవంతంగా పుట్టించడానికి వ్యంగ్యాన్ని వాడలేదు. నిజానికి ఈ ధారావాహిక మొత్తంలో ఎవ్వరూ ఎవరినీ అనవసరంగా అవమానించరు/కించపరచరు.
  • అశ్లీలత కొంచెమంటే కొంచెం కూడా లేదు! తాగుడూ, జూదం, ధూమపానం వంటివి కూడా లేవు. పిల్లలకు సంకోచం లేకుండా చూపించవచ్చును.
  • తెలుగుదనం -- దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ధారావాహికలో ఎక్కడికక్కడ చక్కటి తెలుగుపదాలు వినబడుతూ ఉంటాయి. అక్కడక్కడా సంస్కృతసమాసాలను కూడా దంచారు. ఇక తెలుగు, ఆంగ్ళం కలిపి ప్రాస వ్రాయడం ఆ రచయితకు వెన్నతో పెట్టిన విద్య అనుకుంటాను. "నేరచరిత్రను నెరేట్ చేస్తాను", "కొరిమి దెయ్యంలా courier service అన్నావ్" లాంటి ప్రయాసప్రాసలు భలేగా నవ్విస్తాయి. నిజానికి ఒక వ్యాపారాత్మకమైన దూరదర్శనస్రవంతి (TV channel) లో episode ని అంకం అని పిలిచిన ఏకైక ధారావాహిక ఇదేనేమో!
  • పాత్రధారులు -- అప్పాజీ, అమృతం, ఆంజినేలు, శాంత, సంజీవిని, సర్వం -- ఎవరికి వారే అద్భుతంగా నటించారు. వీళ్ళకు చలనచిత్రాలలో అవకాశాలు లేకపోవడం చలనచిత్రసీమ ఎంత దుస్థితిలో ఉందో తెలుపుతోంది. అందరి ఉచ్చారణ చక్కగా ఉంది. ఎక్కడా వంక పెట్టడానికి లేదు.
  • ఒక ఏడాదంతా హాయిగా నవ్వుకునేటన్ని అంకాలు ఉన్నాయి. మరుసటి ఏడాది మళ్ళీ చూస్తే మళ్ళీ నవ్వొస్తాయి :)

మొదట్లో ఈ ధారావాహికకు ఎంతో ఆకర్షనను కలిగించినది మాత్రం రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఆయనకు మాత్రమే సాధ్యమయ్యే శైలిలో ఆంగ్ళ, తెలుగు పదాలను చక్కగా కలిపి - హాస్యం, తేలికదనం, కవిత్వం, కొత్తదనం కలిపి వ్రాసిన "ఒరేయ్ ఆంజినేలు" అనే పాట తెలియని మధ్యతరగతి తెలుగు వాడుండడేమో.  అది స్వరపరిచి, వినిపించిన కళ్యానీ మాలిక్ కూడా చక్కటి ప్రావిణ్యం కనబరిచారు. పాటను క్రింద వ్రాస్తున్నాను. ఇలాగ వ్రాసేవరకూ ఈ పాటకు రెండు చరణాలు ఉన్నాయని అనుకోలేదు.

హయ్యోలు, హమ్మోలు -- ఇంతేనా బ్రతుకు హు హు హు
ఆహాలు, ఓహోలు -- ఉంటాయి వెతుకు హ హ హ
మన చేతుల్లోనే లేదా రీమోట్ కంట్రోల్
ఇట్టే మార్చేద్దాము ఏడుపుగొట్టు ప్రోగ్రాంలు
వార్తల్లో హెడ్లైన్సా మనకొచ్చే చిలిపి కష్టాలు
అయొడింతో ఐపోయే గాయాలే మనకు గండాలు

ఎటో వెళ్ళిపోతూ నిను చూసింది అనుకోవ ట్రబులు?
హల్లో హవ్డూయుడూ అంటూ అంటోంది అంతే నీ లెవెలు
ఆతిథ్యం ఇస్తానంటే మాత్రం వస్తుందా?
తీరిగ్గా నీతో కాలక్షేపం చేస్తుందా?
గాలైనా రాదయ్యా నీదసలే ఇరుకు అద్దిల్లు,
కాలైనా పెడుతుందా నీ ఇంట్లో పెనుతుఫానసలు?

ఒరేయ్ ఆంజినేలు తెగ ఆయాసపదిపోకు చాలు
మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు
కరెంటు, రెంటు, ఎట్సెట్రా మన కష్టాలు
కర్రీలో కారం ఎక్కువ అయితే కన్నీళ్ళు
నైటంతా దోమల్తో ఫైటింగే మనకు గ్లోబల్ వార్
భారీగా ఫీలయ్యే టెన్షన్లేం పడకు గోలీమార్!

ఈ పాటకు వెనక వచ్చే రేఖాచిత్రాలు (sketches) కూడా చాలా హాస్యభరితంగా, కొత్తగా ఉన్నాయి. "చెంచాడు భవసాగరాలు" అనడం సిరివెన్నెల చేసిన ప్రయోగం చాలా అభినందనీయం. అన్ని కష్టాలనీ రెండు మాటల్లో తేల్చి  పారేశారు. ఏదేమైనా ఈ ధారావాహిక ప్రతి తెలుగువాడూ చూసి తీరాల్సినది!

Sunday, June 12, 2011

విని విని విసుగెత్తిన స్టేట్మెంట్లు

చలనచిత్రాలు సామాన్యుడి మనోరంజనం కోసం, కళాకారుల సంతృప్తి/జీవనోపాధి కోసం అన్నది పాఠ్యపుస్తకాలలోని విషయం. ఆ పుస్తకాలని కాసేపు పక్కన పెట్టి, కళ్ళ ఎదురుగా జరుగుతున్న వింతలని చూస్తే  అసలు విషయం చాలా భిన్నంగా ఉంటుంది. modern  భాషలో చెప్పాలంటే cinema  సామాన్యుడికి ఒక వ్యసనం, కళాకారులుగా చలామణి అవుతున్న వారి డబ్బు దాహం తీర్చే ఒక సాధనం. ఇది తెలుసుకోవడానికి పదో తరగతిలో ఉత్తీర్ణత కూడా అనవసరం.

ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు గారు "చిత్రం చూస్తున్నప్పుడు ఒక్క సారైనా ప్రేక్షకుడి కంట్లో నీరు వస్తే ఆ చిత్రం విజయాన్ని సాధిస్తుంది" అని అన్నారని ఎక్కడో విన్నాను. అందులో కొంత వాస్తవం ఉంది అనే నా నమ్మకం. ఉదాహరణకి కీ.శే. జంధ్యాల చిత్రాలు చూస్తే ఆద్యంతం హాస్యరసం ప్రవహిస్తున్నా, మధ్యలో ఏదో ఒక్క చోట ప్రేక్షకుడికి కళ్ళు చమర్చేలాగా ఒక సన్నివేశాన్ని ఉంచేవారు. చంటబ్బాయ్ లో చిరంజీవి బాల్యాన్ని గురించి వర్ణించినా, ఆహా నా పెళ్ళంట లో రాజేంద్ర ప్రసాద్ పక్కింటి కుటుంబంతో తనకు తల్లి లేకపోవడాన్ని గురించి చెప్పి బాధపడినా, అదే చిత్రం చిట్టచిగురున నూతన్ ప్రసాద్ తన కొడుకుత "ప్రేమలో గెలవలేదని ఎటువంట అఘాయిత్యం చేసుకోవద్దు", అని చెప్పినా, వివాహ భోజనంబు చిత్రంలో హరీష్ తనలో ప్రేమ వలన కలిగిన మార్పులను తన అన్నయ్యతో చెప్పుకు బాధపడినా -- అవన్నీ ఆ చిత్రాలకు పట్టుకొమ్మలైన సన్నివేశాలు కాకపోవచ్చును కానీ, జరుగుతున్న హాస్యం నడుమ కూడా ఏదో ఒక ఆవేదన ఉంటుంది, అటువంటి వ్యక్తులను మనం అర్థం చేసుకోవాలి అనే ఒక ఉద్దేశ్యం కనబడుతుంది. అలాగే, ఎంత బాధ ఉన్నా నవ్వుతూ ఉండాలనే సందేశం కూడా ఉంది.

అంత బాధ్యతగా చిత్రాలు తీసే రోజులు పోయాయి అని ఈ రోజు నేను దండోరా వెయ్యాల్సిన పని లేదు. ఈ దర్శకులు, నిర్మాతలూ ఆత్మవిమర్శ చేసుకోవడం మానేసి, వాళ్ళను వాళ్ళే సమర్థించుకుని మోసం చేసుకుంటున్నారు అనిపిస్తోంది. ఈ భావదౌర్భాగ్యానికి కారణం ప్రేక్షకుడా, కళావ్యాపారా లేక కళాకారులా అన్నది నాకూ తెలియదు కానీ, కళను ఆస్వాదించి సంతృప్తిని పొందే పరిస్థితి నుండి "మన వర్గం నటుడో, దర్శకుడో  కళ కంటే గొప్పవాడు" అనే వ్యసనానికి ప్రేక్షకులు, మంచి చిత్రాలను తీసి కళను ప్రోత్సహించి, కాస్త డబ్బు కూడా సంపాదించుకుందాం అనే పరిస్థితి నుండి "కళ? అమ్మో ప్రేక్షకులు చూడరు. ఫలానా చిత్రంలా మాంచి mass చిత్రమైతే బాగుంటుంది." అనే దుస్థితికి నిర్మాతలూ, దర్శకులు వచ్చేసారు.

ఈ ఉపోద్ఘాతం ఇంతటితో ఆపి, అసలు విషయం దగ్గరకు వస్తే -- ఈ జరుగుతున్న circus  మధ్యలో వినిపించే కొన్ని వ్యాఖ్యలు వింటూ ఉంటె "అసలు వీడు మాట్లాడేదానికి అర్థం ఉందా?" అనే ప్రశ్న నాకు కలుగుతోంది. అలాంటివి కొన్ని చెప్దామని నా ప్రయత్నం.

శంకరాభరణం mass  ఆ, class  ఆ?

మొహం పగలగోట్టాలనిపిస్తుంది ఈ మాట అన్న దర్శకులని. శంకరాభరణం class ఏ అంటాను. పండితులని, పామరులని ఒక త్రాటిపై నిలుపగలిగింది అంటే దాని వెనుక ఒక సిద్ధాంతం ఉంది. వారిద్దరిలోనూ ఉన్న వివేకాన్ని మేల్కొలపడమే ఆ చిత్రవిజయానికి రహస్యం. రిక్షావాడు "శంకరా, నాదశరీరాపరా" అని పాడాడు అంటే వాడికి దాని అర్థం తెలిసి కాదు, ఆ సందర్భాన్ని అనుభవించగలిగాడు అని. కథలో ప్రతీ పాత్రనీ హృద్యంగా చెప్పడం అంటే అదే.

రెండు రుమ్మాళ్ళని పైనా కిందా తొడిగి ఆడపిల్లల చేత అర్థనగ్న ప్రదర్శనలను చేయించి, వాళ్ళు తీసే ఆణాకాణీ చిత్రాలకి శంకరాభరణం చిత్రంతో పోలిక చెప్పే సంకుచితమతులకి "పౌండ్రక విశ్వనాథ్" అనే బిరుదు ప్రకటించాల్సిందిగా మన నిద్రపోతున్న ప్రభుత్వానికి నా విజ్ఞప్తి.

కథను అనుసరించి అవసరమైతే వస్త్రాలను విసర్జిస్తాను.

నీకు అసత్య దోషం అంటదు కుమారీ!  మాకు ఒక దొంగసాకు (కట్టుకథ) చెప్తున్నావు. ఆ కథను అడ్డుపెట్టుకుని (అనుసరించి) వస్త్రసన్యాసం చేస్తున్నావు. నిజమే.

అమ్మాయ్! నువ్వు ఏ మందులో మింగి కండ పట్టించుకుని (అదే, కండబలిసి) వచ్చింది ఎందుకో మా అందరికీ తెలుసునమ్మా. నువ్వు చేసే అభినయానికి అంగుళం అవకాశం లేని ముష్టి పాత్రలకి ఎంత అవసరమో, ఏమి అవసరమో మాకు తెలుసును. మొదట్లో కాస్త ఒళ్ళు దాచుకున్నా రెండు మూడు అవకాశాలు రాగానే, లేదా పోగానే నువ్వేం చేస్తావో మాకు తెలియదా? నాకు అన్నప్రాసన అయినప్పటి విజయశాంతి దగ్గరనుండి నేటి తమన్నా వరకు అందరూ చేసిందే నువ్వూ చేస్తున్నావు.

డబ్బు చాలా చెడ్డదిలే పాపా! చిన్నప్పుడు దేశాన్ని ఉద్ధరిద్దామనుకుని ఎన్నో ప్రగల్భాలు పలికి, ఇప్పుడు అమెరిక వచ్చి చద్దికూడు తింటున్న నాలాంటి వాళ్లకి అది ఇంకా బాగా తెలుసును.

ఈ పాత్ర మా నాయకుడు తప్ప వేరేవాడు చెయ్యలేడు.

ఓసోస్! రాముడు, కృష్ణుడు అంటే ఇలాగే ఉంటాడు అని ఆంధ్రులందరూ నమస్కారం చేసుకున్న కీ. శే. ఎం. టి. ఆర్. కూడా ఒప్పుకోవలసిన సత్యం ఏమిటంటే రామానంద్ సాగర్ రామాయణంలో రాముడు, బీ. ఆర్. చోప్రా మహాభారతంలో కృష్ణుడు ఏంటో అద్భుతంగా కుదిరారు అని. మరి నీ బచ్చాగాడు చేసిన దగుల్బాజీ పాత్రకు వేరే ఎవడూ దొరకడా? సముద్రాన్ని వదిలేసి, దొడ్లో నీటి గుంటలో చేపలు పడితే దొరికిన చెపే అద్భుతంగా అనిపిస్తుందిరా అల్పసంతోషి.

పాత్రకు తగ్గ నాయకుడిని వెతుక్కోవడం అంటే విశ్వనాథ్ ని చూడు. నలభై ఏళ్ళు పైబడిన సోమయాజులని తీసుకొచ్చి కథానాయకుడు అంటే అందరూ నివ్వెరపోయారు/నవ్వి పోయారు. ఆ పాత్రకు నీ యువ-నవ-హీరో సరిపోతాడ? ఒక గర్విష్టి, అహంభావి అయిన పాత్రను పోషించే కళాపిపాస లేని, image -చట్రం లో చిక్కుకుపోయిన మన నటులు సిగ్గుపడే లాగా మమ్ముట్టి వచ్చి స్వాతికిరణంలో నటించి, తన సంభాషణలను తనే చెప్పుకున్నది గమనించి అప్పుడు మాట్లాడు.

ఈ చిత్రం చరిత్రని తిరగ వ్రాస్తుంది.

నిజమే. ఒక్క మగాడు, బిగ్ బాస్, మృగరాజు, శక్తి, పలనాటి బ్రహ్మనాయుడు, పులి -- అన్ని చిత్రాలు చరిత్రను తిరగ వ్రాసాయి. ఆఖరి పుటలో ఆఖరి (తిరగ)  స్థానానికి ఇంత పోటీ ఉంటుంది అని చరిత్రలో నిలిచిపోయే చిత్రాలు తీసిన కీ. శే. కే. వీ. రెడ్డి ఆనాడు అనుకుని ఉండరు.

ఫలానా బాబు career లోనే ఇది "the best film" అవుతుంది.

అవునవును. ఖలేజ మహేష్ బాబుకు, పులి పవన్ కళ్యాణ్ కి, బద్రీనాథ్ అర్జున్ కి, శక్తి ఎం. టీ. ఆర్ కి. - బాగుందామ్మా! ఖర్చుపై ఉన్న శ్రద్ధ script  పైన ఉండదుగా. అందుకే "the భ్రష్టు films" నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన సంగీతానికి మంచి స్పందన లభించింది.

ఎక్కడ? ఎవరు విన్నారు అసలు? హిందీ/తమిళ్ చిత్రాలనుండి కొట్టుకొచ్చిన నాలుగు బాణీలకి, కవులకు స్వేఛ్ఛనివ్వకుండా బలవంతంగా పదాలు ఇరికించి విడుదల చేసిన నీ album ఎవరు బాబూ విన్నది? చిన్నప్పుడు పాఠశాలలో జనగణమన పాడినప్పుడు కూడా నీ సంగీతం విన్నంత రివాజుగా అనిపించలేదు. చీమల గుండె సవ్వడిని చూడటానికి వాడే stethoscope  వాడినా వినపడని స్పందన నీకు మాత్రమె వినిపించిందంటే నువ్వు అసాధ్యుడవే.

కథ కొత్తది అని చెప్పను. కానీ, treatment కొత్తగా ఉంటుంది.

ఇప్పుడు కొంచెం serious. నేను Utah కి వచ్చినప్పుడు మా professor నాకు ఒక project  చెప్పారు. ప్రపంచంలో ఉన్న చలనచిత్రాలన్నీ తీసుకొచ్చి, వాటికున్న పీచు, తొక్క తీసేస్తే మిగిలే గుజ్జులు కేవలం 24  మాత్రమె ఉన్నాయి అని ఎవరో ఒక శాస్త్రవేత్త నిరూపించాడట. నిజమే, ఎన్ని కథలని సృష్టించేస్తాము? (నేను చెయ్యాల్సిన పని ఏమిటయ్యా అంటే చిత్రానికి వచ్చిన వ్యాఖ్యానం (review) ఇస్తే, దాన్ని బట్టి ఆ చిత్రం ఏ గుజ్జుని ఆధారంగా చేసినదో చెప్పే యంత్రాన్ని తయారుచెయ్యడం. project  నచ్చింది కానీ, ఇందులో శాస్త్రాధ్యయనం ఏముందిలే అని వేరే project తీసుకున్నాను.)

మన కర్నాటక సంగీతంలో రాగాలు కేవలం వందలలోనే ఉన్నాయి. హిందుస్తానీ కలిపి వెయ్యి అనుకుందాం. మరి వీటిని అనుసరించి అన్నమాచార్యుడు, పురందర దాసు, త్యాగరాజు మొదలైన వారి స్వరపరిచిన కీర్తనలు ఎన్ని ఉన్నాయి? వేలకు వేలు. పాట పాటకు ఎంత వైవిధ్యం? ఒక్కో పాటకూ ఎంత పరిపూర్ణత, అస్తిత్వం? మన మహాభారతంలో ఎన్ని వేల కథలు ఉన్నాయి? అదంతా చదవాలంటే కనీసం ఒక ఏడాది పడుతుంది అంటే అతిశయోక్తి కాదు. దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏమిటయ్యా అంటే విషయం అదే అయినా, చెప్పే విధానంలో క్రొత్తదనం ఉంటె బాగుంటుంది అని.

గొప్ప విషయాలతో వచ్చిన సమస్య ఏమిటయ్యా అంటే వాటిని అడ్డు పెట్టుకుని చాలా సులువుగా వెధవ పనులు చేసేయ్యచ్చును. ఆది శంకరుడు "అహం బ్రహ్మాస్మి" అనడం వేరు, ఎవడో భూటకసన్యాసి "అహం బ్రహ్మాస్మి" అనడం వేరు. పదాలు అవే, మనసులో భావం, అంటున్న ఆత్మ స్థితి వేరు. ఆది శంకరుడికి ఒక త్రాగుబోతు ఎదురయితే "నాయినా, ఇది చెడ్డ అలవాటు, మానుకోరా!" అని చెప్పారట ఆయన. దానికి వాడు, "మీ శివుడు త్రాగితే లేనిది నేను త్రాగితే వచ్చిందా?" అని అడిగితె, ఆయన వెంటనే కొంచెం విషం ఇచ్చి, "శివుడు గరళం కూడా త్రాగాడు. ఇది నువ్వు త్రాగు!" అన్నారట. ఉన్న విషయంలో తనకు అనుకూలంగా ఉన్న భాగాన్ని మాత్రమె గ్రహించడం మనిషి నైజం. దీన్నే అవకాశవాదం అని కొంతమంది అంటూ ఉంటారు.

"మై నే ప్యార్ కియా" కి "నువ్వొస్తానంటే నేనొద్దంటానా", "జో జీతా వోహి సికందర్" కి "తమ్ముడు" కి మధ్యన ఉన్నది స్ఫూర్తి అంటే నేను ఒప్పుకోలేను. అవి మక్కీకి మక్కీ దింపేసిన చిత్రాలు. ఆ మధ్యన "గుడుంబా శంకర్" సినిమానే  "ఆట"గా తీసారని ఒక నిర్మాత ఫిర్యాదు చేసారు. మరి గుడుంబా శంకర్ చిత్రానికి వెనుకన ఎన్నెన్ని సినిమాలు ఉన్నాయో ఆయనే చెప్పాలి. బిందాస్, జయీభవ, ఆర్య-2, don శీను  మొదలైన చిత్రాలన్నీ నా కళ్ళకు ఒకటే కథ లాగా కనిపించాయి. ఇక సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర - ఇలాగ చెప్పుకుంటూ పొతే కోకొల్లలు. ఈ మధ్యన విజయవంతమైన రవి తేజ చిత్రాలు చూస్తుంటే ప్రేక్షకుల అభిరుచి ఇంత దరిద్రంగా తయారైందా అనిపిస్తోంది. అన్నీ ఒకే కథ లాగా అనిపించాయి.  సరే ఇంకా శక్తి, బద్రీనాథ్ ల సంగతి అందరూ చెప్పుకుంటూ ఉన్నదే. కోడి రామకృష్ణ శివ చిత్రం చూసి శత్రువు చిత్రం తీసారట. ఆ రెండు చిత్రాలూ నేను చూసాన. శత్రువు చిత్రం చూసినప్పుడు నాకు శివ చిత్రం గుర్తు రాలేదు. స్ఫూర్తి అంటే ఇలాగ ఉండాలి ఆయన చెప్పడం నేను విన్నాను, ఏకీభవిస్తాను.

అయ్యా దర్శకులూ! ఒక సారి మన దక్షిణాదిన కే. బాలచందర్ ని చూడండి. వంద చిత్రాలు తీసారు. కథకథకీ  వైవిధ్యం ఉంది. మధ్యతరగతి ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకుని ఆయన తీసిన చిత్రాలు మనందరికీ గర్వకారణం. బలమైన కథని, సంభాషనలని, సంగీతసాహిత్యాలనీ నమ్ముకున్న ఆయనకు ఎప్పుడూ ఇలాగ ప్రచారం చేసుకోవలసిన/సమర్థించుకోవలసిన పనిపడలేదు. మన రాష్ట్రంలోనే నీలకంఠ, క్రిష్, శేఖర్ కమ్ముల  లాంటి దర్శకులు పురోగమనాన్ని సాధిస్తున్నారు. కాస్త మీ ముక్కిపోయిన గుజ్జుని బయట పారేసి బుర్రలో గుజ్జుకి పని చెప్పండి. మీ బుర్రలో గుజ్జు లేదు అని నేను అనుకోవట్లేదు. గుణ శేఖర్ తీసిన సొగసు చూడ తరమా, మనోహరం అద్భుతమైన చిత్రాలు. త్రివిక్రమ్ తీసిన నువ్వే నువ్వే చక్కని చిత్రం. వంశీ చిత్రాలలో ఎన్నో ఆణిముత్యాలు ఉన్నాయి. మరి ఆ తరువాత వాళ్ళ చిత్రాలు ఎందుకు బాగా రాలేదు. సమాధానం వారికే తెలుసును.

మంచి దర్శకుడు కావాలంటే మంచి పుస్తకాలు చదవాలి, జనజీవనం పైన ఒక అవగాహన ఉండాలి, చేసే పనిపైన శ్రద్ధ, అంకితభావం, గురవం ఉండాలి. ఇవన్నీ సాధించెంతవరకూ మీకు ఏదైనా మానసిక వైద్యశాలలో treatment  అవసరం, మీ treatment  మాకు అనవసరం.

Sunday, June 5, 2011

శ్లేషాలంకారము (paronomasia/pun)

వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> శ్లేషాలంకారము


లక్షణం: నానార్థ సంశ్రయః శ్లేషః వర్ణ్యా వర్ణ్యోభయాశ్రితః
వివరణ: రెండు లేదా అంతకంటే ఎక్కువ అర్థాలను ఆశ్రయించుకుని ఉండటాన్ని శ్లేష (కౌగిలి) అలంకారం అందురు.

ఒకే వాక్యానికి అనేక అర్థాలు ఉంటే దాన్ని శ్లేషాలంకారం అంటారు. సాధారణంగా ఇది వ్యంగ్యానికి, కఱ్ఱ విరగకుండా పామును చంపడానికి వాడుతూ ఉంటారు. కానీ, దీనిని సదుద్దేశంతో, స్తుతి చేయడానికి వాడిన సందర్భాలు మన సాహిత్యంలో కోకొల్లలు.


ఉదా:- (రఘువంశం, రచన: కాళిదాసు)
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ

వి:- ఈ వాక్యానికి అర్థం "జగత్తునకు తండ్రులు (తలిదండ్రులు) అయిన పార్వతీ-పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను" అని. కానీ, పార్వతీపరమేశ్వరౌ అనే సంధిని మఱొక విధంగా విడదీయవచ్చును - పార్వతీప (పార్వతీ దేవి పతి), రమేశః (రమాదేవికి ప్రభువు) అంటే "జగత్తునకు తండ్రులైన శివకేశవులకు నమస్కారములు" అనే అర్థంతో కూడా చదువవచ్చును.

"సాగరసంగమం" చిత్రంలో "నాదవినోదము" అనే పాటకు మొదల్లో బాలసుబ్రహ్మణ్యం "వాగర్థావివ సంపృక్తౌ" అనే శ్లోకం చదివి మొదట్లో "పార్వతీ-పరమేశ్వరౌ" అని, ఆ తఱువాత మళ్ళీ, "పార్వతీప-రమేశ్వరౌ" అనడం మీరు గమనించవచ్చును.


ఉదా:- (విష్ణుసహస్రనామ ఉత్తరపీఠిక, రచన: వ్యాసభగవానుడు (?) )
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం, రామ నామ వరాననే

వి:- సంస్కృతంలో మనోరమః అంటే మనసుని రంజింపజేసేవాడు, మనోరమా అంటే మనసుని రంజింపజేసేది (స్త్రీలింగం). మనోరమే అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. మొదటిది "మనోరమా" అనే అకారాంత స్త్రీలింగ శబ్దానికి సంబోధనా ప్రథమా విభక్తి. అంటే సీత అనే ఆమెను పిలవడానికి "హే సీతే" అనడం లాగా అన్నమాట. రెండవ అర్థం మనోరమః అనే అకారాంత పున్లింగ శబ్దానికి సప్తమా విభక్తి. అలాగే వరాననః, వరాననా కూడా. ఇప్పుడు ఈ శ్లోకానికి రెండు అర్థాలు ఎలాగ వచ్చాయో చూద్దాము.

1. శివుడు పార్వతీ దేవితో మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడట:
"శ్రీరామ, రామ, రామ" అని (ఇతి) రామునియందు (రామే) రమిస్తూ (పరమానందాన్ని అనుభవిస్తూ) ఉంటాను, ఓ మనోరమా. రామ నామం ఒక్కటే, వెయ్యి (సహస్ర) పేర్లతో సమానం (తుల్యం) వరాననా".

2. నాబోటి ఒక సాధారణ భక్తుడు శ్రీరాముణ్ణి తలుచుకుంటే:
"శ్రీరామ, రామ, రామ" అని రామునియందు (రామే), మనస్సుకు సంతోషాన్ని కలిగించేవానియందు (మనోరమే), వరాననుడు యంది (వరాననే) రమిస్తూ ఉంటాను. రామనామం ఒక్కటీ వెయ్యి పేర్లకు సమానం".

ఈ విధంగా రెండు అర్థాలను ఆపాదించుకుని ఈ శ్లోకాన్ని చదివి తరించవచ్చును.


ఉదా:- (నానుడి)
పతివ్రతకు పరపతితో పనేముందో?

వి:- పరపతి అనే పదాన్ని రెండు అర్థాలలో వాడవచ్చును. ఒకటి - పరుల పతి అని, రెండు - ప్రతిష్ట అని. పతివ్రతకు పరుల పతి మీదకు మనసు పోకూడదని ఒక అర్థమైతే, పతివ్రతకు పేరుప్రతిష్టల మీద కాక పతి మీద దృష్టి ఉండాలని మఱొక అర్థం.


ఈ అలంకారాన్ని ఆధారంగా అనేక అశ్లీలవాక్యాలను నిర్మించిన ఘనులు ఉన్నారు. వాటిలో భాషాపరంగా మంచి విషయం ఉన్నా, సంస్కారపరంగా నచ్చకపోవడంతో ఇక్కడ ప్రస్తావించట్లేదు. ఈ అలంకారం ఉన్న తెలుగు పద్యాలను/చలనచిత్రగీతాలను వ్యాఖ్యల ద్వారా తెలుపగలరని చదువర్లకు మనవి.