Saturday, August 29, 2009

కిరికిరి - ఆన్లైన్ లవ్!

పోకిరి సినిమా చూసి inspire అయ్యి ఒక లవ్ స్టొరీ డెవలప్ చేసాను. ఈ సినిమా లో హీరో (పేరు: కిట్టు, పండు అంటే మరీ ఓల్డ్ గా ఉంటుంది అని) ఒక M.S. స్టూడెంట్. అతను U.S లో చదువుకుంటూ ఉంటాడు. తను U.S. బయల్దేరే ముందు ఒక అమ్మాయితో (పేరు స్వాతి) పరిచయం అవుతుంది. మనవాడు ఆ అమ్మాయికి ఫ్లాట్ అయిపోతాడు.

ఏవో ఒకటి రెండు సందర్భాలలో ఆ అమ్మాయి భర్త ఎలాగుండాలని expect చేస్తోందో అడిగితే, "ఆ ఏముంది కిట్టుగారు, ఏదో చదువు అయ్యింది అనిపించి, మైక్రోసాఫ్ట్ లోనో, గూగుల్ లోనో పని చేస్తూ ఉండి, ఏటా ఒక సారి యు.ఎస్, ఒక సారి యు.కే కి తీసుకెళ్ళి అన్నీ తిప్పి చూపించగలిగితే చాలు", అంటుంది. మనవాడు షాక్ అయ్యి, వెంటనే "ఛీ నీయన్కమ్మ, నీకు ఒక్క క్వాలిటీ కూడా లేదు", అనుకుంటాడు. సరే, అన్ని ఆశలు ఉండే ambitious పిల్లను పెళ్లి చేసుకుంటే, తన సరదాలన్నీ తీర్చగలిగే అంత సీన్ తనకు లేదు అని అనుకుని, స్వాతి లవ్ చెయ్యనట్టు నటిస్తుంటాడు.

కొన్నాళ్ళకి ఆ అమ్మాయి కూడా తనకు నచ్చిన ఒక్క క్వాలిటీ లేకపోయినా కిట్టునే ఇష్టపడుతుంది. ఆ విషయం కిట్టుకి చెప్తుంది. కానీ, ఏదో మిడిల్ క్లాసు ఫ్యామిలీలో పుట్టి పెరిగిన కిట్టు ఎప్పుడూ చదువు, న్యాయం, నిజాయితీ, సేవ లాంటివి పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. "దీన్ని పెళ్లి చేసుకుంటే యూరోప్ చూపించకపోతే ఏ రోపో తీసుకుని అఘాయిత్యానికి పాల్పడుతుంది", అని అనుకోని, తనకు అసలేమి తెలియనట్టు, తను స్వాతిని ఎప్పుడూ ప్రేమించనట్టు నటిస్తాడు. అప్పుడు వాళ్ళ మధ్యలో జరిగిన ఒక సన్నివేశం ఈ అంకంలో చూద్దాం.

స్వాతి ఆంధ్రదేశంలో, కిట్టు యు.ఎస్ లో ఉన్నారు. స్వాతి ఆర్కుట్ బ్రౌస్ చేస్తూ ఉంటే కిట్టు ఉన్నట్టు తన మనసుకు అనిపిస్తుంది. కానీ కిట్టు స్క్రాప్ చెయ్యడు, gtalk లో ఆన్లైన్ కనబడడు. చివరకు ఈ టెన్షన్ తట్టుకోలేక ఫోన్ చేస్తుంది (ISD call నిముషానికి ఆరు రూపాయలు అయినా సరే. బేసిక్ గా, స్వాతిది బాగా బలిసిన ఫ్యామిలీ).

స్వా: ఏం చేస్తున్నావు?
కి: టీవీ చూస్తున్నాను.
స్వా: కాదు. నువ్వు ఆర్కుట్ లోనూ, gtalk లోనూ ఎవరితోనూ మాట్లాడుతున్నావు.
కి: లేదు. నేను ఫ్యాషన్ టీవీ చూస్తున్నాను. చాలా కలోర్ఫుల్ గా ఉంది.
స్వా: No. నువ్వు ఆర్కుట్ లో బ్రౌస్ చేస్తుంటే నా scrapbook లో నీనుండి స్క్రాప్ వచ్చి, నోటిఫికేషన్ వచ్చినట్టు అనిపిస్తోంది. I can feel it.
కి: లేదు. నేను నిజంగానే టీవీ చూస్తున్నాను.
స్వా: Listen carefully. నువ్వు నిజంగా ఆర్కుట్ లో బ్రౌస్ చేస్తుంటే, నాది నిజమైన ప్రేమ. లేకపోతే, I will try to forget you.
కి: ఉఫ్ఫ్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నేను టీవీ చూస్తున్నాను అని.
స్వా: I don't believe you. You're a liar.

స్వాతికి ఏం చెయ్యాలో పాలుపోక ఆర్కుట్ లో ఫ్రెండ్ (పేరు: రాజు) కి birthday wishes చెప్దామని scrapbook కి వెళ్తే, అక్కడ కిట్టు వ్రాసిన స్క్రాప్ ఉంది. ఎప్పుడు చేసాడా అని చుస్తే 2 min ago, అని ఉంది. స్వాతికి కోపం పొంగుకొచ్చింది. తన ఫ్రెండ్ తులసిని gtalk లో చూసింది. "తులసి, కిట్టు నీతో మాట్లాడాలన్నాడు. invisible mode లో ఉన్నాడు. ping చెయ్యి", అని చెప్పింది. వెంటనే, తులసి "అవునా, నేను తనతో chat చేస్తున్నానే? ఏమీ చెప్పలేదు?", అంది. దానితో కిట్టు ఆన్లైన్ ఉన్నాడని స్వాతికి తెలిసిపోయింది. తులసి కిట్టుని పింగ్ చేసి, "ఏం కిట్టు, నాకు ఏదో చెప్పాలని స్వాతితో అన్నావుట. ఏమిటి?", అని అడిగింది. అప్పుడు కిట్టుకి స్వాతి ఐడియా అర్థం అయ్యింది. తనలో తనే, "ఇప్పుడు స్వాతి నన్ను పింగ్ చేస్తుంది, రెడీ 1,2,3...", అనుకున్నాడు. వెంటనే, స్వాతి పింగ్ చేసింది.

స్వా: ఫ్యాషన్ టీవీ చూడటం అంటే ఆర్కుట్ లో birthday scraps పంపించడం, తులసి తో చాట్ చెయ్యడమా?
కి: ఇప్పటి దాక చూసి, నీతో ఫోన్ మాట్లాడాక ఆన్లైన్ వచ్చాను.
స్వా: అసలు ఫ్యాషన్ టీవీ చూసే మొహమేనా నీది?
కి: ఏం? నేను ఫ్యాషన్ టీవీ చూడకూడదా?
స్వా: ఎందుకు నా మనసుతో ఇలాగ ఆడుకుంటున్నావు? ఎందుకు ఇన్ని అబద్ధాలు.
కి: సరే కానీ. ఏంటి, నేను ఆర్కుట్ లో ఆన్లైన్ వస్తే నీకు స్క్రాప్ చేసినట్టు అనిపిస్తోందా?
స్వా: మరి అనిపించదా?
కి: మరి నాకు అనిపించదేందుకు?
స్వా: జీవితంలో ఎవరినైనా లవ్ చేస్తే కదా తెలిసేదే.
కి: ఐతే ఇప్పుడు ఏంటి? నువ్వు నన్ను లవ్ చేస్తున్నాను అంటావా?
స్వా: ఇప్పటిదాకా లవ్ చేశాను. But, I am dropping now. I hate you truly and completely.
కి: ఏదో ఆవేశంలో ఉన్నట్టున్నావు. పడుకో. తరువాత మాట్లాడుకుందాము.

ఈ chatting మధ్యలోనే కిట్టు birthday wishes చెప్పిన ఫ్రెండ్ (రాజు), "థాంక్స్ బాస్, సో స్వాతి ఏమంటోంది?", అని స్క్రాప్ చేసాడు. దానికి కిట్టు, "తను నన్ను వేపుకు తింటోందిరా బాబు. గౌరీ కూడా ఇంతేనా?", అని రిప్లై పంపాడు. అప్పుడే రాజుకి birthday scrap పంపించిన స్వాతి (పేజి రిఫ్రెష్ అయ్యాక) కిట్టు స్క్రాప్ చూసింది. అది కాపీ చేసి కిట్టు విండో లో పేస్టు చేసింది.

స్వా: "స్వాతి నన్ను వేపుకు తింటోందిరా బాబు. గౌరీ కూడా ఇంతేనా? " -- ఏమిటిది?
కి: నీకు వేరే వాళ్ళ scrapbook చూడటం తప్ప వేరే పని లేదా?
స్వా: నీకు నా గురించి వేరే వాళ్ళ scrapbook లో మాట్లాడటం తప్పితే వేరే పని లేదా? మన విషయాలు వేరే వాళ్ళకి ఎందుకు చెప్పాలి అసలు?
కి: వెళ్ళమ్మా తల్లి, నేను కాస్త పని చేసుకుంటాను. నా టైం వేస్ట్ చెయ్యకు.
స్వా: నీకు నేను టైం వేస్ట్ అయితే, నాకు నువ్వు కూడా టైం వేస్ట్.

కిరికిరి అనే ప్రేమకథలో ఒక అంకం సమాప్తం.

Sunday, August 16, 2009

గిల్లికజ్జాలు

నా "మొగుడ్స్ పెళ్లామ్స్" పోస్ట్ చూసి మరొక చెల్లి కొన్ని కీలకమైన విషయాలపైన కూలంకషంగా చర్చింది. ఆమె అనుమతితో ఇక్కడ ఆ చర్చను ఉంచుతున్నాను.

ఇంతకీ ఈ చెల్లి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. కొన్నాళ్ళు ఇండియా లో పని చేసింది. ఇప్పుడు యు.ఎస్. లో చేస్తోంది. ఇంటర్నెట్ లో పరిచయం ఐన ఒక అబ్బాయిని ఇష్టపడి, ఇంట్లో ఒప్పించి, పెళ్లి చేసుకుంది. యు.ఎస్ వచ్చినా భారతీయ సాంప్రదాయాన్ని, సాంప్రదాయం వెనుకనున్న సాత్వికతను గ్రహించి బుద్ధిగా మసులుకుంటుంది.

నేను: ఏయ్, ఎలాగున్నావు?
తను: బాగున్నాను. నీ మొగుడ్స్ పెళ్లామ్స్ పోస్ట్ చదివాను. చాలా బాగుంది. నూరు శతం ఒప్పుకుని తీరతాను. చెప్పిన అమ్మాయి ఎవరో కానీ ఒక్క ముక్క కూడా పొరబాటు లేకుండా చెప్పింది. బ్యూటిఫుల్! థాంక్స్!
నేను: ఏదో చెల్లెమ్మ, నా పని ఏముంది. ఎవరో పీకిన క్లాసు అందరికీ ఉపయోగపడాలని అక్కడ టైపు చేసి పెట్టాను అంతే.
తను: నేను ఆలోచిస్తూ ఉంటే ఒకటి అనిపిస్తుంది. ఎప్పటినుండో మన అందరిలోనూ అబ్బాయిలు ఎక్కువ, అమ్మాయిలూ తక్కువ అనే ఫీలింగ్ ఉండిపోయింది. ఉదాహరణకి భర్తా భార్యని "మీరు" అనడం భార్యకే ఇష్టం ఉండదు. అదే లవ్ మ్యారేజ్ అయినా కూడా అబ్బాయిని అమ్మాయి మీరు అనే పిలుస్తుంది.
నేను: అదే ఆ పోస్ట్ లో ఇంకో చెల్లి చెప్పినట్టు, అమ్మాయికి భర్త తనను ప్రేమిస్తున్నాడు అనే ఫీలింగ్ ఉంటే చాలు. adjust అయిపోతుంది.
తను: అన్నట్టు, నువ్వు ఆయన ఏదో మాట్లాడుకుంటున్నారు అని చెప్పారు. ఏంటో?
నేను: ఏముంది, నువ్వు తనని రాచిరంపాన పెట్టేస్తున్నావు అని చెప్తున్నాడు. మొన్ననే ఏదో కొంచం వెరైటీ జీన్స్ వేసుకుంటాను అని గొడవ చేసావంట?
తను: ఛి, modern డ్రెస్ ఏమి కాదు.
నేను: అదేమిటి? modern అంటే బూతు అన్నట్టు మాట్లాడుతున్నావు?
తను: అది ఏదో వెరైటీ జీన్స్ వేసుకుంటాను అంటే ఆయనకీ కోపం వచ్చింది. బాగా కొట్టుకున్నాము :P
నేను: ఇదిగో, నా లాంటి ఉత్తముడి చెల్లాయి అంటే చాలా అంచనాలు ఉంటాయి అత్తారింట్లో. ఎంతో మర్యాదగా ఉంటుంది అని, ఇంటి పరువు నిలబెడుతుంది అని అనుకుంటారు. ఇలాగ నీచంగా గుడ్డల కోసం, ఐస్-క్రీంల కోసం మొగుడితో గోడవాడి నా పరువు తియ్యకు. బుద్ధిగా ఉంటే మా మాంగారితో చెప్పి నా పెళ్ళికి నీకు పట్టుచీర పెట్టిస్తాను.
తను: హి హి :) చిన్న చిన్న వాటికి కూడా చాలా కొట్టుకంటాములే.
నేను: చిన్న చిన్న వాటికి ఐతే పరవాలేదు. సరదాగా ఉంటాయి గిల్లికజ్జాలు :)
తను: నేనేదో ఉత్తినే అంటాను. తను అది సీరియస్ గా తీసుకుంటారు. తరువాత నేను "ఎం లేదు. లైట్. ఉత్తినే అన్నాను", అని ఎంత చెప్పిన ఆయన ఒప్పుకోరు. "నువ్వు నా కోసం త్యాగం చేస్తున్నావు. నేను నీకు సూట్ కాను", అని తల తినేస్తారు.
నేను: అదేమిటి? ఇది అమ్మాయిల డవలాగు కదా?
తను: అలాగా ఏమి లేదు అన్నయ్య - అమ్మాయిలూ, అబ్బాయిలు అని. ఒక్కోసారి "నువ్వు త్యాగం చెయ్యొద్దు. నేనే నీ కోసం మారతాను", అంటారు. ఆయన్ని నేను బాగా ఇబ్బంది పెట్టేస్తాను.
నేను: అదేం సరదా తల్లీ నీకు?
తను: అయ్యో, రామ! ఆయన్ని ఇబ్బంది పెట్టడం నాకు సరదా ఏమిటి? నేను ఉత్తినే అన్నదానికి సీరియస్ గా రియాక్ట్ అవుతారు. అనవసరంగా hurt అవుతారు. నేను ఎంత చెప్పినా వినిపించుకోరు.
నేను: సహజంగా సంప్రదాయం విషయానికి వచ్చేసరికి, చాలా మంది మగవాళ్ళు వాళ్ళ కంటేఎక్కువ conservative గా ఉండే ఆడవాళ్ళని ఇష్టపడతారు. నాకు చాలా మంది అదే సలహా ఇచ్చారు. భార్యకి ఆచారం తెలియకపోయినా ఫరవాలేదు, తెలివి లేకపోయినా ఫరవాలేదు, భక్తీ లేకపోయినా ఫరవాలేదు, కానీ సంప్రదాయం మాత్రం బాగుండాలి అనే కొంచం సంప్రదాయం తెలిసిన కుటుంబం నుండి వచ్చిన అబ్బాయి అనుకుంటాడు.
తను: చాలా కరెక్ట్ గా చెప్పావు అన్నయ్య. నేను "అది చేసేద్దాము. ఇది చేసేద్దాము", అనుకునేదాన్ని. నిజానికి చేసినా చెయ్యకపోయినా ఆ ఫీలింగ్ అయితే ఉండేది. "అన్నీ చూసేయ్యాలి. ఎంజాయ్ చేసెయ్యాలి", అని. ఏదైనా కొత్తది కన్పిస్తే చాలు ఇంక ఆగలేకపోఎదాన్ని. ఒక్క రెండు నిముషాల తరువాత ఎంతూ ఉండేది కాదు.
నేను: కొత్త తరం ఆలోచనలన్నమాట. సరే, మరి ఆయనేమిటి అంటారు?
తను: అది ఆయన చూసి, "ఛాన్స్ ఉంటే నువ్వు చేద్దాము అనుకున్నావు కదా?", అని అంటారు. నేను లేదంటాను. అప్పుడు ఆయన అది ఎందుకు చెయ్యడం తనకు నచ్చదో విడమర్చి చెప్తారు. నాకు అర్థం అవుతుంది. అయినా ఊరికే అలుగుతాను.
నేను: హి హి, ముదిరిపోయావు కదే తల్లి.
తను: అప్పుడు ఆయనకీ చెప్పి చెప్పి చిరాకు వస్తుంది. అప్పుడు నేను వెళ్లి సారీ చెప్పేస్తాను.
నేను: బాగుంది వరస!
తను: మాటలు మాటలు కాదు అన్నయ్య! అవి మనసుకు ప్రతిరూపాలు. మనసులో లేనిదే మాట రాదు. వచ్చింది అంటే దానికి ఒక కారణం ఉండకపోదు. అందుకే జాగ్రత్తగా మాట్లాడాలి.
నేను: కరెక్ట్ వ్యక్తికే చెప్పావులే. నా మాట తీరు నచ్చక మొన్ననే ఒక అమ్మాయి, "పో రా వెధవ", అంది. ఆ అమ్మాయి నోట ఆ మాట వినడం అదే మొదటి సారి.
తను: అయ్యో రామ! నిన్ను అంత మాట అందా?
నేను: పోనీలే, జరిగిందేదో జరిగిపోయింది. పోనిలే మనసులో నాలుగు సార్లు అనుకునే బదులు, ఇదే బెటర్. ఇంతకీ మీ డ్రెస్ ల గోల ఎక్కడిదాకా వచ్చింది?
తను: మా అమ్మని చూస్తె నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. యు.ఎస్ కి వచ్చినా సరే, ఇంక పెద్ద బొట్టు పెట్టుకుని, పట్టుచీర కట్టుకునే ఉంటుంది. అలాగా ఉండటానికి ఎంతో ఆత్మవిశ్వాసం ఉండాలి. మనతో మనం నిజాయతి గా ఉండాలి. అది కాలం అమ్మాయిలకి తక్కువ అని నా అభిప్రాయం.
నేను: అవును. Modern డ్రెస్ లు ఇష్టపడే అమ్మాయి అవి కూడా వేసుకోగాలగాలి కదా ఇండియా లో?
తను: అవును కరక్టే అన్నయ్య. కానీ, చాలా మంది వాళ్ళకు తెలియకుండానే ఇతరుల కోసం మారతారు. వాళ్ళకు వాళ్ళు సమాధానం చెప్పుకోవడానికి "రోమ్ నగరం లో రోమన్ లాగా ఉండాలి" అని చెప్పుకుంటారు. ఆ మార్పు external గానే ఉంటోంది అనుకుంటారు. ఆ మార్పు ఎంత వరకు వెళ్తోంది అనేది వ్యక్తికి అర్థం కాదు. అది తెలుసుకుని వాటి మధ్యలో మెలగడానికి చాలా బలమైన విలువలు ఉండాలి. విలువలు అంటే రోజుకు రెండు సార్లు మారేవి కాదు. "ఎందుకు చేస్తున్నాము" అన్నది నిజాయతీగా ఆలోచించి, అప్పుడు చేసే పని కానీ, తీసుకునే నిర్ణయం కానీ కచ్చితంగా బాగుంటాయి. కాలంలో ఎక్కడ చూసిన విలువలు పలచన అవుతున్నాయే కానీ చిక్కబదట్లేదు. అందుకే, మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి.
నేను: వింటున్నాను. చెప్పు చెల్లెమ్మ.
తను: ఆయన నేను ఏదైనా పని చేస్తాను అంటే, "వద్దు" అంటే, వెంటనే నేను అడిగే ప్రశ్న "ఎందుకు చెయ్యకూడదు. అందరూ చేస్తున్నారు కదా?", అని. చాలా టైం తరువాత నాకే అనిపిస్తుంది, "అంత మూర్ఖంగా ఎలాగా ఆలోచించాను?", అని. ఒక్కో సారి ఆలోచిస్తే, "నేను ఎందుకు ఇలాగ stationary గా ఉండాలి? ఎప్పుడూ conservative గా ఉండటం దేనికి? ఇలాగ నేను ఉండలేను. ఇది నాకు కష్టం.", అనిపిస్తుంది. నా పరిస్థితుల్లోనే ఉన్న చాలా మంది అమ్మాయిలూ, సీనియర్లు, బాచ్మేట్స్, ఆ మాటకీ వస్తే హీరోయిన్లు, అంత ఎందుకు నా కసిన్స్, అందరూ చాలా త్వరగా మారిపోతున్నారు. అడిగితే, "నేను ఏమీ మారలేదు", అంటున్నారు. లేకపొతే, "మారటంలో తప్పేమిటి", అంటున్నారు.
నేను: తప్పు లేదు. అది తప్పు అనిపిస్తుందా లేదా అనేది, వ్యక్తిత్వం మీద ఆధార పడి ఉంటుంది.
తను: నిజమే. సైడ్ చాలా colorful గా ఉంటుంది. ఒక్క నిముషం ఆగి, "నేను ఏమిటి చేస్తున్నాను?", అని ఆలోచించడం చాలా కష్టం.
నేను: నిజంగా చెప్పు, మీ ఆయన వలన నువ్వు నీ లాగా ఉండలేకపొతున్నావు అని నీకు ఎప్పుడూ అనిపించలేదా?
తను: అనిపిస్తుంది. కానీ, నేను నా లాగా ఉన్నానా లేదా అన్నా దాని కంటే, నేను "better" గా ఉన్నానా లేనా అనేదే నాకు ముఖ్యం. ఆయన వల్ల నేను ఇంకా "బెటర్" గా ఉన్నాను అని నాకు అనిపిస్తుంది.
నేను: ఓ. కే.
తను: నేను నన్ను సప్రేస్ చేసుకుంటున్నాను అనే ఫీలింగ్ నాకు లేదు. ఎందుకంటే మనసు అనేది పరిపరి విధాల పోతూ ఉంటుంది. దానిని పట్టుకుని పోతూ ఉంటే ఎక్కడికి పోతున్నాము, ఎందుకు పోతున్నామో కూడా తెలియకుండా పోతాము కొన్నాళ్ళకి. నాకు ఎప్పటిలాగే ఎంతూ, ఎనర్జీ ఉన్నాయి. కాకపొతే ఆయన వలన ఇంకా నిర్దిష్టమైన దిశలో ఉన్నాయి. ఇప్పుడు నాకు ఎంతో సంతృప్తిగా ఉంది.
నేను: అంత బానే ఉంది కానీ. tradition కి మరీ అతుక్కుని ఉండాలి అంటావా?
తను: tradition అంటే తిరుగు లేనిది అని నేను అనను అన్నయ్య. ఛాన్దసమ్ గా ఉండమని నా ఉద్దేశం కాదు. కానీ ఎప్పుడూ ఒకటి గుర్తు పెట్టుకో: మా అమ్మ చీర మాత్రమె కట్టుకుంటోంది, నేను కొన్ని modern dresses వేసుకుంటున్నాను. అలాగే రేపు నా కూతురు నా కంటే కొంచం advanced dresses వేసుకుంటుంది. నేను ఎంత లిమిట్ లో ఉన్నాను అన్నదాన్ని బట్టే రేపు నేను తనకు నేర్పించగాలను. ఇప్పుడు ఒకతను తాగలేదు అనుకో, తన కొడుకు ఒక చుక్క రుచి చూస్తే ఏం పోయింది అంటాడు. నాకు ఎక్కడ ఆపాలో తెలుసును అంటాడు. వాడి కొడుకు చుక్క తాగడం వేస్ట్, కక్కుర్తి. మందు తాగేది రుచి కోసం కాదు, కిక్ కోసం. ఒక్క రోజు తాగితే తప్పేమిటి అనుకుంటాడు. అక్కడితో మందు తాగడం రొటీన్ అయిపోతుంది. ఎవ్వరికీ నొప్పి తెలియకుండా అది ఇంట్లోకి ప్రవేసిన్చేస్తుంది. అది ఆపదానికే మనం కొంచం కంట్రోల్ లో ఉండాలి అంటాను.
నేను: అహంభావం లేకుండా, ఆత్మాభిమానానికి లోటు రాకుండా, inferiority complex అనిపించకుండా చాలా చక్కగా చెప్పావు చెల్లెమ్మా. నాకు చాలా నచ్చింది. నీ లాంటి భార్య దొరికినందుకు బావ చాలా అదృష్టవంతుడు.
తను: థాంక్ యు, థాంక్ యు :)
నేను: తన అభిప్రాయాలను అర్థం చేసుకుని, వాటికి విలువనిచ్చి, నిన్ను నువ్వు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నావు. నాకు చాలా గర్వంగా ఉంది నిన్ను చూస్తుంటే. శుభమస్తు :)

Thursday, August 13, 2009

విద్యార్ధి జీవితం

నేను మళ్ళీ విద్యార్ధిని అయ్యాను కదా. కాబట్టి, మళ్ళీ విపరీతమైన ఒత్తిడి, ఉరుకులు, పరుగులు. ఈ సమయంలో నన్ను కొందరు అడిగే ప్రశ్నలకు కొంత చిత్రమైన సమాధానాలు చెప్తున్నాను. అలాంటివి కొన్ని.

స్నే: ఏంటి సందీప్! సెటిల్ అయ్యావా? అన్నీ తెచ్చుకున్నవా?
నే: ఏమోనమ్మా! ఇంకా ఇల్లు దొరకలేదు. బండెడు సామాను. మా అమ్మ ఇచ్చిన సారె తెచ్చుకున్నాను: రెండు వారాల బట్టలు, cooker, గిన్నెలు, గరిటెలు, దేవుడి ప్రతిమలు, స్వీటు, హాటు తెచ్చుకున్నాను. మరి అవన్నీ సరిపోవాలా ఇంట్లో?

స్నే: సందీప్! ఎలాగుంది స్టూడెంట్ లైఫ్?
నే: త్రిపాత్రాభినయం చేస్తున్నట్టుగా ఉంది.
స్నే: అదేమిటి?
నే: పొద్దున్నే లేచి అంట్లు తోముకుని టిఫిన్ వండాల్సింది నేనే, క్యారీయర్ సర్దుకోవలసింది నేనే, స్కూల్ కి వెళ్ళాల్సింది నేనే, డబ్బు సంపాదిన్చాల్సింది నేనే. మొత్తానికి నేనే పెళ్ళాము, నేనే మొగుడు, నేనే పిల్లల్ని. గొప్ప వెరైటీ గా ఉంది. దీన్ని మొబైల్ సంసారం అనచ్చునేమో!

Wednesday, August 12, 2009

కిట్టు కథలు - మొగుడ్స్ పెళ్లామ్స్

ఈ రోజు ఒక అనుకోని సంఘటనలో నాకు మా చెల్లి కి ఒక టాపిక్ దొరికింది చర్చించుకోవడానికి. అది ఏమిటి అంటే ఒక మగవాడు, ఒక ఆడది ప్రేమించడం లో తేడ ఏమిటి. ఇంకా ఆ మాటకీ వస్తే మొగుడు, పెళ్ళాం ఒకరిని ఒకరు ప్రేమించడం లో తేడ ఏమిటి అన్నది. మా చెల్లి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వాళ్ల బుజ్జి పాపాయి కోసం ఉద్యోగం మానేసింది. కొన్నాళ్ళు ఇండియా లో ఉంది, ఇప్పుడు యు.ఎస్ లో ఉంది.

అంటే మరి మా చెల్లి గురించి అంతా చెప్పి నా గురించి చెప్పుకోకపోతే మన ఫాన్స్ ఫీల్ అవుతారు కాబట్టి, ఏవో నాలుగు ముక్కలు. నాకు అమ్మాయిల గురించి అక్షరం ముక్క కూడా తెలియదు అని ఆంధ్రదేశం లో మంచి టాక్ ఉంది. నా జీవితంలో నాకు రాఖీలు కట్టినవాళ్ళ కంటే వీడి మెడకి ఉరేసేద్దాం అనుకున్నా ఆడవాళ్లే ఎక్కువేమో :) అది అన్నమాట, విన్నమాట, ఉన్నమాట.

ఇంతకీ మా చర్చ, ఈ టప లో:

నేను: మీ ఆడవాళ్ళు ప్రేమిస్తారు కానీ ఏది ఒదులుకోవదానికి సిద్ధపడరు. (కంగారు పడకండి, ఏదో వెటకారానికి).
తను: అసలు మీ మగవాళ్ళ ప్రేమ అంటేనే నాకు ఎప్పటికీ విచిత్రం. నాది "unconditional love" అంటారు. కాని నాకు తగినట్టు నడుచుకోవాలి అంటారు. ఏది నమ్మాలో అర్థం కాదు.
నేను: అబ్బా, మరి మీ ఆడవాల్లల్లో అలాగా ఎవరూ లేరా? నువ్వు నా కోసం మారాలి అనేవాళ్ళు.
తను: ఈ విషయంలో ఆడవాళ్ళకి, మగవాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఆడవాళ్ళ మాటకీ పెద్దగా విలువ లేదు. వాళ్ళు పెట్టిన కండిషన్స్ ని వాళ్ళే గుర్తు ఉంచుకోరు, పట్టుబట్టరు. ఉదాహరణకి, నువ్వు ఈ రోజునుండి రాత్రి వంట నువ్వే చేయ్యై అంది అనుకో, మగవాడు "సరే, నీ ఇష్టం", అంటే చాలు, ఒక్క రోజు కూడా వంట చెయ్యక్కరలేదు. "ఆహా, నా మొగుడు కాబట్టి ఒప్పుకున్నాడు", అని మురిసిపోయే వాళ్ళే వంట చేసేస్తారు. అనుకున్నది జరిగిన జరగకపోయినా భర్తా adjust అవుతాడు అనే కాన్ఫిడెన్స్/సెక్యూరిటీ చాలు.
నేను: మరి అబ్బాయిలకో?
తను: అబ్బాయికి మాట ఇస్తే కట్టుబడి తీరాలి, పరిస్తితులు మారినా సరే. ఇప్పుడు చెప్పు. ఎవరిదీ unconditional love? అమ్మాయిలూ కోరుకునేవి చాలా చాల చిన్న చిన్న సిల్లీ విషయాలు: ఒక బైక్ డ్రైవ్ చెయ్యాలనో, ఒక డ్రెస్ కొనుక్కోవలనో. major decisions అన్నీ భర్త తీసుకుంటాడు అనే expect చేస్తారు. చాలా లేట్ గా తెలుసుకునే విషయం ఏమిటి అంటే, ఆ decisions వల్ల రోజు వల్లే adjust అవ్వాల్సివస్తుంది అని. అదే ఆడవాళ్ళూ కోరుకునే adjustments ఏడాదికి ఒక్కసారి వచ్చినా ఆశ్చర్యమే.
నేను: adjustments అంటే?
తను: మా పేరెంట్స్ తో బాగా బెహవె చెయ్యాలి అన్నాను అనుకో. ఎన్ని సార్లు మరి మేము మా పేరెంట్స్ ఇంటికి వెళ్తాము. పుష్కరంలో వేళ్ళ మీద లేక్కపెట్టచ్చు. అదే అబ్బాయి ఐతే? నువ్వు చదువుకోవడానికి వీల్లేదు అంటే అది జీవితాంతం ఉండిపోయే లోటు, నువ్వు ఉద్యోగం చెయ్యడానికి వీల్లేదు అంటే ప్రతిరోజూ తెలిసే లోటు, మా పేరెంట్స్ తో బాగా behave చెయ్యాలి అంటే అది ఒక రోజుతో తీరేదా?
నేను: ఓహో, అలాగంటావా?
తను: ఇప్పుడు చెప్పు. ఎవరిది unconditional love? మగవాళ్లది మాటల్లో. ఆడవాళ్లది చేతల్లో.

నేను: ఇప్పుడు మన కిట్టు గాడు ఉన్నాడు కదా! వాడి గురించి మన చుట్టాల్లో ఆడవాళ్లల్లో మంచి టాక్ ఉంది. ఏమిటంటే, వాడు ఆడవాళ్ళని గౌరవిస్తాడు అని. ఆడవాళ్ళ మాటలకూ విలువ ఇస్తాడు అని.
తను: అవును, నేను కూడా ఒప్పుకుంటాను.
నేను: అదే టైం లో మగవాళ్ళల్లో ఇంకో టాక్ ఉంది. వీడొక వెర్రి వెంగలప్ప, పెళ్ళానికి లొంగిపోతాడు అని. నీ అభిప్రాయం వినగోరుతున్నాను.
తను: లొంగిపోవడం కాన్సెప్ట్ నాకు చాలా వింతగా ఉంటుంది. అసలు " అమ్మాయి లొంగిపోయింది మొగుడికి", అని ఎప్పుడైనా విన్నావా?
నేను: లేదు.
తను: మొగుడు పెళ్ళాం మాట వింటే వెన్నుపూస లేనట్టు. లెక్కన అసలు ఆడవాళ్లకు వెన్నుపూస అంటూ దేవుడు పెట్టలేదు ఏమో? అసలు భార్య మాట వినడం వలన మగవాడికి వచ్చే నష్టం ఏమి లేదు, వాడికంటూ బుర్ర ఉంటే. ఆ బుర్ర కిట్టు అన్నయ్యకి ఉంది.

నేను: (ఓహో, మాకు లేదు అన్నమాట.) ఇంకో సందేహం చెల్లమ్మా. (రేడియో మామయ్య లాగా). మగడైన తన తల్లిని ఎలాగ గౌరవిస్తాడో తన భార్యను కూడా అలాగే గౌరవిస్తాడు కదా? అంటే, వారిద్దరి మధ్యన విభేదాలు రానంతవరకు.
తను: ఈ imaginary clause ఏమిటి? అది అసంభవం.
నేను: ఏది అసంభవం?
తను: అత్తాకోడళ్ళకి విభేదాలు లేకపోవడం.
నేను: పోనీ, ideal scenario లో.
తను: కొంతవరకు నిజమే. కానీ చాలా తేడాలు కూడా ఉన్నాయి.
నేను: ఏమిటో?
తను: ప్రతి కొడుక్కి తల్లి మీద gratitude ఉంటుంది. అది భార్య మీద ఉండదు.
నేను: పోనీ భార్య భర్తను తల్లిలాగా చూసుకుంటే, అప్పుడు భర్త కూడా gratitude తో ఉంటాడు గా.
తను: మరొక impossible scenario. బాగా చూసుకోవడం వేరు, తల్లి లాగా చూసుకోవడం వేరు. అసలు తల్లికి భార్యకి భయంకరమైన తేడా ఏమిటి అంటే, తల్లి కొడుకు దగ్గరనుండి ఏమి ఆశించదు. కొడుకు reciprocate చేస్తే మురిసిపోతుంది, కానీ ఆశించదు. అదే భార్య భర్త దగ్గరనుండి ఆశిస్తుంది. తల్లి కొడుకులది "give to" relationship. భార్యభార్తలది "give and take relationship".
నేను: ఓహో, నిజమే.

నేను: ఏమిటో చెల్లెమ్మ, నువ్వు చెప్తుంటే అన్నీ కరెక్ట్ గా అనిపిస్తున్నాయి. నువ్వు ఫస్ట్ నుండి ఇంతే. పెళ్ళయ్యాక మరీ బాగాను.
తను: మొత్తం క్రెడిట్ చెందాల్సింది మావారికే.
నేను: (ఎమోషన్ లో ప్రమోషన్ ఆ. ఓ. కే.) ఎందుకో?
తను: మా ఆయనా ఎంత ఎమోషనల్ గా చెప్పినా నమ్మరు. అనవసరమైన ఎమోషన్ అంత పీకి పారేసి అసలు ఇన్పుట్ తీసుకుని ప్రాసెస్ చేసి అప్పుడు deliver చేస్తారు. నేను భావిభారతభర్తలకు ఇచ్చే సందేశం కూడా అదే. Have a good sense of discretion. ఎమోషనల్ గా చెప్పింది అని ఎక్కువ వేల్యూ ఇచ్చేయ్యద్దు.
నేను: ఏమిటో చెల్లెమ్మ నీ పుణ్యమా అని ఈ రోజు చాలా జ్ఞానోదయం అయిపొయింది. బావగారిని అడిగానని చెప్పు. ఉంటా మరి.

వంశవృక్షం - ధర్మం

బాపు తీసిన "వంశవృక్షం" అనే ఒక సినిమా ఈ మధ్యన చూసాను. సినిమా లో బొత్తిగా గ్లామర్ లేదు. సినిమా మొత్తం బ్రాహ్మల democracy కనబడుతుంది.అంటే, "by the brahmins, for the brahmins, of the brahmins" అన్న మాట. ఆ సినిమా మా ఇంట్లో ఎవరికీ నచ్చలేదు. నాకు మాత్రం కొంత నచ్చింది. ఎందుకు నచ్చింది? ఏమిటి నచ్చింది?

ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ఇందులో characters ని పరిచయం చెయ్యాలి. సోమయాజులు ఒక కృష్ణ భక్తుడు. వాళ్ళ వంశం పేరు "బృందావనం" వారు. వాళ్ల వంశం లో అందరూ కృష్ణ భక్తులు. వాళ్ళకు రోజు అంటే పొద్దున్నే లేచి కృష్ణనామస్మరణ చేస్తూ పడుకునేవరకు కృష్ణుణ్ణి సేవించడమే. సోమయజులుకు ఒక కొడుకు ఉంటాడు. అతడికి పెళ్లి అయ్యి ఒక పిల్లాడు పుడతాడు. కానీ కొడుకు పుట్టగానే సోమయాజులు కొడుకు చనిపోతాడు. అప్పుడు అతని భార్య (జ్యోతి) వైధవ్యం స్వీకరిస్తుంది. తెల్ల బట్టలు వేసుకుంటుంది. సౌందర్యానికి సంబంధించిన విషయాన్నీ దగ్గరకు రానివ్వదు. యవ్వనం లో ఉండగా కలిగే కోరికలను చంపుకోవడానికి రాత్రుళ్ళు కేవలం మజ్జిగన్నం తింటుంది. కొడుకుని చూసుకుంటూ ఉంటుంది.

కొంత కాలానికి జ్యోతికి MA చెయ్యాలనే కోరిక కలుగుతుంది. చెప్పగానే వాళ్ళ అత్తగారు, "మా ఇంట వంట లేదమ్మా ఇలాగ. వద్దే తల్లి. అనవసరమైన కోరికలు కలుగుతాయి", అంటుంది. కానీ సోమయాజులు ఎంత ఛాందసుడైనా అమ్మాయికి ఇంట్లో ఏమి తోచట్లేదు అని నాలుగు మంచి ముక్కలు చెప్పి చదువుకోవడానికి తన శిష్యుడు (కాంతా రావు, కాలేజీ ప్రిన్సిపాల్) దగ్గరకు పంపిస్తాడు. ప్రతి రోజు లాంచి లో పట్నం వెళ్లి కాంతారావు తమ్ముడు (అనిల్ కపూర్) దగ్గర ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. అనిల్కపూర్ జ్యోతి కి ఆసలు కల్పిస్తాడు, "నాకు నువ్వంటే ఇష్టం. వైధవ్యం నీకు వద్దు. నన్ను పెళ్లి చేసుకో. మీ నాన్న, మగ పిల్లల కోసం, మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. నువ్వు భర్త మరణించాక వేరే పెళ్లి చేసుకుంటే వచ్చిన నష్టం ఏమిటి?", అని. జ్యోతి బాగా తటపటాయించి చివరికి ఒకర రోజు కాలేజీ కి వెళ్ళినట్టే వెళ్లి అనిల్ కపూర్ ని పెళ్లి చేసుకుంటుంది.

కొన్నాళ్ళకు ఆమెకు పుత్రుడి మీద ఉన్న మమకారం వాడిని తనతో తీసుకేల్దాము అనే ఆశ కలిగిస్తుంది. వెళ్లి సోమయజులును అడుగుతుంది. అప్పుడు వారిద్దరి మధ్యన సంభాషణ నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది.

(సో: సోమయాజులు, జో: జ్యోతి).

సో: రా అమ్మ. ఈవేళ మా అబ్బాయి తద్దినం. మీ అత్తగారు నీకు ప్రసాదం పెడుతుంది, తిను.
జ్యో: మామగారు, నాకు నా బిడ్డను తీసుకెళ్ళాలి అని ఉంది.
సో: దాని గురించి మాట్లాడుకుందాం. ముందు మా వాడికి నమస్కారం చేసుకుని భోజనం చేయి.
(భోజనం తరువాత జ్యోతి తండ్రి వచ్చి తనను బాగా తిడతాడు.).
జ్యో: నాన్న, నన్ను ఏమైనా అనే హక్కు నా మావగారికి ఉందేమో కానీ, నీకు కాదు. అమ్మ బ్రతికి ఉండగానే మగపిల్లల కోసం నువ్వు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నావు.
(సోమయాజులు జ్యోతి తండ్రికి నచ్చ జెప్పి పంపిస్తాడు. జ్యోతిని వేరే గదిలోకి తీసుకొచ్చి మాట్లాడతాడు).
సో: అమ్మ, నీకు మళ్ళీ పెళ్లి అయ్యింది. మళ్ళీ పిల్లలు కలుగుతారు. మాకు ఈ వయస్సులో కావలసిన కొడుకు ప్రేమ పోయింది. అనాథలమయ్యిపొయాము. మీ బిడ్డే మా ఊపిరి తల్లి. వాడిలోనే మా బిడ్డను చూసుకుంటున్నాము. దయచేసి వాడిని మాకు వదిలెయ్యి. నీకు కావలసినప్పుడు వచ్చి చూసుకో.
జ్యో: మామగారు. మీరు కర్మ గురించి అన్ని సిద్ధాంతాలు చెప్తారు. మనం గోదావరికి ఎంత పెద్ద బాణ పట్టికేల్తే అంతే నీరు వస్తుంది. ఇదే మీకు ప్రాప్తం. మీ కోసం నేను త్యాగం చెయ్యలేను. నాకు నా సంతోషం ముఖ్యం.
సో: అది ధర్మం కాదు తల్లి.
జ్యో: మామగారు, ధర్మం విషయంలో మీకు నాకు చుక్కెదురు. మనిషి ధర్మం కోసం నడవాలి అని మీరు అంటారు. ధర్మం మనిషి కోసం నడవాలి అని నేను అంటాను.
సో: (నివ్వేరేపోతూ కోపాన్ని శాంతంగా మార్చుకుంటూ విరక్తితో కూడిన చిరునవ్వుతో) సరే, ధర్మం విషయం పక్కన పెడదాము. సాధకబాధకాలే మాట్లాడుకుందాము. వీడు నీకూ, మా అబ్బాయికి పుట్టాడు. నువ్వు వీడిని తీసుకెళ్ళి నీ దగ్గర పెంచిన తరువాత, తన తండ్రి వేరే ఉన్నాడు అని, తన బంధువులు వేరే వున్నారు అని తెలిసి వాడు నిన్ను ద్వేషిస్తే, నన్ను నా బంధువుల దగ్గరనుండి ఎందుకు దూరం చేసావు అని నిలదీస్తే. ఈ ప్రేమ, ఆస్తి అనుభవించే హక్కును నాకు ఎందుకు దూరం చేసావు అని అడిగితే?

ఈ క్షణం లో జ్యోతికి ఏం చెప్పాలో పాలుపోదు. నా కొడుకు అలాగా చెయ్యడు అని ధైర్యం గా చెప్పలేదు. ఎందుకంటే, ప్రేమించే వాళ్లు దూరమయ్యే కొద్దీ వాళ్ల మీద ప్రేమ పెరుగుతుంది. దాని కోసం ఏ బంధాన్నైన, ఇష్టాన్నైనా వదులుకోవాలి అనిపిస్తుంది. అది తనకు కూడా తెలుసును. అలాగని, బిడ్డను వదిలెయ్యలేదు. వచ్చి చూసుకుని వెళ్ళిపోలేదు. భారమైన హృదయంతో వెళ్ళిపోతుంది.

ఒక ఏడాది తరువాత తన బిడ్డను చూసుకున్న కళ్ళల్లో వచ్చే ఆనందబాష్పాలు, బిడ్డ కోసం తల్లడిల్లిపోయే తల్లి వేదన, వాడిని మళ్ళీ తన కళ్ళారా చూసుకోవడం వీలు కాదేమో అనే దుఃఖం, అటు భర్త, ఇటు కొడుకు మధ్యలో నలిగిపోతూ ఉన్న జ్యోతిని చూసి కరుగని మనసు ఉండదేమో. చివరకు వాడి గురించే పరితపిస్తూన్న తనకు ఆఖరు ఘడియల్లో వాడి దర్శనం దొరికినప్పుడు ఆమె ముఖంలో కలిగే భావాలను బాపు తెరకెక్కించిన విధం నిజంగా నా కళ్ళల్లో నీళ్లు తెప్పించింది.

అసలు ఈ సినిమాలో ఎన్నో ప్రశ్నలు వస్తాయి:
  1. అసలు జ్యోతి మళ్ళీ పెళ్లి చేసుకోవడం రైట్ ఆ?
  2. వేరే పెళ్లి చేసుకున్న అంతమాత్రాన తను తొమ్మిది నెలలు మోసి, కని, పెంచిన కొడుకు మీద సర్వహక్కులు కోల్పోతుందా?
  3. ఏదో కొడుకు భవిష్యత్తులో తనను ద్వెషిస్తాడేమో అన్న భయంతో తనను విడిచిపెట్టేయ్యడం వివేకమా? అసలు తను పెంచి, పెద్దచేసిన కొడుకు తనను ఎందుకు ద్వేషిస్తాడు?
  4. కొడుకు పోయి, కోడలు చెప్పా,పెట్టకుండా ఎవర్నో పెళ్లి చేసుకుని, తన మొదటి భర్త తద్దినం రోజే తన బిడ్డను అడగటానికి వస్తే కుమిలిపోతున్న తల్లిదండ్రులను "మీ కర్మ ఇంతే, నా బిడ్డను ఇచ్చెయ్యండి", అనడం సబబా?
ఇవన్నిటికీ సమాధానం సోమయాజులు ఒక్క ముక్కలో చెప్తాడు,"ఏది మంచో, ఏది చెడో చెప్పడానికి నేను ఎవర్నయ్యా? అన్నీ చూసుకోవడానికి కృష్ణపరమాత్మే ఉన్నాడు. నాకు ఏది ధర్మం అనిపించిందో, అది నేను చేస్తాను". నిజమే, మనం ఎవరం? అందరికీ ఏదో ఒకటి రైట్ అనిపించబట్టే చేస్తారు. నూటికి తొంభై మంది, "ఇది తప్పు", అని తెలిస్తే చెయ్యరు. అందరికీ స్వార్థం ఏదో ఒక మొత్తం లో ఉంటుంది. దానిని బట్టే తప్పు, ఒప్పు అనిపిస్తూ ఉంటాయి.

ఈ సినిమా లో నేను మరిచిపోలేని డైలాగ్ ఒకటి ఉంది. కోడలు రాత్రైనా తిరిగి రాలేదు అని సోమయాజులు, వంట మనిషి (డబ్బింగ్ జానకి) కలిసి లాంతరుతో గోదావరి ఒడ్డుకు వెళ్లి వేచి చూస్తారు. జ్యోతి అప్పటికే అనిల్ కపూర్ ని పెళ్లి చేసుకుంటుంది. కోడలు ఎంతకీ రాకపోతే, సోమయాజులు వంట మనిషితో, "చీకటి పడింది కదా! దారి తప్పి ఉంటుంది", అంటాడు. చక్కని మాట.

అన్నీ చూసుకోవడానికి కృష్ణ పరమాత్ముడే ఉన్నాడు. కృష్ణం వందే జగద్గురుం!

గమనిక: నేను కూడా ఈ సినిమా లో ఎదురయ్యిన ప్రశ్నల గురించి ఆలోచించాను. నాకు ఏమిటి అనిపించింది అంటే, జ్యోతి రోజూ పిల్లాణ్ణి ఇంట్లో వదిలి, చదువుకోవడానికి పట్నం వెళ్ళేదికదా? పెళ్లి అయ్యాక కూడా అలాగే, పొద్దున్నంతా సోమయాజుల ఇంటికి వచ్చి పిల్లాణ్ణి చూసుకుని సాయంత్రం భర్తా దగ్గరకు వెళిపోతే సరిపోయేది కదా? ఎలాగూ అనిల్ కపూర్ పొద్దున్నే ఉద్యోగానికి వెళ్లి సాయంత్రమే ఇంటికి వస్తాడు కదా? అని.

ఎలాగుంది నా అవుడియా? మరీ చిన్నపిల్లాడి లాగా ఉందా? తప్పంటారా?

Monday, August 10, 2009

మరొక్క సారి మాస్టర్

శివ, రత్నం, సుబ్బు, సుద్దు అని నలుగురు మిత్రులు ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అందరూ కెరీర్లో మొదటిమెట్టు పైన ఉండటంతో అందరివీ చిన్న జీతాలే. ఇంట్లో వంట, సర్దుడు, చిమ్మడం వంటివి వంతులవారిగా చేస్తూ ఉండేవారు. ఎప్పుడూ సుద్దుగాడు అన్ని పనులూ తప్పించుకునే వాడు. ఒక రోజు అందరూ కలిసి ఎలాగైనా సుద్దుతో టాయిలెట్ కడిగించాలి అని నిర్ణయించుకున్నారు. సుద్దు రాగానే అందరూ లుంగీలు మోకాళ్ళ దాక చుట్టి, సిద్ధంగా ఉన్నారు. అప్పుడు సంభాషణ.

సుద్దు: ఏంటీ? అందరూ ఖాళీగా ఉన్నట్టున్నారు.
శివ: తమరు వేంచేస్తున్నారు అని మేము వెయిట్ చేస్తున్నాము.
సుద్దు: ఎందుకు? ఏదైనా విషయంలో నా సలహా కావాలా?
రత్నం: సహాయం కావాలి.
సుద్దు: ఏంటో! మీకు నా మీద ఈ నమ్మకం. సరే, చెప్పండి. ఏం చెయ్యాలి?
సుబ్బు: ఏమి లేదు. చాలా రోజుల బట్టి నీ చేత శ్రమదానం చేయించమని మన సెంద్ర బాబు తెగ మొహమాట పెట్టేస్తున్నాడు.
రత్నం: ఆ మధ్య నీ చేత అన్నం వండిద్దాము అనుకుంటే cookerనే పేల్చేసావు.
సుద్దు: ఏంటి మామ? ఇంకా ఆ చేదుగతం మరిచిపోలేదా?
శివ: అందుకేగా, నీ చేత మళ్ళీ శ్రమదానం చేయ్యిస్తున్నాము.
సుద్దు: నో నో నో.
రత్నం: ప్లీజ్ మాస్టర్.
సుద్దు: ఓ కే. ఇంతకీ ఏమిటి ప్లాన్?
శివ: టాయిలెట్ క్లీనింగ్.
సుద్దు: తప్పదంటారా?
సుబ్బు: పగిలిపోతుంది.
సుద్దు: ఏమిటి?
రత్నం: ముక్కు. అదే! క్లీన్ చెయ్యకపోతే ఆ వాసనకి ముక్కు పగిలిపోతుంది.
( టెన్షన్ తట్టుకోలేక మొత్తానికి సుద్దు కడగటం మొదలుపెట్టాడు).
శివ: మాస్టర్, మొదటిసారి అయినా మీరు అదరగొట్టేసారు మాస్టర్.
సుద్దు: నాకూ పెద్ద అలవాటు లేదయ్యా, ఏదో మీ ఉత్సాహం చూసి సరదాగా హంగు చేద్దామనిపించింది, అంతే!
శివ: ఈ శ్రమకి కొంచెం acid కలిసిందంటే దుమ్ము దులిపేస్తుంది.
సుద్దు: acid ఆ నా వల్ల, నో నో.
రత్నం: ప్లీజ్.
సుద్దు: ఓ కే.
(అయిపొయింది).
సుబ్బు: మాష్టారు, మాస్టారు క్లీనింగ్ లో మెగాస్టారు!
రత్నం: మాష్టర్, మనకు ఇంకో టాయిలెట్ ఉంది. మీరు తలుచుకుంటే అది కూడా అయిపోతుంది.
సుద్దు: నేనా, మరో టాయిలెటా? నో ఛాన్స్!
శివ: హే,ప్లీజ్ మాస్టరు. మీ టాయిలెట్ టాలెంట్ ఏమిటో మీకు తెలియదు. రిహార్సల్ లేకుండానే ఫస్ట్ టేక్ లో పూర్తి చేసారు. definite గా తరువాతిగది కూడా సూపర్ హిట్ ఏ.
సుద్దు: తప్పదంటారా?
శివ: తప్పదు!
సుద్దు: మీరు నా ప్రజలు,మీ కోసమే నేను జీవిస్తున్నాను. మీ కోసం ఏదైనా ఓ కే.

Saturday, August 8, 2009

కలగూరగంప

సాల్ట్ లేక్ సిటీకి వచ్చేసాను. ఇక్కడ కి వచ్చాక భారతదేశంలో enjoy  చేసినంత ఎంజాయ్ చేస్తానో లేదో తెలియదు కానీ, ఆ తెలుగుదనాన్ని ఆ భారతీయతని కచ్చితంగా మిస్ అవుతాను. ఏవో గతంలోవే గుర్తు చేసుకుని ఈ టపావళి (బ్లాగు) ని నడిపించాలి. సరే, ఇప్పుడు జాగ్రత్తగా కూర్చి  టపలు వ్రాయడం అంటే చాలా కష్టం. అందుకే గుర్తు వచ్చింది వచ్చినట్టు వ్రాసేయ్యాలి అని నిర్ణయించుకున్నాను.

% మన  తరం అమ్మాయిలు అందరికీ అభిమానకథానాయకుడు అంటే నాగార్జున. ఒక సారి ఒకమ్మాయి నాగార్జున గురించి పొగడటం మొదలెట్టి, "అసలు మణిరత్నం అంతటి డైరెక్టర్ తమిళ్ హీరోస్ అందరినీ వదిలేసి మరీ తెలుగులో నాగార్జున ని పెట్టి గీతాంజలి సినిమా తీసాడు అంటే, నాగార్జున గొప్పదనం తెలుసుకోవచ్చు", అంది. వెంటనే పక్కన ఉన్న ఫ్రెండ్, "అది కాదు సంగతి. మొత్తం ఇండియా అంతా వెతికినా కాన్సర్ పేషెంట్ లాగా ఉండే హీరో ఎక్కడా కనబడి ఉండడు. అందుకే వాడినే హీరోగా ఎంచుకుని ఉంటాడు. అలాంటి మొహాన్ని కూడా చూసి పరవశించే ప్రజలు ఆంధ్ర లో తప్ప ఎక్కడా ఉండరు అని ఫిక్స్ అయ్యే తెలుగులో సినిమా తీసి ఉంటాడు", అన్నాడు.

% శ్రీ రామదాసు సినిమా విడుదల అయిన కొత్తల్లో మా అన్నయ్య, "శ్రీ రామదాసు క్యారెక్టర్ కి నాగార్జున కరెక్ట్ రా", అన్నాడు. నేను వెంటనే ఆశ్చర్యపోయాను. ఎందుకు అంటే, నాగార్జున action సంగతి ఎలాగ ఉన్న, dialogue delivery చూస్తె చెవుల్లో yorker delivery పడినంత నొప్పి కలుగుతుంది. నా మొహం చూసి తను మళ్ళీ, "రామదాసు పాటలు కూడా వీడికి తగ్గట్టు - ఎక్కడా ఒత్తులు ఉండవు, 'పలుకే బంగారమాయెనా, కోదండపాణి', చూడు, ఒక్క ఒత్తు లేదు. ఫ, భ, ఘ లాంటి ఘనమైన అక్షరాలు కూడా లేవు", అన్నాడు. నిజమే అనిపించింది. నాగార్జున భక్తులను బక్తుల గానూ, భగవంతుణ్ణి బగవంతుడి గానూ, శాస్త్రాలను షాస్త్రాలు గానూ మార్చేస్తుంటే విని మూర్చబోయిన వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను.

% మా బంధువు పెళ్ళిచూపులకి వెళ్తే అక్కడ పెళ్లి కూతురు "స్వప్న వేణువేదో", అనే సినిమా పాట పాడింది. శంకర శాస్త్రి కి sub-junior లాగా ఉండే మా బంధువు నవ్వుకుని వచ్చేసాడు. మొత్తానికి పెళ్లి అయ్యింది. ఆ తరువాత నేను కలిసినప్పుడు ఆవిణ్ణి అడిగాను, "మరీ ఆ పాట పాడమని ఎవరు సలహా ఇచ్చారు?", అని. దానికి ఆమె, "అదేంటి సందీపు అలాగంటావు? నేను ఐతే 'దాయి దాయి దామ్మ' పాట పాడదాము అనుకున్నాను, తెలుసునా? ఆ పాట పాడుంటే ఏమయ్యేది అంటావు?", అంది. వెంటనే నేను, "ఆ ఏముంది, ఈ పాటికి నేను నీ బదులు ఇంకో అమ్మాయి తో మాట్లాడుతూ ఉండేవాడిని", అన్నాను.

% ఆవిడే ఇంకో సారి నా స్నేహితురాళ్ళని చూసి, "సందీపు, నేను కూడా జీన్సుపాంటు వేసుకుంటే ఎలాగుంటుంది అంటావు?", అంది. వెంటనే నేను, "మీ నాన్నగారు ఒప్పుకుంటారో లేదో", అన్నాను. "అదేంటి, మా వారు ఒప్పుకోవాలి కానీ,మా నాన్న ఎందుకు ఒప్పుకోవాలి", అంది. నేను, "మీ వారు ఎలాగూ ఒప్పుకోరు. నిన్ను తీసుకెళ్ళి పుట్టింట్లో అప్పగిస్తాడు. అప్పుడు మీ నాన్నగారే కదా ఒప్పుకోవాలి", అన్నాను.