Friday, July 29, 2011

కిట్టు కథలు: సంతృప్తి నాకు దిక్సూచి

కిట్టును చూడటానికి తన తండ్రి రాజు, వాళ్ళ స్వగ్రామం నుండి కలకత్తా వచ్చాడు. కిట్టు అప్పటికే చదువు పూర్తి చేసుకుని ఒక పెద్ద సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అప్పటిదాక వాళ్ళ వ్యవసాయం అంతంత మాత్రంగా నడుస్తుండటం, తండ్రి తన చదువుకోసం అప్పులు చేయడం గమనిస్తూ ఉన్న కిట్టు, ఇప్పటికైనా తన తండ్రికి కాస్త విశ్రాంతి కలిగించాలని, తను అనుభవిస్తున్న సుఖాలను తన తండ్రి కూడా అనుభవించాలని కోరుకున్నాడు. రాజుని ఎంతో అభిమానంగా చూసుకోవడం మొదలు పెట్టాడు. ప్రతి వారం ఏదో ఒక చిత్రానికో, షికారుకో అద్దెగాడీల్లో (taxi) వెళ్ళడం, ఖరీదైన restaurantsలో భోజనం చెయ్యడం మామూలైపోయాయి.

కిట్టు ఇదంతా తనపై ప్రేమతో చేస్తున్నాడు అని సంతోషించినా, ఖర్చులు కొంచెం మితి మీరుతున్నాయి అని రాజుకు బాధ కలిగింది. సున్నితమైన మాతలతో, "నాకు వద్దు. ఇంట్లోనే ఉండాలని ఉంది.", లాంటి మాటలతో చెప్పినా కిట్టు బలవంతంగా బయటకు తీసుకెళ్ళసాగాడు. ఒక రోజు కిట్టు, రాజు ఒక పెద్ద mall లో pizza center కి వెళ్ళారు. అక్కడ కిట్టు వెళ్ళి ఒక కుఱ్ఱాడికి తన పేరు ఇచ్చి వచ్చాడు. అది జరిగిన పావుగంటకి ఆ కుఱ్ఱాడు కిట్టు పేరు చదవగా, గబగబా తన తండ్రి చేయి పట్టుకుని లోపలకు, ఆ కుఱ్ఱాడు చూపించిన బల్లకు ఇరువైపులా కూర్చున్నారు. కిట్టు జాబితాలో ఉన్న వంటకాలన్నీ రాజుకు వివరిద్దామని చూశాడు. రాజు మాత్రం, "నీకేది నచ్చితే అదే చెప్పరా నాన్న", అని ఊరుకున్నాడు. కిట్టు రెండుమూడు వంటకాలు తెమ్మని చెప్పాడు.

కాసేపటికి ఆ వస్తువులు వచ్చాయి. కిట్టు ఎంతో సంతోషంగా ఒక ముక్క తుంపి రాజు పళ్ళెంలో వేసి తినమన్నాడు. రాజు దాన్ని తిందామని ప్రయత్నించాడే కానీ, అది ఎక్కట్లేదు. అది ఊతప్పానికి, దిబ్బరొట్టెకి మధ్యలో ఉంది కానీ, ఆ రుచి లేదు. కారంగా లేకపోతే రాజుకు రుచించదు. కిట్టును బాధపెట్టడం ఇష్టం లేక ఎంతో కొంత తిన్నాడు. ఇంతలో bill వచ్చింది, కిట్టు ఇంకా తింటూ ఉండటంతో రాజు దాన్ని తెరిచి చూశాడు. అక్షరాలా ఏడు వందల రూపాయలు అయ్యాయి. రాజుకు తిన్నదంతా బయటకు వచ్చినంత పని అయ్యింది. ముఖం ఎఱ్ఱగా అయ్యింది. కుఱ్ఱదనంలో తానూ బళ్ళ మీద, బట్టల మీదా ఖర్చుపెట్టాడు కానీ, ఇది మరీ ఎక్కువ అనిపించింది. ఏమీ మాట్లాడకుండా కిట్టుతో పాటు ఇంటికి వచ్చేశాడు. తను నెమ్మదిగా చెప్తే వినట్లేదు అని కాస్త గట్టిగా, "ఏడొందలు పెట్టి కొన్నావు. నాకు అది ఏమీ నచ్చలేదు. ఎందుకురా? నాకు పక్కన hotelలో దొరికే రోటీ, దాల్ తడ్కా నచ్చింది." అన్నాడు. కిట్టు, పిజ్జ కొత్త తరం విషయం అని, యువతకు నచ్చుతోందని, రాజు స్వగ్రామానికి వెళ్ళినప్పుడు గర్వంగా చెప్పుకోవచ్చునని నచ్చజెప్పాలని చూశాడు. కిట్టును తను అర్థం చేసుకోవట్లేదని బాధపడుతున్నాడని గమనించి, రాజు అప్పటికి ఊరుకున్నాడు.

సాయంత్రం ఇద్దరూ coffee తాగుతూ కూర్చున్నారు. రాజు కిట్టు కేసి చూస్తూ, "నిన్ను చూస్తుంటే నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయిరా. మా బాబాయ్ నన్ను అర్థం చేసుకోవట్లేదు అని బాధపడేవాడిని", అన్నాడు . కిట్టు నిట్టూర్చి, "అదేం లేదు నాన్న", అన్నాడు. రాజు, "సరే. మా బాబాయ్ కథ ఒకటి చెప్తాను, వింటావా?", అన్నాడు. కిట్టు ఏంటన్నట్టు చూశాడు.

"నా చిన్నదనంలో మా నాన్న చనిపోయాక మా బాబాయే నన్ను సాకాడు అని నీకు తెలుసు. మా తాత ఆస్తిని తనే చూసుకుని, నేను ఎదిగాక నాకు నా భాగాన్ని ఇచ్చాడు. ఆస్తి నా చేతికి వచ్చే ముందు, అంటే నేను చదువుకునేటప్పుడు, నాకూ నీ లాగ చాలా సరదాలు ఉండేవి. అంతమంది కూతుళ్ళ మధ్యన ఒక్కడినే కొడుకుని అని మా అమ్మ నన్ను గారంగా చూసుకునేది. కానీ, డబ్బు కావాలంటే మాత్రం బాబాయ్ నే అడగాలి. మిగతా వారందరూ ఏమనుకున్నా, నాకు మటుకు మా బాబాయ్ మంచివాడు. ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా గడ్డ పెరుగేసి  అన్నం కలిపి, అందులో కొత్తావకాయ్ నంజి పెడుతూ ఉండేవాడు. తన బిడ్డలతో సమానంగా చూసేవాడు - ముద్దాడినా, కొట్టినా.

మా బాబాయ్ వంద ఎకరాల ఆసామి. కానీ, మహా పిసనారి అని మన ఊరంతా చెప్పుకునేది. అయినా, పరుల సొమ్మును ఆశించేవాడు కాదు. ఊరక అణా కూడా ఇచ్చేవాడు కాదు. డబ్బుల కోసం ఆయనని అడగాలంటే నాకూ అదే చిఱాకు, భయం. ఈ సారి కొత్త cycle కోసం అడిగాను. గంభీరంగా ఒక చూపు చూశాడు. వద్దనే దాని అర్థం, అనుకుని నిట్టూర్చాను. నిజానికి కళాశాల ఇంటికి రెండు కిలోమీటర్లకు మించి ఉండదు, మిత్రబృందం అంతా నడుచుకునే వెళ్తున్నారు. ప్చ్...అది చెప్పే వద్దంటాడేమో అనుకున్నాను.

ఉన్నట్టుండి,  "రేపు తెల్లారుకట్ట నేను పార్వతీపురం వెళ్ళాలి, నువ్వూ వస్తావా?", అన్నాడు. ఆయన చెప్పింది చెయ్యడమే తప్ప వేరు అలవాటు లేదు ఆ ఇంట్లో. సరేనని చెప్పి ఆయన వెంట వెళ్ళాను. కొండల వెంటా, గుట్టల వెంటా తిప్పి తీసుకెళ్తూ ఐదారు కిలోమీటర్లు నడిపించి కొంచెం మనుషులు కనబడే చొటికి చేర్చాడు. అప్పుడే సూర్యుడు బయటకు వచ్చాడు. పొద్దున్న ఒక్క అరటిపండు  పెట్టి ఇంత దూరం నడిపించాడేమిటిరా బాబు అనుకుంటుండగా, ఒకరి ఇంటి దగ్గర ఆగి నన్ను అరుగు మీద కూర్చోమని లోపలికి వెళ్ళాడు. లోపలనుండి ఒకావిడ వచ్చి ఒక లోటాలో మంచినీళ్ళు ఇచ్చింది. బాబాయే పంపించి ఉంటాడు. ఒక గంట తరువాత వెనక్కి వచ్చాడు. మా ఆకలేసింది. బాబాయైతే పెద్దవాడు. ఉపవాసాలు చేసి చేసి అలవాటైంది, మరి నా గతేం కాను అనుకున్నాను. మళ్ళీ యాత్ర కొనసాగింది.

ఇంక శొష వస్తుంది అనగా ఒక ఇంటి ముందు ఆపాడు. బయట బాల్చీ, చెంబు ఉన్నాయి. కాళ్ళు కడుక్కుని లోపలకి వెళ్తూ, "నువ్వూ రా" అన్నాడు. నేనూ కాళ్ళు కడుక్కుని లోపలకి వెళ్ళాను. ఒకాయన వచ్చి తుండు ఇచ్చాడు. ఇద్దరం చేతులు తుడుచుకున్నాం. "ఏరా అబ్బీ, మీ ఆవిడ ఎలాగుంది? పిల్లలు చదువుకుంటున్నారా? ఏఁవిటి హొటేలు  పెట్టారట?", అన్నారు. "అవునయ్యా, మీరు హొటేలు పెట్టాక  మొదటిసారి వచ్చారు. కడుపు నిండా తినే వెళ్ళాలి", అన్నాడు అతను. "బయటవాళ్ళకు తెలిస్తే మా ఇంట్లో ఆడవాళ్ళకు పరువు తక్కువరా. హ హ. సరే, ఇక్కడే వడ్డించు", అన్నాడు బాబాయ్.

ఇద్దరం కూర్చున్నాము. రెండు అరటాకులు వేసి ఇడ్డెనలు వడ్డించసాగింది అతడి భార్య. ఆ కాలంలో ఇడ్లీరేకులు దొరికేవి కాదు, saucer అంత ఉండే పళ్ళాల్లో కానీ, పనస ఆకుల్లో కానీ తయారు చేసేవారు ఇడ్డెనలు. "బాగున్నావా అమ్మా", అని నవ్వుతూ అన్నాడు బాబాయ్. అంతే... ఆ తరువాత ఆవిడ వడ్డిస్తూనే ఉంది, బాబాయ్ తింటూనే ఉన్నాడు. మూడు ఇడ్డెనలకే నాకు కూర్చోలేక నడ్డి విరిగినంత పని అయ్యింది. బాబాయ్ మాత్రం డజన్ల కొద్దీ లాగించాడు. బాబాయ్ ఎక్కువ తినడం నేను ఎప్పుడూ చూడలేదు. "ముందురోజు ఉపవాసం ఉన్నాడనుకున్నా, మరీ ఇంతా?" అనుకుంటున్నాను.

బాబాయ్ మొదటి మూడు ఇడ్డెనలూ తింటుండగా హొటేలు యజమాని ముఖ్యంలో "ఇంత పెద్దాయనకు వడ్డించగలుగుతున్నాం" అనే సంతృప్తిని చూశాను. ఆ తఱువాత మూడు ఇడ్డెనలకు "పెద్దాయనకు మన వంట నచ్చింది", అనే సంతోషం చూశాను. ఆ తఱువాత మూడు ఇడ్డెనలకు "పెద్దాయన మాంచి ఆకలి మీద ఉండి మొహమాటం కూడా లేకుండా టింటున్నాడు", అనే చిరునవ్వు చూశాను. ఆ తఱువాతి మూడింటికి "ఒక మనిషి ఇన్ని ఇడ్డెనలు తినగలడా" అనే ఆశ్చర్యం చూశాను. ఆ తరువాతి మూడింటికి, "వాయంతా ఈయనకే సరిపోతోంది, బయటవాళ్ళకి ఎలాగ వడ్డించాలి" అనే కంగారు చూశాను. ఆ తఱువాత మూడింటికి, "ఇన్నీ తిన్నాడు సరే, ఈయన చిల్లిగవ్వగా ఇవ్వడని ఈయన ఊళ్ళొనే చెప్తారు. ఇరువై ఇడ్డెనలకి ముడిసరుకే రెండు రూపాయలు ఉంటుంది", అనే నిట్టూర్పు చూశాను. బాబాయ్ కి మాత్రం ఏమీ పట్టలేదు. ఇడ్డెనలూ, పచ్చడీ జుఱ్ఱేస్తున్నాడు భాగవతంలో బాలకృష్ణుడిలాగా.

అంతా అయ్యింది, ఆయన  లేచి దొడ్లోకి వెళ్ళి చేతులు కడుక్కున్నాడు. నా చేతులు ఆరిపోయాయి, పిండి చేతులపై అట్టగట్టుకుపోయింది. బలంగా రుద్దుకుని కడుక్కుని వెనక్కు వచ్చేసరికి నా జీవితంలో చూస్తాను అనుకోనిది ఒకటి చూశాను. మా బాబాయ్ తుండు నా చేతుల్లో పెట్టి తన సంచిలోంచి ఒక కొత్త వందరూపాయల కాగితం తీశాడు. అది ఇంకా నలగలేదు. అప్పట్లో ఒక రూపాయి అంటే ఇప్పుడు dollarకు సమానం. వడ్డించిన ఆమెను పిలిచి, ఆమెకు చూపిస్తూ "అమ్మాయ్, గోప్ఫగా వండావే ఇడ్డెనలు. ఆ పచ్చడో, అమృతంలాగా ఉందే. ఇదిగో మీ ఆయనకు డబ్బులుస్తిన్నాను. బట్టలు కొనిపించుకో", అన్నాడు. హొటేలు యజమాని, అతడి భార్య, నేను తెల్లబోయి చూస్తున్నాము. బాబాయ్ అతని భుజం తట్టి, "ఒరేయ్ అబ్బీ, నీ ఇంట్లో ఈ అన్నపూర్ణే మహాలక్ష్మి కూడా, చక్కగా చూసుకో. ఉంటాను.", అని నాకేసి చూసి పద అని సైగ చేసి బయల్దేరాడు.

వచ్చేటప్పుడు busలో వచ్చేశాము. దిగి ఇంటికి నడుస్తూ ఉండగా భుజం మీద చెయ్యి వేసి, "ఏరా. cycle కావాలా? ఈ రోజు పొద్దున్న నడిచావు కదా? అంత దూరం నడిచి, ఒక్కోసారి వంతెన పడిపోతే ఏట్లో ఈదుకుంటూ వెళ్ళి నేను పొరుగూరులో బడికి వెళ్ళేవాణ్ణి. ఎక్కువ చదువుకోలేదు అనుకో. cycle ఉండటం మంచిదే. చాలా శ్రమ తగ్గిస్తుంది. విలువ ఉన్న వస్తువు. కొంటాను", అన్నాడు. ఇద్దరం కాళ్ళు కడుక్కుని లోపలకి వెళ్ళాం.

నేను ఎప్పుడూ మా బాబాయ్ ని ప్రశ్నించలేదు, డబ్బు విషయాల్లో అయితే అసలేమీ మాట్లాడలేదు. ఆ రోజు ఉండలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అడిగాను, "బాబాయ్, మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు కదా? మరి మూడు రూపాయలు ఇవ్వవలసిన చోట వందరూపాయలు ఎందుకు ఇచ్చారు?", అని అడిగాను. బాబాయ్ గంభీరంగా చూసి, "డబ్బు రెండు విధాలుగా ఉపయోగపడుతుంది రా నాన్న. ఒకటి అవసరానికి, రెండు సంతృప్తికి. డబ్బును నేను జాగ్రత్త చేసేది అవసరానికి. తాత్కాలికమైన ఆత్రాన్ని అవసరంగా చూపించి చాలా మంది పెద్ద ఖర్చులు పెడుతూ ఉంటారు. నాకు అది చేతకాలేదు. అవసరమైతే ఖర్చు పెడతాను, లేదా సంతృప్తి కోసం ఖర్చు పెడతాను. పొద్దున్న అంత దూరం నడిచి వెళ్ళేసరికి "ఎప్పుడు, ఏమిటి, ఎందుకు అని అడగకుండా అభిమానంగా పిలిచి పీట వేసి భోజనం పెట్టాడు. ఆ సమయంలో ఆ ఇడ్డెనలు నాకు అమృతప్రాయంగా అనిపించాయి. చాలా తృప్తి కలిగింది. పెళ్ళాంపిల్లలు ఉన్నవాడు, వృద్ధిలోకి రావలసినవాడు, బుద్ధిమంతుడు -- వాడికి సాయం చేయడంలో నాకు తృప్తి ఉంది. అందుకే ఇచ్చాను", అని చెప్పి భాగవతం తెరిచి కూర్చున్నాడు. అక్కడే ఉంటే నన్ను చదవమంటాడేమో అని భయపడి వెంటనే బయటకు వచ్చేస్తుంటే, "నాకు సంతృప్తి కలిగితే ఎంతైనా ఇస్తాను. కలగనప్పుడు ఎంత తక్కువైనా ఇవ్వను. ఊసుపోని వాళ్ళు ఎలా ఉంటే మనకేంటి, ఏమనుకుంటే మనకేంటి?", అన్నాడు. "అవును బాబాయ్", అని చెప్పి బయటకు వచ్చేశాను.

అప్పుడు నేను ఆలోచించాను, "ఈ cycle నాకు అవసరమా? తాత్కాలికమైన ఆత్రమా? లేక దీర్ఘకాలిక సంతృప్తా?" అని. ఇప్పటికీ విషయాలూ, వస్తువులూ  మారుతూ వచ్చాయి కానీ అదే ప్రశ్న మనసుని తడుతూ ఉంటుంది. ఈ ప్రశ్న నీకూ ఉపయోగపడచ్చేమోనని ఈ కథ చెప్పాను అంతే."

అని చెప్పాడు రాజు. కిట్టు ఒక చిరునవ్వు నవ్వి, "సాయంత్రం నేనే వంట చేస్తాను నాన్న", అని చెప్పి తన mobile లో taxi వాడికి phone చేసి రావద్దని చెప్పాడు.

Wednesday, July 27, 2011

రాముడు కాకిపై బ్రహ్మాస్త్రం సంధించిన కథ

ఆధారం: ఈ కథ ప్రస్తావన వాల్మీకిరామాయణంలో సుందరకాండలో వస్తుంది. దీని మూలం (సంస్కృతంలో), ఆంగ్ళానువాదం ఇక్కడ చదువవచ్చును.

సందర్భం: హనుమంతుడు సీతమ్మని అశొకవనంలో చూశాడు. తనను తత్క్షణం రాముని వద్దకు తీసుకువెళ్తానని, తన వీపుపై కూర్చోమని హనుమంతుడు కోరినా అనేక కారణాలను సూచించి, సీతమ్మ రాను అంటుంది. అప్పుడు హనుమంతుడు ఆయన సీతమ్మవారిని కలిసినట్టుగా రుజువు కోసం రాముడికి, సీతమ్మకూ మాత్రమే తెలిసిన ఏదైనా ఒక విషయాన్ని చెప్పమని కోరతాడు. అప్పుడు సీత చెప్పిన కథ ఇది.

కథ (సీతమ్మ రాముడికి చెప్తున్నట్టుగా హనుమంతుడితో అంటుంది)

చిత్రకూటానికి ఈశాన్యంలో, గంగానదికి దగ్గరగా సిద్ధులు అనేకులు నివసిస్తుండేవారు. అక్కడ కొండల్లో గుట్టల్లో నువ్వు (రాముడు), నేను సంచరిస్తుండగా నీవు తడిసిపోయి నా సమీపంలో కూర్చున్నావు. అప్పుడు ఒక కాకి మాంసాన్ని ఆశించి తన ముక్కుతో నన్ను పొడవసాగింది. అక్కడే ఉన్న మట్టిగడ్డను తీసి (విసిరి) నేను దానిని ఆపాను. అయినా ఆ కాకి వెళ్ళక అలాగే ఉంది. ఆ కాకి నా బట్టను పట్టుకుని లాగుతుండగా, అది జారకుండా నేను బొందుని లాగిపట్టుకొనుచుండగా నీవు నన్ను చూశావు. అసలే కోపంలో ఉన్నాను, నువ్వు నన్ను చూసి నవ్వుతుండటంతో సిగ్గేసింది. అలిసిపోయి నీ ఒడిలో వాలాను. నీవు నన్ను ఓదార్చగా మళ్ళీ నా ముఖం విరిసింది. కన్నీళ్ళతో నిండిన నా కన్నులను నెమ్మదిగా తుడుచుకుంటూ ఉండగా నువ్వు నన్ను చూశావు. నేను నీ ఒడిలో, నీవు నా భుజాలలో సేద తీరుతున్నాము.

ఇంతలో మళ్ళీ ఆ కాకి వచ్చింది. రాముడి ఒడిలోంచి లేస్తున్న నన్ను చన్నుల నడుమ పదే పదే గ్రుచ్చసాగింది. అప్పుడే నా రక్తం కనబడుతున్న నా చన్నులను గమనించిన నీవు బుసఁగొడుతున్న పాము లాగా లేచి, "ఎవరు నీ చన్నులను గాయపరిచింది. కోపంలో ఉన్న ఐదు-ముఖాలు గల పాముతో ఆడుకోవాలని చూసే ఆ మూర్ఖుడు ఎవరు?" అని అడిగావు. నేను ఏమీ అనక మునుపే, చుట్టొ చూసి గోళ్ళపై రక్తబిందువులు కలిగి నా ముందు ఉన్న ఆ కాకిని గమనించావు. అక్కడ ఉన్నది ఒక్క ఆ కాకే కనుక, అదే ఈ పని చేసి ఉంటుంది అని అనుకుని దానిని దండించాలని నిశ్చయించుకున్నావు.

పర్వతాలలో వేగంగా సంచరించే ఆ కాకి ఇంద్రుడి సంతతి అని అనుకుంటాను. అయినా నువ్వు సంకోచించకుండా, నీ పాంపులోంచి ఒక దర్భను తీసి మంత్రించి బ్రహ్మాస్త్రంగా ప్రయోగించావు. ఆ కాలాగ్ని వంటి కాంతిని చూసిన కాకి భయంతో ఎగిరింది. నీ బ్రహ్మాస్త్రం దాన్ని తరిమసాగింది. రక్షణ కోరి ఆ కాకి ఈ లోకమంతా సంచరించింది. ఇంద్రుడు, దేవతలు, మహర్షులూ కూడా కాపాడమని చెప్పగా తిరిగి తిరిగి ఆ కాకి నిన్నే శరణు కోరింది. ఆ కాకి నీకు తెచ్చిన కోపానికి గాను చంపదగినదే. కానీ, నీ కృప వలన రక్షింపబడింది.

ఆ కాకి అలిసిపోయి నేల మీద పడింది అని గమనించిన నువ్వు, "అలిసిపోయిన నిన్ను నేను చంపను. ఐతే బ్రహ్మాస్త్రం వృధా కాకూడదు. ఇప్పుడు ఏం చెయ్యాలో నువ్వే చెప్పు", అన్నావు. ఆ కాకి, "రామ! నీ అస్త్రం నా కుడికంటిని తాకేలాగా చూడవయ్యా", అంది. అలాగే చేశావు. ఆ విధంగా తన కుడికంటిని వదులుకొని, ప్రాణాలను రక్షించుకుంది. నీ ఔన్నత్యం తెలుసుకొని దశరథునికి, నీకు నమస్కరించి తన ఇంటికి వెళ్ళింది.

రామ! నా కోసం ఒక కాకి పైకి బ్రహ్మాస్త్రాన్ని సంధించావే. మరి ఈ రోజు నీ నుండి నన్ను దూరం చేసినవాడిని ఎందుకు శిక్షించట్లేదయ్యా? నువ్వు కాక నన్ను ఎవరు రక్షించగలరు? నీ ముందు యుద్ధంలో దేవతలు కూడా నిలువలేరు కదా? మఱి ఎందుకు ఈ జాప్యం? త్వరగా వచ్చి నన్ను రక్షించు.

Wednesday, July 20, 2011

మహాభారతంలో యజోపయజుల కథ

(వ్యాసుడు రచించిన మహాభారతంలో ఆదిపర్వంలో, చైత్రరథపర్వంలో ఈ కథ కనబడుతుంది. దీన్ని ఆంగ్ళంలో ఇక్కడ చదువవచ్చును, సంస్కృతంలో ఇక్కడ చదువవచ్చును.)

ద్రోణుడి చేతులో పరాభవం పొందిన ద్రుపదుడు ఎలాగైనా ద్రోణుడిపైన పగ తీర్చుకోవాలనే తపనతో దానికి కావలసిన యోగబలం పొందడం కోసం యజ్ఞయాగాదులు తెలిసిన గొప్ప బ్రాహ్మణుల కోసం వెదుకసాగాడు. యమునా, గంగాతీరాలలో వెదుకుతూ ఉండగా ఒకానొక ఆశ్రమంలో కశ్యపుడి వంశంలో జన్మించిన యజుడు, ఉపయజుడు అనే ఇద్దరు బ్రాహ్మలను చూశాడు. వారు ఇద్దరూ ఎంతో గొప్ప తపోబలం కలిగినవారని తెలుసుకుని వారికి సేవలు చేయనారంభించాడు. వారిరువురిలో తమ్ముడే గొప్పవాడని నిర్ణయించుకుని ఉపయజుడితో, "ద్రోణుడు నాకు కలుగజేసిన అవమానానికి ప్రతీకారంగా అతడిని వధించగలిగే ఒక పుత్రుడు నాకు కలిగే విధంగా ఏమైనా యజ్ఞం చేస్తే మీకు 10,000 గోవులను ఇస్తాను", అన్నాడు. మహాజ్ఞాని అయిన ఉపయజుడు "ద్రుపద, ఇటువంటి చెడు ఉద్దేశాలతో నేను పవిత్రమైన యజ్ఞాలను చేయలేను", అన్నాడు.

అయినా పట్టు వదలకుండా ద్రుపదుడు ఉపయజుణ్ణి మఱొక సంవత్సరం సేవిస్తాడు. అప్పుడు ఉపయజుడు అతడితో, "ద్రుపద, ఒక రోజు అడవిలో సంచరిస్తుండగా నా అన్న యజుడు మలినమయమైన నేల పైన రాలిన ఒక పండుని తీసుకుని సేవించడం నేను చూశాను. జ్ఞానం కలిగినవాడై కూడా అందులో అతనికి ఏమీ తప్పు తోచలేదు. ఒక చోట మలినాన్ని పట్టించుకోనివాడు, మిగతా అన్ని చోట్లా పట్టించుకుంటాడు అని అనుకోలేము. ఇంతకు ముందు మా గురువు గారి వద్దనుండగా అతడు గురుకులంలోని మిగతావారు విడిచిపెట్టిన తినుబండారాలను తినడం నేను చూశాను. అతడికి నచ్చని తిండి గురించి మాట్లాడటం నేను ఎప్పుడూ వినలేదు. తిండి పట్ల ఇంత యావ ఉన్నవాడికి తప్పక ఐహికమైన వాంఛలు బలీయమైనవయి ఉంటాయి. కనుక నీకు కావలసిన యజ్ఞం అతడు చేస్తాడు అని అనిపిస్తోంది", అన్నాడు.

ఉపయజుని అంత గొప్పవాడు కాడని అనుకున్నా, ద్రుపదుడు యజుణ్ణి సమీపించి ఈ విధంగా అన్నాడు, "గురువర్యా, మీరు నా కోసం ఒక యజ్ఞం చేసినట్టైతే మీకు 80,000 గోవులని ఇస్తాను. ద్రోణుడు చేసిన అవమానం నన్ను దహించివేస్తోంది. బ్రహ్మాస్త్రం సంపాదించిన అతడు మఱో పరశురాముని వలే తన బ్రహ్మతేజంతో క్షత్రియుల నాశనాన్ని తలబెడుతున్నాడు. నా దగ్గర క్షత్రియశక్తి ఉన్నప్పటికీ, అతడిని అడ్డుకొనే బ్రహ్మతేజం లేదు. కానీ, మీరు అతని కంటే గొప్ప బ్రహ్మజ్ఞాని. మీరు తప్పక ఈ యజ్ఞాన్ని జరిపి నాకు బ్రహ్మశక్తిని కూడా జత చేయగలరు.". యజుడు యజ్ఞం చెయ్యడానికి ఒప్పుకుంటాడు.

యజుడు ఈ యజ్ఞం చాలా కష్టమైనది అని గ్రహించి, ఉపయజుడి సహాయం కూడా అడుగుతాడు. ఉపయజుడు ఏమీ ఆశించకుండానే సహాయం చేయడానికి సిద్ధపడ్డాడు. వారిద్దరూ కలిసి జరిపిన యజ్ఞంలోనే దృష్టద్యుమ్నుడు, ద్రౌపది పుట్టారు. వారికి నామకరణం కూడా యజుడే చేశాడు. (నిజానికి, ద్రౌపది నల్లగా ఉండటం చేత ఆమెకు "కృష్ణా" అనే పేరు పెట్టారు. కానీ, ద్రుపద రాజు కూతురు కావడం చేత ఆమెను ఎక్కువగా ద్రౌపది అని సంబోధించడం చూస్తున్నాము.) ద్రుపదుడు ఎంతో సంతోషించి యజుడికి తాను మాటిచ్చినట్టుగా అనేక గోవులను దానం చేసి సత్కరించాడు.

ఈ కథలో నీతి ఏమిటంటే, మనిషి వ్యక్తిత్వానికి ఆధారభూతమైన నియమాలు అతను చేసే ప్రతీ పనిలోనూ కనిపిస్తాయి. దీనినే ఆంగ్ళంలో integrity అంటాము. ఒక చోట నియమాన్ని ఉల్లంఘించినవాడు మఱొక చోట దాన్ని గౌరవించకపోయే అవకాశమే ఎక్కువ. అందుకే చిన్నపిల్లలు చెప్పే చిన్న చిన్న అబద్ధాలను, అనే చిన్న చిన్న చెడు మాటలను కూడా సున్నితంగా ఖండించి వారిని సన్మార్గంలో ఉంచాలి అని పెద్దలు చెప్తున్నది.

Monday, July 18, 2011

జంతువు - దైవం

ఇటీవల ఒక గూగుల్ సమూహంలో ఒక కథ చదివాను. ఇది R.K. Narayan రచించిన A tiger of Malgudi అనే పుస్తకం లోనిదని చెప్పారు. ఆ కథ నాలో నిద్రాణమైన ప్రశ్నలని కొన్నింటిని మేలుకొల్పింది. ఆ కథ నేను అసలు పుస్తకం నుండి చదవలేదు కనుక నా మాటల్లో, నాకు అర్థమైనట్టుగా చెప్తున్నాను. మూలకథకుని మాటల్లో వింటే ఇంకా బాగుంటుందనడంలో ఏమీ సందేహం లేదు.

ఒక పులి ఒక సాధువుని కలిసిందిట. ఆ సాధువు పులికి దేవుడి గురించి బోధ చేశాడట. "దేవుడంటే అద్వితీయమైన శక్తి కలవాడు, ఆయన కనుసన్నలలోనే మనమందరం మెలుగుతున్నాము, ఆయన అనుకున్నదల్లా జరుగుతుంది", ఇలాగ కొంచెం లోతుగా వర్ణించి చెప్పాడట. ఆ పులికి వెంట్రుకలు నిక్కబొడుచుకుని, ఆశ్చర్యం నిండిన కన్నులతో చూడసాగిందట. అలాగ కాసేపు వర్ణించిన తరువాత ఆ సాధువు, పులిని "నేను చెప్పినదాన్ని బట్టి దేవుడు ఎలాగ ఉంటాడు అనుకుంటున్నావు?", అని అడిగాడట. అప్పుడు ఆ పులి, "దేవుడు చాలా పెద్ద ఆకారం కలిగిన పులి. ఆయన తోకతో భూమిని మొత్తం చుట్టేయగలడు. ఆయన ఒక్క చూపు చూస్తే అన్ని జంతువులూ భయపడిపోతాయి.", అంటూ చెప్పుకొచ్చిందట. కథ అంతే.

కథలోని నీతి ఏమిటయ్యా అంటే, మనుషులు ఏ విధంగా దేవుడు మనిషే అయ్యి ఉంటాడు అనుకుంటున్నారో, అదే విధంగా మిగతా జీవులు కూడా దేవుడిని నమ్మితే తమ లాగే ఉంటాడు అనుకుంటాయి/అనుకోవాలి కదా? సరే, ఇప్పుడు ఇంకొక కథ విందాం. దీనికి ఆధారం నాకు తెలియదు కానీ, ఇది చైనా/భారతదేశాలలో ప్రచారంలో ఉన్న కథే.

ఒక రోజు ఒక మహర్షి సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ ఉండగా ఒక గాయపడిన ఎలుక మూలుగుతూ కనబడిందట. ఆ మహర్షి ఆ ఎలుకని చూసి జాలిపడి, తనతో తీసుకెళ్ళి పెంచుకోసాగాడట. మహర్షికి ఆ ఎలుక అంటే విపరీతమైన అభిమానం ఏర్పడి, ఆ ఎలుకను తన కూతురుగా భావించసాగాడు. ఒకానొక రోజు ఆ మహర్షికి ఎలుక పెళ్ళీడుకి వచ్చింది అనిపించింది. ఆ ఎలుకకు తగిన భర్త కోసం అన్వేషించసాగాడు.

ఒక రోజు ఉదయం స్నానం తరువాత సూర్యుడికి నమస్కరించుకుంటూండగా ఆయనకు, "సూర్యుడి కంటే అందగాడు, సులక్షణసంపన్నుడు ఎవరుంటారు? ఈతడే నాకు అల్లుడు కాదగ్గవాడు", అనుకుని వెంటనే తన తపోబలంతో సూర్యుణ్ణి ఆహ్వానిస్తాడు. సూర్యుడు కంగారుగా ప్రత్యక్షమయ్యి విషయం కనుక్కుంటాడు. కనుక్కున్నాక ఖంగు తిని, "ఇదెక్కడి చిక్కురా బాబు, మరీ సూర్యుడి భార్య ఎలుక అంటే ఎలాగ?" అనుకుంటాడు. కొంచెం ఆలోచించి, "మహర్షీ, నాకు నీ కుమార్తెను పెళ్ళి చేసుకోవడంలో ఏమీ ఇబ్బంది లేదు కానీ, ఒక్క సారి ఆలోచించు. నేను ఎంత తేజోసంపన్నుణ్ణైనా, మబ్బు వస్తే మసిబారిపోతాను. నా కంటే మబ్బులే శక్తివంతాలు. అందుచేత నువ్వు వరుణుణ్ణి సంప్రతించు", అని అంతర్ధానమవుతాడు.

మహర్షి ఆయన తపోబలాన్ని మళ్ళీ ఉపయోగించి ఈ సారి వరుణుణ్ణి రప్పిస్తాడు. ఆయన కూడా కాసేపు ఆలోచించి, "మహర్షీ, నీకు అల్లుడవ్వడం నా అదృష్టమే. కానీ, నీకు అల్లుడు కాదగిన వాడు వాయువు. ఎందుకంటే నేను ఎంత బలవంతుణ్ణైనా స్వతంత్రుణ్ణి కాను. వాయువు నన్ను ఎటు నడిపిస్తే అటు పోతాను. అందుచేత నువ్వు వాయువుని అల్లుణ్ణి చేసుకుంటే బాగుంటుంది", అంటాడు. మహర్షికి ఉన్నపాటుగా హనుమంతుడు, భీముడు మొదలైనవారి బలానికి మూలమైన వాయువు పట్ల మక్కువ పెరిగుతుంది.

ఈ సారి వాయువుని ఆహ్వానిస్తాడు. వాయువు ప్రత్యక్షమయ్యి, కాసేపు తలగోక్కుని, "మహర్షీ, నాకు నీ కూతుర్ని పెళ్ళిచేసుకోవాలనే ఉంది", అనగానే మహర్షి చిఱాకు పడుతూ, "మఱి ఇంకేమిటి?" అంటాడు. వాయువు, "నేను ఎంత బలవంతుణ్ణైనా కొండలను కదిలించగలనా? అందుకే కదా అవి అచలాలైనాయి? అందుచేత నీకు తగిన అల్లుడు హిమవంతుడని నా అభిప్రాయం.", అంటాడు. ఆలోచిస్తే మహర్షికి అదీ నిజమేననిపించి వాయువుకు సెలవు ఇస్తాడు.

సరే, ఈ సారి ఏదేమైనా సరే హిమవంతుడితో ఎలుకకు పెళ్ళి చేద్దామని నిర్ణయించుకుని హిమవంతుణ్ణి పిలుస్తాడు. ఆయన ఆలోచించి "మహర్షీ, నువ్వు చాలా గొప్పవాడివి. నీ పిలుపు విని దేవతలందరూ ప్రత్యక్షమవుతున్నారు అంటే వారందరికంటే నీవే బలవంతుడవని విదితమౌతోంది. నీ కూతుర్ని పెళ్ళి చేసుకోవడం నా భాగ్యం గా భావిస్తున్నాను. నేను చాలా బలవంతుణ్ణి అని నువ్వు అనుకోవడం నా అదృష్టం. ఐతే నీకు ఒక నిజం చెప్పాలి. నేను ఎంత బలవంతుణ్ణైనా నన్ను తొలిచేయగల సామర్థ్యం ఒక్క ఎలుకకే ఉంది. అందుచేత నీ మూషికానికి మఱొక మూషికాన్ని ఇచ్చి పెళ్ళి చేస్తే బాగుంటుంది", అని మాయమౌతాడు. ఇది విన్న మహర్షికి ఒక్క సారి వివేకం మేల్కొని, "ఏమిటి నా ఈ ప్రయాస, ప్రకృతి ధర్మాన్ని విడిచిపెట్టి నేను ఎందుకు ఇంత ప్రాకులాడాను?", అని విచారించి, ఆ ఎలుకని మఱొక ఎలుకకు ఇచ్చి వివాహం చేస్తాడు.

ఈ కథలో నీతి ఏమిటంటే మనకు ప్రేమ ఉంది కదా అని, మన దృష్టిలో శ్రేష్ఠమైనదాన్ని మనకు ప్రియమైనవారికి తగిలించాలని చూడకూడదు, వారికి ఏది సరిపోతుందో, నచ్చుతుందో అదే ఇవ్వాలి. అంతర్లీనంగా ఉన్న మఱొక నీతి ఏమిటంటే ఏ జీవి గొప్పదనం దానిది. ఏదీ మఱొక దాన్ని కంటే సంపూర్ణంగా ఉన్నతం కాదు.

మొదటి కథకి రెండొ కథకి మధ్యన పెద్ద పొంతన ఏమీ లేదు కానీ, మనిషి జంతువు దృష్ట్యా కూడా ఒక్కసారి ఆలోచిస్తే కానీ దేవుడు అర్థం కాడేమోననే నా అభిప్రాయానికి ఇవి బలాన్ని చేకూరుస్తాయి. సకలచరాచరసృష్టిలో పరమాత్ముడు లేని విషయం ఏముంది? అలాంటప్పుడు ఒక జీవి ఎక్కువ, మఱొక జీవి తక్కువ అనుకుంటే మనకు దైవం అర్థం కానట్టే కదా?