Wednesday, August 12, 2015

అన్నమయ్య: తెలుగుపదానికి జన్మదినం

1997 లో విడుదలైన అన్నమయ్య చిత్రం లోని వేటూరి రాసిన చక్కనైన పాటల సాహిత్యానికి కీరవాణి అనువైన బాణీలు సమకూర్చారు. అంతకు ముందే వచ్చిన సీతారామయ్య గారి మనవరాలు, చెంగల్వ పూదండ, మాతృదేవోభవ వంటి చిత్రాలలో వీరిద్దరి జోడీ తెలుగుదనానికి సత్కారం చేసింది. ఈ చిత్రం కూడా ఆ కోవకు చెందిందే.

పాట వ్రాసిన తరువాత బాణీ సమకూర్చితే ఆ కవి స్వేచ్ఛ పదాల ఒరవడిలో తెలుస్తుంది. అలాగే బాణీలో కూడా ఆ మార్దవం కనిపిస్తుంది. దీనికి చక్కని ఉదాహరణ "తెలుగు పదానికి జన్మదినం" అనే పాట. వేటూరి కవితాస్వేచ్ఛని తరచూ విమర్శించే నా సోదరుడు కూడా ఈ పాటను మెచ్చుకున్నాడు. అంతటి లయ ఉన్న పాట ఇది.

అన్నమయ్య నిజంగా నందకం అవతారమా, లక్కమాంబకు నిజంగా ఆలస్యంగా పిల్లలు పుట్టారా వంటి ప్రశ్నలు యోగులకు, చరిత్రకారులకు పనికొచ్చే ప్రశ్నలు. మనబోటి సామన్యప్రేక్షకులకు తగిన ప్రశ్న "ఈ సందర్భానికి, కథకు కవి న్యాయం చేశాడా?" అని. అది పరిశీలిద్దాము.

తెలుగు పదానికి జన్మదినం
ఇది జానపదానికి జ్ఞాన పథం
ఏడు స్వరాలే ఏడు కొండలై
వెలసిన కలియుగ విష్ణుపదం

అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం

పల్లవిలోనే వేటూరి అన్నమయ్యని బాగా ఉన్నయించాడు (elevate). అన్నమయ్య కాలానికి ముందే నన్నయ, తిక్కన వంటివారు తెలుగు భాషలో గొప్ప సాహిత్యాన్ని వ్రాసారు. ఐతే అవి సంస్కృతపదభూయిష్టమైన మహాకావ్యాలు - సామాన్యులకు అందుబాటులో లేనివి. అన్నమయ్య అచ్చ తెలుగుమాటలకు పెద్ద పీట వేస్తూ, ఛందస్సు కంటే లయకు ప్రాధాన్యతను ఇస్తూ సామన్యజనులకు అర్థమయ్యేటువంటి పాటలు వ్రాసారు. ఒక సారి అన్నమయ్య పాటలలో పల్లవులని చూస్తే ఈ విషయం తేటబడుతుంది: "చక్కని తల్లికి ఛాంగుభళా", "అదివో అల్లదివో", "అలరులు కురియగ", "చందమామ రావో జాబిల్లి రావో", "ఏమొకో చిగురుటధరమున ఏడనెడ కస్తూరి నిండెను", "నెయ్యములల్లో నేరేళ్ళో వొయ్యన ఊరెడి ఉవ్విళ్ళో" మొదలైన పల్లవులలో తెలుగుదనం తాండవిస్తుంది. 

అంతటి సున్నితమైన పల్లవులలోనే ఎంతో గంభీరమైన భక్తి, వైరాగ్య భావాలు దాగున్నాయి. ఉదాహరణకు ఈ చిత్రంలో వినిపించిన "అంతర్యామి అలసితి సొలసితి" అనే పాటలో "భారపు బగ్గాలు పాప పుణ్యములు", "మదిలో చింతలు మైలలు మణుగులు", "జనుల సంగముల జక్క రోగములు" వంటి పంక్తులు సాధకులు తమ మనసుల్లో పచ్చబొట్టు పొడిపించుకోవలసినటువంటివి. అలతి పదాలలో లోతైన జ్ఞానాన్ని వినిపించారు కాబట్టే ఆయన "జానపదానికి జ్ఞానపథాన్ని" చూపించారు. ఏడు కొండల పైన వేంకటేశ్వరుడిలాగ ఏడు స్వరాలను అన్నమయ్య పొదరిల్లుగా చేసుకుని మన మనసుల్లో స్థిరబడ్డారు. ఇంతటి లోతైన భావాన్ని నాలుగే నాలుగు చిన్న పంక్తులలో వేటూరి వెల్లడించారు.

అరిషడ్వర్గము తెగనరికే హరిఖడ్గమిది నందకము
బ్రహ్మలోకమున బ్రహ్మాభారతి నాదాశీశ్శులు పొందినదై
శివలోకమ్మున చిద్విలాసమున ఢమరుద్ధ్వనిలో గమకితమై
దివ్యసభలలో నవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ ఎగసి
నీరదమండల నారద తుంబుర మహతీ గానపు మహిమలు తెలిసి
శితహిమకంధర యతిరాజ్ సభలో తపఃఫలమ్ముగ తళుకుమని
తల్లిదనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాలయమ్ములో
ప్రవేశించి ఆ నందకము నందనానందకారకము

అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం

భగవద్గీత, 2వ అధ్యాయంలో కృష్ణపరమాత్ముడు అన్న ఈ మాటలు సాధకులకు మొదటి పాఠం.

విషయా వినివర్తన్తే నిరాహారస్య దేహినః |
రసవర్జం రసోऽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ||

దీనికి కొంచం వదలుగా తెనుగిస్తే "ఒక వస్తువుని విడిచిపెట్టాలని మనం దాన్ని దూరం చేస్తే, వస్తువు దూరమౌతుంది కానీ కోరిక మిగిలిపోతుంది. అదే ఆ వస్తువు కంటే ఉత్తమమైన వస్తువుని రుచి చూస్తే, అప్పుడు మునుపటి కోరిక కూడా పోతుంది" అని. అరిషడ్వర్గాలకు (కోరిక, కోపం, వలపు, కక్కూర్తి, పొగరు, ఓర్వలేనితనం) మూలం అహం (దేహాత్మబుద్ధి). ఈ చౌకబారు ఆలోచనలను దాటాలంటే ఉన్నతమైన భక్తి, వైరాగ్య భావలను రుచిచూడాలి. అన్నమయ్య పాటలు ఆ భావాలను, వాటిలో ఆనందాన్ని చెప్పేవి. అన్నమయ్యని విష్ణువు ఆయుధమైన నందకానికి అవతారంగా భావిస్తారు. అందుకని కవి అన్నమయ్యని "అరిషడ్వర్గాన్ని తెగనరికే హరి ఖడ్గమ్ము"  అన్నాడు. అరి, హరి ప్రాసతో పాటు తరువాత "షడ్", "ఖడ్" కు కూడా ప్రాస కలిపాడు. లయ చక్కగా కుదిరింది.

విష్ణులోకంలో మొదలైన నందకం తరువాత నెమ్మదిగా మిగతా లోకాలను దర్శించుకుని అక్కడ నాదాన్ని ఆకళించుకుని లక్కమాంబ గర్భంలోకి ప్రవేశించింది. బ్రహ్మలోకంలో బ్రహ్మ, సరస్వతీ దేవి వీణా నాదం; శివలోకంలో శివుడి ఢమరుక నాదం; ఇంద్రాది సభలలో అప్సరసల గాననృత్యాల లయ; మబ్బులలో విహరించే నారదుడు, ఆయన వీణైన మహతీ, తుంబురుడు - వారి భక్తినాదం అన్నీ చూసి హిమాలయాల మీదుగా వచ్చిందట. ఇక్కడ నాకు రెండు విషయాలు అనిపించాయి. నిజమో కాదో వేటూరికే ఎరుక. 1. అప్పటిదాకా నాదప్రధానమైన విషయాలు మాట్లాడుతూ "దివ్యసభలలో నవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ ఎగసి" అనడంలో "నందకం శృంగారరసాన్ని కూడా తెలుసుకుంది" అనే ధ్వని వినిపిస్తోంది. ఎంతైనా అన్నమయ్య శృంగార సంకీర్తనలకు పెట్టింది పేరు. 2. "శితహిమకంధర యతిరాజ్ సభలో తపఃఫలమ్ముగ తళుకుమని" అన్నారు. "శిత హిమ కంధర" అంటే తెల్లని హిమాలయాల దగ్గర అని; "యతిరాజ్ సభ" అంటే అక్కడ తపస్సు చేసుకుంటున్న మునుల చోటు అని నాకు అనిపించింది. వారి తపస్సుకు ఫలితంగా ఈ నందకం అవతారం ఎత్తింది అని కవి భావం అని అనిపిస్తోంది.

గర్భాశయం, గర్భాలయం - ఛందోబద్ధంగా రెండూ ఒకేలాగ ధ్వనిస్తున్నాయి (UUIU). గర్భాశయం అనేది వాడుకలో ఉన్న శబ్దం. వేటూరి గర్భాలయం అనే పదం వాడి అన్నమయ్యకీ, ఆయన తల్లికీ కూడా తగిన పదసత్కారం చేసారు అనిపించింది. చివరిగా ఈ చరణంలో చెప్పుకోవలసిన పదలయ: "ప్రవేశించెను ఆ నందకము, నందన ఆనంద కారకము". నందకము అంటే విష్ణువు ఆయుధము. నందనుడు అంటే కొడుకు. ఆనందము అంటే సంతోషం. ఆనందకము అంటే ఆనందము కలిగించేది. ఇక్కడ "నం, ద", "ఆ, నం, ద" అనే అక్షరాల వరుసలు రెండు మూడు సాల్రు వచ్చాయి. దీన్నే వృత్త్యనుప్రాసం అంటారు. ఒక అక్షరంతో వృత్త్యనుప్రాసం సామాన్యమే. రెండు మూడు అక్షరాలతో చెయ్యడం విశేషం. అలాగే, "ఆ నందకము" అంటే - "ఆ విష్ణువు ఆయుధం" అని. "ఆనందకము" అంటే ఆనందం కలిగించేది అని - ఈ రెండు అర్థాలు ఉండటం వలన శ్లేష ఐంది. ఒక చిన్న వాక్యంలో ఒక శబ్దాలంకారాన్ని, ఒక అర్థాలంకారాన్ని ఉపయోగించి వేటూరి తెలుగు వ్యాకరణం తెలిసినవారికి, తెలియని వారిని కూడా మెప్పించారు. భళా! 


పద్మావతియే పురుడు పోయగా
పద్మాసనుడే ఉసురు పోయగా
విష్ణుతేజమై నాదబీజమై 
ఆంధ్ర సాహితీ అమరకోశమై 
అవతరించెను అన్నమయ్య 
అసతో మా సద్గమయా

"ఉసురు" అంటే "ఊపిరి", "జీవము" అని అర్థం. బహుశా నందకం అచేతనమైనది కనుక అన్నమయ్యకు విష్ణువు జీవం పోసాడు అని కావి భావం అనిపిస్తోంది. "అమర కోశం" అంటే "ఎప్పటికీ నిలిచే నిధి" అని అర్థం. సంస్కృత భాషకు ఒక ప్రముఖమైన "నిఘంటువు" లేదా "థిసారస్ (thesaurus)" పేరు కూడా అమరకోశం. "ఆంధ్ర సాహితీ అమరకోశమై" అనడంలో "తెలుగు సాహిత్యంలో ఎప్పటికీ నిలిచే నిధి" అని, లేదా "తెలుగులో అమర కోశం" (తెలుగు పదాలకు ఆలవాలం/నిఘంటువు) అని రెండు ధ్వనులు వినిపిస్తున్నాయి. ఎలాగ చూసుకున్నా సబబైన మాట. 

"అవతరించెను అన్నమయ" కు యతి, అంత్యప్రాస కూడా కుదిరే విధంగా పవమాన మంత్రాలలో ఒకటైన "అసతో మా సద్గమయా" ను వాడటం ఈ పాటకు చాలా అందాన్ని తెచ్చింది. కొంచెం చాదస్తంగా చూసుకునేవారు " 'అసతో మా సద్గమయా' అంటే 'అసత్యం నుండి నన్ను సత్యం వైపు' నడిపించూ కదా. అన్నమయ్య పుట్టడానికి దానికీ సంబంధం ఏమిటి? " అని అడుగవచ్చును. దీన్ని రెండు విధాలుగా అన్వయించుకోవచ్చును అని నాకు అనిపించింది. 1. కవి అన్నమయ్యను స్వయంగా అడుగుతున్నాడు "నన్ను నీ పాటల ద్వారా అసత్యం  నుండి బ్రహ్మం (సత్) వైపు తీసుకువెళ్ళు" అని. 2. "అసతో మా సద్గమయ" అనే మంత్రానికి ప్రతిస్పందనగా విష్ణువు అన్నమయ్యను పుట్టించాడు అని కూడా అర్థం చేసుకోవచ్చును. నిజానికి కవి లయకు, లోతుకు ప్రాధాన్యతని ఇచ్చి ఇక్కడ విషయాన్ని అస్పష్టంగా విడిచాడు అనిపించింది. ఇది కొందరికి నచ్చకపోవచ్చును. కానీ నాకు నచ్చింది.

పాపడుగా నట్టింట పాకుతూ భాగవతము చేబట్టెనయా
హరినామమ్మును ఆలకించక అరముద్దలనే ముట్టడయా
తెలుగుభారతికి వెలుగు హారతై
ఎద లయలో పదకవితలు కలయ 
తాళ్ళపాకలో ఎదిగె అన్నమయ్య 
తమసో మా జ్యోతిర్గమయా

"అరముద్దలు" అనే పదం నాకు బాగా నచ్చింది. సామాన్యంగా ముద్ద కలిపి, గోటితో మధ్యలోకి త్రుంచి పిల్లలకు పెడతారు. కచ్చితంగా తెలియదు కానీ అందుకే దాన్ని గోరుముద్ద అంటారు అనుకుంటున్నాను. ఇక్కడ కవి అరముద్దలు అని కూడా అందుకే అంటున్నారు అని అర్థమైంది. సరే, "హరి" కి "అర" కి యతి యేనా, లేక ప్రాసయతి కూడా ఉందా అని చూసాను. నిఘంటువులో "అర" అంటే "అర్ధము, సగము" అని (అరగంట లో అర); "అఱ" అంటే "లోపలి" అని (అఱచేయి) ఉంది. సంస్కృతం ర కి తెలుగు ర కి ప్రాస కుదురుతుంది కానీ, సంస్కృతం ర కి తెలుగు ఱ కి కాదు. కవి ఎక్కడికక్కడ, ప్రాస, యతి, ప్రాసయతి చూసుకుంటూ వ్రాసాడనడానికి ఇది ఆధారం.

"తెలుగు భారతికి వెలుగు హారతి" చక్కనైన ప్రయోగం. భారతి అంటే "మాట, శబ్దం, సరస్వతీ" అని అర్థాలు ఉన్నాయి. తెలుగు పదాలకు హారతి పట్టినవాడు అన్నమయ్య. తెలుగు, వెలుగు; భారతి, హారతి - ఎంత చక్కగా ప్రాస కుదిరింది. తెలుగు పద కవితలను సృజింపజేస్తూ ఉంటే ఆయన ఎద లయలో అవి కలిసిపోయాయి. ఆ తరువాత తెలుగు వారి అందరి ఎద లయలో కూడా అవి కలిసిపోయాయి. అందుకే ఆయనని "ఆంధ్ర పద కవితా పితామహుడు" అన్నారు.

పాటను ముగిస్తూ వేటూరి "తాళ్ళపాకలో వెలసెనన్నమయ తమసోమా జ్యోతిర్గమయ" అంటూ మళ్ళీ ఒక పవమాన మంత్రాన్ని కలిపారు. ఈ సారి "తాళ్ళపాక" కు యతి గా "తమసో మా జ్యోతిర్గమయ" అన్నారు. మామూలు మనిషికి కూడా సాహిత్యాన్ని అందించే రసికుణ్ణి, భక్తుణ్ణి చేసిన అన్నమయ్య నిజంగా మనని అంధకారం నుండి  తేజస్సువైపుకు తీసుకెళ్ళారు.

ఈ పాటంతా ఎక్కడికక్కడ యతి, ప్రాస, ప్రాసయతులతో అందంగా వచ్చింది. దానికి కీరవాణి పూర్తిగా న్యాయం చేసాడు. తెలుగు చలన చిత్ర గీతాలలో ఇది కచ్చితంగా ఒక "classic".