Wednesday, January 29, 2014

వేటూరి పుట్టినరోజు


ఈ రోజు వేటూరి పుట్టినరోజు. దాదాపు మూడేళ్ళ క్రితం ఆయన్ని తలుచుకుంటూ ఒక పాట వ్రాసాను. అందులో నాకు సంతృప్తిని ఇచ్చిన పంక్తి ఒకటుంది: మనసుపొరల బొంత కింద నీ పాట, దాగి ఆడుతోంది దోబూచులాట. ఇది వేటూరి గురించి నా అభిప్రాయాన్ని సూక్ష్మంగా చెప్తుంది. మనసు ఒక డబ్బా కాదు: ఒక డొల్ల, లోపల సరుకు ఉండటానికి. దానికి పొరలు ఉంటాయి. సరదాలు, కోఱికలు, పద్ధతులు, ఇష్టాలు, అనుబంధాలు, ఇలా. వేటూరి పాట ఈ పొరలన్నిటినీ దాటి ఆత్మీయమైంది - అంటే నా వ్యక్తిత్వంలో ఒక భాగమైపోయింది. వేటూరి పాట ప్రతి రోజూ పనిఁగట్టుకుని వినకపోవచ్చును. కానీ, ఏదో పని చేస్తున్నప్పుడు ఒక మారు స్ఫురిస్తుంది. అది ఎప్పుడు స్ఫురిస్తుందో తెలియదు, కానీ స్ఫురించినప్పుడు పులకరం కలుగుతుంది. ఒక్కో రోజు ఒక్కో రూపంలో వస్తుంది, ఒక్కో రసం ఒలికిస్తుంది. అదొక దోబూచులాట.

జీవితంలో ఒక్క సారి కూడా కలవని మనిషి, ఎటువంటి ఋణం లేని మనిషి, అన్నో ఇన్నో లోపాలు ఉన్న మనిషి, ఒక రకంగా చెప్పాలంటే "ఎవరో". అలాంటిది తెలుగుని ప్రేమించే ప్రతివాడికీ ఆయన అంటే కొద్దో గొప్పో గౌరవం ఉంది. ఎందుకు? ఆయన పాటల్లో ఏదో ఒకటి మహబాగా నచ్చేసి "ఈ పాట ఈయన తప్పితే ఎవరూ ఇంత బాగా వ్రాసి ఉండరేమో!" అని అనిపించి ఉంటుంది. ఒక ఎనిమిదేళ్ళ అతితెలివి కుఱ్ఱాడు homework చేస్తూ లెక్కకు సమాధానం చూసి గుణించాలో, భాగించాలో అంచనా వేసి సమాధానం వ్రాస్తాడు. అలాగే ఒక్కో సారి వేటూరి భావం అనేసుకుని పదాలను ఇరికించడం, పదాలను అనేసుకుని భావాన్ని కిట్టించడం చేసారు. ఒక్కో రోజు అసలు తెలివి ఖర్చు ఎందుకు అనుకుని వేఱే section లో వాడి దగ్గర home-work copy కొట్టి వ్రాసేస్తాడు. అలాగే వేటూరి కొన్ని అన్యభాషాగీతాలను యథాతథంగా అనువ"దించారు". పన్నెండేళ్ళొచ్చాక Social Studies పరీక్ష అంటే ఏదో ఒక లాగ రెండు pages జవాబు వ్రాయాలి అని అర్థం పర్థం లేని వాక్యాలను వ్రాసేస్తూ ఉంటాడు. కొన్ని వేటూరి పాటలలో భావం కాదు అసలు అర్థమే లేదేమో అనిపిస్తుంది. పదిహేను ఏళ్ళు వచ్చినా తన కంటే ఐదేళ్ళు చిన్నవాడైన తమ్ముడూ, వాడి స్నేహితులతో cricket ఆడుతూ ఉంటాడు. వేటూరికి కవిత్వపరిపక్వత ఉన్నా చిలిపి పాటలూ, సరదా పాటలూ వ్రాసారు. ఇరవై ఏళ్ళొచ్చాక ఏవో రెండు వాక్యాల చివరన ప్రాస కలిపేసి "నేను కవిని" అంటూ ఉంటాడు. వేటూరి కేవలం ప్రాస కోసం వ్రాసిన పంక్తులు ఎన్నో ఉన్నాయి. పాతికేళ్ళకు పక్కన పెళ్ళం ఉండగా ఎదుట పడిన అమ్మాయిని చూసి ఒక్క సారైనా "అబ్బా" అనుకుంటాడు. వేటూరి భావాన్ని పక్కన పడేసి సుస్పష్టంగా వ్రాసిన బూతుపాటలూ ఉన్నాయి.

ఈ దశలన్నీ దాదాపు అందరూ తమ తమ జీవితాలలో చూసినవే. మనకు అత్యంత సన్నిహితుడు ఇవన్నీ చేసి ఉండవచ్చును. అయినా మనకు అవసరమైనప్పుడు లోతైన అనుభవంతో ఒక సలహా ఇచ్చినా, బాధలో ఉన్నప్పుడు ఓదార్చే ఒక మాట మాట్లాడినా, మన మనసులో ఉన్నప్పటికీ మాటల్లో చెప్పలేని భావాన్ని పసిగట్టి తన మాటల్లో అందంగా చెప్పినా, మనం ఆరాధించే విషయాన్ని తనూ అంతే ఇష్టంతో ఆరాధించినా, ఆ వ్యక్తి మనకు సన్నిహితుడే. అదే విధంగా వేటూరి తెలుగువారికి సన్నిహితులయ్యారు. ఆయన వ్రాసిన ప్రతి పాటా ఆణిముత్యం కాకపోవచ్చును. కానీ కొన్ని పాటలు వెల కట్టలేని అమరమైన నేస్తాలు. ఆ పాటలు తెలుగు సంస్కృతి ఉన్నంత వరకూ ప్రచారంలో ఉండాలని, ఆయన మళ్ళీ తెలుగువాడిగా పుట్టి గొప్ప సాహిత్యాన్ని అందించాలనీ కోఱుకుంటున్నాను.