Friday, January 28, 2011

వేటూరి గారి జయంతి

జనవరి వస్తోంది అనగానే మా ఇంట్లో పుట్టినరోజు పండుగల హడావుడి. ఇద్దరు వదినలు, ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య -- అందరూ ఇదే నెలలో పుట్టారు. అలాగే నేను గుర్తుంచుకున్న మఱొక పుట్టినరోజు వేటూరిది -- జనవరి 29. నా బంధువులందరూ నా కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారు. మఱి వేటూరో? లేదు. ఆయనకు ఫలానా సందీప్ అనే అభిమాని ఉన్నాడనే తెలియదు. మఱి వేటూరి పుట్టినరోజుతో నాకేమిటి సంబంధం? ఇది పరోక్షమైనది. ఆయన నన్ను పట్టించుకోకపోయినా, ఆయన పాట నన్ను పట్టుకుంది. బహుశః దీన్ని పాటిచ్చుకోవడం అనాలేమో. నా కష్టసుఖాల్లో నా ఆత్మీయులందరితో పాటు ఆయన పాటలు కూడా తోడున్నాయి. అందుకే ఆయన పాటంటే నాకు ప్రాణం. ఆ పాట ఇచ్చిన మనసు అంటే నాకు అభిమానం.

మొన్న ఒక నాలుగు రోజులు అనారోగ్యం చేసి పక్క దిగలేదు. తత్ఫలితంగా నా mp3 player లో పాటల్ని కూడా వినలేదు. నయమయ్యాక ఒక్క రోజు నాలోనే నాకు తెలియని గొంతు ఒకటి మేలుకొని,  "వేటూరిని మరిచిపోతున్నావా సందీప్?" అని అడిగింది. ఒక్క నిముషం నివ్వెరపోయి చూశాను - "ఎన్నాళ్ళైంది వేటూరి పాట విని - వారం దాట వస్తోందా?", అనిపించింది. సరిగ్గా ఆలోచిస్తే - "లేదే - మొన్ననే వేటూరిని తలుచుకున్నాముగా", అని గుర్తొచ్చింది. ఏదో రెహ్మాన్ సంగీతం గురించి చర్చిస్తూ, "మెరుపు కలలు చిత్రంలోని గీతాలు బాగుంటాయి కదా?", అంటే నా స్నేహితురాలు - "అమ్మో, అందులో నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు", అంది. నిజమే! నేను కూడా రెండుమూడు పదాలకు అర్థాలు నిఘంటువులో చూసుకోవలసివచ్చింది. మఱి భాష మీద ఆయన పట్టు అది. "తల్లో తామర మడిచే ఓ చిలకా...అట్టిట్టాయెను మనమే ఓ థళుకా! చెలి ఒడిలో కాగెను హృదయం, నా కంఠం వరకూ ఆశలు వచ్చే వేళాయె, నీ నల్లని కురుల నట్టడవుల్లో మాయం నేనైపోయానే, ఉదయంలో ఊహ ఉడుకుపెట్టే కొత్తగా, పరువం వచ్చిన పోటు తుమ్మెదల వైశాఖం, గలబా కప్పలు జతకై చేరే ఆషాఢం, ఎడారి కోకిల పెంటిని వెతికే గాంధారం, విరాళిగీతం పలికే కాలం ప్రియానుబంధం ఈ కలం, నఖం కొరికిన పిల్ల అదెంతదో నీ ఆశ, నాగరికం పాటిస్తే ఎలా సాగు పూజ? ఇదే సుమా కౌగిలి భాష" -- ఇలాంటి పదాలను వాడితే సగటు తెలుగు చిత్రవీక్షకుడికి ఏమర్థమవుతుంది. "నువ్వసలు నచ్చలే అనో నీ బలుపు ఇష్టం అనో అంత లేదె అంత లేదె అనో if you gonna love me, i gonna love you" అనో అంటే సులభంగా అర్థమవుతుంది. మళ్ళీ ఒక సారి గుర్తొచ్చింది, "అయ్యో...మళ్ళీ ఇలాంటి కొత్తపాట వినలేమా?" అనిపించి నా మీద నాకే జాలేసింది. "ఏరెల్లి పోతున్నా నీరుండిపోయింది నీటిమీద రాత రాసి నావెల్లిపోయింది" అని ఆయన చెప్పిన మాటలే మళ్ళీ తలుచుకోనా?

అదే రోజు రాత్రి ముగ్గురం స్నేహితులం కూర్చుని కర్నాటిక సంగీతం గురించి చర్చించుకుంటున్నాము. ఇంతలో రాగాల పేర్ల గురించి వస్తే, వేటూరి రాగాల పేర్లను ఎలాగ పాటల్లో వాడేవారో చెప్తూ అన్నాను - "వేటూరి రాగాల పేర్లని ఊరికెనే వాడరండీ... అక్కడ ఆ రాగం బాణీలో కూడా ఉండాలి" అని. డబ్బు మీద ఆశ వదులుకొమ్మని చెప్పేటప్పుడు, "శ్రీరాగమందు కీర్తనలు మానర" అనడం గొప్ప ప్రయోగమే. కానీ, అప్పుడు బాణీలో కూడా అదే ఉంటే అప్పుడు అది మహాద్భుతం. అలాగే, "నాలో రేగే హంసానందీరాగాలై", "అరవిచ్చేటి ఆభేరిరాగాలు" అన్నీను.

ఇంతలో వాళ్ళు "మధురాష్టకం" పెట్టారు. అందులో "అధరం మధురం, వదనం మధురం" అని పల్లవి. వెంటనే నాకు వేటూరివి రెండు పాటలు గుర్తొచ్చాయి -- shock చిత్రంలో "మధురం మధురం" అనే పాట దాదాపు ఇలాంటి ప్రయోగాలతోనే సాగుతుంది,  "యువరాజు" చిత్రంలో "మనసేమో చెప్పిన మాటే వినదు" పాటలో పల్లవికి, మొదటి చరణానికి మధ్యలో కూడా ఈ పాట ఉంటుంది. ఈ రెండూ వేటూరికి మధురాష్టకం పైన ఉన్న అభిమానానికి ఋజువులేమో. ఒక సామాన్యమైన యుగళగీతం వ్రాయమంటే కృష్ణభక్తిభరితమైన వల్లభాచార్యుని పాటను తీసుకురావడాన్ని మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలి?

ఉఫ్...లేదు ఇంకా నేను వేటూరిని మరిచిపోలేదు. అది సంభవం కూడా కాదు. తొలిప్రేమను ఎవరూ మరిచిపోరంటారు. మరి వేటూరి పాట మీద నాకున్న ఈ ప్రేమ తొలిప్రేమే కాదు, మలిప్రేమ కూడానేమో. మళ్ళీ ఇంకొకరి పాటలు వేటూరి పాటలలాగ నన్ను ఆకర్షించవేమో...

వేటూరి వాక్కులనే నేను సామెతలుగా వాడుకుంటూ ఉన్నాను. పిల్లకాయలు ప్రేమ ప్రేమ అని తెగ ఉత్సాహపడిపోతుంటే వారిని చూసిన విరక్తిలో, "పిపీలికాది బ్రహ్మలో పిపాస రేపు ప్రేమలు" అని, ఏళ్ళ తరబడి పెళ్ళి చేసుకోకపోతే, "ఉలకడూ పలకడూ ముదురుబెండడు" అని, పని చెయ్యాలని నన్ను నేనే ఉత్తేజపరుచుకోవడానికి, "మనసు ఉంటే మార్సు దాక మార్గముంది ఛలో" అని, జీవితం మీద విరక్తి వచ్చినప్పుడు "అనుబంధమంటేనే అప్పులే, కరిగే బంధాలన్నీ మబ్బులే" అని, అందమైన అమ్మాయిని చూస్తే "కిన్నెరసాని వచ్చిందమ్మ, వెన్నెల పైటేసి" అని...ఇంక ఇలాగ చెప్పుకుంటూపోతే చాలా ఉన్నాయి. ఆఖరికి నా పెళ్ళి గురించి నేను ఇప్పటి దాకా ఆలోచించిన ఏకైక విషయం ఏమిటి అంటే, "పెళ్ళి cassette లో ఏమేం వేటూరి పాటలు పెట్టించవచ్చును?", అని. బహుశః నాది పిచ్చేమో. కానీ, నాకు అందులో తృప్తి ఉంది.

వేటూరి పుట్టినరోజును ఆయన అభిమానులు చాలామందే గుర్తుంచుకోకపోవచ్చును. కానీ, ఆయన పాటలను ఇంకా తమ సొంతవాటిలాగే అభిమానిస్తున్నారు. ఇంతకంటే ఏ కవి మాత్రం కోరుకునేది ఏముంది?..."ఎగిరి ఎగిరిపోయింది సీతాకోకచిలుక. మిగిలింది వేలిపై అది వాలిన మరక..."

Thursday, January 20, 2011

కిట్టు కథలు - పెళ్ళికానుకలు


అసలు పెళ్ళి అనగానే అందరికీ గుర్తొచ్చేవి షరామామూలే. కిట్టుకు మటుక్కు, పెళ్ళి హడావుడి కంటే పెళ్ళయ్యాక జరిగే ఒక తంతు మాత్రం మహాముచ్చటగా అనిపిస్తుంది. హన్నన్నా - తప్పుగా అనుకోకండి! నేనంటున్నది పెళ్ళికొడుక్కీ, పెళ్ళికూతురికీ వచ్చే బహుమతులను తెరిచి చూస్తూ ఉండటం గురించి. ఇది అంటే కిట్టుకు ఒక అది కలగడానికి కారణం తన మేనమామ కొడుకు పెళ్ళి లో ఎదురైన ఒక అనుభవం. ఆ పెళ్ళి జరుగుతున్నంత సేపూ కిట్టు వాళ్ళ తాతయ్యగారి (మాతామహుడు) పక్కనే ఉన్నాడు. పెళ్ళయ్యాక ఎవరి గొడవలో వాళ్ళుండగా తాతయ్య కిట్టును పిలిచి, "ఒరేయ్, వెళ్ళి ఆ బహుమతులబుట్ట పట్టుకురా అన్నారు" (పెళ్ళికూతురిని తీసుకురావడానికి వాడే బుట్ట తరువాత బహుమతులబుట్ట అవుతుందిలెండి). సరే అని కిట్టు నెమ్మదిగా కొన్ని కొన్ని చప్పున అన్నీ తీసుకుని వచ్చాడు. తాతయ్య ఆయన పడకగదిలో పడకకుర్చీలో వెనక్కి ఆనుకొని ఆ కుర్చీ చేతుల మీద ఒక కాగితం పెట్టి, కలంతో "శ్రీరామ" వ్రాశారు. "ఈ సారి ఒక్కోటీ తీసి ఏముందో చూసి నాకు లెక్క చెప్పు", అన్నారు. కిట్టు మొదలెట్టబోతుంటే, "ఆగు, చిన్న చిన్న coverలన్నీ మొదట తెరిచి చూడు", అన్నారు. సరేనని కిట్టు ఒకటి తెరిచాడు - అందులో నూటపదహార్లున్నాయి. ఆ cover పైన ఉన్న పేరు, సంఖ్య చెప్తే తాతయ్య నెమ్మదిగా ఎక్కించుకుంటున్నారు. ఇలాగ కొంతసేపు సాగింది.

అప్పటికీ cover పట్టుకోగానే అందులో ఎంత ఉందో తెలిసిపోతోంది కిట్టుకు. cover లు చింపడం మీద మిగులు ఆత్మవిశ్వాసం కలిగి పరపరా చింపేస్తున్నాడు. ఒక్క నిముషం తాతయ్య కాగితం మీద దృష్టి కిట్టు చేతుల మీదకు మరల్చారు. వెంటనే కిట్టుకు అర్థమైంది ఏదో తప్పు జరుగుతోంది అని. తాతయ్య కిట్టుకేసి చూసి - "నువ్వు ఒక పది నోటైనా చింపకుండా ఈ రోజు మన లెక్క తేలదుర", అన్నారు. "ఛఛ! తాతయ్యది చాదస్తం. ఇంకా నేను పదో తఱగతి అనుకుంటున్నారు. ఇప్పుడు నేను software-engineerని", అనుకుని - "అబ్బే లేదు తాతయ్య", అని ఒక వెకిలి నవ్వు నవ్వి తప్పించుకున్నాడో లేదో అదే జరిగిపోయింది. తిడతారు ఏమో అనుకుని బేల మొహం వేసుకుని, నాలుక కరుచుకుంటూ - "తాతయ్యా...", అన్నాడు. ఆయన తల తిప్పకుండా, "చెప్పానా - సరే అది మీ పెద్దన్నయ్యకి ఇవ్వు - వాడి bank లో మార్చుకుని తీసుకొస్తాడు", అన్నారు. "ఓహో, ఇంకా నోటు చిరక్కుండానే నోటు చిరిగితే ఏం చెయ్యాలో ఆలోచించారు అన్నమాట", అనుకుని ముక్కున వేలేసుకున్నాడు కిట్టు. మఱి ముప్పై పెళ్ళిళ్ళు చేయించిన అనుభవం తాతయ్యది, మొదటిసారి పెళ్ళిని విహంగవీక్షణంగా కాకుండా వియ్యాలవారి పక్షంగా చూస్తున్న శైశవం కిట్టుది.

ఇంతలో ఒక cover చాలా బరువుగా ఉంది - తెరిచి చూశాడు. అందులో పదివేలు ఱొక్కం ఉంది. కిట్టు నివ్వెరపోయాడు. దాన్ని తాతయ్యగారికి చూపించాడు. తాతయ్య కుర్చీలోంచి ముందుకు వంగి  "అబ్బో, ఎవర్రోయ్" అన్నారు. కిట్టు పేరు చదవగానే, "ఓహో, వాడా!", అన్నారు. ఇంతలో coffee ఇవ్వడానికి గదిలోకి కిట్టు మేనత్త భార్యకు (పెళ్ళికొడుకు తల్లి) అది చూస్తూనే ముఖం వెలిగిపోయింది. కిట్టు తాతయ్య ఒక చిరునవ్వు నవ్వి, "వీడు 1990లో దివాళా తీశాడురా. అప్పుడు నా దగ్గరకు వచ్చాడు - నాకు వాడి నిజాయతీ,వ్యాపరమెలకువల మీద నమ్మకం ఉంది. blank-cheque వ్రాశిచ్చి 'నువ్వెప్పడికైనా గొప్పవ్యాపారస్థుడవౌతావురా' అని చెప్పి ఇచ్చాను. వాడు కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుని వెళ్ళాడు. నా నమ్మకం ఋజువైంది - వాడు మళ్ళీ పోయిందంతా సంపాదించుకున్నాడు. అందుకే ఇలాగ వాడి కృతజ్ఞతను చెప్పుకుంటున్నాడు", అన్నారు. ఆ రోజుకు కిట్టు తాతయ్య దగ్గరనుండి నేర్చుకోవలసిన పాఠం నేర్చుకున్నాను. ఇంకేదొచ్చినా అదనమే. ఒక్కసారి ఆయన కోడలి వైపు చూసి "వాడికి ఆ cheque ఇచ్చిన రోజు నువ్వేమన్నావే అమ్మాయి?", అన్నారు. ఆవిడ ముఖం ఇంకా సంతోషం నుండి తేరుకోలేదు. "ఊ", అని ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయింది. "ఈ సారి వాళ్ళు ఇంటికి వస్తే పింగాణీ glassలో పరమాన్నం పెడుతుంది మీ అత్తయ్య", తాతయ్య అన్నారు నవ్వుతూ.

"coverలన్నీ అయిపోయాయి తాతయ్య", అన్నాడు కిట్టు. "ఈ సారేం...చిన్నచిన్న డబ్బలతో ఉన్న gift-packలు తెరువు. అరచేతిలో పట్టాలి", అన్నారు. ఆయన కాగితంలోకి తొంగి చూశాడు కిట్టు - ఆయన రెండు అడ్డగీతలు గీసి ఇదివరకు చెప్పిన సంఖ్యల మొత్తాన్ని అక్కడ వ్రాశారు. కిట్టు జాగ్రత్తగా gift-packలు తెరుస్తూ ఉన్నాడు. మొదటిదాంట్లో ఒక వెండి కుంకంభరిణ ఉంది. అది చూస్తూనే తాతయ్య "right, ఊహించాను", అన్నారు. నెమ్మదిగా, అలాంటివాటిల్లో కిట్టు నాలుగు భరిణలు ఉండే పసుపుకుంకుమల stand, చిన్న చిన్న దేవతావిగ్రహాలు మొదలైనవి చూశాడు. ఇక అలాంటివి లేవు. మఱికొంచెం పెద్దవి వచ్చాయి. తాతయ్య ఈ విషయం గమనించి ఒక దాన్ని చూసి, "ఏమిటి బాబూ, వినాయకుడి ప్రతిమా?" అని అడిగారు. తెరిచి చూస్తే అదే. "సరే, అది జాగ్రత్తగా ఆ packలోనే ఉంచేయ్. ఇప్పటికే ఇంటినిండా అవే ఉన్నాయి.", అన్నారు. ఈ సారి ఒక పుస్తకం పరిమాణంలో ఒక pack ఉంది. అది కూడా చూస్తూ, "శాయీ బాబా పటమో, photo-frame ఓ అయ్యి ఉంటుంది", అన్నారు. అది దేవత చిత్రం కలిగిన ఒక photo-frame. ఇంక మరికొద్ది పెద్దవి వచ్చేసరికి, "ఇది hot-pack అయ్యుంటుంది, ఇది cup-saucer pack అయ్యుంటుంది", అని అన్నీ చెప్పేస్తూనే ఉన్నారు. కిట్టు ఇంక packetలు తెరవడం కంటే తాతయ్య చెప్పినదాన్ని బట్టి, అది తెరవకుండా వేరే పెళ్ళిళ్ళకు పేరు మార్చి ఇచ్చెయ్యవచ్చు అని నిర్ణయించుకున్నాడు. మొత్తానికి అన్నీ పూర్తయ్యాక, పెద్దపెద్ద వస్తువులని అటక మీదకు చేర్చేదాక తాతయ్య పని చెప్పారు. మధ్యలో మళ్ళీ కిట్టువాళ్ళ అత్త వచ్చింది. "అమ్మాయి, నీ మేనల్లుడు చాలా కష్టపడ్డాడు, ఒక coffee పట్టుకురా", అన్నారు.

అంతా బానే ఉంది కానీ, కిట్టుకు ఒక సందేహం కలిగింది. తాతయ్య ఇంత ధనవంతులు కదా, స్వశక్తి మీద నమ్మకం కలిగిన వ్యక్తి కదా - మఱి కట్నం ఎందుకు తీసుకున్నారు? అని ఆ అనుమానం. "ఇంకేమిటి నాన్న, సంగతులు?", అన్నారు తాతయ్య. "తాతయ్యా, మీరు కట్నం తీసుకున్నారా?", అని అడిగాడు కిట్టు. "నా పెళ్ళి సమయానికి మేము చాలా బీదవాళ్ళం. కట్నం అడిగితే మీ అమ్మమ్మే - 'నీ మొహానికి నేనే ఎక్కువ!' అనేసేదిరా. ఐనా మా మాఁవగారి దగ్గరా డబ్బులేదురా. జోగీ జోగీ పూసుకుంటే బూడిద రాలింది అన్నట్టు", అని నవ్వారు. కిట్టు కూడా నవ్వి, "మఱి మావయ్య పెళ్ళికి?", అని ప్రశ్నను కొనసాగించాడు. "లేదు నాన్న. నాకు ఎవరి సొమ్మూ వద్దు. నేను కట్నం కావలన్నాను అనుకో, వాడెవడో కూతురు పెళ్ళికోసం బల్లలకింద చేతులు పెట్టో, వ్యాపారంలో మోసం చేసో, అప్పు చేసిన దుఃఖంతోనో ఆ డబ్బు తీసుకొచ్చి నా బిడ్డకు ఇస్తాడు. అది వాడికి క్షేమం కాదు. అయినా సమర్థత ఉన్నవాడికి పరాయివాడి సొమ్మెందుకురా", అన్నారు. కిట్టుకు సంతోషం కలిగింది. "మఱి ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు?", అన్నాడు కిట్టు. గట్టిగా నవ్వారు తాతయ్య. "నాన్న, నీకు ఇక్కడ ఒక సూక్ష్మం తెలియదురా", అన్నారు. ఆగి, లేచి నిలుచుండి డబ్బాలోంచి చుట్ట తీసి గోడకేసి చూస్తూ fan ఆపమని సైగ చేశారు. కిట్టు ఆ పని చేస్తూ, తాతయ్యకేసి చూశాడు. ఒక్కసారి బలంగా పొగ పీల్చి, నెమ్మదిగా అది బయటకు వదులుతూ, తాతయ్య అన్నారు, "నాకు కట్నం తీసుకోవాలని ఎప్పుడూ లేదు. మీ మావయ్య పెళ్ళప్పుడు మీ అమ్మమ్మ ఎప్పుడూ నా విషయాలలో కలగజేసుకోలేదు. అది ఒకవేళ అడిగినా, 'నువ్వేం తెచ్చావే నీతో' అని నోరు మూయించేసేవాడిని. మరి ఇప్పుడు జరిగేది నా కొడుకు పెళ్ళి కాదు - వాడి కొడుకు పెళ్ళి. మరి పెళ్ళికొడుకు తల్లిదండ్రులేమంటున్నారో చూసుకోవద్దు?", అన్నారు. కిట్టుకు విషయం అర్థమైంది. "అందరూ వాళ్ళ గతాన్ని గుర్తు పెట్టుకుంటారా? ఐనా అందులోనూ మనం కొంత సామం ఉపయోగించాము.", అని ఒక చిరునవ్వుతో అన్నారు.

"అదొక్కటే కాదు - ఇక్కడ ఇంకో విషయం ఉంది. నాకు ఒక్కడే కొడుకు. ఆడబిడ్డలందరికీ పెళ్ళిళ్ళు చేసేశాను. మరి వాడికి ఇద్దరు కొడుకులు. ఇద్దరికీ ఒకే స్థోమత ఉన్న కుటుంబం నుండి పిల్లలు రావాలని లేదు కదా? కట్నం తీసుకున్నాం అనుకో కలిగిన ఇంటి పిల్ల దగ్గరనుండి ఒకింత తక్కువ తీసుకుంటే రేపు 'నేను ఉన్న ఇంట్లోంచి వచ్చానూ, అని అదంటే మఱొకత్తి, 'నేను ఎక్కువ తీసుకొచ్చానూ అంటుంది. సరిపోదూ?", కిట్టుకు పూర్తిగా అర్థం కాలేదు. కానీ, ఇది పూర్తిగా తాతయ్య అంగీకారంతో జరుగుతున్నది కాదు అని అర్థమయ్యి తల ఊపాడు. "ఐనా - నాకూ ఆడపిల్లలున్నారురోయ్! అందుకే నేను ఇంకో తండ్రిని ఇబ్బందిపెట్టను. మీ పెద్దమ్మ పెళ్ళినాటికి నా దగ్గర ఆస్తి లేదు. మఱి నాకు తెలియదా ఆ బాధ?", అని కిట్టు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, తూకం నెత్తిన ఉండే సూది లాగా తలను అటూ ఇటూ ఊపారు. కిట్టు అవునన్నట్టు తల ఊపాడు. "కట్నం పది దగ్గర మొదలైందిరా", అని ఆయన అంటుంటే కిట్టు నమ్మలేనన్నట్టుగా చూశాడు. "మఱి నేను సామం వాడి ఒకటిన్నరకు దించాను", అనగానే కిట్టు అదెలాగ అన్నట్టు చూశాడు.

"పెళ్ళి వాళ్ళ ఊళ్ళో జరగడం రివాజు. అలాగ జరిగితే మన వ్యాపరంలో భాగస్వాములు, మన దగ్గరకు వచ్చే customerలు, మనకు సరుకులు ఇచ్చే supplierలు వీళ్ళెవరూ రావడం వీలు కాదు. మఱి వీళ్ళందరూ వస్తేనే వాళ్ళకు మనం గుర్తుంటాము కదరా. అది వ్యాపారసూక్ష్మం. అందుకని పెళ్ళి మా ఊళ్ళో చెయ్యమని చెప్పి మూడు కట్నం కోసేశాను. మన బంధువులందరూ ఈ ఊళ్ళోనే ఉన్నారు. మనవాళ్ళందరికీ ticketల ఖర్చు మిగులు. మఱి వాళ్ళందరూ లేకుండా పెళ్ళెలాగరా?", అన్నారు. ఇంతలో కిట్టు, "తలకో వెయ్యినూటపదహార్లు ఇస్తారు అని వేసుకున్నా వాళ్ళకి రాను పోనూ ticketలే ఖర్చవుతాయి", అన్నాడు. తాతయ్య గట్టిగా నవ్వుతూ, "అదీ నిజమే. ఆ డబ్బు వాళ్ళు మనఃపూర్వకంగా పెళ్ళికొడుక్కి ఇవ్వాలి గానీ, ప్రయాణం చేస్తే ఎవరికిచ్చిన సొమ్ము? ఈ ఊళ్ళో మనం ఎన్ని పెళ్ళిళ్ళు చేశామురా? మనకు షామియానాల నుండి బ్రహ్మగారి వరకు అన్నిటిలోనూ discount ఉంది. వియ్యంకుణ్ణి వాళ్ళకు పరిచయం చేశాను. ఆయనకు ఈ ఊళ్ళో కూడా బోలెడు బంధువులున్నారు. సులువైపోలేదు. ", అన్నారు.

కిట్టు "ఇంకా?" అన్నట్టు చూశాడు. తాతయ్య మంచినీళ్ళకోసం సైగ చేస్తే కిట్టు అక్కడ ఉన్న మఱచెంబులోంచి నీళ్ళను గ్లాసులోకి ఒంపి అది అందించాడు. అది త్రాగాక తాతయ్య, "మనకు cash ఐతే ఆదాయపన్ను శాఖ సమస్య అవుతుంది అని చెప్పి, మూడు పెట్టి మీ అమ్మాయికి నగలు చేయించి ఇచ్చెయ్యండి అన్నాను", అన్నారు. మఱి ఇందులో తగ్గించిందేముంది అన్నట్టు చూశాడు కిట్టు. "మనం మూడంటే వాళ్ళు మూడు పెట్టి చేయిస్తారా? అందులో ఎంతో కొంత తగ్గుతుందిలే - అయినా వాళ్ళు చిన్నప్పటినుండి అమ్మాయికి చేయించినవే పంపిస్తారు.", అన్నారు. కిట్టు నవ్వుకుని, "ఎన్ని పెళ్ళిళ్ళు చేసిన/చూసిన అనుభవమో!", అనుకున్నాడు. "మరి మిగతాది", అన్నాడు కిట్టు. "వాళ్ళ బంధువులు ఎంతమంది ఉంటారో లెక్కేశాను. ఒక ఐదువందలమందిదాక వస్తారు అని చెప్పారు. కుటుంబానికి వెయ్య వేసుకున్నా రెండు లెక్క తేలింది. వియ్యంకుణ్ణి పిలిచి అమ్మాయి పేరున వచ్చిన వస్తువులు అమ్మాయితో పాటు వస్తాయి - డబ్బులే ఆయనకు వస్తాయి అని చెప్పాను. వాళ్ళవాళ్ళందరికీ ఆ విషయం తెలిసి డబ్బులే ఇచ్చారు. మఱి అది ఆయనకు కలిసి వచ్చినట్టేనా?", అన్నారు. కిట్టుకు చుక్కలు కనబడటం మొదలైంది. శ్రీకృష్ణరాయబారంలాగా, "అసలు ఈయన ఎవరి పక్షం మహప్రభో?" అని నివ్వెరపోతూ చూశాడు. "ఇంకెంత మిగిలిందిరా?", అన్నారు తాతయ్య. కిట్టు, "రెండు తాతయ్య. సరిపోయింది.", అన్నాడు కిట్టు. లెక్క తెగింది కదా అనుకుని గుక్క తిప్పుకోబోతుంటే, "ఇంకా లేదు, చెప్తాను విను", అని నెమ్మదిగా నడుం వాల్చారు తాతయ్య.

"మిగిలిన రెండు ఆమె పేరునే fixed వెయ్యమన్నాను. ఆ విషయం కూడా పెళ్ళి తఱువాత చూసుకుందాం అన్నాను. దానితో ఆయన మన చేతికి ఇవ్వాల్సిందీ లేదు, మనం ఆయన చేతికి ఇవ్వాల్సిందీ లేదు. లెక్క సరిపోయింది ఇప్పుడు", అన్నారు. కిట్టు మనసులో ఏదో తెలియని ఉత్సాహం కలిగింది, ఏదో వెల్తి పూరింపబడింది, సుమారు రెండుతులాల బరువు గుండెలోంచి తీసేసినట్టు అనిపించింది. తాతయ్య కనబడటానికి ఆరడుగుల ఆజానబాహువు. ఈ చర్చతో ఆయన ఎత్తు ఇంకా ఎక్కువగా అనిపించడం మొదలైంది. "సరే, నేను కాసేపు పడుకుంటాను. నాలుగవుతూనే లేపెయ్. భక్తి TVలో మంచి ప్రసంగం వస్తుంది. నువ్వు వెళ్ళేటప్పుడు light కట్టేయ్", అని జోడించిన అరచేతుల్లోకి చూస్తూ నమస్కరించుకుని ఆవలించారు. కిట్టు light కట్టి తలుపు వైపుగా వెళ్తుంటే, "నేను చెప్పిన లెక్కలు వంటింటి దాక చేరితే మీ అత్తయ్య నీకు sweetలు, నాకు చీవాట్లూ పెడుతుంది", అన్నారు. ఒక చిరునవ్వు నవ్వి, "అబ్బే...లేదు తాతయ్యా", అని కిట్టు తలుపు దగ్గరకేస్తుండగా ఆ తలుపు పక్కగా ఉన్న తాతయ్య తాతయ్య చుట్టలడబ్బా, మఱచెంబూ చూశాడు. తనకు ఊహ తెలిసినప్పటినుండీ తాతయ్య అవే వాడుతున్నారు అన్న విషయం మఱొక్కసారి గుర్తొచ్చింది.

Sunday, January 2, 2011

దీపకాలంకారం

వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> దీపకాలంకారము

లక్షణం: వదంతి వర్ణ్యా౭వర్ణ్యానాం ధర్మైక్యం దీపకం బుధాః
వివరణ: ప్రకృతాప్రకృతములకు ధర్మాలను వర్ణించడం దీపకాలంకారం అవుతుంది. దాదాపు ఇలాగే ఉన్న అలంకారాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు ఉపమాలంకారంలో కూడా రెండు వస్తువులు, వాటి ధర్మాలను గురించి చెప్పుకుంటాము. కాకపోతే, ఇక్కడ ఒక వస్తువు ప్రకృతము (సహజమైనది) రెండవది అప్రకృతము అయి ఉండాలి.


ఉదా:- (చంద్రాలోకం, రచన: ఆడిదము సూరకవి)
మదేన భాతి కలభః ప్రతాపేన మహీపతిః
వి: మదం చేత ఏనుగు, ప్రతాపం చేత మహారాజు ప్రకాశించును అని భావం. ఏనుగు మదించడం ప్రకృతిసిద్ధం. రాజునకు ప్రతాపం ఉండటం ప్రకృతితో వచ్చేది కాదు -- ఈ విషయం గమనించాలి.


దీపకాలంకారంలో ప్రత్యేకమైనది ఆవృత్తి దీపకాలంకారం. ఇది మూడు రకాలు - పదావృత్తి దీపకం, అర్థావృత్తి దీపకం, ఉభయావృత్తి దీపకం. ఆవృత్తి అనగ "మళ్ళీ మళ్ళీ" అని అర్థం. వీటికి ఉదాహరణలు చూద్దాం.

ఈ క్రింది ఉదాహరణలన్నీ చంద్రాలోకం నుండి సంగ్రహించినవే.

ఉదా:-
వర్షతి అంబుదమాల ఇయం, వర్షతి ఏషా చ శర్వరీ
వి:- నాయకునితో సమాగమం కాక ఒక నాయిక ఈ మాటలనంటోంది. "ఈ మేఘమాల వర్షం (వాన) అవుతున్నది, (నా ప్రియుడు రాక) ఈ రాత్రి కూడా వర్షం (ఒక సంవత్సరం) అవుతున్నది." అని భావం. ఇక్కడ. ఇక్కడ "వర్షం అవ్వడం" అనేది సమానధర్మం. ఐతే వర్షం అనే పదం ఆవృత్తి అయినా, అర్థం మాత్రం అవ్వలేదు కనుక ఇది పదావృత్తిదీపకం.

ఉదా:-
ఉన్మీలంతి కదంబాని, స్ఫుటంతి కుటజోద్గమాః
వి:- "కదంబాలు తెరుచుకుంటున్నాయి, కొండమల్లెపూలు విచ్చుకుంటున్నాయి" అని వర్ణిస్తున్నాడు కవి. ఇక్కడ విచ్చుకోవడం అన్నా, తెరుచుకోవడం అన్నా ఒకటే అర్థం - పుష్పించడం. సమానధర్మాలకు పదాలు వేరై, అర్థాలు ఒకటవడం చేత ఇది అర్థావృత్తి దీపకాలంకారం.

ఉదా:-
మాద్యంతి చాతకాః తృప్తాః, మాద్యంతి చ శిఖావళాః
వి:- "తృప్తి చెందిన చాతకపఖులు మదిస్తున్నాయి, అలాగే నెమళ్ళు కూడా మదిస్తున్నాయి" అని అర్థం. ఇక్కడ సమానధర్మం మదించడం - రెండు చోట్లా అర్థం, పదం అదే కనుక ఇది ఉభయావృత్తి దీపకాలంకారం.


ఉదా:- (భగవద్గిత, శ్రీ భగవానువాచ)
ధూమేనావ్రియతే వహ్నిః యథా దర్శో మలేన చ
యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదం ఆవృతం
వి:- "పొగ చేత నిప్పు, దుమ్ము చేత అద్దము, గర్భసంచి చేత గర్భస్థశిశువు ఏ విధంగా ఐతే కప్పబడుచున్నారో ఆత్మ కూడా వాంఛ చేత కప్పబడుతున్నది". ఇక్కడ మొదటి మూడు ఉపమానాలు ప్రకృతాలు. కానీ, అన్ని ఆత్మాలనూ వాంఛ కప్పట్లేదు -- ఇది అప్రకృతం. వీటి మధ్యన సమానధర్మాన్ని చెప్పడంతో ఇది ఉభయావృత దీపకం (అని నా నమ్మకం).


చలనచిత్రగీతాల్లో ఈ అలంకారాన్ని గమనించిన చదువర్లు వాటిని చెప్పవలసినదిగా నా మనవి.

అతిశయోక్త్యలంకారం (hyperbole)

వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> అతిశయోక్త్యలంకారం

వివరణ: ఒక విషయాన్ని ఉన్నదాని కంటె ఎక్కువ చేసి చెప్పడాన్ని అతిశయోక్త్యలంకారం అంటారు.

ఇది మనందరికీ తెలిసినదే. నిత్యజీవితంలో మనం మాట్లాడే చాలా జాతీయాలు, ఛలోక్తులు, సామెతలు ఈ అలంకారాన్ని ధరించినవే.

ఉదా:- అక్కడ ఉన్న జనసందోహానికి ఇసుకేస్తే కిందకు రాలదనుకో
వి: నిజానికి ఎంతమంది జనం ఉన్నా ఇసుకరేణువు జారి క్రిండ పడతాయి. కానీ, అంత జనంతో ప్రదేశం కిక్కిరిసిపోయింది అని చెప్పడానికి ఇలాగ అంటాము.

ఉదా:- వాడు పట్టిందల్లా బంగారమే

ఉదా:- (మనుచరిత్ర - అల్లసాని పెద్దన)
అటఁ జని కాంచె భూమిసురుఁ డంబర చుంబి శిరస్సర్ఝజరీ (...)
వి: ప్రవరుడు (బ్రాహ్మడు) హిమాలయాలను సందరిశించడాన్ని వివరిస్తున్నాడు కవి. అక్కడ ప్రవరుడు ఆకాశాన్ని ముద్దాడుతున్న పర్వతశిఖరాలను చూశాడు అని భావం. నిజానికి ఎంత పర్వతశిఖరమైనా ఆకాశాన్ని తాకదు. కానీ, కవి ఈ ప్రయోగం ద్వారా పర్వతశిఖరాలు ఎత్తైనవి అని తెలిపాడు.

చలనచిత్రాలలో అతిశయోక్తులు మనం చూస్తూనే ఉంటాము. కథానాయకుడు ఒక్క దెబ్బ కొడితే దుండగీడు నాలుగైదు గజాల దూరంలో పడటం స్పష్టమైన అతిశయోక్త్యలంకారం. ఇక పాటల్లో కూడా చాలానే ఉన్నాయి.

ఉదా:- (సూర్య ఐ.పీ.ఎస్, రచన: సిరివెన్నెల)
వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాను నీ కీర్తినే
ముల్లోకాల ఏ మూల విన్నా నీ అందాల సంకీర్తనే

ఉదా:- (సీతారామయ్య గారి మనుమరాలు, రచన: వేటూరి)
ముల్లోకాలే కుప్పెలై జడకుప్పెలై
ఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే
వి: గోదారి గంగమ్మ ఈ సౌందర్యవతికి అందానికి పరవశించి ఆనందంతో ఎగురుతోంది అని కవి భావం.

భ్రాంతిమదలంకారం

వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> భ్రాంతిమదలంకారము

లక్షణం: ఒక వస్తువును చూచి మఱొక వస్తువు అని భ్రమించినట్లుగా వర్ణించడాన్ని భ్రాంతిమదలంకారం అంటారు.

ఉదా:- (మనుచరిత్ర - అల్లసాని పెద్దన)
అంకముఁజేరి శైలతనయా-స్తన-దుగ్ధము లానువేళ బా
ల్యాంక విచేష్టఁదొండమున నవ్వలిచన్ గబళింపబోయి యా
వంక కుచంబుఁగాన కహివల్లభ హారముగాంచి వేమృణా
లాంకుర శకనంటెడు గజాస్యుని గొల్తునభీష్టసిద్ధికిన్

భా:- అర్థనారీశ్ర్వరరూపంలో ఉన్న పార్వతీపరమేశ్వరుల ఒడిలో కూర్చున్న గజాననుడు తల్లి స్తన్యమును త్రాగుతూ రెండవవైపు చన్ను కనిపించక శివుడి మెడలో ఉన్న పామును చూచి దానిని లేత తామరతూడుగా భావించి ఆడుకుంటున్నాడు. (అట్టి గజాననుడిని కోర్కెలు తీర్చమని నేను ప్రార్థించెదను).

వివరణ: ఇక్కడ వినాయకుడు శివుడి మెడలోని పామును తామరతూడు అని భ్రమించాడని కవి వర్ణించడంతో ఇది భ్రాంతిమదలంకారం అయ్యింది.

ఉదా:- (శశాంకవిజయం - శేషము వేంకటపతి)
ఇది మనోహర కాంతి నింపైన బింబంబు
బింబంబు గా దిది బెఁడగు కెంపు
(పూర్తిపద్యాన్ని భావాన్ని, ఇక్కడ చూడవచ్చును)

భా:- తార సౌందర్యాన్ని చూసి చంద్రుడు "ఇది పెదవి కాదు, నా ప్రతిబింబమా? లేక కెంపా?" అని ఆశ్చర్యపోయాడు.

వి: చంద్రుడు తార పెదవిని ఏ వస్తువో సరిపోల్చుకోలేక భ్రమిస్తున్నాడు కాబట్టి ఇది భ్రాంతిమదలంకారం. ఇది సందేహాలంకారం కూడా అవుతుందేమోనని నా సందేహం. ఆ విషయం పెద్దలు ఎవరైనా వివరించాలి.


చలనచిత్రసాహిత్యంలో ఈ అలంకారం చూసిన గుర్తు లేదు నాకు. కానీ వేటూరి మాత్రం పదే పదే తుమ్మెదలు అమ్మాయి సౌందర్యాన్ని చూసి తామర అనుకోవడాన్ని ప్రరోక్షంగా ప్రస్తావించారు. ఉదాహరణకి విలన్ 2010 చిత్రంలో "తుమ్మెదలంటని కమ్మని మోముని కన్న వనాలే హాయ్ హాయ్" అనడంలో "తుమ్మెదలు ఈమె తామరవంటి ముఖాన్ని ఇంకా గుర్తించలేకపోయాయి" అనే ధ్వని కనబడుతోంది.