Wednesday, December 9, 2009

చందమామ కంచమెట్టి, సన్నజాజి బువ్వపెట్టి

1980, 1990 లలో చక్కని తెలుగుదనంతో నిండిన చిత్రాలు తీసినవాళ్ళల్లో విశ్వనాథ్, జంధ్యాల, బాపు అగ్రగణ్యులు. వారు తీసిన చిత్రాలలో తెలుగుదనం ఉట్టిపడేది. అలాంటి దర్శకుల చేతుల్లో పడితే వేటూరి భావుకతకు అసలు అడ్డు, ఆపు ఉండదు. "హిమమే కురిసే చందమామ కౌగిట", అని సాగరసంగమంలో అన్నట్టు వేటూరి మంచి దర్శకుల చేతుల్లో పడితే అంత చలువగల్గిన పదాలు రాలతాయి.

తెలుగుచిత్రసాహిత్యభారతంలో వేటూరి కృష్ణపరమాత్మలాంటివాడు. అటు శృంగారం, ఇటు యోగం రెండూ ఆయనవే. అటు చీరలెత్తుకెళ్ళేవాడు, ఇటు చీరనిచ్చి పరువు గాసేవాడు రెండూ వాడే! అటు దొంగతనాలు చేసేవాడు, ఇటు రాజసూయయఙంలో ప్రథమతాంబూలం అందుకునేవాడు వాడే! ఇదే విషయాన్ని బాపు+రమణ రాంబంటు చిత్రంలో కోట శ్రీనివాసరావు చేత కృష్ణుడి మాటలకు మోడరన్ రంగు పులివి, "వత్స, నేను హీరోల్లో చిరంజీవిని. తారల్లో శ్రీదేవిని, పాటల్లో వేటూరిని", అని అనిపించారు. అది నిజమే. తెలుగుపాటల్లో వేటూరిని మించిన వైవిధ్యం, భావుకత, భాషాప్రయోగాలు మరెవరూ చెయ్యలేదు, చెయ్యలేరు, చెయ్యకూడదు, చేసినా ప్రజలు ఒప్పుకోరు.

ఈ పాట రాంబంటు అనే చిత్రంలోనిది. రాంబంటు పెళ్ళైనా తనను ఇంకా యజమానిలాగే చూస్తున్నాడు అని బాధపడ్డ హీరోయిన్, రాంబంటుని వశీకరించుకోవటానికి చేస్తున్న చిలిపి ప్రయోగం ఇది. ఒక గౌరవనీయమైన స్త్రీ మాటల్లో చిలిపిదనం, పులుపుధనం ఉండాలే కానీ పచ్చిదనం, పిచ్చితనం ఉండకూడదు. అది వేటూరికి మనం చెప్పాలా? అందుకే చూడండి ఎంత చక్కగా వ్రాశాడో!

సందమామ కంచమెట్టి, సన్నజాజి బువ్వపెట్టి
సందెమసక చీరగట్టి, సందుచూసి కన్నుగొట్టి

చక్కనైన చిలిపి విందును వేటూరి వర్ణించడం చూడండి. చందమామని కంచం చేసిందిట, సన్నజాజిపూవులను (అన్నం మెతుకుల పరిమాణంలో ఉంటాయి) బువ్వగా పెట్టి, సందెమసక (చీకటిని) చీరగా చుట్టి కన్నుగొడుతోంది అమ్మాయి. ఆహా, ఏం పోలికలు పోల్చావయ్యా మహానుభావా! ఇంత భావుకత ఉన్న కవులు మళ్ళీ తెలుగుతెరకు ఎప్పుడు వస్తారయ్యా? న భూతో న భవిష్యతి!

భద్రాద్రిరామయ్య పెళ్ళికొడుకవ్వాల, సీతలాంటినిన్ను మనువాడుకోవాల
బెజవాడ కనకదుర్గమ్మ బాసికాల్దేవాల, బాసరలో సరస్వతి పసుపుకుంకుమలివ్వాల
ఏడుకొండలసామి ఏదాలుజదవాల, సెవిటిమల్లన్నేమో సన్నాయి ఊదాల
అన్నవరం సత్తన్న అన్నవరాలివ్వాల, సింహాద్రప్పన్న సిరి(జాస?)లివ్వాల

పాటకు మధ్యలో మన వీరభక్తుడు తన సతికి తనకంటే మంచివ్యక్తితో మళ్ళీ పెళ్ళి కావాలని ఆంధ్రదేశంలో ఉన్న దేవతలందరినీ ప్రార్థించడంతో నిజంగా వేటూరి భక్తికీ, రక్తికీ సమతుల్యాన్ని చేకూర్చాడు. ఇందరు దేవతలను ఒకే పాటలో చూడటం ఇదే మొదటిసారి. సాహో వేటూరి!

పెదవితేనెలందిస్తే పెడమోములు, తెల్లారిపోతున్న చెలినోములు
పిల్లసిగ్గు చచ్చినా, మల్లెమొగ్గ విచ్చినా

ఎంతో చక్కగా ప్రాస,యతి కలిసేలాగా పాట వ్రాయడం ఆరుద్రకి, ఆ తరువాత వేటూరికే చెల్లు. (పెదవి, పెడమోము), (పిల్ల, మల్లె), (చచ్చినా, విచ్చినా) ఎంత చక్కనైన యుగళాలు. ఇదంతా శృంగారగీతంలో. ఆడపిల్లకి సిగ్గే సింగారం. సిగ్గుపడే ఆడదాన్ని విచ్చుకోవడానికి ఆరాటం ఉన్నా ఆ పని చెయ్యలేని మొగ్గతో పోల్చడం రివాజు. అలాంటిది, ఆ సిగ్గే వుడుచి పిల్ల వచ్చినా, ఆ మొగ్గే విచ్చినా నీ యోగమేమిటిరా మహానుభావా అని ఎంత చక్కగా చెప్పాడో! శృంగారగీతంలో చావుకు సంబంధించిన పదాలు వాడటం వేటూరికే చెల్లునేమో! "కోడి కొక్కొరో, పాడికెక్కెరో" అంటూ కొత్తపెళ్ళికొడుకు వైనాన్ని వివరించిన మహాశయుడు కూడా వేటూరే!

పంచదారచిలకడు, అవకతవకడు, ముదురుబెండడూ

ఇక ఇలాంటి శబ్దాలను ప్రయోగించి పెదాలపై హాసాన్ని రప్పించగల మాంత్రీకుడు వేరే ఎవరు స్వామీ! పంచదారని చిలకడు, పంచదారచిలక+డు అనే రెండు అర్థాలు వస్తున్నాయి. ఇలాగ రెండు మూడు అర్థాల వచ్చేలా వ్రాస్తే చదువర్లకూ ఉల్లాసమే!

ఈ పాటలో "ఈ వాక్యం" కలికితురాయి అని చెప్పడానికి లేకుండా ప్రతీ పదానికి, ప్రతీ స్వరానికీ న్యాయం చేసిన ఘనుడిని "నమో నమ: ఆధునికచిత్రకవిసామ్రాట్" అని అనకుండా ఉండలేను.

చిత్రం: రాంబంటు
దర్శకుడు: బాపు
సంగీతం: కీరవాణి
పాడింది: బాలు, చిత్ర

సందమామ కంచమెట్టి, సన్నజాజి బువ్వపెట్టి
సందెమసక చీరగట్టి, సందుచూసి కన్నుగొట్టి
సిగపూవు తెమ్మంటె మగరాయుడు, అరటిపువ్వు తెస్తాడు అడవిపురుషుడు

భద్రాద్రిరామయ్య పెళ్ళికొడుకవ్వాల
సీతలాంటినిన్ను మనువాడుకోవాల
బెజవాడ కనకదుర్గమ్మ బాసికాల్దేవాల
బాసరలో సరస్వతి పసుపుకుంకుమలివ్వాల

విన్నపాలు వినమంటే విసుగంటాడు, మురిపాలంటే ముసుగెడతాడు
బుగ్గపండు కొరకడు, పక్కపాలు అడగడు
పలకడూ, ఉలకడూ పంచదారచిలకడు
కౌగిలింతలిమ్మంటే కరుణించడు, ఆవులింతలంటాడు అవకతవకడు

ఏడుకొండలసామి ఏదాలుజదవాల
సెవిటిమల్లన్నేమో సన్నాయి ఊదాల
అన్నవరం సత్తన్న అన్నవరాలివ్వాల
సింహాద్రప్పన్న సిరి(జాస?)లివ్వాల

పెదవితేనెలందిస్తే పెడమోములు, తెల్లారిపోతున్న చెలినోములు
పిల్లసిగ్గు చచ్చినా, మల్లెమొగ్గ విచ్చినా
కదలడూ మెదలడూ కలికిపురుషుడు
అందమంత నీదంటే అవతారుడు, అదిరదిరి పడతాడు ముదురుబెండడూ

Sunday, December 6, 2009

నిరంతరమూ వసంతములే

ప్రకృతిని వర్ణించని వాడు కవి కాడు. అసలు కళ అనేదే పరమాత్ముని స్త్రీత్వానికి చిహ్నం! అందుకే కళలకు తల్లిగా సరస్వతీదేవిని కొలుస్తున్నాము. వాల్మీకి చిత్రకూటాన్ని వర్నీంచడం దగ్గరనుండి చందస్సుని ఛాందసంగా భావించి మన కృష్ణశాస్త్రి భావకవితలను రచించడం వరకూ అందరు కవులూ ప్రకృతిని వర్ణిస్తూ వచ్చారు. మరి వేటూరి ఏమైనా తక్కువ తిన్నాడా? అసలు ప్రకృతిని వర్ణించాలి అంటే దానికి ప్రకృతిని అంత చక్కగా చూపించగలిగిన దర్శకుడు కావాలి అని నా నమ్మకం. మరి తెలుగులో ప్రకృతి అందాన్ని చక్కగా చూపించగలిగిన వాళ్ళు బాపు, ఆ తరువాత వంశీనే కదా? అందుకే వంశీ, వేటూరి జతగా వచ్చిన చిత్రాలలో చక్కని భావకవిత్వంతో పాటు, పచ్చని ప్రకృతి ప్రతిబింబిస్తుంది.

ఇప్పుడు నేను చెప్పబోయే పాట "ప్రేమించు పెళ్ళాడు", అనే వంశీ చిత్రంలోనిది. ఇందులో వెటూరి ప్రేమికుల భావాలని, ప్రకృతిని/ఋతువులని, పోల్చి చక్కగా వర్ణించాడు. ఈ పాట ఇంత అందంగా రావడానికి ఇళయరాజా సంగీతం ఎంతో తోడ్పడింది అనటంలో ఆశ్చర్యం లేదు. ఇందులో నాకు నచ్చిన వాక్యాలు:

నిరంతరమూ వసంతములే, మందారములా మరందములే

డ్యూయెట్ చిత్రంలో "కొడితే కోలాటం" అనే పాటలో వెన్నెలకంటి "పాటకు ఎస్.పి.బి, పల్లవికి వేటూరి", అని అన్నాడు. అది అక్షరాలా సత్యం. వేటూరి పల్లవి వ్రాస్తే అది నాలుకపైన నాట్యం చేస్తుంది. పల్లవి వ్రాయడం అనేది ఒక ప్రత్యేకమైన విద్య. ప్రతీ చరణం ముగియగానే, ఆ ముగింపు పల్లవికి మరొక మొదలు కావాలి. అది ఇక్కడ వేటూరి ఎంతో చక్కగా చేకూర్చాడు. చరణాల చివరి వక్యాలకు, "ఇంత చక్కని అందం మన చుట్టూ ఉంటే" అనే భావం వచ్చేలాగా వ్రాశాడు. అప్పుడు, తిరిగి పల్లవి పాడితే ఒక కంటిన్యూషన్ ఉంటుంది.

సర్వసామాన్యమైన యుగళగీతానికి సైతం చక్కని బాణీ అందించిన ఇళయరాజాకు, అంతే చక్కని పదాలు (ఉదా| మరందము అంటే తేనె) అల్లి తనేమీ తక్కువ తినలేదు అనిపించుకున్నాడు వేటూరి!

స్వరాలు సుమాలుగ పూచెనులే పదాలు ఫలాలుగ పండెనులే

స్వరాలను సుమాలతో పోల్చడం విచిత్రమేమీ కాదు. కానీ, పదాలను ఫలాలతో పోల్చడం నేను ఇదే చూస్తున్నాను. "స్వరాలు, పదాలు పండించేటి చక్కని వసంతం మా వెంట ఎప్పుడూ ఉంటుంది", అనే భావాన్ని ప్రేమికులు పాడుకోవడం ఎంతో మధురంగా ఉంది.

తేనెలో తానమాడే తుమ్మెదే మాకు చుట్టం
నదులలో వీణ మీటే తెమ్మెరే మాకు ప్రాణం

తేనెలో తానమాడే (స్నానము అనే పదానికి వికృతి తానము) తుమ్మెద అనడంలో, ఆ తుమ్మెద ఎంత ఉత్సాహంగా (ఎక్ష్టాటిక్) ఉందో చెప్తున్నాడు. నదులపై ఉన్న అలలు (రిపుల్స్) ని వీణతీగెలతోనూ, వాటిని గాలి కదపటాన్ని వీణ మీటడంతోనూ పోల్చడానికి మన పిసినారు వేటూరికి నాలుగు పదాలు చాలు!

అగ్నిపత్రాలు వ్రాసి గ్రీష్మమే సాగిపోయే
మెరుపు లేఖల్లు వ్రాసి మేఘమే మూగబోయే
మంచుధాన్యాలు కొలిచి పౌష్యమే వెళ్ళిపోయే
మాఘదాహలలోన అందమే అత్తరాయే

వేడితో తన భావాలను తెలిపి గ్రీష్మఋతువు వెళ్తే, మెరుపుతో వర్షఋతువు వెళ్ళిపోయిందిట. హేమంతఋతువు (పౌషం) మంచుధాన్యాలు కొలిచింది అనడంలో అటు రైతులు పంట నూర్చడాన్ని, ఇటు శరదృతువు కురిపించిన మంచును హేమంతం కొలిచింది అనడాన్ని కలిపి ఎంతో చక్కగా చెప్పాడు. అక్కడికి గ్రీష్మం, వర్షం, శరత్, హెమంతం అయ్యాయి. చివరగా, శిశిరం (మాఘ) దాహలు తీసుకువస్తే దానికి విరుగుడుగా అందాన్ని అత్తరు చేసుకుని చల్లుకున్నాడట మన ప్రేమికుడు. ఇంతకీ శిశిరంలో (చలికాలంలో) దాహమేమిటి? అని అనుకుంటున్నారా? చలికాలంలో చర్మం ఆరిపోవడం, అని సర్ది చెప్పేద్దామని ఉన్నా రసఙులకు అసలు విషయం తెలుస్తుంది :)

ఇవన్ని ఋతువులూ వచ్చి ప్రేమికులనూ ఏమీ చెయ్యలేకపోయాయిట. ఇంతలో మళ్ళి మన వసంతఋతువు వచ్చేసిందిట. అందుకే "నిరంతరమూ వసంతములే"!

చిత్రం: ప్రేమించు పెళ్ళాడు
దర్శకుడు: వంశీ
గానం: జానకి, ఎస్.పీ.బీ
సంగీతం: ఇళయరాజా

నిరంతరమూ వసంతములే, మందారములా మరందములే
స్వరాలు సుమాలుగ పూచెనులే పదాలు ఫలాలుగ పండెనులే

హాయిగా పాటపాడే కోయిలే మాకు నేస్తం
తేనెలో తానమాడే తుమ్మెదే మాకు చుట్టం
నదులలో వీణ మీటే తెమ్మెరే మాకు ప్రాణం
అలలపై నాట్యమాడే వెన్నెలే వేణుగానం
ఆకశానికవి తారలా? ఆశపూల విరిదారులా?
ఈ సమయం ఉషోదయమై మా హృదయం జ్వలిస్తుంటే!

అగ్నిపత్రాలు వ్రాసి గ్రీష్మమే సాగిపోయే
మెరుపు లేఖల్లు వ్రాసి మేఘమే మూగబోయే
మంచుధాన్యాలు కొలిచి పౌష్యమే వెళ్ళిపోయే
మాఘదాహలలోన అందమే అత్తరాయే
మల్లెకొమ్మ చిరునవ్వులా మనసులోని మరుదివ్వెలా?
ఈ సమయం రసోదయమై మా ప్రణయం ఫలిస్తుంటే!