ప్రకృతిని వర్ణించని వాడు కవి కాడు. అసలు కళ అనేదే పరమాత్ముని స్త్రీత్వానికి చిహ్నం! అందుకే కళలకు తల్లిగా సరస్వతీదేవిని కొలుస్తున్నాము. వాల్మీకి చిత్రకూటాన్ని వర్నీంచడం దగ్గరనుండి చందస్సుని ఛాందసంగా భావించి మన కృష్ణశాస్త్రి భావకవితలను రచించడం వరకూ అందరు కవులూ ప్రకృతిని వర్ణిస్తూ వచ్చారు. మరి వేటూరి ఏమైనా తక్కువ తిన్నాడా? అసలు ప్రకృతిని వర్ణించాలి అంటే దానికి ప్రకృతిని అంత చక్కగా చూపించగలిగిన దర్శకుడు కావాలి అని నా నమ్మకం. మరి తెలుగులో ప్రకృతి అందాన్ని చక్కగా చూపించగలిగిన వాళ్ళు బాపు, ఆ తరువాత వంశీనే కదా? అందుకే వంశీ, వేటూరి జతగా వచ్చిన చిత్రాలలో చక్కని భావకవిత్వంతో పాటు, పచ్చని ప్రకృతి ప్రతిబింబిస్తుంది.
ఇప్పుడు నేను చెప్పబోయే పాట "ప్రేమించు పెళ్ళాడు", అనే వంశీ చిత్రంలోనిది. ఇందులో వెటూరి ప్రేమికుల భావాలని, ప్రకృతిని/ఋతువులని, పోల్చి చక్కగా వర్ణించాడు. ఈ పాట ఇంత అందంగా రావడానికి ఇళయరాజా సంగీతం ఎంతో తోడ్పడింది అనటంలో ఆశ్చర్యం లేదు. ఇందులో నాకు నచ్చిన వాక్యాలు:
నిరంతరమూ వసంతములే, మందారములా మరందములే
డ్యూయెట్ చిత్రంలో "కొడితే కోలాటం" అనే పాటలో వెన్నెలకంటి "పాటకు ఎస్.పి.బి, పల్లవికి వేటూరి", అని అన్నాడు. అది అక్షరాలా సత్యం. వేటూరి పల్లవి వ్రాస్తే అది నాలుకపైన నాట్యం చేస్తుంది. పల్లవి వ్రాయడం అనేది ఒక ప్రత్యేకమైన విద్య. ప్రతీ చరణం ముగియగానే, ఆ ముగింపు పల్లవికి మరొక మొదలు కావాలి. అది ఇక్కడ వేటూరి ఎంతో చక్కగా చేకూర్చాడు. చరణాల చివరి వక్యాలకు, "ఇంత చక్కని అందం మన చుట్టూ ఉంటే" అనే భావం వచ్చేలాగా వ్రాశాడు. అప్పుడు, తిరిగి పల్లవి పాడితే ఒక కంటిన్యూషన్ ఉంటుంది.
సర్వసామాన్యమైన యుగళగీతానికి సైతం చక్కని బాణీ అందించిన ఇళయరాజాకు, అంతే చక్కని పదాలు (ఉదా| మరందము అంటే తేనె) అల్లి తనేమీ తక్కువ తినలేదు అనిపించుకున్నాడు వేటూరి!
స్వరాలు సుమాలుగ పూచెనులే పదాలు ఫలాలుగ పండెనులే
స్వరాలను సుమాలతో పోల్చడం విచిత్రమేమీ కాదు. కానీ, పదాలను ఫలాలతో పోల్చడం నేను ఇదే చూస్తున్నాను. "స్వరాలు, పదాలు పండించేటి చక్కని వసంతం మా వెంట ఎప్పుడూ ఉంటుంది", అనే భావాన్ని ప్రేమికులు పాడుకోవడం ఎంతో మధురంగా ఉంది.
తేనెలో తానమాడే తుమ్మెదే మాకు చుట్టం
నదులలో వీణ మీటే తెమ్మెరే మాకు ప్రాణం
తేనెలో తానమాడే (స్నానము అనే పదానికి వికృతి తానము) తుమ్మెద అనడంలో, ఆ తుమ్మెద ఎంత ఉత్సాహంగా (ఎక్ష్టాటిక్) ఉందో చెప్తున్నాడు. నదులపై ఉన్న అలలు (రిపుల్స్) ని వీణతీగెలతోనూ, వాటిని గాలి కదపటాన్ని వీణ మీటడంతోనూ పోల్చడానికి మన పిసినారు వేటూరికి నాలుగు పదాలు చాలు!
అగ్నిపత్రాలు వ్రాసి గ్రీష్మమే సాగిపోయే
మెరుపు లేఖల్లు వ్రాసి మేఘమే మూగబోయే
మంచుధాన్యాలు కొలిచి పౌష్యమే వెళ్ళిపోయే
మాఘదాహలలోన అందమే అత్తరాయే
వేడితో తన భావాలను తెలిపి గ్రీష్మఋతువు వెళ్తే, మెరుపుతో వర్షఋతువు వెళ్ళిపోయిందిట. హేమంతఋతువు (పౌషం) మంచుధాన్యాలు కొలిచింది అనడంలో అటు రైతులు పంట నూర్చడాన్ని, ఇటు శరదృతువు కురిపించిన మంచును హేమంతం కొలిచింది అనడాన్ని కలిపి ఎంతో చక్కగా చెప్పాడు. అక్కడికి గ్రీష్మం, వర్షం, శరత్, హెమంతం అయ్యాయి. చివరగా, శిశిరం (మాఘ) దాహలు తీసుకువస్తే దానికి విరుగుడుగా అందాన్ని అత్తరు చేసుకుని చల్లుకున్నాడట మన ప్రేమికుడు. ఇంతకీ శిశిరంలో (చలికాలంలో) దాహమేమిటి? అని అనుకుంటున్నారా? చలికాలంలో చర్మం ఆరిపోవడం, అని సర్ది చెప్పేద్దామని ఉన్నా రసఙులకు అసలు విషయం తెలుస్తుంది :)
ఇవన్ని ఋతువులూ వచ్చి ప్రేమికులనూ ఏమీ చెయ్యలేకపోయాయిట. ఇంతలో మళ్ళి మన వసంతఋతువు వచ్చేసిందిట. అందుకే "నిరంతరమూ వసంతములే"!
చిత్రం: ప్రేమించు పెళ్ళాడు
దర్శకుడు: వంశీ
గానం: జానకి, ఎస్.పీ.బీ
సంగీతం: ఇళయరాజా
నిరంతరమూ వసంతములే, మందారములా మరందములే
స్వరాలు సుమాలుగ పూచెనులే పదాలు ఫలాలుగ పండెనులే
హాయిగా పాటపాడే కోయిలే మాకు నేస్తం
తేనెలో తానమాడే తుమ్మెదే మాకు చుట్టం
నదులలో వీణ మీటే తెమ్మెరే మాకు ప్రాణం
అలలపై నాట్యమాడే వెన్నెలే వేణుగానం
ఆకశానికవి తారలా? ఆశపూల విరిదారులా?
ఈ సమయం ఉషోదయమై మా హృదయం జ్వలిస్తుంటే!
అగ్నిపత్రాలు వ్రాసి గ్రీష్మమే సాగిపోయే
మెరుపు లేఖల్లు వ్రాసి మేఘమే మూగబోయే
మంచుధాన్యాలు కొలిచి పౌష్యమే వెళ్ళిపోయే
మాఘదాహలలోన అందమే అత్తరాయే
మల్లెకొమ్మ చిరునవ్వులా మనసులోని మరుదివ్వెలా?
ఈ సమయం రసోదయమై మా ప్రణయం ఫలిస్తుంటే!
3 comments:
వంశీ వేటూరి కలయిక ఎప్పుడు అద్బుతమే. వారిద్దరి నుంచి వచ్చిన ప్రతి పాట ఒక కావ్యం. చాలా బాగా వ్రాసారు వీరి కలయికలొని ఇంకోన్ని పాటలని వివరించగలరని ఆశిస్తున్నా.
this is my favourite song.
thre is no song that equals this in telugu films with reference to its poetry.
wonderful analysis.
especially here
నదులపై ఉన్న అలలు (రిపుల్స్) ని వీణతీగెలతోనూ, వాటిని గాలి కదపటాన్ని వీణ మీటడంతోనూ పోల్చడానికి మన పిసినారు వేటూరికి నాలుగు పదాలు చాలు!
chaalaa baagundi.
bollojubaba
ఈ సినిమాలో పాటలన్నీ అద్భుతంగా ఉంటాయ్, సంగీత సాహిత్య పరంగా! ఇళయరాజా ఒకే రోజులో అన్ని పాటలూ ట్యూన్ చేసేశాడని వంశీ హాసంలో రాశారు. ఇక ప్రతి పాటనీ ఒక అద్భుత భావగీతంలా మలచిన వేటూరి ప్రతిభకి పులకించడం తప్ప ఇంకేం చెయ్యగలం? చక్కటి వ్యాసం!
Post a Comment