Thursday, February 18, 2016

శ్రీ వేంకటేశ్వర పదములు - మనిషిగ పుట్టెను ఒక మట్టి

కథానాయకదర్శకనిర్మాతాదుల ఒత్తిడి లేకుండా వ్రాయడం ఏ చలన చిత్ర కవికైనా వరమే. బహుశా అందుకేనేమో, వేటూరి private albums కొన్నిటికి ఆణిముత్యాల వంటి పాటలు వ్రాసారు. "శ్రీ వేంకటేశ్వర పదములు" అనే album లో భక్తిని, వేదాంతాన్ని కలగలిపి వ్రాసిన సాహిత్యం విన్న ప్రతి ఒక్కరికీ నచ్చితీరుతుంది. ఆ పాటల్లో నాకు పదే పదే గుర్తొచ్చేది "మనిషిగ పుట్టెను ఒక మట్టి" అనే పాట. దీన్ని స్వరపరిచినది కే.వీ.మహదేవన్, పాడింది ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం. వీరిద్దరూ వేటూరి సాహిత్యానికి తగిన న్యాయాన్ని చేకూర్చారు.

వేదాంతం అంతా మూడిటి మధ్య సంబంధం గురించి చెబుతుంది. అవి జీవుడు (జీవాత్మ), ప్రపంచం (జాగత్తు), ఈశ్వరుడు (పరమాత్మ). ఈ మూడూ ఒకటే అనేది అద్వైతవేదాంతం. అద్వైతం అంటే - "రెండవది లేనిది" అని అర్థం. అద్వైతసారం: ఉన్నది ఒకటే - బ్రహ్మం. మాయ వలన బ్రహ్మమే విడి విడిగా అనేక జీవులుగా, వస్తువులుగా (ప్రపంచం), ఈశ్వరుడిగా కనిపిస్తోంది. తెల్లదైన సూర్యరశ్మి తేమ ద్వారా చూస్తే ఏడు రంగులుగా కనిపించినట్టు అన్నమాట. శంకరాచార్యుల నుండి, నిసర్గదత్త వరకు గురువులు అందరూ ఇదే విషయాన్ని అనేక దృష్టాంతాలతో (ఉదాహరణలతో) వర్ణించి చెప్పారు. వీటిలోని అనేక అంశాలను స్పృశిస్తూ వేటూరి కలం నుండి పల్లవించిన ఈ పాట ఆ పరమేశ్వరుడి చరణాలను చేరింది అని నా నమ్మకం.

ఈ పాటలో పల్లవి, చరణాలూ పంచభూతాలలో ఒక్కొక్క దాన్నీ వర్ణించుకుంటూ వెళ్తాయి. కవి వాటిని చూసి జిజ్ఞాసతో తేలిక మాటలలో లోతైన ప్రశ్నలను అడుగుతూ ఉంటాడు. ఆ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం తెలిస్తే వేదాంతం అర్థమైనట్టే. (అర్థమైనంత మాత్రాన అనుభవంలోకి రాదు. అనుభవంలోకి రానప్పుడు అర్థమైనా కానట్టే.) ఆ ప్రశ్నలు, వాటికి వేదాంతంలో నాకు తెలిసిన సమాధానాలు కూడి ఈ వ్యాసం వ్రాస్తున్నాను. ఈ వ్యాసం చదువుతుంటే మీకు "వేటూరి ఈ ఉద్దేశంతోనే వ్రాసుంటారా?" అని అనిపిస్తే, మీరు ఏకాకి కాదు. వ్రాస్తున్నప్పుడు నాకే బోలెడు సార్లు అలాగ అనిపించింది. కచ్చితంగా ఈ పాటలో చాలా లోతైన భావాలను కొద్దిపాటి పదాలలో చెప్పారు. అందుచేత ఆయన రచించిన వేరే పాటలలో భావాలను, శైలిని బట్టి కవిహృదయాన్ని ఊహించవలసి వచ్చింది. ఆ ప్రక్రియలో పొరబాట్లు కూడా దొర్లి ఉండవచ్చును. ఇది వేటూరి పాటల్లో తరచూ జరిగే (నాకు ఇష్టమైన) విషయం. ఒక వేళ మీకు "ఈ పాటలో ఉన్న పది పదాలకు, వీడు వేయి మాటల్లో వేదాంతం వివరించాలా?" అని అనిపిస్తే మన్నించాలి. ఈ పాట నేను అప్పుడప్పుడూ చదువుకున్న వేదాంత తర్కసారాలను మనసు లోపొరల్లోంచి తవ్విస్తుంది. అందుకు కృతజ్ఞతగా ఈ వ్యాసాన్ని వ్రాస్తున్నాను.

మనిషిగ పుట్టెను ఒక మట్టి
తన మనసును పెంచినదే మట్టి
మానై పుట్టెను ఒక మట్టి
తన పూవై పూసినదే మట్టి

మట్టిలోంచే అంతా వస్తుంది, మట్టిలోకే అంతా వెళ్తుంది అన్నది వీధి వేదాంతం. అంటే - అందరికీ తెలిసిన వాదం, అందరూ సుమారుగా అంగీకరించే వాదం. శరీరానికి మట్టి ముడిసరుకు. మరి, మనసు కనబడదు, తాకడానికి వీలు కాదు కదా - దానికి ముడిసరుకు ఏది? మాను మట్టి లోంచే పుట్టింది, ఆ మానుకు భిన్నంగా ఉండి, కళను తెచ్చే పువ్వు ఎక్కడనుండి వచ్చింది?

అంతా మట్టి అని మనం అంటాము. అంతా బ్రహ్మం అని వేదాంతులు అంటారు. మనిషి దేహం మట్టిలోంచి వచ్చింది. మనసు అదృశ్యం, అస్పృశ్యము, అభౌతికము కదా, దానికి మూలం ఏమిటి? దానికి జవాబు "అజ్ఞానం (అవిద్య)". జీవుడికి "నేను ఈ దేహాన్ని" అనే మోహం కలిగించేది అజ్ఞానం. ఈ అజ్ఞానానికి కొమ్మలు - బుద్ధి, మనసు, అహంకారం, చిత్తం. సూక్ష్మంగా వీటిలో భేదాలు ఉన్నా, స్థూలంగా వీటిని కలిపి "మనసు" అంటాము. దేహంలోని ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని చూసి మనసు కోరికలను, బంధాలను ఏర్పరుచుకుని బలపడుతుంది. ఆ దేహం వాసయోగ్యం కానప్పుడు ఇంకా మనసు మిగిలిపోతే - అది మళ్ళీ వేరే దేహాన్ని ఆశ్రయిస్తుంది. మనిషి-మనసులకు ఉపమానాలుగా మాను, పువ్వులను చెప్పారు. చెట్టు నుండి పువ్వు వస్తుంది. పువ్వు నుండి చెట్టు వస్తుంది.

ఆయువు పోసెను ఒక గాలి
జీవాత్మలనూదినదే గాలి
వేణువులూదెను ఒక గాలి
పరమాత్మునికూపిరి ఏ గాలి

జీవుడికి ఒక దేహంలో ఆయువుని ఇచ్చేది గాలి. మరి దేహాలను మారుస్తూ పోయే జీవాత్మలను కల్పించినది ఏ గాలి? ఈ జీవాత్మల జీవనవేణువులు (జీవితంలో రాగాలు - అనుభూతులు) ఊదుతున్నది ఏ గాలి? అది ఈశ్వరుడు అనుకుంటే మరి ఈశ్వరుడికి ఆధారం ఏమిటి? §

ప్రాణం అంటే మామూలు భాషలో ఊపిరి. యోగాభ్యాసంలో జీవుడి ఉనికిని (vitality, life-breath) ప్రాణం అంటారు. దీన్నే తెలుగులో ఉసురు అని అంటాము. దేహంలో ఉసురు ఉన్నంతవరకే జీవుడు అందులో నివసిస్తాడు, దీన్నే ఆయువు అంటాము. కవి ప్రాణాన్నే గాలి అంటున్నాడు.

అద్వైతంలో "సృష్టి" అనేది ప్రపంచానికి ఉందేమో కానీ జీవాత్మలకు లేదు. కృష్ణభగవానుడు కూడా గీతలో "న త్వేవాహం జాతు నాసం న త్వం న ఇమే జనాధిపాః" అన్నాడు కదా. జీవాత్మ తను బ్రహ్మం నుండి వేరని భావించడానికి కారణం అజ్ఞానం. అజ్ఞానానికి ఆది ఉండదు. ఉదాహరణకు, ఒకడు తాడును చూసి పాము అనుకున్నాడు. వాడు దాన్ని పాము అని అనుకుంటుండగా "అక్కడ పాము ఎంత సేపటినుండి ఉంది?" అని అడిగితే వాడు రెండు రోజులన్నా, రెండు కోట్ల సంవత్సరాలన్నా పొరబాటే. ఎందుకంటే అక్కడ ఉన్నది అసలు పామే కాదు. పోనీ, వాడు అది తాడు అని తెలుసుకున్న తరువాత, "అక్కడ పాము ఎంత సేపటినుండి ఉంది?" అని అడిగితే ఆ ప్రశ్నే నిరర్థకం. అలాగ "జీవాత్మ, అజ్ఞానం ఎప్పుడు సృష్టింపబడ్డాయి?" అంటే దానికి సమాధానం "అసలు అవి సృష్టింపబడలేదు". బహుశా అందుకేనేమో వేటూరి "సృష్టించిన" అనే భావం రాకుండా, సున్నితంగా జీవాత్మలను "ఊదినది" ఏ గాలి అన్నారు.

ఈ జీవాత్మలకు అనుభవాలు కలగాలి అంటే వారికి ఒక పరిసరం కావాలి. ప్రపంచాన్ని సృష్టించి వారి జీవనవేణువులను ఊదినది ఏ గాలి అని కవి అడుగుతున్నాడు. దానికి సమాధానం ఈశ్వరుడు అని చెప్పచ్చును. మరి ఆ ఈశ్వరుడికి ఉసురు ఎవరు పోసారు? అసలు జీవాత్మనే ఎవరూ సృష్టించలేదు అంటే, మరి పరమాత్మ సంగతి అడగాలా? ఆయనా సనాతనుడే. ఆ వాదం నచ్చలేదూ, వేదం మరొక ఆధారం ఇచ్చింది -  "ప్రజ్ఞానం బ్రహ్మ" అనే మహావాక్యంలో. అంటే తమ తమ ఉనికిని గుర్తించే సకలజీవాలలోనూ "నేను ఉన్నాను" అనే జ్ఞానమే (అనుభవం, స్ఫురణ) బ్రహ్మం. ఆంగ్లంలో దీన్ని consciousness అంటారు. మరి ఆ జ్ఞానాన్ని ఎవరు సృష్టించారు అంటే - ఆ ప్రశ్నే నిరర్థకం. సృష్టించేవాడికి జ్ఞానం ఉండాలి కదా, అంటే స్రష్ట కంటే ముందు జ్ఞానం ఉంది అన్నమాట. అంటే జ్ఞానం సృష్టించబడినది కాదు, సనాతనమైనది. ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడు - ఆయనా సనాతనుడే.

ఆకలి పెంచినదొక నిప్పు
తన అంగము పెంచినదే నిప్పు
కన్నుగ వెలిగెను ఒక నిప్పు
తన వెన్నుని గాంచినదే నిప్పు

నిప్పుకు రెండు లక్షణాలు ఉంటాయి. ఒకటి మండటం, రెండు వెలగడం. దేహానికి ఆ రెండూ అవసరం. ఎప్పటికప్పుడు ఆకలి అగ్ని లాగా మండుతున్న అనుభవాన్ని ఇస్తుంది. తిండి పెడితే దాన్ని జీర్ణించుకుని శరీరభాగాలకు బలాన్ని ఇచ్చి, పెంచుతుంది. ఇది నిరంతరం దేహంలో జరిగే యజ్ఞము. అన్ని ఇంద్రియాల లోకీ ముఖ్యమైనది కన్ను. ఆ కంటికి ఏదైనా కనబడేందుకు ఆధారం వెలుగు. ఇదంతా బానే ఉంది, మరి ఈ దేహానికి చైతన్యాన్ని ఇచ్చిన నిప్పు ఏమిటి?

మనిషి వెన్ను క్రింది కొన దగ్గర ఒక శక్తి ఉంటుంది అని యోగుల అనుభవం. దాన్నే కుండలినీ శక్తి అంటారు. దీన్ని పాముతోనూ, నిప్పుతోనూ పోలుస్తారు. ఈ శక్తి భౌతికమైన దేహానికి, అధ్యాత్మికమైన బ్రహ్మానికి ఒక వంతెన. ఎందుకంటే వేదాంతులు ఆ శక్తి మరేదో కాదు - ప్రజ్ఞానమే అంటారు. దీనికే అఖండాకార వృత్తి, అహం ("నేను ఉన్నాను") స్ఫురణ అనే పేర్లు కూడా ఉన్నాయి. "వెన్నును చూసిన నిప్పు" అంటే జీవుడి వెనుకనున్న "చైతన్యం" - అది బ్రహ్మం అన్నమాట.

దాహము తీర్చెను ఒక నీరు
తన దేహపుటొరవడి ఏ నీరు
కడలై పొంగిన దొక నీరు
తన కన్నుల పొంగినదే నీరు

దాహం తీరుస్తున్న నీరు తెలుసును. మరి దేహాన్ని నడుపుతున్న నీరు ఏమిటి? ఫలానా పరిస్థితుల మధ్యన ఈ జీవుడు దేహాన్ని పొందుతాడు అని నిర్దేశించేది ఏమిటి? దానికి జవాబు - కర్మ. జీవుడు తన మనసులో కోరికలు (దాహం) తీర్చుకోవడానికి ప్రస్తుతదేహంతో కర్మలు చేస్తాడు. ఆ కర్మ ప్రతిఫలాన్ని, మిగిలిన మనసును (వాసనలను) బట్టి ఈ దేహపు ఆయువు తీరాక, మరొక దేహాన్ని ఆశ్రయిస్తాడు.

కడలిలో నీటికి కడవలో (కుండ) నీటికి తేడా ఏమిటి? కడలిలో ఎంత నీరు పోసినా ఇంకా పడుతుంది. కడవలో నీటి రంగు, రూపు, రుచి మొదలైన గుణాలు మార్చనవుతుంది. కడలిలో నీటిని మార్చడం అసంభవం. కడవలో పోసిన నీరు వెనక్కి తీసుకోవచ్చును. కడలిలో పోసిన నీరు వెనక్కి రావు. ఇక్కడ కడలి ఈశ్వరుడు, కడవ జీవుడు. జీవుడు తాను దేహాన్ని అనుకుని కర్మను చేస్తే ప్రతిఫలం అనుభవించాలి. అదే, జీవుడు కర్మను ఈశ్వరుడికి సమర్పించి చేస్తే, అది ఈశ్వరుడి కర్మ అవుతుంది. దానికి ప్రతిఫలం జీవుడికి రాదు. దీన్నే కర్మయోగం అంటారు.

క్రమేపి కడలి వంటి ఈశ్వరుడి విస్తారాన్ని, లోతుని గుర్తించిన జీవుడి కన్నుల్లో భక్తి పొంగి కర్మయోగం భక్తియోగం గా పరిణమిస్తుంది.

అటనట నిలిచెను ఒక గగనం
తన ఘటమున నిండినదేగగనం
ఘటనాఘటనల నడుమ నటనలో
మెరుపులు మెరిసినదే గగనం

ఎక్కడ వేరే వస్తువు లేదో అక్కడ ఆకాశం (space) ఉన్నట్టే కదా. ఆ లెక్కన అణువుకూ అణువుకూ మధ్యలో కూడా ఆకాశం ఉంది, అంటే ఆకాశం అంతటా ఉంది. ఒక ఖాళీ కుండ ఉంది అనుకోండి. ఆ కుండలో కూడా ఆకాశం ఉంది. ఆ లోపలి ఆకాశం, బయటన ఉన్న ఆకాశం ఒకటేనా? జరిగేవాటితో, జరగనివాటితో ప్రపంచం నడుస్తుండగా ఉన్నట్టుండి మెరుపులు మెరుస్తున్నాయి - అవి ఏ ఆకాశానివి? కుండ బయట ఉన్న ఆకాశానివా? అది కాక మరొక ఆకాశం ఉందా? ఇదంతా కవి ఆలోచిస్తున్నాడు.

ఈ పాట చరణాలన్నిటిలోనూ నాకు అత్యంత ఇష్టమైన చరణం ఇదే. వేదాంతంలో ఘటాకాశ దృష్టాంతం (ఉదాహరణ) అని చెప్తారు. ఆకాశం అంతటా ఉంది. కుండ (ఘటము) లోపలా ఉంది, బయటా ఉంది. కుండ ఉన్నంత కాలం లోపల ఉన్న ఆకాశం (ఘటాకాశం) వేరుగా, బయట ఉన్నది (మహాకాశం) వేరుగా అనిపిస్తాయి. ఒక సారి ఘటం ముక్కలైపోతే మిగిలేది మహాకాశమే. ఇక్కడ ఆకాశం ప్రజ్ఞానానికి (బ్రహ్మానికి) ప్రతీక. ఒక్కటే ప్రజ్ఞానం అఖండంగా ఉంది. అజ్ఞానమనే మట్టితో కొన్ని కుండలు (జీవాత్మలు) ఏర్పడ్డాయి. ఆ అజ్ఞానపు ఆవరణ వలన "నేను వేరు, బయట వేరు" అనే భావన జీవాత్మలకు కలుగుతోంది. ఆవరణ లోపల ఉన్నది మాత్రమే "నేను" అనే భ్రమ జీవాత్మ అయ్యింది. ఆవరణ లోంచి బయటకు చూస్తే ప్రజ్ఞానమే చిత్రవిచిత్రంగా విక్షేపం (projected) అయ్యి ప్రపంచంగా కనిపిస్తోంది. ఒక సారి ఆ అజ్ఞానం ఛిన్నమైపోతే జీవుడూ, ప్రపంచం, బ్రహ్మమూ అంతా ఒకటే అని గోచరిస్తుంది.

ఒక వేదిక పైన ఇద్దరు మనుషుల సంభాషణ హేతుబద్ధంగా ఉండవచ్చును, నిజం అనిపించవచ్చును. ఒక్క సారి హేతుబద్ధంగా జరగవలసింది జరగకపోతే అది రంగస్థలం అని, వారిది నటన అని మనకు అనుమానం వస్తుంది. అలాగే, ఈ ప్రపంచంలో జరిగే ప్రతి విషయానికీ భౌతికంగా ప్రత్యక్షహేతువు (rationale) గోచరిస్తోంది. కానీ ఏ ఒక్క విషయాన్ని పరిపూర్ణంగా నిర్దేశించడం కుదరదు. ఒక్కోసారి పరిపూర్ణ ప్రయత్నానికి ప్రతిఫలం రాకపోతే మనం చేసేది కూడా నటన ఏమో అనిపిస్తుంది. ఈ నటన మనం చేస్తుంటే, ప్రపంచాన్ని అనుకోని మలుపులు (మెరుపులు) తిప్పుతున్నది ఎవరు? ఈ ప్రశ్నకు వేదాంతం ఇచ్చే సమాధానం ఈశ్వరుడు (సగుణ బ్రహ్మం). మామూలుగా బ్రహ్మానికి గుణాలు ఉండవు. ఉదాహరణకు బ్రహ్మం ఏ రంగులో ఉంటుంది అంటే, దానికి సమాధానం - "బ్రహ్మానికి రంగు లేదు" అని. బ్రహ్మానికి నిర్వచనం సత్ (ఎప్పటికీ ఉండేది, మారనిది), చిత్ ("నేను ఉన్నాను" అనే స్ఫురణ), (అనంతమైన) ఆనందం. మరి సగుణ బ్రహ్మం ఎవరు? అజ్ఞానం జీవాత్మకు ప్రపంచంతో పాటు, ఈశ్వరుడు అనే పాలకుణ్ణి చూపిస్తోంది. ఆ పాలకుడి దగ్గర "మాయ" అనే శక్తిని కూడా ఉందని చూపిస్తోంది. ఈ సగుణ బ్రహ్మాన్ని ఒక్కో జీవి (తన వాసనలను బట్టి) ఒక్కో లాగా చూస్తాడు. మాయ ఒకడికి శివుడిగా, మరొకడికి విష్ణువుగా, ఇంకొకడికి అమ్మవారిగా అనిపిస్తుంది. సగుణ బ్రహ్మానికి జీవాత్మ దృష్టిలో గుణాలు ఉంటాయి. నిజానికి - జీవాత్మ, ప్రపంచం, ఈశ్వరుడు అన్నీ ఒక్కటే - ప్రజ్ఞానం (బ్రహ్మం).

పంచభూతముల పంజరశుకమై
అలమట జెందిన నేనెవరో
ఏడు కొండలా ఎత్తున నిలిచి
బదులే పలుకని నీవెవరో!
ఇంతకు నాకు నీవెవరో!

చరమచరణంలో జీవుడు (కవి) తనకూ ఈశ్వరుడికీ ఉన్న సంబంధం ఏమిటి అని అడుగుతున్నాడు. వేదాంతానికి పునాది అయిన ఈ ప్రశ్నను ఇక్కడ లేవనెత్తాడు. ప్రతి ముముక్షువు (మోక్షాన్ని కాంక్షించేవాడు) "పంచభూతాలతో చేసిన పంజరం (దేహం) లో చిక్కుకున్న చిలుకను నేను, పంజరం నుండి పంజరానికి మారుతూ దుఃఖపడుతున్నాను, నాకు శాంతి కావాలి!" అనే అనుకుంటాడు. జీవుడు ఎంత వేదన పడుతున్నా, ఏడు కొండలపైన ఉన్న వేంకటేశ్వరుడు (ఈశ్వరుడు) బదులు చెప్పట్లేదు. ఎందుకంటే ఈశ్వరుడిని గుర్తించాలంటే బయట కాదు, లోపల వెతకాలి. నిజమైన భగవదుపదేశం మౌనంలోనే ఉంది. అందుకేనేమో ఇదే album లో మరొక పాటలో వేటూరి "మౌనమైన నీ జ్ఞానబోధలే కానక నివురున కలిసితిని" అన్నారు.
§ ఈ చరణంలో ఆఖరి రెండు పంక్తులకు చాలా అన్వయాలు గోచరించాయి. కొంచం సులభంగా అన్వయించుకోవాలి అంటే “సాక్షాత్తు ఆ ఈశ్వరుడే కృష్ణపరమాత్ముడై వేదాన్ని నాదంగా ఊదాడు. అప్పుడు ఆయనకు ఊపిరి అయ్యి, వేణువులో రాగజీవాన్ని పోసినది కూడా ఈ గాలే,” అని అనుకోవచ్చును. కానీ, “వేణువులు” అని బహువచనం ఉపయోగించడం, గతంలో వేటూరి "జీవన వేణువులూదగా" అని ప్రయోగించడం కారణంగా ఇలాగ అన్వయించాలి అనిపించింది.

ప్రాణానికి, మనసుకు అవినాభావ (ఒకటి లేక మరొకటి లేదు) సంబంధం  ఉంది అని శాస్త్రం. అందుకే యోగులు, సాధకులు ప్రాణాయామం చేసి ఊపిరిని అదుపులో పెట్టుకుని, తద్ద్వారా మనసును అదుపులో ఉంచుకుంటారు.

అందుకే దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరాచార్యులు "మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్త్వం" అన్నారు.

Wednesday, August 12, 2015

అన్నమయ్య: తెలుగుపదానికి జన్మదినం

1997 లో విడుదలైన అన్నమయ్య చిత్రం లోని వేటూరి రాసిన చక్కనైన పాటల సాహిత్యానికి కీరవాణి అనువైన బాణీలు సమకూర్చారు. అంతకు ముందే వచ్చిన సీతారామయ్య గారి మనవరాలు, చెంగల్వ పూదండ, మాతృదేవోభవ వంటి చిత్రాలలో వీరిద్దరి జోడీ తెలుగుదనానికి సత్కారం చేసింది. ఈ చిత్రం కూడా ఆ కోవకు చెందిందే.

పాట వ్రాసిన తరువాత బాణీ సమకూర్చితే ఆ కవి స్వేచ్ఛ పదాల ఒరవడిలో తెలుస్తుంది. అలాగే బాణీలో కూడా ఆ మార్దవం కనిపిస్తుంది. దీనికి చక్కని ఉదాహరణ "తెలుగు పదానికి జన్మదినం" అనే పాట. వేటూరి కవితాస్వేచ్ఛని తరచూ విమర్శించే నా సోదరుడు కూడా ఈ పాటను మెచ్చుకున్నాడు. అంతటి లయ ఉన్న పాట ఇది.

అన్నమయ్య నిజంగా నందకం అవతారమా, లక్కమాంబకు నిజంగా ఆలస్యంగా పిల్లలు పుట్టారా వంటి ప్రశ్నలు యోగులకు, చరిత్రకారులకు పనికొచ్చే ప్రశ్నలు. మనబోటి సామన్యప్రేక్షకులకు తగిన ప్రశ్న "ఈ సందర్భానికి, కథకు కవి న్యాయం చేశాడా?" అని. అది పరిశీలిద్దాము.

తెలుగు పదానికి జన్మదినం
ఇది జానపదానికి జ్ఞాన పథం
ఏడు స్వరాలే ఏడు కొండలై
వెలసిన కలియుగ విష్ణుపదం

అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం

పల్లవిలోనే వేటూరి అన్నమయ్యని బాగా ఉన్నయించాడు (elevate). అన్నమయ్య కాలానికి ముందే నన్నయ, తిక్కన వంటివారు తెలుగు భాషలో గొప్ప సాహిత్యాన్ని వ్రాసారు. ఐతే అవి సంస్కృతపదభూయిష్టమైన మహాకావ్యాలు - సామాన్యులకు అందుబాటులో లేనివి. అన్నమయ్య అచ్చ తెలుగుమాటలకు పెద్ద పీట వేస్తూ, ఛందస్సు కంటే లయకు ప్రాధాన్యతను ఇస్తూ సామన్యజనులకు అర్థమయ్యేటువంటి పాటలు వ్రాసారు. ఒక సారి అన్నమయ్య పాటలలో పల్లవులని చూస్తే ఈ విషయం తేటబడుతుంది: "చక్కని తల్లికి ఛాంగుభళా", "అదివో అల్లదివో", "అలరులు కురియగ", "చందమామ రావో జాబిల్లి రావో", "ఏమొకో చిగురుటధరమున ఏడనెడ కస్తూరి నిండెను", "నెయ్యములల్లో నేరేళ్ళో వొయ్యన ఊరెడి ఉవ్విళ్ళో" మొదలైన పల్లవులలో తెలుగుదనం తాండవిస్తుంది. 

అంతటి సున్నితమైన పల్లవులలోనే ఎంతో గంభీరమైన భక్తి, వైరాగ్య భావాలు దాగున్నాయి. ఉదాహరణకు ఈ చిత్రంలో వినిపించిన "అంతర్యామి అలసితి సొలసితి" అనే పాటలో "భారపు బగ్గాలు పాప పుణ్యములు", "మదిలో చింతలు మైలలు మణుగులు", "జనుల సంగముల జక్క రోగములు" వంటి పంక్తులు సాధకులు తమ మనసుల్లో పచ్చబొట్టు పొడిపించుకోవలసినటువంటివి. అలతి పదాలలో లోతైన జ్ఞానాన్ని వినిపించారు కాబట్టే ఆయన "జానపదానికి జ్ఞానపథాన్ని" చూపించారు. ఏడు కొండల పైన వేంకటేశ్వరుడిలాగ ఏడు స్వరాలను అన్నమయ్య పొదరిల్లుగా చేసుకుని మన మనసుల్లో స్థిరబడ్డారు. ఇంతటి లోతైన భావాన్ని నాలుగే నాలుగు చిన్న పంక్తులలో వేటూరి వెల్లడించారు.

అరిషడ్వర్గము తెగనరికే హరిఖడ్గమిది నందకము
బ్రహ్మలోకమున బ్రహ్మాభారతి నాదాశీశ్శులు పొందినదై
శివలోకమ్మున చిద్విలాసమున ఢమరుద్ధ్వనిలో గమకితమై
దివ్యసభలలో నవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ ఎగసి
నీరదమండల నారద తుంబుర మహతీ గానపు మహిమలు తెలిసి
శితహిమకంధర యతిరాజ్ సభలో తపఃఫలమ్ముగ తళుకుమని
తల్లిదనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాలయమ్ములో
ప్రవేశించి ఆ నందకము నందనానందకారకము

అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం

భగవద్గీత, 2వ అధ్యాయంలో కృష్ణపరమాత్ముడు అన్న ఈ మాటలు సాధకులకు మొదటి పాఠం.

విషయా వినివర్తన్తే నిరాహారస్య దేహినః |
రసవర్జం రసోऽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ||

దీనికి కొంచం వదలుగా తెనుగిస్తే "ఒక వస్తువుని విడిచిపెట్టాలని మనం దాన్ని దూరం చేస్తే, వస్తువు దూరమౌతుంది కానీ కోరిక మిగిలిపోతుంది. అదే ఆ వస్తువు కంటే ఉత్తమమైన వస్తువుని రుచి చూస్తే, అప్పుడు మునుపటి కోరిక కూడా పోతుంది" అని. అరిషడ్వర్గాలకు (కోరిక, కోపం, వలపు, కక్కూర్తి, పొగరు, ఓర్వలేనితనం) మూలం అహం (దేహాత్మబుద్ధి). ఈ చౌకబారు ఆలోచనలను దాటాలంటే ఉన్నతమైన భక్తి, వైరాగ్య భావలను రుచిచూడాలి. అన్నమయ్య పాటలు ఆ భావాలను, వాటిలో ఆనందాన్ని చెప్పేవి. అన్నమయ్యని విష్ణువు ఆయుధమైన నందకానికి అవతారంగా భావిస్తారు. అందుకని కవి అన్నమయ్యని "అరిషడ్వర్గాన్ని తెగనరికే హరి ఖడ్గమ్ము"  అన్నాడు. అరి, హరి ప్రాసతో పాటు తరువాత "షడ్", "ఖడ్" కు కూడా ప్రాస కలిపాడు. లయ చక్కగా కుదిరింది.

విష్ణులోకంలో మొదలైన నందకం తరువాత నెమ్మదిగా మిగతా లోకాలను దర్శించుకుని అక్కడ నాదాన్ని ఆకళించుకుని లక్కమాంబ గర్భంలోకి ప్రవేశించింది. బ్రహ్మలోకంలో బ్రహ్మ, సరస్వతీ దేవి వీణా నాదం; శివలోకంలో శివుడి ఢమరుక నాదం; ఇంద్రాది సభలలో అప్సరసల గాననృత్యాల లయ; మబ్బులలో విహరించే నారదుడు, ఆయన వీణైన మహతీ, తుంబురుడు - వారి భక్తినాదం అన్నీ చూసి హిమాలయాల మీదుగా వచ్చిందట. ఇక్కడ నాకు రెండు విషయాలు అనిపించాయి. నిజమో కాదో వేటూరికే ఎరుక. 1. అప్పటిదాకా నాదప్రధానమైన విషయాలు మాట్లాడుతూ "దివ్యసభలలో నవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ ఎగసి" అనడంలో "నందకం శృంగారరసాన్ని కూడా తెలుసుకుంది" అనే ధ్వని వినిపిస్తోంది. ఎంతైనా అన్నమయ్య శృంగార సంకీర్తనలకు పెట్టింది పేరు. 2. "శితహిమకంధర యతిరాజ్ సభలో తపఃఫలమ్ముగ తళుకుమని" అన్నారు. "శిత హిమ కంధర" అంటే తెల్లని హిమాలయాల దగ్గర అని; "యతిరాజ్ సభ" అంటే అక్కడ తపస్సు చేసుకుంటున్న మునుల చోటు అని నాకు అనిపించింది. వారి తపస్సుకు ఫలితంగా ఈ నందకం అవతారం ఎత్తింది అని కవి భావం అని అనిపిస్తోంది.

గర్భాశయం, గర్భాలయం - ఛందోబద్ధంగా రెండూ ఒకేలాగ ధ్వనిస్తున్నాయి (UUIU). గర్భాశయం అనేది వాడుకలో ఉన్న శబ్దం. వేటూరి గర్భాలయం అనే పదం వాడి అన్నమయ్యకీ, ఆయన తల్లికీ కూడా తగిన పదసత్కారం చేసారు అనిపించింది. చివరిగా ఈ చరణంలో చెప్పుకోవలసిన పదలయ: "ప్రవేశించెను ఆ నందకము, నందన ఆనంద కారకము". నందకము అంటే విష్ణువు ఆయుధము. నందనుడు అంటే కొడుకు. ఆనందము అంటే సంతోషం. ఆనందకము అంటే ఆనందము కలిగించేది. ఇక్కడ "నం, ద", "ఆ, నం, ద" అనే అక్షరాల వరుసలు రెండు మూడు సాల్రు వచ్చాయి. దీన్నే వృత్త్యనుప్రాసం అంటారు. ఒక అక్షరంతో వృత్త్యనుప్రాసం సామాన్యమే. రెండు మూడు అక్షరాలతో చెయ్యడం విశేషం. అలాగే, "ఆ నందకము" అంటే - "ఆ విష్ణువు ఆయుధం" అని. "ఆనందకము" అంటే ఆనందం కలిగించేది అని - ఈ రెండు అర్థాలు ఉండటం వలన శ్లేష ఐంది. ఒక చిన్న వాక్యంలో ఒక శబ్దాలంకారాన్ని, ఒక అర్థాలంకారాన్ని ఉపయోగించి వేటూరి తెలుగు వ్యాకరణం తెలిసినవారికి, తెలియని వారిని కూడా మెప్పించారు. భళా! 


పద్మావతియే పురుడు పోయగా
పద్మాసనుడే ఉసురు పోయగా
విష్ణుతేజమై నాదబీజమై 
ఆంధ్ర సాహితీ అమరకోశమై 
అవతరించెను అన్నమయ్య 
అసతో మా సద్గమయా

"ఉసురు" అంటే "ఊపిరి", "జీవము" అని అర్థం. బహుశా నందకం అచేతనమైనది కనుక అన్నమయ్యకు విష్ణువు జీవం పోసాడు అని కావి భావం అనిపిస్తోంది. "అమర కోశం" అంటే "ఎప్పటికీ నిలిచే నిధి" అని అర్థం. సంస్కృత భాషకు ఒక ప్రముఖమైన "నిఘంటువు" లేదా "థిసారస్ (thesaurus)" పేరు కూడా అమరకోశం. "ఆంధ్ర సాహితీ అమరకోశమై" అనడంలో "తెలుగు సాహిత్యంలో ఎప్పటికీ నిలిచే నిధి" అని, లేదా "తెలుగులో అమర కోశం" (తెలుగు పదాలకు ఆలవాలం/నిఘంటువు) అని రెండు ధ్వనులు వినిపిస్తున్నాయి. ఎలాగ చూసుకున్నా సబబైన మాట. 

"అవతరించెను అన్నమయ" కు యతి, అంత్యప్రాస కూడా కుదిరే విధంగా పవమాన మంత్రాలలో ఒకటైన "అసతో మా సద్గమయా" ను వాడటం ఈ పాటకు చాలా అందాన్ని తెచ్చింది. కొంచెం చాదస్తంగా చూసుకునేవారు " 'అసతో మా సద్గమయా' అంటే 'అసత్యం నుండి నన్ను సత్యం వైపు' నడిపించూ కదా. అన్నమయ్య పుట్టడానికి దానికీ సంబంధం ఏమిటి? " అని అడుగవచ్చును. దీన్ని రెండు విధాలుగా అన్వయించుకోవచ్చును అని నాకు అనిపించింది. 1. కవి అన్నమయ్యను స్వయంగా అడుగుతున్నాడు "నన్ను నీ పాటల ద్వారా అసత్యం  నుండి బ్రహ్మం (సత్) వైపు తీసుకువెళ్ళు" అని. 2. "అసతో మా సద్గమయ" అనే మంత్రానికి ప్రతిస్పందనగా విష్ణువు అన్నమయ్యను పుట్టించాడు అని కూడా అర్థం చేసుకోవచ్చును. నిజానికి కవి లయకు, లోతుకు ప్రాధాన్యతని ఇచ్చి ఇక్కడ విషయాన్ని అస్పష్టంగా విడిచాడు అనిపించింది. ఇది కొందరికి నచ్చకపోవచ్చును. కానీ నాకు నచ్చింది.

పాపడుగా నట్టింట పాకుతూ భాగవతము చేబట్టెనయా
హరినామమ్మును ఆలకించక అరముద్దలనే ముట్టడయా
తెలుగుభారతికి వెలుగు హారతై
ఎద లయలో పదకవితలు కలయ 
తాళ్ళపాకలో ఎదిగె అన్నమయ్య 
తమసో మా జ్యోతిర్గమయా

"అరముద్దలు" అనే పదం నాకు బాగా నచ్చింది. సామాన్యంగా ముద్ద కలిపి, గోటితో మధ్యలోకి త్రుంచి పిల్లలకు పెడతారు. కచ్చితంగా తెలియదు కానీ అందుకే దాన్ని గోరుముద్ద అంటారు అనుకుంటున్నాను. ఇక్కడ కవి అరముద్దలు అని కూడా అందుకే అంటున్నారు అని అర్థమైంది. సరే, "హరి" కి "అర" కి యతి యేనా, లేక ప్రాసయతి కూడా ఉందా అని చూసాను. నిఘంటువులో "అర" అంటే "అర్ధము, సగము" అని (అరగంట లో అర); "అఱ" అంటే "లోపలి" అని (అఱచేయి) ఉంది. సంస్కృతం ర కి తెలుగు ర కి ప్రాస కుదురుతుంది కానీ, సంస్కృతం ర కి తెలుగు ఱ కి కాదు. కవి ఎక్కడికక్కడ, ప్రాస, యతి, ప్రాసయతి చూసుకుంటూ వ్రాసాడనడానికి ఇది ఆధారం.

"తెలుగు భారతికి వెలుగు హారతి" చక్కనైన ప్రయోగం. భారతి అంటే "మాట, శబ్దం, సరస్వతీ" అని అర్థాలు ఉన్నాయి. తెలుగు పదాలకు హారతి పట్టినవాడు అన్నమయ్య. తెలుగు, వెలుగు; భారతి, హారతి - ఎంత చక్కగా ప్రాస కుదిరింది. తెలుగు పద కవితలను సృజింపజేస్తూ ఉంటే ఆయన ఎద లయలో అవి కలిసిపోయాయి. ఆ తరువాత తెలుగు వారి అందరి ఎద లయలో కూడా అవి కలిసిపోయాయి. అందుకే ఆయనని "ఆంధ్ర పద కవితా పితామహుడు" అన్నారు.

పాటను ముగిస్తూ వేటూరి "తాళ్ళపాకలో వెలసెనన్నమయ తమసోమా జ్యోతిర్గమయ" అంటూ మళ్ళీ ఒక పవమాన మంత్రాన్ని కలిపారు. ఈ సారి "తాళ్ళపాక" కు యతి గా "తమసో మా జ్యోతిర్గమయ" అన్నారు. మామూలు మనిషికి కూడా సాహిత్యాన్ని అందించే రసికుణ్ణి, భక్తుణ్ణి చేసిన అన్నమయ్య నిజంగా మనని అంధకారం నుండి  తేజస్సువైపుకు తీసుకెళ్ళారు.

ఈ పాటంతా ఎక్కడికక్కడ యతి, ప్రాస, ప్రాసయతులతో అందంగా వచ్చింది. దానికి కీరవాణి పూర్తిగా న్యాయం చేసాడు. తెలుగు చలన చిత్ర గీతాలలో ఇది కచ్చితంగా ఒక "classic".

Sunday, June 21, 2015

సియాటల్ లో మన్మథ నామ నూతన సంవత్సర యుగాది కవి సమ్మేళణం

2014 ఉగాదికి సియాటల్ లో జరిగిన కవి సమ్మేళణానికి మంచి ప్రతిస్పందన లభించింది. ఆ స్ఫూర్తితో ఈ సారి కూడా జరుపుదామనుకున్నాము. ఈ సారి శ్రీరామ నవమి, ఉగాది కలిపి జరపాలని "మన సంస్కృతి" సంస్థ నిర్ణయించింది. శ్రీ సీతారాముల కల్యాణం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగింది. కొంచం ఆలస్యం అవ్వడంతో కవి సమ్మేళణానికి సమయం లేకపోయింది. అయినప్పటికి ప్రశ్నలను, ప్రోత్సాహాన్ని అందించిన భైరవభట్ల కామేశ్వరరావు గారికి, కొత్తపాళి గారికి కృతజ్ఞులము. కవిసమ్మేళనానికి గానూ వ్రాసిన పద్యాలలో కొన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

సీతా రామునికిట్లొనర్చెదవె యిస్సీ ద్రోహ మిల్లాలవై!

ఇస్సీ అనే పదం మనకు ప్రస్తుతం వాడుకలో లేదు. ఇస్సీ అంటే "అయ్యో, అక్కట" అనే అర్థంలో వాడతారు(ట). దీన్ని చాలా అద్భుతంగా పూరించినవారు లంకా సూర్య రవీంద్ర.

నా త్రాణంబును, నాదు బ్రాణములు, నా దార్ఢ్యంబు శ్రీ రాముడే!
నా తండ్రిన్, నన జానకీతనయ నే దావాలకంపింపనే?
నీతిన్ దప్పక నీకు జేసినటి వాగ్ద్విత్వంబు జెల్లింప, నా
సీతారామునికిట్లొనర్చెదవె యిస్సీ ద్రోహ మిల్లాలవై!

సామాన్యంగా మనం సమస్యను "సీతా! రామునికి ఇలా ద్రోహం చేస్తావా?" అని చదువుతాము. సీతాదేవి రామునికి ద్రోహం ఎప్పుడు చేసిందా అనుకుంటాము. ఐతే పూరకులు దాన్ని "సీతారామునికి ఇలా ద్రోహం చేస్తావా?" అని అర్థం వచ్చేలాగా వ్రాసారు. పై పద్యంలో భావం: దశరథుడు కైకేయతో "నా మాటను నెపంగా పెట్టుకుని నా సర్వస్వమైన సీతారాముణ్ణి, సీతని అడవులకు పంపించి అతనికి ద్రోహం చేస్తావా?" అని అంటున్నాడట.

మారా మారాము మానుమా రామునితో

ఇది సులభమైనదే. మన్మథుడు రామునితో మారాం చేస్తున్నాడట. దీనికి పూరణ:

శారదమయ ఘనచంద్రిక
తారావళి తోడ గూడి తాపము బెంచన్,
భారమె, సీతా విరహము!
మారా! మారాము మాను మా రామునితో!

సీత అశోకవనంలో ఉన్నప్పుడు రాముడు విరహంతో బాధపడుతున్న విషయాన్ని ఆధారంగా చేసుకుని చెప్పారు బులుసు మల్లిక్. ఐతే వసంతంలో సీతారాములు వేఱ్వేఱు చోట్లలో ఉన్నారు అని ఆధారమేమిటి? కిష్కింధ కాండలో దీనికి ఆధారాలు ఉన్నాయి.

దత్తపది: బీర, వంగ, కంద, కాకర - ఉగాది పచ్చడి

ఇది పరిపరి విధాలుగా ఆలోచించాను. పెద్ద పెద్ద పద్యాలు వ్రాసి కిట్టించవచ్చునేమో కానీ, నాకు చిన్న పద్యం వ్రాస్తేనే శ్రోతలకు కాస్త ఆసక్తి ఉంటుంది అనిపించి చివరకు నన్ను ఆదరించిన కందాన్ని ఆశ్రయించాను.

మనసు కందనీక మనియేమి ఫలితంబు
బీరముండ కుండ పేలవంగ
మలగమంది చూడు మనుగాది పచ్చడి
రాతి రీతి కాక రసమయంగ

ఎప్పుడూ సుఖాన్ని (తీపిని) మాత్రమే కోఱుకుంటూ వెళ్ళకుండా కాస్త నాలుగు రుచులూ చూడమని ఉగాది పచ్చడి సందేశం అని భావం. ఉదాహరణకు చిన్నతనంలో చెయ్యాలనుకుని చెయ్యలేని పని ఇప్పుడూ చెయ్యడం పులుపు. వ్యాయామం చెయ్యడం చేదు. ఇలాగ ఆరు రుచులూ కలిస్తేనే జీవితం రసమయం అవుతుంది. లేకపోతే రాయి లాగ బ్రతుకుతున్నట్టే.


దత్తపది: మలైక, సన్నీ, కరీన, ప్రియాంక - మన్మథవత్సరానికి స్వాగతం

ఇది కొంచం కష్టమైనదే. అన్నీ అందమైన అమ్మాయిల పేర్లతో మన్మథ నామ సంవత్సరానికి స్వాగతం పలకాలి. కానీ ఎక్కడా అసభ్యత కనిపించకూడదు. ఇది పూరించడంలో బులుసు మల్లిక్ గారు మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించారు.

వచ్చెను మన్మథుండు నవవత్సరమై - విమలైకదృశ్యమై
విచ్చెను పద్మినుల్ గుబురు వెన్నెల వోలిన సన్నివేశమై
నచ్చిన శాంకరీ నగవు నాచిన మోహన పుష్పధన్వి తా
తెచ్చెను రాగదీపికల తేనియలొల్కెడి విష్ణుసూనుడున్

ఇందులో భావం: "మన్మథుడు ఒక సంవత్సరంగా వచ్చాడు. దానితో ఎంతో అందమైన దృశ్యం ఏర్పడింది. తామరపువ్వులు గుబురుగా ఏర్పడి వెన్నెల విరిసినట్టు ఉన్నాయి. ఆ పరమేశ్వరి తేనెలొలికే నవ్వును దోచుకుని మన్మథుడు సౌందర్యదీపికలను తీసుకుని వచ్చాడు." అని. అమ్మవారి నవ్వు మన్మథుడు దోచుకోవడం ఏమిటి అంటే సౌందర్యలహరిలో దీనికి సంకేతంగా ఒక శ్లోకం (86 వ ది) ఉంది.

దత్తపది: రంభ, మేనక, ఘృతాచి, మనోరమ - సీతారామ కల్యాణం

అప్సరసల పేర్లతో సీతారామ కల్యాణం వర్ణించమన్నారు. వీళ్ళందరూ వచ్చి సీతమ్మ అందాన్ని చూచి చిన్నబోయారనో, దంపతులను చూచి సంతోషించారనో పూరించవచ్చును. అప్పుడు పృచ్ఛకుని శ్రమను అవమానించినట్టు అవుతుంది. అందుకని మంచి స్ఫూర్తితో పూరించడం జరిగింది. ఘృతాచి ఒక అప్సరస. అదే పదానికి "ఆజ్యాన్ని (నెయ్యిని) హోమాగ్నిలో పోసే గరిటె" అని కూడా అర్థం ఉంది. అది ఆధారంగా దొరికింది. అందుకని ఇలాగ పూరించాను.

అనలం రేగె ఘృతాచి నుండి పడగా ఆజ్యంబు, ఆ రీతినే
ఇనవంశీయుని సొంపు మేనఁ కళలున్, హెచ్చయ్యె సీతమ్మఁవా 
కొనచూపుల్ పడగా మనోరమముగా, కోలాహలంబంతటా
కనువారందరి సంబరం భళి భళీ గానాలుఁ, కేరింతలై

(శ్రీ సీతారాముల కల్యాణంలో జరుగుతున్న హోమంలో) ఘృతాచి నుండి పడిన నెయ్యి తగిలి అగ్ని రేగింది. అలాగనే సీతమ్మ కొనచూపులు పడి శ్రీరాముడి ఒంటి వెలుగు కూడా హెచ్చైందిట. ఇది చూసినవారందరి కబుర్లు, కేరింతలూ చేరి అంతటా కోలాహలంగా ఉందిట.

భైరవభట్ల కామేశ్వర రావు, బులుసు మల్లిక్, లంకా సూర్య రవీంద్ర గార్లకు కృతజ్ఞలు.

Saturday, August 2, 2014

చిల్లుగొడుగు మేలు యిట్టి కొడుకు కన్న

పండితులు, పీఠాధిపతులు, మహర్షులు కూడా తల్లిని గౌరవిస్తారు. ఏమిటి చూసుకుని మనబోటిగాళ్ళం తల్లిదండ్రులను అగౌరవపరుస్తామో అనిపిస్తుంది. వాళ్ళు పట్టించుకోకపోయినా, మనం వాళ్ళని ఎన్ని సార్లు క్షమాపణం అడిగినా, మనసులో పశ్చాత్తాపం పోదు. అలాగని మళ్ళీ తప్పు చెయ్యకుండా కూడా ఉండము. అదే ఆలోచిస్తూ ఇవి వ్రాసాను.

నరక బాధకోర్చి మరణాన్ని దాటొచ్చి
పేగు తెంచి నాకు ప్రేమ పంచి
పెంచినాక నిన్ను వంచించినానొకొ
పంచనుండి కనక మంచి చెడుల

పాలుఁ గుడిపినావు పంటిగాటులకోర్చి
తగని వాడఁ నీదు త్యాగములకు
మెత్త గుండె ఒత్తు నెత్తురంతయి త్రాగి
తక్కువంచు తలచు రక్కసుడను

నెలల బాలుడపుడు మలమూత్రములఁ నీదు
వొంటి మీద విడిన చంటి పాప
పాలతోటి నీదు పాదములఁ గడుగక
పలుచనైన మాట పలికె నేడు

నడుమునొంచి నాకు నడక నేర్పిన నీవు
నడుము వొంగి కాస్త నలత చెంద
గడువు లేదటంచు కాళ్ళు పట్టనె, చిల్లు
గొడుగు మేలు యిట్టి కొడుకు కన్న

Wednesday, July 23, 2014

సరస్వతీ స్తుతి

ఈ రోజు ఏకాదశి అని కాసేపు కూర్చుని దైవచింతన చేద్దామని, శారదా దేవి గురించి కొన్ని పద్యాలు వ్రాసాను.పద్యరచన చేసి చాలా రోజులైంది. తప్పులుంటే చదువర్లు సరిచేయగలరు అని మనవి.

నిముషంబైనను చిక్కదే దినమునన్ నీ దివ్యరూపంబు, హే
విమలా! చిత్తమునందుఁ దల్చి రుచిగా గానంబుఁ గావించగన్
విమలాలై విలసిల్లు నీ గుణములన్, వేదాంత సందీపనీ!
క్షమియింపమ్మ, కృపాసముద్రహృదయా! కారుణ్య భావమ్మునన్

భ్రమలో చిక్కితి నీదు భిక్షయిన నా ప్రావిణ్యతన్ క్రొవ్వునన్
శ్రమతో పొందితినంచు తల్తునొకొ నా శౌర్యంబదే పాటిదో
గమనించన్ చననీదవిద్య, జననీ! జ్ఞానాగ్నితేజోమయీ!
తమముంద్రుంచవె మాయ వైదొలగి నీ ధామంబుఁ నేఁ జేరగన్

విలువేమున్నది వేల సంపదకు నే వేదాంతముందెల్వకన్
తెలివేమున్నది వేదశాస్త్రములలో దీనుల్ని చేపట్టకన్
బలమేమున్నది రాజస్నేహములలో వైరాగ్యమేతెంచకన్
మలగన్ కోర్కెలు నీ యనుజ్ఞనిడుమా మాయాత్మికా, యీశ్వరీ!

Saturday, July 5, 2014

మారిపీలికాట్టే మారిప్పోకు

ఈ మధ్యన ఆఫీసులో పని ఎక్కువై పాటలు వినే తీరిక లేకపోయింది. ఎప్పుడైనా కాస్త తీరికగా కూర్చుని పని చేస్తుంటే చెవులకు గరికిపాటి వారి భారతం వినిపిస్తున్నాను. అప్పుడప్పుడు మరీ వెలితిగా అనిపిస్తే అప్పుడు కాస్త ఇళయరాజా రసం పట్టిస్తున్నాను. అలాగ పట్టించి రసాలలో ఒకటి మలయాళం చిత్రం పుదియ తీరంగళ్ (కొత్త తీరాలు) లోని మారిపీలికాట్టే మారిప్పోకు అనే పాట. వినగానే నాకు చాలా నచ్చింది. ఇంత సున్నితమైన, శ్రావ్యమైన పాట విని చాలా రోజులైంది.


మలయాళంలో ఈ పాట భావం కానీ సందర్భం కానీ నాకు తెలియవు. రచయిత కైతప్రం దామోదరన్ నంబూద్రి, స్వరకర్త ఇళయరాజా అని మాత్రం తెలుసును. చిత్రంలో అన్ని పాటలూ బాగున్నా, ఈ పాట నన్ను బాగా ఆకట్టుకుంది. దీనిని తెనుగీకరించాలి అని సంకల్పించి ఒక గంటలో ఏది వ్రాయగలిగితే అది వ్రాసాను. అక్కడక్కడ తెలుగుకు అనుగుణంగా స్వరాలను మార్చాను.

భావం విషయానికి వస్తే. ఆఫీసు వ్యవహారాలతో హడావుడిలో ఉన్న కొన్ని రోజులు నిద్ర చెడింది. అదే సందర్భంగా తీసుకుని, కొంచం గాఢపరచి వ్రాసాను. అంటే నిరాశకు లోనైనా ఒక భగ్నప్రేమికుడు ఎలాగ ఆలోచిస్తాడో అలాగా వ్రాసాను.

వాలిపోయే పొద్దా ఆగిపోవా
ఆగిపోయి నాతో ఆడుకోవా
ఒంటరైన గుండెతో జావళీలు పాడవా
కంటిపాప నిండుగా రంగుతోట చూపవా
చీకట్లు కమ్మనీక!

పల్లవిలోని తోలిపలుకులను వేటూరి వ్రాసిన "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే" అనే జాతీయ పురస్కారం లభించిన పాట లోంచి యథాతథంగా తస్కరించాను. ఇది ఆయన పట్ల గౌరవంతో, ప్రేమతో చేసిన ప్రయోగంగా చదువర్లు గ్రహించి మన్నించాలి.

నాకు రోజు ఎంత భారంగా సాయంత్రం సంధ్యా సమయంలోని ఆకాశాన్ని చూస్తె ఉత్తేజం కలుగుతుంది. ఆకాశాన్ని "రంగుతోట" చేసేది సంధ్య (మలిపొద్దు). ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన వెంట వచ్చే వాటిల్లో ఆ సౌందర్యం ఒకటి.

పొద్దు వాలితే ఎందుకో ఎదకోత రేగునే
నిద్దురన్నదే చేరక కను ఎఱ్ఱబారునే
గుండె లోతులో వెలుతులే తెగ మండె కంటిలో వెలుతురై
చీకట్లాగిపోయే ఱెప్పల ముంగిట్లో
జోకొట్టే వాఱేరి చిక్కుల పాన్పుల్లో
వెన్నెలంటే వెగటొచ్చింది, తారలన్ని భారమయ్యె - ఏమైందో ఎందుకనో...

సాధారణంగా చీకటిని చెడ్డదిగా, వెలుతురిని మంచిదిగా వర్ణిస్తారు. కళ్ళు మూసుకున్నప్పుడు మనసు ఖాళీగా ఉంటె, అప్పుడు నిద్ర సులువుగా పడుతుంది. అదే మనసులో వెలితి ఉంటె, అది కళ్ళు మూసుకున్నా కళ్ళల్లో కదలాడుతూ ఉంటుంది. మధ్యాహ్నం సూర్యుడి కింది కళ్ళు మూసుకుని పడుకున్నా నిద్ర పట్టదు. అలాగే మనసులో అంతటి వెలితి మండుతూ ఉంటె కూడా నిద్ర పట్టదు. కమ్మిన చీకట్లన్నీ కంటి బయటే ఆగిపోతాయి. అలాంటి రోజుల్లో కిటికీ లోంచి వెన్నెల వచ్చినా కంటికి ఇంపుగా ఉండదు. చుక్కలన్నీ చిక్కుల్లాగా అనిపిస్తాయి. అందుకని ఇక్కడ నిద్రనిచ్చే చీకటిని మంచిదిగా, నిద్రపోనివ్వని వెలుతురిని చేద్దడిగా వర్ణించడం జరిగింది.

తెల్లవారితే కలవరం పొలికేక ధాటికే
చల్లబోయిన మది నరం ముసుగైన తీయదే
రోజు మారితే రోజనం, మది తీరు మారితే నవదినం
చింతల చీకటి మాపేసే సూరీడున్నాడో
దొంతర ఆశల మబ్బుల్లో దాక్కుని ఉన్నాడో
చెయ్యందించి చేదనిపించే జీవితమిచ్చే తీపిని పంచే వెలుగొచ్చేదింకెన్నడో...

ఉదయం మంచం మీద నుండి దిగేటప్పుడు మనసు ఉత్సాహంగా లేకపోతె మనం జీవితంలో ఏదో పొరబాటు చేస్తున్నాము అని సూచన. ఆశ, స్ఫూర్తి, ధైర్యం, తెగువ లేని మనిషి తోలి అడుగు తనకే కాక, భూమికి కూడా భారం అవుతుంది. కలతలో ఉన్న మనిషికి పొద్దున్న లేవగానే అదే గుర్తొస్తుంది. గుర్తు రాగానే మనసులో ఒక పెద్ద గొయ్య త్రవ్వినట్టు అనిపించి, లోటు తెలుస్తుంది. ఇంకాఁ మనసు నిద్ర లేవడానికి ఇష్టపడదు.

తేదీ మారితే కొత్త తేదీ వస్తుంది. అంత మాత్రాన దాన్ని "కొత్త రోజు" అనడానికి లేదు. కొత్త అంటే "వాడనిది, వాడిపోనిది" అని కదా అర్థం. ఎప్పుడైతే మనసు నడత మారి సరికొత్త పుంతలు తోక్కుతుందో అప్పుడు "నవ దినం", ఒక కొత్త పర్వం మొదలైంది అని అంటాము. కవితా స్వేచ్ఛను అనుసరించి, ఈ భావాన్నే "రోజు మారితే రాజనం" అని కుదించాను. వేటూరి అభిమానులు కోపగించుకోరు కానీ అన్యులకు ఇది న్యూనంగా అనిపించవచ్చును.

ఏదో ఒక సమయంలో మనిషికి తానున్న వెలితిలోంచి బయట పడే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనను నిచ్చెన చేసుకుని మనసులోని గోయ్యలోంచి బయటకు పాకుతాడు. అలాంటి ఆలోచన ఆశలోంచే కలుగుతుంది కానీ నిరాశలోంచి కాదు. అది కలిగాక అప్పటి వరకూ చేదుగా అనిపించిన జీవితం ఉన్నట్టుండి తీయగా అనిపిస్తుంది. ఆ కొత్త రోజు కోసం ప్రతి ఒక్కరూ వేచి ఉండాలి. ఆ ఆలోచనే నిజమైన వేడ్మి, కాంతి కలిగిన సూర్యుడు.

Wednesday, January 29, 2014

వేటూరి పుట్టినరోజు


ఈ రోజు వేటూరి పుట్టినరోజు. దాదాపు మూడేళ్ళ క్రితం ఆయన్ని తలుచుకుంటూ ఒక పాట వ్రాసాను. అందులో నాకు సంతృప్తిని ఇచ్చిన పంక్తి ఒకటుంది: మనసుపొరల బొంత కింద నీ పాట, దాగి ఆడుతోంది దోబూచులాట. ఇది వేటూరి గురించి నా అభిప్రాయాన్ని సూక్ష్మంగా చెప్తుంది. మనసు ఒక డబ్బా కాదు: ఒక డొల్ల, లోపల సరుకు ఉండటానికి. దానికి పొరలు ఉంటాయి. సరదాలు, కోఱికలు, పద్ధతులు, ఇష్టాలు, అనుబంధాలు, ఇలా. వేటూరి పాట ఈ పొరలన్నిటినీ దాటి ఆత్మీయమైంది - అంటే నా వ్యక్తిత్వంలో ఒక భాగమైపోయింది. వేటూరి పాట ప్రతి రోజూ పనిఁగట్టుకుని వినకపోవచ్చును. కానీ, ఏదో పని చేస్తున్నప్పుడు ఒక మారు స్ఫురిస్తుంది. అది ఎప్పుడు స్ఫురిస్తుందో తెలియదు, కానీ స్ఫురించినప్పుడు పులకరం కలుగుతుంది. ఒక్కో రోజు ఒక్కో రూపంలో వస్తుంది, ఒక్కో రసం ఒలికిస్తుంది. అదొక దోబూచులాట.

జీవితంలో ఒక్క సారి కూడా కలవని మనిషి, ఎటువంటి ఋణం లేని మనిషి, అన్నో ఇన్నో లోపాలు ఉన్న మనిషి, ఒక రకంగా చెప్పాలంటే "ఎవరో". అలాంటిది తెలుగుని ప్రేమించే ప్రతివాడికీ ఆయన అంటే కొద్దో గొప్పో గౌరవం ఉంది. ఎందుకు? ఆయన పాటల్లో ఏదో ఒకటి మహబాగా నచ్చేసి "ఈ పాట ఈయన తప్పితే ఎవరూ ఇంత బాగా వ్రాసి ఉండరేమో!" అని అనిపించి ఉంటుంది. ఒక ఎనిమిదేళ్ళ అతితెలివి కుఱ్ఱాడు homework చేస్తూ లెక్కకు సమాధానం చూసి గుణించాలో, భాగించాలో అంచనా వేసి సమాధానం వ్రాస్తాడు. అలాగే ఒక్కో సారి వేటూరి భావం అనేసుకుని పదాలను ఇరికించడం, పదాలను అనేసుకుని భావాన్ని కిట్టించడం చేసారు. ఒక్కో రోజు అసలు తెలివి ఖర్చు ఎందుకు అనుకుని వేఱే section లో వాడి దగ్గర home-work copy కొట్టి వ్రాసేస్తాడు. అలాగే వేటూరి కొన్ని అన్యభాషాగీతాలను యథాతథంగా అనువ"దించారు". పన్నెండేళ్ళొచ్చాక Social Studies పరీక్ష అంటే ఏదో ఒక లాగ రెండు pages జవాబు వ్రాయాలి అని అర్థం పర్థం లేని వాక్యాలను వ్రాసేస్తూ ఉంటాడు. కొన్ని వేటూరి పాటలలో భావం కాదు అసలు అర్థమే లేదేమో అనిపిస్తుంది. పదిహేను ఏళ్ళు వచ్చినా తన కంటే ఐదేళ్ళు చిన్నవాడైన తమ్ముడూ, వాడి స్నేహితులతో cricket ఆడుతూ ఉంటాడు. వేటూరికి కవిత్వపరిపక్వత ఉన్నా చిలిపి పాటలూ, సరదా పాటలూ వ్రాసారు. ఇరవై ఏళ్ళొచ్చాక ఏవో రెండు వాక్యాల చివరన ప్రాస కలిపేసి "నేను కవిని" అంటూ ఉంటాడు. వేటూరి కేవలం ప్రాస కోసం వ్రాసిన పంక్తులు ఎన్నో ఉన్నాయి. పాతికేళ్ళకు పక్కన పెళ్ళం ఉండగా ఎదుట పడిన అమ్మాయిని చూసి ఒక్క సారైనా "అబ్బా" అనుకుంటాడు. వేటూరి భావాన్ని పక్కన పడేసి సుస్పష్టంగా వ్రాసిన బూతుపాటలూ ఉన్నాయి.

ఈ దశలన్నీ దాదాపు అందరూ తమ తమ జీవితాలలో చూసినవే. మనకు అత్యంత సన్నిహితుడు ఇవన్నీ చేసి ఉండవచ్చును. అయినా మనకు అవసరమైనప్పుడు లోతైన అనుభవంతో ఒక సలహా ఇచ్చినా, బాధలో ఉన్నప్పుడు ఓదార్చే ఒక మాట మాట్లాడినా, మన మనసులో ఉన్నప్పటికీ మాటల్లో చెప్పలేని భావాన్ని పసిగట్టి తన మాటల్లో అందంగా చెప్పినా, మనం ఆరాధించే విషయాన్ని తనూ అంతే ఇష్టంతో ఆరాధించినా, ఆ వ్యక్తి మనకు సన్నిహితుడే. అదే విధంగా వేటూరి తెలుగువారికి సన్నిహితులయ్యారు. ఆయన వ్రాసిన ప్రతి పాటా ఆణిముత్యం కాకపోవచ్చును. కానీ కొన్ని పాటలు వెల కట్టలేని అమరమైన నేస్తాలు. ఆ పాటలు తెలుగు సంస్కృతి ఉన్నంత వరకూ ప్రచారంలో ఉండాలని, ఆయన మళ్ళీ తెలుగువాడిగా పుట్టి గొప్ప సాహిత్యాన్ని అందించాలనీ కోఱుకుంటున్నాను.