Sunday, April 12, 2020

"అల వైకుంఠపురములో" దుర్భరం

అసలు ఈ మధ్యన బ్లాగులో రాయడం మానేశాను. ఎప్పుడో పండగకో పబ్బానికో రాస్తున్నాను. అలాంటిది ఉన్నట్టుండి ఒక పోస్టు రాయాలని అనిపించింది. సాధారణంగా అభిమానంతో రాసే నేను ఈ రోజు చిరాకు, విరక్తితో రాస్తున్నాను. ఎంతోమంది బాగుందని చెప్పారని ఈ రోజు Netflix కి signup చేసి మరీ "అల వైకుంఠపురములో" అనే ఒక సినిమా చూస్తే కలిగిన భావాలవి.

ఈ మధ్యన నేను తెలుగు సినిమాలు చూడటమే తగ్గింది. చూస్తే పాత సినిమాలు, లేకపోతే indie సినిమాలు చూస్తున్నాను. మంచి సినిమాలు వస్తున్నాయి. ఉదాహరణలు వెతికితే వెంటనే పెళ్ళి చూపులు, బ్రోచేవారెవరురా, మత్తు వదలరా గుర్తొస్తున్నాయి. ఇలాంటి సినిమాలు బాగానే ఆడుతున్నాయి కూడా. ఐనా కూడా కొంతమంది దర్శకులు నవ్యత లేని సినిమాలు తీయాలని ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు.

ఇక సినిమా  గురించి మాట్లాడుకుందాం. నాకు అన్నిటికంటే ముందు చిరాకు వచ్చిన విషయం - బావామరదళ్ళ ప్రణయం. దక్షిణభారతదేశంలో ఇది ఒకప్పుడు మామూలై ఉండవచ్చును. కానీ ఇప్పుడు మనం కూడా సైన్సు చదువుకుంటున్నాము కదా. First cousins పెళ్ళి చేసుకుంటే వారికి పుట్టే పిల్లలకు అనారోగ్యం కలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. 1980 లోనే మా నాన్న గారిని ఎంతో మంది మరదలినో, మేనగోడలినో పెళ్ళి చేసుకోమంటే పిల్లలు బాగుండాలని వద్దు అన్నారు. ఇది 2020. మనకీ అంతో ఇంతో లోకజ్ఞానం వచ్చింది కదా. ఇకనైనా మనం first cousins పెళ్ళిళ్ళని ఆపమని సందేశం ఇవ్వచ్చునా? పోనీ, సినిమాల్లో సందేశాలెందుకు అంటారా, కనీసం అది glorify చెయ్యకుండా ఉండవచ్చునా? ఈ సినిమాలో రాజ్, తన మరదలైన నందినిని ఇష్టపడతాడు. వేరే దేశాల వరకు ఎందుకు? మన దేశంలోనే ఉత్తరాదిలో దీన్ని అసహ్యంగా భావిస్తారు. బావామరదళ్ళు కూడా అన్నాచెల్లెళ్ళ లాంటివారే అని వారి అభిప్రాయం. ఈ విషయంలో త్రివిక్రం repeat offender. ఇంతకు ముందు తీసిన "అత్తారింటికి దారేది" లో కూడా ఇదే చేసాడు.

రెండవ విషయం ఆడవాళ్ళ పట్ల రచయిత చులకన భావం. ఈ సినిమాలో పదే పదే హీరొయిన్ కాళ్ళను చూపించడం చిరాకు అనిపించింది. పాట మొదట రాసి తరువాత సినిమా తీసారో, సినిమా రాసిన తరువాత పాట రాసారో తెలియదు. కానీ, చివరికి అశ్లీలంగా అనిపించింది. ఎవరైనా అలాగ office లో ఎవరితోనైనా వ్యవహరిస్తే ఉద్యోగం పీకేస్తారు. ఇక్కడ మన "హీరో" ఏకంగా CEOని అలాగ చూసి వ్యాఖ్యానం చేసినా ఆవిడ ఏమీ అనుకోదు. ఇంతకు ముందు అతారింటికి దారేది సినిమాలో కూడా శమాంతా మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు "హీరో" ఆమెకు ఏదో కథ చెప్పి, మీద చేతులు వేసి హడావుడి చెయ్యడం కూడా నాకు లైంగిక వేధింపు నేరంలాగా అనిపించింది. నవ్వు రాలేదు.

మూడో విషయం అర్థం పర్థం లేని పాత్రలు. అసలు సునీల్ పాత్ర ఎందుకు ఉంది, ఏం చేస్తోంది? రాజేంద్ర ప్రసాద్ సినిమాలో ఎందుకు ఉన్నాడు? ఎంతో నైపుణ్యం ఉన్న నటులను పెద్ద పాత్రలలో పెట్టకుండా, ఈ చిల్లర పాత్రలలో ఎందుకు పెట్టినట్టు? ఎవరైనా HR లో పని చేసేవాళ్ళు పొద్దున్నే బైకుల మీద తిరుగుతూ అమ్మాయిల చున్నీలు లాగుతారా? అలాంటి వెధవని ఒక CEO ఐన అమ్మాయి HR లో ఉంచుతుందా? బ్రహ్మాజీ వెనకనుండే రౌడీలు తెల్లవాళ్ళెలాగ అయ్యారు? రష్యా నుంచి వచ్చి రౌడీలుగా హైదరాబాద్లో స్థిరబడ్డారా? బ్రోచేవారెవరురా చిత్రంలో నిండుగా బట్టలు కప్పుకుని, స్వతంత్రనిర్ణ్యయాలు తీసుకోగల ఒక మంచి పాత్ర చేసిన నటి (నివేద) ఈ సినిమాలో సగం సగం బట్టలు వేసుకుని ఎవరో వచ్చి "నువ్వు పెద్ద అందగత్తెవు కాదు కానీ sexy గా ఉన్నావు" అంటే ఎందుకు మురిసిపోయింది. పెద్ద కంపెనీ పెట్టి CEO అయినావిడ ముక్కూ మొహం తెలియని వాడితో పెళ్ళికి ఎలాగ ఒప్పుకుందీ? ఆ పెళ్ళి ఆపెయ్యకుండా వేరేవాడిని తల్లిదండ్రుల ఎదురుగుండా ఎందుకు కావలించుకుంటోంది? ఇది మోసం కాదా? ఇవా ఆడవాళ్ళ పాత్రలు రాసే విధానం. రాజ్ నందినిని ఇష్టపడితే board meeting సీన్ లో అమూల్యని చూసి ఎందుకు ఊగుతున్నాడు? వాడు కొంచం నెమ్మెదస్తుడు అని చెప్పారు కానీ, వాడికి ఎవరు ఇష్టమో కూడా తేల్చుకోలేని శుంఠా?

నాలుగో విషయం అర్థం పర్థం లేని కథనం. (1) ఒక పెద్ద ఆఫీసులో ఒకటే lift ఉందా? దాన్ని ఆపడం ఎలాగో పల్లెటూరులో ఉండే ఒక తాతగారికి తెలిసిందా? Freight elevator ఏమైంది? ఆ టైంలో రామచంద్రకికి అప్పలనాయుడుకి meeting ఉంది అని schedule లో ఉంటుంది, నాయుడు లోపలకు రావడం వెళ్ళడం పదిమందీ చూసి ఉంటారు. అయినా కేసు ఎందుకు పెట్టలేదు? (2) పాతికేళ్ళు కోమాలో ఉన్న ఆమె ఉన్నట్టుండి లేవడం, సరాసరి రామచంద్ర కొడుకుని కలవడం, వాల్మీకి చూసి గుర్తుపట్టడం, పూస గుచ్చినట్టు కథ చెప్పటం, అది వీళ్ళ తాత కూడా వినడం - ఇదంతా చిత్తు కాగితాల మీద రాసుకునే కథనం లాగా ఉంది. కోమా లోంచి వచ్చినావిడ "మా అమ్మ ఏది? నాన్న ఏడి? మొగుడేడి? పిల్లలేరీ?" - ఇవేమీ అడగలేదు? corridor లో ఉన్న ఆమె బంటుతో మాట్లాడుతుంటే curtain ఎక్కడ నుంచి వచ్చింది? (3) ఎంత సరదాగా ఉన్నా board meeting లో పాటలు పెట్టి dance చేసేవాడెవడైనా ఉంటాడా? అలాగ చేస్తే share value ఏమౌతుంది? అసలు ఆ సీనే నాకు అర్థం కాలేదు. (4) ఏ తల్లి ఐనా తన కొడుకు ఎదురుగుండా ఇంకోడితో "You are better than my son" అంటుందా? కన్నకొడుకుని బయటకు గెంటి వాడికి సగం ఆస్తి రాసి ఇస్తుందా? వాడు helicopter ఎక్కుతుంటే కుటుంబమంతా వచ్చి చప్పట్లు కొడుతుందా? (5) ఉన్నట్టుండి ఆ రాజ్ వెళ్ళి వాల్మీకి ఇంట్లో ఉండటం ఏమిటో, ఆ ఇంటి ఇల్లాలి ఎదురుగుండా "మందు కొడతాను" అనడం ఏమిటో, ఎవరో బేవార్స్ గాళ్ళను ఇంటికి పిలవడం ఏమిటో? పెళ్ళి కావలసిన కూతురున్న ఏ తల్లైనా ఇవన్నీ ఒప్పుకుంటుందా? ఏంటి ఈ పిచ్చి. (6) "హీరో" ఏది అనుకుంటే అది జరిగిపోతుంది. ఎక్కడో వాడు వెళ్ళి వందమంది గూండాలను కొడుతూ ఉంటే, ఇక్కడ రామచంద్ర, యశోదా మేనగోడలి కోసం సంతకాలు పెడతారు అని, రాజ్ మొత్తానికి కోపం తెచ్చుకుంటాడు అని ఎలాగ ఊహించాడో మహానుభావుడు. ఇంటిల్లిపాది చూస్తుండగా రామచంద్ర ఎవరో ఒక అమ్మాయితో అక్రమసంబంధం పెట్టుకున్నాడు అని చెప్పడం ఏమి ఔచిత్యమో నాకు అర్థం కాలేదు.

ఐదో విషయం అర్థం పర్థం లేని ఫైట్లు. 2020 లో ఇంకా తెలుగు హీరోలు భౌతికశాస్త్రాన్ని వెక్కిరిస్తూ ఫైట్లు చేస్తున్నారు. కొన్ని కొన్ని సీన్లు చూస్తే ఇది కార్టూనా అనిపించింది. మనిషి భూమి మీద పడి స్ప్రింగులు ఉన్నట్టు ఎలాగ లేస్తాడు? దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 1980లలో ఫైట్లు మరీ రివాజుగా ఉన్నాయి అని సినిమాల్లో దర్శకులు ఏదో ఒక gimmick పెడుతూ ఉండేవారు. football నేల మీద పడకుండా రౌడీలని కొట్టడం, ఆయుధం వాడకుండా కొట్టడం (స్టేట్ రౌడీ) చూసను. 2020 లో చున్నీ తడిపారెయ్యడం ఒక ఫైటుగా చూస్తాను అని ఊహించలేదు.

నేనూ ఒక రచయితనే. నా శక్తి కొలది మంచివో, చెడ్డవోపద్యాలూ, పాటలూ, కథలూ రాస్తాను. వాటిని ఎవరైనా విమర్శిస్తే బాధ కలుగుతుంది. అందుకని వీలైనంతవరకు వ్యక్తులను కాక వారి పనులను మాత్రమే ప్రయోజనాత్మకంగా విమర్శించే ప్రయత్నం చేస్తాను. కానీ, ఒక్కో సారి మనసు గడి తప్పి ఇలాగ రాయాలనిపిస్తుంది. ఈ సినిమా రచయిత, దర్శకుడు ఐన త్రివిక్రం ని మాటలమాంత్రికుడని ఎందుకు అంటారో నాకు ఎప్పుడూ అర్థం కాలేదు. పేరు, బలగం, ప్రజాభిమానం ఉన్న నటులు కూడా మంచి పాత్రలు చెయ్యగలరు అని ఎప్పటినుంచో ఋజువులు ఉన్నాయి. ఇలాంటి అత్తెసరు కథలు, కథనాలు ఎందుకు ఇష్టపడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. ప్రపంచమంతా ముందుముందుకీ పోతుంటే, మన తెలుగు సినిమా అగ్రవర్గం మాత్రం వెనక్కి వెళ్తోంది. వాళ్ళకే గురూజీ అనీ, intelligent directors అనీ, మాటల మాంత్రీకులని బిరుదులు ఇచ్చుకుంటున్నాము అంటే నాకు ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లేదు.

ఈ సినిమా మొత్తానికి పాటలు; జయరాం, మురళీ శర్మల నటన నచ్చాయి. ఈ సినిమా తీసినవారికి, బాగుందని నాతో అన్నవారికి శతకోటి నమస్కారాలు. 

8 comments:

Krishna Mohan said...

మీ ప్రతీ అభిప్రాయంతోటీ ఏకీభవిస్తున్నాను 🙏
బాధ అనవసరం.
అది అంతే.
మీరు ఏమి అడిగినా సరే, ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టి అనే ఒకే ఒక కారణంతో కొట్టిపారేయగల అపర మాంత్రికులం మేము.

Anonymous said...

Exactly! I agree with each and every word. You spoke my mind.

బుచికి said...

Best review of the worst movie. ఖలేజా సినిమా లో కూడా అనుష్క పాత్రను అవమానకరం గా చూపించాడు త్రివిక్రమ్. అజ్ఞాతవాసి, అత్తారింటికి దారేది కూడా పనికిమాలిన సినిమాలు. హీరో తోటినటుల చెంపలు పగల గొట్టడం insult చేయడం, ఆఫీసుల్లో ఉద్యోగులను bafoon చేసి పాటలు పాడటం. ఏమి దర్శకత్వం ఇది. తమన్ సంగీతం పాటలు బాగున్నాయి.

Shiva Danthala said...

చాలా మంచి review ఇచ్చారండి.
అసలు ఎందుకు తీస్తారో అర్ధంపర్థం లేని సినిమాలు..
వీళ్ళలాంటి వాళ్లే "చదవకముందు కాకరకాయ్ చదివిన తర్వాత కీకరకాయ్" అన్నారట..

Bhãskar Rãmarãju said...

*నీ కల్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కల్లు* అని ఒక కవి ప్రేమావేశాన్ని దగ్గరుండి మరూ ఖూనీ చేయించిన దర్శకునిదా తప్పు లేక దాన్ని ఖూనీచేస్తుంటే కిమ్మనకుండా ఉన్న నిర్మాతదా తప్పు.
ళ అని పలకలేని ఓ ఏడుపుగొట్టోడిచేత పాడించే దిక్కులేని స్థితికి జారుకున్న తెలుగు సినిమాని చూసి బాధపడే స్థాయిలోంచి జాలిపడేస్థాయికి వచ్చా నేనైతే

లవ్‌గురు said...

మీరు మరీ బాధపడిపోతున్నారేమో మాష్టారూ, ఒక్కోక్కరు ఒక్కో పాత్రను ఒక్కోలా చూపిస్తారు. స్త్రీ పాత్రను నీచంగా చూపిస్తున్నారు అని మనం ఫీలవ్వడమే .. బహుషా ఈ ఏ ఫెమినిస్టుల రచన యొక్క ఇంఫ్లూయన్సో అయి ఉంటుంది.

ఆడ పాత్రలు అనగానే మహోన్నత పాత్రలుగా, మగ పాత్రలన్నీ విలనిజములో కూడుకున్న పాత్రలుగా సృష్టించడం, ఫైనలుగా ఒక హీరో " అన్ని గుణాలూ, పర్ఫెక్టుగా ఉండి, పైలోకములో ఉన్న ఫెమినిష్టమ్మలందరూ.. బ్రహ్మతో పోట్లాడి, అన్ని క్వాలిటీలు కరక్టుగా దగ్గరుండి పెట్టి పంపించినట్టు" ఒక క్యారక్టరును ప్రవేశ పెట్టి, వాడిని హీరో అనిపించేసి .. మిగిలిన మగవాళ్ళందరికీ "హితబోధలు", మగ జన్మ అంటే ... "ఆడావారిని గొప్ప తనాన్ని గుర్తించడం" కోసం మాత్రమే పుట్టినట్టు చూపించేసే సినిమాలు, కథలూ చాలానే ఉన్నాయి.

బహుషా ఆ "హీరో"లు చెప్పిన ( ఫెమినిష్టమ్మలు చెప్పించిన) నీతి వాఖ్యాలు మనకు శిరోధార్యం అవడం వల్ల, మరే రకమైన చిత్రీకరణా మనకు నచ్చడం లేదేమో ?

అలా కాదు అంటారా ...

సినిమా లాజిక్కు ఏమిటంటే .. బయట చేస్తే సెక్సువల్ హరాస్‌మెంట్ అయ్యే చాలా పనులు, సినిమాల్లో హీరో హీరోయిన్లు చేయడం చాలా మంది రొమాంటిగ్గా ఫీలవుతారు. అప్పట్లో వచ్చిన షారుఖ్ ఖాన్ "ఢర్" సినిమా మొదలుకొని, కొంత కాలం క్రితం వరకూ వచ్చిన సైకో "ఆర్య, ఆర్య-2" సినిమాల వరకూ ఇదే నిజం. వాటిని చూసినప్పుడు సగటు ప్రేక్షకుడిలోని ఒక రకమైన " ఫాంటసీని" సినిమాలో తీర్చాడు అనుకుని వదిలేయడం బెటరని నా ఫీలింగ్. ఎందుకంటే, సినిమాల్లో 90% శాతం, మనలోని ఫాంటసీలకు, కోరికలకూ ప్రతిరూపాలే ! పైన చెప్పిన ఫెమిన్ష్టమ్మల కథలు, సినిమాలతో సహా !

నాకు తెలిసి మన తెలుగు సినిమాలకు ముందు, ఇది వరకూ WWE, WWF రెజిలింగ్ వచ్చేప్పుడు వేసినట్టు, "ఈ స్టంట్లన్నీ నిపుణుల పర్యవేక్షణలో చేస్తున్నవి, ప్లీజ్ డొంట్ ట్రై దిస్ అట్ హోం" అని దిస్క్లైమర్ వేసి చెబితే సరిగ్గా ఉంటుందేమో.. లేకపోతే, ప్రేక్షకుడు ఆ సినిమాలు ఎందుకో అర్థం చేసుకోగలిగితే అవి కూడా అవసరం లేదు. అదో ఎంటర్‌టైనరూ, చూసొచ్చేయాలి అనుకుంటాడు.

లవ్‌గురు said...

నా ఉద్దేశ్యం ఏమిటీ అంటే, మనం ఆడవాల్ల మనోభావాల విషయమై, ఆడవారికంటే ఎక్కువ సున్నితంగా ఆలోచించేసి, వారు కూడా విసుక్కునేలా తయారయ్యాం అని ..

ఇంత సున్నితత్వం మేమే ప్రదర్శించం, మీరెందుకు బాబూ ఓవర్ యాక్షన్లు చేస్తారు అని ఆడవారు ఎన్ని సార్లు విసుక్కున్నారో, లెక్కలేదు.. ప్రతీ " అంతర్జాతీయ స్త్రీల దినోత్సవం" రోజున మగవారు చేసే, రాసే అతికి.. బోలెడు మంది ఆడవాళ్ళూ.. "ఉస్షో, వీళ్ళూ, వీళ్ళ ఆదర్శాలూ ..." అనుకోకుండా ఉండలేక పోతున్నారంటే అతిశయోక్తి కాదు.

బహుషా మనకు త్రివిక్రం కాదు, నాకు నచ్చినట్టు నేను తీస్తా అనే రాం గోపాల్ వర్మే కరక్టేమో అనిపిస్తుంది కొన్ని సార్లు. పచ్చి బూతు సినిమా తీసి, ఆడవారు గొప్పవారు, వారు మాత్రమే మగవారిని తమ అందాలతో ఈ విధంగా కట్టిపడేయగలరు, వారికే ఆశక్తి ఉంది, ఆ శక్తిని నేను పూజిస్తున్నాను అనేయగలడు .. మహానుభావుడు.

Sandeep P said...

@Bhaskar Ramaraju - నిజమే నండి. వరుడు సినిమాలో అల్లు అర్జున్ ఒక భగవద్గిత శ్లోకం చెప్తాడు ("యదా యదా హి"). నాకు భగవద్గిత చదివితే ఎంత వచ్చిన వైరాగ్యం కంటే తను ఆ శ్లోకం చెప్తే వచ్చిన బాధ ఎక్కువైపోయింది (https://youtu.be/TCScr9Eh16s?t=1068). తెలుగు భాష, చరిత్ర, సంస్కృతి పట్ల గౌరవం ఉన్న గుణశేఖర్ సినిమాలోనే, తెలుగు నటుడివలనే ఇలాగ జరిగిందంటే, ఇక అమెరికాలో పుట్టి పెరిగిన తమిళుడు సిద్ శ్రీరాం చేసిన నేరం ఎంత లేండి. తెలుగు సినిమాలకు ఉచ్చారణ వైరస్ ఎప్పుడో పట్టింది.