Monday, March 30, 2009

అమెరికా మీద సెటైర్లు

అమెరికా అనగానే మన తెలుగునాడులో చాలామంది తలుచుకునేది ఏమిటో మీకూ తెలిసే ఉంటుంది. ఐతే ఈ టపా శుభ్రంగా ఉంచటం  కోసం నేను విషయం చెప్పకుండా దాని మీద జోకులు మాత్రం చెప్తాను.

% మా దూరబ్బంధువు ఒకమ్మాయి అమెరికా లో ఉంటుంది. ఆమె ఇండియా వచ్చేటప్పుడు మా తాతయ్య కోసం ఏవో పెద్దపెద్ద గిఫ్టులు తీసుకొచ్చింది. మా తాతయ్య చాలా సంతోషించారు. "బాగున్నాయి, లోపల పెట్టు", అని చెప్పారు. అప్పుడు ఆమె, "తాతగారు, నేను మీ కోసం ఇన్ని తెచ్చాను. మరి నాకేమి ఇస్తారు?", అంది. వెంటనే మా తాతయ్య, "అమ్మ, నేను ఈనాడు, వార్తా, సాక్షి - మూడు వార్తాపత్రికలు తెప్పిస్తున్నాను. అవన్నీ నువ్వే వాడుకో...", అన్నారు.

% నా మిత్రుడు అమెరికా వెళ్తుంటే అడిగాను, "ఎందుకురా ఇప్పుడు అమెరికాకి వెళ్తున్నావు?", అన్నాడు. వెంటనే వ్యంగ్యం గా, "ఆ ఏముంది, కొంచం paperwork ఉంది. అది పూర్తీ చేసుకుని వద్దామని", అన్నాడు. ఆ పేపర్ వర్క్ ఏమిటో నాకు అర్థం కాలేదు.

% మా అన్నయ్య అమెరికా వెళ్లి వచ్చి విశేషాలు చెప్తూ అన్నాడు. "ఏమిటో రా, వీళ్ళు! బొత్తిగా శుచి,శుభ్రత లేవు. ఏదో చుట్టపు చూపుగా వచ్చి కూర్చున్నట్టు కూర్చుని లేచి వెళ్లిపోతుంటారు!", అని ఆ ఘట్టాన్ని వర్ణించాడు.

Wednesday, March 25, 2009

పిలాని టైమ్స్

చాలా రోజుల తరువాత పిలాని వెళ్లి అక్కడి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటే ఒక చిన్న తవిక పుట్టుకొచ్చింది.

ఈ గాలుల్లో నీ గానం విన్నాలే, ఈ దారుల్లో నీ గమనం కన్నాలే
అణువు అణువునా జ్ఞాపకాలు అవి అమృతాలుగా కురిసెనే
క్షణము క్షణమునూ గురతుచేసి నా కంట నీరైనాయే
ఎదుట నిలిచి నా గతము కొత్తగా నువ్వు ఎవరని అడిగేనే
అడుగు అడుగునా నాటి మమతలే నేడు కూడ ఎదురాయే

ఈ చిన్ని తవికకి ట్యూన్ ఏర్పరిచిన శ్రీకాంత్ కి కృతజ్ఞతలు :)

Tuesday, March 24, 2009

కిట్టు కథలు - ఆడజన్మ

"నాకిప్పుడు బట్టలు ఎందుకమ్మా? ఏమిటి ఈ చాదస్తం? ఐనా అనవసరంగా డబ్బు ఖర్చు చెయ్యమంటే నీ తరువాతే", అన్నాడు కిట్టు. "అదేమిటిరా నాన్న? పుట్టినరోజు కొత్త బట్టలు వేసుకోకపోతే ఎలాగ?", అంది అరుణ. "ఏమీ అక్కరలేదు. అయినా నీ చాదస్తం నా మీద రుద్దకు", అని వెళిపోయాడు కిట్టు.

అరుణకు తాపత్రయం ఆగలేదు. తను వెళ్లి బజారులో తన దగ్గరున్న డబ్బులేవో పెట్టి ఒక చొక్కా కొంది. అదేమిటో నిండుగా ఉండే చీర పట్టుమని ఐదు వందలు ఉండదు! ఈ పాంటులు, చొక్కాలు రెండు వేలు పెట్టినా మంచివి రావు. వెనక్కొచ్చేటప్పుడు ఆటో కోసం చూస్తుంటే ఒక మాట గుర్తుకొచ్చింది, "అయినా అనవసరంగా డబ్బు ఖర్చు చెయ్యమంటే నీ తరువాతే", అని కిట్టు అన్నది. వెంటనే మనసు గతంలో ఎక్కడికో వెళ్ళిపోయింది.

"అమ్మ, నేనూ నీతో కొట్టుకి వస్తాను", అని కిట్టు అన్నాడు. "వద్దు నాన్న. అది చాలా దూరం. నువ్వు నడవలేవు", అంది అరుణ. "నీతో వస్తే నాకు కావలసిన చాక్లెట్లు నేనే కొనుక్కోవచ్చు. నీకు తెలియదు", అన్నాడు కిట్టు. వాడికి తెలియదు పాపం బజారుకి వెళ్ళాలంటే ఐదు కిలోమీటర్లు నడవాలి అని. దారి మధ్యలోనే కాళ్ళు నొప్పెడుతున్నాయి అంటాడు. అప్పుడు వాళ్ళమ్మ ఎత్తుకుని వెళ్ళాలి. తనకు అంత ఓపిక లేదు. సరే, ఆటోలో వెళ్తే, మరి ఆ డబ్బులు ఎక్కడ ఆదా చెయ్యాలి? అరుణ క్రితం సంకురాత్తిరి నుండి ఒక జాకెట్ కుట్టించుకుందాం అనుకుంటోంది. కిట్టుకి పుట్టినరోజు బట్టల కోసం ప్రతిసారి అది వాయిదా వేస్తూ వచ్చింది. ఈ సారి ఇది.

ఈ ఆలోచనల మధ్యలోనే అరుణ ఇంటికి వచ్చేసింది. కిట్టు ఇప్పుడు software engineer. నెలకు ఆరు అంకెల జీతం. ప్రతి దానికి చికాకు పడుతూ ఉండటం అతనికి అలవాటు.

సాయంత్రం ఇంటికి వస్తూనే, "అమ్మ నేను Zurich వెళ్ళాలి", అన్నాడు. "అదేక్కడరా?", అంది అరుణ. "అమ్మ, Zurich తెలియదా? Switzerland లో ఉంది అమ్మా", అన్నాడు. "ఎన్నాళ్ళు ఉండాలి?", అంది. "ఒక నెలరోజులు", కిట్టు చెప్పాడు. "ఎందుకురా నాన్న అన్నాళ్ళు అక్కడ? నిన్ను చూడకుండా నేను ఉండలేనురా", అంది. "అమ్మ, అంత sentimental గా ఫీల్ అవ్వకు అమ్మ. ఈ వయసులోనే అన్నీ తిరిగి చూడాలి, బోలెడు డబ్బు సంపాదించుకోవాలి. ఇప్పుడు సెంటిమెంట్ పెట్టుకుంటే ఎలాగ? ఐనా నేను ఇక్కడ లేకుండా నువ్వు ఉండటం అలవాటు చేసుకోవాలి. రేపు నాకు H1B visa వచ్చింది అనుకో, అప్పుడు నేను వెళ్లి నీకు వీసా సంపాదించడానికి కనీసం మూడు నెలలు పడుతుంది.', అన్నాడు. కిట్టు చెప్పిన విషయాల్లో అరుణకి రెండే అర్థమయ్యాయి: "నేను ఇంకా దూరం వెళ్ళే అవకాశం ఉంది. నువ్వు నేను లేకుండా నీ పనులు చేసుకోవడం అలవాటు చేసుకో", అన్నవి. కిట్టు భోజనం చేసేసి ఏదో ఫోన్ మాట్లాడుతూ కంప్యూటర్ నొక్కుకుంటూ కూర్చున్నాడు.

అరుణకి నిద్దర పట్టట్లేదు. కిట్టు వేరే చోట ఉండాల్సి వస్తే ఎలాగ? వాడి బాగోగులు ఎవరు చూసుకుంటారు? పెళ్లి చేసుకొమ్మంటే చేసుకోడాయే. కెరీర్ కెరీర్ అంటాడు. అదేమిటో అరుణకు అర్థం కాదు. చిన్నప్పుడు స్కూల్ కి వెళ్తూ కారియర్ కారియర్ అన్నట్టు వినబడుతుంది. ఇంతలోనే మళ్ళీ మనసు గతాన్ని వెతుక్కుంటూ వెళ్ళింది.

"నాకిష్టమొచ్చినట్టు నేను ఉంటాను. నీకిష్టమైతే ఉండు లేకపోతె పో, మీ బాబు దగ్గరకి", అన్నాడు అరుణ భర్త. అతడు భార్యాద్వేషి. పెళ్లయినా ఎప్పటిలాగే ఫ్రెండ్స్ తో ఉండాలి, తనలో ఏ మాత్రం మార్పు రాకూడదు అని అతని నమ్మకం. అది అసాధ్యం, అధర్మం అని తెలియదు. చెప్తే వినడు. ఇప్పటికి ఎన్నో సార్లు అరుణని పుట్టింటికి పొమ్మన్నాడు. కానీ ఆమె కిట్టు కోసం ఆగిపోయింది. ఈసారి మాత్రం పట్టలేని దుఖం వచ్చింది. బంధువులందరి ముందూ తిట్టాడు. ఎంత ఆపుకుందామన్నా ఆగని కన్నీళ్లు. మనసులో ఏదో తెలియని అలజడి. సరే ఈ సారి తెగించింది. కిట్టు స్కూల్ నుండి వచ్చేలోపలే వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. బట్టలు సర్దుకుని పుట్టింటికి వెళ్ళింది.

కిట్టు ఇంటికి వచ్చాడు. ఇంట్లో అరుణ కనిపించలేదు. వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళాడు, "నాన్న, అమ్మ ఏది?", అన్నాడు. "అమ్మ తాతయ్య ఇంటికి వెల్లిందిరా.", తండ్రి చెప్పాడు. "నాతొ చెప్పకుండా ఎందుకు వెళ్ళింది?", కిట్టు అడిగాడు. "అర్జెంటు పని ఉంది వెళ్ళిందిరా", తండ్రి చెప్పాడు. "ఎప్పుడు వస్తుంది?", కిట్టు ఎదురుప్రశ్న. "ఇంకా ప్రశ్నలకి అంతు ఉండదా? వెళ్లి హోం వర్క్ చేసుకో వెధవా", తండ్రి చిరాకు పడ్డాడు. కిట్టు వంటింట్లోకి వెళ్లి చూసాడు. ఉప్మా ఉంది. అది తినేసి హోం వర్క్ చేసుకున్నాడు. రాత్రి వాళ్ల నాన్న ఎక్కడినుండో పార్సెల్ తెచ్చాడు. అదే కిట్టూ కూడా తిన్నాడు. మర్నాడు ఉదయం లేచి స్కూల్ కి రెడీ అయ్యాక "నాన్న, కాఫీ", అన్నాడు. "నీకు కాఫీ అలవాటు ఉందా?", అన్నాడు తండ్రి. "అవును నాన్న. నాకు కాఫీ, టిఫిన్ పెట్టి కారేజి ఇస్తే నేను స్కూల్ కి వెళ్తాను", కిట్టు అన్నాడు. "ఈ చిన్న వయసులో కాఫీ అలవాటేమిటి. ఇక్కడ పాలు ఉన్నాయి తాగు. ఈ పూట టిఫిన్ లేదు. మీ అమ్మ బిస్కట్లు ఎక్కడో పెట్టి ఉంటుంది , వెతుక్కుని తిను. నేను మీ లంచ్ టైం కి కారేజి తెచ్చి ఇస్తాను", అన్నాడు తండ్రి. biscuits వెతుక్కుంటూ కిట్టు ఒక సీసా పగలగోట్టేసాడు. వాళ్ల నాన్నకి కోపం వచ్చి తిట్టాడు. తను ఏడ్చుకుంటూ స్కూల్ కి వెళ్ళాడు.

ఇలాగ ఒక రెండు రోజులు సాగింది. ఇంతలొ తన పుట్టినరోజు వచ్చింది. అమ్మ వచ్చేస్తుంది అని కొండంత ఆశతో చూస్తున్నాడు. అయినా అమ్మ దగ్గరనుండి ఉలుకు పలుకు లేదు. వాళ్ళింట్లో ఫోన్ లేదు. పుట్టినరోజు అమ్మ తలంటు పోసేది. ఈ సారి షంపూనే. అయ్యాక దేవుడికి దణ్ణం పెట్టుకున్నాడు. వెళ్లి వాళ్ళ అమ్మ బట్టల్లో వెతికితే ఒక కొత్త చొక్కా కనిపించింది. దానికి పసుపుబొట్లు పెట్టి వేసుకున్నాడు. బరువైన గుండెతో ఒక పోస్ట్ కార్డు తీసుకుని రాయడం మొదలు పెట్టాడు.

"అమ్మ,

నేను బాగున్నాను. నువ్వు బాగున్నావా? నాతొ చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు? నా మీద కోపం వచ్చిందా? నేను రోజూ హోం వర్క్ చేస్తున్నాను. కంచం చుట్టూ మెతుకులు పారబోయ్యకుండా తింటున్నాను. స్కూల్ నుండి రాగానే షూస్ స్టాండ్ లోనే పెట్టుకుంటున్నాను. టీవీ అసలు చూడట్లేదు. రోజూ హోం వర్క్ అయ్యాకే రాముతో ఆడుకుంటున్నాను. అయినా ఎందుకమ్మా నీకు నా మీద కోపం వచ్చింది?

నువ్వు లేకుండా ఈ పుట్టినరోజు అసలు బాలేదు. నాన్నకి తలంటు పొయ్యడం తెలియదు. కొత్త బట్టలకి పసుపుబోట్లు పెట్టడం తెలియదు. తల దువ్వడం తెలియదు. ఈ సారి స్కూల్ లో చాక్లెట్లు కూడా పంచిపెట్టలేదు. నాకు ఏడుపు వస్తోంది. నాన్నకి కాఫీ కలపడం రాదు. బూస్ట్ కలపడం రాదు. హోం వర్క్ కూడా చెయ్యించట్లేదు. మా మిస్ తిడుతున్నారు అమ్మ. గాడ్ ప్రామిస్ గా చెప్తున్నాను ఇంకెప్పుడు నీకు కోపం తెప్పించను. వచ్చేయ్యమ్మా.

ఇట్లు
కిట్టు"

ఆ ఉత్తరం అరుణ చదువుతూనే కళ్ళల్లోంచి నీళ్లు తిరిగాయి. ఒక్క నిముషం కూడా ఉండలేకపోయింది. అన్నం సాయించట్లేదు. తన తండ్రితో చెప్పి వెంటనే బయల్దేరి భర్త దగ్గరకు వచ్చేసింది. "ఏమిటి, మీ బాబు ఇంట్లోంచి గెంటేసాడా? ఇలాగ వచ్చావు? వెళ్లేముందే ఆలోచించుకోవాలి", అన్నాడు భర్త. అరుణకు ఉక్రోషం పొంగుకొచ్చింది. కిట్టు వ్రాసిన ఉత్తరం అక్కడ పడేసి వెళ్లి వంట చేసుకుని కారేజి సర్దుకుని స్కూల్ కి వెళ్ళింది. కిట్టు అరునని చూస్తూనే పరిగెత్తుకుంటూ వచ్చి మీద పడిపోయాడు. అరుణ వాడిని గట్టిగా గుండెలకు అట్టుకొని అన్నం తినిపించింది. "అమ్మ, సారీ అమ్మా", అన్నాడు కిట్టు. అరుణ ఎప్పటిలాగా చెప్పలేని బాధని గుండెల్లోనే దాచుకుని, "నీ మీద కోపం లేదు నాన్న. ఏదో పని ఉంది వెళ్ళానంతే!", అంది.

ఇంకా అరుణకి నిద్ర పట్టట్లేదు. లేచి తన అలమరలో వెతుక్కుని ఆ ఉత్తరం మళ్ళీ చూసుకుంది. అది గుండెల మీద పెట్టుకుని ఆలోచిస్తూ పడుకుంది. లైట్ కూడా కట్టలేదు. కిట్టు ఫోన్ మాట్లాడటం అయిపొయింది. లోపలకి వచ్చి అరుణ లైట్ కట్టకుండా పడుకుంది అని చిరాకు పడుతూ ఆమె గుండెల మీద ఉన్నా ఉత్తరం పై "కిట్టు" అని తన దస్తూరి చూసి ఆ ఉత్తరం చదివాడు.

విజయవాడ విశేషాలు

ఈ సారి విజయవాడ లో బస బాగా జరిగింది. ఎన్నో మంచి విషయాలు తెలిసాయి. సాహిత్యం, జ్యోతిష్యం పట్ల అభిరుచి ఉన్నవారికి పండుగ లాగ జరిగింది. ఈ ట్రిప్ లో కూడా కొంచం కామెడీ జరిగింది.

* మా మావయ్య కి ఎవరో పెరుగు వడ్డిస్తుంటే, "ఆ వద్దు, నువ్వు మడి గట్టుకోలేదు", అన్నారు. వెంటనే నేను, "పెరుగు, పాలు, నెయ్యి - వీటికి మడి అక్కరలేదు మావయ్య", అని శాస్త్రం వల్లించాను. "ఆ, నేనెప్పుడు వినలేదు", అన్నారు. నాకు నవ్వు వచ్చి, వెంటనే అన్నాను, "ఈ లెక్కన, మనం జున్ను పాలు తాగకూడదు. జున్ను తినకూడదు", అని. అందరూ, "ఎందుకు?", అన్నట్టు చూసారు. వెంటనే నేను, "ఆవు పురుడు పోసుకున్నందుకు మైలు ఉంటుంది కదా", అన్నాను. వెంటనే అందరూ "ఒరెయ్, నీకు తెలియంది లేదు. నువ్వు నోరుమూసుకుని ఉండవు", అన్నారు ;)

* మా తాతయ్యకి నేను జాతకంలో ఉన్నా విషయం ఉన్నట్టు చెప్పేస్తుంటే కోపం వచ్చి, "నువ్వు జ్యోతిష్యం బాగా నేర్చుకున్తున్నావు. ఇంకా నేర్చుకో. కానీ నువ్వు ఎవరికీ చెప్పకు", అన్నారు. నేను అదోలా మొహం పెట్టుకున్నాను. అప్పుడు అయన ఒక ఉదాహరణ చెప్పారు. మా తాతయ్యా గారికి గురుతుల్యులు, శ్రీ గరికిపాటి సూర్య నారాయణ మూర్తి గారు గారు మా తాతయ్యకు జ్యోతిష్యం నేర్పిస్తూ అనేవారుట, "ఒరెయ్ అబ్బాయి, ఎప్పుడు జ్యోతిష్కుడు ఉన్న విషయం చెప్పకూడదురా. ఉదాహరణకి తల్లికి వైధవ్యం ఉంటే, కొడుకుతో - మీ అమ్మ ఎక్కువ కాలం బ్రతుకుతుంది అని చెప్పాలే కానీ, మీ నాన్న చనిపోతాడు అని చెప్పకూడదు.", అన్నారు.

* ఎవరో కంప్యూటర్ కొనుక్కుంటుంటే నేను సలహా ఇచ్చాను, "ఇది కొనండి, ఒక పాతికవేలు పోయినా, మంచి కంప్యూటర్", అన్నాను. వెంటనే మా తాతయ్యా వచ్చి, "పోవడం ఏమిటి? ఖర్చైనా అనాలి", అన్నారు. వెంటనే నేను, "తాతయ్యా, మీరు ఏ నేల్లూరో చిత్తూరో వెళ్తే అందరినీ శపించి వస్తారు", అన్నాను. "ఎందుకురా", అన్నారు తాతయ్యా. వెంటనే నేను, "ఏముంది, వాళ్ళు - మీ అమ్మ పోయిందా? మీ నాన్న పోయాడా? అని అడుగుతారు. పోవడం అంటే వాళ్ల భాష లో వెళ్ళడం", అన్నాను.

Sunday, March 22, 2009

బిగించేద్దాం

ఒక చోట గరికిపాటి నరసింహారావుగారూ, తదితరులు కలిసి ఒక "భువనవిజయం" కార్యక్రమం ఏర్పాటు చేశారు. అప్పుడు అందులో కృష్ణదేవరాయలుగా ఆ organizerని వేషం వెయ్యమన్నారు. గరికిపాటివారు "తెనాలి రామలింగడు"! ఈ organizerకి తెలుగు మీద పెద్దగా పట్టు లేదు. ఎలాగూ (ఈ script లో) కృష్ణదేవరాయలు కవిత్వం చెప్పడు కదా అనే ధైర్యం తో ఆ పాత్ర పోషించడానికి ఒప్పుకున్నాడే కానీ ఎక్కడో భయం. "నన్నేం చెయ్యమంటారు రామలింగడు గారు?", అని అడిగితే ఆయన "ఇంగ్లీష్ పదాలు రాకుండా చూసుకోండి" అని చెప్పారుట. ఇక సభ మొదలయ్యే సమయానికి ఆయన, "ఓ కవిపుంగావులార! ఇంక సభ begin చేద్దామా?", అన్నారుట. అప్పుడు వాళ్ళల్లో ఓ కవి, "అయ్యా, బిగించేయ్యడానికి ఇంకా సమయం ఉంది. మిగతా కవులు సిద్ధమైయ్యాక అప్పుడు బెగిద్దాం", అని దానిని కప్పిపుచ్చారు అట :)

నాకు ఇది విన్నప్పుడు, నేను చిన్నప్పుడు తెలుగువాచకంలో చదువుకున్న "రంగస్థలం పై సమయస్ఫూర్తి" అనే పాఠం గుర్తొచ్చింది.

Wednesday, March 18, 2009

పశ్చాత్తాపం

ఒక వ్యక్తి తనను ప్రేమించిన అమ్మాయిని బాధపెట్టి పశ్చాత్తాపం పడుతూ ఉంటాడు. అది చూసి తన మిత్రుడు, "హనుమంతుడి భక్తుదవయ్యి ఈ బేలతనం ఏలనయ్య?" మంచి నాలుగు  మాటలు చెప్తాడు. దానికి ఈ ప్రేమికుడు ఇచ్చే సమాధానం:

హనుమంతుడె యా సీతను
గని నాకై చూపినాడు కైపున నేనే
వనితామణి యామేనని
కనుగొన లేకుంటినకట కఠినాత్ముడనై

రామాయని నామమునే
నామాతాపితరులెంచి నాకుంచితిరే
నే మాత్రము మూఢుడినై
నా మానిని మనసు విరిచినానే నేస్తం

నా పాపము పండు దినము
నాపాలనుకోను నేను నాస్తికరీతిన్
ఈ పామరుడా భామిని
కోపానికి నోచుకోక కుంగుట జరిగెన్

తరిగెను మనసున భారము
తిరముగ నీ లేఖ జదువ తెరిపియు గలిగెన్
వరముగ భావింతునెపుడు
పరులను పట్టించుకొనెడి వారల స్నేహం

PS: ఈ కథలో పాత్రలు, సన్నివేశాలు అన్నీ కల్పితాలే. ఎవరికైనా సంబంధం ఉన్నట్టు అనిపిస్తే అది కేవలం యాదృచ్చికం. (The characters and situations in this story are totally imaginary :) )

Tuesday, March 17, 2009

ప్రాస రోగం...

ఈ మధ్యన నాకు ప్రాసరోగం పట్టుకుందని తెలిసిన విషయమే కదా? ఆ విషయమే ఆలోచిస్తుంటే నాకు ప్రాస మీద ఒక ఆశుపద్యం వచ్చేసింది.

కం:-
ప్రాసయనెడి రోగముతో
మాసాలుగ వేసారిన మనిషిని నేనే!
వేసేందుకు లేదు గడియ
ముసేందుకు వీలుగాని మూతిర కృష్ణా!నా జాతకం చెప్పు

నేను ఈ మధ్యన జాతకాలు చెప్పడం మానేసాను, ముఖ్యమ్గా ఆడవాళ్ళకి. చాలా మంది స్త్రీలకు జాతకం చెప్పడం మంచిది కాదు అని పదే పదే ఇచ్చిన సలహాలు పెడచెవిన పెట్టినందుకు నాకు తగ్గ శాస్తి జరిగింది. సరే, ఇందులో కామెడీ ఏమిటా అనుకుంటున్నారా? ఈ మధ్యన ఒక చలాకి అమ్మాయితో జరిగిన సంభాషణ.

అమ్మాయి: నా జాతకం చెప్పు
నేను: నాకు మూడ్ లేదు. నాకు మూడ్ తెప్పిస్తే చెప్తాను.
అమ్మాయి: మూడ్ ఎలాగ వస్తుంది.
నేను: ఎవరైనా అమ్మాయి నాకు ఐ లవ్ యు చెప్తే
అమ్మాయి: ఐ లవ్ యు మాత్రం చెప్పను.
నేను: నేను నిన్ను ప్రేమించను, పెళ్లి చేసుకోను అని తెలిసిన చెప్పవా?
అమ్మాయి: చెప్పను.
నేను: ఏమిటే మీ అమ్మాయిలూ, పెళ్లి చేసుకుంటాను అన్నా ఐ లవ్ యు చెప్పరు. కచ్చితంగా పెళ్లి చేసుకోను అని చెప్పినా ఐ లవ్ యు చెప్పరు. మిమ్మల్ని అర్థం చేసుకోవడంకంటే నూతులో పడ్డ నువ్వు గింజ వెతుక్కోవడం బెటర్.
అమ్మాయి: చెప్పావులే. నాకు ఉద్యోగం ఇప్పించు.
నేను: నా పెళ్ళాం పోస్ట్ ఖాళి గా ఉంది - చేస్తావా?
అమ్మాయి: చేస్తాను. కానీ జాబ్ అంటున్నావు కదా? రేపు ఇంకోల్లెక్కువ జీతం ఇస్తే వేలిపోతాను. సరేనా?
నేను: వామ్మో. నీ జాతకం నిజంగా చూడాల్సిందే. నువ్వు ఇంత ఖతర్నాక్ గా ఎలాగయ్యవో అని.

Monday, March 16, 2009

మెట్లు ఎక్కాలి బాసు

నేనూ, నా మిత్రుడూ చర్చించుకుంటుంటే ఎక్కడో, "ఇంకా చాలా నేర్చుకోవాలి", అన్నాడు అతను. వెంటనే వచ్చింది ఆశుకవిత్వం.

కం:-
పుట్టిన రోజునే గారుర
దిట్టలు ఏ గొప్పవారు దీనులగానే
మెట్టులనెక్కుచు బోవగ
కొట్టును లోకము సలాము కొనియాడునురా!

Saturday, March 14, 2009

ధ్వంసరచనలు

పనిలేని మంగలాడు పిల్లి తల గోరిగాడో లేదో తెలియదు కానీ, నేను మాత్రం అవునంటే కందం కాదంటే కందం అంటూ రెచ్చిపోతున్నాను. ఈవేళ "పని లేని పద్యం" ఇదిగో:

కం:-
ప్రేమరసంబెరుగమనుచు
మా మనసున భావమెల్ల మైత్రేననుచున్
తామసిలో ముంచెదరే
తామరపై నీటిబొట్లు తరుణీమణులే ||

"తన్వీమణులే" అనే అని నేనంటే "తరుణీమణులే" అని నారాయణుడన్నాడు. ఏదైనా ఒకటే :)

PS: ఒక్కళ్ళు తప్ప, సోదరసోదరీమణులారా! ఇది కేవలం సరదా కోసం చేసిన ప్రయోగమే కానీ సీరియస్ ఏ మాత్రం కాదని మనస్పూర్తిగా మనవి చేసుకుంటున్నాను.

Thursday, March 12, 2009

అమెరికా భోజనం

నా అమెరికా మిత్రుడు "భోజనానికి బయల్దేరుతున్నాను", అంటే వెంటనే పుట్టుకొచ్చింది వ్యంగ్యకవిత్వం. మన ఆంధ్రో-అమెరికన్స్ (అదే, ఆంగ్లో-ఇండియాన్స్ లాగా) భోజన శైలి గురించి.

కం:-
మెక్కుడు నాలుగు మెతుకులు
కుక్కుడు మీ నోటి లోన కోలాహలమే
చిక్కుడు గింజైననిచట
లక్కున చిక్కినదనుకొని లాగించుమురా!

అన్నం పరబ్రహ్మస్వరూపం అంటారు. అది నిజానికి "భక్ష్యం పరబ్రహ్మస్వరూపం" అని ఉండాల్సింది. తిండి ఏ రూపం లో ఉన్న అది అన్నపూర్ణాదేవి అనుగ్రహమే. అమెరికా తిండి బాగుండదని అని అనడం నా ఉద్దేశ్యం కాదు. అవకయలకి అలవాటు పడ్డ మన తెలుగు వాళ్లు ఇక్కడ దొరికే cheese sandwich లు చూసి ఏమనుకుంటారో చెప్పటం మాత్రమే నా ఉద్దేశం.

అన్నపూర్ణే సదాపూర్ణే!

Wednesday, March 11, 2009

దూరం కలిగించే ఆవేదన...

ఒక ప్రాణమిత్రుడిని కలిసి చాలా రోజులైంది. కేవలం కళ్ళతోనే మాట్లాడుకొగల స్నేహం అది. అన్నాళ్ళ తరువాత కలిసిన స్నేహితుడితో ఏం మాట్లాడతాను? ఐదు పద్యాల్లో వ్రాయమని ఆజ్ఞ. సరే,

" నారాయణం నమస్కృత్య నరం చైవ నరాధిపం
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్"

అనుకోని మొదలెట్టాను. ఇందులో ఏమైనా మహిమ ఉంటే అది ఆ కళామతల్లిది. ఆ పైన నన్ను అత్యంత ప్రీతిపాత్రం గా చూసుకుంటూ, నాలోని లోపాలను పట్టించుకోకుండా "నా వాడు", అనుకున్న స్నేహితులది.


కం:-
సుఖులే మాతాపితరుల్
సుఖులే నీబంధుజనులు సుమధురభాషుల్
సుఖులే భార్యాబిడ్డలు
సుఖులే నాబోటి సఖులు సుఖివే గదరా?

కం:-
దూరము మన యిరువురి నడి
జేరితినని గర్వపడెను జీవనములలో
మారని మన బంధము గని
నేరము జేసితిననుకొనినేమో గదరా?

కం:-
వేరుగ మిగిలితి నేనిట
తీరుగ నీ జోడు లేక తిమిరము నిండెన్
భారము పెరిగెను మనసున
నేరుగ నిను కనగలేక నే సగమైతిన్

కం:-
యే గ్రహములు యిరువురిపై
ఆగ్రహమొందెనొ తెలియదు అరుణుడు రాడే
జాగ్రద్భావము బోయెను
ఈ గ్రహణము తాళలేక ఖిన్నుడనైతిన్

కం:-
మారెను మబ్బుగ జూడర
కారని నాకంటి నీరు కన్నుల క్రిందన్
జారెను జలజల మనుచున్
చేరగ నీ చెలిమి చలువ చెంతనె మిత్రం


(ఈ పద్యాలు నేను మొదట వ్రాసినవి. ఇందులో కొన్ని వ్యాకరణ దోషాలు ఉన్నాయి అని పెద్దలు చెప్పారు. ఇవి సరిచేస్తాను, వీలు చిక్కినప్పుడు)

Tuesday, March 10, 2009

నిత్యజీవితంలో కుళ్ళుకామెడీ!

%
అక్క: ఎరా నాన్న, భోజనం చేసావా?
నేను: లేదు అక్క, ఇంకో గంట ఆగి చేస్తాను.
అక్క: అదేమిటిరా? ఎంత కష్టపడినా అది జానెడు పొట్ట కోసమే కదరా?
నేను: కొటేషన్ బాగుంది కాని, చిన్న కరెక్షన్.
అక్క: ఏమిటి?
నేను: నాది జానెడు పొట్ట కాదు. బానడు పొట్ట!


% మా చుట్టం ఒకావిడ చెప్పింది, "రంభ అసలు పేరు విజయలక్ష్మి. తను విజయవాడ లో ఒక స్వీట్ షాప్ ఓనరు. మా నాన్న తన చిన్నప్పుడు చూసారట", అంది. వెంటనే, మా అన్నయ్య, "పెద్దయ్యాక వీళ్ళ అన్నయ్యలు చూసి ఉంటారు", అని ముగించాడు.

% "సందీపు, అసలు ఛాయా అంటే ఏమిటి?', అని నన్ను ధర్మసందేహం అడిగింది మా బంధువు. అప్పుడు నేను చాయాదేవి కథ చెప్పుకుంటూ వచ్చాను. "సూర్యనారాయణమూర్తి కి శరణ్య అనే భార్య ఉండేది. ఆమెకి పుట్టింటికి వెళ్ళాలనే కోరిక బాగా పెరిగి, భర్తకు తెలియకుండా వేల్దామనుకుంది. అప్పుడు తన నీడకు తనలాగా కనబడే అతీతశక్తినిచ్చి, తన భర్తను తను అక్కడే ఉన్నట్టు నమ్మించమని చెప్పి, పుట్టింటికి వెళ్ళింది. ఆ నీడ పేరు ఛాయా. ఛాయా అంటే నీడ! అప్పుడు సూర్యనారాయణమూర్తికి ఆమెయందు శని, యముడు పిల్లలుగా కలిగారు.", అని వృత్తాంతం చెప్పుకుంటూ వచ్చాను. "ఇప్పుడు ఈ కథలో నీకు అర్థమైన నీటి ఏమిటి?", అని అడిగాను. అప్పుడు తను, "ఛాయా అంటే నీడ", అని అంది. అప్పుడు నేను చెప్పాను, "అది కాదు. సూర్యుడు లోకసాక్షి. ఎక్కడ ఏమి జరుగుతున్నా ఆయన గమనిస్తాడు. ఆయన తన మామగారి ఇంట్లోకి ఒక్కసారి తొంగి చూసినా తన భార్య అక్కడ ఉంది అన్న విషయం తెలిసేది. అలాంటిది ఆయన చూడలేదు. అంటే దాని అర్థం: ఏ అల్లుడికైనా మామ అంటే allergy నే!". అప్పటికే అలాంటి సమస్యని ఎదుర్కొంటున్న ఆమెకు నా కథ నిజమే అనిపించింది!