Tuesday, March 24, 2009

కిట్టు కథలు - ఆడజన్మ

"నాకిప్పుడు బట్టలు ఎందుకమ్మా? ఏమిటి ఈ చాదస్తం? ఐనా అనవసరంగా డబ్బు ఖర్చు చెయ్యమంటే నీ తరువాతే", అన్నాడు కిట్టు. "అదేమిటిరా నాన్న? పుట్టినరోజు కొత్త బట్టలు వేసుకోకపోతే ఎలాగ?", అంది అరుణ. "ఏమీ అక్కరలేదు. అయినా నీ చాదస్తం నా మీద రుద్దకు", అని వెళిపోయాడు కిట్టు.

అరుణకు తాపత్రయం ఆగలేదు. తను వెళ్లి బజారులో తన దగ్గరున్న డబ్బులేవో పెట్టి ఒక చొక్కా కొంది. అదేమిటో నిండుగా ఉండే చీర పట్టుమని ఐదు వందలు ఉండదు! ఈ పాంటులు, చొక్కాలు రెండు వేలు పెట్టినా మంచివి రావు. వెనక్కొచ్చేటప్పుడు ఆటో కోసం చూస్తుంటే ఒక మాట గుర్తుకొచ్చింది, "అయినా అనవసరంగా డబ్బు ఖర్చు చెయ్యమంటే నీ తరువాతే", అని కిట్టు అన్నది. వెంటనే మనసు గతంలో ఎక్కడికో వెళ్ళిపోయింది.

"అమ్మ, నేనూ నీతో కొట్టుకి వస్తాను", అని కిట్టు అన్నాడు. "వద్దు నాన్న. అది చాలా దూరం. నువ్వు నడవలేవు", అంది అరుణ. "నీతో వస్తే నాకు కావలసిన చాక్లెట్లు నేనే కొనుక్కోవచ్చు. నీకు తెలియదు", అన్నాడు కిట్టు. వాడికి తెలియదు పాపం బజారుకి వెళ్ళాలంటే ఐదు కిలోమీటర్లు నడవాలి అని. దారి మధ్యలోనే కాళ్ళు నొప్పెడుతున్నాయి అంటాడు. అప్పుడు వాళ్ళమ్మ ఎత్తుకుని వెళ్ళాలి. తనకు అంత ఓపిక లేదు. సరే, ఆటోలో వెళ్తే, మరి ఆ డబ్బులు ఎక్కడ ఆదా చెయ్యాలి? అరుణ క్రితం సంకురాత్తిరి నుండి ఒక జాకెట్ కుట్టించుకుందాం అనుకుంటోంది. కిట్టుకి పుట్టినరోజు బట్టల కోసం ప్రతిసారి అది వాయిదా వేస్తూ వచ్చింది. ఈ సారి ఇది.

ఈ ఆలోచనల మధ్యలోనే అరుణ ఇంటికి వచ్చేసింది. కిట్టు ఇప్పుడు software engineer. నెలకు ఆరు అంకెల జీతం. ప్రతి దానికి చికాకు పడుతూ ఉండటం అతనికి అలవాటు.

సాయంత్రం ఇంటికి వస్తూనే, "అమ్మ నేను Zurich వెళ్ళాలి", అన్నాడు. "అదేక్కడరా?", అంది అరుణ. "అమ్మ, Zurich తెలియదా? Switzerland లో ఉంది అమ్మా", అన్నాడు. "ఎన్నాళ్ళు ఉండాలి?", అంది. "ఒక నెలరోజులు", కిట్టు చెప్పాడు. "ఎందుకురా నాన్న అన్నాళ్ళు అక్కడ? నిన్ను చూడకుండా నేను ఉండలేనురా", అంది. "అమ్మ, అంత sentimental గా ఫీల్ అవ్వకు అమ్మ. ఈ వయసులోనే అన్నీ తిరిగి చూడాలి, బోలెడు డబ్బు సంపాదించుకోవాలి. ఇప్పుడు సెంటిమెంట్ పెట్టుకుంటే ఎలాగ? ఐనా నేను ఇక్కడ లేకుండా నువ్వు ఉండటం అలవాటు చేసుకోవాలి. రేపు నాకు H1B visa వచ్చింది అనుకో, అప్పుడు నేను వెళ్లి నీకు వీసా సంపాదించడానికి కనీసం మూడు నెలలు పడుతుంది.', అన్నాడు. కిట్టు చెప్పిన విషయాల్లో అరుణకి రెండే అర్థమయ్యాయి: "నేను ఇంకా దూరం వెళ్ళే అవకాశం ఉంది. నువ్వు నేను లేకుండా నీ పనులు చేసుకోవడం అలవాటు చేసుకో", అన్నవి. కిట్టు భోజనం చేసేసి ఏదో ఫోన్ మాట్లాడుతూ కంప్యూటర్ నొక్కుకుంటూ కూర్చున్నాడు.

అరుణకి నిద్దర పట్టట్లేదు. కిట్టు వేరే చోట ఉండాల్సి వస్తే ఎలాగ? వాడి బాగోగులు ఎవరు చూసుకుంటారు? పెళ్లి చేసుకొమ్మంటే చేసుకోడాయే. కెరీర్ కెరీర్ అంటాడు. అదేమిటో అరుణకు అర్థం కాదు. చిన్నప్పుడు స్కూల్ కి వెళ్తూ కారియర్ కారియర్ అన్నట్టు వినబడుతుంది. ఇంతలోనే మళ్ళీ మనసు గతాన్ని వెతుక్కుంటూ వెళ్ళింది.

"నాకిష్టమొచ్చినట్టు నేను ఉంటాను. నీకిష్టమైతే ఉండు లేకపోతె పో, మీ బాబు దగ్గరకి", అన్నాడు అరుణ భర్త. అతడు భార్యాద్వేషి. పెళ్లయినా ఎప్పటిలాగే ఫ్రెండ్స్ తో ఉండాలి, తనలో ఏ మాత్రం మార్పు రాకూడదు అని అతని నమ్మకం. అది అసాధ్యం, అధర్మం అని తెలియదు. చెప్తే వినడు. ఇప్పటికి ఎన్నో సార్లు అరుణని పుట్టింటికి పొమ్మన్నాడు. కానీ ఆమె కిట్టు కోసం ఆగిపోయింది. ఈసారి మాత్రం పట్టలేని దుఖం వచ్చింది. బంధువులందరి ముందూ తిట్టాడు. ఎంత ఆపుకుందామన్నా ఆగని కన్నీళ్లు. మనసులో ఏదో తెలియని అలజడి. సరే ఈ సారి తెగించింది. కిట్టు స్కూల్ నుండి వచ్చేలోపలే వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. బట్టలు సర్దుకుని పుట్టింటికి వెళ్ళింది.

కిట్టు ఇంటికి వచ్చాడు. ఇంట్లో అరుణ కనిపించలేదు. వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళాడు, "నాన్న, అమ్మ ఏది?", అన్నాడు. "అమ్మ తాతయ్య ఇంటికి వెల్లిందిరా.", తండ్రి చెప్పాడు. "నాతొ చెప్పకుండా ఎందుకు వెళ్ళింది?", కిట్టు అడిగాడు. "అర్జెంటు పని ఉంది వెళ్ళిందిరా", తండ్రి చెప్పాడు. "ఎప్పుడు వస్తుంది?", కిట్టు ఎదురుప్రశ్న. "ఇంకా ప్రశ్నలకి అంతు ఉండదా? వెళ్లి హోం వర్క్ చేసుకో వెధవా", తండ్రి చిరాకు పడ్డాడు. కిట్టు వంటింట్లోకి వెళ్లి చూసాడు. ఉప్మా ఉంది. అది తినేసి హోం వర్క్ చేసుకున్నాడు. రాత్రి వాళ్ల నాన్న ఎక్కడినుండో పార్సెల్ తెచ్చాడు. అదే కిట్టూ కూడా తిన్నాడు. మర్నాడు ఉదయం లేచి స్కూల్ కి రెడీ అయ్యాక "నాన్న, కాఫీ", అన్నాడు. "నీకు కాఫీ అలవాటు ఉందా?", అన్నాడు తండ్రి. "అవును నాన్న. నాకు కాఫీ, టిఫిన్ పెట్టి కారేజి ఇస్తే నేను స్కూల్ కి వెళ్తాను", కిట్టు అన్నాడు. "ఈ చిన్న వయసులో కాఫీ అలవాటేమిటి. ఇక్కడ పాలు ఉన్నాయి తాగు. ఈ పూట టిఫిన్ లేదు. మీ అమ్మ బిస్కట్లు ఎక్కడో పెట్టి ఉంటుంది , వెతుక్కుని తిను. నేను మీ లంచ్ టైం కి కారేజి తెచ్చి ఇస్తాను", అన్నాడు తండ్రి. biscuits వెతుక్కుంటూ కిట్టు ఒక సీసా పగలగోట్టేసాడు. వాళ్ల నాన్నకి కోపం వచ్చి తిట్టాడు. తను ఏడ్చుకుంటూ స్కూల్ కి వెళ్ళాడు.

ఇలాగ ఒక రెండు రోజులు సాగింది. ఇంతలొ తన పుట్టినరోజు వచ్చింది. అమ్మ వచ్చేస్తుంది అని కొండంత ఆశతో చూస్తున్నాడు. అయినా అమ్మ దగ్గరనుండి ఉలుకు పలుకు లేదు. వాళ్ళింట్లో ఫోన్ లేదు. పుట్టినరోజు అమ్మ తలంటు పోసేది. ఈ సారి షంపూనే. అయ్యాక దేవుడికి దణ్ణం పెట్టుకున్నాడు. వెళ్లి వాళ్ళ అమ్మ బట్టల్లో వెతికితే ఒక కొత్త చొక్కా కనిపించింది. దానికి పసుపుబొట్లు పెట్టి వేసుకున్నాడు. బరువైన గుండెతో ఒక పోస్ట్ కార్డు తీసుకుని రాయడం మొదలు పెట్టాడు.

"అమ్మ,

నేను బాగున్నాను. నువ్వు బాగున్నావా? నాతొ చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు? నా మీద కోపం వచ్చిందా? నేను రోజూ హోం వర్క్ చేస్తున్నాను. కంచం చుట్టూ మెతుకులు పారబోయ్యకుండా తింటున్నాను. స్కూల్ నుండి రాగానే షూస్ స్టాండ్ లోనే పెట్టుకుంటున్నాను. టీవీ అసలు చూడట్లేదు. రోజూ హోం వర్క్ అయ్యాకే రాముతో ఆడుకుంటున్నాను. అయినా ఎందుకమ్మా నీకు నా మీద కోపం వచ్చింది?

నువ్వు లేకుండా ఈ పుట్టినరోజు అసలు బాలేదు. నాన్నకి తలంటు పొయ్యడం తెలియదు. కొత్త బట్టలకి పసుపుబోట్లు పెట్టడం తెలియదు. తల దువ్వడం తెలియదు. ఈ సారి స్కూల్ లో చాక్లెట్లు కూడా పంచిపెట్టలేదు. నాకు ఏడుపు వస్తోంది. నాన్నకి కాఫీ కలపడం రాదు. బూస్ట్ కలపడం రాదు. హోం వర్క్ కూడా చెయ్యించట్లేదు. మా మిస్ తిడుతున్నారు అమ్మ. గాడ్ ప్రామిస్ గా చెప్తున్నాను ఇంకెప్పుడు నీకు కోపం తెప్పించను. వచ్చేయ్యమ్మా.

ఇట్లు
కిట్టు"

ఆ ఉత్తరం అరుణ చదువుతూనే కళ్ళల్లోంచి నీళ్లు తిరిగాయి. ఒక్క నిముషం కూడా ఉండలేకపోయింది. అన్నం సాయించట్లేదు. తన తండ్రితో చెప్పి వెంటనే బయల్దేరి భర్త దగ్గరకు వచ్చేసింది. "ఏమిటి, మీ బాబు ఇంట్లోంచి గెంటేసాడా? ఇలాగ వచ్చావు? వెళ్లేముందే ఆలోచించుకోవాలి", అన్నాడు భర్త. అరుణకు ఉక్రోషం పొంగుకొచ్చింది. కిట్టు వ్రాసిన ఉత్తరం అక్కడ పడేసి వెళ్లి వంట చేసుకుని కారేజి సర్దుకుని స్కూల్ కి వెళ్ళింది. కిట్టు అరునని చూస్తూనే పరిగెత్తుకుంటూ వచ్చి మీద పడిపోయాడు. అరుణ వాడిని గట్టిగా గుండెలకు అట్టుకొని అన్నం తినిపించింది. "అమ్మ, సారీ అమ్మా", అన్నాడు కిట్టు. అరుణ ఎప్పటిలాగా చెప్పలేని బాధని గుండెల్లోనే దాచుకుని, "నీ మీద కోపం లేదు నాన్న. ఏదో పని ఉంది వెళ్ళానంతే!", అంది.

ఇంకా అరుణకి నిద్ర పట్టట్లేదు. లేచి తన అలమరలో వెతుక్కుని ఆ ఉత్తరం మళ్ళీ చూసుకుంది. అది గుండెల మీద పెట్టుకుని ఆలోచిస్తూ పడుకుంది. లైట్ కూడా కట్టలేదు. కిట్టు ఫోన్ మాట్లాడటం అయిపొయింది. లోపలకి వచ్చి అరుణ లైట్ కట్టకుండా పడుకుంది అని చిరాకు పడుతూ ఆమె గుండెల మీద ఉన్నా ఉత్తరం పై "కిట్టు" అని తన దస్తూరి చూసి ఆ ఉత్తరం చదివాడు.

3 comments:

Hemanth said...

Wonderful ga undi story.Amma ante ento kanipinchindi.Thanks for giving a good story. blog inka poortiga chadavaledu.Inka manchi manchi kathalu ilage rastu undalani korukuntunnanu.

Me Inc said...

అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు అన్న సామెత దీనికి వర్తిస్తుంది. Story బావుంది. కొడుకులు చిన్నప్పుడు తల్లిని support చేసినా పెద్దయ్యాక తండ్రి స్వభావమే వస్తుంది :)

ప్రభ
(హరితా వాళ్ల అమ్మ)

Sandeep said...

నమస్తే ఆంటీ

మీరు చెప్పిన సామెత చాలా బాగుంది. అది నేను ఎప్పుడూ వినలేదు. ఒక్కోసారి మా అమ్మగారిని ఫోన్లో కసురుతూ ఉంటాను. అది పెట్టెయ్యగానే నా మనస్సు చివుక్కుమంటుంది. 'ఇదివరకు మధ్యాహ్నం పుల్లైసు వాడు వచ్చినప్పుడు పడుకున్న మా అమ్మని లేపి మరీ కొనిపించుకునేవాణ్ణి. ఇప్పుడు ఒక గిన్నో, గరిటో కొనమంటే, "ఎందుకిప్పుడు?", అని అడిగేస్తుంటాను. చిన్నప్పుడు "అమ్మో, అమ్మ కొడుతుంది" అనుకున్న భయం, అమాయకత్వం, శిశుత్వం ఏమైపోయాయి?', అని అనిపిస్తుంది. చిన్నప్పుడైతే ఏడ్చి సారీ చెప్పేవాణ్ణి కానీ, ఇప్పుడు నా వయసు అది చెయ్యనివ్వట్లేదు. వయసు మప్పే ఆత్మవంచన ఇదేనేమో అనిపిస్తుంది.

మీతో పరిచయం అయినందుకు చాలా సంతోషంగా ఉంది.
సందీప్