Friday, October 30, 2009

నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నది!

నేను ఇప్పుడు చెప్పబోయే పాట బహుశా చాలా మందికి తెలిసి ఉండదు. నేనే ఆ పాట వినటానికి ఇష్టపడను. ఎందుకంటే, అది ఒక ఏడుపు-పాట. కానీ, ఆ పాటలో నిజమైన ఆవేదనని ఒక "మామూలు మనిషి" మాటల్లో చెప్పాడు వేటూరి.

ఈ పాట "జెమిని" సినిమాలోది. ఒక వ్యక్తీ చనిపోతే ఎంత బాధ కలుగుతుందో, ఎవరెవరో ఎలాగ బాధపడతారో చెప్పే పాట. ఇందులో నేను వ్యాఖ్యానిన్చటానికి ఏమి లేదు. ఆ వాక్యాలు అన్నీ సామాన్యులకు అర్థమయ్యేలాగా ఉన్న మాటలే. ఐతే నా మనసుని తాకినా వాక్యాలు రెండు: "నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నది, కన్నీళ్ళకు కట్టె కూడా ఆరనన్నది".


చిత్రం: జెమిని
రచన: వేటూరి
సంగీతం: ఆర్ పీ పట్నాయక్
పాడింది: వందేమాతరం శ్రీనివాస్

చుక్కల్లోకేక్కినాడు చక్కనోడు
ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు
తల్లిడిల్లిపోతుంది తల్లి అన్నది
బొట్టు రాల్చుకుంటుంది కట్టుకున్నది
పాడె ఎత్తడానికే స్నేహమన్నది
కొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది

పోయినోడు ఇక రాడు,ఎవరికెవరు తొడు
ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు
నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నది
కన్నీళ్ళకు కట్టె కూడా ఆరనన్నది
చావుబ్రతుకులన్నవి ఆడుకుంటవి
చావు లేని స్నేహమే తోడూ ఉంటది

Tuesday, October 27, 2009

పదాలకు వింత వ్యుత్పత్తుల ఉత్పత్తులు!

నా చిన్నతనం నుండి నాకు భాషల పట్ల ఇష్టం, ఒక రకమైన అభిరుచి ఉన్నాయి. అందులోనూ ఎంతో కొంత కవిని ఆయే! ఇంక కొత్త పదం తెలియడమేమిటి, దానికి వ్యుత్పత్తి ఏంటో నేనే ఊహించి చెప్పెయ్యడం మొదలెట్టేసాను. అలాంటివి:

సప్తపది: సప్త అంతే ఏడు కాబట్టి ఏడు పదులు డబ్భై అనుకునేవాడిని. సప్తపది సినిమా గురించి తొలుత విన్నప్పుడు నా వయసు వర్షసప్తకం!

దత్తపది: పది పదాలు ఇచ్చి మిగతావి వ్రాయమంటారు కాబట్టి దత్తపది. ఒక సారి మా ఫ్రెండ్ కి నాలుగు పదాలు ఇచ్చి, "ఇది దత్త-నాలుగు" అన్నాను కూడా :-)

అనవసరం: ఇంగ్లీష్ "అన్" + "అవసరం". అంటే, "అన్" + "నేసెస్సరీ" లాగా అన్నమాట. అలాగే, "అశేషం" అంటే "అ" + "శేషం". మన "అ" + "టిపికల్" లాగా అన్న మాట. ఇది నేను చిన్నప్పుడైతే తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ ని కాపీ కొట్టేసారు అనుకునేవాడిని :-O

బ్రదర్: సంస్కృత "భ్రాతా" నుండి కాపీ కొట్టేసారు అనుకునేవాడిని. అలాగే, "నైట్" అనేది "నక్తం" నుండి వచ్చిందని బలంగా నమ్మేవాడిని. ఇందులో కొంత నిజం ఉన్నా ఆశ్చర్యపోనులెండి.

నాకు ఒక్కోసారి జంధ్యాల సినిమాలో "సుత్తి వీరభద్రరావు" గుర్తొస్తూ ఉంటాడు. "అసలు న్యూటన్ అనేవాడి అసలు పేరు "నూతనుడు". వాడు బెంగాలీయుడు!" అని ఉద్ఘాటించినట్లు నేను కూడా చాలా అర్థాలు "డిసైడ్" చేసేసేవాడిని.

ఇవి ఇలాగ ఉంటే, నిజంగా కొన్ని మామూలు పదాలకు చాలా పెద్ద పెద్ద అర్థాలు ఏర్పరుస్తారు జనాలు. అది ఇంకా విచిత్రం. ఉదాహరణకి:

నాయాలు: "నా + ఆలు" అంటే "నా భార్య" అని అర్థం. ప్రియురాలు, జవరాలు, ఇల్లాలు అన్నీ కూడా తెలుగు సంధులే. ఈ నాయాలు అనే పదం తొలుత మా సోదరుడు "లవ-కుశ" చిత్రంలో "ఒల్లనోయి మామా, నీ పిల్లను" అనే పాటనుండి గ్రహించి నాకు అజ్ఞానం నుండి విమోచనం కలిగించాడు!

శ్రాద్ధం: "శ్రద్ధ" గా చేసేది కాబట్టి శ్రాద్ధం! అలాగే, "తద్దినం" అంటే "తత్ + దినం" అంటే "ఆ రోజు" అని అర్థము. ఈ రెండు పదాలు ఎప్పుడూ కొంచం అశుభసందర్భాలలోనే వాడతారు.

మరి కొందరు పదాల అర్థాలకు తోడ్పడేలాగా పదాలను పలుకుతారు. మచ్చుక్కి:

లెఖ్ఖ: అసలు పదం "లెక్క". కానీ, "లెక్క సరిగ్గా ఉండాలి" అనే భావంతో ఆ "సరిగ్గా" మీద కక్ష/కాంక్షా తీసుకొచ్చి ఈ "లెక్క" మీద రుద్ది "లెఖ్ఖ" చేస్తారు!

ఉచ్ఛారణ: అసలు పదం "ఉచ్చారణ". "ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి" అనే ఆవేశంతో స్పష్టాన్ని క్లిష్టం చేసి ఉచ్ఛారణ చేసారు. ఇది ఇంగ్లీష్ లోనూ ఉంది "pronunciation" ని "pronounciation" చేసేస్తారు. ఏమైనా, మనకు కావలసింది pronunciation ఏ కానీ, spelling కాదు కదా!

ఖర్మ: అసలు ఈ "ఖర్మ" ఎక్కడనుండి వచ్చిందా అని నేను తెగ ఆలోచించేవాడిని. బ్రహ్మానందం భాషలో ఇది "కర్మ" కు పట్టిన "కర్మాయ్" :) ఎంతో విసుగ్గా ఉండి, "ఇది నా కర్మఫలితము. ఎవర్నీ అనుకోవడానికి లేదు", అనే లోతైన వేదసూత్రాన్ని "నెత్తీ నోరు బాదుకుని" చెప్పిన ఫలితం దక్కాలని "ఖర్మ" గా మార్చారు.

తెలుగు పద్యాలు చదివేటప్పుడు కొందరు చేసే దోషాలు బాగా నవ్విస్తాయి. "రామునితో కపివరుండు ఇట్లనియె" ని "రాముని తో పివరుండు ఇట్లనియె" అని "పండగ" సినిమా లో చూసి "ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తారా?", అనుకునే వాళ్లు అవాక్కయ్యేలాగా మా తమ్ముడి క్లాసు లో కొందరు, కృష్ణుడితో ద్రౌపది తన ఆవేదనను వ్యక్తం చేస్తూ చెప్పిన పద్యంలో ఒక పదాన్ని "పంక-జనాభా" అని పలికారు. పాపం, "పంకజ-నాభుడికి" "కలియుగం మొదలయ్యింది, జనాభా అంతా పంకమయం అయ్యింది", అని ద్రౌపది చెప్తోంది అనుకున్నారో ఏమో!

Friday, October 2, 2009

లిపిలేని కంటి భాష తెలిపింది కొంటె ఆశ

ఈ రోజు వేటూరి చేసిన ప్రయోగాల్లోకల్లా కాస్త సులువుగా అర్థమయ్యి, ద్వంద్వార్థాలు లేని ఒక్క పాట చూద్దాము.

ఒక అమ్మాయి తన మనసులో ఉన్నా సున్నితమైన భావాన్ని విప్పి ఒక లేఖగా తన ప్రియుడికి పంపించింది. అతడు అది చదివి ఆ అమ్మాయికి బొక్కబోర్లా పడిపోయాడు. వాళ్ళిద్దరి హృదయాల నడుమ పారే ప్రణయరాసాన్ని వేటూరి ఎంతో సున్నితంగా మంచి భావుకతతో వ్రాసాడు. మొత్తం పాట గురించి నేను వ్యాఖ్యానించెంత టైం లేదు కానీ, నాకు నచ్చిన ప్రయోగాలు మాత్రమే చెప్తాను.

- మోహంలో ఉన్న అమ్మాయి కళ్లు మాట్లాడుతున్నాయి అనడానికి "లిపి లేని కంటి భాష, తెలిపింది చిలిపి ఆశ" అని ఎంతో చిలిపిగా చెప్పాడు.
- తెలుగు పదాలతో గారడీ చెయ్యవయ్యా అని దరఖాస్తు పెట్టుకోకుండానే అవలీలగా చేసేసి మురిపించేయ్యడం వేటూరికి కొత్త కాదుగా. "గడప దాటలేక నేనే గడియ వేసుకున్నాను", అని అమ్మాయి, "నువ్వు లేని జీవితం నాకు నచ్చలేదు", అని చెప్తే, "గడియైనా నీవు లేక గడపలేక ఉన్నాను", అని అదే భావాన్ని మాటలు ముందుకూ, వెనక్కీ మార్చి అబ్బాయి చెప్పడం నా చేత ఐతే, "సాహో వేటూరి, నీకు లేదు సాటి", అనిపించింది.

ఇక్కడ చెప్పుకోవలసింది ఒకటి ఉంది. వేటూరి కొందరు దర్శకులకు ఎప్పుడూ మంచి సాహిత్యాన్నీ అందిస్తూ ఉంటాడు. విశ్వనాథ్, జంధ్యాల, రాఘవేంద్రరావు, శేఖర్ కమ్ముల, దాసరి నారాయణ రావు వంటి వారికి గతంలో అద్భుతమైన పాటలు వ్రాసాడు.

(డబ్భైమూడేళ్ళ మనిషిని పట్టుకుని, "డు-కారం", వాడుతున్నాడు అని కారాలూ మిరియాలూ నూరేయ్యకండి. అదివేటూరిని "మమ" (సంస్కృతంలో "నా") అనుకున్న "మమకారం".)


చిత్రం: శ్రీవారికి ప్రేమలేఖ
సంగీతం: రమేష్ నాయుడు
గాయకులూ: బాలు, జానకి
దర్శకుడు: కీ. శే. జంధ్యాల

లిపి లేని కంటి భాష, తెలిపింది చిలిపి ఆశ
నీ కన్నుల కాటుకలేఖలలో, నీ సొగసుల కవితారేఖలలో
ఇలా... ఇలా... చదవనీ నీ లేఖని ప్రణయలేఖని
బదులైన లేని లేఖ, బ్రతుకైనా ప్రేమలేఖ
నీ కౌగిట బిగిసిన శ్వాసలతో, నీ కవితలు నేర్పిన ప్రాసలతో
ఇలా... ఇలా... వ్రాయనీ నా లేఖని ప్రనయరేఖనీ!

అమావాస్య నిశిలో కోటి తారలున్నా ఆకాశం
వెతుకుతూ ఉంది వేదన తానై విదియనాటి జాబిలి కోసం
వెలుగునీడలేన్నున్నా వెలగలేని ఆకాశం
ఎదుగుతుంది వెన్నెల తానై ఒక్కనాటి పున్నమి కోసం

అక్షరాల నీడలలో నీ జాడలు చూసుకుని
ఆ పదాల అల్లికలో నీ పెదాలు అద్దుకుని
నీ కంటికి పాపను నేనై, నీ ఇంటికి వాకిలి నేనై
గడప దాటలేక నేనే గడియ వేసుకున్నాను
గడియైనా నీవు లేక గడపలేక ఉన్నాను.

భావాలతోట, పదాలతేట, వేటూరి పాట!

వేటూరికి రెండు అస్త్రాలు ఉన్నాయి. ఒకటి భాష, మరొకటి భావుకత. ఆ రెండూ ఉన్న కవిని పట్టుకోవడం అసాధ్యం. ఆది నుంచి ఉన్న తెలుగు సినీకవుల్లో ఎవరికీ లేనంత భాషాపరిజ్ఞానం ఒక్క వేటూరికే ఉంది అనటంలో యేమీ సందేహం లేదు. అదే కాకుండా, భారతీయ/తెలుగు సాంప్రదాయాలకు సంబంధించిన సాహిత్యాన్నీ చాలా వరకు చదువుకున్నాడు ఈయన. మరి ఆనాటి చదువులవి. ఇదంతా ఒక్క పెట్టు ఐతే, ఆకాశాన్ని తాకే ఆయన భావాలు నన్ను మైమరిపిస్తాయి. "ఆహా, భావాన్ని ఇంత అందంగా వర్ణంచచ్చా? ఇంకా అందంగా ఎవరైనా వర్ణించగాలరా?" అనిపించేలాగా ఆయన వ్రాస్తారు అని నా అభిప్రాయం.

ఐతే ప్రతీ ఒక్కరికీ వేటూరి మీద ఉండే కోపం ఏమిటి అంటే, అన్ని పాటలకూ అదే న్యాయం చేకూర్చరు అని. నేనూ ఒప్పుకుంటాను. ఆయన వ్రాసిన పాటల్లో చాలా ఎబ్బెట్టుగా ఉండే పాటలు కూడా ఉన్నాయి. "అసలు, పాట ఈయన వ్రాసి ఉండకపొతే బాగుండేది", అనుకున్న సందర్భాలు ఎన్నో. కానీ, ఎవరి వ్యాపారం వాళ్ళది. వేటూరిని విమర్శించే చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, "నేను వ్రాసే ప్రతీ లైన్ కీ న్యాయం చీస్తున్నానా?", అని వాళ్ళను వాళ్లు ప్రశ్నించుకోవాలి. అలాగే, వేటూరిని విమర్శించే ప్రతీ విధార్ధి, "నేను వ్రాసే ప్రతీ పరీక్షకీ నేను పరిపూర్ణంగా సంసిద్ధం అవుతున్నానా?", అని ప్రశ్నించుకోవాలి. ఐతే ఒకటి: అలాంటి రచయితలు లేరు నేను అనట్లేదు. కానీ, వాళ్లకు వేటూరి అంత లోతు, ఎత్తు, బరువు లేవు అని నా నమ్మకం. (శారీరకంగా కాదు అండోయ్, రచించడంలో). ఒక్క మాటలో చెప్పాలి అంతే వేటూరి ఎవరితోనూ పోల్చదగినవాడు కాదు. ఆయన స్థాయే వేరు.

నేను వేటూరికి వీరాభిమానిని. చెవులు, ముక్కు, నాలుక ఇత్యాది శరీరభాగాలని కోసుకుంటాను అని చెప్పను కానీ, మనసు ఐతే పారేసుకున్నాను ఆయన కవిత్వానికి. ఈయన రచనల్లో నాకు నచ్చిన లైన్స్ ఒక్కొక్కటిగా ఎక్కడైనా పేర్చాలి అనుకుంటున్నాను. ఆ భావంతోనే ఈ "వేటూరి నవరసాలు" అనే శీర్షిక మొదలుపెట్టాను.