Tuesday, October 27, 2009

పదాలకు వింత వ్యుత్పత్తుల ఉత్పత్తులు!

నా చిన్నతనం నుండి నాకు భాషల పట్ల ఇష్టం, ఒక రకమైన అభిరుచి ఉన్నాయి. అందులోనూ ఎంతో కొంత కవిని ఆయే! ఇంక కొత్త పదం తెలియడమేమిటి, దానికి వ్యుత్పత్తి ఏంటో నేనే ఊహించి చెప్పెయ్యడం మొదలెట్టేసాను. అలాంటివి:

సప్తపది: సప్త అంతే ఏడు కాబట్టి ఏడు పదులు డబ్భై అనుకునేవాడిని. సప్తపది సినిమా గురించి తొలుత విన్నప్పుడు నా వయసు వర్షసప్తకం!

దత్తపది: పది పదాలు ఇచ్చి మిగతావి వ్రాయమంటారు కాబట్టి దత్తపది. ఒక సారి మా ఫ్రెండ్ కి నాలుగు పదాలు ఇచ్చి, "ఇది దత్త-నాలుగు" అన్నాను కూడా :-)

అనవసరం: ఇంగ్లీష్ "అన్" + "అవసరం". అంటే, "అన్" + "నేసెస్సరీ" లాగా అన్నమాట. అలాగే, "అశేషం" అంటే "అ" + "శేషం". మన "అ" + "టిపికల్" లాగా అన్న మాట. ఇది నేను చిన్నప్పుడైతే తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ ని కాపీ కొట్టేసారు అనుకునేవాడిని :-O

బ్రదర్: సంస్కృత "భ్రాతా" నుండి కాపీ కొట్టేసారు అనుకునేవాడిని. అలాగే, "నైట్" అనేది "నక్తం" నుండి వచ్చిందని బలంగా నమ్మేవాడిని. ఇందులో కొంత నిజం ఉన్నా ఆశ్చర్యపోనులెండి.

నాకు ఒక్కోసారి జంధ్యాల సినిమాలో "సుత్తి వీరభద్రరావు" గుర్తొస్తూ ఉంటాడు. "అసలు న్యూటన్ అనేవాడి అసలు పేరు "నూతనుడు". వాడు బెంగాలీయుడు!" అని ఉద్ఘాటించినట్లు నేను కూడా చాలా అర్థాలు "డిసైడ్" చేసేసేవాడిని.

ఇవి ఇలాగ ఉంటే, నిజంగా కొన్ని మామూలు పదాలకు చాలా పెద్ద పెద్ద అర్థాలు ఏర్పరుస్తారు జనాలు. అది ఇంకా విచిత్రం. ఉదాహరణకి:

నాయాలు: "నా + ఆలు" అంటే "నా భార్య" అని అర్థం. ప్రియురాలు, జవరాలు, ఇల్లాలు అన్నీ కూడా తెలుగు సంధులే. ఈ నాయాలు అనే పదం తొలుత మా సోదరుడు "లవ-కుశ" చిత్రంలో "ఒల్లనోయి మామా, నీ పిల్లను" అనే పాటనుండి గ్రహించి నాకు అజ్ఞానం నుండి విమోచనం కలిగించాడు!

శ్రాద్ధం: "శ్రద్ధ" గా చేసేది కాబట్టి శ్రాద్ధం! అలాగే, "తద్దినం" అంటే "తత్ + దినం" అంటే "ఆ రోజు" అని అర్థము. ఈ రెండు పదాలు ఎప్పుడూ కొంచం అశుభసందర్భాలలోనే వాడతారు.

మరి కొందరు పదాల అర్థాలకు తోడ్పడేలాగా పదాలను పలుకుతారు. మచ్చుక్కి:

లెఖ్ఖ: అసలు పదం "లెక్క". కానీ, "లెక్క సరిగ్గా ఉండాలి" అనే భావంతో ఆ "సరిగ్గా" మీద కక్ష/కాంక్షా తీసుకొచ్చి ఈ "లెక్క" మీద రుద్ది "లెఖ్ఖ" చేస్తారు!

ఉచ్ఛారణ: అసలు పదం "ఉచ్చారణ". "ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి" అనే ఆవేశంతో స్పష్టాన్ని క్లిష్టం చేసి ఉచ్ఛారణ చేసారు. ఇది ఇంగ్లీష్ లోనూ ఉంది "pronunciation" ని "pronounciation" చేసేస్తారు. ఏమైనా, మనకు కావలసింది pronunciation ఏ కానీ, spelling కాదు కదా!

ఖర్మ: అసలు ఈ "ఖర్మ" ఎక్కడనుండి వచ్చిందా అని నేను తెగ ఆలోచించేవాడిని. బ్రహ్మానందం భాషలో ఇది "కర్మ" కు పట్టిన "కర్మాయ్" :) ఎంతో విసుగ్గా ఉండి, "ఇది నా కర్మఫలితము. ఎవర్నీ అనుకోవడానికి లేదు", అనే లోతైన వేదసూత్రాన్ని "నెత్తీ నోరు బాదుకుని" చెప్పిన ఫలితం దక్కాలని "ఖర్మ" గా మార్చారు.

తెలుగు పద్యాలు చదివేటప్పుడు కొందరు చేసే దోషాలు బాగా నవ్విస్తాయి. "రామునితో కపివరుండు ఇట్లనియె" ని "రాముని తో పివరుండు ఇట్లనియె" అని "పండగ" సినిమా లో చూసి "ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తారా?", అనుకునే వాళ్లు అవాక్కయ్యేలాగా మా తమ్ముడి క్లాసు లో కొందరు, కృష్ణుడితో ద్రౌపది తన ఆవేదనను వ్యక్తం చేస్తూ చెప్పిన పద్యంలో ఒక పదాన్ని "పంక-జనాభా" అని పలికారు. పాపం, "పంకజ-నాభుడికి" "కలియుగం మొదలయ్యింది, జనాభా అంతా పంకమయం అయ్యింది", అని ద్రౌపది చెప్తోంది అనుకున్నారో ఏమో!

6 comments:

విశ్వ ప్రేమికుడు said...

నాకు మీరు చెప్పేవరకూ ఉచ్ఛారణ అనకూడదని తెలియదు. బాగా రాశారు. ఏదో పాఠం చెబుతున్నట్టు గాకుండా, సరదాగా అందరికీ గుర్తుండే విధంగా రాశారు. ధన్యవాదాలు. :)

కొత్త పాళీ said...

బా .. గుబాగు! :)

అబ్రకదబ్ర said...

బాగుంది మీ భాషావేశం.

నేనెక్కడో విన్న జోకు. అదేదో పల్లెటూర్లో ఓ హోటల్ ముందు వేలాడుతున్న బోర్డుపైనున్న రాత:

'ఇచ్చట భోజనం మరి యువసతి లభించును'

భావన said...

బాగుంది. నేను ఖర్మ అనే పదం నిజం గా వుందనే అనుకున్నా ఇన్నాళ్ళు.. :-(
మల్లె పందిరి లో అనుకుంటా బాలు పాడతారు.. నాకు తెలుగు రాదండీ అని "తొలి చూపు తో రణమాయే, కల్యాణ కా రణమాయే" అని.. ;-)

ఎస్పీ జగదీష్ said...

ఈ విషయం పై నేను రాసిన బ్లాగు చదవండి... ఇంగ్లీష్ భాష యొక్క సంస్కృత భాషా మూలాలు. http://saradaa.blogspot.com/2008/07/blog-post_15.html

sivaranjani said...

చాలా బాగుంది మీ వివరణ . నాకు కూడ ఇలాగే దినం అంటే రోజు అని తెలిసేది కాదు