Sunday, August 1, 2010

ప్రతీపాలంకారము

వ్యాకరణం -> అలంకారములు -> అర్థాలంకారములు -> ప్రతీపాలంకారము


లక్షణం: ప్రతీపం ఉపమానస్య ఉపమేయత్వప్రకల్పనం
వివరణ: ఉపమానంగా ప్రసిద్ధమైనదానికి ఉపమేయంగా వాడటాన్ని ప్రతీపాలంకారం అంటారు.

ఉదా:- (రేరాణి, రచన: ఎల్. నాగలక్ష్మి)
రాణి! నీయందముతో సరి రతిదైన
యందమని సురాంగనలందురక్కజముతో

సాధారణంగా స్త్రీ సౌందర్యాన్ని రతిసౌందర్యంతో పోలుస్తారు. అప్పుడు రతిసౌందర్యం ఉపమానం అవుతుంది, స్త్రీ సౌందర్యం ఉపమేయం అవుతుంది. కానీ, ఇక్కడ "రాణి అందానికి సాటి రతిసౌందర్యం" అనడంతో రతిసౌందర్యం ఉపమేయం, రాణిసౌందర్యంతో ఉపమానం అయ్యాయి. దీన్నే ప్రతీపాలంకారం అంటారు.


ఉదా:- (చంద్రాలోకం, రచన: ఆడిదము సూరకవి)
పద్మము నీ లోచనముతో సమానం

సాధారణంగా కన్నుని పద్మంతో పోలుస్తారు. కానీ, ఇక్కడ పద్మాన్నే కన్నుతో పోల్చడం జరిగింది కనుక ఇది ప్రతీపాలంకారం.


ఈ అలంకారానికి చలనచిత్రగీతాల్లో ఉదాహరణలు నాకు తెలియవు. చదువర్లకు తెలిస్తే చెప్పగలరు.

ఉపమేయోపమాలంకారము

వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> ఉపమేయోపమాలంకారము


లక్షణం: పర్యాయేణ ద్వయోస్తచ్చేదుపమేయోపమా మతా
వివరణ: రెండు వస్తువులను ఒకదానికి ఒకటి ఉపమానంగా వాడితే అది ఉపమేయోపమానం అవుతుంది.

ఉదా:- (చంద్రాలోకం, రచన: ఆడిదము సూరకవి)
ఓ రాజా! నీయందు ధర్మము అర్థము వలెను, అర్థము ధర్మము వలెను శ్రీమంతములు.

ఇక్కడ ధర్మము, అర్థము అని రెండు వస్తువులు ఉన్నాయి. మొదట, "ధర్మము అర్థము వలెను శ్రీమంతము" అన్నప్పుడు: ధర్మము ఉపమేయము, అర్థము ఉపమానము. తఱువాత, "అర్థము ధర్మము వలెను శ్రీమంతము" అన్నప్పుడు: అర్థము ఉపమేయము, ధర్మము ఉపమానము. ఈ విధంగా రెండు వస్తువులను ఒకదానికొకటి ఉపమానంగా వాడటాన్ని ఉపమేయోపమాలంకారము అంటారు.


ఉదా:- (కావ్యాలంకారసంగ్రహం, రచన: రామరాజభూషణుడు)
ఆ నరసింహునికి ఈ నరసింహరాయలు సాటి. ఈ నరసింహరాయలుకు ఆ నరసింహుడు సాటి.


ఉదా:- (చిత్రం: నీ స్నేహం, రచన: సిరివెన్నెల)
వివరిస్తున్నది అద్దం, మన అనుబంధానికి అద్దం; నువు నాలాగా నే నీలాగా కనిపించడమే సత్యం.


చలనచిత్రాలనుండి నాకు ఉదాహరణలు ఆట్టే తెలియవు. చదువర్లకు తెలిస్తే చెప్పగలరు.