Saturday, May 30, 2009

ఉపమానాలు

దైనందిక జీవితం లో మాటల్లో మంచి మంచి ఉపమానాలు వాడటం అన్నది ఒక కళ. అది అంత సులువు కాదండోయ్! దానికి బాగా గమనించే శక్తి కావాలి. త్రివిక్రం అతడులో మంచి డైలాగ్ వ్రాసాడు, "చూడరా నాన్న పొట్ట మన స్కూల్ బెంచి లాగ ఎంత గట్టిగా ఉందొ", అని. నాకు భలే నచ్చింది. చిన్నపిల్లల మాట్లాడుకునే భాషని బాగా గమనించినట్టు అనిపించింది. అలాంటివే ఈ మధ్యన నేను విన్నవి/అన్నవి.

% మా ఫ్రెండ్ ఒకడు నేను gtalk లో online ఉండగా తల/తోక లేకుండా ఒక లింక్ నా మోహన కొట్టాడు. ఆ తరువాత నాకు ఫోన్ చేసి, "ఏరా చదివావా?", అని అడిగాడు. "కాకి రెట్టేసినట్టు లింక్ నా నెత్తిన వేస్తె చదవడానికి నాకు పని లేదు అనుకున్నావా?", అని కొంచం పరుషంగా అన్నాను. gtalk లో లింక్ ని కాకి రెట్టతో పోల్చిన నా అనుభవానికి అతడు ఖిన్నుడయ్యాడు.
% ఒక స్నేహితురాలు పెళ్లి చేసుకుంటూ కూడా తనకు invitation పంపలేదు అని నా మిత్రుడు బాధపడ్డాడు. అప్పుడు నేను, "ఎవరో ఎవర్నో పెళ్లి చేసుకుంటూ నీకు invitation పంపలేదు అని, నువ్వు bit-paper పోయిన 10th కుర్రాడిలాగా ఎందుకురా బుర్ర పాడుచేసుకుంటావు?", అన్నాను. వాడు ఆ పోలిక తట్టుకోలేక పడిపడి నవ్వాడు.
% మా అన్నయ్య మిత్రుడు ఒకతను నాకు బాగా క్లోజ్. అతడికి కూడా ఈ వింత పోలికలు పోల్చడం బాగా అలవాటు. మంచి చ్రేతివిత్య్ ఉన్న వ్యక్తీ. వాళ్ల సీనియర్ మేనేజర్ ఒకతను US నుండి వచ్చి వల్ల ఆఫీసు లో Indian toilets చూస, "ఇది ఎలాగా వాడతారు?", అని అడిగాడట. వెంటనే అక్కడ టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తుంటే అది చూపించి, "See the wicket-keeper. Same to same", అన్నాడుట.

ఇలాంటివి చెప్పాలంటే మన తరం కంటే ముందుతరం వాళ్ళు బాగా చెప్తారు. ముఖ్యంగా మా దూరపుబంధువు ఒకాయన ఇచ్చే ఉపమానాలు ఉంటాయి - బాబొయ్ - వినగానే విపరీతంగా నవ్వాలి. మనమే victim ఐతే విరక్తి పొందాలి :) ఒక్క ఉదాహరణ చెప్తాను. విని తట్టుకోగాలిగితే తట్టుకోండి. కొంచం అసభ్యంగా అనిపించవచ్చు, అనుకోనేట్టైతే చదవటం మానేయ్యండి.

% ఎనభై ఏళ్ల వయసులో ఆయన చూడంది లేదు. ఆయన అనుభవంతో ఎందరికో సలహాలు ఇస్తారు (వాళ్ళు అడిగినప్పుడే). ఐతే కొంతమంది మొండి గావినరు. అలాంటప్పుడు, ఆయన "ఐతే నీ ఇష్టం అంటారు", వదిలేస్తారు. అదే ఆ మనిషి ఆయనకు బాగా కావలసిన వాడైతే, "దొడ్లోకెళ్తూ దోసకాయ తినకురా అంటే నీకెందుకు నంజుకుతింటాను అనేవాడితో నేనేమి చెప్తాను మహాప్రభో, నీ ఇష్టం", అంటారు. అది విన్నవాడికి జీవితం మీద విరక్తి వచ్చి చేసేపని ఆపేస్తాడు :)

Sunday, May 24, 2009

తెలుగింటి తలకట్టు

కృష్ణుడు "యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత", అంటూ శ్లోకం చెప్పాడు. అంటే, ధర్మానికి హాని జరిగితే నేను వచ్చి అడ్డుకుంటాను అని. అలాగే వేటూరి "చక్కనైన బాణీ అందిస్తే దానికి నేను అన్యాయం చెయ్యను", అని చెప్పకనే చాలా సార్లు చెప్పాడు. పోలిక ఓవర్గా ఉన్నా, విషయం ఏమిటంటే: ఎన్నో చిన్న బుడ్జెట్ సినిమాలకి, ఊరూపేరు తెలియని సంగీతదర్సకులకి కూడా చక్కని పాటలని అందించాడు. అందుకు ఉదాహరణ ఈవేళ నేను చెప్పబోయే పాట.

ఈ పాట భజంత్రీలు సినిమాలోనిది. సంగీతదర్శకుడు చక్రి. ఈ పాటకు బాణీ చెవికోసిన మేకకు ఆకలేసినట్టుగా లేదు. అచ్చతెలుగు బాణీ. జానపదం లాగా సాగిపోతుంది. అందుకు వేటూరి న్యాయం చేకూర్చాడు. ఈ పాట వేటూరి వ్రాశాడు అని నేను శైలిని బట్టి కొంత, telugufm websiteని బట్టి కొంత నమ్ముతున్నాను. ఇంతకీ పాట చెల్లెలికి అన్నలకు మధ్యలో సాగుతుంది.

సిరిమువ్వ చిరునవ్వమ్మ, చిలకమ్మ, సిగపూవమ్మ
మా చెల్లి చేమంతమ్మ, రాధమ్మా రావమ్మ
మా ముద్దు మురిపం నీవమ్మా, మలిపొద్దు దీపం కావమ్మ

సిరిమువ్వ చిరునవ్వు అంటే ఘల్లుమనే శబ్దం. "సిరిమువ్వ చిరునవ్వమ్మ" అనడం లో జానపదం చక్కగా తొణికిసలాడుతోంది. చెల్లిని సిగపూవుతో, సిరిమువ్వ శబ్దంతో, చిలకంమతో, సిగలోపువ్వుతో, మలిపొద్దులో దీపంతో పోల్చడంలో ఆశ్చర్యమేమీ లేదు కానీ, "రాధమ్మ" తో పోల్చడం ఏమిటో నాకూ అర్థం కాలేదు. కానీ, రాధా అనురగావతి అనే ఉద్దేశంతో వ్రాసి ఉండవచ్చు.

ఎన్నెన్నో వయ్యారాల ఎన్నెల్లో గోదారంమా నీలాల లాల పొయ్యాల
పచ్చని సింగారాల మా పల్లె బంగారమ్మ పాదాల పారానేట్టాల
నీ కట్టు నీ బొట్టు తెలుగింటి తలకట్టు, చూసి ఎవరు వస్తారో నీ జట్టు?
పున్నాగ సన్నాఎట్టి మా గుండె తాళాలుఎట్టి, చేస్తాము పెళ్లి పేరంటం

గోదావరి నది తనకు స్నానం చేయించాలి, పచ్చగా ఉండే ఊరు తనకు పాదాల పారాణి కావలి అని కోరుకుంటున్న అన్నయ్యలు తన చేల్లెల్లి తెలుగుదనాన్ని అక్షరాల్లో వాడే "తలకట్టు" (గౌరవం) తో పోల్చడం ఈ పాటకే ఒక వన్నె తెచ్చింది.

ముగ్గింటి ముంగిల్లమ్మ పెళ్ళాడి వేల్లెవేల ఆకాశ గంగే మా కళ్లు
పెరటింటి మా తులసమ్మ పక్కిల్లు చేరెవేల మా కళ్ళే మూయని వాకిళ్ళు

ఇంక చెల్లెలి వివాహం జరుగుతుంటే అన్నలు పడే ఆవేదనని ఇక్కడ మళ్ళీ చక్కగా వర్ణించారు. "ముగ్గులు వేసిన ముంగిలి" గా తమ ముందు తిరిగిన చెల్లెలు వెళ్తే వీరి కళ్ళల్లో ఆకాశగంగ పొంగుతుంది. "పెరటింట్లో ఉండే తులసమ్మ" పక్కింటికి నడుచుకుని వెళ్తుంటే వాకిలి బైట ఎవరిదో రాక కోసం ఎదురుచూస్తూ తలుపు తెరుచుకున్నట్టు తమ కళ్లు తెరుచుకుని ఉండిపోతామనడం నిజమైన కాపీనాన్ని తలపింపచేస్తుంది

పుట్టింటి కూతుళ్ళు మెట్టింటి కోడళ్ళు, మెచ్చాలి నిన్నే ఊరోళ్ళు
మరువకు అన్నలను మరలిరాని ఈ నిన్నలను, చెల్లి నీ వెన్నెల నీడలము

ఎంత ప్రేమ ఉన్నా ఈడు వచ్చిన ఆడపిల్ల "ఆడ" పిల్ల కానీ ఈడ పిల్ల కాదు. అదే ధృవీకరిస్తూ, మెట్టినింటిలో మంచిపేరు తెచ్చుకోవాలని చెప్తున్నాడు అన్నయ్య. "ఈ అన్నలు మరలి రాని నిన్నలు" అనడంలో గీతాకారుడి మాటల చతురతే కాకుండా భావాల లోతు కూడా కనిస్తోంది.

ఇంక అన్నిటికంటే ధృవంగా ఇది వేటూరి పాటే అని చెప్తున్నది ఈ ఆఖరి వాక్యం చూసే. "నీ వెన్నెల నీడలం" అనడం ఒక్క వేటూరికే సాధ్యం ఏమో అనిపిస్తుంది. తమ చెల్లెల్ని నిండు వెన్నెలతో పోల్చి, తము కేవలం తన మమతానురాగాలకు నీడలం మాత్రమె అని చెప్తూ, తను లేని నాడు తామూ లేము అని చెప్పడానికి అన్నలు ఎంచుకున్న వాక్యం ఇది.

ఈ పాట వ్రాసింది వేటూరి అయినా కాకపోయినా వ్రాసిన వారికి వంద వందనాలు! తెలుగుదనం ఇంకా మన సినిమా పాటల్లో బ్రతికే ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఆధారం.

Saturday, May 23, 2009

DNA జాను

స్నేహితులమందరమూ తీరిగ్గా కూర్చున్నాము. ఇందులో సుబ్బు మిమిక్రీ చెయ్యడంలో సిద్ధగాత్రుడు (అంటే సిద్ధహస్తుడు అంటే చేతికి సంబంధించిన విద్యలకు వాడతారేమో అని అలాగా అన్నాను). సరే సుబ్బు, శంకర్ మహదేవన్ లాగా పాడటం మొదలెట్టాడు. అప్పుడు మొదలైంది తంటా.

జాను: అవును మీకు శంకర్ మహదేవన్ తండ్రి ఎవరో తెలుసునా?
కిట్టు: తెలియదు. DNA పరీక్షలు జరిపించి తెలుసుకోవలసిన అంత పెద్ద విషయం కాదేమో (కిట్టు నోరు విప్పితే ద్వంద్వార్థాలే).
జాను: అలా కాదు. శంకర్ మహదేవన్ తండ్రి "కే వి మహదేవన్" అంది.
సుబ్బు: (ముఖకవళికలు బట్టి సంభావ్యత ఎంతో కాస్త ఆలోచించి చెప్తున్నట్టుగా ఆగి) ఇది ఎలాగుందో చెప్పనా? గోవుల గోపన్న తండ్రి కంచర్ల గోపన్న అన్నట్టు ఉంది.
జాను: ఏయ్, ఛి. మీరు ఏది నమ్మరు. నాకు కచ్చితంగా తెలుసును.
లచ్చి: ఎందుకు జాను నువ్వు టెన్షన్ పడటం. మనం ఇంటర్నెట్ లో చూసి రూఢీ చేసుకుందాం. (లచ్చికి లాప్టాప్ అంటే బహి:ప్రాణం, సెల్ ఫోన్ వాడి ఆయుధం అనుకోండి).
కిట్టు: (వీడికి పురాణాలు వినడం అలవాటు) జాను, ఇంకా ఇలాంటి నిగూఢ రహస్యాలు ఏమైనా ఉంటే చెప్పి మా కళ్లు తెరిపించ ప్రార్థిస్తున్నాను. (ఇది కుతూహలమో వెటకారమో అర్థం కావట్లేదు సభ్యులకి).
జాను: ఏమిటి మీకు అసలు సినిమా పరిజ్ఞానం లేదు అనుకుంటాను. ఇంక ఇలాంటివి బోళ్ళు తెలుసు నాకు.
రాగి: ఏవి, ఇంకో రెండు వదులు.
జాను: మీకు వినీత్ వాళ్ళ నాన్న ఎవరో తెలుసునా? సాక్షి రంగారావు.
రవి: అయ్యా బాబోయ్, ఇది ఘోరం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి జాను చేతికి చిక్కాము. ఎక్కడ అచ్చ తెలుగు నటుడు సాక్షి రంగారావు? ఎక్కడ కేరళలో పుట్టి కొబ్బరినూనెలో వేయించిన అప్పడాలు తినే వినీత్?
జాను: ఎహే, చెప్పేది వినండి. మీకు నగ్మా తెలుసునా?

మిగత వాళ్ళము "ఎందుకు తెలియదు?" అన్నట్టు expression పెట్టి, ఇప్పుడు తెలుసుకోబోయే జగమెరుగని సత్యం ఏమిటా అని ఎదురుచూస్తుంటే నమ్మలేని నిజం చెప్పింది జాను.

జాను
: అది L. విజయలక్ష్మి కూతురు.
బాలు: ఇదిగో, ఈ సుబ్బుగాడు చిన్నప్పుడు L.విజయలక్ష్మి ఫాన్స్.
కిట్టు: అమ్మా, DNA జాను. ఇంతసేపు తండ్రులని మారిస్తే పోనిలే ఏదో అవకాశం లేకపోలేదులే అనుకుని సరిపెట్టుకున్నాము. కానీ, నువ్వు ఇలాగ తల్లుల్నే మారిస్తే తట్టుకోవడంలో అశక్తులమౌతున్నాము.
సుగ్గు: ఛీ, ఇవన్నీ పచ్చి అబద్ధాలు. ఎవరు చెప్పారు?
జాను: ఎవరో చెప్తే ఎందుకు నమ్ముతాను? మా అన్నయ్య, తమ్ముడు చెప్పారు.
కిట్టు: విళ్ళేమైన వ్యాస భగవానుడి కజిన్ బ్రదర్స్ ఆ? చెప్తే ప్రశ్నించకుండా నమ్మెయ్యడానికి?
లచ్చి: చూడెహే, నేను ఇంటర్నెట్ లో వెతికేసాను. శంకర్ మహదేవన్ తండ్రి కే వి మహదేవన్ కాదు.
కిట్టు: హమ్మయ్య, పొనిలే ఏ లోకంలో ఉన్నా "కే వి మహదేవన్" ఆత్మకి శాంతి కలుగుతుంది.
జాను: ఎహే, నువ్వు ఇంటర్నెట్ ని నమ్ముతావా? మా అన్నయ్యలని నమ్మమంటావా?
రవి: చైనా దగ్గరా చందమామ దగ్గరా? (భావుకతతో సమాధానం ఇచ్చాడు).
సుగ్గు: ఇంకా ఏమైనా నిజాలు తెలుసునా DNA జాను?
జాను: సినిమా హీరోయిన్ రాశి లేదు? అది జయమాలిని కూతురు.

ఇది అంత చూస్తున్న బాలు, "ఇంతసేపు తను జ్యోతిష్యం ద్వారా కూడా కనుక్కోలేను కఠినమైన నిజాలు తన పక్కనే ఉంటూ ఏమి ఎరుగనిదానిలాగా మొహం పెట్టుకు తిరిగే జాను ఎలాగ తెలుసుకుంటోందో", అన్నట్టు నివ్వెరపోయాడు.

సుగ్గు: ఛీ, ఇలాగ features మ్యాచ్ అయ్యాయని తల్లుల్ని మార్చేస్తే మహాపాపం.
కిట్టు: (అదేదో సెన్సార్ బోర్డు మెంబెర్ లాగా ఫీల్ అయిపోతూ) సుగ్గూ, ఏమిటి ఆ బూతులు?
సుగ్గు: ఛీ పోరా నాటుగాడా, నా ఉద్దేశం ఏమిటి అంటే, ముఖంలో పోలికలు అని.
బాలు: రేయ్ కిట్టు, నువ్వు మరీ ఎక్కువ ఆలోచించకు.

జాను: మీరు ఏది నమ్మట్లేదు. మా పక్క ఇంటి ఫ్రెండ్స్ అయితే అన్నీ నమ్మేవారు.
కిట్టు: మీ ఫ్రెండ్స్ అంత గొప్పవాళ్ళం మేము కానందుకు చింతిస్తున్నాము. భవిష్యత్తులో అవుదామని ఐతే అనుకోవట్లేదు. నీ సావసంతో అయితే అది మా ప్రారబ్ధంగా భావిస్తాము.
లచ్చి: నువ్వు చెప్పినవాటిల్లో నిజలేమితో మనం ఇంటర్నెట్ లో వెతుకుదాము జాను. నువ్వు వీళ్ళన్న మాటలు పట్టించుకోకు.
రాగి: ప్రజాభిమానం పొందిన స్త్రీపురుషుల పితృదేవతలు ఆగ్రహించి జానుకు ఏ రాత్రివేళో కలలోకి రాక మునుపే మనం ఈ సభని ముగిద్దాం. ఎవరూ ఎరుగని సత్యాలను తెలియజెప్పిన జాను కి "DNA జాను" అనే బిరుదు బహూకరిస్తున్నాము. అందరం కలిసి ఒక్కసారి అరుంధతి ట్యూన్ లో "జానమ్మ జానమ్మ" అని పాడుదాము.

సభ సమాప్తం.

Tuesday, May 12, 2009

మూగబోయిన మోవిపై...

మూగబోయిన మోవిపై మోయలేని మౌనమో
చెలిమి లేదను చింతలో చిన్నబోయిన చిత్తమో
పలుకవేమని అడుగగా, అడుగు వేయని పలుకగా
అలిసిపోయిన ఆశగా ఆగిపోయా నేనిలా...
 
మసిబారిన కన్నులలో పసియాశలివి
ఉసురెరుగని శ్వాసలలో చిరువూసులివి
గుండె నిండుగా పండే వెండి వెన్నెలే
ఎండమావిగా మరే మండుటెండలో
వలపు సోకని నాడు శిలేగా మది స్వరూపం
గెలుపు దక్కని నాడు బలేగా లేత ప్రాయం

Tuesday, May 5, 2009

చెంత లేకుంటివే...

ఎప్పుడో 2007-జూన్-6 న చినుకులు పడుతుంటే ఉన్నట్టుండి పుట్టుకొచ్చిన కవిత. మొన్న వర్షం పడుతుంటే గుర్తు వచ్చింది.

సరసలేకుంటివే సఖియ
సరసమాడగ నాకు సరియైన వేళ

చల్లగాలులు మత్తు చల్లుచూ తాకంగ
నుల్లమెల్లను నీవెయూహలయ్యెనె సఖియ
పిల్లతెమ్మెర నిన్ను పిలువమంటున్నదె
చెల్లించ నా పలుకు చెంత చేరవె చెలియ

విల్లు ఎత్తిన మిన్ను విరహాల రేపంగ
విసిరెనే బాణాలు వేసారె ప్రాణాలు
జల్లు కురిసెడివేళ జవరాల రావటే
జాగుసేయుదువేల జతగూడరాదటే?