Saturday, May 23, 2009

DNA జాను

స్నేహితులమందరమూ తీరిగ్గా కూర్చున్నాము. ఇందులో సుబ్బు మిమిక్రీ చెయ్యడంలో సిద్ధగాత్రుడు (అంటే సిద్ధహస్తుడు అంటే చేతికి సంబంధించిన విద్యలకు వాడతారేమో అని అలాగా అన్నాను). సరే సుబ్బు, శంకర్ మహదేవన్ లాగా పాడటం మొదలెట్టాడు. అప్పుడు మొదలైంది తంటా.

జాను: అవును మీకు శంకర్ మహదేవన్ తండ్రి ఎవరో తెలుసునా?
కిట్టు: తెలియదు. DNA పరీక్షలు జరిపించి తెలుసుకోవలసిన అంత పెద్ద విషయం కాదేమో (కిట్టు నోరు విప్పితే ద్వంద్వార్థాలే).
జాను: అలా కాదు. శంకర్ మహదేవన్ తండ్రి "కే వి మహదేవన్" అంది.
సుబ్బు: (ముఖకవళికలు బట్టి సంభావ్యత ఎంతో కాస్త ఆలోచించి చెప్తున్నట్టుగా ఆగి) ఇది ఎలాగుందో చెప్పనా? గోవుల గోపన్న తండ్రి కంచర్ల గోపన్న అన్నట్టు ఉంది.
జాను: ఏయ్, ఛి. మీరు ఏది నమ్మరు. నాకు కచ్చితంగా తెలుసును.
లచ్చి: ఎందుకు జాను నువ్వు టెన్షన్ పడటం. మనం ఇంటర్నెట్ లో చూసి రూఢీ చేసుకుందాం. (లచ్చికి లాప్టాప్ అంటే బహి:ప్రాణం, సెల్ ఫోన్ వాడి ఆయుధం అనుకోండి).
కిట్టు: (వీడికి పురాణాలు వినడం అలవాటు) జాను, ఇంకా ఇలాంటి నిగూఢ రహస్యాలు ఏమైనా ఉంటే చెప్పి మా కళ్లు తెరిపించ ప్రార్థిస్తున్నాను. (ఇది కుతూహలమో వెటకారమో అర్థం కావట్లేదు సభ్యులకి).
జాను: ఏమిటి మీకు అసలు సినిమా పరిజ్ఞానం లేదు అనుకుంటాను. ఇంక ఇలాంటివి బోళ్ళు తెలుసు నాకు.
రాగి: ఏవి, ఇంకో రెండు వదులు.
జాను: మీకు వినీత్ వాళ్ళ నాన్న ఎవరో తెలుసునా? సాక్షి రంగారావు.
రవి: అయ్యా బాబోయ్, ఇది ఘోరం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి జాను చేతికి చిక్కాము. ఎక్కడ అచ్చ తెలుగు నటుడు సాక్షి రంగారావు? ఎక్కడ కేరళలో పుట్టి కొబ్బరినూనెలో వేయించిన అప్పడాలు తినే వినీత్?
జాను: ఎహే, చెప్పేది వినండి. మీకు నగ్మా తెలుసునా?

మిగత వాళ్ళము "ఎందుకు తెలియదు?" అన్నట్టు expression పెట్టి, ఇప్పుడు తెలుసుకోబోయే జగమెరుగని సత్యం ఏమిటా అని ఎదురుచూస్తుంటే నమ్మలేని నిజం చెప్పింది జాను.

జాను
: అది L. విజయలక్ష్మి కూతురు.
బాలు: ఇదిగో, ఈ సుబ్బుగాడు చిన్నప్పుడు L.విజయలక్ష్మి ఫాన్స్.
కిట్టు: అమ్మా, DNA జాను. ఇంతసేపు తండ్రులని మారిస్తే పోనిలే ఏదో అవకాశం లేకపోలేదులే అనుకుని సరిపెట్టుకున్నాము. కానీ, నువ్వు ఇలాగ తల్లుల్నే మారిస్తే తట్టుకోవడంలో అశక్తులమౌతున్నాము.
సుగ్గు: ఛీ, ఇవన్నీ పచ్చి అబద్ధాలు. ఎవరు చెప్పారు?
జాను: ఎవరో చెప్తే ఎందుకు నమ్ముతాను? మా అన్నయ్య, తమ్ముడు చెప్పారు.
కిట్టు: విళ్ళేమైన వ్యాస భగవానుడి కజిన్ బ్రదర్స్ ఆ? చెప్తే ప్రశ్నించకుండా నమ్మెయ్యడానికి?
లచ్చి: చూడెహే, నేను ఇంటర్నెట్ లో వెతికేసాను. శంకర్ మహదేవన్ తండ్రి కే వి మహదేవన్ కాదు.
కిట్టు: హమ్మయ్య, పొనిలే ఏ లోకంలో ఉన్నా "కే వి మహదేవన్" ఆత్మకి శాంతి కలుగుతుంది.
జాను: ఎహే, నువ్వు ఇంటర్నెట్ ని నమ్ముతావా? మా అన్నయ్యలని నమ్మమంటావా?
రవి: చైనా దగ్గరా చందమామ దగ్గరా? (భావుకతతో సమాధానం ఇచ్చాడు).
సుగ్గు: ఇంకా ఏమైనా నిజాలు తెలుసునా DNA జాను?
జాను: సినిమా హీరోయిన్ రాశి లేదు? అది జయమాలిని కూతురు.

ఇది అంత చూస్తున్న బాలు, "ఇంతసేపు తను జ్యోతిష్యం ద్వారా కూడా కనుక్కోలేను కఠినమైన నిజాలు తన పక్కనే ఉంటూ ఏమి ఎరుగనిదానిలాగా మొహం పెట్టుకు తిరిగే జాను ఎలాగ తెలుసుకుంటోందో", అన్నట్టు నివ్వెరపోయాడు.

సుగ్గు: ఛీ, ఇలాగ features మ్యాచ్ అయ్యాయని తల్లుల్ని మార్చేస్తే మహాపాపం.
కిట్టు: (అదేదో సెన్సార్ బోర్డు మెంబెర్ లాగా ఫీల్ అయిపోతూ) సుగ్గూ, ఏమిటి ఆ బూతులు?
సుగ్గు: ఛీ పోరా నాటుగాడా, నా ఉద్దేశం ఏమిటి అంటే, ముఖంలో పోలికలు అని.
బాలు: రేయ్ కిట్టు, నువ్వు మరీ ఎక్కువ ఆలోచించకు.

జాను: మీరు ఏది నమ్మట్లేదు. మా పక్క ఇంటి ఫ్రెండ్స్ అయితే అన్నీ నమ్మేవారు.
కిట్టు: మీ ఫ్రెండ్స్ అంత గొప్పవాళ్ళం మేము కానందుకు చింతిస్తున్నాము. భవిష్యత్తులో అవుదామని ఐతే అనుకోవట్లేదు. నీ సావసంతో అయితే అది మా ప్రారబ్ధంగా భావిస్తాము.
లచ్చి: నువ్వు చెప్పినవాటిల్లో నిజలేమితో మనం ఇంటర్నెట్ లో వెతుకుదాము జాను. నువ్వు వీళ్ళన్న మాటలు పట్టించుకోకు.
రాగి: ప్రజాభిమానం పొందిన స్త్రీపురుషుల పితృదేవతలు ఆగ్రహించి జానుకు ఏ రాత్రివేళో కలలోకి రాక మునుపే మనం ఈ సభని ముగిద్దాం. ఎవరూ ఎరుగని సత్యాలను తెలియజెప్పిన జాను కి "DNA జాను" అనే బిరుదు బహూకరిస్తున్నాము. అందరం కలిసి ఒక్కసారి అరుంధతి ట్యూన్ లో "జానమ్మ జానమ్మ" అని పాడుదాము.

సభ సమాప్తం.

No comments: