Sunday, May 24, 2009

తెలుగింటి తలకట్టు

కృష్ణుడు "యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత", అంటూ శ్లోకం చెప్పాడు. అంటే, ధర్మానికి హాని జరిగితే నేను వచ్చి అడ్డుకుంటాను అని. అలాగే వేటూరి "చక్కనైన బాణీ అందిస్తే దానికి నేను అన్యాయం చెయ్యను", అని చెప్పకనే చాలా సార్లు చెప్పాడు. పోలిక ఓవర్గా ఉన్నా, విషయం ఏమిటంటే: ఎన్నో చిన్న బుడ్జెట్ సినిమాలకి, ఊరూపేరు తెలియని సంగీతదర్సకులకి కూడా చక్కని పాటలని అందించాడు. అందుకు ఉదాహరణ ఈవేళ నేను చెప్పబోయే పాట.

ఈ పాట భజంత్రీలు సినిమాలోనిది. సంగీతదర్శకుడు చక్రి. ఈ పాటకు బాణీ చెవికోసిన మేకకు ఆకలేసినట్టుగా లేదు. అచ్చతెలుగు బాణీ. జానపదం లాగా సాగిపోతుంది. అందుకు వేటూరి న్యాయం చేకూర్చాడు. ఈ పాట వేటూరి వ్రాశాడు అని నేను శైలిని బట్టి కొంత, telugufm websiteని బట్టి కొంత నమ్ముతున్నాను. ఇంతకీ పాట చెల్లెలికి అన్నలకు మధ్యలో సాగుతుంది.

సిరిమువ్వ చిరునవ్వమ్మ, చిలకమ్మ, సిగపూవమ్మ
మా చెల్లి చేమంతమ్మ, రాధమ్మా రావమ్మ
మా ముద్దు మురిపం నీవమ్మా, మలిపొద్దు దీపం కావమ్మ

సిరిమువ్వ చిరునవ్వు అంటే ఘల్లుమనే శబ్దం. "సిరిమువ్వ చిరునవ్వమ్మ" అనడం లో జానపదం చక్కగా తొణికిసలాడుతోంది. చెల్లిని సిగపూవుతో, సిరిమువ్వ శబ్దంతో, చిలకంమతో, సిగలోపువ్వుతో, మలిపొద్దులో దీపంతో పోల్చడంలో ఆశ్చర్యమేమీ లేదు కానీ, "రాధమ్మ" తో పోల్చడం ఏమిటో నాకూ అర్థం కాలేదు. కానీ, రాధా అనురగావతి అనే ఉద్దేశంతో వ్రాసి ఉండవచ్చు.

ఎన్నెన్నో వయ్యారాల ఎన్నెల్లో గోదారంమా నీలాల లాల పొయ్యాల
పచ్చని సింగారాల మా పల్లె బంగారమ్మ పాదాల పారానేట్టాల
నీ కట్టు నీ బొట్టు తెలుగింటి తలకట్టు, చూసి ఎవరు వస్తారో నీ జట్టు?
పున్నాగ సన్నాఎట్టి మా గుండె తాళాలుఎట్టి, చేస్తాము పెళ్లి పేరంటం

గోదావరి నది తనకు స్నానం చేయించాలి, పచ్చగా ఉండే ఊరు తనకు పాదాల పారాణి కావలి అని కోరుకుంటున్న అన్నయ్యలు తన చేల్లెల్లి తెలుగుదనాన్ని అక్షరాల్లో వాడే "తలకట్టు" (గౌరవం) తో పోల్చడం ఈ పాటకే ఒక వన్నె తెచ్చింది.

ముగ్గింటి ముంగిల్లమ్మ పెళ్ళాడి వేల్లెవేల ఆకాశ గంగే మా కళ్లు
పెరటింటి మా తులసమ్మ పక్కిల్లు చేరెవేల మా కళ్ళే మూయని వాకిళ్ళు

ఇంక చెల్లెలి వివాహం జరుగుతుంటే అన్నలు పడే ఆవేదనని ఇక్కడ మళ్ళీ చక్కగా వర్ణించారు. "ముగ్గులు వేసిన ముంగిలి" గా తమ ముందు తిరిగిన చెల్లెలు వెళ్తే వీరి కళ్ళల్లో ఆకాశగంగ పొంగుతుంది. "పెరటింట్లో ఉండే తులసమ్మ" పక్కింటికి నడుచుకుని వెళ్తుంటే వాకిలి బైట ఎవరిదో రాక కోసం ఎదురుచూస్తూ తలుపు తెరుచుకున్నట్టు తమ కళ్లు తెరుచుకుని ఉండిపోతామనడం నిజమైన కాపీనాన్ని తలపింపచేస్తుంది

పుట్టింటి కూతుళ్ళు మెట్టింటి కోడళ్ళు, మెచ్చాలి నిన్నే ఊరోళ్ళు
మరువకు అన్నలను మరలిరాని ఈ నిన్నలను, చెల్లి నీ వెన్నెల నీడలము

ఎంత ప్రేమ ఉన్నా ఈడు వచ్చిన ఆడపిల్ల "ఆడ" పిల్ల కానీ ఈడ పిల్ల కాదు. అదే ధృవీకరిస్తూ, మెట్టినింటిలో మంచిపేరు తెచ్చుకోవాలని చెప్తున్నాడు అన్నయ్య. "ఈ అన్నలు మరలి రాని నిన్నలు" అనడంలో గీతాకారుడి మాటల చతురతే కాకుండా భావాల లోతు కూడా కనిస్తోంది.

ఇంక అన్నిటికంటే ధృవంగా ఇది వేటూరి పాటే అని చెప్తున్నది ఈ ఆఖరి వాక్యం చూసే. "నీ వెన్నెల నీడలం" అనడం ఒక్క వేటూరికే సాధ్యం ఏమో అనిపిస్తుంది. తమ చెల్లెల్ని నిండు వెన్నెలతో పోల్చి, తము కేవలం తన మమతానురాగాలకు నీడలం మాత్రమె అని చెప్తూ, తను లేని నాడు తామూ లేము అని చెప్పడానికి అన్నలు ఎంచుకున్న వాక్యం ఇది.

ఈ పాట వ్రాసింది వేటూరి అయినా కాకపోయినా వ్రాసిన వారికి వంద వందనాలు! తెలుగుదనం ఇంకా మన సినిమా పాటల్లో బ్రతికే ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఆధారం.

2 comments:

కొత్త పాళీ said...

nice.
సినిమాలో ఆ అమ్మాయి పాత్ర పేరు రాధ అయ్యుండొచ్చు.

వేమన said...

Good one

ఎంతైనా వేటూరి వేటూరే !