Saturday, August 30, 2008

పొలాల అమావాస్య

శ్రావణ బహుళ అమావాస్య (అంటే దసరా ముందు వచ్చే అమావాస్య అన్నమాట) నాడు పోలాల అమావాస్య అంటారు. పండగపూట కందమొక్కకు పూజ చేస్తారు. పూజలో భాగంగా కథ చెప్తారు. ఈ రోజు కథ విన్నదాన్ని బట్టి నాకు అర్థమైనది ఏమిటి అంటే - ఇది పెళ్ళయిన ఆడవాళ్ళు పిల్లల (శ్రేయస్సు) కోసం చేస్తారు అని. కథ క్లుప్తం గా చెప్పాలి అంటే:

"
ఒక కుటుంబం లో ఏడుగురు కొడుకులు. అందరికీ పెళ్లిళ్ళు చేస్తారు. అందులో, ఏదో కోడలికి ఏట పిల్లాడు పుడతాడు. కానీ పోలాల అమావాస్య రోజు చనిపోతాడు. అలాగా ఆరు సంవత్సరాలు జరుగుతుంది. అప్పటికే ఆమె తోడికోడళ్ళు దేప్పటం మొదలుపెడతారు - ఆమె వలన వారు పండుగ జరుపుకోలేకపోతున్నారు అని. బాధ భరించలేక ఎదవ సంవత్సరం పిల్లాడు కోన ఊపిరితో ఉండగానే అతడిని ఒక చాపలో చుట్టేసి ఉన్చేస్తుంది. అందరూ పూజ చేసుకుంటారు. అది అయ్యాక, ఆమె బాబుని భుజం మీద వేసుకుని స్మశానానికి ఏడుస్తూ వెళ్తుంది. అది చూసిన పార్వతీపరమేశ్వరులు వృద్ధదంపతుల రూపంలో ఎదురయ్యి - "ఎవరమ్మా నీవు? ఎవరా బాబు? ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడుగుతారు. దానికి ఆమె - "ఎవరైతే ఏమిటమ్మ - మీరు ఆర్చేవారా తీర్చేవారా?" అని అడుగుతుంది. దానికి వారు - "మేమే ఆర్చేవారము - తీర్చేవారము - చెప్పవమ్మా" అంటారు. ఆమె తన గోడు చెప్పుకుంటుంది. వారు ఓదార్చి అంతా శుభం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడు ఆమె భుజం మీద ఉన్నా బిడ్డతో సహా, ఇదివరకు చనిపోయిన బిడ్డలు కూడా లేచి వచ్చేస్తారు. వారిని చూసిన ఆశ్చర్యంలో దంపతులను చూద్దాం అని తిరిగేసరికి వారు ఉండరు. అప్పుడు - అది పార్వతీపరమేశ్వరులు అని తెలుసుకుని ఆనందంగా ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడ ఆమె తోడికోడళ్ళు ఈమె అదృష్టానికి అబ్బురపోయి క్షమార్పణ చెప్పుకుంటారు. అప్పటినుండి ఆమె ప్రతి ఏట తప్పకుండా పోలాల అమావాస్య జరుపుకుంటుంది."

ఈ కథ విన్న తరువాత చెప్పినవారు: "పోలేరమ్మ, నీ ఇల్లు పాలతో, నేతితో అలుకుతాను. నా ఇల్లు ఉచ్చతో, పియ్యతో అలుకు", అంటారు. వినడానికి కొంచం ఎబ్బెట్టుగా అనిపించచ్చు కానీ - అది పిల్లల మీద ప్రేమకు చిహ్నం. ఆ కథ అక్షింతలు చదివినవాళ్ళు, విన్నవాళ్లు తలపై వేసుకుంటారు.

మా అమ్మ పుట్టినరోజు పొలాల అమావాస్య నాడే. ఎప్పటినుండో తప్పకుండా చేసుకుంటోంది ఈ పూజ!

Thursday, August 7, 2008

నాకు స్ఫూర్తినిచ్చే పాట!


ఇది వ్రాసింది నేను అని చెప్పే అర్హత నాకు లేదు. అవి నా జీవితంలో అతి పెద్ద దెబ్బ తగిలిన రోజులు. బ్రతుకులో బాధ్యతలు తప్పితే కోరికలు/ఆశయాలు కనబడని రోజులు. మౌంటైన్ వ్యూ లో ఉన్నాను. ఒక ప్రభాతవేళ నాలో ఏదో తెలియని శక్తి ప్రవేశించి వ్రాసింది ఈ పాటని, అని నా నమ్మకం.

ఈ పాటలో వ్యాకరణదోషాలు ఉండచ్చు - అప్పటికే నేను సంసృతంలో మాట్లాడి ఒక ఐదు ఏళ్ళు దాటింది. కానీ ఆ భావం నేను అనుభవించగలుగుతున్నాను...ఒక్క సారిగా ఈ ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోతాను. కష్టానికి, సుఖానికి తేడా తెలియదు. నాలో ఉన్నా మనిషి చచ్చిపోయి, దైవం మిగుల్తుంది....శివోహం అనిపిస్తుంది. అది అనుభవించాలి!

మానవరూపేశివోహం, వర్ణధారాధృతోహం
అర్ణవమథనాసమయే గరళం పీత్వాపి సజీవోహం ||


మాయామృత్తికాయాముత్పన్న, వాంఛాలతాః దగ్ధ్వా
కాయం నిత్యమాఛ్ఛేదయామి, భస్మితలిప్సాః ధృత్వా
హృదయేజాతభావసందోహం, కఠిన్యేణ హత్వా
మానసరుద్రభూమ్యాం చరామి నిత్యం, మామేవ జీత్వా
నిత్యాహారం కపాలే సత్యం, స్థితప్రఙా మే వృషభవాహనం
సర్వేషామపి బంధువత్ అహం, నాస్తి మే కోపి మిత్రం ||


విధిదత్తం మహోత్తరం కార్యం, మానసకర్ణైః శ్రుత్వా,
నిత్యం తాన్ హి ధారామి కాయే , విషసర్పాః కృత్వా
అనుభవనామజటాం తు మూర్ధ్నే, గాఢతరేణ బధ్ధ్వా
నిరతం సమ్నియమ్య తిష్టామి, గాత్రగంగాం గృహీత్వా
సత్యేందుర్మే నిత్యభూషణం, లజ్జా మహ్యం భవతి అంబరం
అర్థాంగీ తు విధ్యుక్త ధర్మం, ఙానం భవతి త్రినేత్రం ||

మామూలు మాటల్లో చెప్పాలంటే:

మానవుడి రూపంలో ఉన్నా శివుణ్ణి నేను. అక్షరాల ధారను మోస్తున్నాను (శివుని ఢమరుకంలోనుండి శబ్దాలు వెలువడ్డాయి). సముద్రాన్ని మథనం చేసినప్పుడు పుట్టిన విషం తాగినా ఇంకా బ్రతికే ఉన్నాను.

మాయ అనే మట్టిలో (పాంచభౌతిక ప్రపంచం మాయ - అంటా మట్టే) పుట్టిన కోరిక అనే తీగలను నేను తగలబెట్టి ఆ బూడిదతో నన్ను నేను అలంకరించుకుంటాను. మనసులో పుట్టిన భావాల సమూహాన్ని నేను నిర్దాక్షణ్యంగా చంపి, ఆ స్మశానంలో, నన్ను (నా భావాలను) నేను జయించి తిరుగుతూ ఉంటాను. నాకు నిజమే ఆహారం. స్థితప్రఙ నాకున్న వృషభవాహనం (బలానికి, నిబ్బరానికి చిహ్నం). అందరికీ నేను బంధువునే. కానీ నాకు ఎవరూ మిత్రులు కారు. (నేను ఎవరడిగినా సాయం చేద్దామనే చూస్తాను. కానీ, నేను ఎవరి దగ్గరనుండి ఏది ఆశించను).

నాకు విధి ఒక కర్తవ్యాన్ని ఇచ్చింది. అది నా మనసు గ్రహించింది. ఆ కర్తవ్యాన్నే విషసర్పాలుగా ధరిస్తున్నాను. ఎంత కష్టమైనా, ప్రమాదమైనా అవే నాకు అలంకారం. అనుభవం అనే జడలో గంగలాగా ప్రవహిస్తున్న నా అంగాలను బలంగా బంధించి ఆ సంనియమంలోనే నేను సంతృప్తిని పొందుతాను. నాకు సత్యమే చంద్రుడివంటి భూషణం, లజ్జ నిజమైన కట్టుబట్ట, విధి నిర్దేశించిన బాధ్యతే భార్య (భరించవలసినది), ఙానం మూడో కన్ను.

నా జీవితంలో నన్ను అన్నిటికంటే ప్రభావితం చేసిన పుస్తకం మనిషి వ్రాసింది కాదు. మాధవుడు చెప్పింది, మహర్షి వ్రాసింది! అది భగవద్గీత. భగవద్గీతను అందరి కంటే యథాతథంగా అనుసరించేది - విష్ణువుకి అతిశ్రేష్ఠుడైన  భక్తుడు, మిత్రుడు - శివుడు. ఆ శివుడికి నేను చిన్నప్పటినుండి కింకరుణ్ని. నా జీవితాన్ని చాలా ప్రభావితం చేసినవాల్లల్లో మొదటివాడు కూడా శివుడే. ఆయనకు మనసా, శిరసా అనేకకోటి నమస్కారాలు చేస్తూ నా చేతులమీద ఆయన వ్రాయించుకున్న పాట తిరిగి ఆయనకే అంకితం చేస్తున్నాను.