Wednesday, March 11, 2009

దూరం కలిగించే ఆవేదన...

ఒక ప్రాణమిత్రుడిని కలిసి చాలా రోజులైంది. కేవలం కళ్ళతోనే మాట్లాడుకొగల స్నేహం అది. అన్నాళ్ళ తరువాత కలిసిన స్నేహితుడితో ఏం మాట్లాడతాను? ఐదు పద్యాల్లో వ్రాయమని ఆజ్ఞ. సరే,

" నారాయణం నమస్కృత్య నరం చైవ నరాధిపం
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్"

అనుకోని మొదలెట్టాను. ఇందులో ఏమైనా మహిమ ఉంటే అది ఆ కళామతల్లిది. ఆ పైన నన్ను అత్యంత ప్రీతిపాత్రం గా చూసుకుంటూ, నాలోని లోపాలను పట్టించుకోకుండా "నా వాడు", అనుకున్న స్నేహితులది.


కం:-
సుఖులే మాతాపితరుల్
సుఖులే నీబంధుజనులు సుమధురభాషుల్
సుఖులే భార్యాబిడ్డలు
సుఖులే నాబోటి సఖులు సుఖివే గదరా?

కం:-
దూరము మన యిరువురి నడి
జేరితినని గర్వపడెను జీవనములలో
మారని మన బంధము గని
నేరము జేసితిననుకొనినేమో గదరా?

కం:-
వేరుగ మిగిలితి నేనిట
తీరుగ నీ జోడు లేక తిమిరము నిండెన్
భారము పెరిగెను మనసున
నేరుగ నిను కనగలేక నే సగమైతిన్

కం:-
యే గ్రహములు యిరువురిపై
ఆగ్రహమొందెనొ తెలియదు అరుణుడు రాడే
జాగ్రద్భావము బోయెను
ఈ గ్రహణము తాళలేక ఖిన్నుడనైతిన్

కం:-
మారెను మబ్బుగ జూడర
కారని నాకంటి నీరు కన్నుల క్రిందన్
జారెను జలజల మనుచున్
చేరగ నీ చెలిమి చలువ చెంతనె మిత్రం


(ఈ పద్యాలు నేను మొదట వ్రాసినవి. ఇందులో కొన్ని వ్యాకరణ దోషాలు ఉన్నాయి అని పెద్దలు చెప్పారు. ఇవి సరిచేస్తాను, వీలు చిక్కినప్పుడు)

1 comment:

Sandeep said...

చాలా మంది - మిత్రం అనే పదం బదులుగా "నేస్తం" అనే పదం వాడమని సలహా ఇచ్చారు. నాకూ మొదట అదే నచ్చింది. ఐతే మిత్రం అనే సంస్కృత శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి - స్నేహితుడు, సూర్యుడు, అని.

ముందు పద్యాల్లో స్నేహితుడు కనబడకపోవదం సూర్యగ్రహణంతో పోల్చడం జరిగింది కాబట్టి ఈ పద్యంలో "మిత్రం" అనే సంస్కృతశబ్దానికి ప్రాధాన్యత ఇచ్చాను.

రసికులు గమనించగలరు.