Tuesday, March 24, 2009

విజయవాడ విశేషాలు

ఈ సారి విజయవాడ లో బస బాగా జరిగింది. ఎన్నో మంచి విషయాలు తెలిసాయి. సాహిత్యం, జ్యోతిష్యం పట్ల అభిరుచి ఉన్నవారికి పండుగ లాగ జరిగింది. ఈ ట్రిప్ లో కూడా కొంచం కామెడీ జరిగింది.

* మా మావయ్య కి ఎవరో పెరుగు వడ్డిస్తుంటే, "ఆ వద్దు, నువ్వు మడి గట్టుకోలేదు", అన్నారు. వెంటనే నేను, "పెరుగు, పాలు, నెయ్యి - వీటికి మడి అక్కరలేదు మావయ్య", అని శాస్త్రం వల్లించాను. "ఆ, నేనెప్పుడు వినలేదు", అన్నారు. నాకు నవ్వు వచ్చి, వెంటనే అన్నాను, "ఈ లెక్కన, మనం జున్ను పాలు తాగకూడదు. జున్ను తినకూడదు", అని. అందరూ, "ఎందుకు?", అన్నట్టు చూసారు. వెంటనే నేను, "ఆవు పురుడు పోసుకున్నందుకు మైలు ఉంటుంది కదా", అన్నాను. వెంటనే అందరూ "ఒరెయ్, నీకు తెలియంది లేదు. నువ్వు నోరుమూసుకుని ఉండవు", అన్నారు ;)

* మా తాతయ్యకి నేను జాతకంలో ఉన్నా విషయం ఉన్నట్టు చెప్పేస్తుంటే కోపం వచ్చి, "నువ్వు జ్యోతిష్యం బాగా నేర్చుకున్తున్నావు. ఇంకా నేర్చుకో. కానీ నువ్వు ఎవరికీ చెప్పకు", అన్నారు. నేను అదోలా మొహం పెట్టుకున్నాను. అప్పుడు అయన ఒక ఉదాహరణ చెప్పారు. మా తాతయ్యా గారికి గురుతుల్యులు, శ్రీ గరికిపాటి సూర్య నారాయణ మూర్తి గారు గారు మా తాతయ్యకు జ్యోతిష్యం నేర్పిస్తూ అనేవారుట, "ఒరెయ్ అబ్బాయి, ఎప్పుడు జ్యోతిష్కుడు ఉన్న విషయం చెప్పకూడదురా. ఉదాహరణకి తల్లికి వైధవ్యం ఉంటే, కొడుకుతో - మీ అమ్మ ఎక్కువ కాలం బ్రతుకుతుంది అని చెప్పాలే కానీ, మీ నాన్న చనిపోతాడు అని చెప్పకూడదు.", అన్నారు.

* ఎవరో కంప్యూటర్ కొనుక్కుంటుంటే నేను సలహా ఇచ్చాను, "ఇది కొనండి, ఒక పాతికవేలు పోయినా, మంచి కంప్యూటర్", అన్నాను. వెంటనే మా తాతయ్యా వచ్చి, "పోవడం ఏమిటి? ఖర్చైనా అనాలి", అన్నారు. వెంటనే నేను, "తాతయ్యా, మీరు ఏ నేల్లూరో చిత్తూరో వెళ్తే అందరినీ శపించి వస్తారు", అన్నాను. "ఎందుకురా", అన్నారు తాతయ్యా. వెంటనే నేను, "ఏముంది, వాళ్ళు - మీ అమ్మ పోయిందా? మీ నాన్న పోయాడా? అని అడుగుతారు. పోవడం అంటే వాళ్ల భాష లో వెళ్ళడం", అన్నాను.

2 comments:

కొత్త పాళీ said...

జున్ను, ఆవుకి పురిటి మైల .. హ హ హ. భలే!
బైదవే, జ్యోతిషం కరక్టు అనుకుంటా, ష కి యావత్తు లేదు :)

Sandeep P said...

నారాయణా

జ్యోతిషం అనేదే సరియైన పదం. జ్యోతిష్యం అనే పదం ఎక్కడో మథ్యలో పుట్టినట్టు ఉంది. కానీ, జ్యోతిషంలో యావత్తూ (సర్వం) ఉంది :)