Friday, July 29, 2011

కిట్టు కథలు: సంతృప్తి నాకు దిక్సూచి

కిట్టును చూడటానికి తన తండ్రి రాజు, వాళ్ళ స్వగ్రామం నుండి కలకత్తా వచ్చాడు. కిట్టు అప్పటికే చదువు పూర్తి చేసుకుని ఒక పెద్ద సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అప్పటిదాక వాళ్ళ వ్యవసాయం అంతంత మాత్రంగా నడుస్తుండటం, తండ్రి తన చదువుకోసం అప్పులు చేయడం గమనిస్తూ ఉన్న కిట్టు, ఇప్పటికైనా తన తండ్రికి కాస్త విశ్రాంతి కలిగించాలని, తను అనుభవిస్తున్న సుఖాలను తన తండ్రి కూడా అనుభవించాలని కోరుకున్నాడు. రాజుని ఎంతో అభిమానంగా చూసుకోవడం మొదలు పెట్టాడు. ప్రతి వారం ఏదో ఒక చిత్రానికో, షికారుకో అద్దెగాడీల్లో (taxi) వెళ్ళడం, ఖరీదైన restaurantsలో భోజనం చెయ్యడం మామూలైపోయాయి.

కిట్టు ఇదంతా తనపై ప్రేమతో చేస్తున్నాడు అని సంతోషించినా, ఖర్చులు కొంచెం మితి మీరుతున్నాయి అని రాజుకు బాధ కలిగింది. సున్నితమైన మాతలతో, "నాకు వద్దు. ఇంట్లోనే ఉండాలని ఉంది.", లాంటి మాటలతో చెప్పినా కిట్టు బలవంతంగా బయటకు తీసుకెళ్ళసాగాడు. ఒక రోజు కిట్టు, రాజు ఒక పెద్ద mall లో pizza center కి వెళ్ళారు. అక్కడ కిట్టు వెళ్ళి ఒక కుఱ్ఱాడికి తన పేరు ఇచ్చి వచ్చాడు. అది జరిగిన పావుగంటకి ఆ కుఱ్ఱాడు కిట్టు పేరు చదవగా, గబగబా తన తండ్రి చేయి పట్టుకుని లోపలకు, ఆ కుఱ్ఱాడు చూపించిన బల్లకు ఇరువైపులా కూర్చున్నారు. కిట్టు జాబితాలో ఉన్న వంటకాలన్నీ రాజుకు వివరిద్దామని చూశాడు. రాజు మాత్రం, "నీకేది నచ్చితే అదే చెప్పరా నాన్న", అని ఊరుకున్నాడు. కిట్టు రెండుమూడు వంటకాలు తెమ్మని చెప్పాడు.

కాసేపటికి ఆ వస్తువులు వచ్చాయి. కిట్టు ఎంతో సంతోషంగా ఒక ముక్క తుంపి రాజు పళ్ళెంలో వేసి తినమన్నాడు. రాజు దాన్ని తిందామని ప్రయత్నించాడే కానీ, అది ఎక్కట్లేదు. అది ఊతప్పానికి, దిబ్బరొట్టెకి మధ్యలో ఉంది కానీ, ఆ రుచి లేదు. కారంగా లేకపోతే రాజుకు రుచించదు. కిట్టును బాధపెట్టడం ఇష్టం లేక ఎంతో కొంత తిన్నాడు. ఇంతలో bill వచ్చింది, కిట్టు ఇంకా తింటూ ఉండటంతో రాజు దాన్ని తెరిచి చూశాడు. అక్షరాలా ఏడు వందల రూపాయలు అయ్యాయి. రాజుకు తిన్నదంతా బయటకు వచ్చినంత పని అయ్యింది. ముఖం ఎఱ్ఱగా అయ్యింది. కుఱ్ఱదనంలో తానూ బళ్ళ మీద, బట్టల మీదా ఖర్చుపెట్టాడు కానీ, ఇది మరీ ఎక్కువ అనిపించింది. ఏమీ మాట్లాడకుండా కిట్టుతో పాటు ఇంటికి వచ్చేశాడు. తను నెమ్మదిగా చెప్తే వినట్లేదు అని కాస్త గట్టిగా, "ఏడొందలు పెట్టి కొన్నావు. నాకు అది ఏమీ నచ్చలేదు. ఎందుకురా? నాకు పక్కన hotelలో దొరికే రోటీ, దాల్ తడ్కా నచ్చింది." అన్నాడు. కిట్టు, పిజ్జ కొత్త తరం విషయం అని, యువతకు నచ్చుతోందని, రాజు స్వగ్రామానికి వెళ్ళినప్పుడు గర్వంగా చెప్పుకోవచ్చునని నచ్చజెప్పాలని చూశాడు. కిట్టును తను అర్థం చేసుకోవట్లేదని బాధపడుతున్నాడని గమనించి, రాజు అప్పటికి ఊరుకున్నాడు.

సాయంత్రం ఇద్దరూ coffee తాగుతూ కూర్చున్నారు. రాజు కిట్టు కేసి చూస్తూ, "నిన్ను చూస్తుంటే నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయిరా. మా బాబాయ్ నన్ను అర్థం చేసుకోవట్లేదు అని బాధపడేవాడిని", అన్నాడు . కిట్టు నిట్టూర్చి, "అదేం లేదు నాన్న", అన్నాడు. రాజు, "సరే. మా బాబాయ్ కథ ఒకటి చెప్తాను, వింటావా?", అన్నాడు. కిట్టు ఏంటన్నట్టు చూశాడు.

"నా చిన్నదనంలో మా నాన్న చనిపోయాక మా బాబాయే నన్ను సాకాడు అని నీకు తెలుసు. మా తాత ఆస్తిని తనే చూసుకుని, నేను ఎదిగాక నాకు నా భాగాన్ని ఇచ్చాడు. ఆస్తి నా చేతికి వచ్చే ముందు, అంటే నేను చదువుకునేటప్పుడు, నాకూ నీ లాగ చాలా సరదాలు ఉండేవి. అంతమంది కూతుళ్ళ మధ్యన ఒక్కడినే కొడుకుని అని మా అమ్మ నన్ను గారంగా చూసుకునేది. కానీ, డబ్బు కావాలంటే మాత్రం బాబాయ్ నే అడగాలి. మిగతా వారందరూ ఏమనుకున్నా, నాకు మటుకు మా బాబాయ్ మంచివాడు. ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా గడ్డ పెరుగేసి  అన్నం కలిపి, అందులో కొత్తావకాయ్ నంజి పెడుతూ ఉండేవాడు. తన బిడ్డలతో సమానంగా చూసేవాడు - ముద్దాడినా, కొట్టినా.

మా బాబాయ్ వంద ఎకరాల ఆసామి. కానీ, మహా పిసనారి అని మన ఊరంతా చెప్పుకునేది. అయినా, పరుల సొమ్మును ఆశించేవాడు కాదు. ఊరక అణా కూడా ఇచ్చేవాడు కాదు. డబ్బుల కోసం ఆయనని అడగాలంటే నాకూ అదే చిఱాకు, భయం. ఈ సారి కొత్త cycle కోసం అడిగాను. గంభీరంగా ఒక చూపు చూశాడు. వద్దనే దాని అర్థం, అనుకుని నిట్టూర్చాను. నిజానికి కళాశాల ఇంటికి రెండు కిలోమీటర్లకు మించి ఉండదు, మిత్రబృందం అంతా నడుచుకునే వెళ్తున్నారు. ప్చ్...అది చెప్పే వద్దంటాడేమో అనుకున్నాను.

ఉన్నట్టుండి,  "రేపు తెల్లారుకట్ట నేను పార్వతీపురం వెళ్ళాలి, నువ్వూ వస్తావా?", అన్నాడు. ఆయన చెప్పింది చెయ్యడమే తప్ప వేరు అలవాటు లేదు ఆ ఇంట్లో. సరేనని చెప్పి ఆయన వెంట వెళ్ళాను. కొండల వెంటా, గుట్టల వెంటా తిప్పి తీసుకెళ్తూ ఐదారు కిలోమీటర్లు నడిపించి కొంచెం మనుషులు కనబడే చొటికి చేర్చాడు. అప్పుడే సూర్యుడు బయటకు వచ్చాడు. పొద్దున్న ఒక్క అరటిపండు  పెట్టి ఇంత దూరం నడిపించాడేమిటిరా బాబు అనుకుంటుండగా, ఒకరి ఇంటి దగ్గర ఆగి నన్ను అరుగు మీద కూర్చోమని లోపలికి వెళ్ళాడు. లోపలనుండి ఒకావిడ వచ్చి ఒక లోటాలో మంచినీళ్ళు ఇచ్చింది. బాబాయే పంపించి ఉంటాడు. ఒక గంట తరువాత వెనక్కి వచ్చాడు. మా ఆకలేసింది. బాబాయైతే పెద్దవాడు. ఉపవాసాలు చేసి చేసి అలవాటైంది, మరి నా గతేం కాను అనుకున్నాను. మళ్ళీ యాత్ర కొనసాగింది.

ఇంక శొష వస్తుంది అనగా ఒక ఇంటి ముందు ఆపాడు. బయట బాల్చీ, చెంబు ఉన్నాయి. కాళ్ళు కడుక్కుని లోపలకి వెళ్తూ, "నువ్వూ రా" అన్నాడు. నేనూ కాళ్ళు కడుక్కుని లోపలకి వెళ్ళాను. ఒకాయన వచ్చి తుండు ఇచ్చాడు. ఇద్దరం చేతులు తుడుచుకున్నాం. "ఏరా అబ్బీ, మీ ఆవిడ ఎలాగుంది? పిల్లలు చదువుకుంటున్నారా? ఏఁవిటి హొటేలు  పెట్టారట?", అన్నారు. "అవునయ్యా, మీరు హొటేలు పెట్టాక  మొదటిసారి వచ్చారు. కడుపు నిండా తినే వెళ్ళాలి", అన్నాడు అతను. "బయటవాళ్ళకు తెలిస్తే మా ఇంట్లో ఆడవాళ్ళకు పరువు తక్కువరా. హ హ. సరే, ఇక్కడే వడ్డించు", అన్నాడు బాబాయ్.

ఇద్దరం కూర్చున్నాము. రెండు అరటాకులు వేసి ఇడ్డెనలు వడ్డించసాగింది అతడి భార్య. ఆ కాలంలో ఇడ్లీరేకులు దొరికేవి కాదు, saucer అంత ఉండే పళ్ళాల్లో కానీ, పనస ఆకుల్లో కానీ తయారు చేసేవారు ఇడ్డెనలు. "బాగున్నావా అమ్మా", అని నవ్వుతూ అన్నాడు బాబాయ్. అంతే... ఆ తరువాత ఆవిడ వడ్డిస్తూనే ఉంది, బాబాయ్ తింటూనే ఉన్నాడు. మూడు ఇడ్డెనలకే నాకు కూర్చోలేక నడ్డి విరిగినంత పని అయ్యింది. బాబాయ్ మాత్రం డజన్ల కొద్దీ లాగించాడు. బాబాయ్ ఎక్కువ తినడం నేను ఎప్పుడూ చూడలేదు. "ముందురోజు ఉపవాసం ఉన్నాడనుకున్నా, మరీ ఇంతా?" అనుకుంటున్నాను.

బాబాయ్ మొదటి మూడు ఇడ్డెనలూ తింటుండగా హొటేలు యజమాని ముఖ్యంలో "ఇంత పెద్దాయనకు వడ్డించగలుగుతున్నాం" అనే సంతృప్తిని చూశాను. ఆ తఱువాత మూడు ఇడ్డెనలకు "పెద్దాయనకు మన వంట నచ్చింది", అనే సంతోషం చూశాను. ఆ తఱువాత మూడు ఇడ్డెనలకు "పెద్దాయన మాంచి ఆకలి మీద ఉండి మొహమాటం కూడా లేకుండా టింటున్నాడు", అనే చిరునవ్వు చూశాను. ఆ తఱువాతి మూడింటికి "ఒక మనిషి ఇన్ని ఇడ్డెనలు తినగలడా" అనే ఆశ్చర్యం చూశాను. ఆ తరువాతి మూడింటికి, "వాయంతా ఈయనకే సరిపోతోంది, బయటవాళ్ళకి ఎలాగ వడ్డించాలి" అనే కంగారు చూశాను. ఆ తఱువాత మూడింటికి, "ఇన్నీ తిన్నాడు సరే, ఈయన చిల్లిగవ్వగా ఇవ్వడని ఈయన ఊళ్ళొనే చెప్తారు. ఇరువై ఇడ్డెనలకి ముడిసరుకే రెండు రూపాయలు ఉంటుంది", అనే నిట్టూర్పు చూశాను. బాబాయ్ కి మాత్రం ఏమీ పట్టలేదు. ఇడ్డెనలూ, పచ్చడీ జుఱ్ఱేస్తున్నాడు భాగవతంలో బాలకృష్ణుడిలాగా.

అంతా అయ్యింది, ఆయన  లేచి దొడ్లోకి వెళ్ళి చేతులు కడుక్కున్నాడు. నా చేతులు ఆరిపోయాయి, పిండి చేతులపై అట్టగట్టుకుపోయింది. బలంగా రుద్దుకుని కడుక్కుని వెనక్కు వచ్చేసరికి నా జీవితంలో చూస్తాను అనుకోనిది ఒకటి చూశాను. మా బాబాయ్ తుండు నా చేతుల్లో పెట్టి తన సంచిలోంచి ఒక కొత్త వందరూపాయల కాగితం తీశాడు. అది ఇంకా నలగలేదు. అప్పట్లో ఒక రూపాయి అంటే ఇప్పుడు dollarకు సమానం. వడ్డించిన ఆమెను పిలిచి, ఆమెకు చూపిస్తూ "అమ్మాయ్, గోప్ఫగా వండావే ఇడ్డెనలు. ఆ పచ్చడో, అమృతంలాగా ఉందే. ఇదిగో మీ ఆయనకు డబ్బులుస్తిన్నాను. బట్టలు కొనిపించుకో", అన్నాడు. హొటేలు యజమాని, అతడి భార్య, నేను తెల్లబోయి చూస్తున్నాము. బాబాయ్ అతని భుజం తట్టి, "ఒరేయ్ అబ్బీ, నీ ఇంట్లో ఈ అన్నపూర్ణే మహాలక్ష్మి కూడా, చక్కగా చూసుకో. ఉంటాను.", అని నాకేసి చూసి పద అని సైగ చేసి బయల్దేరాడు.

వచ్చేటప్పుడు busలో వచ్చేశాము. దిగి ఇంటికి నడుస్తూ ఉండగా భుజం మీద చెయ్యి వేసి, "ఏరా. cycle కావాలా? ఈ రోజు పొద్దున్న నడిచావు కదా? అంత దూరం నడిచి, ఒక్కోసారి వంతెన పడిపోతే ఏట్లో ఈదుకుంటూ వెళ్ళి నేను పొరుగూరులో బడికి వెళ్ళేవాణ్ణి. ఎక్కువ చదువుకోలేదు అనుకో. cycle ఉండటం మంచిదే. చాలా శ్రమ తగ్గిస్తుంది. విలువ ఉన్న వస్తువు. కొంటాను", అన్నాడు. ఇద్దరం కాళ్ళు కడుక్కుని లోపలకి వెళ్ళాం.

నేను ఎప్పుడూ మా బాబాయ్ ని ప్రశ్నించలేదు, డబ్బు విషయాల్లో అయితే అసలేమీ మాట్లాడలేదు. ఆ రోజు ఉండలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అడిగాను, "బాబాయ్, మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు కదా? మరి మూడు రూపాయలు ఇవ్వవలసిన చోట వందరూపాయలు ఎందుకు ఇచ్చారు?", అని అడిగాను. బాబాయ్ గంభీరంగా చూసి, "డబ్బు రెండు విధాలుగా ఉపయోగపడుతుంది రా నాన్న. ఒకటి అవసరానికి, రెండు సంతృప్తికి. డబ్బును నేను జాగ్రత్త చేసేది అవసరానికి. తాత్కాలికమైన ఆత్రాన్ని అవసరంగా చూపించి చాలా మంది పెద్ద ఖర్చులు పెడుతూ ఉంటారు. నాకు అది చేతకాలేదు. అవసరమైతే ఖర్చు పెడతాను, లేదా సంతృప్తి కోసం ఖర్చు పెడతాను. పొద్దున్న అంత దూరం నడిచి వెళ్ళేసరికి "ఎప్పుడు, ఏమిటి, ఎందుకు అని అడగకుండా అభిమానంగా పిలిచి పీట వేసి భోజనం పెట్టాడు. ఆ సమయంలో ఆ ఇడ్డెనలు నాకు అమృతప్రాయంగా అనిపించాయి. చాలా తృప్తి కలిగింది. పెళ్ళాంపిల్లలు ఉన్నవాడు, వృద్ధిలోకి రావలసినవాడు, బుద్ధిమంతుడు -- వాడికి సాయం చేయడంలో నాకు తృప్తి ఉంది. అందుకే ఇచ్చాను", అని చెప్పి భాగవతం తెరిచి కూర్చున్నాడు. అక్కడే ఉంటే నన్ను చదవమంటాడేమో అని భయపడి వెంటనే బయటకు వచ్చేస్తుంటే, "నాకు సంతృప్తి కలిగితే ఎంతైనా ఇస్తాను. కలగనప్పుడు ఎంత తక్కువైనా ఇవ్వను. ఊసుపోని వాళ్ళు ఎలా ఉంటే మనకేంటి, ఏమనుకుంటే మనకేంటి?", అన్నాడు. "అవును బాబాయ్", అని చెప్పి బయటకు వచ్చేశాను.

అప్పుడు నేను ఆలోచించాను, "ఈ cycle నాకు అవసరమా? తాత్కాలికమైన ఆత్రమా? లేక దీర్ఘకాలిక సంతృప్తా?" అని. ఇప్పటికీ విషయాలూ, వస్తువులూ  మారుతూ వచ్చాయి కానీ అదే ప్రశ్న మనసుని తడుతూ ఉంటుంది. ఈ ప్రశ్న నీకూ ఉపయోగపడచ్చేమోనని ఈ కథ చెప్పాను అంతే."

అని చెప్పాడు రాజు. కిట్టు ఒక చిరునవ్వు నవ్వి, "సాయంత్రం నేనే వంట చేస్తాను నాన్న", అని చెప్పి తన mobile లో taxi వాడికి phone చేసి రావద్దని చెప్పాడు.

8 comments:

వీరుభొట్ల వెంకట గణేష్ said...

/*
తాత్కాలికమైన ఆత్రాన్ని అవసరంగా చూపించి చాలా మంది పెద్ద ఖర్చులు పెడుతూ ఉంటారు.
*/
చదివినప్పటినుంచి ఈ వాక్యం మనసులో మెదులుతూనే ఉందండి!!

మాలా కుమార్ said...

కథ చాలా బాగుంది . నీతి ఇంకా బాగుంది .

Ramesh said...

కధ చాలా బాగుందండి. తృప్తి, అవసరం, ఆత్రం లలో తేడా కనుక్కోవటం కష్టమేనండి కొంచెం - మనివి కానివయితే (మనవారివి అయితే) ఇంకొంచెం ఎక్కువే కష్టం.

Srikanth.C said...

అన్నయ్య నువ్వు super. ఒక మంచి నీతి వున్నా కథ చదివి చాల సంవత్సరాలు అయ్యింది. ఇలాంటివి ఇంకెన్నో రాయాలని అవి నేను చదవాలని ఆశిస్తూ మీ తమ్ముడు.

Sandeep said...

@అందరూ

మీకు ఈ కథ నచ్చినందుకు చాలా సంతోషం. నిజానికి ఈ కథ మా నాన్నగారు మాకు చెప్పినది, నిజంగా జరిగినది.

Phanindra said...

మంచి కథ మిత్రమా. మీ నాన్నగారు చెప్పిన ఇలాటి కథలూ, విషయాలు, చేసిన రచనలు ఏమైనా ఉంటే బ్లాగులో అందించు.

Ramesh said...

చాల బాగుంది సందీప్

Nithin said...

aussome ra sandy....
nenu follow avvadaniki try chesatanu...


Nithin.Y.R
(nee ex wingee :P)