Monday, July 18, 2011

జంతువు - దైవం

ఇటీవల ఒక గూగుల్ సమూహంలో ఒక కథ చదివాను. ఇది R.K. Narayan రచించిన A tiger of Malgudi అనే పుస్తకం లోనిదని చెప్పారు. ఆ కథ నాలో నిద్రాణమైన ప్రశ్నలని కొన్నింటిని మేలుకొల్పింది. ఆ కథ నేను అసలు పుస్తకం నుండి చదవలేదు కనుక నా మాటల్లో, నాకు అర్థమైనట్టుగా చెప్తున్నాను. మూలకథకుని మాటల్లో వింటే ఇంకా బాగుంటుందనడంలో ఏమీ సందేహం లేదు.

ఒక పులి ఒక సాధువుని కలిసిందిట. ఆ సాధువు పులికి దేవుడి గురించి బోధ చేశాడట. "దేవుడంటే అద్వితీయమైన శక్తి కలవాడు, ఆయన కనుసన్నలలోనే మనమందరం మెలుగుతున్నాము, ఆయన అనుకున్నదల్లా జరుగుతుంది", ఇలాగ కొంచెం లోతుగా వర్ణించి చెప్పాడట. ఆ పులికి వెంట్రుకలు నిక్కబొడుచుకుని, ఆశ్చర్యం నిండిన కన్నులతో చూడసాగిందట. అలాగ కాసేపు వర్ణించిన తరువాత ఆ సాధువు, పులిని "నేను చెప్పినదాన్ని బట్టి దేవుడు ఎలాగ ఉంటాడు అనుకుంటున్నావు?", అని అడిగాడట. అప్పుడు ఆ పులి, "దేవుడు చాలా పెద్ద ఆకారం కలిగిన పులి. ఆయన తోకతో భూమిని మొత్తం చుట్టేయగలడు. ఆయన ఒక్క చూపు చూస్తే అన్ని జంతువులూ భయపడిపోతాయి.", అంటూ చెప్పుకొచ్చిందట. కథ అంతే.

కథలోని నీతి ఏమిటయ్యా అంటే, మనుషులు ఏ విధంగా దేవుడు మనిషే అయ్యి ఉంటాడు అనుకుంటున్నారో, అదే విధంగా మిగతా జీవులు కూడా దేవుడిని నమ్మితే తమ లాగే ఉంటాడు అనుకుంటాయి/అనుకోవాలి కదా? సరే, ఇప్పుడు ఇంకొక కథ విందాం. దీనికి ఆధారం నాకు తెలియదు కానీ, ఇది చైనా/భారతదేశాలలో ప్రచారంలో ఉన్న కథే.

ఒక రోజు ఒక మహర్షి సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ ఉండగా ఒక గాయపడిన ఎలుక మూలుగుతూ కనబడిందట. ఆ మహర్షి ఆ ఎలుకని చూసి జాలిపడి, తనతో తీసుకెళ్ళి పెంచుకోసాగాడట. మహర్షికి ఆ ఎలుక అంటే విపరీతమైన అభిమానం ఏర్పడి, ఆ ఎలుకను తన కూతురుగా భావించసాగాడు. ఒకానొక రోజు ఆ మహర్షికి ఎలుక పెళ్ళీడుకి వచ్చింది అనిపించింది. ఆ ఎలుకకు తగిన భర్త కోసం అన్వేషించసాగాడు.

ఒక రోజు ఉదయం స్నానం తరువాత సూర్యుడికి నమస్కరించుకుంటూండగా ఆయనకు, "సూర్యుడి కంటే అందగాడు, సులక్షణసంపన్నుడు ఎవరుంటారు? ఈతడే నాకు అల్లుడు కాదగ్గవాడు", అనుకుని వెంటనే తన తపోబలంతో సూర్యుణ్ణి ఆహ్వానిస్తాడు. సూర్యుడు కంగారుగా ప్రత్యక్షమయ్యి విషయం కనుక్కుంటాడు. కనుక్కున్నాక ఖంగు తిని, "ఇదెక్కడి చిక్కురా బాబు, మరీ సూర్యుడి భార్య ఎలుక అంటే ఎలాగ?" అనుకుంటాడు. కొంచెం ఆలోచించి, "మహర్షీ, నాకు నీ కుమార్తెను పెళ్ళి చేసుకోవడంలో ఏమీ ఇబ్బంది లేదు కానీ, ఒక్క సారి ఆలోచించు. నేను ఎంత తేజోసంపన్నుణ్ణైనా, మబ్బు వస్తే మసిబారిపోతాను. నా కంటే మబ్బులే శక్తివంతాలు. అందుచేత నువ్వు వరుణుణ్ణి సంప్రతించు", అని అంతర్ధానమవుతాడు.

మహర్షి ఆయన తపోబలాన్ని మళ్ళీ ఉపయోగించి ఈ సారి వరుణుణ్ణి రప్పిస్తాడు. ఆయన కూడా కాసేపు ఆలోచించి, "మహర్షీ, నీకు అల్లుడవ్వడం నా అదృష్టమే. కానీ, నీకు అల్లుడు కాదగిన వాడు వాయువు. ఎందుకంటే నేను ఎంత బలవంతుణ్ణైనా స్వతంత్రుణ్ణి కాను. వాయువు నన్ను ఎటు నడిపిస్తే అటు పోతాను. అందుచేత నువ్వు వాయువుని అల్లుణ్ణి చేసుకుంటే బాగుంటుంది", అంటాడు. మహర్షికి ఉన్నపాటుగా హనుమంతుడు, భీముడు మొదలైనవారి బలానికి మూలమైన వాయువు పట్ల మక్కువ పెరిగుతుంది.

ఈ సారి వాయువుని ఆహ్వానిస్తాడు. వాయువు ప్రత్యక్షమయ్యి, కాసేపు తలగోక్కుని, "మహర్షీ, నాకు నీ కూతుర్ని పెళ్ళిచేసుకోవాలనే ఉంది", అనగానే మహర్షి చిఱాకు పడుతూ, "మఱి ఇంకేమిటి?" అంటాడు. వాయువు, "నేను ఎంత బలవంతుణ్ణైనా కొండలను కదిలించగలనా? అందుకే కదా అవి అచలాలైనాయి? అందుచేత నీకు తగిన అల్లుడు హిమవంతుడని నా అభిప్రాయం.", అంటాడు. ఆలోచిస్తే మహర్షికి అదీ నిజమేననిపించి వాయువుకు సెలవు ఇస్తాడు.

సరే, ఈ సారి ఏదేమైనా సరే హిమవంతుడితో ఎలుకకు పెళ్ళి చేద్దామని నిర్ణయించుకుని హిమవంతుణ్ణి పిలుస్తాడు. ఆయన ఆలోచించి "మహర్షీ, నువ్వు చాలా గొప్పవాడివి. నీ పిలుపు విని దేవతలందరూ ప్రత్యక్షమవుతున్నారు అంటే వారందరికంటే నీవే బలవంతుడవని విదితమౌతోంది. నీ కూతుర్ని పెళ్ళి చేసుకోవడం నా భాగ్యం గా భావిస్తున్నాను. నేను చాలా బలవంతుణ్ణి అని నువ్వు అనుకోవడం నా అదృష్టం. ఐతే నీకు ఒక నిజం చెప్పాలి. నేను ఎంత బలవంతుణ్ణైనా నన్ను తొలిచేయగల సామర్థ్యం ఒక్క ఎలుకకే ఉంది. అందుచేత నీ మూషికానికి మఱొక మూషికాన్ని ఇచ్చి పెళ్ళి చేస్తే బాగుంటుంది", అని మాయమౌతాడు. ఇది విన్న మహర్షికి ఒక్క సారి వివేకం మేల్కొని, "ఏమిటి నా ఈ ప్రయాస, ప్రకృతి ధర్మాన్ని విడిచిపెట్టి నేను ఎందుకు ఇంత ప్రాకులాడాను?", అని విచారించి, ఆ ఎలుకని మఱొక ఎలుకకు ఇచ్చి వివాహం చేస్తాడు.

ఈ కథలో నీతి ఏమిటంటే మనకు ప్రేమ ఉంది కదా అని, మన దృష్టిలో శ్రేష్ఠమైనదాన్ని మనకు ప్రియమైనవారికి తగిలించాలని చూడకూడదు, వారికి ఏది సరిపోతుందో, నచ్చుతుందో అదే ఇవ్వాలి. అంతర్లీనంగా ఉన్న మఱొక నీతి ఏమిటంటే ఏ జీవి గొప్పదనం దానిది. ఏదీ మఱొక దాన్ని కంటే సంపూర్ణంగా ఉన్నతం కాదు.

మొదటి కథకి రెండొ కథకి మధ్యన పెద్ద పొంతన ఏమీ లేదు కానీ, మనిషి జంతువు దృష్ట్యా కూడా ఒక్కసారి ఆలోచిస్తే కానీ దేవుడు అర్థం కాడేమోననే నా అభిప్రాయానికి ఇవి బలాన్ని చేకూరుస్తాయి. సకలచరాచరసృష్టిలో పరమాత్ముడు లేని విషయం ఏముంది? అలాంటప్పుడు ఒక జీవి ఎక్కువ, మఱొక జీవి తక్కువ అనుకుంటే మనకు దైవం అర్థం కానట్టే కదా?

1 comment:

Naga Pochiraju said...

a tiger for malgudi...nijam ga cadavaalsina pustakam; okaa noka sandharbham lo tiger saadhuvutO anTundi naaku andaru manushulu okE laagaa unnaaru ani; adE daiva swaroopam ani saadhuvu anTADu