Thursday, June 30, 2011

హాస్యధారావాహిక - అమృతం

ఈ మధ్యన భారతీయులకు పరదేశీ హాస్యధారావాహికల మీద దృష్టి మళ్ళింది. Friends, Two and a half men, Big bang theory, How I met your mother మొదలైన ధారావాహికల గురించి ప్రవాసభారతీయులు మాట్లాడుకోవడం తరచూ నేను వింటుంటాను. నేను చూసిన రెండు మూడు ధారావాహికలు నిజంగానే హాస్యభరితంగా ఉన్నాయి. కాకపోతే వీటితో నాకు రెండు చిరాకులు ఉన్నాయి. మొదటిది అశ్లీలత (కొంచెం కూడా విలువలని చూపించకపోవడం) ఐతే రెండోది బలవంతంగా నవ్వించాలనుకోవడం (తెర వెనుక నవ్వులు, చప్పట్లు గుప్పించడం). అయినప్పటికీ వీటిల్లో చాలా సృజనాత్మకత ఉంటుంది. అది నిజంగా అభినందనీయం.

పశ్చిమదేశాలు ఏం చేస్తే అది అనుసరించడం అలవాటైపోయిన మన దేశంలో అలాంటి చిత్రాలు ఊపందుకున్నాయి కానీ, నాకు తెలిసి ధారావాహికలు మాత్రం ఇంకా మొదలవ్వలేదు. ఉత్తరభారతదేశంలో Laughter challenge పేరిట హాస్యాన్ని పండించగలిగారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొందరు ఆ తరువాత అదే వృత్తిగా ఎంచుకొని విజయం సాధించారు. వాళ్ళల్లో ప్రముఖుడు రాజూ శ్రీవాస్తవ్ చాలా కీర్తి గడించాడు. దక్షిణాదిలో తమిళులని చూస్తే, వాళ్ళూ చాలా హాస్యభరితమైన ధారావాహికను సృష్టించగలిగారు. "లొల్లు సభ" పేరితో వారు చలచిత్రాలకు వ్యంగ్యరూపాలను చిత్రించి ప్రేక్షకుల మెప్పు పొందారు. కాకపోతే ఈ రెండిట్లో కూడా ఎంతో కొంత అశ్లీలత, వ్యంగ్యం ఉన్నాయి.

ప్రపంచం అంతా ముగ్గులు వేసుకున్నాక లేస్తూ ఆవలించడం అలవాటైపోయిన కొత్త తరం తెలుగువాళ్ళకు ఇలాంటిది ఏముందా అని ఆలోచించుకోవలసిన పరిస్థితి లేకుండా ఎంతో చక్కటి అభిరుచి ఉన్న గుణ్ణం గంగరాజు గారు (Just Yellow అనే పతాకంపై) అమృతం హాస్యధారావాహికను మొదలుపెట్టారు. ఈయన ప్రమేయం ఉన్న చిత్రాలు అన్నీ నాకు నచ్చినవే -- Little soldiers, ఐతే, అనుకోకుండా ఒక రోజు, అమ్మ చెప్పింది మొదలైనవన్నీ చక్కటి చిత్రాలు. అమృతంలో ఎక్కువ అంకాలు ఎవరు దర్శకత్వం వహించారో తెలియదు కానీ, మొదట్లో కొన్ని చంద్రశేఖర్ ఏలేటి (ఐతే, అనుకోకుండా ఒక రోజు చిత్రాలకు దర్శకుడు) చివరిలో చాలా భాగాలు హర్షవర్ధన్ (కొన్నాళ్ళు అమృతం పాత్రను పోషించిన చక్కని నటుడు), వాసు ఇంటూరి (సర్వం పాత్రతో సంచలనం సృష్టించిన మరో చక్కని నటుడు) దర్శకత్వం వహించారు. చాలా అంకాలకు రచన చేసింది గుణ్ణం గంగరాజు గారే!

వివిధదశల్లో అమృతం పాత్రను ముగ్గురు నటులు పోషించారు -- శివాజీ రాజా, senior నరేశ్, హర్షవర్ధన్. అలాగే సంజీవని పాత్రను కూడా ముగ్గురు (?) నటులు పోషించారు (ఝాన్సీ, ఉమా మహంతి, సుప్రజ). ఆంజినేలు, శాంతలుగా గుండు హనుమంతురావ్, రాగిణి అద్భుతంగా నటించారు. అమృతరావు మరదలు పద్దుగా స్వాతి, మామగారిగా కనకాల దేవదాస్ నటించారు. అప్పాజీ గా శివన్నారాయన నూటికి నూటొక్కపాళ్ళు న్యాయం చేశారంటే అతిశయోక్తి కాదు. అప్పుడప్పుడూ కనిపించి వెళ్ళిపోతూ ఉండే పాత్రలు చేసినవాళ్ళు (kidnapper గా చేసిన వ్యక్తి, కిరాణా కొట్లో పనిపిల్లగా చేసిన అమ్మాయి, రాధ-మధులో పద్మశ్రీకి సహాయకుడిగా చేసిన అబ్బాయి -- వీళ్ళ పేర్లు తెలియవు కానీ...) కూడా బాగా చేశారు.

ప్రపంచంలో ఎంతో ఖర్చుపెట్టి తీసిన, పేరు పొందిన హాస్యధారావాహికలు కొన్ని మాత్రమే 300 అంకాలు (episodes) పూర్తి చేసుకున్నాయి. అలాంటిది అతి తక్కువ ఖర్చుతో తీసిన అమృతం ధారావాహిక 313 అంకాల పాటు నడిచింది. ఈ అంకాలను ఒక్కొక్కటిగా Just Yellow పతాకం వారు YouTube లో చేరుస్తున్నారు. దాదాపు అన్ని అంకాలు ఎంతో కొత్తదనంతో, నిజాయతీతో ఉంటాయి. ఈ ధారావాహికలో నాకు నచ్చిన విషయాలు:
  • ప్రతి  frameలోనూ హాస్యాన్ని బలవంతంగా పుట్టించడానికి వ్యంగ్యాన్ని వాడలేదు. నిజానికి ఈ ధారావాహిక మొత్తంలో ఎవ్వరూ ఎవరినీ అనవసరంగా అవమానించరు/కించపరచరు.
  • అశ్లీలత కొంచెమంటే కొంచెం కూడా లేదు! తాగుడూ, జూదం, ధూమపానం వంటివి కూడా లేవు. పిల్లలకు సంకోచం లేకుండా చూపించవచ్చును.
  • తెలుగుదనం -- దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ధారావాహికలో ఎక్కడికక్కడ చక్కటి తెలుగుపదాలు వినబడుతూ ఉంటాయి. అక్కడక్కడా సంస్కృతసమాసాలను కూడా దంచారు. ఇక తెలుగు, ఆంగ్ళం కలిపి ప్రాస వ్రాయడం ఆ రచయితకు వెన్నతో పెట్టిన విద్య అనుకుంటాను. "నేరచరిత్రను నెరేట్ చేస్తాను", "కొరిమి దెయ్యంలా courier service అన్నావ్" లాంటి ప్రయాసప్రాసలు భలేగా నవ్విస్తాయి. నిజానికి ఒక వ్యాపారాత్మకమైన దూరదర్శనస్రవంతి (TV channel) లో episode ని అంకం అని పిలిచిన ఏకైక ధారావాహిక ఇదేనేమో!
  • పాత్రధారులు -- అప్పాజీ, అమృతం, ఆంజినేలు, శాంత, సంజీవిని, సర్వం -- ఎవరికి వారే అద్భుతంగా నటించారు. వీళ్ళకు చలనచిత్రాలలో అవకాశాలు లేకపోవడం చలనచిత్రసీమ ఎంత దుస్థితిలో ఉందో తెలుపుతోంది. అందరి ఉచ్చారణ చక్కగా ఉంది. ఎక్కడా వంక పెట్టడానికి లేదు.
  • ఒక ఏడాదంతా హాయిగా నవ్వుకునేటన్ని అంకాలు ఉన్నాయి. మరుసటి ఏడాది మళ్ళీ చూస్తే మళ్ళీ నవ్వొస్తాయి :)

మొదట్లో ఈ ధారావాహికకు ఎంతో ఆకర్షనను కలిగించినది మాత్రం రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఆయనకు మాత్రమే సాధ్యమయ్యే శైలిలో ఆంగ్ళ, తెలుగు పదాలను చక్కగా కలిపి - హాస్యం, తేలికదనం, కవిత్వం, కొత్తదనం కలిపి వ్రాసిన "ఒరేయ్ ఆంజినేలు" అనే పాట తెలియని మధ్యతరగతి తెలుగు వాడుండడేమో.  అది స్వరపరిచి, వినిపించిన కళ్యానీ మాలిక్ కూడా చక్కటి ప్రావిణ్యం కనబరిచారు. పాటను క్రింద వ్రాస్తున్నాను. ఇలాగ వ్రాసేవరకూ ఈ పాటకు రెండు చరణాలు ఉన్నాయని అనుకోలేదు.

హయ్యోలు, హమ్మోలు -- ఇంతేనా బ్రతుకు హు హు హు
ఆహాలు, ఓహోలు -- ఉంటాయి వెతుకు హ హ హ
మన చేతుల్లోనే లేదా రీమోట్ కంట్రోల్
ఇట్టే మార్చేద్దాము ఏడుపుగొట్టు ప్రోగ్రాంలు
వార్తల్లో హెడ్లైన్సా మనకొచ్చే చిలిపి కష్టాలు
అయొడింతో ఐపోయే గాయాలే మనకు గండాలు

ఎటో వెళ్ళిపోతూ నిను చూసింది అనుకోవ ట్రబులు?
హల్లో హవ్డూయుడూ అంటూ అంటోంది అంతే నీ లెవెలు
ఆతిథ్యం ఇస్తానంటే మాత్రం వస్తుందా?
తీరిగ్గా నీతో కాలక్షేపం చేస్తుందా?
గాలైనా రాదయ్యా నీదసలే ఇరుకు అద్దిల్లు,
కాలైనా పెడుతుందా నీ ఇంట్లో పెనుతుఫానసలు?

ఒరేయ్ ఆంజినేలు తెగ ఆయాసపదిపోకు చాలు
మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు
కరెంటు, రెంటు, ఎట్సెట్రా మన కష్టాలు
కర్రీలో కారం ఎక్కువ అయితే కన్నీళ్ళు
నైటంతా దోమల్తో ఫైటింగే మనకు గ్లోబల్ వార్
భారీగా ఫీలయ్యే టెన్షన్లేం పడకు గోలీమార్!

ఈ పాటకు వెనక వచ్చే రేఖాచిత్రాలు (sketches) కూడా చాలా హాస్యభరితంగా, కొత్తగా ఉన్నాయి. "చెంచాడు భవసాగరాలు" అనడం సిరివెన్నెల చేసిన ప్రయోగం చాలా అభినందనీయం. అన్ని కష్టాలనీ రెండు మాటల్లో తేల్చి  పారేశారు. ఏదేమైనా ఈ ధారావాహిక ప్రతి తెలుగువాడూ చూసి తీరాల్సినది!

8 comments:

కన్నగాడు said...

మీరు మరీను, అమృతం చూడని తెలుగు ప్రేక్షకులు కూడా ఉన్నారా! అందరికి అందరే ఐనా, అమృతాల అందరిలోను శివాజిరాజా బాగా చేసాడని నా అభిప్రాయం(ఆ తరువాత హర్షవర్దన్). కొత్త విషయం జస్ట్ యెల్లో వారే యూట్యూబ్ లో పెట్టడం. తెలియచేసినందుకు ధన్యవాదాలు.

Prasanth said...

కొత్త విషయం (జస్ట్ యెల్లో వారే యూట్యూబ్ లో పెట్టడం.)తెలియచేసినందుకు ధన్యవాదాలు.

Tejaswi said...

అమృతం మా ఇంటిల్లిపాదికీ అభిమాన సీరియల్. ఇన్నాళ్ళనుంచి వస్తున్నా ఏ ఎపిసోడ్ కూడా విసుగుపుట్టించకుండా, సున్నితమైన హాస్యాన్ని అందిస్తూ, కుటుంబసమేతంగా చూడతగ్గట్లుగా తీస్తున్న జస్ట్ యెల్లో వారు అభినందనీయులు. సీరియల్ లోని పాత్రలు నిజమైన మనుషులన్నంతగా వాళ్ళ క్యారెక్టర్లను, స్వభావాలను దర్శక, రచయితలు తీర్చిదిద్దారు. డైలాగుల్లో కూడా విట్, పంచ్ బాగుంటాయి. పగలు, పంతాల సీరియల్స్ కంటే వందలరెట్లు బెటర్. మా అమ్మాయి రోజూ చూసేది ఇటీవలి స్కూల్స్ రీఓపెనింగ్ దాకా. అయితే ఉదయాన్నే స్కూల్ కు వెళ్ళాల్సిఉండటంతో ముందే పడుకోబెడుతుండటంతో, తను ఈ సీరియల్ మిస్ అవుతోందని బాగా ఫీల్ అవుతోంది. రాత్రి 10.30కి కాకుండా ప్రైమ్ టైమ్ లోకి...కాస్త ముందుకు జరిపితే బాగుండు.

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

Good one

lakshman said...

One of very best and excellent Telugu serial. Whenever I am tired or feel bore I watch these Amrutham Episodes.

http://www.youtube.com/user/amruthamserial?blend=5&ob=5#g/a.

All the cast rocked in this serial and thanks to the producer for sharing these videos at Youtube.

Anonymous said...

http://www.sirivennela-bhavalahari.org/?p=3098

Praveen Sarma said...

Amrutam was one of my favourite programs one TV. I watched it till end.
Praveen Sarma - http://patrika.teluguwebmedia.in

Praveen Sarma said...

Visit the program producers' site: http://justyellowmedia.com
Praveen Sarma - http://patrika.teluguwebmedia.in