Sunday, June 5, 2011

శ్లేషాలంకారము (paronomasia/pun)

వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> శ్లేషాలంకారము


లక్షణం: నానార్థ సంశ్రయః శ్లేషః వర్ణ్యా వర్ణ్యోభయాశ్రితః
వివరణ: రెండు లేదా అంతకంటే ఎక్కువ అర్థాలను ఆశ్రయించుకుని ఉండటాన్ని శ్లేష (కౌగిలి) అలంకారం అందురు.

ఒకే వాక్యానికి అనేక అర్థాలు ఉంటే దాన్ని శ్లేషాలంకారం అంటారు. సాధారణంగా ఇది వ్యంగ్యానికి, కఱ్ఱ విరగకుండా పామును చంపడానికి వాడుతూ ఉంటారు. కానీ, దీనిని సదుద్దేశంతో, స్తుతి చేయడానికి వాడిన సందర్భాలు మన సాహిత్యంలో కోకొల్లలు.


ఉదా:- (రఘువంశం, రచన: కాళిదాసు)
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ

వి:- ఈ వాక్యానికి అర్థం "జగత్తునకు తండ్రులు (తలిదండ్రులు) అయిన పార్వతీ-పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను" అని. కానీ, పార్వతీపరమేశ్వరౌ అనే సంధిని మఱొక విధంగా విడదీయవచ్చును - పార్వతీప (పార్వతీ దేవి పతి), రమేశః (రమాదేవికి ప్రభువు) అంటే "జగత్తునకు తండ్రులైన శివకేశవులకు నమస్కారములు" అనే అర్థంతో కూడా చదువవచ్చును.

"సాగరసంగమం" చిత్రంలో "నాదవినోదము" అనే పాటకు మొదల్లో బాలసుబ్రహ్మణ్యం "వాగర్థావివ సంపృక్తౌ" అనే శ్లోకం చదివి మొదట్లో "పార్వతీ-పరమేశ్వరౌ" అని, ఆ తఱువాత మళ్ళీ, "పార్వతీప-రమేశ్వరౌ" అనడం మీరు గమనించవచ్చును.


ఉదా:- (విష్ణుసహస్రనామ ఉత్తరపీఠిక, రచన: వ్యాసభగవానుడు (?) )
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం, రామ నామ వరాననే

వి:- సంస్కృతంలో మనోరమః అంటే మనసుని రంజింపజేసేవాడు, మనోరమా అంటే మనసుని రంజింపజేసేది (స్త్రీలింగం). మనోరమే అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. మొదటిది "మనోరమా" అనే అకారాంత స్త్రీలింగ శబ్దానికి సంబోధనా ప్రథమా విభక్తి. అంటే సీత అనే ఆమెను పిలవడానికి "హే సీతే" అనడం లాగా అన్నమాట. రెండవ అర్థం మనోరమః అనే అకారాంత పున్లింగ శబ్దానికి సప్తమా విభక్తి. అలాగే వరాననః, వరాననా కూడా. ఇప్పుడు ఈ శ్లోకానికి రెండు అర్థాలు ఎలాగ వచ్చాయో చూద్దాము.

1. శివుడు పార్వతీ దేవితో మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడట:
"శ్రీరామ, రామ, రామ" అని (ఇతి) రామునియందు (రామే) రమిస్తూ (పరమానందాన్ని అనుభవిస్తూ) ఉంటాను, ఓ మనోరమా. రామ నామం ఒక్కటే, వెయ్యి (సహస్ర) పేర్లతో సమానం (తుల్యం) వరాననా".

2. నాబోటి ఒక సాధారణ భక్తుడు శ్రీరాముణ్ణి తలుచుకుంటే:
"శ్రీరామ, రామ, రామ" అని రామునియందు (రామే), మనస్సుకు సంతోషాన్ని కలిగించేవానియందు (మనోరమే), వరాననుడు యంది (వరాననే) రమిస్తూ ఉంటాను. రామనామం ఒక్కటీ వెయ్యి పేర్లకు సమానం".

ఈ విధంగా రెండు అర్థాలను ఆపాదించుకుని ఈ శ్లోకాన్ని చదివి తరించవచ్చును.


ఉదా:- (నానుడి)
పతివ్రతకు పరపతితో పనేముందో?

వి:- పరపతి అనే పదాన్ని రెండు అర్థాలలో వాడవచ్చును. ఒకటి - పరుల పతి అని, రెండు - ప్రతిష్ట అని. పతివ్రతకు పరుల పతి మీదకు మనసు పోకూడదని ఒక అర్థమైతే, పతివ్రతకు పేరుప్రతిష్టల మీద కాక పతి మీద దృష్టి ఉండాలని మఱొక అర్థం.


ఈ అలంకారాన్ని ఆధారంగా అనేక అశ్లీలవాక్యాలను నిర్మించిన ఘనులు ఉన్నారు. వాటిలో భాషాపరంగా మంచి విషయం ఉన్నా, సంస్కారపరంగా నచ్చకపోవడంతో ఇక్కడ ప్రస్తావించట్లేదు. ఈ అలంకారం ఉన్న తెలుగు పద్యాలను/చలనచిత్రగీతాలను వ్యాఖ్యల ద్వారా తెలుపగలరని చదువర్లకు మనవి.

11 comments:

శ్రీనివాసమౌళి said...

కారటుదీస్తది సిల్క
పనులైతై పైసలిమ్మంటదీ
ఇది కాకింటది *కావు* *కావంటది*
శబ్బాసురా శంకరా
--tanikeLLa bharaNi

ఆ.సౌమ్య said...

పాత గుణసుందరి కథ సినిమాలో "దక్షుడొక యజ్ఞంబు చేపట్టి" అని ఒక పద్యం ఉంటుంది.

అందులో కొసన "పతి భక్తి పతి ప్రేమ పతి గౌరవమ్మె సతికి మోక్షమటంచు సతి నిరూపించె". అని వస్తుంది.

ఇది దక్షయజ్ఞం సమయంలో శివుని, దక్షుడు అవమానపరచగా తనని తాను భస్మం చేసుకున్న సతీదేవి కథ గురించి పాడే పద్యం. సతికి (భార్యకి) మోక్షమటంచు సతి (పార్వతీ దేవి) నిరూపించె. ఇది శ్లేషాలంకారం క్రింద వస్తుందా?

Praveen Sarma said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...

సాగర సంగమం సినిమా లో "పార్వతీపరమేశ్వరౌ" అన్న పదాన్ని బాలు "పార్వతీప - రమేశ్వరౌ" అని విడకొడితే ఏదో పైత్యం తోనో tune కోసమో విడగొట్టారని అనుకున్న. శ్లేష ఉందని ఇప్పుడు తెలిసింది.

Thanks for the great posts

Sandeep said...

@సౌమ్య మీరు చెప్పిన వాక్యంలో మొదటి సారి సతి అన్నప్పుడు సతీదేవి అని ఆపాదించుకోవడానికి అవకాశం ఉంది, "సతీదేవి పతి గౌరవమ్మే మోక్షం గా భావించింది" అనే అర్థం వస్తుంది కాబట్టి. అందుచేత ఇందులో శ్లేష ఉందని చెప్పుకోవచ్చును.

@మౌళి నువ్వు చెప్పింది బాగుంది.

@ఊరోడు నేనూ మొదట్లో అలాగే అనుకునేవాడిని.

Anonymous said...

"మీరు మా కుమారులు",
"మీరు మాకు మారులు"
చిత్రాంగి అన్నది, సారంగధరుని తో. దీన్ని కూడా శ్లేషాలంకారానికి ఉదాహరణగా వాడతారు.

త్యాగరాజ స్వామి "మారు బల్క కున్నావేమిరా, మా మనోరమణ" (మా= లక్ష్మి, మా= మాకు) అన్న దగ్గరా శ్లేష వాడారేమో అనిపిస్తుంది.
శారద

Sandeep said...

@శారద

మీరు చెప్పిన రెండు ఉదాహరణలూ చక్కనివి. కృతజ్ఞతలు.

మందాకిని said...

అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల
"ఆబాలగోపాలమా" "బాలగోపాలు"ని
ఇవీ శ్లేష కాదంటారా??

Sandeep said...

@మందాకిని

అది శ్లేషాలంకారం కాదండి. ఎందుకంటే అక్కడ రెండు సార్లు ఒకే పదాన్ని వేర్వేరు అర్థాలతో వాడారు. కనుక చదువరికి "ఓహో, మొదట ఈ అర్థంలో, రెండో సారి ఈ అర్థంలో వాడి ఉంటారు" అని తెలుస్తుంది. కానీ, శ్లేషాలంకారం వైశిష్ట్యం ఏమిటంటే ఒకే పదాల సమూహాన్ని రెండు అర్థాలతో అన్వయించుకోవచ్చును. మీరు చెప్పిన ఉదాహరణ ఛేకానుప్రాసం.

#ఇక్కడ దాని గురించి చదువవచ్చును.

కొత్త పాళీ said...

బావున్నై.
మరికొన్ని విశేషాలు.
హైస్కూలు వ్యాకరణంలో సాధారణంగా చెప్పబడుతుండే ఉదాహరణ వాక్యం -
రాజు కువలయానందకరుడు.
అష్టదిగ్గజాల్లో ఒకాయన, పింగళి సూరన అనుకుంటా - ఏకంగా ఒక కావ్యమే రాశాడు, రాఘవ పాండవీయమని. ఇటువంటి కావ్యానికి ద్వ్యర్ధి (రెండు అర్ధాలున్న) కావ్యమని వాడుక.
శ్రీపాదవారి కథల్లో చాలా చోట్ల వరసైనవారు వేళాకోళం చేసుకుంటున్నప్పుడు ఒక మాటకి ఇంకో అర్ధం తీస్తే "ద్వ్యర్ధి తీశావే" అంటూ ఉంటారు, శ్లేష అనరు.
ఇటువంటి భావననే మన సినిమాకవిత్వపు పరిభాషలో ద్వంద్వార్ధాల పాటలు అంటూ ఉంటారు. ద్వంద్వార్ధం అనే వాడుక తప్పు, ద్వ్యర్ధి కరక్టు.
శ్రీశ్రీ సిరిసిరిమువ్వల నించి ఒక కొంటె ఉదాహరణ:
కం. భోషాణప్పెట్టెల్లో
ఘోషా స్త్రీలను బిగించి గొళ్ళెం వేస్తూ
భేషు భలే బీగాలని
శ్లేషించెను సాయిబొకడు సిరిసిరిమువ్వా!
సరిగ్గా ఇదే కాదుకాని, ఇంచుమించుగా ఇటువంటి ప్రక్రియనే ఆంగ్లంలో పన్ (pun) అంటారు. ప్రఖ్యాత కవులూ కమేడియన్లూ అంతో ఇంతో పన్నులు పీకేవాళ్ళే. చిన్నయసూరి వ్యాకరణాన్ని చాల దండిస్తానని బెదిరించిన పఠాబి (తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి) ఆ రోజుల్లోనే (1940 ప్రాంతాల్లో) "పన్"చాంగం అనే ముచ్చటైన పన్నుల పుస్తకం వేసి తెలుగుసాహితిని సుసంపన్నం చేశారు.
వార్తలు ఇంతటితో సమాప్తం.

Sandeep said...

@కొత్తపాళి

చక్కని విషయాలను తెలిపారు అండి. నెనర్లు. ఈ మధ్యనే శ్రీరాఘవ వ్రాసిన టప కూడా చాలా లోతుగా ఉంది. దయచేసి వాగ్విలాసము బ్లాగు చూడగలరు.