Saturday, June 5, 2010

ఛేకానుప్రాసాలంకారము

వ్యాకరణం -> అలంకారాలు -> శబ్దాలంకారాలు -> ఛేకానుప్రాసాలంకారం


లక్షణం: భవేదవ్యవధానేన ద్వయోర్వ్యంజన యుగ్మయోః
అర్థం: రెండుగానీ, అంతకంటె ఎక్కువగానీ ఉన్న హల్లుల జంటలు అర్థభేదం కలిగి, వెంట వెంటనే ప్రయోగింపబడితే అది ఛేకానుప్రాసాలంకారమవుతుంది.

కనీసం రెండు "అక్షరాల సమూహం", "వేర్వేరు అర్థాలతో", "పక్కపక్కన (మధ్యలో మరేమీ ఉండకూడదు)" వాడితే అది ఛేకానుప్రాస అవుతుంది. ఉదాహరణలు చూద్దాము.


ఉదా: (చిత్రం: సప్తపది రచన: వేటూరి)

1. ఆబాలగోపాలమా బాలగోపాలుని అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ తాండవమాడిన సరళి

ఇక్కడ "అచ్చెరువున" అనే పదం రెండుసార్లు మధ్యలో వేరే అక్షారాలు లేకుండా వచ్చింది. మొదటి అచ్చెరువున అన్న పదానికి "ఆ చెరువున" (త్రికసంధి) అని అర్థం. రెండోసారి అచ్చెరువున అన్నప్పుడు "ఆశ్చర్యంతో" (అచ్చెరువు అన్నది "ఆశ్చర్యాం" యొక్క వికృతిశబ్దం) అని అర్థం. అంటే ఆ వాక్యం భావం "కాళిందు చెరువులో ఉన్న కృష్ణుణ్ణి ఆశ్చర్యంతో చూశారు" అని. ఇది ఛేకానుప్రాస.

ఇందులోనే "ఆబాలగోపాలమా బాలగోపాలుని" అన్నది ఛేకానుప్రాసలాగా కనిపిస్తున్నా - కాదు! ఎందుకంటే, "అబాలగోపాలము" "ఆ బాలగోపాలుని" మధ్యలో రెండు అక్షరాల భేదం ఉంది. ఇది వేరే (యమకం) అలంకారమవుతుంది. ఆ అలంకారాన్ని చర్చించుకునేటప్పుడు వివరిస్తాను.

2. మధురానగరిలో యమునాలహరిలో ఆ రాధ ఆరాధనాగీతి పలికించి

"ఆ రాధ" అంటే "రాధమ్మ" అని, "ఆరాధనాగీతి" అంటే ప్రేమగీతం అని అర్థం. ఇక్కడ "ఆ రాధ" అన్న అక్షరాల కలయిక రెండుసార్లు పక్కపక్కనే వచ్చింది. ఇది ఛేకానుప్రాస. ఇక్కడ గమనించవలసిన విషయమేమిటంటే ఈ రెండు "ఆరాధ" అనేది అర్థవంతమైన పదం కాదు. మొదటి సారి అది రెండు పదాల కలయిక అయితే, రెండో సారి అది ఒక పదంలో భాగం మాత్రమే! అయినా ఫరవాలేదు. అందుకే సూత్రంలో "రెండు లేక అంతకన్నా ఎక్కువ అక్షరాలసమూహం" అన్నాం తప్పితే "పదం" అని అనలేదు.


ఉదా: (చిత్రం: సూత్రధారులు రచన: (బహుశా) సినారె)

1. మహారాజరాజశ్రీ మహనీయులందరికీ వందనాలు, వంద వందనాలు

"వంద వందనాలు" అన్నప్పుడు మొదటి "వంద"కు "నూరు" అని అర్థం అయితే రెండో "వంద", "వందనములు" అనే పదంలోని భాగం. రెండింటి మధ్యనా వేరే అక్షరం లేదు కనుక ఇది ఛేకానుప్రాస.

2. సన్నాయి సొరమెక్కి చిన్నారి బసవన్న చెన్నార చిందాడ, కన్నార కన్నార?

ఇక్కడ మొదటి "కన్నార" కి "కన్ను + ఆర" అంటే "కళ్ళ నిండుగా" అని అర్థమైతే, రెండో "కన్నార"-కి "చూశారా?" (ప్రశ్నార్థకం) అని అర్థం. వాక్యానిలో భావం, "బసవన్నని కళ్ళ నిండుగా చూశారా?" అని.


ఉదా: (చిత్రం: సీతారాముకళ్యాణం రచన: (బహుశా) సముద్రాల రాఘవాచార్య)
సర్పభూషితాంగ, కందర్పదర్పభంగ

"కందర్పుడు" అంటే "మన్మథుడు". "దర్పము" అంటే "గర్వము" అని అర్థం. ఈ పదానికి అర్థం "మన్మథునికి గర్వభంగం చేసినవాడా" అని.


ఉదా: (చిత్రం: కోకిల రచన: వేటూరి)
ఈ పట్టుకోకట్టుకోవాలమ్మో, ఆ కట్టు ఆకట్టుకోవాలమ్మో

ఉదా: (చిత్రం: రాజకుమారుడు రచన: వేటూరి)
చుక్కలలో చక్కదనం దాచినదానా, ఎలాగైనా లాగెయ్-నా? ఏదో చెయ్-నా? దోచైనా?

ఈ ఉదాహరణ బహుశా సరైనది కాకపోవచ్చును. ఎందుకంటే "లాగైనా" కి "లాగెయ్-నా" కి తేడా ఉంది. కాకపోతే శబ్దాలంకారము అంటే శబ్దాన్ని ఎలాగ వింటాము అన్నదాన్ని బట్టి కాబట్టి ఛేకానుప్రాసకు ఉండాల్సిన స్ఫూర్తి దీనికి ఉంది అని నా నమ్మకం.


ఉదా: (పోతనామాత్యుల శ్రీమద్భాగవతం)
అరుణప్రభా మనోహరములు కరములు కంబుసౌందర్య మంగళము గళము [పూర్తి పద్యము]

కవి కృష్ణపరమాత్ముడి శరీరాన్ని వర్ణిస్తున్నాడు. కృష్ణుడి మెడను (గళము) శంఖంతో పోల్చాడు. "కంబుసౌందర్య మంగళము" అంటే "శంఖం వంటి సౌందర్యము కలిగి శుభదాయకమైనది" అని అర్థం.


* ఈ అలంకారానికి కూడా ఈ పేరు ఎందుకు వచ్చిందో ఊహించగలుగుతున్నాను కానీ, గురువు/పుస్తకం ద్వారా తెలుసుకోలేదు. ఎవరైన విషయఙ్ఞులు ఉంటే తప్పక చెప్పగలరు.

7 comments:

రవి said...

దండి దశకుమార చరితమ్ నిండా ఈ అలంకారం విరివిగా వాడబడింది. చేమకూర వేంకటకవి విజయవిలాసంలో కూడా ఉదాహరణలు దొరకవచ్చునని అనుకుంటున్నాను.

Sandeep said...

@రవి

మీరు చెప్పినట్టుగానే దండి కవి "దశకుమార చరితం" text సంపాదించాను అండి. అలాగ రెండు పుటలు తిరగేస్తేనే పుట్టెడు కనిపించాయి ఛేకానుప్రాసలు. "తదా, తదాకర్ణ్య", ఎదుటనే కనబడింది. ఈ లంకెను ఇచ్చినందుకు కృతఙ్ఞతలు.

రవి said...

సందీప్, మీరు చెప్పిన లంకె నాకు తెలియదండి. :-) నా వద్ద పాటిబండ్ల మాధవశర్మ గారి దశకుమారచరితమ్ పీడీఎఫ్ (తెనుగు లిపిలో సంస్కృత పాఠం, తాత్పర్యార్థసహితం) పూర్వపీఠిక ఉంది. మీకు కావాలంటే చెప్పండి. రేపు సాయంత్రానికి (ఆఫీసు నుంచి :-))అప్ లోడు చేసి లంకె అందించగలను.లేదా ఈ మెయిలు చేస్తాను. (మీ ఐడీ ఇస్తే)

Sandeep said...

@రవి
తప్పకుండా పంపించండి. తెలుగులో చదివితే ఆ తృప్తే వేరు! నా ఈ-మెయిలయిడీ prk.sandeep జీ-మెయిలులో.

Sandeep said...

మరొక సినిమాపాట
(చిత్రం: కొండవీటి దొంగ, రచన: సిరివెన్నెల)
అంతో ఇంతో సాయం చెయ్య, చెయ్యందియ్యాలయ్యా!

శ్రీనివాసమౌళి said...

మరి కొన్ని...
[b]నంద నంద[/b]నా...నీకే అందమివ్వనా... --వేటూరి

మునుపెపుడూ [b]మన మన[/b]సెరుగని -- శ్రీనివాసమౌళి

మదన రతీ శృతి చేసిన రాగం
నా [b[చెలి చెలిమిలో[/b] ...చిరు చినుకులో -- శ్రీనివాసమౌళి

Sandeep said...

చిత్రం: సొగసు చూడ తరమా! రచన: సిరివెన్నెల(?)
సొగసు చూడ తరమా? మరుని నారి నారిగ మారి, మదిని నాటు విరిశరమా?