Sunday, June 13, 2010

లాటానుప్రాసాలంకారము

వ్యాకరణం -> అలంకారాలు -> శబ్దాలంకారాలు -> లాటానుప్రాసాలంకారము


లక్షణం: శబ్దార్థయోః పౌనరుక్త్యం యత్ర తాత్పర్య భేదవత్, సకావ్య తాత్పర్య విదాం లాటాను ప్రాస ఇష్యతే
అర్థం: శబ్దభేదం, అర్థభేదం లేకుండా అవే పదాలు తాత్పర్యభేదం కలిగి తిరిగి అవ్యవధానంగా ప్రయోగించటాన్ని లాటాను ప్రాస అంటారు

ఒక అలంకారం నేర్చుకునేటప్పుడు, ముందు నేర్చుకున్న అలంకారాలకీ దీనికీ గల వ్యత్యాసం గురించి ఆలోచించడం ముఖ్యం. అందుచేత మొదట లాటానుప్రాసకి, వృత్త్యనుప్రాసకి ఉన్న తేడా ఏమిటో చూద్దాము. వృత్త్యనుప్రాసలో "హల్లుల సమూహం" తిరిగి తిరిగి వస్తూ ఉంటుంది. ఆ హల్లు(ల)కు ఏ అచ్చు కలిసినా ఫరవాలేదు. "ఏకాకి కాకీక" లో ఐదు అక్షరాలు క-గుణింతంలోనివే. అది చాలు వృత్త్యనుప్రాసకి. "అర్థ భేదం ఉందా లేదా? పక్క పక్కనే వస్తున్నాయా లేదా?", వంటి విషయాల ప్రస్తావనే లేదు.

ఛేకానుప్రాసలో "అక్షరాల సమూహం" అన్నాము.
అంటే అవి "అర్థవంతమైన పదాలు కాకపోవచ్చును. ఉదాహరణకి "కర్నూలు నూలు" లో "నూలు" అన్నది మొదటి పదంలో భాగమైతే రెండో మాఱు పూర్తి పదం. ఇక్కడా అక్షరాలన్నాము తప్పితే హల్లులు అనలేదు. (అక్షరం = హల్లు + అచ్చు). "కోవెల కావలికాడు" అని అన్నామనుకోండి. అందులో కోవెల, కావలి - రెండింటిలోనూ అదే హల్లుల సమాహారం ఉంది (క, వ, ల). కాకపోతే అదే అక్షరసమూహం లేదు. అందుచేత అది ఛేకానుప్రాస కాదు. ఛేకానుప్రాసలో ఆ అక్షరసమూహం పక్కపక్కనే రావాలి, అర్థభేదం కూడా ఉండాలి.

లాటానుప్రాసలో "పదం" కలవాలి (అక్షరాల సమూహం కాదు). అంటే "ఆ రాధ ఆరాధన" అన్నది కుదరదు. "ఆ రాధ" అనే అక్షరాల సమూహం పక్క పక్కనే రెండుసార్లు వచ్చినా, అదే అర్థంతో రెండు సార్లు రాలేదు. అలాగే, "వగచి వగచి వేచా" అనే వాక్యంలో "వగచి" రెండుసార్లు ఒకే అర్థంతో వచ్చింది కానీ, ఆ మొదటి "వగచి" కి రెండో 'వగచి" కి తాత్పర్యభేదం లేదు. అందుచేత అది లాటానుప్రాస కాదు. తాత్పర్యభేదం అంటే ఏమిటి అనేది నిర్వచించడం కంటే ఉదహరించటం సులువు.


ఉదా: (శ్రీమదాంధ్రమహాభాగవతంలోని ప్రహ్లాదోపాఖ్యానం, రచన: పోతనామాత్యుడు)
కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ [పూర్తి పద్యం]

ఇక్కడ "కరములు" అనే పదం రెండు సార్లు పక్కపక్కనే అదే అర్థంతో వచ్చింది. కానీ తాత్పర్యంలో వ్యత్యాసం ఉంది. "కమలాక్షుణ్ణి అర్చించే కరములే నిజమైన కరములు" అని ఆ పాదంలోని భావం. మొదటి "కరములు" కి "చేతులు" అని తాత్పర్యం, రెండో "కరములు" కి "నిజమైన చేతులు" అని తాత్పర్యం. అందుచేత ఇది లాటానుప్రాస అవుతుంది. పోతన ఈ అలంకారాన్ని చాలా సందర్భాలలో వాడాడు.


ఉదా: (శ్రీమదాంధ్రమహాభాగవతంలోని కుచేలోపాఖ్యానం, రచన: పోతనామాత్యుడు)
హరిభజియించు హస్తములు హస్తములచ్యుతుగోరి మ్రొక్కుత, చ్చిరము శిరంబు చక్రథరు చేరిన చిత్తము చిత్తము [పూర్తి పద్యం]

ఇక్కడ కూడా మునుపుటి ఉదాహరణలాగే రెండోసారి "హస్తము/చిత్తము" అన్నప్పుడు నిజమైన/శ్రేష్ఠమైన హస్తము/చిత్తము అని అర్థం.


ఉదా: (కావ్యాలంకార సంగ్రహం, రామ రాజ భూషణుడు)
ఘనత నృసింహుజూడగల కన్నులు కన్నులు


సినిమాపాటల్లో ఈ అలంకారం నాకెప్పుడూ ఎదురవ్వలేదు. లీడర్ చిత్రంలో వేటూరి ఈ అలంకారాన్ని వాడిన పాట ఒకటి కారణాంతరాల వలన చిత్రంలో రాలేదని చిత్రదర్శకుడు శేఖర్ చెప్పారు. 

ఉదా: (చిత్రం: లీడర్, రచన: వేటూరి)
అనుభవాలను చెప్పి గుణగణాలను దిద్ది, అభయహస్తములిచ్చు అమ్మ అమ్మ


ఈ అలంకారానికి కూడా ఆ పేరు ఎందుకొచ్చిందో నాకు తెలియదు. మీకు తెలిస్తే తప్పక చెప్పగలరు.

8 comments:

.C said...

"ninu ganna kanulE kanulu, swaamii!" (sinaare?) ani "saptaswaraalu" chitramlO oka paaTa undi. "andamanTE nuvvE..." (illaalu) anna Athreya paaTalO "neevanTidi neevE neevE" anna line vastundi. Would that be laaTaanupraasa? Or, would it not be, since it's not exactly neevu/neevE at the beginning?

Sandeep said...

కిరణ్

మంచి పాటని గురించి చెప్పావు. ఆ చిత్రంలోని అన్ని పాటలూ అద్భుతమైన సంగీతసాహిత్యాలతో ఉంటాయి అని ఇప్పుడే తెలుసుకున్నాను. నువ్వు చెప్పిన ఉదాహరణ (నిను గన్న కనులె కనులు) లాటానుప్రాస అవుతుంది. ఐతే ఇక్కడ నాకొక సందేహం ఉంది. "కనులె", "కనులు" - రెండింటి మధ్యనా శబ్దభేదం ఉంది (స్ఫూర్తిలో లేకపోయినా, అక్షరాలలో). ఇది ఫరవాలేదా అన్న సంగతి నేను కనుక్కుని చెప్తాను.

ఇక "నీవంటిది నీవే, నీవే" లాటానుప్రాస కాదు అని నా అభిమతం. ఎందుకంటే, ఇక్కడ "నీవే నీవే" అని రెండుసార్లు వచ్చినా కూడా వాటి మధ్యన తాత్పర్యభేదం లేదు. "నీవంటిది నీవే" లో రెండు "నీవు"-లు ఉన్నా, అవి అవ్యవధానంగా రాలేదు. అందుచేత కచ్చితంగా లాటానుప్రాస కాదు అని అనుకుంటున్నాను.

మందాకిని said...

వయ్యారీ గోదారమ్మ
వళ్ళంతా ఎందుకమ్మా కలవరం?
కడలి ఒడిలో కలిసిపోతే కల వరం!
ఇందులో పదాలు పక్కపక్కనే లేకపోయినా ఆ అందం వచ్చింది అనిపిస్తుంది.

మందాకిని said...

అయ్యో! అర్థ భేదం ఉండకూడదు. తాత్పర్య భేదం ఉండాలని విషయం మరిచిపోయి, కలవరం గురించి రాశాను. అది తప్పుకదా!

కన్నగాడు said...

ఈ అలంకారం వాడడం కొద్దిగా కష్టమనుకుంటా, బడిలో కూడా కరములు కరములు ఉదాహరణే వాడినట్టు గుర్తు.

Sandeep said...

@ మందాకిని
మీరు చెప్పిన పాటలోనిది వేరే అలంకారం అండి. అది త్వరలోనే వివరిస్తాను. అది నాకు ఎంతో ఇష్టమైన అలంకారం కూడా. అది లాటానుప్రాస కాదని మీరు చెప్పినది వాస్తవమే. ఎందుకంటే: ఆ రెండు వాడుకల మధ్యనా వేరే పదాలు వచ్చాయి. అది లాటానుప్రాసకి నిషిద్ధం. అలాగే ఆ రెండు వాడుకలలోనా అర్థభేదం ఉంది. ఇది కూడా లాటానుప్రాసకు సరిపోదు.

@కన్నగాడు
అవునండి. ఈ అలంకారం సినిమాపాటల్లో వెతికివెతికి చూస్తే రెండు కనబడ్డాయి. ఎప్పుడైనా పాటలు వింటుంటే ఇంకా కనబడితే తప్పకు వ్యాసాన్ని పొడిగిస్తాను/వ్యాఖ్యలు వ్రాస్తాను.

మందాకిని said...

పోతనామాత్యులవారి భాగవతంలోని రుక్మిణీకల్యాణం అనే ఘట్టంలో రుక్మిణీ దేవి గురించి అగ్నిద్యోతనుడు అనే భూసురోత్తముడు శ్రీ కృష్ణుని వద్ద వర్ణన చేస్తూ
పల్లవవైభవాస్పదములు పదములు.....
అనే సీసపద్యంలో వచ్చేది ఇదే అలంకారమనుకుంటాను.

Saradhi Motamarri said...

ఆచార్య ఆత్రేయ కూడా ఈ అలంకారాన్ని చాలా పాటల్లో ఉపయోగించినారు: 'అడగక ఇచ్చిన ముద్దే ముద్దు, అందీ అందని అందమే ముద్దు'.