Thursday, June 3, 2010

వృత్త్యనుప్రాసాలంకారము

వ్యాకరణం -> అలంకారాలు -> శబ్దాలంకారాలు -> వృత్యనుప్రాసాలంకారము


లక్షణం: ఏకద్విప్రభృతీనాంతు వ్యంజనానాం యథాభవేత్ పునరుక్తి రసౌనామ్నా వృత్త్యను ప్రాస ఇష్యతే
అర్థం: ఒకటి, రెండు మొదలైన హల్లులను పెక్కుసార్లు ఆవృత్తి చేయుట వృత్త్యనుప్రాస అనబడును

వృత్త్యనుప్రాసాలంకరాము అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పదే పదే వస్తూ ఉండటం. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే హల్లు ప్రధానం కానీ, అచ్చు కాదు. ఇది ఎందుకు చెప్తున్నానో ఈ క్రింది ఉదాహరణ తరువాత తెలుస్తుంది:

ఉదా: (చిత్రం: స్వాతికిరణం, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)
క్షాధ్వరశిక్షాదీక్షాక్ష! విరూపాక్ష! నీ కృపావీక్షణాపేక్షితప్రతీక్షనుపేక్ష సేయక పరీక్ష సేయక రక్ష క్ష యను ప్రార్థన వినర!

ఇక్కడ "క్ష్"తో వృత్త్యనుప్రాస కూర్చబడింది. ఇక్కడ ముద్దగా (bold) దిద్దబడిన అక్షరాలన్నిటిలోనూ "క్ష్" ఉంది. చూశారా "క్ష్" వేర్వేరు అచ్చులతో కలిసి మళ్ళీ మళ్ళీ వచ్చింది. దక్ష లో "క్ష" గ ఉంటే "ఉపేక్షిత" లో "క్షి" ఉంది. అచ్చులు (అ, ఇ) వేరే అయినా హల్లు ఒకటే. అది చాలు వృత్త్యనుప్రాసకి.


వృత్త్యనుప్రాసలో వాడే అక్షరానికి ఏదైనా ఒక చోట, ముందు అక్షరంలో పూర్ణబిందువు (సున్నా) ఉంటే అది అన్ని చోట్లా ఉండాలి.  ఈ క్రింది ఉదాహరణ చూడండి:

ఉదా: (చిత్రం: శ్రీ అయ్యప్పస్వామి మహత్యం, రచన: వేటూరి)
ఉత్తుంశబరిగిరిశృం, నిత్యనిస్సం, మంళాం, పంపాతరం, పుణ్యానుషం, మునిహృదయజలజభృం!

ఈ ఉదాహరణలో ముద్దగా చూపిన "గ"-ల ముందు అక్షరాల్లో పూర్ణబిందువు ఉంది.


వృత్త్యనుప్రాస ఒక అక్షరంతోనే కాక రెండు, లేక అంతకన్నా ఎక్కువ అక్షరాలతో కూడా కలపచ్చును. మన తెలుగుసాహిత్యంలో ఏకంగా మూడు అక్షరాలతో వృత్త్యనుప్రాసను ప్రయోగించిన మహాకవులున్నారు.

ఉదా: (చిత్రం: వరుడు, రచన: వేటూరి)
బహుశా ఓ చంచలా ఎగిరే రాయంచలా తగిలే లేమంచులా!

ఇక్కడ "చ", "ల" అనే రెండు హల్లులూ మళ్లీ మళ్ళీ వచ్చాయి. అందుచేత ఇది కూడా వృత్త్యనుప్రాస అవుతుంది - కాకపోతే రెండు అక్షరాలతో.


మరిన్ని ఉదాహరణలు:

ఉదా: (కీర్తన: కృష్ణం కలయసఖి సుందరం, రచన: శ్రీ నారాయణతీర్థులవారు)
కృష్ణం గత విషయ తృష్ణం, జగత్ప్రభ విష్ణుం, సురారిగణజిష్ణుం

ఉదా: (చిత్రం: సితార, రచన: వేటూరి)
జిలిబిలి పలుకు చిలిపిగ పలికిన ఓ మైనా మైనా, కికి నగవు వపులు చిలికిన ఓ మైనా మైనా


శ్రీహరి అలంకారప్రియుడు కదా? మరి మన పోతనామాత్యుడు ఊరుకుంటాడా? శ్రీమదాంధ్రమహాభాగవతములో లేని అలంకారమంటూ లేదంటే అతిశయోక్తి కాదేమో? అందులోని కొన్ని వెన్నముద్దలు.

సీ: (ప్రహ్లాదోపాఖ్యానం)
మందారకరందమాధుర్యమునదేలు ధుపమ్మువోవునే దనములకు [పూర్తి పద్యం]

తే: (కుచేలోపాఖ్యానం)
విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణుఁ గృష్ణు [పూర్తి పద్యం]

కం: (గజేంద్రమోక్షం)
అడిగెదనని కడువడిఁజని
యడిగినఁదన మగడు నుడువడని నెడ యుడుగన్
వెడవెడ సిడిముడి తడబడ
నడుగిడి నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్!

పోతనామాత్యులు ఈ పద్యాన్ని నకారంతో ఒక అనుప్రాస, డకారంతో ఒక అనుప్రాస - రెండు తీగెలు అల్లుకుంటున్నట్టుగా అల్లుతూ వ్రాశారు. ఈ పద్యంలోని తరంగాల వేగాన్ని అందుకోలేక దాదాపు internetలో అందరూ (నాతో సహా) ఎక్కడో ఒక చోట తప్పు వ్రాశారు. ఇక్కడ ఉన్నదాంట్లో ఏమైనా తప్పుంటే సవరించగలరు.

ఈ పద్యంలో మరో విశేషం ఏమిటంటే ఒక కందపద్యం అనివార్యం అయిన చోట్ల తప్ప అన్నీ లఘువులతోనే వ్రాశారు.

కం: (రుక్మిణీకల్యాణం)
భూషణములు సెవులకు బుధ
తోషణము లనేక జన్మ దురితౌఘ విని
శ్శోషణములు మంగళతర
ఘోషణములు గరుడగమను గుణ భాషణముల్.

ఇక్కడ చూశారా? ప్రతీ పాదంలో రెండు, మూడు, నాలుగు, ఐదు అక్షరాలన్నీ "ష", "ణ", "మ", "ల" గుణింతాలనుండీ వరుసగా వచ్చాయి. అంటే నాలుగు అక్షరాలతో వృత్త్యనుప్రాస నడిపించాడు మహనీయుడు పోతన!


* ఈ అలంకారానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో నాకూ నిర్దిష్టంగా తెలియదు. ఎవరికైనా తెలిస్తే వ్యాఖల పెట్టెలో వ్రాయండి. అప్పుడు నేను వ్యాసాన్ని సరిచేస్తాను.
* ఈ క్రింది వ్యాఖ్యలలో కిరణ్ (.C)  చక్కని ఉదాహరణలని వివరణలనీ ఇచ్చాడు. తప్పకుండా చూడండి.
* శ్రీయుతులు వేదుల బాలకృష్ణమూర్తిగారు ఈ క్రింది లంకెల్లో లంకెబిందెలకంటే విలువైన పోతనపద్యాలను పొందుపరిచారు. సాహిత్యాభిలాషులు తప్పక చదవవలసినవి ఈ పద్యాలు: రుక్మిణీకల్యాణం; కుచేలోపాఖ్యానం.

19 comments:

కన్నగాడు said...

అలంకారాల గురించి చెబుతున్నందుకు ధన్యవాదాలు

రవి said...

చాలా రోజులనుంచి ఎదురుచూస్తున్నాను, ఇలాంటి టపాలకోసం. కొనసాగించండి. వీలయితే కొన్ని అసైన్ మెంట్స్ ఇవ్వండి.

(యమకం, వృత్యనుప్రాస కు వ్యత్యాసాలు ఏమిటో తెలుపగలరా?)

Phanindra said...

bhEshaina rachana! inkaa raay sOdaraa! gatamlO kiraN "Telugu Kavita" lO chandassu paaTaalu konni cheppaaDu. ippuDu nuvvu alamkaaraala gurinchi cheptE baagunTundi.

శ్రీనివాసమౌళి said...

బాగుంది రాముడూ...నీ కృషి అభినందనీయం... నువ్వు ఎప్పుడూ అనేమాట నిజమే వేటూరి,సిరివెన్నెల పాటల్లో ప్రాసలూ...అనుప్రాసలూ..యతులూ...మతులు పోగొడతాయి అని...:) :)

సిరివెన్నెల ఈ అలంకారాన్ని చాలా పాటల్లో వాడారు(ఆయన పాటల్లో లఘువులు ఉపయోగించి వచ్చే లైన్స్ లో ఈ అలంకారం ఎక్కువగా కనపడుతుంది ...నాకు గుర్తొచ్చిన పాటలు వ్రాస్తున్నాను...అందరివీ...నేను సినిమాలకు వ్రాసి ఇచ్చినవి కూడా ఉన్నాయి

తమ నిగ నిగ నగ లను...పదు గురి ఎదురుగ ఇదిగిది గో అని చూపెడుతూ
తెగ తిర్గే తరుణుల తిక మక పరుగులు చూడగా
--సిరివెన్నెల

కలికి చిలకల కొలికి మాకు మేనత్త
కలవారి కోడలు కనక మాలక్ష్మి
--వేటూరి

రేపొద్దు మాపొద్దు యారో...నన్ను ఆపొద్దు ముద్దులివ్వనీరో
ఈపొద్దు రేపొద్దు నాలో లేనిపోని పెద్ద ఊహలేవో..
--శ్రీనివాసమౌళి

కిల కిల కిల కిల కిలా...పడుచు...కోకిక..
పలికేప్రియ గీతిక పెళ్ళి కిలా
--సామవేదం

పుచ్చా పూవులు విచ్చేతావుల వెచ్చా వెన్నెలలూ...
--వేటూరి

తళ తళ మని కులు కుల వని -- కలుసుకోవాలని సినిమాలోనిది ఇందులో వృత్యానుప్రాస విరివిగా వాడబడింది
--సిరివెన్నెల

ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగనఝగన సొగసులలనవె
-- వేటూరీ నిన్ను దొంగల్దోల మహానుభావుడివి... :) :)

చక్కని చుక్కకు చక్కిలి గింతల చక్కెర ముద్దులు ఇయ్యాలి
--శ్రీనివాసమౌళి

మునుపెపుడూ మనమనసెరుగని మధురిమ ప్రేమ అని
అడుగడుగూ...తడబడుతూ నువు పొరపడవలదు చెలీ..
--శ్రీనివాసమౌళి

వయ్యారరం ఒంటరిగా...యవ్వారం తుంటరిగా
సయ్యాట కోరిందిగా
కూర్రోళ్ళ సందడిలో కవ్వించే కన్నులతో...
ఖవ్వాలీ ఆడిందిగా
సుతి మెత్తంగా మొత్తంగా అందింది బాల..
గుత్తంగా తూచింది గుండెల్నిలా
--శ్రీనివాసమౌళి

నేను ఎక్కువగా మాస్ పాటలకు ఉపయోగించినట్లు ఉంది ఈ అలంకారాన్ని తెలియకుండా(అనగా వాడాలి అని పనిగట్టుకు వ్రాయకుండా)...


అన్నిటికన్నా నాకు అమితామితం గా నచ్చిన ప్రయోగం వేటూరివారిదే...రెండు అక్షరాలు వాడబడ్డాయి...

రేపని మరి మాపని క్షణమాపని మాపని...
ఆపని ఏదో ఇపుడే తెలుపనీ...వలపనీ..

.C said...

శుభం! (వ్యాఖ్య మొదలుబెట్టక ముందే శుభం పలికినది ఎందుకంటే అలంకారాల మీద నేనూ వ్రాయలనుకుని షికాగోకి పుస్తకాలు కూడా తెచ్చుకున్నాను. కాస్త కుదుఱుకున్నాక వ్రాద్దామనుకున్నాను. నువ్వైనా ఆలస్యం లేకుండా మొదలుబెట్టేసావు, శుభం! ...అని)

<< ఉత్తుంగశబరిగిరిశృంగ, నిత్యనిస్సంగ, మంగళాంగ, పంపాతరంగ, పుణ్యానుషంగ, మునిహృదయజలజభృంగ!
ఇక్కడ "గ" తోనే కాక, "గ" కు ముందున్న అక్షరంలోని సున్నతో కూడి వృత్త్యనుప్రాస నడించింది! >>

అనుప్రాసకైనా నాకు తెలిసి ప్రాస నియమమే వర్తిస్తుంది. అనగా, "గ"కారానికి ముందు పూర్ణబిందువు (సున్నా) ఉంటే అది తప్పనిసరిగా ప్రతి "గ"కారనికి ముందూ రావాలి, లేకుంటే అనుప్రాస కాదు (అని నా నమ్మకం).

<< మందారమకరందమాధుర్యమునదేలు మధుపమ్మువోవునే మదనములకు >>

ఇది వృత్యనుప్రాస ఉదారహణమేనంటావా? (పొడుగు పాదంలోని రెండు భాగాలకూ) "మ"కారం యతి స్థానం కనుక తప్పనిసరిగా రావలసిందే... కాకపోతే ఒక్క "మ"కారం అదనంగా చేఱింది.

మఱిన్ని వ్యాఖ్యలకిది నాంది.

.C said...

<< అడిగెదనని కడువడిఁజను
నడిగినఁ దను మగుడనుడువడని నడ యుడుగన్
వెడవెడఁ సిడిముడి తడబడ
అడుగిడు, అడుగిడుదు జడిమ నడుగిడు నెడలన్! >>

నాకు తెలిసిన పద్యం:

అడిగెదనని కడువడిఁజని
యడిగినఁదన మగడు నుడువడని నెడ యుడుగన్
వెడవెడ సిడిముడి తడబడ
నడుగిడి నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్!

నేను చెప్పుకున్న అన్వయం/తాత్పర్యం: [విష్ణువు గజేంద్రుడిని రక్షించటానికి చెప్పా చెయ్యకుండా పఱుగులు పెడితే... లక్ష్మీదేవి ఆయనని కారణం] అడుగుదాం లెమ్మని కడు వడిగా (వేగంగా) చని (వెళ్ళి)... అడిగినా తన మగడు నుడువడని (చెప్పడని) అనుకుని, సమయం కఱిగిపోతుండగా (ఎడ ఉడిగిపోతుండగా) అలాగే వెళ్ళగా వెళ్ళగా కొప్పు (సిడి ముడి = కొప్పు? స్త్రీ?) తడబడుతూ అడుగు ఇడిన (పెట్టిన) చోటల్లా (ఎడల) జడిమ (జడత్వం) వలన అడుగు పెట్టీ పెట్టకుండా పెడుతూ [లక్ష్మీదేవి సాగుతోంది].

(నేను పుస్తకాలేవీ చూడలేదు... ఇందులో పోతన పాండిత్యంతో పాటూ నా పైత్యమూ కలిసిపోయి ఉండవచ్చు. తెలిసినవాళ్ళు పైత్యాంతకం ఒక మాత్ర నాకూ పడెయ్యండి, దయ చేసి! ముందుగానే నెనఱ్లు!)

.C said...

<< (*) ఈ అలంకారానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో నాకూ నిర్దిష్టంగా తెలియదు. ఎవరికైనా తెలిస్తే వ్యాఖల పెట్టెలో వ్రాయండి. >>

నిర్దుష్టంగా నాకూ తెలియదేమో, కానీ సొంత తెలివి వాడితే (బహుశా నీకూ అలా తెలిసినదే) నాకు తోచినది: అనుప్రాసాక్షర(క్రమ)ము ఆవృతం (repeat/cycle) అవుతుంది కనుక.

<< అన్నిటికన్నా నాకు అమితామితం గా నచ్చిన ప్రయోగం వేటూరివారిదే...రెండు అక్షరాలు వాడబడ్డాయి...

రేపని మరి మాపని క్షణమాపని మాపని...
ఆపని ఏదో ఇపుడే తెలుపనీ...వలపనీ.. >>

<< యమకం, వృత్యనుప్రాస కు వ్యత్యాసాలు ఏమిటో తెలుపగలరా? >>

ఈ పైన శ్రీనివాసమౌళి వ్రాసిన యమకం అవుతుంది. ఆవృతమవుతున్న అక్షరక్రమం అర్థభేదం కలిగి ఉంటే యమకమవుతుంది. "లేమా, దనుజుల గెలువగలేమా!" అన్నది చిరపరిచితమైన ఉదాహరణ (పోతన భాగవతం, నరకాసుర వధ ఘట్టం) - ఇక్కడ "లేమ" అన్న మొదటి ప్రయోగం "(ఓ) స్త్రీ!" అన్న అర్థంలో వస్తుంది, రెండవ అర్థం సులభగ్రాహ్యమే.

పైన చెప్పబడిన (స్వర్గీయ వేటూరి వారి) ఉదాహరణలో కూడా "ప-ని" అన్న అక్షరక్రమం అక్కడక్కడా అర్థభేదంతో వస్తుంది. (అర్థంభేదం తప్పనిసరిగా ప్రతి ప్రయోగానికి ఉండాలా వద్దా అన్నది నాకూ తెలియదు. అలా ఉండి తీఱవలసినదేనంటే ఇది వృత్యనుప్రాసమే అవుతుంది.)

.C said...

నాకు నచ్చిన ఒక వృత్యనుప్రాస ప్రయోగం, త్యాగరాజ కృతి:

వరలీల గానలోల సురపాల సుగుణజాల-భరిత నీల-గళహృదాల-యశ్రుతిమూల సుకరుణాలాలవాల పాలయా సుమాం!
సురవందితాప్తబృంద వరమందరధర సుందరకర కుందరదన ఇందుముఖ సనందననుత నందనందనేందిరావర!
మునిచింతనీయస్వాంత నరకాంతక నిగమాంతచర సుకాంత కుశలవాంతరహితదాంత కుజవసంత సంతతాంతకస్తుత!
వరభూషవంశభూష నటపోషణ మృదుభాషణ రిపుభీషణ నరవేశ నగపోషణ వరశేషభూష తోషితానఘ!
సుకవీశ హృన్నివేశ జగదీశకు భవపాశరహిత శ్రీశ సురగణేశహిత జలేశశయన కేశవాశమీశ దుర్లభ!
రణధీర సర్వసార సుకుమార బుధవిహార దనుజనీర ధరసమీరణ కరుణారస పరిపూర్ణ జార చోర పాహిమాం!
నరరక్షక నీరజాక్ష వరరాక్షస-మదశిక్షక సురయక్ష సనక-ఋక్షపతి నుతాక్షహరణ పక్షదక్ష శిక్షక ప్రియా!
రఘురాజ త్యాగరాజ నుతరాజ దివసరాజ నయనభోజ గదవనాజ జనకరాజ-సుతావిరాజ రాజరాజపూజిత!

(అంతా సొంతంగా తప్పులు దొఱలకుండా కొట్టేంత శక్తి నాకు లేదు. అందుకే, చూ. http://sahityam.net/wiki/Vara_leela_gana_lola - అర్థసహితంగా ఉంది. http://www.youtube.com/watch?v=ohrDlaiBYoI దగ్గర రామవర్మ గారు అద్భుతమైన వ్యాఖ్యానంతో పాడారు ఈ కీర్తన.)

మరో వృత్యనుప్రాస ప్రయోగం శ్రీ శ్రీనివాస గద్యం: http://mannaram.tripod.com/ramanuja/pdfs/srinivag.pdf (http://mannaram.tripod.com/ramanuja/ నుంచి తీసుకున్నాను. అక్కడే శ్రవణరూపం కూడా ఉంది.)

ఈ రెండిటిలోనూ ఈ ఒక్క అలంకారమే కాక భాషాసంగీతసాహిత్యాలపరంగా బోలెడుంది. అంతటినీ వ్యాఖ్యానించే దమ్ము నాకు లేదు, ఇది ఉచితమైన చోటూ కాదు. సంస్కృతభాష మీద మంచి పట్టే ఉన్న సోదరుడు సాందీపుడే నేను వ్రాసిన వాటిలో తప్పులు, తప్పుడు విఱుపులూ చెప్పి అర్థాలు మఱింత విస్తారంగా (మఱో సారి యెప్పుడో వీలు చూసుకుని) చెప్పగలిగితే బాగుండును.

.C said...

http://www.youtube.com/watch?v=NY3TVnCymQE - Couldn't help but share this (a kid's rendition of "varaleela gaanalOla..." - the kid with the violin is beaming all through!)

And, if someone thought it's a nearly impossible tongue-twister, listen to this too: http://www.youtube.com/watch?v=rRBF9vofFgQ and http://www.youtube.com/watch?v=PpaDwPLY1Qs or even http://www.youtube.com/watch?v=wDE4ySH3qfg - at least, they tried!!

Sandeep said...

@కిరణ్
చక్కని సూచనలను ఇచ్చావు సోదరా! నీ వ్యాఖ్యలు చూశాక నా వ్యాసాన్ని కొంచెం మార్చాను. ముఖ్యంగా ముందు అక్షరంలో పూర్ణబిందువు విషయం సరిచేశాను , "అడిగెదనని" పద్యం కూడా (ఇప్పుడు యతిమైత్రి సరిపోతోంది).

ఇక "పని" తో వేటూరి చేసిన ప్రయోగం వృత్త్యనుప్రాస అనే నా నమ్మకం. అయినప్పటికీ వ్యాకరణం పుస్తకం తిరగేసి మళ్ళీ వ్యాఖ్యానిస్తాను. "మందారమకరంద" పద్యం కూడా పద్యనియమానుసారం అన్ని "మ"-లు వాడాల్సిన పని లేదు కాబట్టి అనుప్రాసే అనిపించింది. ఇది ముక్కువారిని అడిగి నిర్ధారించాల్సిన విషయం అనుకుంటున్నాను.

నువ్వూ అలంకారాలపై వ్యాసాలను వ్రాయాలని అనుకుంటున్నావు కాబట్టి, ఈ సారి నేను వ్రాసే ముందు నిన్ను సంప్రతిస్తాను.

@కన్నగాడు, రవి, ఫణీంద్ర
తప్పక ఇంకా సవివరమైన వ్యాసాలను వ్రాయడానికి ప్రయత్నిస్తాను. మీ ప్రోత్సాహానికి కృతఙ్ఞుణ్ణి.

@మౌళి
వేటూరి, సిరివెన్నెల వాడిన మరిన్ని ప్రయోగాలను తెలిపినందుకు కృతఙ్ఞతలు సోదరా! నీ ప్రయోగాలు కూడా ముచ్చటగా ఉన్నాయి.

Sravan Kumar DVN said...

few from annamacharya kirtanalu ,
ivi brutyanuprasalamkaramo kado cheppandi.
http://annamacharya-lyrics.blogspot.com/2006/10/26shrimannarayana.html
కమలాసతీ ముఖకమల కమల హిత కమలప్రియ కమలేక్షణ కమలాసనహిత గరుడకమనశ్రీ కమలనాభ నీ పదకమలమే శరణు
..
పరమయోగిజన భాగధేయ శ్రీ పరమపూరుష పరాత్పర
పరమాత్మ పరమాణు రూప శ్రీ తిరువేంకటగిరి దేవ శరణు
------------------
ide sirasu manikya...
http://annamacharya-lyrics.blogspot.com/2006/10/42ide-sirasu-manikya-michchipampeneeku.html
ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు
నాకె అదనెరిగి తెచ్చితిని అవథరించవయ్యా

రామా నిను బాసి నీ రామా నే చూడగ
ఆరామమున నిను పాడెను రామ రామ యనుచు
ఆ మెళుత సీతయని అపుడు నే తెలిసి
నీ ముద్ర ఉంగరము నేనిచ్చితిని౨

కమలాప్తకులుడా నీ కమలాక్షి నీ పాద
కమలములు తలపోసి కమలారిదూరె
నెమకి ఆలేమను నీ దేవియని తెలిసి
అమరంగ నీ సేమమటు విన్నవించితిని౨

దశరధాత్మజా నీవు దశ శిరుని చంపి
ఆ దశనున్న చెలిగావొ దశ దిశలు పొగడ
రసికుడ శ్రీ వెంకట రఘువీరుడా నీవు
శశిముకి చేకుంటి చక్కనాయ పనులు
--------------------------

http://annamacharya-lyrics.blogspot.com/2008/07/510-paramapurusha-hari-parama.html

పరమపురుష హరి పరమ పరాత్పర
పరరిపుభంజన పరిపూర్ణ నమో

కమలాపతి కమలనాభ కమలాసనవంద్య
కమలహితానంత కోటి ఘనసముదాయతేజా
కమలామలపత్రనేత్ర కమలవైరివర్ణగాత్ర
కమలషట్కయోగీశ్వరహృదయం తే హం నమో నమో

జలనిధిమథన జలనిధిబంధన జలధిమధ్యశయనా
జలధియంతరవిహార మచ్చకచ్చపయవతారా
జలనిధిజామాత జలనిధిశోషణ జలనిధిసప్తకగమన
జలనిధికారుణ్య నమోతేహం జలనిధిగంభీర నమోనమో

నగధర నగరిపునందిత నగచరయూథపనాథా
నగపారిజాతహర సారసపన్నగపతిరాజశయన
నగకులవిజయ శ్రీవేంకటనగనాయక భక్తవిధేయా
నగధీరా హం తే సర్వేశ్వర నారాయణ నమో నమో

Sravan Kumar DVN said...

http://annamacharya-lyrics.blogspot.com/2007/12/367gora-vidarana-narasimha.html
ప|| ఘోర విదారణ నారసింహనీ | నీ రూపముతో నెట్లుండితివో ||
చ|| ఉడికెడి కోపపుటూర్పుల గొండలు | పొడిపొడియై నభమున కెగయ |
బెడిదపు రవమున పిడుగులు దొరుగగ | యెడనెడ నీవపుటెట్లుండితివో ||
చ|| కాలానలములు గక్కున యన | జ్వాలల నిప్పులు చల్లుచును |
ఫాలాక్షముతో బ్రహ్మాణ్డ కోట్ల | కేలికవై నేవెటులుండితివో ||

Sandeep said...

@శ్రవణ్
అన్నమయ్య పాటల్లోని అలంకారాలను ఏరాలని నాకూ ఎంతో ఉత్సాహం ఉంది. మీరు అడిగిన పాటల వివరాలు సేకరించి నేనే వ్యాఖ్యని వ్రాస్తాను. వీటిని నాకు చూపించినందుకు కృతఙ్ఞతలు.

@అందరూ
"బహుశా నిను బందర్లో చూసి ఉంటా" అనే సరదా పాటలో కూడా వేటూరి "ఆ మాటిచ్చి, ఓ మాటొచ్చి, ఈ మాటిచ్చే రుచులందుకో" అనడం జరిగింది. అంటే "ఆ మాట ఇచ్చి, ఒక మాటు వచ్చి, ఈ మాటున ఇచ్చే రుచులందుకో" అని అర్థం. ఇక్కడ మూడక్షరాలతో వృత్త్యనుప్రాస కలిసింది. గమనించండి.

కార్తీక్ చంద్ర said...

maama nuvvu ilaa blogs lo vyyakaranam explain cheyyadam chaala baavundi...abhinandaneeyam...

eppudo chinnappudu mokkubadigaa maarukula koraku nerchukunna ee alankaaraalu chandassu loni sootraalu..ilaa roju vine paatalalo, padyaalalo choopinchadam chaala baavundi....really appreciate your efforts...keep going..

శ్రీనివాసమౌళి said...

అయ్యారే! సయ్యంటోంది...తయ్యారై..వయ్యారి -- సిరివెన్నెల

వరదైనా వరమని వరిస్తానమ్మా! --చంద్రబోస్

ఎక్కడో పుట్టి
ఎక్కడో పెరిగి
ఇక్కడే కలిశాము-- చంద్రబోస్

కొల్లేటి కోటల్లో...గోటి గాటుల్లో వాటమేముందిలే
ఈ మంచుమీటుల్లో మబ్బు చాటుల్లో
మోమాటమే వద్దులే
--అనంతశ్రీరాం

గల గలా తెలి నురగలా... సెలయేటికుందిలే నవ్వు
తళతళా తొలి మెరుపులా ఆ తారకుంది నవ్వు...
--అనంతశ్రీరాం

చిలిపి చిలక వలకి పడిందోయ్
చెలిమి చిటికె చెలికి మహా నచ్చిందోయ్
--వేటూరి?

Sandeep said...

@శ్రీనివాస మౌళి

నువ్వు చెప్పిన ఉదాహరణలో వృత్త్యనుప్రాస నియమం కనబడుతోంది కానీ, ఆ స్ఫూర్తి (spirit) కనబడట్లేదు అన్నాయ్. ఉదా: "ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఇక్కడే" అన్నప్పుడు నిజానికి అక్కడ ఉన్నది రెండే "క్క"-లు ('ఎక్కడా రెండుసార్లు వచ్చింది). ఈ మాత్రం ప్రయోగం దాదాపు 90% పాటల్లో ఉంటూనే ఉంటుంది. నా వరకు నేను ఒక అక్షరంతో ఉండే వృత్త్యనుప్రాసలో కనీసం నాలుగో ఐదో సార్లు అదే అక్షరం ఒక పాదంలోనే రావాలని ఆశిస్తాను. ఇక నువ్వు చెప్పిన అనంతశ్రీరాం ప్రయోగాలు కూడా నాకు రుచించలేదు. "చిలిపి చిలక" పాట వ్రాసింది సిరివెన్నెల. దానిలో కొంత బలం కనబడింది.

సినిమా పాటల్లో నాకు కనిపించిన మరి కొన్ని ప్రయోగాలు:
చలిపిడుగుల సడి విని జడిసిన బిడియము తడబడి నిను విడదా? (చిత్రం: వర్షం, రచన: సిరివెన్నెల)
ఎక్కడ{7} దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్కా, ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవె చప్పున చక్కగ, టక్కున టక్కరి పిట్టా, నిన్ను పట్టేదెట్టా? (చిత్రం: లేడీస్ టైలర్, రచన: సిరివెన్నెల)

చూడు కనీసం ఐదారు 'క్క '-లు, 'డ ' లు ఉన్నాయి.

శ్రీనివాసమౌళి said...

మనకు కలిగే అసంతృప్తులన్నీ మన ఆశలవల్లే అని ఒక మహానుభావుడు చెప్పాడు (చెప్పాడో లేదో తెలీదు మనం చెప్పేటప్పుడు అలా కవర్ చెయ్యాలి అని బాబాయ్ చెప్పాడు)
ఎక్కడో పుట్టి లో... కనీసం మూడు క్క లు ఉన్నాయి రెండవ లైన్ లో "వ" అనే అక్షరం మూడు సార్లు వాడబడింది ...... ఇక్కడ ఇంకో సందేహం "ల" కి "ళ" కి ప్రాస కలుస్తుంది అలాంటప్పుడు అనుప్రాసలో ఎందుకు లెక్కించలేము?

ఇంకా నాకు గుర్తొస్తున్న వృత్యనుప్రాసలు

నల్లా నల్లాని కళ్ళ పిల్లా నీ మొగుడయ్యే వాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా
తెల్లారే సరికల్లా నే జిల్లాలన్నీ వెతికి...వాణ్ణెల్లా గొల్లాగ తెచ్చి పెళ్ళి చేసేస్తానమ్మా!
--శివశక్తిదత్త(చిత్రం:సై )

Sandeep said...

ల-కి, ళ-కి అనుప్రాస కుదురుతుందనే నా నమ్మకం. మామూలుగా పద్యాల్లో ప్రాసకి (పాదంలో రెండో అక్షరం) చెల్లుతుంది కాబట్టి ఇక్కడా చెల్లుతుందని అనుకుంటున్నాను.

శ్రీనివాసమౌళి said...

మరోఅద్భుతమైన అనుప్రాస

ఘల్లు ఘల్లు ఘల్లుమంటూ మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు
నల్లమబ్బు చల్లనీ చల్లని చిరు జల్లు
ఎల్లలన్నవే ఎరుగని వేగంతో వెళ్ళు
--సిరివెన్నెల

చల్లనీ చల్లని --ఇది మరో అలంకారం అవుతుంది..

దాదాపు 15 సార్లు "ల్ల" ను ఉపయోగించటం జరిగింది అదీ పల్లవిలోనే!..నిజం గా ఒక అద్భుతమే

లక్స్ పాప లక్స్ పాప లంచ్ కొస్తావా
లడ్డు కొరికిస్తావా లవ్వే తినిపిస్తావా
లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా!
--భువన చంద్ర