Saturday, June 5, 2010

దర్శకులు జంధ్యాల గారి తిట్లదండకం

నాకు జంధ్యాల అంటే అపారమైన గౌరవం, అభిమానం. హాస్యాన్ని పండించడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో దాదాపు అన్నింటిలో హాస్యానికే పెద్దపీట వేశారు. అంతే కాక అటు విశ్వనాథ్ వంటి కళాతపస్వికి, ఇటు రాఘవేంద్ర రావు వంటి కమర్షియల్ దర్శకుడికీ కూడా సంభాషణలు (dialogues) వ్రాసి పెట్టారు. శంకరాభరణమైనా, వేటగాడైనా చెల్లింది వేటూరికే అంటారు కానీ, జంధ్యాలకి (గాయకుడు బాలుకి కూడా) చెల్లిందన్నది నిర్ద్వంద్వమైన నిజం.

జంధ్యాలగారు దర్శకత్వం వహించిన "ష్...గప్..చుప్" అనే చిత్రం చిత్రం పెద్ద హిట్టవలేదన్నట్టు గుర్తు. ఆ చిత్రానికి సాహిత్యం అందించినది వేటూరి, జొన్నవిత్తుల. ఇద్దరికిద్దరు చక్కని తెలుగుకు ప్రాధాన్యత ఇస్తూ వ్రాసేవాళ్ళే! అందులోనూ జంధ్యాల, ఆయన చిత్రాల్లో సాహిత్యానికి చాలా ప్రాముఖ్యతను కల్పిస్తారు. అందుకే ఈ చిత్రంలోని అన్ని పాటలూ బాగుంటాయి. నాకు ప్రత్యేకించి నచ్చినవి మాత్రం సరదా పాటలే! "లోకాన రైలుబండి చికుచికు అంటుంది" అనే పాట మా ఇంటిల్లిపాదికీ ఇష్టం. అలాగే అందులో జంధ్యాల ఒక తిట్లదండకాన్ని ప్రయోగించారు. వ్రాసింది జంధ్యాలో, వేటూరో, జొన్నవిత్తులో తెలియదు కానీ, మంచి సరదాగా ఉంటుంది. అది ఇక్కడ వ్రాస్తున్నాను.

ఈ దండకానికి సందర్భం ఏమిటంటే, ఒక bankలో ఉద్యోగస్థులందరూ కలిసి రాజమండ్రి గోదావరి తీరానికి picnicకి వెళ్తారు. అక్కడ "పాపికొండల్లో తిరిగే కొండపాపులు" కొందరు వారిని gunలతో బెదిరించి వారిని ఆటపాటలతో అలరించమన్నప్పుడు వారందరూ చేసే విన్యాసమే ఈ దండకం. ఈ సరదాప్రయోగాన్ని మధ్యమధ్యలో కొన్ని ఆంగ్లపదాలను తగిలించి, "దండకం" అనే ఛందోరీతిలో, తమాషాగా వ్రాశారు. గతంలో ఆరుద్రగారు "దోమ" మీద, దండకం వ్రాస్తూ "నువ్వేమి ట్రాన్సిస్టరా? లేక దాన్సిస్టరా?" అని వ్రాయడం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇది కూడా అదే పంథాలో ఉంటుంది.

ఈ ప్రయోగం సరదాకి మాత్రమే కాని మన సంస్కృతినో, ఛందస్సునో అవమానించడానికి కాదన్నది పాఠకులు గమనించాలి.


ఒరేయ్ త్రాపి, మహాపాపి, కురూపి, నిన్ను చూడంగనే వచ్చు హై లెవెల్ బీపీ,
ముండమోపి, జిరాఫీ, నిన్ను తెగ్గోస్తె లోకానికే పిచ్చ హ్యాపి
అంకఛండాలుడా, బంకబధిరాంధుడా, పరమపాపిష్ఠ నికృష్ట దుష్టాత్ముడా,
నీ నీచరూపంబు చూడంగ పాపంబు, నీ కంఠనాళంబు కక్కోసు గొట్టంబు,
నీ కళ్ళలో కుళ్ళు, నీ బుర్రలో బురద, నీ పల్కులే చెత్త,
నీ జన్మ డ్రైనేజీ, నువ్వో దగుల్బాజీ, ఏబ్రాసి, ఛెప్రాసి, సన్నాసివీ
అశుద్ధస్వరూప అబద్ధప్రలాప, పింగు బొంగైన పింజారిగా,
కుత్తేకా బచ్చా, కొవ్వెక్కిన లుఛ్ఛ, పగిలేను నీ పుచ్చ, తీరేను నా కచ్చ, నీ చేతికేవచ్చు చిల్లిబొచ్చ నిక్కచ్చిగా
భ్రష్టాతిభ్రష్టా, పరాకాష్టకెళ్ళావు, దుష్టత్వమందున్ ముదనష్టుడా త్రాష్టుడా,
కుష్టుముష్టోడి అంగుష్టమా, వృద్ధక్షయరోగి ఉఛ్ఛిష్టమా
ఒరేయ్ పళ్ళపిచ్చి (?), అరేయ్ చిల్లిగోచి, నీ పిచ్చి పోగొట్టగా టచ్చి ఇస్తాను, పెంటచ్చిగా, పెన్-టచ్చిగా (pen-touchగా)
ఒరేయ్ పాచిముఖమా, నడుస్తున్న శవమా, వేడి ఇడ్లీలు పారేయుచున్, చద్ది సాంబారు తెగత్రాగు సోంబేరిగా
పెద్ద ఇడియట్టువి, చద్ది పెసరట్టువి, పిచ్చి టేష్టున్న శ్యాడిష్టువి,
గజ్జిపాదాల మరుగుజ్జువి, ఉఛ్ఛనీచాలు లేనట్టి రాస్కేలువి, తేలువి (?)
ఒరేయ్ అక్కుపక్షి, నిరక్షరకుక్షి, కుంఖాక్షి (?), ఏకాక్షి సంఘాల అధ్యక్షుడా
నువ్వు చుంచెలుక గొద్దెవి, రాబందు రెట్టవి, బొద్దింక కేశానివి
సీంపంది మూతివి, గబ్బిలం తోకవి, ఏకాకి కాకీకవి, న్యూసెన్సు డాంకీవి, నో-సెన్సు మంకీవి, కుడితిలో చిట్టెలుకవి
మున్సిపాలిటీ పందికిన్ మూత్రపిండానివి, ఎద్దు మొండానివి, సృష్టిమొత్తంబులో శుంఠవి,
ఒరేయ్ పేడతట్టా, అరేయ్ చెత్తబుట్ట, ఒరేయ్ గడ్డిపోచా, అరేయ్ నారపీచా
ఒరేయ్ తుప్పుమేకా, అరేయ్ పందితోకా, ఒరే వానపాము, ఇలా తొక్కుతాము
ఒరేయ్ గౌడుగేదె, ఇదే బడితపూజ, సెంటిమెంటన్నదే లేని ప్రెంటాసురా(?)
నిన్ను తిట్టంగ నేనెంతవాడన్ దురాత్మ, ఏడేడు లోకాలకే భాషలకె శోషొచ్చి మూర్ఛిల్లురా
మహాబండబూతులు తలల్వంచు నీ ముందు పాపాత్ముడా
రావరావో బోడివెధవా, రావ రావొ అంట్లవెధవా, రావ రావో చచ్చువెధవ (?)
వెధవన్నరెధవా, ముప్పావు వెధవా, పరిపూర్ణవెధవ
చావరా, చావరా, చావు చావు, థూ!


(?) అని ఉన్న చోట నాకు సరిగ్గా వినబడలేదు. మీకెవరికైనా అర్థమైతే తప్పకుండా టీకాతాత్పర్యసహితంగా చెప్పండి. ఈ దండకాన్ని సచిత్రంగా ఇక్కడ చూడవచ్చును.

విశేషమేమిటంటే కవి ఎవరో కానీ శబ్దాలంకారాలని, ఉపమాలంకారాన్ని చాలా ఘనంగా వాడారు. "పెంటచ్చిగా, pen-touchగా" అని ఛేకానుప్రాస, "ఏకాకి కాకీకవి" మొ. వృత్త్యనుప్రాస నాకు బాగా నచ్చాయి. ఇంక జంధ్యాల చిత్రాల్లో ఉపమానాలకు లెక్కేముంది? wash-basinలో చేపలు పట్టుకునేవాడా, మిట్టమధ్యాహ్నం ఎండలో వేణ్ణీళ్ళతో స్నానం చేసి రగ్గు కప్పుకుని పడుకునేవాడా, జిగటవిరేచెనాలు పట్టిన జిరాఫీ మొ. ఆయన ఎన్నో వాడారు. పరమభయంకరమైన తిట్లను కూడా సరదాగా వినబడేలాగా చేశారు. మొత్తానికి ఎన్నిసార్లు విన్నా నవ్వొచ్చేటువంటి సరదాపాట ఇది.

8 comments:

WitReal said...

written by jonnavittula.

జ్యోతి said...

ఇది చూడండి..

http://jyothivalaboju.blogspot.com/2008/06/blog-post_03.html

Sandeep said...

@WitReal
నేను సినిమా టైటిల్స్ లో చూస్తే ఏ పాట ఎవరు వ్రాశారో చెప్పలేదండి. ఇది జొన్నవిత్తుల వ్రాశారని మీకు ఎలాగ తెలిసిందో చెప్తారా? అంటే మీరన్నది నిజమని నమ్మక కాదు, అసలు కుతూహలం - ఇలాంటి సమాచారం ఎక్కడ దొరుకుతుందా అని.

@జ్యోతి
బాగుందండి మీ టప. నాకు అర్థం కాని కొన్ని పదాలు అక్కడ చూసి తెలుసుకున్నాను. నా వ్యాసాన్ని సరిచేస్తాను. మీ టప టైటిల్లో కొంచం ఆ తిట్టు తీసేస్తే బాగుండనిపించింది. మీ బ్లాగులో చింతా రామకృష్ణారావుగారు వంటి మహానుభావులు వ్యాఖ్యలు వ్రాశారంటే మీరెంతటి రచయితలో విదితమౌతోంది.

జ్యోతి said...

సందీప్ గారు,

జంద్యాలగారి తిట్లకు కాస్తైనా ధీటుగా ఉండాలని సరదాగా అలా టైటిల్ పెట్టానండి..అంతే తప్ప వేరే ఉద్ధేశ్యం లేదు..

Anonymous said...

excellent.. evarimeedainaa kopam unte vaallaki mail/scrap cheseyyachu..hheheheh

WitReal said...

ఆ సినిమా వొచ్చిన రొజుల్లో, అక్కడా ఇక్కడా సదవటమో, సూడటమో జరిగింది

Sunil Telagamsetty said...

గొద్దేకబచ్చ (?) --> కుత్తే కా బచ్చా అన్నట్టుంది
పరాకాష్టకేళావు (?), దుష్టత్వమందున్ -->
పరాకాష్టకెళ్ళావు దుష్టత్వమందున్

Sandeep P said...

@Sunil

మీరన్నది సరి అనిపిస్తోంది. బ్లాగు టప దిద్దాను. నెనర్లు.