Wednesday, August 12, 2009

వంశవృక్షం - ధర్మం

బాపు తీసిన "వంశవృక్షం" అనే ఒక సినిమా ఈ మధ్యన చూసాను. సినిమా లో బొత్తిగా గ్లామర్ లేదు. సినిమా మొత్తం బ్రాహ్మల democracy కనబడుతుంది.అంటే, "by the brahmins, for the brahmins, of the brahmins" అన్న మాట. ఆ సినిమా మా ఇంట్లో ఎవరికీ నచ్చలేదు. నాకు మాత్రం కొంత నచ్చింది. ఎందుకు నచ్చింది? ఏమిటి నచ్చింది?

ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ఇందులో characters ని పరిచయం చెయ్యాలి. సోమయాజులు ఒక కృష్ణ భక్తుడు. వాళ్ళ వంశం పేరు "బృందావనం" వారు. వాళ్ల వంశం లో అందరూ కృష్ణ భక్తులు. వాళ్ళకు రోజు అంటే పొద్దున్నే లేచి కృష్ణనామస్మరణ చేస్తూ పడుకునేవరకు కృష్ణుణ్ణి సేవించడమే. సోమయజులుకు ఒక కొడుకు ఉంటాడు. అతడికి పెళ్లి అయ్యి ఒక పిల్లాడు పుడతాడు. కానీ కొడుకు పుట్టగానే సోమయాజులు కొడుకు చనిపోతాడు. అప్పుడు అతని భార్య (జ్యోతి) వైధవ్యం స్వీకరిస్తుంది. తెల్ల బట్టలు వేసుకుంటుంది. సౌందర్యానికి సంబంధించిన విషయాన్నీ దగ్గరకు రానివ్వదు. యవ్వనం లో ఉండగా కలిగే కోరికలను చంపుకోవడానికి రాత్రుళ్ళు కేవలం మజ్జిగన్నం తింటుంది. కొడుకుని చూసుకుంటూ ఉంటుంది.

కొంత కాలానికి జ్యోతికి MA చెయ్యాలనే కోరిక కలుగుతుంది. చెప్పగానే వాళ్ళ అత్తగారు, "మా ఇంట వంట లేదమ్మా ఇలాగ. వద్దే తల్లి. అనవసరమైన కోరికలు కలుగుతాయి", అంటుంది. కానీ సోమయాజులు ఎంత ఛాందసుడైనా అమ్మాయికి ఇంట్లో ఏమి తోచట్లేదు అని నాలుగు మంచి ముక్కలు చెప్పి చదువుకోవడానికి తన శిష్యుడు (కాంతా రావు, కాలేజీ ప్రిన్సిపాల్) దగ్గరకు పంపిస్తాడు. ప్రతి రోజు లాంచి లో పట్నం వెళ్లి కాంతారావు తమ్ముడు (అనిల్ కపూర్) దగ్గర ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. అనిల్కపూర్ జ్యోతి కి ఆసలు కల్పిస్తాడు, "నాకు నువ్వంటే ఇష్టం. వైధవ్యం నీకు వద్దు. నన్ను పెళ్లి చేసుకో. మీ నాన్న, మగ పిల్లల కోసం, మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. నువ్వు భర్త మరణించాక వేరే పెళ్లి చేసుకుంటే వచ్చిన నష్టం ఏమిటి?", అని. జ్యోతి బాగా తటపటాయించి చివరికి ఒకర రోజు కాలేజీ కి వెళ్ళినట్టే వెళ్లి అనిల్ కపూర్ ని పెళ్లి చేసుకుంటుంది.

కొన్నాళ్ళకు ఆమెకు పుత్రుడి మీద ఉన్న మమకారం వాడిని తనతో తీసుకేల్దాము అనే ఆశ కలిగిస్తుంది. వెళ్లి సోమయజులును అడుగుతుంది. అప్పుడు వారిద్దరి మధ్యన సంభాషణ నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది.

(సో: సోమయాజులు, జో: జ్యోతి).

సో: రా అమ్మ. ఈవేళ మా అబ్బాయి తద్దినం. మీ అత్తగారు నీకు ప్రసాదం పెడుతుంది, తిను.
జ్యో: మామగారు, నాకు నా బిడ్డను తీసుకెళ్ళాలి అని ఉంది.
సో: దాని గురించి మాట్లాడుకుందాం. ముందు మా వాడికి నమస్కారం చేసుకుని భోజనం చేయి.
(భోజనం తరువాత జ్యోతి తండ్రి వచ్చి తనను బాగా తిడతాడు.).
జ్యో: నాన్న, నన్ను ఏమైనా అనే హక్కు నా మావగారికి ఉందేమో కానీ, నీకు కాదు. అమ్మ బ్రతికి ఉండగానే మగపిల్లల కోసం నువ్వు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నావు.
(సోమయాజులు జ్యోతి తండ్రికి నచ్చ జెప్పి పంపిస్తాడు. జ్యోతిని వేరే గదిలోకి తీసుకొచ్చి మాట్లాడతాడు).
సో: అమ్మ, నీకు మళ్ళీ పెళ్లి అయ్యింది. మళ్ళీ పిల్లలు కలుగుతారు. మాకు ఈ వయస్సులో కావలసిన కొడుకు ప్రేమ పోయింది. అనాథలమయ్యిపొయాము. మీ బిడ్డే మా ఊపిరి తల్లి. వాడిలోనే మా బిడ్డను చూసుకుంటున్నాము. దయచేసి వాడిని మాకు వదిలెయ్యి. నీకు కావలసినప్పుడు వచ్చి చూసుకో.
జ్యో: మామగారు. మీరు కర్మ గురించి అన్ని సిద్ధాంతాలు చెప్తారు. మనం గోదావరికి ఎంత పెద్ద బాణ పట్టికేల్తే అంతే నీరు వస్తుంది. ఇదే మీకు ప్రాప్తం. మీ కోసం నేను త్యాగం చెయ్యలేను. నాకు నా సంతోషం ముఖ్యం.
సో: అది ధర్మం కాదు తల్లి.
జ్యో: మామగారు, ధర్మం విషయంలో మీకు నాకు చుక్కెదురు. మనిషి ధర్మం కోసం నడవాలి అని మీరు అంటారు. ధర్మం మనిషి కోసం నడవాలి అని నేను అంటాను.
సో: (నివ్వేరేపోతూ కోపాన్ని శాంతంగా మార్చుకుంటూ విరక్తితో కూడిన చిరునవ్వుతో) సరే, ధర్మం విషయం పక్కన పెడదాము. సాధకబాధకాలే మాట్లాడుకుందాము. వీడు నీకూ, మా అబ్బాయికి పుట్టాడు. నువ్వు వీడిని తీసుకెళ్ళి నీ దగ్గర పెంచిన తరువాత, తన తండ్రి వేరే ఉన్నాడు అని, తన బంధువులు వేరే వున్నారు అని తెలిసి వాడు నిన్ను ద్వేషిస్తే, నన్ను నా బంధువుల దగ్గరనుండి ఎందుకు దూరం చేసావు అని నిలదీస్తే. ఈ ప్రేమ, ఆస్తి అనుభవించే హక్కును నాకు ఎందుకు దూరం చేసావు అని అడిగితే?

ఈ క్షణం లో జ్యోతికి ఏం చెప్పాలో పాలుపోదు. నా కొడుకు అలాగా చెయ్యడు అని ధైర్యం గా చెప్పలేదు. ఎందుకంటే, ప్రేమించే వాళ్లు దూరమయ్యే కొద్దీ వాళ్ల మీద ప్రేమ పెరుగుతుంది. దాని కోసం ఏ బంధాన్నైన, ఇష్టాన్నైనా వదులుకోవాలి అనిపిస్తుంది. అది తనకు కూడా తెలుసును. అలాగని, బిడ్డను వదిలెయ్యలేదు. వచ్చి చూసుకుని వెళ్ళిపోలేదు. భారమైన హృదయంతో వెళ్ళిపోతుంది.

ఒక ఏడాది తరువాత తన బిడ్డను చూసుకున్న కళ్ళల్లో వచ్చే ఆనందబాష్పాలు, బిడ్డ కోసం తల్లడిల్లిపోయే తల్లి వేదన, వాడిని మళ్ళీ తన కళ్ళారా చూసుకోవడం వీలు కాదేమో అనే దుఃఖం, అటు భర్త, ఇటు కొడుకు మధ్యలో నలిగిపోతూ ఉన్న జ్యోతిని చూసి కరుగని మనసు ఉండదేమో. చివరకు వాడి గురించే పరితపిస్తూన్న తనకు ఆఖరు ఘడియల్లో వాడి దర్శనం దొరికినప్పుడు ఆమె ముఖంలో కలిగే భావాలను బాపు తెరకెక్కించిన విధం నిజంగా నా కళ్ళల్లో నీళ్లు తెప్పించింది.

అసలు ఈ సినిమాలో ఎన్నో ప్రశ్నలు వస్తాయి:
  1. అసలు జ్యోతి మళ్ళీ పెళ్లి చేసుకోవడం రైట్ ఆ?
  2. వేరే పెళ్లి చేసుకున్న అంతమాత్రాన తను తొమ్మిది నెలలు మోసి, కని, పెంచిన కొడుకు మీద సర్వహక్కులు కోల్పోతుందా?
  3. ఏదో కొడుకు భవిష్యత్తులో తనను ద్వెషిస్తాడేమో అన్న భయంతో తనను విడిచిపెట్టేయ్యడం వివేకమా? అసలు తను పెంచి, పెద్దచేసిన కొడుకు తనను ఎందుకు ద్వేషిస్తాడు?
  4. కొడుకు పోయి, కోడలు చెప్పా,పెట్టకుండా ఎవర్నో పెళ్లి చేసుకుని, తన మొదటి భర్త తద్దినం రోజే తన బిడ్డను అడగటానికి వస్తే కుమిలిపోతున్న తల్లిదండ్రులను "మీ కర్మ ఇంతే, నా బిడ్డను ఇచ్చెయ్యండి", అనడం సబబా?
ఇవన్నిటికీ సమాధానం సోమయాజులు ఒక్క ముక్కలో చెప్తాడు,"ఏది మంచో, ఏది చెడో చెప్పడానికి నేను ఎవర్నయ్యా? అన్నీ చూసుకోవడానికి కృష్ణపరమాత్మే ఉన్నాడు. నాకు ఏది ధర్మం అనిపించిందో, అది నేను చేస్తాను". నిజమే, మనం ఎవరం? అందరికీ ఏదో ఒకటి రైట్ అనిపించబట్టే చేస్తారు. నూటికి తొంభై మంది, "ఇది తప్పు", అని తెలిస్తే చెయ్యరు. అందరికీ స్వార్థం ఏదో ఒక మొత్తం లో ఉంటుంది. దానిని బట్టే తప్పు, ఒప్పు అనిపిస్తూ ఉంటాయి.

ఈ సినిమా లో నేను మరిచిపోలేని డైలాగ్ ఒకటి ఉంది. కోడలు రాత్రైనా తిరిగి రాలేదు అని సోమయాజులు, వంట మనిషి (డబ్బింగ్ జానకి) కలిసి లాంతరుతో గోదావరి ఒడ్డుకు వెళ్లి వేచి చూస్తారు. జ్యోతి అప్పటికే అనిల్ కపూర్ ని పెళ్లి చేసుకుంటుంది. కోడలు ఎంతకీ రాకపోతే, సోమయాజులు వంట మనిషితో, "చీకటి పడింది కదా! దారి తప్పి ఉంటుంది", అంటాడు. చక్కని మాట.

అన్నీ చూసుకోవడానికి కృష్ణ పరమాత్ముడే ఉన్నాడు. కృష్ణం వందే జగద్గురుం!

గమనిక: నేను కూడా ఈ సినిమా లో ఎదురయ్యిన ప్రశ్నల గురించి ఆలోచించాను. నాకు ఏమిటి అనిపించింది అంటే, జ్యోతి రోజూ పిల్లాణ్ణి ఇంట్లో వదిలి, చదువుకోవడానికి పట్నం వెళ్ళేదికదా? పెళ్లి అయ్యాక కూడా అలాగే, పొద్దున్నంతా సోమయాజుల ఇంటికి వచ్చి పిల్లాణ్ణి చూసుకుని సాయంత్రం భర్తా దగ్గరకు వెళిపోతే సరిపోయేది కదా? ఎలాగూ అనిల్ కపూర్ పొద్దున్నే ఉద్యోగానికి వెళ్లి సాయంత్రమే ఇంటికి వస్తాడు కదా? అని.

ఎలాగుంది నా అవుడియా? మరీ చిన్నపిల్లాడి లాగా ఉందా? తప్పంటారా?

2 comments:

Mauli said...

mee idea tokka laga undi ..hi hi...

just kidding...

manchi cinima teesikonnaru ...somayaajulu maaa tatayya gari lane matladinatlu anipinchedi ....alage athani kodalu nalaga matladinatlu anna maata...vallu velli aa ammayi daggara ela undalerO...alanE aame kooda tana biddani veella daggara vadala ledu ....asalame pelli chesokodaniki velli nappude bidda ni teesikoni vellalsindi ...kani kudirE pani kAdu kadA ...

Naga Pochiraju said...

some how I like this movie!
for the script......asalu ekkaDa kooDa anavasarapu sannivESam unDadu mottam
renDu virudha bhaavaalaa sangharshaNa calaa baagaa ceppaaru