జొన్నవిత్తులకి అపారమైన లాఘవం ఉన్నప్పటికీ ఆయనకు తగిన గుర్తింపు రాలేదు అని నా అభిప్రాయం. దేవుడు, దేవి మొదలైన చిత్రాలలో ఆయన అందించిన సాహిత్యం ఎంతో చక్కగా ఉంటుంది. అందరికీ అర్థమయ్యేలాగా, అచ్చతెలుగు పదాలను వాడి అందరినీ మెప్పిస్తారు. ఈ పాటతో సరసగీతాలలో ఆయనకు ఉన్న పట్టుని ప్రదర్శించారు.
ఈ పాటను ఇక్కడ చూడవచ్చును.
చిత్రం: దేవి
రచన: జొన్నవిత్తుల
దర్శకత్వం: కోడి రామకృష్ణ
పాడింది: చిత్ర, బాలు
సంగీతం: దేవిశ్రీప్రసాద్
కుంకుమపూలతోటలో కులికే ఓ కుమారి
మేలిమిబంగరు చీరలో మెరిసే ఓ వయారి
నా మనసులోని మరాళి, మల్లెల చిరుగాలి
నా ప్రేమ నీకు నివాళి, నువ్వే నువ్వే కావాలి
శంఖములూదిన ప్రేమకే చేశా మది నివాళి
గుండెలకందని ఆశలే దాచా! రా విహారి!
నా వలపు నీకు సమాళి, యవ్వనవనమాలి
ఈ చంద్రకాంతచకోరి గుండెల్లోకి చేరాలి
"శంఖములూదిన ప్రేమ" అనేది గొప్ప ప్రయోగం. శంఖారావం విన్నప్పటికి మల్లే, ప్రేమ మనసును తట్టగానే గుండె ఝల్లుమంటోంది అనే లోతైన భావాన్ని రెండు ముక్కల్లో చెప్పాడు కవి. "సమాళించడం"అంటే అనుకూలంగా చేర్చడం - ఈ పదం కూడా చలనచిత్రగీతాల్లో విన్నది తక్కువే! చంద్రకాంతిని వెతికే చకోరంగా తనను, యవ్వనమనే వనానికి కాపరి గా ప్రియుణ్ణి సంబోధించడం కూడా చాలా నవ్యంగా ఉంది.
మంచుకొండ అంచు మీదనుండి వచ్చు మబ్బుల సందేశం
ఈ తామమొగ్గకు తప్పదు అన్నది కాముని సావాసం
తామరమొగ్గ, కాముని సవాసం -శృంగారానికి కూడా ఎంతో సాత్వికతను అలది చెప్పగలిగారు కవి.
హంసలెక్క పక్క ఆదితాళమేసి పలికెను ఆహ్వానం
ఈ అచ్చటముచ్చట ఇచ్చట తీరగ హెచ్చెను హేమంతం
"చ్చ" తో అనుప్రాస కలిపడం ఒక ఎత్తైతే, "హెచ్చెను హేమంతం" అనడంతో "హె"-కు యతి కలిసింది - అలాగే హేమంతానికి ఉత్సాహం కలిగింది అనే కొంగొత్త ప్రయోగం కుదిరింది.
ప్రియమగు ప్రియురాల, చంపకు విరహాల
విరిసిన పరువాల పిలిచెను మధుబాల
ఊగి ఊగి రేగే అందాలే వేసే పూబంధాలే
మధురం మధురం సాగే సరాగం, మనసా వాచా
"విరిసిన పరువాల పిలిచెను మధుబాల" -- స్త్రీని విరిసిన పువ్వుతో పోల్చడం గతంలో చాలా పాటల్లో జరిగినా ఇది కొత్త మాటలతో వినూత్నంగా ఉంది. ఆ వాక్యానికి "వేసే పూబంధాలు" అంటూ మరింత సౌందర్యాన్ని అలిదారు కవి.
అక్షారాల నీకు ఇచ్చిపుచ్చుకున్న వెచ్చని తాంబూలం
అది ముద్దుగ మారి బుగ్గను చేరిన పుష్యమి నక్షత్రం
పుష్యమి నక్షత్రం అనడంలో కవి ఆంతర్యం పరిపూర్ణంగా అర్థం కాకపోయినా -- పుష్యం అంటే ఒక నవరత్నాలలో ఒకటి. "ప్రియుడు తన ప్రేయసికి ఇచ్చిన తాంబూలం ఆమె చెక్కిలిపై పుష్యంగా చేరి నక్షత్రం వలే మెరుస్తోంది" అన్నది కవి భావమనిపిస్తోంది. ఇక్కడ కూడా జొన్నవిత్తుల వారు వేటూరిని తలపించారు. నక్షత్రాలను, తిథులను పాటల్లోకి తీసుకురావడం ఇదివరకు వేటూరి చాలా సార్లు చేశారు. (ఉదా:- కొండవీటి రాజ చిత్రంలో "గన్నవరం సిద్ధాంతి అన్నారు - వలపుల్లో వర్జ్యాలు ఉండబోవని").అలాగే, ఒక ప్రయోగానికి రెండుమూడు భావాలు కుదిరేలాగా వ్రాయగలగడం కూడా వేటూరి పాటల్లో రివాజు.
ఎక్కుపెట్టి ఉన్న పంచదారవిల్లు చేసినదీ గాయం
అది గుచ్చకపోతే వచ్చిన వయసుకు తీరదు మోమాటం
ఇది నా చేత, "ఆహా" అనిపించిన వాక్యం. "పంచదారవిల్లు" (అంటే "చెరుకువిల్లు", మన్మథుడి విల్లు) చేసిన గాయం అంటే ప్రేమ పెట్టిన తొందర - ఎంత కొత్తగా చెప్పారు కవి! ఆ విల్లు వదిలిన బాణం తగలకపోతే వయసు మోమాటం తీరదుట - మహాచిలిపిగా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది.
నిలిచా నినుకోరి, రసమయ రహదారి
శుభమే సుకుమారి, సొగసుకు ప్రతిసారి
"రసమయరహదారి" (ప్రేమరసం నిండిన త్రోవ) - ఇటువంటి మాటను నేను తెలుగుపాటల్లో వినలేదు. అదొకటే కాక "శుభమే సుకుమారి, సొగసుకు ప్రతిసారి" అనడంలో ఎంతో శృంగారం నిక్షిప్తం చేశాడు కవి.
మదిలో, యెదలో, ఒడిలో నువ్వేలే పొంగే ఆనందాలే
నింగీనేలా ఏలే రాగాలే నీవూ నేనై...
నింగీనేలా ఏలే రాగాలు అంటే సాయంసంధ్య గా నాకు అర్థమయ్యింది. అంటే సందెవేళలో ప్రేయసీప్రియులు ఏకమై ప్రేమభావంలో పొంగిపోతున్నారు...అని.
7 comments:
ఈ పాటను వినలేదు, చూడలేదండి. బాగుంది.
చాలా చక్కని అలంకారాలు, పదబంధాలు, భావచిత్రాలు ఉన్నాయి యీ గీతంలో! "పరిచయం" చేసినందుకు నెనర్లు, సోదరా! కాకపోతే, ఇతర కవులు చేసిన *ప్రతి* మంచి ప్రయోగాన్నీ వేటూరి గారికో సీతారామశాస్త్రి గారికో ముడి పెట్టెయ్యటం నా దృష్టిలో సదరు కవికి స్వతహాగా ఉన్న అస్థిత్వాన్ని తక్కువ చెయ్యటం కూడా అవుతుందని (వేటూరి, సీతారామశాస్త్రి ఎంతటి గొప్ప కవులైనా సరే.) "On the shoulders of giants we stand and thus we see farther than our ancestors. అన్న న్యూటన్ (?) వాక్యాన్ని మననం చేసుకుంటూనే జొన్నవిత్తుల గారి ప్రయోగాల్లో "నవ్యత" పూర్వ కవుల ప్రయోగాల లాగా ఉందనటం "నవ్యంగా లే"దని చెప్పటమే అవుతుంది. (జొన్నవిత్తుల గారే వ్రాసిన "చినుకు చినుకు అందెలతో...", "పొఱుగింటి మంగళగౌరి..." పాటలని "అచ్చు సీతారామశాస్త్రి లాగా వ్రాసారు!" అని ముచ్చటగా "మెచ్చుకున్న" వాళ్ళ దగ్గఱ కూడా ఇదే మాట చెప్పాను నేను గతంలో.)
@నచకి
నీ వ్యాఖ్య సముచితంగా ఉంది. ప్రతీ పాటనూ వేటూరికో, సిరివెన్నెలకో ఆపదించడం నా ఉద్దేశం కాదు అని ముందే చెప్పి ఉండవలసినది.
శైలి వేరు, ప్రయోగం వేరు కదా! ఈ పాటలో కొన్ని వాక్యాలలో వేటూరి శైలి కనిపించింది తప్పితే, కవి మఱొకరిని అనుసరించారనో, అనుకరించారనో అనడం నా ఉద్దేశం కాదు. "పంచదారవిల్లు", "సొగసుకు ప్రతిసారి", "శంఖములూదిన" వంటి ప్రయోగాలు నాకు తెలిసి మఱెవరూ గతంలో చెయ్యలేదు. కానీ, కొంతవరకు ధ్వని వేటూరి పాటలకున్నట్టుగా గోచరించింది. అంతకు మించి వేరే ఉద్దేశం లేదు.
చాలా బాగా రాసారు..సందీప్ గారూ.. ఇలాంటివి మరికొన్ని అందించగలరని ఆశిస్తున్నాను.
ఇదివరకు ఈ పాట వినే అవకాశం దొరకలేదు! ఈ పాటకు నువ్వు రాసిన అందమైన వివరణ చదువుతుంటే వినాలనిపిస్తుంది.
ముఖ్యంగా నాకు కొన్ని పదప్రయోగాలు, భావాలు నచ్చాయి.
"చంద్రకాంతచకోరి", "తామరమొగ్గ"
నాకు తెలిసినంతవరకు కమలాన్ని "తామర" అన్న పేరుతో సినీకవులు ఎక్కువ వాడలేదు.
పుష్యమి గురించి నువ్విచ్చిన వివరణ ఎంతవరకు సరియగునే తెలియదు, కానీ బాగుంది. అయితే పుష్యమీ నక్షత్రంలో వచ్చే పుణ్ణమి గురించి మహాభారతంలో ఎక్కడో ప్రస్తావించినట్టు గుర్తు.
->ఎక్కుపెట్టి ఉన్న పంచదారవిల్లు చేసినదీ గాయం
->అది గుచ్చకపోతే వచ్చిన వయసుకు తీరదు మోమాటం
నాకూ శభాష్ కొట్టాలనిపించింది చదవగానే! అహో, జొన్నవిత్తుల, అహో!
-అవినేని భాస్కర్.
P.S జొన్నవిత్తుల చతురతగలిగిన సినీ కవి అయినప్పటికీ ఎందుకో ఆయనకు ఎక్కువ పాటలు రాసే అవకాశం రాలేదనే చెప్పాలి.
సందీప్ గారూ మంచి పాట గురించి చెప్పారు. మీరన్నట్టు జొన్నవిత్తులకి రావలసినంత పేరు రాలేదు. ఆయన నిజంగానే పండితుడు. దేవి సినిమాలో పాటలు నాకు చాలా ఇష్టం. పదహారేళ్ల వయసులోనే అంత మంచి సంగీతన్ని అందించిన దేవిశ్రీ అన్నా నాకెంతో అభిమాం. ఈ కుకుమపూల తోటలో పాట చాలా బావుంటుంది. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ పాట తెగ వినేదాన్ని నేను. మంచి పాటని గుర్తు చేసారు. Thanks!
idi dEvi music anTE nammabudhi kaalEdu mundu. cakkaga, praSAntam ga undi music. taruvaatE hOru modalu pETTADu.
paaTa paricayam cESinanduku nenarlu
Post a Comment