వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> వ్యతిరేకాలంకారం
లక్షణం: వ్యతిరేకో విశేషః చేత్ ఉపమేయ ఉపమానయోః
వివరణ: ఉపమేయం, ఉపమానం ఈ రెంటిలో ఏదో ఒకదానిలోనున్న ప్రత్యేకమైన విశేషం చెప్తే అది వ్యతిరేకాలంకారం అవుతుంది. ఆ విషయం ఉపమేయాన్ని పొగిడే విధంగా ఉండటం సహజం. చంద్రాలోకంలో ఇచ్చిన ఉదాహరణ చూద్దాము.
ఉదా:- (చంద్రాలోకం)
సంస్కృత శ్లోకం: శైలా ఇవోన్నతాస్సంతః కింతు ప్రకృతి కోమలాః
భావం: (మీరు) కొండలవలే ఎత్తుగానున్న వారు కాకపోతే మీకు కోమలత్వం కూడా ఉంది.
వివరణ: కొండలకు, ఒక వ్యక్తికి సామ్యం చెప్పారు (ఎత్తుగా ఉండటం). కాకపోతే వెంటనే కొండలకు లేని, ఆ వ్యక్తికి ఉన్న ఒక విశేషాన్ని చెప్పారు -- సహజ కోమలత్వం. కనుక కొండలకంటే ఆ వ్యక్తే మెరుగు అని తెలుస్తోంది. ఈ వ్యతిరేక విషయం చెప్పడం వలన ఆ వ్యక్తిని మరింత పొగిడినట్టైంది. కనుక ఇది వ్యతిరేకాలంకారం.
ఉదా:- (కావ్యం: భామినీ విలాసం, రచన: జగన్నాథ పండితరాయలు)
పంక్తి: ఓ ప్రియా, ఇలాటి నీ ముఖముతో రాత్రులందు ముకుళించుకున్న పద్మాలను ఎలాగ పోలుస్తాము?
వివరణ: పద్మాలు పొద్దున్న పూటల విచ్చుకుంటాయి, రాత్రిళ్ళు ముడుచుకుపోతాయి. కానీ వక్త ప్రేయసి ముఖం రాత్రుళ్ళు ముకుళించుకోవట్లేదు కనుక (నే) పద్మాలతో పోలిక న్యాయం కాదంటున్నాడు (పొద్దున్న విచ్చుకునే విషయంలో రెండూ సమానమే అని ఉద్దేశం).
ఈ అలంకారాన్ని కూడా మన సినీకవులు అంతగా వాడుకోలేదు అనుకుంటున్నాను. నా మాటను ఉదాహరణలతో సవరిస్తే సంతోషపడతాను.
పొడిగింపు:
మందాకిని/లక్ష్మీదేవి గారు వ్యాఖ్యలో చెప్పిన పాటనుండి:
చిత్రం: స్వప్న, రచన: ఆత్రేయ, సంగీతం: సత్యం, పాట: ఇదే నా మొదటి ప్రేమ లేఖ
మెరుపని పిలువాలంటే ఆ వెలుగు ఒక్క క్షణం
పూవని పిలువాలంటే ఆ సొగసు ఒక్క దినం
7 comments:
సందీప్ గారు,
ఇలాంటి పాటలున్నాయండి. ఆ భావం ప్రతిఫలిస్తూ వ్రాశారు మనవాళ్ళు.
నిన్ను మెరుపని అందామంటే అది క్షణకాలమే
పూవని అందామంటే అది ఒక్కరోజు లో వాడిపోతుందంటూ పాటలు ఉన్నాయి. బాలు గారు పాడినవే. ఏమిటో గుర్తు రావటంలేదు. సరిగ్గా పల్లవి, చరణాలు వ్రాద్దామంటే.
లక్ష్మీ దేవి గారు,
నాకూ మనసులో లీలగా అనిపిస్తోంది కానీ ఒక్క పాటా గుర్తుకు రావట్లేదు అండి. చూద్దాము, పాటలు వింటూ ఉంటే ఏదో ఒకటి దొరకకపోతుందా?
సందీప్ గారు,
పైన నేను చెప్పిన పాట పట్టుకున్నా, ఈ లంకెలో సాహిత్యం కూడా ఉంది చూడండి.
అందమైన పాట గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
http://www.sakhiyaa.com/ide-naa-modati-prema-lekha-rasanu-neeku-cheppaleka-lyrics-swapna-1980/
మొత్తానికి నిఖార్సైన ఉదాహరణ చెప్పారంది. చాలా సంతోషం. నెనర్లు :)
అద్భుతం!
ఈ మధ్య సంస్కృతంలో అలంకారాలు నేర్చుకుంటుంటే మీరు గుర్తుకొచ్చారు. మీ బ్లాగులో కొన్ని వ్యాఖ్యలు చేసుకుంటాను మీ అనుమతితో. ఇది నా రెఫరెన్స్ కోసం. :)
వ్యతిరేకాలంకారానికి ఉదాహరణ చాలా ఫేమస్ ఆకాశవాణి శ్లోకం
కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చంద్రోజ్జ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం నాऽలంకృతా మూర్ధజా: |
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయన్తే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్ ||
అని అనుకుంటున్నాను. ఇలాంటివి సంస్కృతంలో మీకేమైనా తెలుస్తే చెప్తారా?
@రవి
చదువర్ల సౌలభ్యం కోసం ఆ సంస్కృత శ్లోకానికి (సుమారు) భావాన్ని తెలుగు వ్రాయవలసినదిగా మనవి అండి. తప్పకుండా ఉదాహరణలను రాయండి. ఒక వేళ ఎమైన కొత్త అలంకారలు స్ఫురిస్తే ఒక వేగు పంపండి -- దాని గురించి పరిశోధించి ఒక టప వ్రాస్తాను.
వ్యతిరేకాలంకారం కాదు కానీ అలాంటిదే "అగజానన పద్మార్కం, గజాననం అహర్నిశం; అనేకదంతం భక్తానాం, ఏకదంతం ఉపాస్మహే". ఇది శబ్దాలతో వ్యతిరేకార్థాలను తీసుకువస్తోంది. ఒక పక్కన అగజానన (సమాసంలో సగమే అనుకోండి) అంటూ మళ్ళీ గజాననం అంటున్నాడు, అలాగే "అనేకదం తం" అంటూ "ఏకదంతం" అంటున్నాడు. వేరేవి స్ఫురిస్తే తప్పక తెలియజేస్తాను.
Post a Comment