Tuesday, July 13, 2010

అనన్వయాలంకారము

వ్యాకరణం -> అలంకారములు -> అర్థాలంకారాలు -> అనన్వయాలంకారం

లక్షణం: ఉపమానోపమేయత్వం యదేకస్యైవ వస్తునః
వివరణ: ఒక వస్తువుకు దానినే ఉపమానంగా చెప్పడాన్ని అనన్వయాలంకారం అంటారు.

ఒక మహారాజును వర్ణిస్తూ, "మహారాజులాగా ఉన్నాడు" అనడం అనన్వయానికి ఉదాహరణ అవుతుంది.

గమనిక: అనన్వయాలంకారం అర్థాలంకారం. అందుచేత శబ్దానికి ప్రాధాన్యతలేదు. అంటే రెండు సార్లు ఒకటే వస్తువుని వేరే పదాలతో పిలిచినా ఫరవాలేదు. కానీ, తాత్పర్యభేదం, అర్థభేదం ఉండకూడదు! ఉంటే అది లాటానుప్రాసం అయ్యే అవకాశం ఉంది.

ఉదా: (రేరాణి, రచన: ఎల్. నాగలక్ష్మి)
రాణి రాణి వలెనతిలోక సౌందర్యవతి

ఇక్కడ రాణితో పోల్చదగిన వస్తువు మఱొకటి లేదు కనుక, రాణి రాణిలాగా ఉంది అన్నారు.

ఉదా: (కావ్యాలంకారసంగ్రహం, రచన: రామరాజభూషణుడు)
నీ దయకు నీడు జోడు
నీ దయ, నీ జయము సాటి నీ జయమిలలో
నీ దానమునకు నెనయగు
నీ దానము, నీకు సాటి నీవె నృసింహా

నరసరాజు (అనబడే రాజు) దయ, విజయం, దానం - వీటికి ఇవే సాటి అనే ఉద్దేశంతో ఈ పద్యం చెప్పబడింది.

ఉదా: (చంద్రాలోకం, రచన: ఆడిదము సూరకవి)
శశి శశి భంగి కాంత్యుదగ్రుడు

దీని అర్థం "చంద్రుడు చంద్రుని వలెనే కాంతిలో గొప్పవాడు" అని. చంద్రుడినే ఉపమానంగానూ, ఉపమేయంగానూ వాడటం చేత ఇది అనన్వయం అయ్యింది.

చలనచిత్రగీతాల్లో అనన్వయాలంకారం నేను తక్కువగా చూశాను.  లాటానుప్రాస గురించి చర్చలో సోదరుడు కిరణ్ చెప్పిన ఉదాహరణ ఒకటి:

ఉదా: (ఇల్లాలు, రచన: ఆత్రేయ)
అందమంటె నువ్వే, ఆనందమంటే నువ్వే, నువ్వంటే నువ్వే, నీ వంటిది నువ్వే నువ్వే

"నిన్ను" పోలి "నువ్వు" తప్ప వేరేవారు లేరు అనడం వలన ఇది అనన్వయాలంకారం అవుతుంది.

4 comments:

Sai Praveen said...

అలంకారాల గురించి అంతర్జాలంలో ప్రయత్నించాను కానీ ఎక్కడా దొరకలేదు. మీ కృషికి ధన్యవాదాలు.

రవి said...

కమలాక్షునర్చించు కరములు కరములు - ఈ పద్యం అనన్వయాలంకారమనుకోవచ్చానండి?

Sandeep P said...

@రవి
కమలాక్షునర్చించు కరములు కరములు "లాటానుప్రాసం" అవుతుంది అని మనం ఇదివరకు చెప్పుకున్నాము. లాటానుప్రాసకి, అనన్వయాలంకారానికి తేడా ఉంది. లాటానుప్రాసకి అదే శబ్దం పక్కపక్కన రెండుసార్లు రావాలి. కానీ, వాటి మధ్యన తాత్పర్యభేదం ఉండాలి. "కమలాక్షునర్చించు కరములు కరములు" అన్నప్పుడు రెండొ "కరములు" కి "నిజమైన కరములు" అని తాత్పర్యం. అందుచేత తాత్పర్యభేదం ఉండి, అర్థభేదం లేకుండా, అదే పదాన్ని రెండుసార్లు పక్కపక్కన వినియోగించాడని చెప్పుకున్నాము.

అనన్వయాలంకారానికి పక్కపక్కన రావాలి అని లేదు. అదే శబ్దం రావాలి అని కూడా లేదు. అర్థం ఒకటే కావాలి, తాత్పర్యం కూడా ఒకటే కావాలి. "పోలిక" చెప్పాలి. "నీకు సాటి నువ్వే" అన్నప్పుడు "సాటి" అన్నది పోలికను చెప్తోంది. "నిన్నర్చించు కరములు కరములు" అన్నప్పుడు పోలిక లేదు. "నిశ్చయంగా అవి మాత్రమే కరములు, మిగతావి కావు" - అని అర్థం. అందుచేత ఇది అనన్వయాలంకారం కాదు అని నా అభిప్రాయం.

@ప్రవీణ్
అలంకారాలను తెలుసుకోవడంలో నా బ్లాగు మీకు ఉపయోగపడుతున్నందుకు సంతోషమండి.

శ్రీనివాసమౌళి said...

చిత్రం:రుక్మిణి
పాట:గోదారి రేవులోన

గోదారి రేవులోన రాదారినావలోన
నామాటే చెప్పుకుంటూ ఉంటారంట
నానోట చెప్పుకుంటే బాగోదో ఏమోగాని
[b]నాలాంటి అందగత్తె నేనేనంట[/b]
--సిరివెన్నెల

నాఅంత వాడు నేను...
--బుడుగులో ముళ్ళపూడి వెంకట రమణ