Saturday, July 10, 2010

విధాత తలపున (సిరివెన్నెల చిత్రంలోని పాట)

  • అప్రస్తుతమైన విషయాలు చదవకుండా, ఈ పాట గురించి మాత్రమే చదవాలనుకునేవారు మొదటి ఐదు పేరాలు వదిలెయ్యడం మంచిది.
  • ఈ వ్యాసం వ్రాయడానికి సహాయపడిన సోదరులు - కిరణ్, ఫణీంద్రలకు; వ్రాయమని అడిగిన ప్రణీత స్వాతి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.


"సిరివెన్నెల" చిత్రంతో చలనచిత్రరంగానికి పరిచయమై, అప్పటి నుండి ఆయన పాటలతో ప్రేక్షకులకే కాక, తెలుగు సాహిత్యాభిమానులకు కూడా ప్రీతిపాత్రులైనటువంటి రచయిత సీతారామశాస్త్రి గారు. ఆయనంటే నాకు అమితమైన అభిమానం, గౌరవం. నేను సహజంగా ఆయన పాటల గురించి ఈ బ్లాగులో వ్రాయను. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి: ఆయన పాటలు పండితపామరజనరంజకంగా ఉంటాయి. సహజంగా, వివరించి చెప్పాల్సినంత భాషని కానీ, భావుకతని కానీ (వాడగలిగినా) వాడరు. ప్రతిమనిషికీ అర్థమయ్యి, వారు ఆ పాటను అనుభవించగలిగేలాగా వ్రాయడం ఆయన శైలిలో నాకు నచ్చేటువంటి అంశం. రెండు: ఆయనకు యువతరంలో అసంఖ్యాకమైన అభిమానులున్నారు. ఆయన అభిమానులు బోలెడు వెబ్-సైటులను ఏర్పరిచి ఆయన ప్రతిగీతాన్ని వర్ణించుకుంటూ వెళ్తున్నారు. అందుచేత నేను ఇప్పుడు పనిగట్టుకుని చెయ్యవలసింది లేదు. మూడు: ఆయనతో ప్రతిరోజూ మాట్లాడే ఆయన శిష్యులు చాలామంది సిరివెన్నెల ఆర్కుట్ కమ్యూనిటీలోనో, తదితర వెబ్సైట్లలోనో ఆయన పాటలకు ఆయనే ఇచ్చుకున్న విశ్లేషణలని చెప్తూ ఉంటారు. నాలుగు: సిరివెన్నెల తరంగాలు ఇత్యాది పుస్తకాల ద్వారా కూడా ఆయన పాటల ప్రేక్షకులకు దగ్గరవుతున్నాయి. ఈ బ్లాగులో నేను, ముందుతరంలోని కవులు ఆరుద్ర, ఆత్రేయ, వేటూరి మొ.; అలాగే ఆయన తరంలో ఎంతో లాఘవం కలిగి ప్రజాదరణకు ఆట్టే నోచుకోని కవులు జొన్నవిత్తుల, వెన్నెలకంటి, భువనచంద్ర మొ. వారి పాటల గురించి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాను.

నాకు కవిని కావడానికి స్ఫూర్తి మా మాతామహులు, నాన్నగారు మొదలుకొని చాలా మంది ఉన్నారు. అయితే మామూలు చలనచిత్రగీతంలో కూడా విషయాన్ని చెప్పచ్చు అని తెలిసింది ఆయన పాటలు విన్నప్పుడే. ఆ తరువాత ఆయన ఇంటర్వ్యూలో "వేటూరి ఆయనకు గురుతుల్యుడు" అని అంటే "హమ్మ! ఈయనకే గురువా?" అనుకుని, వేటూరి వ్రాసిన పాటలు చూసుకుంటూ పోతే నాకు మతి తిరిగిపోయింది. అప్పటినుండి నేను ఆ వేటూరి-మాయలో ఉండిపోయాను - బహుశా ఎప్పటికీ ఉండిపోతాను. వేటూరి వ్రాసిన కొమ్మకొమ్మకో సన్నాయి పుస్తకం చదివాక ఆయనకు ఆత్రేయగారి మీద ఉన్న గౌరవం తెలిసింది, నాకున్న గౌరవం మరింత పెరిగింది. సిరివెన్నెల చాలా విధాలుగా ఆత్రేయని గుర్తుచేస్తారు అని ప్రేక్షకులలో ఒక నుడి. వీరిరువురూ ఒక పాట వ్రాయడానికి నెలకంటే ఎక్కువ తీసుకోవడం జరిగిన సందర్భాలు ఒకింత కారణం ఐతే, ఒక మామూలు ప్రేక్షకుడికి (సగటు భాషాజ్ఞానం,ఊహాశక్తి ఉన్నవాడికి) కూడా అర్థమయ్యి, మనసు కరిగేలాగానో, కదిలేలాగానో వ్రాయగలగడం మఱొకటి.

ఇంతకీ విషయానికి వస్తే సిరివెన్నెల వ్రాసిన "విధాత తలపున" అనే పాట తెలుగువాడూ గర్వించదగిన పాట. ఈ పాటకు జాతీయస్థాయి అవార్డు రాకపోవడం ఆ అవార్డుకు దురదృష్టంగా పేర్కొనవచ్చును. ఈ పాట గురించి వ్రాయమని ప్రణీతాస్వాతిగారు అడిగితే, "Internetలో ఎక్కడైనా దీన్ని గురించి విశ్లేషించారా?" అని వెదుకగా ఎక్కడా దొరకలేదు. అందుచేత ఏదైనా వ్రాద్దామని పూనుకున్నాను.

ఈ పాటను వ్రాసినప్పుడు ఆయన పరిస్థితులేమిటి అన్నది ఈ ఇంటర్వ్యూ చూస్తే తెలుస్తుంది. "సిరివెన్నెలతరంగాలు" పుస్తకంలో ఆయన కూడా ఈ పాటను వర్ణించారు. (ఈ పుస్తకం మీరు కొనాలనుకుంటే ఆయన ఇంటర్వ్యూ చివరన ఉన్న చిరునామాను సంప్రతించండి). అది చదివిన తరువాత నేను ప్రత్యేకించి చెప్పవలసిన విషయం ఏమీ లేదు. అర్థాలను వివరిస్తే, ఆయన మాటలను ఇక్కడ వ్రాస్తే సరిపోతుంది అని తెలుసుకున్నాను.  శాస్త్రిగారు చలనచిత్రసీమకు పరిచయం కాకముందు "భరణి" పేరిట వ్రాసిన ఒక కవితని కొంచెం మరమ్మత్తు చేసి వ్రాసినది ఈ పాట. పాట మూలాన్ని ఇక్కడ చదవవచ్చును. చిత్రంలోని పాటను పూర్తిగా ఇక్కడ చదవవచ్చును.

ఈ పాట గురించి చెప్పుకోవలసినవాళ్ళు చాలామంది ఉన్నారు.  మొట్ట మొదట చెప్పుకోవలసినది కళాతపస్వి కే. విశ్వనాథ్ గారి గురించి. సిరివెన్నెల వ్రాసిన మొట్టమొదటి పాట ఇంత అద్భుతంగా ఉంది. మళ్ళీ ఈ పాటలో ఉన్నంత భావుకత, బరువు, వైశాల్యం, లోతు నాకు ఎక్కడా కనబడలేదు. మళ్ళీ వ్రాయలేకనా? కాదు! సందర్భం లేక. శ్రేష్ఠమైన సందర్భాలను, కవికి స్వేఛ్ఛనూ ఇచ్చేటువంటి దర్శకులు కరువయ్యి మళ్ళీ ఇలాంటి పాట రాలేదు. అందుకని ఈ పాటలో విశ్వనాథ్ గారికి పెద్దవాటా ఉంది.  అలాగే "నువ్వు వ్రాయవయ్యా. నేను స్వరపరుస్తాను.", అనేటువంటి ఔన్నత్యం ఉన్న సంగీతదర్శకుడు మామ, కే.వీ.మహదేవన్. ఆయనకు హిందూ వార్తాపత్రిక ఇచ్చినా  స్వరపరుస్తారు అని చలనచిత్రరంగంలో పేరు. ఆయనకు కూడా ఈ పాటలో పెద్దవాటా ఉంది.  ఈ చిత్రానికి వేణుగానాన్ని అందించిన హరిప్రసాద్ చౌరాసియా గారు కూడా పాట భావానికి, సందర్భానికి తగిన స్వరాలను వినిపించారు. ఇహ బాలు, సుశీల గురించి చెప్పుకోవడం దేనికి? పంచదార తియ్యనా, తేనె తియ్యనా అన్నట్టు ఉంటుంది వారి గాత్రాల జంట.

అనాదిగా విధాత (పరబ్రహ్మ) ఉన్నాడని వేదాలు చెప్తున్నాయి. ఆ పరబ్రహ్మ హృదయంలో మెదిలిన ఒక ఆలోచన నుండి ఈ సృష్టి పుట్టింది అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఆ ఆలోచన స్వరూపం ఓంకారం. ఆ ఓంకారమే ఈ సృష్టికి మూలం. ఆ ఓంకారమే ప్రకృతిలోనూ, జీవరాశుల్లోనూ చైతన్యమై నిండివుందన్నది ఆవిష్కరించడం ఈ పాటలోని ప్రథానాంశం. ఈ పాట కవి స్వగతం కాబట్టి, దీని గురించి కవి స్థానంలో ఉండి చెప్పడం అవసరం. అందుకే మొత్తం కవి మాట్లాడుతున్నట్టుగా చెప్తున్నాను.


విధాత మనసులో కలిగిన ఊహ ఓంకారం. ఆ ఓంకారం ప్రతిజీవిలోనూ చైతన్యమై నడిపిస్తోంది.

భగవద్గీతలో కృష్ణపరమాత్ముడు అర్జునుడికి విశ్వరూపం చూపించాడు. చూపించినప్పుడు అక్కడ ఏముందో వ్యాసభగవానుడు సవివరంగా చెప్పాడు.  ప్రకృతిలోని గ్రహాలు, నక్షత్రాలు మొదలుకొని రాయి, రప్ప వరకు అన్ని వస్తువులు; సమస్తజీవరాశులు జననం నుండి మరణం వరకు చేసే ప్రయాణం - సృష్టి, స్థితి, లయ అన్నీ ఒక్కచోట అర్జునుడికి కనిపించాయి.   అది చూసి అర్జునుడు, అవన్నీ నడిపిస్తున్నది ఆ పరమాత్ముడే అని తెలుసుకున్నాడు.

అదే విశ్వరూపవిన్యాసం ప్రతిమనిషికీ కనిపిస్తుంది. అది ఎప్పుడంటే - సృష్టి మొత్తం నిండినది ఒకటే నాదం, ఒకటే జీవం, ఒకటేచైతన్యం అన్న విషయం అర్థమయినప్పుడు. ఆ దివ్యనేత్రం తెరుచుకున్నప్పుడు, మనిషి సృష్టిని ఒక్కచోటనే నిలబడి చూస్తాడు. "ప్రతిజీవి గుండెలోని లయా ఆ ఓంకారమే.  అది విరించి (బ్రహ్మ) విపంచి (వీణ) గానం, పరమాత్మ స్వరూపం. నేను అంటే ఈ మేను కాదు, ఆత్మ. నా ఆత్మ, చూడాటానికి వాడే పరికరాలు కళ్ళు. ఆ ఆత్మ చూడవలసింది, తెలుసుకోవలసినది(1) సృష్టిని, దాని వెనుకనున్న ఓంకారాన్ని. అదే జీవనవేదం.", అని  విదితమవుతుంది. ఆ సృష్టిని ప్రతిబింబించేటువంటి కవితను వ్రాయడానికి నేను ఒక  విరించిని(2) అయ్యాను, అది పాడి వినిపించడానికి నేను ఒక వీణను (విపంచి) అయ్యాను.

సంగీతానికి మూలం సామవేదం. సామవేదంలో స్వరాలను ఎలాగ పలకాలో, వేదాలను ఎలాగ చదవాలో ఉంటుంది. ఆ వేదం మూలంగా కలిగి, తీయని స్వరాలు (సరసస్వర) నీరుగా ఉన్న గంగ (సురఝరి) నా పాట. ఈ పాట  జీవనవేదాన్ని చెబుతుంది.

నిద్ర మృత్యువుతో సమానమని మన యుద్ధధర్మాలు బోధిస్తున్నాయి. ఆ మృత్యువుని తీసుకొచ్చేటువంటి వాహనం రాత్రి. ఆ మృత్యువుని సంహరించి, ప్రకృతికి చైతన్యాన్ని తీసుకువచ్చేది ఉదయం. ప్రొద్దున్నే మేలుకొని గుంపులుగా చేరిన పక్షులు (జాగృత-విహంగ-తతులు) నీలిగగనమనే వేదికపైన, తూరుపుదిక్కును ఒక వీణగా మలచి (ప్రాక్-దిశ-వీణియ) సూర్యుడి కిరణాలను దానికి తీగెలుగా బిగించి (దినకర-మయూఖ-తంత్రులు), తమ రెక్కలనే వేళ్ళుగా చేసుకుని ఆ వీణియను వాయిస్తూ, తమ కిలకిలారావాలను (స్వనములు) పాడటమే ఈ జగతికి (ఒక కొత్త) శ్రీకారం అవుతోంది. సృష్టి మళ్ళీ చైతన్యంతో నడుస్తోంది. ఈ విషయం తెలుసుకుంటే విశ్వం అనే కావ్యానికి భాష్యం చెప్పడం చేతనౌతుంది. ఆ భాష్యమే నా గీతం.

పుట్టిన ప్రతిప్రాణి గళంలో వినబడేటువంటి స్వరం, ఓంకారంలోని ఒక తరంగం (జీవననాదతరంగం). ఆ చైతన్యానికి స్పందనగా, గుండె ఒక మృదంగంగా మారి ధ్వనిస్తోంది (గుండెచప్పుడు). ఆ చప్పుడు మొదలైనప్పటినుండీ ఒకేలాగా ఉంటుంది కనుక ఆదితాళం. అది పాడుతున్న జీవనవేదానికి ఆది-అంతం లేవు కాబట్టి దానిది అనాదిరాగం. ఇదే రీతిలో అనంతమైన జీవరాశులు ప్రవహిస్తున్న నది సృష్టి (అనంత-జీవన-వాహిని).  ఆ సృష్టి విలాసమే నా ఈ గీతంలోని విషయం. సృష్టిరహస్యమే నా ఊపిరిగా (ఉఛ్చ్వాసం) వెళ్ళి, నాలో ఉన్న ప్రాణచైతన్యాన్ని స్పందింపజేసి, గానంగా బయటకు (నిశ్వాసం) వస్తోంది.


(1) వేదం అంటే తెలుసుకోవలసినది అని అర్థం.
(2) విరించి అంటే బ్రహ్మ (సృష్టించేవాడు). కవి కవితను సృష్టిస్తాడు.

15 comments:

.C said...

అదాటున కలిగిన కొన్ని భావలు: (Some random thoughts కి వచ్చిన తిప్పలు)

<< ఆత్రేయ చాలా విధాలుగా సిరివెన్నెలని గుర్తుచేస్తారు అని ప్రేక్షకులలో ఒక నుడి. >>
మా నాన్న నా పోలికే అన్నట్టుంది ఈ నానుడి! :-D

<< ఈ పాటను వ్రాసినప్పుడు ఆయన పరిస్థితులేమిటి అన్నది ఈ ఇంటర్వ్యూ చూస్తే తెలుస్తుంది. ఈ పుస్తకం మీరు కొనాలనుకుంటే ఆయన ఇంటర్వ్యూ చివరన ఉన్న చిరునామాను సంప్రతించండి. >>
సంప్రదించదగ్గ చిరునామా మాఱిపోయింది. ప్రస్తుత చిరునామా ఇవ్వటం అనవసరమేమో... ఎందుకంటే ఆ పుస్తకం ప్రతులు ఎక్కడా దొఱకటంలేదు. ఉంటే గింటే అమెరికాలోనే (ఎవఱి దగ్గఱ?) కొన్ని ఉండవచ్చేమో.

<< మళ్ళీ ఈ పాటలో ఉన్నంత భావుకత, బరువు, వైశాల్యం, లోతు నాకు ఎక్కడా కనబడలేదు. మళ్ళీ వ్రాయలేకనా? కాదు! సందర్భం లేక. శ్రేష్ఠమైన సందర్భాలను, కవికి స్వేఛ్ఛనూ ఇచ్చేటువంటి దర్శకులు కరువయ్యి మళ్ళీ ఇలాంటి పాట రాలేదు. >>
ఇది నీ అభిప్రాయమని తలుస్తాను. "మళ్ళీ అలాంటి పాటలు వ్రాయకపోతే [సినీరంగంలో] ఇన్నేళ్ళు ఉండగలిగేవాడినా?" అని పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసమే తప్ప అహంకారం లేని గొంతులో సీతారామశాస్త్రి గారే కొన్ని సార్లు బాహాటంగానే ఆశ్చర్యపోవటం నాకు తెలుసు. నా అభిప్రాయమే ప్రాతిపదిక అయితే నాకు ఈ పాట ఆయన వ్రాసిన "10 అత్యుత్తమమైన పాటల"లో చేఱుతుందేమో కానీ తొలి అయిందింటిలోనూ నేను పెట్టనేమో!

<< ...కే.వీ.మహదేవన్. ఆయనకు హిందూ వార్తాపత్రిక ఇచ్చినా స్వరపరుస్తారు అని చలనచిత్రరంగంలో పేరు. >>
Setting the record straight, "వార్తాపత్రికలోని సంపాదకీయాన్నయినా స్వరపఱచగలను కానీ సాహిత్యం లేకుండా బాణీ దేనికి కట్టాలి? నా తలకాయకా?" అని మహదేవన్ గారు అన్నట్టు ప్రతీతి. ఆయన తెలుగు వార్తాపత్రికలోని సంపాదకీయాన్ని నిజంగానే స్వరపఱిచారని కూడా అంటారు.

...ఇంతా చేస్తే అసలు వ్యాఖ్యానం గుఱించి నేను చెప్పేదల్లా "చాలా సులభగ్రాహ్యంగా వ్రాసావు! విస్తృతమైన వాడుకలో లేని కొన్ని పదాలకు అర్థాలను పద్యానికి ప్రతిపదార్థం చెప్పినట్టు చెప్పకపోయినా భావమూ, పదనిర్మాణమూ గ్రహించగలిగేలా చెప్పటం నచ్చింది." అని మాత్రమే! :-)

రవి said...

మీ టపా సూపర్ గా ఉంది. దాచుకొని చదువుకోవాలి.

నాకు సిరివెన్నెల సినిమా గురించి చాలా రోజులు తెలియదు. ఏదో చదువులో మునిగి సినిమాలు చూడక మిస్సయ్యాను.ఓ రోజు ఈ పాట చూస్తుంటే, మొదట హరిప్రసాద్ గారి వీణావాదం, సీతారాముని పాట వింటే వళ్ళు తెలీలేదు. అంత అద్భుతంగా ఉంది.అయితే అప్పటికే వేటూరి వారి పాటల మత్తులో చిన్నప్పటి నుంచి పెరగడం వల్లనేమో, నాకు అలతి అలతి పదాలతో కూర్చిన పాటలు "బాటనీ పాఠముంది.." వంటివే ఇష్టం.

Sandeep said...

@ నచకి
ఆత్రేయ, సిరివెన్నెల సారూప్యం: నిజమే! వ్రాస్తున్నప్పుడు ఆలోచించనేలేదు సుమీ. ఇప్పుడు మార్చాను.
కొత్త అడ్రసు: నాకు తెలియదు :( ఈ సారి ఆయనతో మాట్లాడినప్పుడు కనుక్కుని చెప్పరాదు?
అభిప్రాయం: నిజమే! ఇది నా అభిప్రాయంగానే చదువర్లు పరిగణించాలి. నీకు ఇంతకంటే అద్భుతమనిపించిన పాటలు తప్పక చెప్పగలవు - చదువర్లు వింటారు!
"మళ్ళీ అలాంటి పాటలు వ్రాయకపోతే [సినీరంగంలో] ఇన్నేళ్ళు ఉండగలిగేవాడినా?": కళ విషయంలో ఉన్న ఒక విశేషమేమిటి అంటే కళాకారుడికి నచ్చిందే ప్రజలందరికీ నచ్చాలని లేదు. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి నచ్చుతుంది. ఇదే శ్రేష్ఠమైనది అని నిశ్చయించే హక్కు ఎవరిదీ కాదు. చెప్పే హక్కు మాత్రం అందరిదీ :)
ప్రతిపదార్థాలు: మొదట అలాగ వ్రాద్దాము అనిపించింది. కానీ, ఆ సమాసభూయిష్టమైన పదాలు ఒకదానికి మఱొకటి లంకె పడి ఉన్నాయి. అర్థాలు చెప్పుకుంటూపోతే ప్రవాహం దెబ్బ తింటుంది అని అనిపించి ఇలాగ వ్రాశాను.

@రవి
ఈ టప నీకు నచ్చినందుకు సంతోషం మిత్రమా! వేటూరివారు కూడా ఇలాగ సంస్కృతపదభూయిష్టంగా వ్రాసిన పాటలు ఉన్నాయి అని నీకు తెలిసే ఉంటుంది. అవీ నాకు ఇష్టమే!

కన్నగాడు said...

పాట అర్థాన్ని అద్భుతంగా విడమర్చారు. ధన్యవాదాలు :)

జ్యోతి said...

ఈ పాట అంటే నాకు కూడా చాలా ఇష్టం. ప్రతి పదం ఎంత అందంగా ఉంటుందంటే దాని అర్ధం తెలుసుకోకుండా ఉండలేకపోయాను. ఇదిగోండి.
http://jyothivalaboju.blogspot.com/2009/07/blog-post_12.html

Phanindra said...

baagundi. vivaraNa chaalaa spashTamgaa undi.

"sirivennela tarangaalu" citramlO ii paaTa antaka mundu raasina paaTagaa ceppabaDalEdu. paigaa, appaTikappuDu aalOcinci raaSaanu annaTTu undi. enducEtanO teliidu.

ప్రణీత స్వాతి said...

సందీప్ గారూ చాలా చాలా థాంక్స్..నా విన్నపాన్ని మన్నించి నాకెంతో ఇష్టమైన పాటని విస్తారంగా చాలా చక్కగా వివరించి చెప్పారు. రవి గారన్నట్టు ఈ టపాని దాచుకుని చదువుకోవాలి. ఈ పాటకి నేననుకున్న అర్ధాలు సరి అవునో కాదో అనే సందిగ్ధంలో వున్నానిన్నాళ్ళు. పూర్తిగా కాకపోయినా కొంతవరకూ సరిపోయాయి.

ఉష said...

Sandeep గారు, "విధాత తలపున" గూర్చి చాలా సంపూర్ణంగా రాసారండి. పాట ని ఎలివేట్ చేసినట్లుగా ఉంది. మీరు పెట్టిన కృషి ప్రతి పేరాలోనూ స్పష్టంగా కనపడుతుంది. హృదయపూర్వక అభినందనలు. గీతాలు/గేయాలు, రచయితలు, అర్థాలు పట్ల గల అభిరుచి వల్లనైతేనేమి, ఈ మధ్యనే మళ్ళీ చదవటం మూలాన గానీ నాకు గుర్తున్న ఈ వివరాలు ఇక్కడ కలుపుదామని..

ఇక్కడ లభ్యమయ్యే ఒకే ఒక ప్రింట్ పత్రిక - "తెలుగునాడి" వారి మే-జూన్ 2009 సంచికలో "నేను, నా సినిమా" అన్న పేరున సాక్షి దినపత్రిక నుంచి సమీకరించిన ఒక ఇంటర్వ్యూ కళాతపస్వి శ్రీ విశ్వనాథ్ గారిది ఉంది. ఆయన ప్రస్తావించిన ఏడు సినిమాల్లో "సిరివెన్నెల" ఒకటి. ఆ విశేషాలు రాస్తున్నాను.

ఈ సినిమా ఆయన మనసుకి దగ్గరైన ప్రాజెక్ట్. మొదటిసారి వేటూరి గారితో కాక బయటవారితో రాయించారు. "గంగావతరణం" పాటలు విని వాకబు చేసి, ఆ పాటల రచయిత సీతారామశాస్త్రి గారిని పిలిపించారు. కథ వినిపించి, రాయించిన పాటల్లో ఇది మొదటి పాట. ఇక ఈ పాటని గూర్చి మీ వ్యాసం అంతా చెప్పేసింది. అలాగే ఈ సినిమాలో "ఆదిభిక్షువు వాడినేది కోరేది" కూడా ప్రత్యేకత కలదే..అది నిందాస్తుతి లో రాయబడింది. ఆ పాటని గూర్చిన టపా అచ్చంగా మీ ఈ పొస్ట్ దాయనున్నట్లే, పదిలపరిచాను. ఇదిగో ఇక్కడ - http://uniqcyberzone.com/svennela/?p=87

ఇవి మీ టపాకి సంబంధం లేనివని మీరు భావిస్తే తొలగించండి/ప్రచురించకండి. ఈ మాధ్యమం పంచుకునే వేదిక అన్న తీరున ఇలా వ్రాయటం అలవాటు. కానీ, ఈ బ్లాగు స్వంతదారు మీరు అన్నది విస్మరించను.

Sandeep said...

@ఉష
మీ వ్యాఖ్యల ద్వారా చాలా చక్కని విషయాలను తెలిపారండి. చాలా సంతోషంగా ఉంది. మీరు మరీ మొహమాటస్తులు లాగా ఉన్నారు. మీ వ్యాఖ్యకు నా వ్యాసానికి ఎంతో సందర్భోచితమైనది.

Anonymous said...

చాలా బాగా రాశారు. అలాగె మీరు శంకరాభరణం లోని ఓంకార నాధాను సందాన మౌగానేమే శంకరాభరణం అనే పాటని గురించి రాసేది. నాకు " శంకర గళనిగళము శ్రీహరి పదకమలము" అనేది ఎందుకు రాశారో అర్థంకాలేదు. మీకు వీలైతె అర్థం చెప్పెది.

కొత్త పాళీ said...

చాలా బాగా రాశారు

Avineni N Bhaskar said...

పాట గురించి మాత్రమే కావాలంటే మొదట 5 పేరాలు వదిలేయండి అని మొట్ట మొదటే రాశావు. అయితే నాకు నచ్చినవి, కొత్తగా/బాగున్నట్టు అనిపించినవి మొదట 6 పేరాలే. కారణం, నా personal interest అయ్యుండవచ్చు! నీ 'స్వ'భావం గురించి మరికొంత తెలుసుకోగలిగాను ఆ పేరాలలోని అభిప్రాయాలతో. నువ్వు రాసిన రెండో పేరాలోని విషయాలు నాకు as isగా వర్తిస్తాయి :)

సిరివెన్నెల గారు ఆత్రేయని కొంతవరకు గుర్తు చేసినా వారిరువురి సాహిత్యాన్నీ పోల్చకుండ, రాయటానికి వాళ్ళు ఎక్కువ సమయం తీసుకుంటారు అని పోల్చటం నీ సంస్కారం!

సిరివెన్నెల గొప్పకవే! ఈ రోజు సినిమా సందర్భలలోని అవసరాలనుబట్టి పాటలు రాయడం తప్పదుగనుక విధాత తలపున పాటలో వాడిన అంత పైస్థాయి భాషను వాడలేక పోతున్నారని నా అభిప్రాయం! ఈ రోజుకూడా శాస్త్రి గారు సందర్భాలనుబట్టి మంచి భావాలను ప్రతిపాటలోను ఎక్కడ ఒక చోటైనా పొడిగిస్తూనే ఉన్నారు.

అదిమాత్రం కాదు, తర్వాత వచ్చిన ప్రతివారు(చంద్రబోసు, కులశేఖర్, భాస్కరభట్ల, చైతన్య ప్రసాద్, కఒందికొండ, అనంత శ్రీరాం లు) సీతారామ శాస్త్రి గారు చేసిన ఒక్కోప్రయోగాత్మకమైన శైలీ తీగలను పట్టుకుని పైకెక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈయన గారి భావాల గొప్పతనంతో నేనేకీభవించకపోయినా, ఖచ్చితంగా Originality and Honestyకి తలవంచి నమస్కరిస్తాను!

ఏది ఏమైనప్పటికీ, ఈ పాటగురించి నువ్వు రాసిన వివరణ చాలా బాగుంది! ఈ పాటకు నాలో ఉన్నదీ దాదాపు ఇలాంటి వివరణే :) Good Work!

Sai Praveen said...

ఈ పాట గురించి ఎవరైనా మంచి విశ్లేషణ రాస్తే బావుంటుంది అని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. సరిగ్గా నేను కోరుకున్నదే మీ టపా నాకు అందించింది. ఈ పాట నాకు అర్ధం అయినట్టే ఉన్నా కాని నాకు తెలియని లోతు ఇంకా చాలా ఉందని నా నమ్మకం. మీరు చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.

RAAMAN said...

Hai sandeep, what a wonder, whenever i listen this song i only enjoy the song style and sweet fluite, but i don"t know meaning of this song, Today i know, thank you very much sir.

Raaman,HYD

Durga Lakshmi Narayana said...

అమోగం....అద్వితీయం........పాటలో ఉన్న ఆర్ద్రత.....పదంలో ఉన్న అర్ధాన్ని.....రచించిన సిరివెన్నెల గారికి,వివరించిన సుదీప్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

ఆ సర్వేశ్వరుడు ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యములు ప్రసాదించి ,సుఖః సంతోష సౌభాగ్యములు
ప్రసాదించాలని​ ​మనః స్పూర్తి గా కోరుకుంటున్నాను..... దుర్గా లక్ష్మి నారాయణ