Saturday, July 17, 2010

నిత్యజీవితంలో పద్యాలు - పాప పుట్టినరోజు

సందర్భం: రేపు, మా బంధువులమ్మాయి పుట్టినరోజు. నేను, బాబాయ్ ఏవైనా పద్యాలు వ్రాద్దామని అనుకున్నాము. ఆయన వ్రాసిన పద్యాలు ఇక్కడ చదవగలరు. నేను వ్రాసినవి ఇవి. ఈ పద్యాలను వినిపించేది మామూలు తెలుగు (వ్యావహారికం) మాత్రమే తెలిసినవారు కాబట్టి (శ్రోతలకు) నిఘంటువుతో పనిలేకుండా వ్రాయాలని నిర్ణయించుకున్నాను. అక్కడక్కడా అలంకారాలను సూచించేటువంటి అక్షరాలను ముద్దగా దిద్దాను. చదువర్లు గమనించగలరు.

గమనిక: వీటిలో తప్పులుండే అవకాశం ఉంది. అక్కడక్కడా నాకున్న సందేహాలను వ్రాశాను. చదువర్లు సందేహాలను నివృత్తి చేసి, తప్పులను సవరించవలసిందిగా కోరుతున్నాను.

ఆ :-
పసిడినగవులమ్మ పాలపళ్ళు తెలుపు
బుల్లిమోముతల్లి బుగ్గ ఎఱుపు
కలువకంటి పాప కంటిపాప నలుపు
నునుపుమేను బంతి నుదురు పసుపు

విశేషాలు:
1. అన్ని పాదాలలోనూ చివరి అక్షరం "పు". అందుచేత ఇది అంత్యప్రాస అవుతుంది.
2. "కలువకంటి" అంటేనే "స్త్రీ" అని అర్థం. మరి, "కలువకంటి పాప" అనడం సరి అవుతుందా? అయితే, కలువకంటి పాప అంటే, కలువ వంటి కనులు కలిగిన పాప. కంటిపాప అంటే pupil of eye. ఇక్కడ ఛేకానుప్రాస కుదిరింది.

ఆ :-

రంగులన్ని యిట్లు రంరించెను బ్రహ్మ
గంభంగి పొంగెనంగు - అవనిఁ!
ముంగిలి మురిసేది రంవల్లికి, మరి
లోగిలి! చిటిపాప ఆగడముకు!

విశేషాలు:

1. రంగు, రంగరించు, గంగ, భంగి, పొంగె, అంగు, ముంగిలి, రంగవల్లి - ఇవన్నీ కూడా వృత్త్యనుప్రాసకు ఉపకరించాయి. గంగ, భంగి, పొంగె, అంగు - ఇవి నాలుగు వరుసగా రావడంతో (మిగతా పదాల సంగతి ఎలాగున్నా) ఇది వృత్త్యనుప్రాస అవుతుంది.
2. "అవనిన్" అనే పదాన్ని "అవనిఁ" అని మార్చడం సరి అవుతుందా? ఇదే వ్యాకరణనియమానుసారం అవుతుంది? ఒకవేళ సరి ఐతే: అవనిఁ అనడంలో రెండు అర్థాలు: a) పుట్టినరోజు పాప పేరు "అవనిజ". ఆ  పేరుకు ముద్దు పేరు అవని అవుతుంది. b) "అవనిలోపల అందం గంగలా ప్రవహించింది" అనే అర్థంలో కూడా "అవనిఁ" సరిపోతుంది. కనుక, ఇది శ్లేషాలంకారం అవుతుంది.

సీ :-

బుజిపాప నోరార బువ్వలు తినుచుండ, కన్నవారికి కూడ కడుపు నిండె
చిరునవ్వు చిగురించు చిన్నారి సిరిమోము, చిత్తాన చైత్రమై, చింతఁ దీర్చె
బుడతమ్మ నట్టింట పడిలేచి పారాడు సవ్వళ్ళు మాగుండె చప్పుడయ్యె
అలసిన పాపాయి అరమోడ్పుకనుదోయి, గాంచిన నిట్టూర్పు గాసిఁ దీర్చు
విశేషాలు:
1. "కన్నవారికి" అంటే తల్లిదండ్రులు అని ఒక అర్థం, చూసినవారు అని మఱొక అర్థం. అందుచేత ఇది శ్లేషాలంకారం అవుతుంది.
2. "చ" తో రెండో పాదంలో ఒక విన్యాసం చేశాను. ఇది చాలా వరకు అనాలోచితంగా వచ్చినదే. ఇది వృత్త్యనుప్రాస అవుతుందా?

తే :-

లక్ష్మి యెల్లవేళల నీకు లక్షలివ్వ
దుర్గ ఆపద రాకుండ తోడునుండ
శారదాంబ కరుణఁజూచి చదువులివ్వ
నిండు నూరేళ్ళు చల్లగనుండవమ్మ!


చదువర్లు వ్యాఖ్యల ద్వారా నా సందేహాలను నివృత్తి చేస్తారని ఆశిస్తున్నాను.

6 comments:

కంది శంకరయ్య said...

సందీప్ గారూ,
పద్య రచనా నైపుణ్యం మీకు పట్టుబడింది. బాగున్నాయి. కొన్ని లోపాలున్నాయి. సమయాభావం వల్ల వివరంగా రాయలేక పోతున్నాను. వీలున్నప్పుడు రాస్తాను.

జిగురు సత్యనారాయణ said...

సందీప్ గారూ,
పద్యాలు బాగున్నాయి.
నాకు వ్యాకరణము గురించి అంతగా తెలియదు కాని, చంధస్సు పరముగ మూడు చోట్ల యతి లేక ప్రాస యతి తప్పినట్టు అనిపిస్తుంది.
1. "లోగిలి! చిటిపాప నగవు చేరి" :- ఇక్కడ ప్రాస యతి క్రింద "గ" వేశారు. కాని పాదము గురువుతో మొదలైంది కాబట్టి ప్రాస యతి ముందున్న అక్షరము కూడ గురువు కావాలేమో అనుకుంట.
2." గాంచిన నిట్టూర్పు అలుపుఁ దీర్చె" :- ఇక్కడ యతి చెల్ల లేదు.
3. "ఆయురారోగ్యసంతోష ప్రాప్తిరస్తు" :- ఇక్కడ కూడ యతి చెల్ల లేదు

రవి said...

బావున్నాయండి. నేనూ మా పాప మీద రాద్దామనుకుంటే ఆలోచనలే రావట్లేదు. ఇప్పుడు మీ ఐడియాలు కాపీ కొడతాను. :-)

అవనిఁ - ఈ రకమైన ప్రయోగాలు నేనూ చేశాను చాలా సార్లు. చూశాను కూడా. నాకు తెలిసి ఇది కరెక్టే అనుకుంటాను.

Sandeep said...

@కంది శంకరయ్యగారు
మీ వంటి అనుభవజ్ఞులు పద్యాలను చూడటమే నా అదృష్టం. మీ దగ్గరనుండి వచ్చే సూచనలు నాకు మార్గదర్శకాలు అవుతాయి. మీ వ్యాఖ్యలకోసం వేచి చూస్తాను.

@జిగురు సత్యనారాయణ గారు
మీరు చెప్పిన విషయాలన్నీ నేను తిరిగి వ్యాకరణపుస్తకంలో చూశాను. అన్నీ సరైనవే. ఇలాంటి అతి ప్రాథమిక నియమాలు కూడా తెలియకుండా నేను నాలుగేళ్ళుగా పద్యాలు వ్రాస్తున్నాను అంటే నాకు సిగ్గేస్తోంది. ఇప్పటికైనా తమ వలన ఈ విషయాలను నేర్చుకున్నాను. ఇప్పుడు అన్నీ సరిచేశాను. వీలైతే మళ్ళీ చూడగలరు.

@రవి
కవిత్వానికీ చమత్కారానికీ చాలా దగ్గర సంబంధం ఉంది అని నా నమ్మకం. మీ చమత్కారం గురించి నాకు తెలుసును గనుక, మీకు ఆలోచనలు రావట్లేదంటే నమ్మను, పైగా, ఇదీ చమత్కారమనే నమ్ముతాను :)

జిగురు సత్యనారాయణ said...

సందీప్ గారూ,
ఇప్పుడు సరి పోయిందండి.

నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి) said...

చిత్తాన చైత్రమై కు బదులుగా చిత్తాన చిత్రమై - అని ఉంటే ఇంకా అందగిస్తుందేమో కదా!