తమిళంలో ఇళయరాజ చేసిన శ్రావ్యమైన గీతాల జాబితాను తయారు చేయడం వారికి కూడా అసంభవం అని నా నమ్మకం. ఏ జన్మపుణ్యఫలమో ఆయనకు అనుకోగానే మధురాతిమధురమైన బాణీలు ఇట్టే స్ఫురిస్తాయి. అలాంటి మధురమైన గీతాలలో నాకు నచ్చిన ఒక పాట ఇది. దీన్ని ఉదయగీతం అనే చిత్రానికి ముత్తులింగం అనే రచయిత వ్రాసారు, బాలు పాడారు. చిత్రంలో కథానాయకుడు పాటకాడు. సంగీతం పట్ల తనకు ఉన్న గౌరవాన్ని, ఇష్టాన్ని ఈ పాట ద్వారా చెప్తాడు అని నాకు చూచాయిగా అర్థమైంది. ఆ పాటను తెలుగులో కూడా వ్రాద్దామనిపించి ఈ ప్రయత్నం చేస్తున్నాను.
పాటలో చాలా వాక్యాలు వేటూరిని, ఇళయరాజ ని దృష్టిలో పెట్టుకుని వ్రాసాను. మొదటి చరణంలో సాహిత్యం గురించి, రెండవ చరణంలో సంగీతం గురించి వ్రాసాను. పాట Commerical గా ఉండకుండా వీలైనంతవరకు ప్రయత్నించాను. రోజంతా కూర్చుని వ్రాయవచ్చును కానీ, అంత సమయం లేదు కాబట్టి రెండున్నర గంటల్లో తోచిందేదో వ్రాసాను. పల్లవి ఆఖరిలో పూర్తి చేసినందుకో ఏమో అంత బలంగా అనిపించలేదు.
సంగీతమేఘం వర్షించే గానం
మనసుల్లో పండిస్తుంది ఆనందం
గానం నా జీవితం, గీతం మీకంకితం
ఎపుడూ సాగాలి ఈ సంబరం
మాట పూల తోటలో బాటసారి శ్వాసలో
తావి కలిసిన తీపి గాలుల మాధుర్యమూ
భావమేఘమాలలో ఆస చుక్కల డోలలో
మేను మరిచిన గుండెజాబిలి సౌందర్యమూ
ఇలా పాటై తేనె వూటై పొంగెనీ గొంతులో (2)
పాటే నా గమ్యం...
తీపి స్వరముల సవ్వడో, స్వాతి చినుకుల తాకిడో
గుండె ఝల్లని పొంగు క్షణమున నేనెఱుగను!
భావమెఱిగిన రాగమూ, తాళశ్రుతులకు యోగమూ
మేళవించిన గీతమందు అదే అనుభవం
ఈ దేహం మన్నైనా పాటై నిలుస్తా (2)
పాటే నా జీవం...
తమిళ పల్లవిలో "సంగీతమేఘం తేన్సిందుం రాగం", మొదటి చరణం చివరిలో వచ్చే "ఇంద దేగం, మరైందాలుం ఇసయాయ్ మళర్వేన్" -- ఈ రెండు వాక్యాలనూ తస్కరించి వాడాను. మొదటిది తమిళ పాట తెలిసినవాళ్ళకు (నాకు కూడా) బొత్తిగా తలా తోకా లేకుండా పూర్తిగా కొత్త పల్లవి ఇష్టం లేక. రెండవది నాకు ఆ వాక్యం బాగా నచ్చింది కనుక. నిజానికి ఆ వాక్యం పాతలో రెండు సార్లు వస్తుంది -- దాన్ని వేటూరికి అన్వయించినప్పుడు "ఈ దేహం మన్నైనా పాటై నిలుస్తా, పాటల్లో భావాన్నై (లై) మీలో వసిస్తా" అని పాడుకునేవాడిని. ఇక్కడ మాత్రం బీజగీతంలో లాగ మొదటి వాక్యం మాత్రమే ఉంచాను.
6 comments:
మంచి పాట పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు.
ప్రయత్నం బాగుందండి.
>>>ఆస చుక్కల
అంటే ఏంటండీ?
@JB
ఆశచుక్కలు అనడం వ్యాకరణపరంగా తప్పనిపించి, ఆశకి తెలుగులో వికృతి ఆస కాబట్టి ఆసచుక్కలు అని వ్రాసాను. నిజానికి, నాకూ అది అంత convincing గా అనిపించలేదు :-(
హా! నేనూ ఆశనే అనుకున్నా!
ఇంకోటి చెప్పనా - మీకు తెలుసో లేదో తెలుగు డబ్బింగు వచ్చింది. యూట్యూబులో దొరికింది - http://www.youtube.com/watch?v=YTRlNOrsgLc
ఆ పాట తెలుగులో ఉందని నేనూ ఒక నెల క్రితమే తెలుసుకున్నాను. రాజశ్రీ చక్కగా అనువదించారు. లంకె ఇచ్చినందుకు నెనర్లు :)
రచన బాగుంది, ముఖ్యంగా మొదటి చరణం బాగా నచ్చింది. అయితే ట్యూన్‌కి పూర్తిగా సరిపోయే రచనకాదు ఇది. మాత్రలు తేడావచ్చాయి కొన్ని చోట్ల. ఇక్కడ నీ ప్రయత్నం ట్యూన్‌కి చూచాయగా సరిపోయే పాట రాయడమే కనుక ఇది ఇబ్బందేమీ కాదు.
@ఫణీంద్ర
నాకూ మొదటి చరణమే బాగా వచ్చిందనిపించింది. అలాగే అక్కడక్కడ మాత్రలు తప్పాయి అని కూడా గమనించాను. నీ సద్విమర్శకు నెనర్లు.
Post a Comment