ఆత్మబంధువు అనే అనువాదచిత్రంలో బహుశా
రాజశ్రీ అనుకుంటాను ఒక పాట వ్రాశారు - "
మనిషికో స్నేహం, మనసుకో దాహం" అని.ఈ రోజు ప్రపంచాన్ని చూస్తే దీన్ని "
మనిషికో రోగం, మనసుకో భోగం" అని మార్చాలనిపిస్తోంది.
ప్రతి మనిషీ తనకో ప్రత్యేకత ఉండాలని కోరుకుంటాడు. అందులో తప్పు లేదు. కొందరు దానికోసం రాత్రింబవళ్ళు శ్రమించి సాధించుకుంటే కొందరు సులభమార్గాలను వెతుక్కుంటారు. నేను బెంగుళూరులో పని చేస్తుండగా నా సహోద్యోగి ఒకాయన అన్నాడు,
"Most people are ordinary, and that is by definition." అని. నాకు భలే నచ్చింది. నిజమే!
సామాన్యం అనే పదానికి అర్థమే "అత్యధికంగా సంభవించే విషయం" అని. లేకపోతే అమెరికాలో పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళను విచిత్రంగానూ, మన దేశంలో అవైవాహికసహజీవనాన్ని (live-in relationship) విచిత్రంగానూ ఎందుకు చూస్తున్నారు? సరే, అది మఱొక సున్నితమైన విషయం కాబట్టి దాన్ని విడిచిపెడదాము.
ప్రతి మనిషికీ ఒక అభద్రతాభావం ఉంటుంది. దాన్ని తొలగించుకోవడానికి తన చుట్టూ ఒక సమూహాన్ని (ఇల్లు, ఊరు, మొదలైనవి) ఏర్పరుచుకుంటాడు. ఆ సమూహం బలంగా ఉంటే తనూ బలంగా ఉంటాడని ఒక నమ్మకం.
అది స్వార్థమా లేక ఔన్నత్యమా అన్నది ఎవరికిష్టమొచ్చినట్టు వారు అన్వయించుకోవచ్చును.
ఇంతకీ ఈ వ్యాసానికి కేంద్రబిందువు (central point) ఏమిటయ్యా అంటే,
వివాదాస్పదమైన వ్యాఖ్యలతో, పనులతో ఈ రెండూ (తమ ఉనికి చాటుకోవడం, ఒక గుంపులో మెలగడం) సాధించుకునేవాళ్ళను చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే అభద్రత అనే రోగాన్ని కప్పిపుచ్చుకోవడానికి, తమకంటూ ఒక అవాస్తవిక అస్తిత్వాన్ని (false identity), పరపతిని ఏర్పరుచుకుని దాన్నే భోగంగా భావించే వారి గురించే ఈ వ్యాసం. వారి వాదనలోని మూర్ఖత్వాన్ని, అసంగతాన్ని (incoherence) వారికి ఎలాగ తెలియజేయాలో అర్థం కాదు.
వారికి నిజం కంటే వారి డొల్ల-పునాదితో ఏర్పడిన అభిప్రాయాలే ముఖ్యం. అలాంటి కొన్ని ఉదాహరణలు చూద్దాము.
ఇటీవల Ace Ventura - The Pet Detective అనే చలనచిత్రాన్ని చూశాను. Jim Carrey నటించిన ఈ చిత్రం హాస్యరసభరితంగా ఉంటుంది అని విని, ఓపిగ్గా చూశాను. అప్పుడప్పుడు నవ్వు వచ్చింది, కొన్ని చోట్ల జుగుప్స కలిగింది. పతాకసన్నివేశంలో ఒక dolphin ని దొంగిలించినవాడు ఎవరో కాదు, ఆ ఫిర్యాదును పర్యవేక్షిస్తున్న ఆడ police ఏ నని తెలుస్తుంది. ఇదేమిటి ఆ వ్యక్తి ఇంతకీ వాడా, ఆమా౨ అన్న సందేహానికి సమాధానం -- రెండూను.
అవును, ఆ వ్యక్తి ద్విలింగి (transgender). కథలో ఏడాగోడానికి (confusion) అదే మూలకారణం. దొంగిలించిన వ్యక్తి మగ అని కొన్ని ఆధారాలు, ఆడ అని కొన్ని ఆధారాలూ దొరికి చివరికి రెండూ అని తెలుసుకుంటాడు నాయకుడు. ఆ ద్విలింగిని శిక్షిస్తారు. ఇక్కడిదాక విషయం ఫరవాలేదు.
ఈ చలనచిత్రం చూసిన ద్విలింగులు, ఈ చిత్రం ద్విలింగుల పట్ల దుగ్ధతో తీసినదని, ద్విలింగులను తప్పుడు కోణంలో చూపించిందని గొడవకు దిగారు. అయ్యా, ఒక ప్రశ్న: ద్విలింగులని వేఱుగా/వింతగా చూస్తే,
"మమ్మల్ని వెలివేస్తున్నారు, మాకు సమానమైన హక్కులు, హోదా కావాలి", అని ధర్నాలకు దిగుతున్నారు. నిజంగా మీ మనసులో సమానభావం ఉంటే, తమరు ద్విలింగులు అనే అభద్రతాభావం లేకుంటే; ఒకవేళ ద్విలింగులు, ఏకలింగులూ సమానం అనే దృక్కోణానికి సమాజం అలవాటు పడి;
తరతరాలుగా స్త్రీలనో, పురుషులనో చెడ్డవారిగా చూపించిన చిత్రాలను అన్నిటినీ నిషేధించాలని ఒక ఆరువందలకోట్ల ఆడవారు, మగవారు కూడా ధర్నాకు దిగి, మీరు కూడా వారికి మద్దతును తెలపాలి అంటే ఏం చేస్తారు?
కథ అన్న తఱువాత మంచిని, చెడుని కొందరు మనుషుల రూపేణ చూపించడం అన్ని సంస్కృతులలోనూ ఉన్న విషయమే కదా?
ఎవరికి వారు "మమ్మల్ని తక్కువగా చూపిస్తున్నారు" అంటే ఎలాగ?
హమ్మయ్య, అందరు NRIల లాగా నేను మొదట జన్మభూమిని అవమానించలేదు. ఆ పాఙ్తేయం (fashion?), పైత్యం నాకు ఇంకా వంటబట్టలేదు అనుకుంటాను. సరే, ఇకనైన మన దేశాన్ని విమర్శించకపోతే నన్ను NRIలు అందరూ అపాఙ్తేయుణ్ణని వెలివేస్తారు కాబట్టి ఒకసారి భారతదేశం కేసి చూద్దాము.
మన దేశంలో ఆరక్షణ (reservation) చట్టాలు విస్తృతమౌతున్న దశలో నాకో సందేహం.
మొదట ఒక విషయం మాత్రం తేటతెల్లం చెయ్యాలి -- దళితులకు అన్యాయం జరిగింది, అవమానం కలిగింది. దీనిలో సందేహం ఏమాత్రం లేదు. వారికి
కొంతవరకు, కొన్నాళ్ళు ఆరక్షణ కల్పించడం కూడా సబబే! నా సమస్య అది కాదు.
సందేహం ఏమిటయ్యా అంటే లోక్పాల్ చట్టానికి మీకూ సంబంధం ఏమిటి అని. లోక్పాల్ మనువాది ఉద్యమం అని, ఊర్ధ్వకులాల కుట్ర అని వాపోతున్న మహాధ్యాపకులు (professors?) ఆ సంబంధాన్ని సశాస్త్రీయంగా, తర్కించి విశదీకరిస్తే బాగుంటుంది. లోక్పాల్ లో ఎక్కడైనా దళితులు ఫిర్యాదు చేస్తే దాన్ని పరిశీలించక్కరలేదు అని ఉందా? పోనీ, దళిత సంఘాల్లో జరిగే కుంభకోణాలను, రంభకోణాలను (
సహస్రావధాని గరికపాటి వారి పాదలాకు మ్రొక్కుతూ ఈ ప్రయోగాన్ని తస్కరించాను :) ) మొదట/ఆఖర వెదకాలని ఏమినా ప్రత్యేకించి ఒక వాక్యం ఉందా?
ఓహోహో రాజ్యాంగం వ్రాసిన అంబేద్కర్ దళితుడా? ఆ రాజ్యాంగాన్ని గాంధీ స్ఫూర్తితో మారుస్తున్న హజారే దుష్టుడా? సరే. మీకు ఇప్పుడు ఇంకో చిక్కు ప్రశ్న.
మన దేశంలో స్వలింగసంపర్కం క్రూరమైన దుష్చర్యగా (criminal offense) నిర్ణయించిన మహానుభావుడు ఎవరయ్యా? అంబేద్కరే కదా? నవీనకులతత్త్వానికి (modern casteism) నిర్వచనం ఏమిటి? ఒకడు పుట్టిన పరిస్థితులని బట్టి వాడి జీవితంలో ఏదైనా చేసి తీరాలి, చెయ్యకూడదు అని చెప్పడం తప్పు అనే కదా? అంటే దళితుడైతే ఎవరినీ ముట్టుకోకూడదనో, బ్రాహ్మడైతే అందరూ కాళ్ళ మీద పడాలనో అంటే ఎందుకు తప్పు? వాడు పుట్టిన కుటుంబాన్ని బట్టి వాడికి గౌరవాన్నో, అవమానాన్నో కల్పించడం అహేతుకం అనేనా? సరేనయ్యా.
మరి మగవాడిగా పుడితే ఆడదాన్నే కామించాలని ఎవరు నిర్ణయించారట? దేవుడెక్కడైనా చీటి వ్రాసిపెట్టాడా? మఱి గబ్బిలాల్లో స్వలింగసంపర్కుల సంఖ్య ఎక్కువగా ఉంది, వాటికి ఏ గ్రుడ్డిగుహలోనో చీటీ చదువుకోవడం వీలు కావట్లేదు అనుకుంటాను. వెటకారం అటుంచితే, మఱొక సందేహం.
ఇప్పుడు దళిత స్వలింగసంపర్కులు అంబేద్కర్ ని పొగడాలా? తిట్టాలా? అమ్మో, జటిలప్రశ్నే. సరే నేను దళితుణ్ణీ కాదు, స్వలింగసంపర్కుణ్ణీ కాదు - అందుచేత నేను ఏమీ వ్యాఖ్యానించను. (
ఈ వాక్యం కూడా దట్టపరిచెయ్యాలని (bold) ఎందుకో మనసు పీకుతోంది :) )
ఎవరండక్కడ? ఏమిటి?
అంబేద్కర్ ఉపవాసాలు మొదలైనవాటిని నిషేధించాడా? మఱి ధర్నాలు ప్రోత్సహించాడా? దండోరాలు, రాస్తా రోకోలూ ప్రబోధించాడా? సరే అదీ వదిలెయ్యండి.
అయ్యా, మీరు మహాధ్యాపకులు, తాత్వికులు కదా. ఇప్పుడు మఱొక ప్రశ్న. మీరు దళితులు అంటూనే కిరస్తానీలు అంటున్నారు. నాకు అద్వైతం మీద గురి కావడం చేత సోదరులైన కిరస్తానీయులపైన ఏమీ దురభిమానం లేదు. ఐతే దళితులు చాలా మంది క్రైస్తవాన్ని పుచ్చుకుని హైందవాన్ని దూషిస్తున్న పరిస్థితుల్లో నాదొక ప్రశ్న --
క్రైస్తవులు తరతరాలుగా నల్లవారిని (అదే నీగ్రోలు అని కొందరు పిలిస్తూ ఉంటారు) కించపరుస్తూ, వారిని బానిసలుగా తిప్పుకున్నారు. మరి మీకు వారిలో కులోన్మాదం ఉంది అనిపించట్లేదా?
పురాణాల గురించి, ఇతిహాసాల గురించి ఏం తెలుసని వ్యాఖ్యానిస్తున్నారో కానీ,
మీరు వ్యాధగీత (వ్యాధుడు అంటే బోయవాడు - నికార్సైన దళితుడు) గురించి తెలుసునో లేదో. భగవద్గీత లాగానే భారతంలో ఒక బోయవాడు తపస్వికి చేసిన జ్ఞానబోధ గురించి ఉంది. అంటే (జ్ఞానం ఉన్న) యాదవుడైన కృష్ణుడు, శూద్రుడైన వ్యాధుడు కూడా పొగరుబోతు బ్రాహ్మడి కంటే గొప్పవారని చెప్తోంది మన సంస్కృతి. అయ్యో వ్యాసం ప్రవచనం అయిపోతోంది. క్షమించాలి.
అబ్బెబ్బే, ఈ రోజు నాకేదో ఐంది, ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తున్నాయి. ఈ వివాదాస్పదప్రశ్నావళికి ఇంక ముగింపు పెట్టి మఱొక ఉదాహరణ చూద్దాము.
ఎంత అద్వైతిని ఐనా పొరుగువాడిని నిందించకపోతే ఈ వెధవ జన్మకు నిద్ర పట్టేలా లేదు. ఈ సారి తమిళనాస్తికమిత్రులకు కొన్ని ప్రశ్నలు. కొందరు ద్రవిడకళగభజనాతత్పరులు రావణుడిని పూజించడం మొదలెట్టారు. అదేమిటి అంటే
"రాముడు ఆర్యుడు, ఆయన ఎక్కడో వాయవ్యమ్నుండి వచ్చాడు. అమాయకుడైన మా రావణుణ్ణి, ద్రవిడులని అవ్యాజమైన కక్షతో చంపివేశాడు" అంటున్నారు. అబ్బబ్బ, మళ్ళీ ప్రశ్నావళి.
రావణ అనే శబ్దమే సంస్కృతపదం. ఆయన అనేకశాస్త్రాలలో పండితుడని రామాయణం చెప్తోంది. బ్రహ్మకు, ఆయనకు బంధుత్వాన్ని సూచిస్తోంది.
ఆయన మహాశివభక్తుడు, రాముడు కూడా సైకితలింగాన్ని నిర్మించాడు. మఱి ఒకరు ఆర్యుడు అయ్యి, మఱొకరు వేరే జాతి ఎందుకు అయ్యారు? వదిలెయ్యండి.
దక్షిణభారతంలోని వారిని కించపరచడానికే వారిని కోతులుగా, రాక్షసులుగా చూపించారని అంటారా? సరే,
"హనుమంతుడు చక్కనైన సంస్కృతభాష మాట్లాడుతున్నాడు. ఇలాంటివాడు మనకు తోడుంటే ఎవరినైనా జయించవచ్చును", అని రాముడన్నది దక్షిణభారతీయుడైన హనుమంతుణ్ణే. సోదరసమానుడిగా భావించి గౌరవించిన విభీషణుడు రాక్షసుడే. పతివ్రతగా పరిగణించబడిన మండోదరి కూడా...ఆఁయ్.
ఉన్నట్టుండి వీరందరూ మీకు దగ్గర బంధువులు, రాముడికి శత్రువులు ఎలాగయ్యారయ్యా? ఆర్య అయిన కైకని చెడ్డదానిగా ఎందుకు చిత్రీకరించారో? మంథరను ద్రవిడదుర్మతిగా చూపిస్తే కథ ఇంకా రక్తి కట్టేదేమో?
అక్కడ నీతి -- వానరుడైనా, మనిషి అయినా, రాక్షసుడైనా, మగైనా, ఆడైనా మనిషి నడవడిని బట్టే గౌరవించాలని. ద్రవిడుడోయంటూ కరుణానిధికి పట్టం కట్టారు. ఏమైంది? ఏ రంగు పూసినా బల్లి బల్లి కాక ఊసరవెల్లి అవుతుందా?
ఇంకా ఇలాంటి ఉదాహరణలు చాలా గుర్తొస్తున్నాయి. కానీ, వ్యాసం చదివేవారికి వేఱే వ్యాసంగాలు (vocation) కూడా ఉంటాయి కదా. ఇక్కడితో ఆపుతున్నాను. కాకపోతే ఒక చిన్న నివృత్తితో.
మనిషిని మనిషిగా గుర్తించాలి, అతనిలో మంచిచెడులను విశ్లేషించాలి, తదనుసారం గౌరవించాలి. గుంపుతనం (mob-mentality), కఱుడుఁగట్టిన అభిప్రాయాలు, వితండవాదాలు, అకార్మికంగా కీర్తిని, డబ్బుని, ఆశించడం, సంచలనప్రియత్వం, బహుమతాన్ని (majority) వ్యతిరేకించి గొప్ప అనుకోవడం ఇవన్నీ అభద్రతకు, హృదయదౌర్బల్యానికి సూచనలు. మనిషి ప్రేమించాల్సింది నిజాన్ని.
వ్యాసంలో ఎక్కడబడితే అక్కడ కొత్తకొత్త తెలుగు/సంస్కృత పదాలను సృష్టించాను. తప్పులుంటే మన్నించగలరు, సవరించగలరు అని మనవి.