Monday, September 8, 2008

వెన్నెల చేత వేదం పలికించిన వేటూరి...

ఈ సారి మాత్రం వేటూరి పాట వ్రాయకూడదని చాలా ప్రయత్నించాను అండి. కానీ నా వల్ల కాలేదు. బహుశా, ఈ పాట భక్తీ, శక్తి, ముక్తి అన్నిటి గురించి మాట్లాడే పాట కావడం వలన కావచ్చు. ఈ పాట విని కళ్ళల్లో నీళ్లు రాని వారుండరేమో.

పాట గురించి చెప్పేముందు - రెండింటి గురించి చెప్పాలి. ఒక దేవుడు. మనల్ని చాలా మంది ప్రేమిస్తారు, ప్రేమించామన్నట్టు నటిస్తారు, ప్రేమించామనుకుంటారు. కానీ, నిజం గా ప్రేమించేది, ధర్మబద్ధమైన ప్రేమ చూపించేది ఒక్క దేవుడే. నేను ఎప్పుడూ అంటూ ఉంటాను: "దేవుడిని చూడలేమురా ఈ పాంచభౌతికదేహంతో! మన ఆత్మతో ఆరాధించాలి, అనుభవించాలి", అని. అలాగ అనుభవించలేని వాళ్లు ఏం కోల్పోతున్నారో వారికి తెలియదు.

రెండవది అమ్మ. దేవుడి ప్రేమ అతినిర్మలమైనది. దాని తరువాత అంత నిర్మలమైన ప్రేమ అమ్మదే అని నా అభిప్రాయం. మనలో చాలా మంది కూడుకీ గుడ్డకీ లోటు లేని వాళ్ళం అయ్యుండవచ్చు. మనకి కష్టం అంటే తెలియకపోవచ్చు. కానీ, మన దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఇంకా ఒక పూట కడుపు నిండా తింటే ఆనందపడే వాళ్లు అనేకులున్నారు. వారందరూ ఎలాగ బ్రతుకుతున్నారో తెలుసునా? త్యాగాలవలన. ఒక ఇంట్లో ఒక అమ్మ అన్నం తిన్నానని అబద్ధం చెప్పి పిల్లలకి అన్నం పెడుతుంది. ఒక ఇంట్లో నాన్నబట్టలంటే ఇష్టం లేదు అని చెప్పి పిల్లలకి మాత్రమే బట్టలు కొంటాడు. ఒక హాస్టల్ లో ఒక ఆన్న భోజనం చెయ్యడం మానేసి డబ్బులు దాచి తమ్ముడికి పంపిస్తున్నాడు. ఒక ఇల్లాలు రిక్షా ఎక్కితే ఎలాగ అని ఐదారు కిలోమీటర్లు నడిచు వస్తోంది. వీరందరూ త్యాగాలు చేస్తున్నామనుకోవట్లేదు. భోగాలు అనుభవిస్తున్నాము అనుకుంటున్నారు. ఎందుకు అంటే - "ఇవ్వడం లో ఉన్న తృప్తి తెలుసుకున్నారు". తన వారి కళ్ళల్లో కనబడే ఆనందం, వారి మనసు లోతుల్లోంచి వచ్చే నిట్టూర్పూ... ఇవి నిజమైన ఆనందాలు. కష్టాలు వస్తాయి, పోతాయి. కానీ, ఈ మమతలు బలపడిపోతాయి. ఈ సృష్టి నడుస్తోంది అంటే దానికి మూలం "ప్రేమ". ఆ ప్రేమ లేనప్పుడు సృష్టి, "ఆత్మ లేని శరీరం" లాంటిది. ఆ ప్రేమకు నిలువుటద్దము "అమ్మ". అమ్మ చెయ్యని త్యాగం ఉంది అంటే అది నేను నమ్మను.*

అలాంటి ఒక అమ్మ జీవితం ఎలాగ నడిచిందో చెప్పిన సినిమా "మాతృదేవోభవ". ఆ సినిమాలోని అమ్మ లాంటి అమ్మల్ని ఏ మిడిల్ క్లాసు ఇంటికి వెళ్ళినా చూడవచ్చు. "రేపు ఎలాగుంటుందో తెలియదు, ఈ రోజు సాగితే చాలు", అనిపించే ప్రతీ ఇంట్లోనూ ఏదో ఒక పరిమాణంలో జరిగే కథనే అది. ఇందులో ఒక ఇల్లాలికి మొదట భర్త అండగా నిలువడు. అతడు మనసు మారి దగ్గరయ్యే సమయానికి దేవుడికి తెగ నచ్చేసి తన దగ్గరకు తీసుకుపోతాడు. దేవుడికి ఎప్పుడు ఎవరి మీద ప్రేమ పుడుతుందో చెప్పలేము కదా! ఇంతలొ ఈ ఇల్లాలికి కూడా ప్రాణాలను హరించే రోగం ఉంది అని తెలుస్తుంది. అప్పుడు ఆ తల్లి తనకు ఉన్న పిల్లల్ని ఒక్కరోక్కర్నీ ఒక్కో గూటికి చేరుస్తుంది. చేర్చి - ఇక తనను తీసుకేల్లిపోమని దేవుడిని ప్రార్థిస్తూ పాడే పాట. ఇది అన్నమయ్య తన జీవితపు సాయమ్సంధ్యలో పాడిన ఒక పాట పల్లవిని తీసుకుని వేటూరి అల్లిన ఒక వేదం. ఆశావాదం, నిరాశావాదం, దేవుడి మీద ప్రేమ అన్నీ కలగలిపి ఒక అమ్మ చెప్పిన భగవద్గీత.

వేణువై వచ్చాను భువనానికి, గాలినైపోతాను aగగనానికి
మమతలన్నీ మౌనగీతం, వాంఛలు అన్నీవాయులీనం ||

ప్రతిమనిషీ ఈ భూమి మీదకు వచ్చేటప్పుడు ఏమి తెలియకుండానే వస్తాడు. వచ్చి - ఏదేదో చేస్తాడు. తన స్వార్థం తను చూసుకుని వెళ్ళిపోయేవాడు కర్రలాంటి వాడు. దానికి ప్రాణం ఉన్నంతకాలం చెట్టుతో ఊగుతుంది. ఏదో అనుభవిస్తున్నాను అనుకుంటుంది. దాని కాలం అయిపోయిన తరువాత తగలేస్తారు. తన గాయాలను లెక్క చెయ్యకుండా తనవారికి మంచి చేసేవాడు వేణువు లాంటి వాడు. "పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు. అల్లన మోవికి తాకితే గేయాలు", అన్నట్టు. ఈ సినిమాలో అమ్మ కూడా వేణువులాంటిదే...మనసులో ఎన్ని గాయాలున్నా తన పిల్లలకోసం ఇంకా పోరాడి, పోరాడి...బాధ్యతలని నెరవేర్చి ఆ గానాలు వారికి విడిచిపెట్టి గాలిగా మారిపోతోంది. వేణువు ఆలాపించేవాడు వెళ్ళిపోయినా, వేణువు వెళ్ళిపోయినా, ఆ వెదురు పాటలు మాత్రం మనసుని విడిచిపోవు.

ఈ ఇల్లాలి మమతలను పంచడానికి పిల్లలు దగ్గరలేరు. ఆమె మమత అంతా మౌనంగానే ఉండిపోయింది. ఆమె కోరికలన్నీ రాగాలుగా ఆ వాయులీనంలో పలికిస్తోంది. వాయులీనం అంటే "వాయువులో లీనమైనది" అనే భావం కూడా కనిపిస్తోంది. ఆమె కోరికలు గాలిలో కలిసిపోయాయి అన్నమాట.

ఏడుకొండలకైనా బండ తానోక్కటే, ఏడు జన్మల తీపి బంధమే
నీ కంటిలో నలక లో వెలుగునే కనక, నేను మేను అనుకుంటే ఎద చీకటే, హరి, హరి, హరి, హరి...
రాయినై ఉన్నాను నాటికీ రామపాదము రాక ఏనాటికీ ||

మనం ఏడు కొండలు అని వేరేగా చూసినా, అవన్నిటినీ కలిపేది రాయే. రాయినే మనం వేరే వేరే కొండలుగా చూస్తున్నాము. అలాగే మనం గుర్తించలేకపోయినా మన జన్మలనన్న్టినీ కలిపేది "ప్రేమ" అనే బంధమే. భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తాడు.

చాలా మంది కష్టాలు వస్తే దేవుణ్ణి తిట్టుకుంటారు. దేవుడికి మనసు లేదు అంటారు. కానీ, ఆ దేవుడు ఎక్కడో లేదు తమలోనే ఉన్నాడు అని గుర్తించలేరు. ఆ పరమాత్మ అనే వెలుగుని చూడకుండా ఉండేవాడు నిజంగా అంధుడు. అతడి మనసు గ్రుడ్డిది. దేవుడికి ధర్మం మాత్రమే తెలుసును. ప్రేమించడమే తెలుసును. ప్రేమించినవారిని ఆదరించడమే తెలుసును. ఇక్కడ వేటూరి "నేను మేను అనుకుంటే", అని చాలా గొప్పగా చెప్పాడు. "నేను" ఈ శరీరం కాదు. అది ఆత్మ. దానికి ఒక పరమార్థం ఉంది. అది తెలుసుకుని నడుచుకుంటే వచ్చే తృప్తి చిరకాలం ఉంటుంది. ఎందుకంటే మనలో ఉన్న పరమాత్మకి అది నచ్చుతుంది. మనం సినిమా చూస్తేనో, స్విట్జర్లాండ్ వేల్తేనో వచ్చే ఆనందంతో ఒకరి కళ్ళల్లో నీళ్ళను తుడిస్తేనో, ఒకరి కడుపులో మంటను చల్లార్చితెనో వచ్చే ఆనందంతో పోలిస్తే చాలా తక్కువ, తాత్కాలికం.

ప్రతి రోజూ "నా కష్టాలు తీరతాయి", అని ఆశించే ప్రతి మనిషి ఒక అహల్య. అలాంటి అహల్యలు ఈ లోకంలో ఇంకా ఎంతో మంది ఉన్నారు.

నీరు కన్నీరాయె, ఊపిరే బరువాయె, నిట్టు నిప్పుగా మారే నా గుండెలో...
నింగిలో కలిసే శూన్య బంధాలు, పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు...హరి, హరి, హరి, హరీ....
రెప్పనై ఉన్నాను నీ కంటికి, పాపని వస్తాను నీ ఇంటికీ ||

ఇలాంటి కష్టాలు భరించిన ఏ వ్యక్తీకి అయినా ధారాపాతంగా వచ్చేది కన్నీరే. "ఆగక పొంగే కన్నీరే నీ ఆకలి దప్తులు తీర్చాలమ్మా", అన్నాడు "స్వాతిముత్యం" సినిమాలో ఒక కవి. ఆ నిజాలని అనుభవిస్తూ బ్రతికే ప్రతి క్షణం మనసుని మండిస్తుంది.

చివరికి ఈ తల్లి హరిని తన తండ్రి గా భావించి తన చావుని కూడా "పుట్టిల్లుకి చేరుకోవడం" గా వర్ణిస్తూ ఉంది. జన్మలో తన పిల్లలకి "రెప్ప" గా ఉన్నా తల్లి, మళ్ళీ పిల్లల ఇంటికే పాపగా మారి వస్తాను అనే ఆశావాదం వ్యక్తం చేస్తోంది. అదే కదా మరి ఏడుజన్మల బంధం అంటే.

పాటలో లైన్ నచ్చింది అని అడిగితే ఏమిటి చెప్పను. "ఇలాంటి తల్లుల్ని చూసి, వారి వేదనని చూసి, వారి త్యాగాలను చూసి చమ్మగిల్లిన కళ్లు, తడి ఆరిపోయిన గొంతుతో మూగబోయాను", అని మాత్రమె చెప్పగలను. అలాగ త్యాగాల మధ్యలో తమ పిల్లల్ని పెంచిన తల్లితండ్రులకి నా ఈ కన్నీళ్ళతో పాదాలు కడుగుతూ శతకోటిప్రణామాలు చేస్తూ ఇక్కడితో ఆపేస్తున్నాను.

అసలు ఈ పోస్ట్ కి "వెన్నెలతో వేదం పలికించడం" అని ఎందుకు పేరు పెట్టావు అంటే. నాకు జాబిల్లి అంటే మా అమ్మ. ఇదే సినిమాలో వేటూరి అమ్మను, "వేకువలో వెన్నెలవై, జారిపడే జాబిలివై", అన్నాడు. అది నిజం! అమ్మ వేదం చెప్తే ఈ పాట లాగే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అందుకే ఈ పేరు!

ఈ పాట ఇక్కడ చూడవచ్చును. పూర్తిగా లేదు సుమీ!




* కొంతమంది exceptions ఉంటారు అని మీరు అనవచ్చు. అలాంటి వారిని "అమ్మ" అనే పదానికి ఆపాదిన్చవద్దు.