నాకు మొదటిసారి తెలుగు సినిమా పాట మీద ఇష్టం కలిగింది సిరివెన్నెల పాటలు వినడం వలన. ఆయన అంటే నాకు వల్లమాలిన అభిమానం. తరువాత నేను ఆయన ఇంటర్వ్యూ ఒకటి చదివాను. అందులో ఆయన, "నా హీరో వేటూరి. అసలు తెలుగు పాటకి ఉన్నా హద్దులు అన్నీ చెరిపేసి, తెలుగు పాటకే ఓనమాలు నేర్పించిన మహానుభావుడు వేటూరి", అని చెప్పడంతో నాకు వేటూరి గొప్పదనం అర్థమైంది. అప్పటినుండి, నేను వేటూరి పాటలను కూడా సీరియస్ గా ఫాలో అయ్యాను. ఆ తరువాత సిరివెన్నెల చెప్పినదాంట్లో ఏ మాత్రం అబద్ధం అని అర్థమైంది. ఐనప్పటికీ సిరివెన్నెల గొప్పదనాన్ని ఎవరూ కాదనలేరు. ఆయన పాట ఎంత నచ్చుతుందో, ముక్కుసూటిగా ఉండే ఆయన నైజం కూడా నాకు అంత నచ్చుతుంది.
[ మీ వయసు పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువైతే ఇక్కడితో చదవడం ఆపేయ్యండి :) ]
నాకు నవరసాల్లోనూ మహా నచ్చేవి మూడు: భక్తిరసం, హాస్యరసం, శృంగారరసం. [ ఎవరైనా అప్పుడే కళ్లు ఎర్ర చేస్తున్నారా? చేసుకోండి. I'm not here to impress. I'm here to express :) ] బహూశా అందుకేనేమో నాకు త్యాగయ్య, జంధ్యాల, వేటూరి అంటే చాలా ఇష్టం :) ఇక ఈ రసాలని mix and match చేసే వాళ్ళంటే భలే మక్కువ. ఉదాహరణకి అన్నమయ్య, జయదేవులు. వ్రాసేది మహాశృంగారభరితంగా ఉన్నా - భక్తిభావం మాత్రమె తోణికిసలాడుతుంది.
ఇక తెలుగు సినిమా పాటల్లో శృంగారరసం పండించటంలో ఒక lineage ఉంది. ఆత్రేయ, వేటూరి ఇందులో ఆద్యులు :) ఇక వేటూరి నా అంచనాలను అధిగమించి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆయనను బీట్ చెయ్యగలిగేవారు ఉన్నారు అంటే నేను ఒప్పుకోలేను. అసలు ఆయన పాటల్లో భావుకత మీద నేను ఒక పోస్ట్ వేరేగా వ్రాస్తాను.
సిరివెన్నెల విషయానికి వస్తే ఈయన కనబడరు కానీ మహాముదురె. కొన్ని పాటల్లో వేటూరిని తలపించి, తనకు తెలియనట్టు తలవంచుకుని వెళ్ళిపోతారు. అలాటి ఒక పాటే "కూలీ నెంబర్ ఒనె" లోని ఈ పాట. ఇందులో ఆయన చేసిన కొన్ని ప్రయోగాలు వేటూరి స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా ఉంటాయి. మరీ ముదురిపోయినవి నేను ఇక్కడ వర్ణించను కానీ, మిగతావి (నాకు నచ్చినవి) ఇక్కడ చెప్తాను.
నా చెంప సంపెంగలో కెంపు రంగాయే తోలిసంబరం
ప్రియురాలి చెంపను సంపెంగతో పోల్చడం కొత్తేమీ కాదు. బహుశా రంగులో ఉన్న సామ్యం వలన కావచ్చు. ఇక "తోలిసంబరం" అనే చక్కని తెలుగుసమాసం ఎందుకు వాడాడు అని ఆలోచించాలి. "కెంపు రంగు" అంటే ఎర్రటి ఎరుపు. ఆమె బుగ్గపైన ఎర్రటి ఎరుపు కలిగించింది ఏమయ్యుంటుందో!
ఉద్యోగామిప్పించావా సోకు ఉద్యానవనమాలిగా
రకరకాల చెట్లు ఉండేది ఉద్యానవనం. ప్రియురాలిని సోకు ఉద్యానవనం గా పిలిస్తే తనే ఉద్యానవనంలో పొడుగాటి చెట్టు ఎక్కేసే ప్రమాదం ఉంది. అయినా పొగడ్తలకు పాడిపోని ఆడవాళ్ళని నేను ఇప్పటిదాకా చూడలేదు! ఆ ఉద్యానవనానికి తోటమాలిగా ఉంటానని అప్లికేషను పెట్టాడు సిరివెన్నెల!
నాజూకు మందారమే ముళ్ళ రోజాగా మారే క్షణం
మందారానికి స్త్రీకి చాలా సార్లు పోలిక చెప్తారు. ఈ మధ్యన మన వేటూరి "మదిలోని ప్రేమ నీదే మాధవుడా! మందారపువ్వే నేను మనువాదరా", అని వ్రాసాడు. మందారపువ్వును చూస్తె ఒక పవిత్రమైన భావం కలుగుతుంది (పోనీ, మల్లెపూవుతో పోలిస్తే). అలాంటి అమ్మాయి, "ముళ్ళ రోజాగా" మారిందిట. అది ఎలాగ అని అనుమానం వచ్చి, నేను వెంటనే వేటూరి నిఘంటువు వెదికాను. అందులో "మొదటిరాతిరి సిగ్గు మొగలిపువ్వట. గుచ్చుకుంటూనే మొగ్గ విచ్చుతుందట", అని ఉంది. అప్పుడు అర్థమైంది. మందారానికి, రోజాకి ఉన్న తేడ మినీ కవులకు కూడా అర్థమవ్వాలి. మందారపువ్వును చూస్తె కలిగే భావం వేరు. రోజా పువ్వును చూస్తె కలిగే భావం వేరు.
కండల్లో వైశాఖమా, కైపు ఎండల్లో కరిగించుమా...
నేను జడ్జిని ఐతే, ఈ ప్రయోగానికి నూటికి రెండు వందల మార్కులు వేస్తాను. అసలు, దీనికి విలువ కట్టలేము అండి. ఇంతకీ అసలు వైశాఖం అంటే తెలుసునా? "ఎండా కాలం". కండల్లో ఎండా కాలం చూపిస్తున్నదుట మన హీరో. పేరుకు సిరివెన్నెల కానీ, గురూజీ అప్పుడప్పుడు ఇలాంటి తాపం కూడా కలిగిస్తూ ఉంటారు.
తీగమల్లికి నరాల పందిరి అందించుకోనా?
దీని గురించి చిన్నపిల్లాణ్ని నేను చెప్తే ఆట్టే బాగుండదు. ఆమెను అల్లుకునే పూలతీగాతో పోల్చడం ఒక ఎత్తైతే, తన నరాలతో పందిరి వేస్తాను అనడం అతడి ఔదార్యానికి నిదర్శనం, అతనికి నిద్రనాశనం :)
మొత్తం పాట:
కొత్త కొత్తగా ఉన్నది, స్వర్గం ఇక్కడే అన్నది
కోటి తారలే పూల ఏరులై నెల చేరగానే
నా కన్ను ముద్దాడితే కన్నె కులుకయే కనకాంబరం
నా చెంప సంపెంగలో కెంపు రంగాయే తోలి సంబరం
ఎన్ని పొంగులో కుమారి కొంగులో, ఎన్ని రంగులో సుమాల వాగులో
ఉద్యోగామిప్పించావా? సోకు ఉద్యానవనమాలిగా
జీతమియ్యగా లేత వన్నెలే చెల్లించుకోనా?
నీ నవ్వు ముద్దాడితే మల్లె పువ్వాయే నా యవ్వనం
నాజూకు మందారమే ముళ్ళ రోజాగా మారే క్షణం
మొగలి పరిమళం మగాడి కౌగిలి
మగువ పరవశం సుఖాల లోగిలి
కండల్లో వైశాఖమా కైపు ఎండల్లో కరిగించుమా
తీగమల్లికి నరాల పందిరి అందించుకోనా?
వీడియో:
1 comment:
వందమార్కులు కొట్టేసావ్ గురుడా! ఇలా చక్కగా శృంగారాన్ని విశ్లేషించే బ్లాగరి కావాలి. ఈ మధ్య యండమూరి వీరేంద్రనాథ్ మాటీవీ కార్యక్రమంలో ఒక వేటూరి పాట గురించి చెప్పాడు (మొత్తం చెప్పిన విషయంలో టీవీలో రాలేదు ఎడిట్ చెయ్యబడింది). దానిగురించి నేనూ రాసెయ్యాలి.
Post a Comment