Wednesday, September 3, 2008

నా గుండె గుడిలో...

విలన్ అనే సినిమా తెలుగులొ వచ్చింది అని మనలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ సినిమాలో ఒక పాట నాకు బాగా నచ్చింది. విద్యాసాగర్ (ఈయన అవ్వడానికి తెలుగు వాడైనా అవకాశాలు లేక తమిళ్, మళయాళం రంగాలలో ఉన్నత స్థాయిని చేరుకున్నాడు) చాలా అద్భుతమైన బాణీని అందించాడు. దానికి భువనచంద్ర తనదైన రీతిలో చక్కటి సాహిత్యాన్ని అందించారు. ఈ పాట విన్న వెంటనే నేను అన్నాను - ఇది భువనచంద్ర వ్రాసి ఉండాలి అని!

పాట ప్రతి వాక్యంలోనూ ఒక విషయాన్ని చూపించి, దానికి అతిముఖ్యం ఐన మరొక రెండు విషయాలని చూపించి - "మొదటిది నేనైతే, ఈ రెండింటిలో నువ్వు ఏమిటి?" అని ప్రేయసీప్రియులు ఒకరినొకరు అడగటం ముచ్చటగా ఉంటుంది. నిజమైన భార్యాభర్తలు ఇలాగే ఉండాలేమో అనిపిస్తుంది!

నా గుండె గుడిలో నువు శిలవా? దేవతవా?

శిల లేకపోతే అది గుడే కాదు. అలాగని ఆ శిలలో అందరూ చూసేది దేవతని - అది ఆ శిలకి ఆత్మ. అందుకే ప్రతిష్ఠాపన/ఆవాహన అనే కార్యక్రమం చేసేది. మన హీరో ఏదీ తేల్చుకోలేక అమాయకంగా అడుగుతున్నాడు :)

నా వలపు బడిలో నువు గురువా శిష్యుడివా?

వలపు అనేది నిజంగా ఒక బడే! ఇద్దరు మాత్రమే ఉండే బడి. ఆడపిల్ల గురించి మగవాడికీ, మగవాడి గురించి ఆడపిల్లకీ ఎక్కువ తెలియకపోవచ్చు. పైగా ఇద్దరికీ కొత్తే :) ఇది సైన్సు, మాథ్సు కాదు ఇతరులు వచ్చి లెసన్స్ తీసుకోవడానికి. అందుకే ఇద్దరిలోనూ గురువూ/గుర్విణీ, శిష్యుడు/శిష్యురాలూ ఉంటారు.

నీ పెదవితడిలో నే ముద్దునా మధురిమనా?

ముద్దు గురించి చిన్నపిల్లాణ్ణి నేను చెప్తే ఏం బాగుంటుంది? పైగా అనుభవం నిల్ ఆయే! కానీ ఏదో "వేటూరి అభిమానికి ముద్దు గురించి కూడా తెలియదు అట", అంటే ఆయన మనసు కలత చెందుతుంది అని రెండు ముక్కలు చెప్తున్నాను :) ఒక చిన్న పాపను చూశాము. కళ్ళల్లో కల్మషం లేకుండా, పాలబుగ్గలతో, బోసి నవ్వులతో ఉంది. ఆ పాపను గట్టిగా ముద్దు పెట్టుకున్నాము అనుకోండి. ఆ ముద్దు వలన మన కడుపు నిండదు. కానీ మనసు నిండుతుంది. ఆ క్షణంలో మనసులో ఏదో తెలియని సంతోషం కలుగుతుంది. అది వర్ణించలేము కానీ - అతిపవిత్రమైన, నిర్మలమైన నీటివాగులో నీళ్ళు దోసిట్లో నింపుకుని పొడిగొంతులో పోసుకుంటే ఆ భావం ఎలాగ ఉంటుందో అలాగ ఉంటుంది అని నా అభిప్రాయం. రొమాంటిక్ టచ్ పోయింది - దిశపాయింట్ చేసావు అనుకుంటున్నారా? ఐతే ఇంకో టచ్!

"ఇచ్చిన కొద్దీ ముచ్చట పుట్టే లక్షణముందే ఈ ముద్దులో" అని మన సిరివెన్నెల ఎప్పుడో చెప్పారు. అలాగే "సూరీడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళ" అని ముద్దు పెట్టుకోవడాన్ని వేటూరి చెప్పారు. వారి ముందు నేనెంత?

నే విరహమైతే నువు రతివా కోరికవా?

విరహమనేది ఒక తీయని అనుభూతి. కోరుకున్నది దొరకదు, కానీ దొరుకుతుంది అని ఆశ. వెరసి విరిహం. ఈ రెండింటిలో మొదటిది (దొర్కకపోవడం) లేకపోతే అది కలయిక అయిపోతుంది. రెండవది (ఆశ) లేకపోతే అది అది వైరాగ్యం ఐపోతుంది. ఈ రెండూ ఉన్నదే విరహమై మనసులో తీయని బాధ నింపుతుంది. మీకు "బాధ తీయగా ఉండటమేమిటి", అనిపించింది అనుకోండి; నాకు మిమ్మల్ని చూసి బాధపడాలో, జాలి పడాలో అర్థం కాదు.

ఇంతకీ రతికి ఉన్న గుణం - కోరిక కలిగించడం. కోరిక అనేది abstract ఐతే రతి దానికి ప్రతిరూపం.అవి విడదీయలేనివి.

నే పాపనైతే నువు ఒడివా ఊయలవా?

చంటిపాపల్ని వాళ్ళ అమ్మ ఒళ్ళో ఊయలనూపడం చూశారా? పాపలకి మనశ్శాంతిగా నిదుర పడుతుంది. అది "అమ్మ ఒళ్ళో ఉన్నాం", అనే ధీమా; "ఉయ్యాలూగుతున్నాము", అనే సరదా. ఈ రెండింటిలో ఏది లేకపోయినా ఆ చక్కని నిద్ర చేరదు!

నే విందునైతే, నువు రుచివా ఆకలివా?

రుచి చూడాలనే ఆకలి (ఇది వేరే వెర్షన్ :P) పుడుతుంది. ఆకలి ఉంటేనే రుచి తెలుస్తుంది. ఈ రెండింటిలో ఏది తక్కువైనా అక్కడ విషయం నిల్ :)

నే భాషనైతే, నువు స్వరమా అక్షరమా?

కాళిదాసు "వాగర్థావివ సంపృక్తౌ" అని చెప్పినట్టు ఉంది కదా? భాషకి లిపి, మాట చాలా ముఖ్యమైనవి. ఇవి ఙాపకశక్తి, అనుభూతి కి చిహ్నాలు. మనకి ఒక చక్కని విషయం జరిగింది అనుకోండి. అది చాలా రోజులు గుర్తుండిపోవాలి అనుకుంటాము. ఆ అనుభూతి మళ్ళీ మళ్ళీ అనుభవిస్తాము. అలాగే మాట ఒక నిముషం మాత్రమే ఉంటుంది. కానీ అక్షరం ఎప్పటికీ ఉండిపోతుంది.

నే తోటనైతే, ఆమనివా కోకిలవా?

తోటకి అందం పచ్చని చెట్లు, కోకిల స్వరాలు. మన నగరాల్లో రెండూ కరువే అనుకోండి. (నేను పల్లెటూరిని కనీసం కొన్నాళ్ళు అనుభవించాను కాబట్టి చెప్తున్నాను.) పచ్చని చెట్లు లేనిదే కోకిలకి పాడాలనే మూడ్ రాదు. ఆమని తోటలూ, కోకిల పాటలూ విననిదే మనకు (పోనీ నాలాంటి మినీ-కవులకు) మూడ్ రాదు :)

మొత్తానికి ఈ పాట ఒక చక్కని భావంతో నిండి ఉంది. భువనచంద్ర మీద నాకున్న నమ్మకాన్నీ, అభిమానాన్నీ రెట్టింపు చేసింది. గతంలో "కీరవాణి రాగంలో", "పికాసో చిత్రమా" (స్వయమ్వరం), "సుర్యాకిరీటమే" (ప్రేమించుకుందాం రా) వంటి పాటలతో నన్ను మైమరిపించిన భువనచంద్ర ఇంకా చాలా అద్భుతమైన పాటల్ని రాయాలని కోరుకుంటున్నాను.

మొత్తం పాట లిరిక్:

నా గుండె గుడిలో నువ్వు శిలవా దేవతవా?
నా వలపు బడిలో నువ్వు గురువా శిష్యుడివా?
నీ కనుల వడిలో నే కలనా కాటుకనా?
నీ పెదవి తడిలో నే ముద్దునా మధురిమనా?
నీ సొగసు పొగడ నే కవినా కల్పననా?

నే బిడియపడితే నువ్వు గిలివా చెక్కిలివా?
నే విరహమైతే నువ్వు రతివా కోరికవా?
నే పాపనైతే నువ్వు వొడివా ఊయలవా?
నే నిదురనైతే నువ్వు కలవా కౌగిలివా?
నే హృదయమైతే ఊపిరివా సవ్వడివా?

నే గగనమైతే వేసవివా వెన్నెలవా?
నే నదిని ఐతే నువ్వు అలవా అలజడివా?
నే విందునైతే నువ్వు రుచివా ఆకలివా?
నే భాషనైతే నువ్వు స్వరమా అక్షరమా?
నే పాటనైతే నువ్వు శృతివా పల్లవివా?

నే తోటనైతే ఆమనివా కొయిలవా?
నే జంటకొస్తే నువ్వు ఋషివా మదనుడివా?
నే ఎదుట పడితే పిలిచేవా వలచేవా?
నిను నే పిలువకుంటే అలగవా అడగవా?
నను ప్రేమించమంటే తప్పా? ఒప్పా?

2 comments:

గీతాచార్య said...

Excellent melody it is. Thanks for the lyric.

Also yor commentary is good.

plz remove word verification.

Sandeep said...

Thanks! Removed word verification for comments.