"నిళల్ గళ్" అనే చిత్రంలోని "పొన్మాలై పొళుదు" అనే పాట వైరముత్తు అనే ప్రసిద్ధ తమిళ రచయిత వ్రాసిన తొలి చలనచిత్రగీతం. ఇళయరాజా ఇచ్చిన బాణీ ఎంతో హాయిగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ పాట ఎంతగానో నచ్చిన నాకు దీని అర్థం ఏమిటొ తెలుసుకోవాలనే కుతూహలం కలగడంతో సోదరుడు భాస్కర్ ని అడిగితే, ఆయన ఎంతో ఓర్పుగా వైరముత్తు ఆత్మకథలో ఈ పాట గురించి వ్రాసిన ఘట్టాన్ని మొత్తం అనువదించారు. అనువాదం చదివాక నాకూ ఆ కవి శక్తి ఏమిటో అర్థమైంది. పాటలో గొప్ప ఆశావాదం, ప్రకృతివర్ణన ఉన్నాయి. విన్నాక ఇళయరాజ, భారతీరాజ వంటి మహామహులు ముగ్ధులయ్యారుట.
ఈ పాటకి అనువాదం కాదు కానీ, ఆ బాణీకి తగిన స్ఫూర్తితో తెలుగులో ఏమైనా వ్రాద్దామనుకుంటూ పడుకోబోయాను. కానీ ఎందుకో వెంటనే వ్రాయాలనిపించి లేచి వ్రాస్తున్నాను. కచ్చితంగా ఇది వైరముత్తు పాటతో పోల్చదగినది కాదు. ఏదో చిట్టిచిట్టి భావాలకు అద్దం పట్టాను - అంతే.
చిత్రం: నిళల్ గళ్
సంగీతం: ఇళయరాజ
మూలం రచించినది: వైరముత్తు
గాయకుడు: బాలు
నా దైవం నువ్వే
ఎపుడూ, నా దైవం నువ్వే
ఆగకురా ఓ మనసా!
వీడకురా నీ ఆశ!
కాలం నేర్పిన పాఠమిది
జ్ఞానం చూపిన బాట యిది
మనసును నమ్మిన మానవుడే
చరితలు మార్చే నాయకుడు
నీ పలుకే నా ఉనికై, పయనించే వేళ...
అందలమొకటే జీవితమా?
అందిన సిరులూ శాస్వతమా?
మరణం ఆపని నీ యశమే
నిరతం నిలిచే యవ్వనము
అంతములేని సొంతమదే! అది నాకందించే...
గెలవకపోతేనేం, భయమా?
ఓటమి చూడనిదో జయమా?
మట్టిని తాకిన విత్తనమే
మానై పొందును చేతనము
రెమ్మ ఒడీ, కొమ్మ బడీ విడి సాగే వేళ...
ఈ పాట చదివిన వెంటనే నాకు అనిపించినదేమిటి అంటే, "ఈ పాటకు సినిమా మసాలా పడలేదు. మరీ ఉడకబెట్టి, ఉప్పూకారం చల్లిన కూరలాగా ఉంది". "సరే నిర్మలంగా వచ్చిన భావాన్ని ఎందుకు మార్చాలి ఇప్పుడు? మనం ఎలాగూ సినిమాకవులం కాదు కదా!" అని అనిపించి ఇలాగ వదిలేశాను.
పల్లవిలో "నా దైవం నువ్వే, మనసా!" అనడం నన్ను ఎరిగినవాళ్ళందరికీ కొంచెం జీర్ణించుకోవడం కష్టతరమైన విషయమే. ఎందుకంటే నేను దైవంతో ఎవరినీ/దేనినీ పోల్చను.నా దృష్టిలో, భౌతికమైనదేమైనా పరమాత్మకు ప్రతిరూపమవుతుందేమో కానీ, "ఏవార్థం" (నువ్వే) ఇవ్వదగినది కాదు. సినిమాలో ఇది ఒక యువకుడు కులమతాల గొడవలు లేకుండా ప్రపంచమంతా చక్కగా మారాలనే ఆశాభావంతో పాడతాడు. దానికి తోడు వైరముత్తు తన నాస్తికత్వాన్ని కొంచెం ప్రదర్శించాడు. సరే, సందర్భానుసారం అలాగే వ్రాద్దామని వ్రాశాను.
పల్లవిలో "ఆగకురా ఓ మనసా!" అంటూ మనసుని పుంలింగంలో సంబోధించడం వేటూరికి నేను అక్షరనివాళిగా సమర్పించుకుంటున్నాను. గోదావరి సినిమాలో ఆయన, "మనసా గెలుపు నీదేరా!" అనడం నాకు ఎంతగానో నచ్చింది. విశ్లేషించి చూసుకుంటే పాటలో చాలా వరకు సిరివెన్నెల శైలి కనబడుతోంది నాకు. అంటే ఆయనకు సమానంగా వ్రాశానని కాదు, నేను చెప్తున్నది శైలి గురించి. బహుశః నాకు సినిమాపాటల మీద ఇష్టం ఏర్పడటానికి కారణం ఆయనే కనుక ఇది జరిగి ఉండవచ్చును.
పాటలో ఏవార్థాలు (ఏ-కారం) ఎక్కువే పడ్డాయి. కానీ ఎక్కడా స్వరాలు/మాత్రలు కుదర్చడానికి వాటిని వాడలేదు అనే నా నమ్మకం. సరిచూసుకోవడానికి సంస్కృతంలోకి అనువదించుకుని/ఉన్న పద్యాలతో పోల్చి చూశాను. నాకు తప్పేమీ తోచలేదు. నువ్వే నా దైవం (త్వమేవ శరణం మమ), మానవుడే నాయకుడు/యశమే యవ్వనము (తన కోపమె తన శత్రువు), విత్తనమే-చేతనము (భూమ్యాం పతితం బీజమేవ వృక్షం భవేత్, అన్యత్ నైవ), పలుకే-ఉనికై (తవ ఆజ్ఞా ఏవ మమ జీవనం, అన్యత్ నాస్తి). ఏవార్థం గురించి ఇంత చాదస్తంగా ఎందుకు చూసుకుంటున్నాను అంటే, ఈ మధ్యన సినిమా పాటలు వినీ వినీ ఈ ఏ-కారం అంటే ఒక ద్వేషం ఏర్పడింది. ఆ మధ్యన ఎవరో, "ఏ?" అని అడిగారు ("ఏందుకు?" అని). "ఓరి నీ ఏ-కారం బంగారం కానూ, పదం లేకుండానే వాడి పారేస్తున్నారూ?" అనుకున్నాను. అంత విరక్తి కలిగింది.
14 comments:
ఈ పాట నాకు చాలా ఇష్టం. నాకు తమిళ భావం తెలియదు కానీ నేను కూడా సంవత్సరం క్రితం ఈ ట్యూనుకి తెలుగు పాట రాసుకున్నాను. ఇప్పుడు నీ సాహిత్యం చూస్తే భలే అనిపించింది.
పాటని నువ్వన్నట్టు కొంత edit చెయ్యొచ్చు. అయితే భావాలు బాగున్నాయ్. ముఖ్యంగా ఆఖరి చరణం నాకు బాగా నచ్చింది. "రెమ్మ ఒడి కొమ్మ బడి" - excellent.
చాలా బాగుందండీ. విడమరచి చెప్పడం రాలేదు నాకు.
@@ స్వాతి
మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి అండి :-)
@ఫణీంద్ర
భావాలు నీకు నచ్చినందుకు సంతోషం సోదరా. నువ్వు వ్రాసినది ఇంకా youtubeలో upload చేసినట్టులేదు?
వైరముత్తు అనే కోయిల సిని గగనంలో ఎగరటానికి రెక్కలు తొడిగిన పాట ఇది. అందుకే ఈ పాటంటే నాకు ఎంతో ఇష్టం. దీనికి తెలుగు versionలేదు. ఇంత మంచి ట్యూన్‌కి వేటూరి గారి తెలుగుని అరువుకు తీసుకుని ఉంటే ఎంత బాగుండేది అనుకునే వాణ్ణి. నేనే రాయలనుకున్నాను. అయినా వైరముత్తుగారిమీద గౌరవంతో సాహసించలేదు.
నీ తెలుగు పాట చదివాక, అరె భలే రాసేశాడే వీడు అని ఆశ్చర్యపోయాను. ఒకటికాదు రెండుకాదు మూడు చరణాలు. అదీ మూడో చరణం మొదటి రేండిటికన్న గొప్పగా ఉంది.
గెలువక పోతేనేం, భయమా?
ఓటమి చూడనిదో జయమా?
నిలుచున్న ప్రతివాడూ ఎప్పుడో ఒకప్పుడు పడినవాడే!
మట్టిని తాకిన విత్తనమే
మానై పొందును చేతనుము
గొప్ప భావం!
మనసును నమ్మిన మానవుడే
చరితలు మార్చే నాయకుడు
అధృష్టాన్ని నిందిస్తూ సోమరులవుతున్నవారికి మంచి దెబ్బ ఇది.
మరణం ఆపని నీ యశమే
నిరతం నిలిచే యవ్వనము!
అంతములేని సొంతమది... కొత్త పదాల ప్రయోగం, భావానికి మరింత భలం తెచ్చింది.
ఈ పాటను ఎవరితోనైన కరక్కో పెట్టి పాడిస్తే బాగుంటుందేమో! ప్రయత్నించు!
ఇట్లు
అవినేని భాస్కర్
గెలవకపోతేనేం, భయమా?
ఓటమి చూడనిదో జయమా?
Typical Sirivennela's Style.. Too good.. I read this stanza atleast ten times by now.
One more line I liked in this post is "నాకు సినిమాపాటల మీద ఇష్టం ఏర్పడటానికి కారణం ఆయనే(సిరివెన్నెల) కనుక ఇది జరిగి ఉండవచ్చును." :-)
@అవినేని
నీ విపులమైన వ్యాఖ్య చూసి నాకు చాలా సంతోషం కలిగింది. నేను వ్రాసిన పాటలో లయ అంతగా కుదరలేదు అనిపించింది. Tune కొంచెం తమిళపదాలకు అనువుగా ఉందేమోననిపించింది. ఇళయరాజకున్న గొప్పదనాల్లో అదొకటి - భాషను బట్టి Tune లో చిన్నచిన్న మార్పులు చెయ్యగలరు.
@రమేశ్
నీ అభిమానాపూర్వకమైన వ్యాఖ్యకు కృతజ్ఙుణ్ణి. నాకు సినిమాపాటలపైన అభిమానం కలగడానికి సిరివెన్నెల పాటలు కారణం. వేటూరి సాహిత్యం పట్ల నాకున్న అమితమైన ప్రేమకు కారణం కూడా idlebrain కి సిరివెన్నెల ఇచ్చిన interview-నే. ఆ తరువాత ఆత్రేయ మీద గౌరవం పెరగడానికి వేటూరి కారణం అయ్యారు. అలాగ, తీగె లాగితే డొంకంతా కదిలింది.
సందీప్ గారూ..నాదో చిన్న విన్నపం..
సిరివెన్నెల గారి, సిరివెన్నెల సినిమాలోని "విధాత తలపున ప్రభవించినది" పాటకి అర్ధం విడమరచి చెప్తారాండీ ప్లీజ్..
ఎన్నో వేల సార్లు విన్నా ఆ పాటని. అయినా ఇంకా కొంత అర్ధం కాకుండా మిగిలిపోయిన భావన. నాకెంతో ఇష్టమైన ఆ పాటని సరిగా అర్ధం చేసుకోలేక ఆ పాటలోని మాధుర్యాన్ని సరిగ్గా ఆస్వాదించలేక పోతున్నాననిపిస్తూ వుంటుంది నాకు.
మళ్ళీ ఈసారి ఎప్పుడైనా పాట గురించి టపా రాసేటప్పుడు ఈ పాట గురించి రాయగలరా ప్లీజ్...
@ప్రణీతా స్వాతి
తెలుగు చలనచిత్రసీమ ఉన్నంతవరకూ ఉండిపోయే పాటల్లో "విధాత తలపున" ఒకటి. అది సిరివెన్నెల ఆయన సినిమారంగానికి రాకముందు వ్రాసినది కాబట్టి అందులో భావావేశానికి ఆనకట్ట లేదు, దాన్ని ఎవరూ వెలకట్టలేదు! ఆ పాట గురించి చాలా మంది గతంలో విశ్లేషించారు అని అనుకున్నాను. ఆ పాట మూలం ఆయన వ్రాసిన దాదాపు ఆరు చరణాలు ఉన్న మఱొక పాట. ఆ రెంటినీ కలిపి ఎవరైనా విశ్లేషించారా అని చూశాను. ఎవరూ ఆ పని చేసినట్టుగా లేదు. మరి గూగులమ్మలో కనబడట్లేదు!
సాధారణంగా నేను సిరివెన్నెల పాటలను ఆట్టే విశ్లేషించను. ఎందుకంటే ఆయన పాటల్లో ప్రయోగాలు సులభతరంగా, అందరికీ అర్థమయ్యేలాగా ఉంటాయి. వాటికి వేరేవారి విశ్లేషణ అనవసరం. కానీ, ఈ పాటను గురించి ఎంతైనా చెప్పుకుంటూ పోవచ్చును. ఇప్పటిదాక ఎవరూ చెయ్యలేదు అంటే ఆశ్చర్యంగా ఉంది.
తప్పకుండా వీలు చూసుకుని వ్రాస్తాను అండి!
పొళుదు అంటే పొద్దు కదా, మీ అనువాదంలో ఆ పదం దొరకలేదు? ఏమో లెండి, నాకు తమిళం తెలుసు కానీ, ఈ రేంజులో కాదు.
నిళల్ గళ్ రవి అని ఒకనటుడు ఆ సినిమాతో పేరు సంపాదించాడు. నాకు ఈ సినిమాలో ఇంకోపాట ఇష్టం.."పూమాలయే.." అని వస్తుంది. ఇళయరాజా పాడారు తమిళంలో.
వైరముత్తు అంటే గుర్తొచ్చింది. వాలి సినిమా తెలుసుంటుంది, అందులో ఓ పాట ఇలా..
"నిలమై కొండువా కట్టిలిల్ కట్టివెయ్
మేఘం కొండువా, మెత్తై పోట్టువై.."
"ఆకాశం తెచ్చి మంచంగా వేయి
మేఘాలను పరుపుగా వెయ్.."
పైకి సాధారణంగా ఉన్న గొప్పపాట అది. వీలయితే చూడండి.
@రవి
మీరు చెప్పినది వాస్తవం అండి. ఈ పాటలో "పొద్దు" అనే పదం నేను వాడలేదు. నేను వ్రాసినది ఆ పాటకు అనువాదం కాదు. అలాగే, సినిమాలోని సందర్భానికి కాదు. బాణీ నచ్చి అందులో కొంచెం ఆధునిక ఆలోచనను ఇమిడ్చి వ్రాసిన ఒక స్ఫూర్తిదాయకమైన పాట వ్రాద్దాము అనుకుని వ్రాసినది. నాకు వచ్చిన తమిళం కూడా చాలా తక్కువేనండోయ్! వైరముత్తు ఈ చిత్రంలో చక్కని పాటలను వ్రాశారు. మీరు చెప్పిన పాటలు కూడా వింటాను.
నిలవై కొండువా అని ఆ పదం.
నిలా అంటే జాబిల్లి. జాబిల్లిని తెచ్చి మంచంలో కట్టి ఉంచమని.
హిందీ సినిమా పాటల్లో విరహగీతాల కోసం గూగులిస్తూ ఉంటే ఈ బ్లాగు కంటపడింది....చాలా పోస్టులు మిస్సయ్యాను..మించిపోయినదేం లేదనుకోండి..ఇప్పుడు చదువుకోవచ్చు.
చాలా బాగా రాసారు ఈ పాట..స్ఫూర్తిదాయకంగా ఉంది. సిరివెన్నెల పాటలలాగే. ఒరిజినల్ కి అనువాదం కాదన్నారు కనుక మీ భావ ప్రకటన మీదే కనుక పాట బావుంది.
అంతము లేని సొంతమదే వాక్య భావం మాత్రం నాకు అందలేదు.
పదం లేకుండానే వాడిపారేస్తున్నారూ...ఏకారం మీద మీరు చెప్పిన మాట బహు బాగుంది. తమిళ సినిమా డబ్బింగులు చూసి ఇప్పటి పిల్లలకు బాగా అలవాటయిపోయిన పదప్రయోగం కదా అది. మణిరత్నం సినిమాలో ఒక్కసారయినా భావగర్భితంగా వినబడే మాట అది.
@సుధ గారు
మీ మంచి మాటలకి నెనర్లు. "అంతం లేని సొంతం అదే" అనడం కచ్చితంగా రివాజు ప్రయోగానికి భిన్నంగా ఉంది. "సొంతం" అనేది ఇక్కడ adjective గా కాకుండా, noun గా వాడాను. వ్యాకరణరీత్యా చూస్తే అది దోషమేనేమో అనిపిస్తోంది :(
Post a Comment