వ్యాకరణం -> అలంకారాలు -> శబ్దాలంకారాలు -> ముక్తపదగ్రస్తాలంకరము
లక్షణం: ఒక పాదం చివర వదిలిన పదాన్ని మరల రెండవ పాదం మొదటి పదంగాను, రెండవ పాదం చివర వదిలిన పదాన్ని మూడవ పాదం మొదటి పదం గాను, అలాగే మూడు, నాలుగు పాదాలు కూడా ఉంటే అది ముక్తపదగ్రస్తం అవుతుంది.
ముక్తము అంటే విడువబడింది, గ్రస్తము అంటే తీసుకోబడింది. ముక్తపదగ్రస్తము అంటే "విడిచిపెట్టిన పదాన్ని తిరిగి గ్రహించినటువంటి పద్యం". నాకు తెలిసినంతవరకు, ఇది ప్రతీపాదంలోనూ జరగాలని నియమం లేదు. ఈ అలంకారానికి ప్రత్యేకించి వివరణ అవసరం లేదు అనుకుంటున్నాను. ఈ క్రింది ఉదహారణలో ముద్దగా దిద్దబడిన పదాలను చూస్తే విషయం అర్థమవుతుంది.
ఉదా: (కావ్యాలంకార సంగ్రహం, రచన: రామరాజ భూషణుడు)
సుదతీనూతన మదనా!
మదనాగతురంగ! పూర్ణమణిమయసదనా!
సదనామయగజరదనా!
రదనాగేంద్రనిభ! కీర్తి రస నరసింహా! (1)
ఉదా: (శ్రీవేంకటేశ్వర సుప్రభాతం రచన: అన్నన్ స్వామి)
లక్ష్మీ సువిభ్రమాలోక సుభ్రూవిభ్రమ చక్షుషే
చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళం
ఉదా: (రచన:మల్లాది సాయికృష్ణ ప్రసాద్) (2)
మారమ కనికరమా రమ
మారమణునకు చెప్పి మమ్ము మన్నింపనిచోన్
వాక్యాంతముక్తపదగ్రస్తము:
పాదం చివర విడిచిన పదాన్ని ఆ తరువాతి పాదంలో మొదట పదంగా వాడితే అది ముక్తపదగ్రస్తం. అలాగే వాక్యం చివర విడిచిన పదాన్ని ఆ తరువాతి వాక్యంలో మొదటి పదంగా వాడితే అది వాక్యాంతముక్తపదగ్రస్తము. (వాక్య: వాక్యం, అంత: చివర, ముక్త: విడిచిన, పద: పదం, గ్రస్తము: తీసుకోబడినది).
ఉదా: (వ్యాకరణాదర్శం, రచన: బూరుగుల గోపాలకృష్ణమూర్తి)
మారసుందర! సుందర! ధీరమూర్తి!
మూర్తిగతలోక! లోకప్రపూజితాంగ!
అంగ సంగత గంగ! గంగాంతరంగ!
విశ్వరక్షక! స్వామి శ్రీ వేంకటేశ!
ఇందులో "మూర్తి" అన్నది పాదానికే కాక, వాక్యానికి కూడా చివరన ఉంది. అదే పదంతో ఆ తరువాతి వాక్యం (పాదం కూడా) మొదలయింది. ఇక "లోక", "అంగ" (పూజితాంగ = పూజిత + అంగ), "గంగ" (గంగాంతరంగ = గంగ + అంతరంగ) కూడా వాక్యాలకు చివరన వచ్చి, ఆ తరువాతి వాక్యాలలో మొదట వచ్చాయి. అందుచేత ఇది వాక్యాంతముక్తపదగ్రస్తము.
వాక్యాంతముక్తపదగ్రస్తానికి చలనచిత్రాల్లో ఉదాహరణలు ఉన్నాయి. ప్రస్తుతానికి నాకు గుర్తున్నది ఇది ఒకటి:
ఉదా: (చిత్రం: వరుడు, రచన: వేటూరి)
నలుగు పెట్టినకొద్దీ అలిగింది వయసు. వయసు అలిగినకొద్దీ వెలిగింది మనసు
(1) ఇక్కడి పద్యాలలోని పదాలను నేను సరిగ్గా విభజించానో లేదో తెలియడం లేదు. ఈ పద్యాలకు భావాలు మీకు పూర్తిగా అర్థమయితే వ్యాఖ్య ద్వారా నాకు వివరించగలరు.
(2) ఈయన నేను చదువుతున్న వ్యాకరణం పుస్తకానికి రచయిత.
19 comments:
బాగున్నదండీ మీ ప్రయత్నం. కొనసాగించండి. ఇది కూడా ఓసిరి చూడగలరు.
http://kasstuuritilakam.blogspot.com/search/label/%E0%B0%95%E0%B0%BE%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%82%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B0%9A%E0%B1%82%E0%B0%A1%E0%B0%BE%E0%B0%AE%E0%B0%A3%E0%B0%BF%28%20%E0%B0%9B%E0%B0%82%E0%B0%A6%E0%B0%83%20%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3%E0%B0%AE%E0%B1%81%20%29
@బాలకృష్ణమూర్తిగారు
మీరు వ్యాకరణాన్ని వివరించడం మొదలుపెట్టారని నేను చూసుకోలేదు. మీ ప్రయత్నం అమోఘం. తప్పకుండా కొనసాగించండి. నా బోటివారికి అవి పుస్తకాలతో సమానం. నా వ్యాసాల్లో ఏమైనా తప్పులుంటే సరిదిద్దగలరు.
ఈ టపా చూసిన రోజునుంచీ జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను కానీ, గుర్తుకు రావట్లేదు. చేమకూరి వెంకటకవి, సుభద్రను వర్ణించే పద్యం ఒకటి (అచ్చతెనుగు) కొన్ని నెలల క్రితం చూసి, భట్టీ పట్టాను. అది గుర్తుకే రావట్లేదు.
పోనీలెండి. అన్నట్టు ఈ అలంకారాలు చూస్తూ, అప్పుడప్పుడూ నేనేమైనా ప్రయోగించగలనా అని చూస్తున్నాను. దగ్గరగా వస్తోంది తప్ప, సఫలం కావట్లేదు. చూద్దాం.:-)
@రవి
అలంకారాలు, అనుకుని వాడితే రావడం కష్టమని నా చిట్టి అనుభవం. మీరు వ్రాసుకుంటూ వెళ్ళండి - ఎక్కడో ఒక్కాడ తగులుతాయి. నాకు అలంకారాల గురించి తెలియనప్పుడు, ఒకసారి పోతన పద్యం విని (మామావలువలు..), సందర్భం కుదిరినప్పుడు అలాగే (యమకంతో) ఒక పద్యం వ్రాశాను.అది వ్రాసిన మూడేళ్ళకి తెలిసింది అది యమకమని :-P అప్పట్లో రోజుకి ఒక పద్యం వ్రాయాలని నియమంగా వ్రాశాను కాబట్టి అలాగ ప్రయోగాలు చెయ్యడానికి వీలైనది అని నా అభిమతం. మీకు సలహా ఇచ్చేంత వయసు, అనుభవం లేదనుకోండి. చిన్న అనుభవాన్ని పంచుకుంటున్నాను అంతే :)
>>మీకు సలహా ఇచ్చేంత వయసు, అనుభవం >>లేదనుకోండి.
ఏం చెప్పాలో తెలియట్లేదు. సరే. :-)
సుదతీ నూతనమదనా - స్త్రీలకి నవమన్మథుడా
మద నాగ తురంగ - మదించిన ఏనుగు వాహనంగా కలవాడా
పూర్ణ మణిమయ సదనా - మణిమయమైన భవనంలో ఉండేవాడా
సత్ + అనామయ గజ రదనా - మంచి ఆరోగ్యవంతమైన ఏనుగు దంతాలవంటి పటిష్టమైన పళ్ళు కలవాడా
రద నాగేంద్ర నిభ - (ఇది కొంచెం అనుమానం) మంచి దంతాలు కలిగిన గజేంద్రము వంటి వాడా
నాకు పరిచయమైన మొట్టమొదటి ముక్తపదగ్రస్తం చిన్నప్పుడు కంఠస్థం చేసిన మయసభ - దుర్యోధన ఏకపాత్రాభినయంలోది.
"వివిధ ఫలభరానత శాఖాశిఖా తరువర విరాజితంబు. రాజిత తరుస్కంధ సమాశ్రిత దివ్య సురభిళ పుష్పవల్లీ మతల్లికా సంభాసురంబు. భాసుర పుష్ప గుచ్ఛ స్రవన్మధుర మధు రసాస్వాదనార్థ సంభ్రమద్భ్రమర కోమల ఝంకార నినాద మేదురంబు. మేదుర మధుకర ఘన ఘనాఘన శంకా నర్తన క్రీడాభిరామ మాయూర వార విస్తృత కలాపి కలాపరమణీయంబు..." ఇలా సాగుతుంది.
వీటిలో ఏ పద్యమండీ గురువు గారూ !
సీ.
నెఱికొప్పుఁ గొన గోర నిమిరినయంతనే
తళుకు లేముద్దుఁ జెక్కిలి చెమర్చెఁ;
దళుకులేముద్దుఁ జెక్కిలి నొక్కినంతనే
వలిగుబ్బ చనుఁగవ పులకరించె;
వలిగుబ్బ చనుఁగవ నలిమినయంతనే
నతనాభినీవిబంధము ప్రిదిలె;
నతనాభినీవిబంధము నంటినంతనే
తను వెల్లఁ బరవశ త్వంబు నొందె;
తే.
నవలఁ జెప్పెడి దేమి ! యా నవరసికుఁడు
తావిచెంగావిచక్కెరమోవి గ్రోలి
కుసుమశరుకేళి నేమేమిగుఱుతు లిడెనొ
బాల యెఱుఁగదు సౌఖ్యాబ్ధిఁ దేలి యపుడు. 222
సీ.
వీఁగు కొప్పున సాము విరిదండ వెలిఁ గ్రమ్మ
గమ్మ కస్తురిబొట్టు చెమ్మగిల్లఁ,
దనువున మేల్పూఁత తావిమాత్రము చిక్కఁ,
జిక్క చన్గవ సరుల్ చిక్కు వడఁగ,
క.
రావక్క, వక్కలాకులు
కోవక్క ; శుభోత్తరముగ గొబ్బున విభుచే
నీవక్క ; సేవ చేయుము
నీ వక్కఱ కలిగి రమణునికిఁ జిత్తము రాన్.
సీ.
ఆ హార మిం పౌ కుచాగ్రమానక యున్న
నాహార మింపుగా దబ్జవదన !
చెఱకుఁబా లొదవు వాతెఱ యీనిచో గంతు
చెఱకుఁ బా లౌదునే చిగురుఁబోణి !
కళలు దేఱెడు నెమ్మొగంబు ముద్దిడ కున్నఁ
గళలు దేఱవు సుమీ కంబుకంఠి !
వలఱేని దురమున నలరింప కున్న న
వ్వల రే నిదురరాదు కలువకంఠి !
చే.
నేడు కాదు గదే ప్రేమ నీకు నాకు !
నాటియున్నది మదిఁ జిన్ననాఁటినుండి ;
యిటుల నేకాంతసమయ మెన్నఁటికి దొరకు ?
నేల తప్పించుకొనియెదవే లతాంగి ? 194
క.
అరచందమామ నేలిన
దొరగా నెన్నుదురు నెన్నుదురు బిత్తరికిన్ ;
బరువంపు మొల్ల మొగ్గల
దొరగాఁ బల్కుదురుఁ బల్కుదురు జవ్వనికివ్. 78
ఎన్నెన్ని సార్లు చదివినా గానీ మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే మధుర కావ్యం విజయవిలాసం. చేమకూర కి ఎన్నిసార్లు నమస్కరించుకుంటామో గద ! నా కిష్టమైన మరో పద్యం
"అత్తవారింట సకల భాగ్యంబు లున్న ,
మగని మీఁదటఁ దన కెంత మక్కువున్న
నాఁడుబుట్టువు పుట్టింటి కాసపడును
గావున, సుభద్ర యొకతీరుగాఁక నుండె"
ఈ పద్యం చదివిన తర్వాత నా కర్థం అయింది, మా ఆవిడ అస్తమానం పుట్టింటికి వెళతానని యెందుకు అంటుందో !
@భైరవభట్లవారు
చక్కగా వివరించారు పద్యాన్ని. ఇంతకీ, దుర్యోధనుడి ఏకపాత్రాభినయం ఎవరు వ్రాసింది? వివరాలు ఇస్తే వ్యాసంలో చేరుస్తాను అండి.
@వేదులవారు
గొప్ప పద్యాల గురించి చెప్పారండి! ఎంతద్భుతమైనవి. ఏమైపోయింది ఆ సాహిత్యమంతా అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు! 'వక్కాతో రెండక్షరాల ప్రాస వేశారు చేమకూరవారు.
@సినిమాపాటల కోసం వెతికే వారు
"మహర్షి" సినిమాలో, "మాట రాని మౌనమిది, మౌనవీణ గానమిది, గానిమిది నీ ధ్యానమిది, ధ్యానములో నీ ప్రాణమిది" అని వెన్నెలకంటి ఒక ప్రయోగం చేశారు. అది ముక్తపదగ్రస్తానికి దగ్గరగా అనిపించింది.
అలాగే "పంతులమ్మ" చిత్రంలో "ఎలదేటి పాట చెలరేగె నాలో, చెలరేగి పోవే మధుమాసమల్లే! ఎలమామితోట పలికింది నాలో, పలికించుకోవే మదికోయిలల్లే!", "మరుమల్లెతోట మారాకు వేసే, మారాకు వేసే నీ రాకతోనే! నీ పలుకు పాటై బ్రతుకైనవేళ, బ్రతికించుకోవే నీ పదముగానే!" అని చేసిన ప్రయోగాలు ముక్తపదగ్రస్తం కాకపోయినా దగ్గరగా తోచాయి.
శ్రీ శంకరాచార్యులవారు రాసిన "షట్పది" లో
ఉద్ధృత నగ! నగభిదనుజ! దనుజకులామిత్ర! మిత్రశశిదృష్టే!
దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవ తిరస్కార:
అని వస్తుంది.
ఈ విషయం అప్పుడే రాశాననుకున్నాను.
నే రాసిన ఓ కవితపై ఒక కామెంటులో ముక్తపద అలంకారం ఛాయలున్నాయని ఓ పెద్దాయన అంటే ఏమో అనుకొన్నాను. ఇప్పుడు అర్ధమైంది. థాంక్యూ వెరీ మచ్ ఫర్ ద ఇన్ఫో బాస్
http://sahitheeyanam.blogspot.com/2011/09/blog-post_23.html
బహుసా మీరన్నట్టు ఫలానా అలంకారంలో పద్యం రాయాలని ప్రయత్నిస్తే, రాయలేమేమో. రాసిన వాటిలో వెతుక్కోవటం బెటర్
బొల్లోజు బాబా
గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది?
చిత్రం: మూగ మనసులు
ముక్తపద గ్రస్తాలంకారం గురించి రెండు రోజులుగా వెతుక్కుంటూ మళ్ళీ వచ్చాను. చాలా ఆకర్షణీయమైన శబ్దాలంకారం కదండీ ఇది.
కాళిదాసు రఘువంశంలోని శ్లోకం:
ఆకారస్సదృశ ప్రజ్ఞః
ప్రజ్ఞయా సదృశాగమః |
ఆగమైః సదృశారంభః
ఆరంభైః సదృశోదయః ||
నిన్న ఇది గుర్తొచ్చింది.
ఇంతకూ ఇక్కడ చెప్పదల్చుకున్నదేమంటే - టీటీడీ వారీ మధ్య ముద్రించిన పుస్తకం ఒకటి మొన్న కొన్నాను. ఆ కావ్యం పేరు - చక్రవాళమంజరి. మంజరీద్విపద కావ్యం ఇది. దీని కర్త - తాళ్ళపాక పెదతిరుమలయ్య. ఈ కావ్యం మొత్తం పాదపాదానికీ - ముక్తపదగ్రస్తాలంకారం! ప్రతి పాదాంతంలోనూ చివరి రెండక్షరాలను యథాతథంగా తర్వాతి పాదం మొదట ఉపయోగించాడు. కావ్యం ఆరంభం లోని "శ్రీల" అన్న అక్షరాలతో కావ్యం ముగుస్తుంది కూడానూ.
అంతా చేసి ఈ కావ్యం "పనికట్టుకుని" అపసోపాలు పడ్డట్టుగా కాక చాలా హాయిగా, పాటపాడుకునే విధంగా వ్రాశాడు ఆ కవి. (తాళ్ళపాక అన్నమయ్య మనవడు).ఆసక్తి, వీలు దొరికితే చదవండి.
చాలా ఉపయోగకరమైన వ్యాఖ్యను పంపారు అండి, నెనర్లు. అన్నమాచార్యుల మనవడు కూడా సాహితీసేవ చేసారు అని తెలిస్తే చాలా సంతోషంగా ఉంది.
కాళిదాసు పద్యానికి నా పొగడ్త సముద్రుడికి నీటిబిందువు దానం ఇచ్చినట్టుంటుంది. కాస్త ఆ పద్యం సందర్భం, తాత్పర్యం వివరించగలరు అని మనవి.
1)మదనాగ-తురంగ-పూర్ణ మణిమయసదనా = మదించిన ఏనుగులతో,అశ్వాలతో నిండిన;మణులతో కూడి ఉన్న భవనంకలవాడా!
2)రదనాగేంద్ర కీర్తినిభ! = నాగేంద్రదంతాలవంటి(తెల్లనైన/స్వచ్ఛమైన/పటిష్టమైన) కీర్తిచే ప్రకాశించువాడా!
ఈ విధంగా అర్థం చెప్పవచ్చు అంటారా?
స్కూల్ లో చదువుకున్న తెలుగు వ్యాకరణం! మీ ఈ పోస్టు, దాని కి ఇక్కడ రాసిన కామెంట్లు … very resourceful అండి. నేను ముక్తపదగ్రస్తం గురించి వెతకడానికి కారణం నాకు పరిచయమైనా ఓ అన్నమాచార్య కీర్తన ..
(॥పల్లవి॥)
అలమేలుమంగవు నీవౌనే పతిఁ జేకొంటివి
నెలకొని యీ చేఁతలు నీవే నేరుతువే
(॥అల॥)
మొగము చూడఁగనే ముంచుకొను నగవులు
నగఁగనే పెనగొని నాఁటుఁ దగులు
తగులఁగఁ దగులఁగాఁ దమకము చిగిరించు
చిగిరింపునాసలు చిమ్మిరేఁచువలపు
(॥అల॥)
పలవఁగా వలవఁగా వడిఁబెట్టుఁ దలఁపులు
తలఁచఁగా నోరికబ్బు తానే పిలుపు
పిలువఁగాఁ బిలువఁగాఁ బెనలుఁగొనుఁజెలిమి
చెలిమి గడుఁ జేయఁగా చెలరేఁగు మనసు
(॥అల॥)
మనసు పెట్టఁ బెట్టఁగా మల్లడిగొను ననుపు
ననుచఁగా ననుచఁగా నంటు లెనయు
యెనయఁగా శ్రీవేంకటేశుఁ డేలేగుట్టు గను
కనుఁగొనఁగానే చెంగలించు మొగము
చరణాలలో ఈ అలంకారం కనిపిస్తోంది .. చరణానికి చరణానికి మధ్య కూడా ఇది continue చేశారు అన్నమయ్య! ఇందాక కామెంటు లో పెద్ద తిరుమలాచార్య గురించి వచ్చింది … ఇప్పుడు ఆయన తాతగారు కూడా వాడారు అని తెలిసి భలే గా అనిపించింది!
చాలా అందమైన అలంకారం ఇది. ఇటువంటి పద్యాలననేకం ఓచోట కూర్చగలిగితే ఎంత బావుంటుందో కదా.
ఇంత మంచిగా ఇంత ప్రోత్సాహకరంగా వున్న తెలుగు బ్లాగులు ప్చ్ కాలగతి లో నేడు ముక్కుతూ మూల్గుతూ కనబడటం శోచనీయం.
జిలేబి
మీ యెక్క వివరణ . నాలాంటి తెలుగు వ్యాకరణం నేర్చుకోవాలి అనుకున్న ఔత్సాహికులు చాలా ఉపయోగపడుతుంది . కృతజ్ఞతలు
telugu cinema paatala lo kooda ee mukta pada grastam vaadaaru
student No.1 lo ok paata
sakuni dubbing film lo kooda vaadaru
gamanichandi
Post a Comment