Sunday, June 20, 2010

నన్ను పోలిన మనిషి

మన ఇళ్ళల్లో చాలా మంది, ఒక బిడ్డ పుట్టగానే వాడి పోలికలను పసిగట్టేస్తుంటారు. "ఆ ముక్కు చూడు, అచ్చం వాళ్ళ నాయినమ్మే" అని ఒకడంటే, "ఏడిశావు, వాడివన్నీ వాళ్ళ అమ్మమ్మ పోలికలే" అనేవాడు మఱొకడు. ice-creamలో ఆవకాయబద్దలాగా బిడ్డ పుట్టాడన్న ఆనందం పక్కనే, "మా పోలికలున్నాయని చెప్పే నాథుడెవడూ లేడా?" అని తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. "పూజారికి లేక పస్తులుంటుంటే భక్తుడొచ్చి పొంగలి అడిగాడు" అన్నట్టు మేనమామలు, మేనత్తలూ కూడా పోలికలలో వాటాకొస్తుంటారు. ఇన్నాళ్ళూ లోపల ప్రశాంతంగా ఉన్నాను, బయటకి ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను అని ఆ బిడ్డకు అనిపిస్తుందేమో. దానికి ప్రతీకారంగా క్రమేపీ తన ఫ్యాన్సు అంచనాలకు అందకుండా పోలికలు మార్చేసుకుంటూ వెళ్తాడు/వెళ్తుంది. మొదట తండ్రి పోలిక అనిపించినవాడు, రెండు నెలలకు పూర్తిగా తల్లిపోలిక అనిపిస్తాడు. ఈ వేడుకంతా మా అన్నయ్యకు పిల్లాడు పుట్టినప్పుడు దూరం నుండి వీక్షించాను కానీ, మొదటిచెయ్యి అనుభవం  (first-hand experience) లేదు.

చిన్నప్పుడు "వీడికి మేనత్త పోలిక" అంటూ ఉండేవారు (ఆవిడా నా లాగే కొంచెం చామంచాయ, చాదస్తం - ఏ పని చేసినా (భోజనానికి కూర్చున్నా) మూడు సార్లు చెయ్యడం అలవాటు). ఇది పక్కన పెడితే, నాకు చిన్నప్పటినుండి ఎక్కడికి వెళ్ళినా, "అరే, అచ్చం మీలానే ఇంకోళ్ళను చూశానే" అనేవాళ్ళు తగుల్తూనే ఉన్నారు. మొదట్లో ఉత్సాహపడేవాడిని "హాయ్, నాలాగే ఇంకోడా? దొంగమొగుడు, రౌడీ అల్లుడు ఇత్యాది సినిమాల్లో చిరంజీవి లాగా నాకూ డూప్ ఉన్నాడు అన్నమాట" అనుకునేవాణ్ణి. (చిన్నప్పుడు మెము చిరంజీవి ఫ్యాన్సు. మా అమ్మమ్మ మాకు ఉత్తరం వ్రాసి చివర్లో, "చిరంజీవి దీపు బాగా చదువుకుంటున్నాడని ఆశిస్తున్నాను" అంటే, మా తమ్ముడు బనీన్ వేసుకుని, చొక్కా బటన్లు విప్పేసి, "చూడండిరా, అమ్మమ్మ కూడా చెప్పింది. నేనే చిరంజీవి. కావలిస్తే gang-leader సినిమాలో కూడా చిరంజీవి last తమ్ముడే, చూసుకోండి", అనేవాడు). క్రమేపీ ఆ ఉత్సాహం నిట్టూర్పుగానూ, ఆ నిట్టూర్పు చిరాకుగానూ, ఆ చిరాకు ఆందోళనగానూ మారాయి. అది ఏమిటి? ఎందుకు? ఎలాగ? అని అడక్కముండే చెప్పేస్తాను.

మొట్టమొదటిగా నాకు ఈ అనుభవం మంగలికొట్లో ఎదురయ్యింది. నేను వెళ్ళి క్యూ-బల్లపై ఈనాడు పత్రికలోని సినిమాశీర్షిక చదువుతూ కూర్చున్నాను. నా వంతు వచ్చేసరికి వెళ్ళి సింహాసనాధిరోహణం గావించాను. అక్కడ కత్తెర వెయ్యడానికి చెయ్యి లేపిన మంగలి ఒక్కసారి ఆగి, ఆ కుర్చి వెనక్కు తిప్పి, "బాబొ, మీకు మొన్ననే గాందా కట్టింగ్ సేసాను? మల్లీ ఇంత జుత్తెట్టొచ్చేసిందె?", అని అడిగాడు. మా ఎకనామిక్స్ క్లాసులోలాగా వెర్రిముఖమేసుకుని ఒకసారి వాడి మొహంకేసి చూశాను. "నువ్వెవరనుకుని అంటున్నావో కానీ, మా అమ్మ నన్ను కొడుతుందేమో అని భయమేసినప్పుడు తప్పితే నేను క్షవరం చేయించుకోను. నేను రెండు నెలలుగా అసలు మంగలినే చూడలేదు", అన్నాను. దానికి అతను, "ఓరోరె, ఐతే మీకులాంటోడికే నేను మొన్న కటింగ్ చేసానొ. ఆల్లు ఈ పక్కన సూరోల్ల యీదిలోనే ఉంటారు. మీరేడ ఉంటారేటి?" అంటూ ఇంక నా పుట్టుపూర్వోత్తరాలు, పూర్వతరాలు గురించి అడగడం మొదలు పెట్టాడు. అసలే కృష్ణుడికి నెమలిపించం పుట్టుకతో వస్తే ఇలాగే ఉంటుంది అన్నట్టు నా తలపైన జుత్తు దానంతట అదే నుంచుంటుంది. ఆశ్చర్యానికి లోనైన మంగలి ఏ కంగారు-లోనైన దాన్ని పురికొలుపుతాడేమో,"పురి విడిచిన నెమలి"-ని అవుతానేమోనని నా భయం సంగతి అటు ఉంచితే, అప్పటినుండి నాకు నా సరూపుణ్ణి చూడాలనే ఉత్సాహం మొదలైంది. అది ఎప్పుడూ జరుగలేదు.

ఆ తరువాత మేము తుని విడిచిపెట్టి విశాఖపట్నం వెళ్ళాము. మధ్యలో ఏదో పని ఉండి తుని మళ్ళీ వెళ్ళాను. నా దారిని నేను పోతుంటే నాకు ఉడిపీ లక్ష్మీభవన్ కనబడింది. అది మా ఇంటిల్లిపాదికీ ఇష్టమైన వుటేలు. మసాలదోశ మీద మనసుతో లోపలికి వెళ్ళాను. అక్కడ ఆ ఓనరు, "అప్పా, మీ నాన్నగారు రాలేదా?" అని అడిగాడు. చదువులకోసమని మా అన్నదమ్ములము అక్కడ ఉన్నాం తప్పితే మా నాన్నగారు తునిలో ఉన్నది తక్కువే. అందుచేత "ఇతనికి మా నాన్నగారు ఎలాగ తెలుసు", అనుకుంటూ, "రాలేదు. ఆయన ప్రస్తుతం బిసీగా ఉన్నారు" అని చెప్పి టోకెన్ కోసం నేను పదిరూపాయలు ఇచ్చాను. ఇస్తున్నానే కానీ మనసు వెనకాల ఎక్కడో, 'నాన్నగారు తెలుసంటున్నాడు. "మీ దగ్గర డబ్బులు తీసుకోవడమేమప్పా" అని ఆ పది వెనక్కిచ్చేస్తాడేమో', అని అనిపించింది. కానీ, ఆల్-అవుట్ ఎడ్వర్టైస్మెంటులో కప్ప దోమని నాలుకతో కబళించినట్టు ఈ అప్ప నా చేతిలో ఉన్న పదినోటుని సంగ్రహించి టోకెన్ ఇచ్చాడు. సరే ఎవడిదో సొమ్ము మనకెందుకులే అనుకున్నాను. కాకపోతే చిక్కు ఎక్కడ వచ్చిందంటే, నేను దోశ తుంపుకుని చట్నీలో ముంచినప్పుడల్లా వాడు నా వంక చూసి చిరునవ్వులు చిందించడం మొదలెట్టాడు. ఆ దోశ వెనకాల ఇంకా మైసూరు బజ్జీ, సాంబార్వడ, పూరీ మొదలుగా కలిగిన పదార్థాలను తిందామనుకున్న నాకు ఎందుకో ఇబ్బందిగా అనిపించి సగం నిండిన మనసుతో (అంటే, కడుపు నిండింది అనుకోండి) బయటకు వచ్చేశాను. అక్కడికి నాకు నా సరూపుడంటే ఉత్సాహం పోయింది, చిరాకు వచ్చింది.

ఆ తరువాత వైజాగులో మా అన్నదమ్ములం ముగ్గురమూ ఆసుపత్రికి వెళ్ళాము. అక్కడ మరీ సినిమాలో చూసినట్టైంది. నాకు ఒకమ్మాయి ఎదురయ్యింది. ఆ అమ్మాయి గతంలో నాకు నచ్చిన మఱొక అమ్మాయిలాగా కనిపించడంతో ఒక్కసారి అలాగ కళ్ళార్పకుండా చూశాను. (తరువాత ఈ ప్రక్రియనే సైటు కొట్టడం అని పిలుస్తారని తెలుసుకున్నాను.) ఆ అమ్మాయి నా కళ్ళల్లో ఏం చదివిందో తెలియదు కానీ, నాకేసి చూస్తూ సిగ్గుపడటం మొదలెట్టింది. ఇంతలో నా ఆత్మా'రాముడూ', "ఏంటిది, నగర్రపౌరులు చూస్తున్నారు. ఒళ్ళు/కళ్ళు దగ్గరపెట్టుకో", అన్నాడు. నేను కాస్త తలతిప్పుకుని వెళ్ళిపోయాను. ఇంతలో అచ్చం మా అన్నయ్యలాగే ఉన్న ఒక వ్యక్తి నా కళ్ళెదురుగా వెళ్ళాడు. కాకపోతే అతనికి గెడ్డం ఎక్కువ ఉంది. మా అన్నయ్యకి, అతనికి కొంచెం ముఖకవళికల్లో భేదం ఉంది (సరిగ్గాచూస్తే గుర్తు తెలియడానికి వీలయినంత) అనుకుని అలాగే కళ్ళార్పకుండా చూస్తూ అతను కారిడార్లోకి వెళ్ళాక నేను మా అన్నయ్యకి, తమ్ముడికి ఆ విషయం చెప్పాను. ముగ్గురం ఆలోచిస్తుండగా నా పక్కనుండి ఈ సరీ మరీ నాకు డూపులాగా ఉండేవాడు (పరిమాణంలో కూడా భేదం లేదు కానీ, కొంచెం గెడ్డం గీసుకుని నీట్ గా ఉన్నాడు) కనబడ్డాడు. ముఖమైతే shame to shame. అదే ఆవదం తాగి నవ్వుదామని ప్రయత్నించేవాడి ఫేసు. వాడూ నాకేసి అదోలా చూస్తూ వెళ్ళిపోయాడు. "ఇది ఆసుపత్రా? మయసభా?", అనుకుని మేము ముగ్గురం ముక్కున వేలేసుకున్నాము.

ఇంతకీ ఈ గోలంతా ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అంటే, నిన్న నేను మౌంటెన్ వ్యూలో, ప్యాసేజ్ టు ఇండియా బేకరీ అనే చోటుకు వెళ్ళాను. అక్కడ టోకెన్ ఇచ్చేవాడు కూడా, "మీ ఫ్యామిలీ ఇక్కడ ఉంటుందా?", అని అడిగాడు. నేను కొంచెం అనుమానంగా చూస్తూ, "లేదు", అన్నాను. వాడు, "మీ లాగే ఉండే ఒక పాప మా రెష్టారెంటుకు వస్తూ ఉంటుందండి", అన్నాడు. "ఆఖరికి నీ పోలికతో అమ్మాయి కూడా ఉందిరా శాండీ (నన్ను నేను పిలుచుకునే ముద్దుపేరు)", అనుకుంటుండగా, "Are you sure?", అన్నాడు. నాకు చిర్రెత్తుకొచ్చి, "లేదు. ఆ అమ్మాయి నా కూతురే. వాళ్ళమ్మ మీద అలిగి ఇంట్లోంచి పారిపోయి వచ్చాను. నువ్వేమైనా ఫ్రీగా ఇంత ముద్ద పాడేస్తావా?", అని అడగాలనిపించింది. వాడు మళ్ళీ నా ముఖంలోకి డెంటిష్టు చూసినట్టు చూసి, "As it is. ఆ అమ్మాయి గలగలా మాట్లాడుతూ ఉంటుంది, చాలా చిలిపి పిల్ల.", అన్నాడు. ఇవి కచ్చితంగా నా పోలికలే. అందరూ నన్ను గలగల (పోనీ, లొడా లొడా) మాట్లాడుతున్నావని అంటారు. చిలిపిదనంలోనూ నాకు కొన్ని సెర్టిఫికేట్లు ఉన్నాయి. అప్పుడు నాకు కంగారు పట్టుకుంది. ఏవేవో ఆలోచనలు. "అమ్మోవ్, ఇదేమిటి పవిత్రబంధం (నాగేస్సర్రావుది) సినిమాలాగుంది? అసలే ఈవేళ పొద్దున్నే 'గాంధి పుట్టిన దేశమా ఇదీ?' అని పాడుకున్నాను కూడా. నేను నాలుగేళ్ళ క్రితం కూడా మౌంటెన్ వ్యూ వచ్చానాయె. ఇది కల కాదు కదా? ఇంకా నయం గరళ-ఫ్రెండ్ తో వచ్చుంటే గరళం తాగించేది. పెళ్ళాం తో వస్తే చెళ్ళుమనిపించేది. అన్నదమ్ములతో వస్తే అనుమానాలొచ్చేవి. friendsతో వస్తే బ్రతుకు facebook అయిపోయేది. మన అదృష్టం బాగుండి ఆ పిల్ల ఈ చుట్టు పక్కల లేదు. లేకపోతే విక్రమార్కుడు సినిమాలాగా అయ్యేదేమో!" - ఇలాగ అనేక ఆలోచనలు కలిగి ఆందోళన మిగిలింది. అప్పుడు వాడితో "అచ్చం నాలాగే ఉందా? ఉండే ఉంటుంది. మరి నా ఫేసు పరమబోరింగు ఫేసు కదా? ఎక్కడ పడితే అక్కడే ఉంటుందన్న మాట. నువ్వటు తిరుగమ్మ, కొంచెం అటు తిరుగు. అద్ది, అద్ది అలాగ నీ కంప్యూటర్కేసి చూడు. అలాగన్నమాట. నా లాగే ఉన్న అమ్మాయి. అచ్చం. మే బీ, ఆడం, ఈవ్-ల దగ్గర మొదలయిన వంశవృక్షంలో అందరికంటే పైకి ఉన్నది పొక్కునూరి వంశమేనేమో. అయ్యో! ఏది ఆ ఏప్లీస్ కాయేది? నేను ఇక్కడున్నాను ఏమిటి? అడవిలో ఉండాలి కదా? 'అహా నా డూపు అంటా, ఒహో నా డూపు అంటా, అహ నా డూపు అంట ఒహొ నా డూపు అంట, వాడు నేను సేమంట, నాకు మంట ఒళ్ళంత, ఢాం ఢాం ఢాం'" అని బ్రహ్మానందం స్టైల్లో అనాలనిపించింది. అయినా (వాడెదురుగుండా) నోరు మూసుకుని, భోజనం చేసి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. ఏమవుతుందో చూడాలి.

13 comments:

కాంత్ said...

"ఇది ఆసుపత్రా? మయసభా?" డైలాగు అదిరింది. BTW, అచ్చం ఇలాంటిదే బ్లాగు ఎక్కడో చదివానే. బహుశా మీ డూప్ రాసేడనుకుంటా (just kidding).

మీలా ఉండే వాళ్ళు మొత్తం ఏడుగురిలో ఇంకా ఐదుగురు మీకు ఎదురుపడాలి. విసుగుచెందక వెతకండి.

ramnarsimha said...

Very very very very very very...

fu...........nny..

Thanq..

ప్రణీత స్వాతి said...

హ..హ..హ..హ..హ..హ..చాలా బాగుంది సందీప్ గారూ..

ప్రణీత స్వాతి said...

చిన్న రిక్వెస్ట్..కొద్దిగా ఫాంట్ సైజు పెంచగలరా ప్లీజ్.

Sandeep P said...

@ప్రణీత స్వాతి

ఫాంట్ సైజ్ పెంచాను అండి. ధన్యవాదాలు :)

ప్రణీత స్వాతి said...

సందీప్ గారూ..మీ బ్లాగ్ "శాస్త్రి" చాలా బాగుందండీ. అలా వదిలేశారేం? అందులో కూడా టపాలు రాస్తూ వుండండి.

Sandeep P said...

@ప్రణీత స్వాతి

మంచి ప్రశ్న అడిగారండి. ఒకప్పుడు రోజూ అరగంట కూర్చుని ఆలోచించి వ్రాసేవాణ్ణి ఆ పద్యాలు. నా కవితాప్రస్థానంలో తొలిమెట్లు అవి. మధ్యలో కొంచం ఆలోచనలలో పరిపక్వత, కవిత్వంలో అనుభవం, భావనలలో కొత్తందనం కోసం తీసుకున్న విరామం నాకు బద్ధకాన్ని మప్పేసింది. మొదలెడతాను - ఈ ఆదివరం నుండి మళ్ళీ మొదలెడతాను. మీ ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు. :-)

రవి said...

డబల్ ఏక్షన్ బాలయ్య ఫ్లాపు సినిమా కథలాంటి దయనీయమైనదన్న మాట మీ కథ. అయితే ఏ అమ్మాయైనా ఆ మాటంటే మాత్రం తీసిపారెయ్యకండి. అమ్మాయిలతో పరిచయం పెంచుకోవాలంటే యూత్ వాడే అస్త్రం, "నిన్నెక్కడో చూసినట్టుందే!" ...ఏమో అమ్మాయిలూ ఇదే అస్త్రం వాడుతారేమో?

Ashwin said...

chaala haasyoktanga undi !! chaala rojula taruvata manchi telugu article chadivanu .. mukhyanga nacchinadi

" ice-creamలో ఆవకాయబద్దలాగా బిడ్డ పుట్టాడన్న ఆనందం పక్కనే, "మా పోలికలున్నాయని చెప్పే నాథుడెవడూ లేడా?" అని తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు " ..... :D :D :D

thnx!!

Sandeep P said...

@రవి

మీరు బాలయ్య గురించి అన్న మాటలు చూస్తే ఎవరైనా ఫ్యాన్సు మీ బ్లాగులో విధ్వంశం సృష్టించే అవకాశం ఉంది - తస్మాత్ జాగ్రత్త :) మీరన్న "మిమ్మల్నెక్కడో చూసినట్టుందే" డయలాగుని గుర్తుపెట్టుకుంటా. ఎవరైనా అమ్మాయి ఆ మాట పొరబాటున అన్నా, hint తీసుకుని చెలరేగిపోతాను.

@అందరూ
నా వ్యాసం మీకు నచ్చినందుకు సంతోషం అండి :)

Anonymous said...

awesome andi..chala bagundi..chala sepu navvukunnanu..inka ilantivi chala rayandi please!

Sandeep P said...

thanks, mythoughtsonline

@All
OK - ఈసారి ఏకంగా TVలోనే నా లాంటి వాడు. ఎవరో శ్రీరాం అని Indian Idol 5 లో participant అట. మా friend నన్ను శ్రీరాం అని పిలవడం మొదలెట్టాడు.

'''నేస్తం... said...

mi blog eeroje chuse adrustaniki nochukunnanu.. inthakalam ee manchi blog miss aiyaaanu..

Chaaaaalaaaa baagundi..
Bhujam meeda junnu kaavidi petkuni aidaraabaadu lo alludi gaari adddress kosam thirigina lb sreeram laagaa thiruguthunna naaku..
mee blog evadi gola vaadidi cinema lo climax remix song frnds tho chusi enjoy chesinantha aanandam ga undi....

Thanks,