వ్యాకరణం -> అలంకారాలు -> శబ్దాలంకారాలు -> యమకాలంకారము
లక్షణం: పౌనరుక్తేన ద్వయోర్వ్యంజేన యుగ్మయోః
అర్థం: రెండు లేక, అంతకంటే ఎక్కువ అక్షరాలు ఉన్న పదాలు తిరిగి తిరిగి, అర్థభేదం కలిగి ఉంటే అది యమకాలంకారము.
యమకం అంటే సంస్కృతంలో "జత" అని అర్థం. అదే అక్షరసమూహాన్ని రెండుసార్లు (లేక అంతకంటే ఎక్కువసార్లు) వాడుతున్నారు కాబట్టి యమకాలంకారం అయ్యింది.
వృత్త్యనుప్రాసలో అర్థం ప్రసక్తి లేదు. "అక్షరాలు పదే పదే వస్తున్నాయా? లేదా? ", అన్నదే ప్రశ్న. ఉదాహరణకి "భూషణములు సెవులకు బుధతోషణములనేక..." అని అన్నప్పుడు "షణములు" అనే అక్షరాల సమూహం మళ్ళీ వచ్చింది కానీ, "షణములు" అనే అక్షరసమూహానికి అర్థం ఏమీ లేదు. అలాగే, "ష", "ణ, "మ", "ల" గుణింతాలలోని అక్షరాలు వరుసగా వచ్చాయి. లాటానుప్రాస అంటే అదే పదానికి తాత్పర్యభేదం ఉండాలి కానీ, అర్థభేదం ఉండకూడదు. యమకాలంకారానికి అర్థభేదం ఉండి తీరాలి.
ఛేకానుప్రాస అంటే అదే అక్షరసమూహానికి అర్థభేదం కలిగి, పక్కపక్కనే (అవ్యవధానంగా) రావాలి. యమకాలంకారానికి పక్కపక్కన రావాలనే నియమం లేదు. అంటే, ఆ అక్షరసమూహం తిరిగి వచ్చేలోపు వేరే అక్షరాలు/పదాలు ఉండాలి. ఉదాహరణకి "వంద వందనాలు" అన్నది ఛేకానుప్రాస అవుతుంది, "వందలకొలది వందనాలు" అన్నది యమకం అవుతుంది.
ఉదా: (చిత్రం: సీతాకోక చిలుక, రచన: వేటూరి)
ఓ చుక్కా, నవ్వవే! నావకు చుక్కానవ్వవే
"ఓ చుక్కా, నవ్వవే" అంటే "ఓ నక్షత్రమా, నవ్వుమా!" అని. రెండోసారి "చుక్కానవ్వవే" అంటే "చుక్కాని + అవ్వవే" అని. పూర్వం నావికులు నక్షత్రాలను బట్టి దిశను గుర్తించేవారు. "చుక్కాని" అనేది పడవలో ఒక భాగం. నావకు దిశను చూపించడం దాని ఉపయోగం. ఈ వాక్యంలో ప్రియుడిని తన జీవితానికి దిశను నిర్దేశించమని ఒక అమ్మాయి అడుగుతోంది. అందుకని కవి, రెండు వేర్వేరు ఉపమానాలతో అదే భావాన్ని వ్యక్తపరిచాడు. "చుక్కనవ్వవే" అనే అక్షరాలను తిరిగి వచ్చేలాగా వాడాడు కనుక, ఇది యమకాలంకారం అవుతుంది.
సినిమా పాటల్లో యమకాలంకారం విరివిగా వాడబడింది. నాకు తెలిసిన మరి కొన్ని ఉదాహరణలు.
ఉదా: (చిత్రం: శుభలేఖ, రచన: వేటూరి)
నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు కనుక
జడ-కుచ్చులు అంటే స్త్రీలు జడలోని అల్లిక. మెడకుచ్చులు = "మెడకు + ఉచ్చులు" . అమ్మాయి జడలోని కుచ్చులు అబ్బాయి మెడను బంధిస్తున్నాయి (వాటి చక్కందనంతో కట్టిపారేస్తున్నాయి) అని భావం.
ఉదా: (చిత్రం: గమ్యం, రచన: సిరివెన్నెల)
విందడిగారే అందాలని, ముందుకు రారే అందాలని (అందాలని: అందాలను(ద్వితీయావిభక్తి), అందాలి+ అని)
నిన్నొదిలి పోలేరమ్మ, ఓ పోలేరమ్మ (పోలేరమ్మ: పోలేరు + అమ్మ, పోలేరమ్మ (పేరు) )
ఉదా: (చిత్రం: పౌర్ణమి, రచన: సిరివెన్నెల)
ఎపుడో కన్న తీపికల, ఎదురౌతుంటె దీపికల
శివనివేదనగ అవనివేదనగ పలికిన పదము పరేశ
ఈ ఉదాహరణలో వృత్త్యనుప్రాసకి, యమకానికి మధ్యలో భేదం సన్నగిల్లుతోంది. ఎందుకంటే, "పికల"/"వనివేదనగ" అనే అక్షరసమూహానికి అర్థమే లేదు, ఇంక అర్థభేదమేమిటి? అయినా దీనిని యమకంగా కొందరు చెప్పుకుంటారు. నా వరకు నాకు ఇది వృత్త్యనుప్రాస అనిపించింది.
సినిమావాళ్ళే ఇంతలా వాడారు అంటే మన పద్యకర్తలు విడిచిపెడతారా? పద్యకావ్యాలనుండి కొన్ని ఉదాహరణలు:
ఉదా: (శ్రీమదాంధ్రమహాభాగవతం, రచన: పోతన)
(నరకాసురవధ)
లేమా! దనుజుల గెలువగ
లేమా? నీవేల కడగి లేచితి? విటురా;
లే మాను మానవేనిన్,
లే! మా విల్లందుకొనుము లీలం గేలన్
"లే, మ " -- ఎన్నిసార్లు వచ్చిందో చూసుకోండి. మఱొక్కటి:
(గోపికా వస్త్రహరణం)
మా, మా వలువలు ముట్టకు
మామా! కొనిపోకు పోకు మన్నింపు తగన్
మా మానమేల కొనియెదు
మా మానసహరణ మేల మానుము కృష్ణా!
అది పోతన అంటే! తేనెల జలపాతం కదటండీ తెలుగు భాగవతం? అందుకే వేటూరి, "పోతన్న కైతలన్నీ పోత పోసుకున్నాడే మా మువ్వాగోపాలుడు", అని అన్నాడు.
ఉదా: (విజయవిలాసం, రచన: చేమకూర వేంకట కవి)
మనసుభద్రమయ్యె మన సుభద్రకు
మీకు తెలిసిన యమకాలంకారప్రయోగాలు ఇంకా ఏమైనా ఉంటే వ్యాఖ్యల ద్వారా తప్పక తెలియజేయండి. ముఖ్యంగా నాకు తెలిసిన పద్యాలు తక్కువ. అందుచేత మీకు తెలిసిన పద్యాలు నాకు తప్పక తెలియజేయగలరు.
13 comments:
మీ వివరణ చాలా బావుంది సందీప్ గారు.శాస్త్రీ బ్లాగు లో పద్యాలు కూడా బావున్నాయి
@శ్రీకాంత్
నా వ్యాసం, బ్లాగు మీకు నచ్చడం చాలా సంతోషంగా ఉంది శ్రీకాంత్ గారు.
చాలా చక్కగా వివరించారు. ఈ శ్లోకమూ యమకాలంకారమనుకుంటాను.
http://blaagadistaa.blogspot.com/2008/10/blog-post_11.html
బాగుందండీ. తెలుగు బాషకు సంబందించి ఒక కొత్త విషయం నేను తెలుసుకున్నాను.
మంచి వ్యాసం. పోతన పద్యాలు తెలియజేసినందుకు thanks.
సినిమా పాటల విషయానికి వస్తే వేటూరి ఈ అలంకార పరంగా చేసినన్ని ప్రయోగాలు ఇంకెవరూ చెయ్యలేదేమో అనిపిస్తుంది -
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ
I love you, ఓ హారికా, నీ ప్రేమకే జోహారికా
కాస్తందుకో దరఖాస్తందుకో ప్రేమ ధర కాస్తందుకో
ఓ చెలికాడా, ఈ చెలి కాడ ఇదేం రగడ
యమునకు చెప్పమ్మా సాయమునకు వెనకాడొద్దని...
ఇంకా ఎన్నున్నాయో!
@రవి
మీ వ్యాసం చదివాను అండి. నాకు బాగా నచ్చింది. ఆ పద్యంలోని అలంకారాలు వ్యాఖ్యలద్వారా చెప్తాను. మీ అభిమానానికి ధన్యవాదాలు!
@సునీల్
చాలా సంతోషం అండి. మీకు తెలిసిన ఉదాహరణలు ఏమైనా ఉంటే తప్పక చెప్పగలరు.
@ఫనీంద్ర
అవును. వేటూరి ఈ అలంకారాన్ని చాలా ఎక్కువగా వాడారు. నేను చదువుతున్న వ్యాకరణం పుస్తకంలో ఈ అలంకారానికి "ఓ హారికా, జోహారిక" అన్నది ఉదాహరణగా సూచించారు. అలాగే వృత్త్యనుప్రాసకు "ఇందువదన కుందరదన..." చెప్పారు :)
"అచ్చెరువును, అచ్చెరువున" -- ఇది ఛేకానుప్రాస అవుతుంది. ఆ విషయం ఇదివరకు వ్యాసంలో చెప్పాను.
"మరులన్ని మనవి అన్న మనవి చేసుకుంటా"
బాపూ గారి సినిమాలో పాటండీ, ఎవరి రచనో తెలియదు
బాగుంది
🙏👏👏👏
వ్యాసం చాలా ఉపయోగ కరము గా ఉన్నది ...Thank you sir
వ్యాసం చాలా ఉపయోగ కరము గా ఉన్నది ...Thank you sir
చాలా చక్కగా వివరించారు
"విజయ విలాస కావ్యమున వెంకట సత్కవిదెల్పినయట్టి ఒకానొక పల్కుటందముల" లో ఇది బాగా ప్రసిద్ధి గదా? ఇది యమకమే కదా?
'అమ్మకచెల్ల, నాదు మనమమ్మక చెల్లదు వీనికెంతయున్..."
-సుదర్శన్
Post a Comment