Friday, June 11, 2010

చిట్టికథ - అన్ని విద్యలనీ గౌరవించాలి

(ఈ కథకు మూలం ఏమిటో నాకు తెలియదు. పెద్దలనుండి విని చెప్తున్నదే. అందుచేత ఏమైనా తప్పులుంటే చెప్పగలరు. ఈ వ్యాసం ఏదో ఒక శాస్త్రాన్నో, విద్యనో, ఎవరో ఒక వ్యక్తినో, సమూహాన్నో విమర్శించడానికో, కించపరచడానికో వ్రాయలేదు. ఎక్కడైనా పొరబాటు కనిపిస్తే తప్పక తెలియజేయగలరు. నేను వెంటనే సవరిస్తాను.)

పూర్వం ఒక బ్రాహ్మడు పొరుగూరుకెళ్దామనుకున్నాడు. దానికి ఒక నది దాటాల్సివచ్చింది. ఆ నది మీద పడవ నడిపే వాడు (రేవుబోయ) ఒకడు అక్కడ కూర్చున్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మడు అతడిని తన పడవలో నది దాటించమన్నాడు. ఆ బోయ సరేనన్నాడు. ఇద్దరూ కలిసి పడవలో నది మీద సాగుతున్నారు.

 ఇంతలో బ్రాహ్మడు ఆ బోయని, "ఏమయ్యా, నువ్వు భాగవతం చదివావా?" అని అడిగాడు. ఆ బోయ, "అబ్బే నాకు చదవడం రాదు సాములు", అన్నాడు. దానికి ఆ బ్రాహ్మడు నివ్వెరబోయి, "అయ్యో, ఐతే నీ జీవితంలో సగభాగం వృథా చేసుకున్నావయ్యా", అన్నాడు. ఆ బోయ "అయ్యో" అన్నట్టు చూశాడు. అప్పుడు బ్రాహ్మడు, "పోనీ మహాభారతం విన్నావా?", అని అడిగాడు. "లేదు సాములు", అన్నాడు బోయ. దానికి ఆ బ్రాహ్మడు మరింత ఆశ్చర్యపోయి, "మహాభారతంలో లేనిది ఈ ప్రపంచంలో లేదు. మహాభారతంలో ఉన్నవన్నీ ఈ ప్రపంచంలో ఎక్కడో జరుగుతూనే  ఉంటాయి. అది వినకపోవడం నీ దురదృష్టం", అన్నాడు. మళ్ళీ బోయ కించిత్ బాధపడ్డాడు. ఆ తరువాత బ్రాహ్మడు, "కనీసం రామాయణం తెలుసునా?" అన్నాడు. అది కూడా తెలియదన్నట్టు తల అడ్డంగా ఊపాడు బోయ. దాంతో బ్రాహ్మడు "అయ్యయ్యో, అఙ్ఞానంతో నీ జీవితాన్ని నదికి, పడవకి అంకితం చేసుకోకు, ఇవన్నీ తెలియని జన్మ నిరర్థకం", అన్నాడు.

కొంతసేపు ఆగి ఆ బోయ "సాములు, మీకు ఈత వచ్చా?" అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మడు, "ఈతదేముందయ్య? అది నీళ్ళను ఈదడానికే పనికొస్తుంది. భవసాగరాన్ని ఈదడానికి పనికిరాదు", అన్నాడు. బోయ, "ఐతే గొప్పచిక్కొచ్చిపడింది సాములోరు. నది పోటెత్తుకుంది. ఇంకాసేపటిలో పడవ పగిలిపోతుంది. అప్పుడు నది ఈదుకొని దాటాలి. నాకు ఈత వచ్చు. మీకు రాదాయె!", అన్నాడు. ఒక్కసారిగా ఆ బ్రాహ్మడు "అమ్మో, ఇప్పుడెలాగ? నన్నెలాగైనా కాపాడు బాబు. నీకు దండం పెడతా!", అని ఆ బోయని వేడుకున్నాడు.

కథ అంతే! ఈ కథ వినగా నాకు స్ఫురించిన విషయాలు చెప్పదలుచుకున్నాను. అవి:

1. నిజంగా భవసాగరంలో చిక్కుకుపోయిన బోయని చూసి బ్రాహ్మడు జాలిపడితే, వాడికి పనికొచ్చే రెండు మంచిముక్కలు ("బాబూ, రామాయణంలోని నీతి చెప్తాను, విను" అనో, "హరినామస్మరణ మహత్మ్యం తెలుసుకో", అనో) చెప్తే బాగుండేది. అంతే కానీ, అవతలవాడి విద్యనో, వృత్తినో తక్కువ చేసి మాట్లాడటం తప్పు. ఎవరి ధర్మం వారిది. అన్నీ వృత్తులూ ఉండబట్టే ఈ భౌతికప్రపంచం సాగుతోంది కదా?

మనం కూడా ఇంజినీరింగు కాలేజీలలో చూస్తూ ఉంటాము, "అరే నీది ఫలానా బ్రాంచా? ఎందుకురా? కంప్యూటర్ సైన్సో, ఎలెక్ట్రానిక్సో తీసుకోవచ్చును  కదా?", అని అంటూ ఉంటారు. వాళ్ళల్లో, "సరే, నాకు ప్రోగ్రామింగ్ నేర్పుతావా?", అని అడిగితే నేర్పేవాళ్ళెంతమంది. అది కూడా ఈ బ్రాహ్మడి జాలి/విఙ్ఞానం వంటిదే!

2. నిజంగా అంత భవసాగరాన్ని ఈదేటువంటి విఙ్ఞానం, స్థితప్రఙ్ఞత ఉన్నవాడే ఐతే అట్టి ప్రమాదంలో భగవంతుణ్ణి ధ్యానించాలి, ప్రాణభయం లేకుండా చెయ్యగలిగినదేదో తెలుసుకోవాలి, గత్యంతరం లేకపోతే పరమాత్ముడిపై ధ్యానాన్ని నిలిపి "నీవే దిక్కు" అనాలి (గజేంద్రమోక్షంలో లాగా) కానీ, వెంటనే కంగారు పడితే "చదివిందంతా నాలుకపైనే ఉంది, మనసులోకి వెళ్ళలేదు" అని అర్థం.

ఇది కూడా మనం నిత్యజీవితంలో చూస్తూ ఉంటాము. కొంతమంది "ఆర్ట్ ఆఫ్ లివింగ్", "పర్సెనాలిటీ డెవెలప్మెంట్" వంటి కోర్సులు చేస్తూ ఉంటారు. వారికి శమము ఆ కోర్సులో ఉన్నంతసేపే ఉంటుంది కానీ, ఆ తరువాత కనబడదు. గతంలో నేను కూడా భగవద్గీత పదే పదే చదివుతూ, తలుచుకుంటూ ఉండేవాడిని కానీ చిన్న విషయాలకు కూడా కోపపడేవాడిని. ఒక రోజు మా తమ్ముడు నాతో అన్నాడు, "ఇంత చిన్న విషయాలకు కూడా కోప్పడితే ఇంక నువ్వు చదివిన భగవద్గీత నీకేమి మప్పిందిరా అన్నయ్య?", అని. అప్పటినుండి కొంత శాంతం అలవరుచుకున్నాను.

8 comments:

త్రినేత్రుడు said...

బ్రాహ్మల మీద కబుర్లు,సెటైర్లు ఆపండెహే

తిక్క తింగరోడు said...

ఈరలెవెల్లొ గోకేసినవన్నా... మస్తుగజెప్పినవ్

Sandeep P said...

నేను ఊహిస్తూనే ఉన్నాను. ఎవరో నేను బ్రాహ్మల మీద వ్రాసిన సెటైర్ అనుకుంటారని. అఙ్ఞాతగారు అననే అన్నారు.

@అఙ్ఞాత
నేనూ జన్మతః బ్రాహ్మడినే. మహాఛాందసుడినని స్నేహితులు, ఇష్ట్పడిన అమ్మాయి, అన్నదమ్ములు, అమ్మనాన్నలూ కూడా అనుకునేవాణ్ణి. నా బ్లాగుకి కులాల రంగు లేదు. దయచేసి ఆ కోణంలో చూడకండి.

తిక్క తింగరోడు said...

అన్నా సందీపన్నా!, నేనూ బ్రాహ్మడినే!. నాకైతే నువ్వేం సెటైరేసినట్లనిపించలేదన్నా! అసలు నువుజెప్పిన కహానిలో మతలబు "అన్నీ విద్యలు గొప్పవని!". ఇందులో కులం ప్రసక్తి ఎక్కడుంది. పేరు జెప్పుకోని తొక్క (*) లందరూ అఙ్ఞాతల పేరుతో ఏదో ఒకటి కామెంటేస్తారు. అన్నీ పట్టిచ్చుకోవద్దన్నా!. గీకేసెయ్య్. తిక్కరేగిపోవాలంతే...........

Malakpet Rowdy said...

Very well said ....


అంతే కానీ, అవతలవాడి విద్యనో, వృత్తినో తక్కువ చేసి మాట్లాడటం తప్పు. ఎవరి ధర్మం వారిది. అన్నీ వృత్తులూ ఉండబట్టే ఈ భౌతికప్రపంచం సాగుతోంది కదా?
_____________________________________


మాట్లాడ కుండా ఎవరినీ ఆపలేం. They quote their Freedom of Expression! కానీ అవతలవాడు కూడా (Using the same Freedom) నీ విద్యని వృత్తిని అవమానించగలడని గుర్తించి దానికి సిధ్ధపడితే చాలు. పై కధలో జరిగింది అదే!

Bhãskar Rãmarãju said...

:)
>>నేనూ జన్మతః బ్రాహ్మడినే. మహాఛాందసుడినని స్నేహితులు, ఇష్ట్పడిన అమ్మాయి, అన్నదమ్ములు, అమ్మనాన్నలూ కూడా అనుకునేవాణ్ణి. నా బ్లాగుకి కులాల రంగు లేదు. దయచేసి ఆ కోణంలో చూడకండి.
బాగుందయ్యా

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

ఈ కథకి అన్ని విద్యలూ గొప్పవే అనే పేరు సరిపోతుందనుకుంటాను.

Sandeep P said...

@ మందాకిని
మీ సూచన మేరకు వ్యాసానికి పేరు మార్చాను అండి. కృతఙ్ఞతలు.