Sunday, November 16, 2008

గరికిపాటి వారి వ్యంగ్యం

సియాటెల్ లో గరికిపాటి నరసింహరావుగారు రామాయణం మీద ఒక ఉపన్యాసం ఇచ్చారు. అందులో హనుమంతుడి ఔన్నత్యాన్ని గురించి చెప్తూ ఒక చిన్న చమత్కారం విసిరారు. దాని సారాంశం.

మనం ఎవరైనా గొప్ప పని చెయ్యగానే, వాడు కులమతజాతిరాష్ట్రదేశాలలో ఏదైనా ఒక దాని రీత్యా మనవడు అని ఋజువు చేసుకుందామని చూస్తాము. ఎక్కడో గాని రామాయణం గురించి చర్చ చేస్తుంటే "అయ్యా, హనుమంతుడు రాష్ట్రం వాడు", అని అడిగారుట. ఇంకా అక్కడి గురువు ఏమి చెప్పకుండానే ఎవరో, "తమిళుడు. వనరులందరూ సౌత్ ఇండియన్స్", అన్నాడు. ఇది విన్న మరొకడు, "బాగుందయ్యా, రాముడు, సీత మాత్రం అయోధ్యలో పుట్టి హనుమంతుడు తమిళనాడులో ఎందుకు పుడతాడు? అతడు కూడా యు.పీ. వాడే", అన్నాడుట. మరొకడు "మీరు మనిషి చేసే పనిని బట్టి అతడు జాతివాడో తెలుసుకోవాలి. ఒకడు తనది కాని పనిలో వేలుపెట్టి, సొంత టికెట్ కొనుక్కుని సముద్రం కూడా దాటి, ఎవరికో విషయం చెరేసి, అక్కడ నగరం అంత తగలెట్టి వచ్చాడు అంటే - అది కచ్చితంగా తెలుగు వాడే అయ్యుండాలి", అన్నాడుట. చూసి చూసి, అటువైపుగా వెళ్తున్న ఒక ముస్లిం, "హనుమాన్ మా వాడే", అన్నాడుట. "అదేమిటయ్యా? హనుమంతుడిని ముస్లిం అని ఎలాగా చెప్తున్నావు?", అన్నాడుట. దానికి వాడు, "పేరు బట్టే చెప్పచ్చు. సులేమాన్, జలేమన్ లాగా హనూమాన్", అన్నాడుట.

ఇంట కదా చెప్పిగూడా నేను ఇలాగ చెప్పడం బాగోదు ఏమో కానీ, గరికిపాటి నరసింహారావుగారు మాకు బంధువు :) మొన్న నవంబర్ 14 వ తేదిన వారు "పాండురంగ మహాత్మ్యం" మీద వ్యాఖ్యానించడానికి బెంగుళూరు వచ్చినప్పుడు కలిసాను.

Friday, November 7, 2008

బాలాయనం ~ 1

చిన్నపిల్లల చేష్టలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు, వాళ్ళ కోరికలు అన్నీ సరదాగా, నవ్వుగా ఉంటాయి. అలాంటివి కొన్ని ఇక్కడ చెప్తాను.

~~
మా అన్నయ్య కొడుకు ఏడాది వయసులో బాగా కుస్తీ పట్టి "కావా" అనే పదాన్ని తెలుసుకున్నాడు. అంటే "కావాలి" కి షార్ట్ కట్ అన్నమాట. వాళ్ళ అమ్మ, నాన్న అన్నిటినీ "నీకు ఇది కావాలా?", అని అడిగితే, దానికి వాడు "కావా" అని చెప్తాడు. మొన్నవాళ్ళ మేనత్తకు బాగా చిరాకు తెప్పిస్తే, "ఏం? దెబ్బలు కావాలా?", అని అడిగింది. వాడు పాపం నిజంగానే ఏదో తినేది అనుకుని "కావా", అని ఆశగా ఎదురు చూసాడు.

~~
విశాఖపట్నం వెళ్దామని మా ఫ్యామిలీ అందరూ ట్రైన్ లో కూర్చున్నాము. అప్పుడు ఒక పిల్లడు, వాళ్ళ అమ్మ, అమ్మమ్మ ట్రైన్ ఎక్కారు. వాళ్ల నాన్న టాటా చెప్పి వెళ్ళడం చూసాక వాడు ఏడవటం మొదలుపెట్టాడు. వాళ్ళ అమ్మమ్మ, "ట్రైన్ లో వెళ్ళాలంటే టికెట్ కావాలా? మీ నాన్న అది తీసుకురావడానికే వెళ్ళాడు?", అన్నారు. దానికి వాడు ఊఁ కొట్టి కొంతసేపటికి సైలెంట్ అయ్యాడు.
ఏదో పిచ్చా పాటి మాట్లాడుతూ నేను వాడిని పేరు, ఊరు అడిగాను. "నీ పేరు ఎంటిరా", అంటే "మై నేమ్ ఇస్ ప్రజేష్", అన్నాడు. "మీ నాన్న ఎం చేస్తూ ఉంటాడు", అన్నాను. దానికి వాడు "టికెట్ తెస్తున్నాడు", అన్నాడు. వారిని, నీకు ఎంత నమ్మకం రా మీ నాన్నమ్మ మాటల మీద అనుకుని ముక్కున వేలేసుకున్నాను. ఇక్కడ ఇంకో విశేషం ఉందండోయ్, వాడికి వాళ్ళమ్మ రామాయణం మొత్తం నేర్పించింది. ఎంత వరకు అంటే, "సంపాతి, లంకిణి" మొదలైనవాళ్ళు కూడా తెలుసును వాడికి!
~~
నా చిన్నప్పుడు (రెండు ఏళ్ళు అనుకుంటాను) నేను తెగ అల్లరి చేసేవాడిని. మా వదిన ఒకావిడ నన్నుఆట పట్టిస్తోంటే, నేను గోల చేస్తున్నాను. చూసి, చూసి మా అమ్మగారు నన్ను నాలుగు దెబ్బలు వేసింది. ఏడుస్తున్న నన్ను వదిలి మళ్ళీ వంటగదిలోకి వెళ్లారు. అప్పుడు వదిన ఆటపట్టించడానికి ముందుకు ఒంగి, "ఎరా రామకృష్ణ, మీ అమ్మ నీకు బొబ్బట్లు పెట్టినట్టు ఉంది? నాకు సగం పెట్టావా?", అంది. నేనెంత వేదవానో నాకే తెలియదు, ఇంక ఆవిదకేమి తెలుస్తూంది? నాలుగుని కరెక్ట్ గా రెండు భాగాలు చేసి, చెంప మీద రెండు దెబ్బలు వేసేసి వెళ్ళిపోయాను. అప్పుడు మొదలైంది, నేను మా చుట్టాలకి షాక్ ఇవ్వడం.

Saturday, October 25, 2008

సంగీతసాహిత్యసమలంకృతే...

నాకు సరస్వతీదేవి అంటే అధికమైన ప్రేమ. సరస్వతీదేవి కళ్ళల్లో నాకు జ్ఞ్యానం, ధర్మం, కరుణ మొదలైన సద్భావాలు కనిపిస్తాయి. సరస్వతీదేవి గురించి మన సినిమాల్లో ఎన్నో పాటలు వ్రాసారు. వేటూరి, సినారె, సిరివెన్నెల మొ|| కవులు ఎన్నో విధాలుగా పొగిడారు.

వీటిల్లో నాకు బాగా గుర్తుండిపోయే పాట "స్వాతికిరణం" చిత్రంలో "సంగీతసాహిత్యసమలంకృతే" అనే పాట. ఈ గీతకర్త "సినారె". ఎంతో లలితంగా వ్రాసిన ఈ పాటకి మామ కే.వి. మహదేవన్, పుహళేంది చేకూర్చిన సంగీతం జాతీయ అవార్డు పొందింది అన్న సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. పూజ్యుడు మహదేవన్, ఆయన సంగీతంలో కనబడే సత్వగుణం నాకు వేరేవారి పాటల్లో కనబడలేదు అని చెప్పాలి. మహానుభావుడు మామకి నమస్కరిస్తూ ఈ పాట గురించి చెప్తాను. పాట మొత్తం సంస్కృతంలో ఉంటుంది అండోయ్.

సంగీతసాహిత్యసమలంకృతే, స్వరరాగపదయోగసమభుషితే
హే భారతీ మనసా స్మరామి, శ్రీ భారతీ శిరసా నమామి

భారతీ అనేది సరస్వతీదేవి పేరు. సంగీతసాహిత్యాలతో చక్కగా అలంకరించబడిన, స్వరాలతో కూడిన రాగాలతో, పదాల అల్లికతో అలరారే సరస్వతీదేవిని మనస్ఫూర్తిగా తలుచుకుంటాను, శిరస్సు వంచి నమస్కరిస్తాను.

వేదవేదంతావనవాసినీ, పూర్ణశశిహాసినీ

"వేదం, వేదాంతం అనేది వనంలో జీవించే దానవు నీవు. పూర్ణచంద్రుని వలె భాసించే హాసం కలదానావు నీవు. "

ఇక్కడ వేదం, వేదాంతం మధ్యన భేదం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ రెండు పదాలు పడని వాళ్లు ఈ ఖండం విడిచి తక్కినది చదువచ్చు.

"వేదం" అంటే "తెలుసుకోదగినది" అని అర్థం. అది జ్ఞ్యానం. పాంచభౌతిక ప్రపంచాన్ని విడిచి వెళ్ళేది కాదు. భౌతికమైన వృద్ధి, లబ్ది కోరి ఏమేమి చెయ్యచ్చు అనేది చెప్పేవి వేదాలు. అవి సత్వ, రజ, తామస గుణాలకు అతీతం కావు. అవి మనిషి ధర్మాధర్మాలు, బాధ్యతలూ, కట్టుబాట్లు తెలిపేవి మాత్రమే. ఇందులో యజ్ఞాలు, యాగాలూ మొదలైన సందర్భాలకి అగ్ని, వాయువు మొదలైన దేవతలను ఏ విధంగా తృప్తి పరచాలో చెప్పేవి.

"వేదాంతం" అంటే "జ్ఞ్యానానికి చివరిది" అని అర్థం. వేదాంతం తెలుసుకోవడం అంటే "బ్రహ్మాన్ని తెలుసుకోవడం". భగవద్గీతలో శ్రీకృష్ణుడు వేదాలను రక్షిస్తాను అని చెబుతూనే కర్మకాందని ఖండిస్తాడు. అది సామాన్యమైన యోగమని, దానితో పరమాత్మని/బ్రహ్మాన్ని చేరుకోవడం కష్టమని చెబుతాడు. ఈ సత్వ, రజ, తమో గుణాలకు అతీతంగా "భక్తిగుణం" తోనే తనను చేరుకోవడం సులభమని చెప్తాడు.

వేదానుసారంగా బ్రతికేవాడికి, కర్మలాచరించేవాడికి ఉన్నతమైన మరుజన్మ లభిస్తుంది. భౌతిక లబ్ధి (డబ్బు, భార్య, బిడ్డలు, పాడి, పంట, సుఖం మొ||) సిద్ధిస్తుంది. అదే వేదాంతం ఎరిగి "దానిని ఆచరించినవాడికి", మరుజన్మ ఉండదు. వాడు పరమాత్మను చేరుకుంటాడు.

నాదనాదాంతపరివేషిణీ, ఆత్మసంభాషిణీ

నాదం అంటే (లయబద్ధమైన) శబ్దం. "పరివేష్టించుట" అంటే "చుట్టుముట్టుట" అని అర్థం. "అమ్మా, నువ్వు సంగీతం మధ్యలో కొలువైయున్నదానవు" అనే భావం ఒక సంస్కృతభూయిష్టమైన, నాకు మహాయిష్టమైన రీతిలో చెప్పాడు కవి. "అత్మసంభాషిణీ" అంటే "తనలోనే మాట్లాడుకునేది" అని అర్థం. నా లాంటివాళ్ళు లోడలోడా వాగుతూనే ఉంటారు. జ్ఞ్యానులు అత్యవసరమైనది మాత్రమే మాట్లాడతారు. వారిది ఆత్మానందం. పరమాత్ముడి గురించి ఆలోచిస్తూ, దృష్టిని అక్కడ లగ్నం చేస్తూ తమలో తామే ఆనందిస్తారు.

వ్యాసవాల్మీకివాగ్దాయినీ, జ్ఞ్యానవల్లీ, సవుల్లాసినీ

"వ్యాసుడు, వాల్మీకి వంటి మహాకవులకు, మహాజ్ఞ్యానులకు మాటను ప్రసాదించిన దానవు. జ్ఞ్యానం అనే తీగావు. ఎల్లప్పుడూ ఉల్లాసం కలిగించేదానావు నీవు. "

ముందు వాక్యమ్లో సంగీతం గురించి మాట్లాడిన కవి, ఇప్పుడు సాహిత్యం (రామాయణం, భరతం, భాగవతం, పురాణాలు, ఇవన్ని సాహిత్యం, జ్ఞ్యానానికి పరాకాష్టలు) చెప్పడం బాగుంది. ఈ మహోన్నతమైన గ్రంధాలు చదువుతుంటే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి, మనస్సుకు ఊరట ఉల్లాసం కలగట్లేదు అంటే అది దురదృష్టమనే చెప్పుకోవాలి.

బ్రహ్మరసనాగ్రసంచారిణీ, భవ్యఫలకారిణీ

"బ్రహ్మ యొక్క నాలుకపై నడిచేదానా, నీవు శుభాలను చేకూర్చే వేల్పువు."

ఏ మహాపురుషుడికైనా భార్య కూడా గొప్పదైతే కలిగే కీర్తి వేరు. విష్ణువు లక్ష్మిని గుండెలో పెట్టుకుంటే, శివుడు పార్వతికి అర్థశరీరాన్ని ఇచ్చాడు. అలాగే బ్రహ్మ నాలుక సరస్వతికి స్థానం. ఆమె అక్కడ ఉండుటవలనే ఆయన చెప్పినదల్లా జరుగుతోంది. ఆయన మాటకు అంత శక్తి లభించింది.

సరస్వతీదేవి కరుణ ఉన్నవారి వాక్కు ఫలిస్తుంది. ఎందుకంటే సకలవిద్యలకు ఆమె దైవం. ఆమె అనుగ్రహంతోనే మనిషికి విద్య లభిస్తోంది. విద్యలేని వాడి మాట ఎలాగ ఫలిస్తుంది? [ విద్య అంటే "టెక్స్ట్ బుక్స్ లో చెప్పేది" అని మాత్రం దయచేసి అనుకోకండి. విద్య అంటే అది ఆట కావచ్చు, పాట కావచ్చు, ఆర్ట్ కావచ్చు ... ఏదైనా స్కిల్ ].

నిత్యచైతన్యనిజరూపిణీ, సత్యసందీపిణీ

నిత్యచైతన్యం ఎవరికీ ఉంటుంది? ఆ పరబ్రహ్మను ఉపాసించే వారికి, వేదాంతం ఎరిగినవారికి ఉంటుంది. అటువంటి రూపం పరబ్రహ్మకు అద్దం పడుతుంది. మనుషులకు సత్యాన్ని బోధిస్తుంది.

సత్యం అంటే అదేదో "ట్రూత్" అనుకోకండి. నిజానికి సత్యానికి తేడా ఉంది. నిజం భౌతికప్రపంచంలో కాలానికి కట్టుబడి ఉంటుంది. సత్యం కాలానికి, ఈ ప్రపంచానికి అతీతమైనది. ఒక్క మాటలో చెప్పాలి అంటే, సత్యం అనేది నిజం కంటే గొప్పది. ఉదాహరణకి బ్రహ్మజ్ఞ్యానం లోని మర్మాలు సత్యాలు.

సకలసుకళా సవున్మేషిణీ, సర్వరసభా సంజీవినీ

అన్ని కళలనూ వికసింపజేసేది దానవు. అన్ని రసభావాలనూ బ్రతికించేది దానవు.

"రసము" అంటే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఇక్కడ "స్పిరిట్" అనే అర్థంలో వాడినట్లు అనిపిస్తోంది. "భావము" అంటే "ఫీలింగ్" అని చెప్పుకొనవచ్చు. (సరస్వతీదేవి గురించి చెప్పడానికి ఇంగ్లీష్ పదాలు అవసరమైనందుకు చింతిస్తున్నాను. చదివేవాళ్ళు నన్ను క్షమించాలి.) ఒక కవికి కానీ, నర్తకునికి కానీ ధర్మం - ఒక భావాన్నీ, దాని రసాన్నీచూపించగలగడం. అది కరుణ కావచ్చు, శృంగారం కావచ్చు, హాస్యం కావచ్చు, మరేదైనా కావచ్చు. అంటే వారు ఆ రసానికి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు అన్న మాట.

అలాటి కళలకూ, భావాలకూ ప్రాణం పోసేది ఆ తల్లి, సరస్వతీదేవి.

సరస్వతీదేవి గురించి చెప్పడానికి నాకు పదాలు చాలవు. దేవి ముఖారవిందం చూస్తేనే నాకు ఎన్నో నాళ్ళనుండి తీరని దాహం తీరినట్లు, జ్ఞ్యానమనే వెన్నెలలో స్నానం చేస్తున్నట్లు, అమ్మ వొడిలో పడుకున్నట్ల, పరబ్రహ్మను అద్దంలో నుండి చూసినట్లు అనిపిస్తుంది. తల్లికి పాదాభివందనాలు అర్పించుకుంటున్నాను.

ఈ పాట ఇక్కడ చూడవచ్చును.

Friday, October 24, 2008

తాతయ్య మాట తథ్యం బేటా

మా మాతామహులు (సంసృతం ఆట్టే తెలియని తెలియనివాళ్ళకి: "మాతామహులు" అంటే "తల్లి యొక్క తండ్రి") విజయవాడలో గొప్ప పేరున్న సిద్ధాంతి. వాస్తు, జ్యోతిష్యం బాగా తెలిసి, అనుభవం ఉన్న మహానుభావులు. నాకు, నాలాంటి చాలా మందికి గురువు, మార్గదర్సకులు. తెలుగు సాహిత్యం పట్ల మంచి అభిరుచి కలిగిన వ్యక్తీ. తాతయ్య ఏది చెప్పినా గొప్ప అనుభవంతో, ముందు చూపుతో చెప్తారు. ఆయన చెప్పింది విని బాగుపడిన వాళ్ళు అనేకులు. ఆయన మంచి చతురత కలిగినవారు. ఆయన ఛలోక్తులు ఈ సంచికలో :)

~
మా తాతయ్య చిన్నదనంలో ఆయన స్కూల్ కి వెళ్లడానికి ఎనిమిది మైళ్ళు సైకిల్ ఐనా తొక్కాలి, లేకపొతే ఒక ఏటిని ఈదుకుంటూ వెళ్ళాలి. రెండూ ఉత్సాహంగానే చేసేవారు. మా తాతయ్యకి ఒక మారు అందరికంటే ఎక్కువగా వందకి తొంభై మార్కులు వచ్చాయి. తరువాతి మార్కు డబ్బై. ఎప్పుడు క్లాసు లో టీచర్ తో వాదిస్తూ, అప్పుడప్పుడు స్కూల్ కి డుమ్మా కొడుతూ ఉండే మా తాతయ్య కి అన్ని మార్కులు వస్తే ఆశ్చర్యపోయిన టీచర్, "ఏరా రామకృష్ణయ్య! ఎవరి దాంట్లో చూసి కాపీ కొట్టావురా?" అని అడిగారు. దానికి మా తాతయ్య తడుముకోకుండా..."నా కంటే ఎక్కువ
మార్కులు వచ్చినవాడి దాంట్లో అండీ", అని చెప్పారు. ఆ టీచర్ కి గొంతులో వెలక్కాయ పడినట్లయ్యింది.
~
అవిరామదీక్షతో, కఠోరమైన క్రమశిక్షణతో పొద్దున్న అయిదింటికి లేచి సంధ్యావందనం, సుర్యారాధానం చేసే మా తాతయ్య వ్యాపారంలో కూడా గొప్ప అభివృద్ది సాధించారు. అనకూడదు కానీ, వ్యాపారం అంటే మోసమే. మోసం చెయ్యకుండా, అన్నీ నిజాలే మాట్లాడి వ్యాపారం చేద్దాం అనుకుంటే కష్టం. అదే విషయం నాతో చెప్తూ, "తెల్లారితే తిమిరాన్తకుని ఆరాధన, మధ్యాహ్నం నుండి మాటలగారడి", అన్నారు. తాతయ్యకి కాస్త ఊరట కలిగిద్దాం అనే ఉద్దేశంతో, "అది ఆపత్ధర్మం తాతయ్య ", అన్నాను. దానికి మా తాతయ్య "పెళ్ళాం లేదని మరదలు చెయ్యి పట్టుకుని ఆపత్ధర్మం అంటావురా?", అన్నారు. నాకు ఒక్కసారి మతిపోయింది. "ఇంత మాటనేసారేటి?", అనుకుని నవ్వేసి ఊరుకున్నాను.
~
ఒక లక్ష జాతకాల దాక చూసిన మా తాతయ్యకి ఎంత పాండిత్యం ఉందొ, అనుభవం ఉందొ చెప్పడానికి నా మాటలు సరిపోవు. రోజూ కనీసం ఒక ఇరువై జాతకాలు చూస్తారు. అయినా ఎవరి దగ్గరా పొరబాటున కూడా డబ్బులు పుచ్చుకోరు. కొంతమందికి ఆటోకి చిల్లర లేకపొతే ఆయనే డబ్బులు చెల్లించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన జాతకాలు చెప్తుంటే ఎవరైనా నోరు వెళ్ళబెట్టుకుని చూడాల్సిందే.

నేను ఎప్పుడూ నా జాతకం గురించి అడిగే ధైర్యం చెయ్యలేదు. నా చిన్నప్పుడు ఎప్పుడో తప్పితే మా తాతయ్య నా జాతకం చూడలేదు అని నా నమ్మకం. ఈ మధ్యన, నేను జ్యోతిష్యం నేర్చుకుంటున్నాను అనే నెపంతో నా జాతకం చూపిస్తే, పది నిముషాలలో నా జీవితంలో ఏవేమి జరిగాయో, జరుగుతాయో, నా మనసులో ఏముందో చెప్పేశారు. షాక్ అయ్యాను :)

ఒక ప్రముఖ సినీగేయరచయిత జాతకం చూపించి ఇతని గురించి చెప్పండి అంటే, అది చూసి: "వీడు గొప్ప జ్ఞ్యానిరా, కానీ పచ్చి వ్యభిచారి", అన్నారు. ఆ రచయిత దగ్గర పని చేసిన మా ఫ్రెండ్ తాతగారు అది నిజమేనని చెప్పారు.

ఒకమారు ఎవరో వ్యక్తీ తన కూతురు పెళ్లి గురించి అడగటానికి వచ్చారు. అమ్మాయిది, అబ్బాయిది జాతకం చూసి మా తాతయ్య "చేసేయ్యవయ్యా...", అన్నారు. దానికి అతను నసిగాడు, "అతనికి ఉద్యోగం...", అన్నాడు. "ఫరవాలేదు. చేసేయ్", అన్నారు మా తాతయ్య. ఉద్యోగం లేకపోయినా అతనికే ఇచ్చి చెయ్యమన్నారు అంటే దాని అర్థం, అమ్మాయి జాతకానికి అతడి జాతకం చాలా బాగా నప్పింది అని. "అయ్యా...అది...పెద్ద అందగాడు కూడా...", మళ్ళీ నసిగాడు. మా తాతయ్యకి చిరాకు వచ్చింది. "పనికొస్తాడా?", అని అడిగారు. వచ్చిన ఆయన సిగ్గుతో, "హీ హీ హీ. ఆయ్", అన్నాడు. "ఐతే చేసెయ్యి", అన్నారు మళ్ళీ. మారు మాట్లాడకుండా వెళిపోయాడు అతను.
~
సాహిత్యమ్లో చమక్కులు చాలానే చదివిన మా తాతయ్య కొన్నిసార్లు అవి కూడా చెప్తారు. ఒకసారి ఒక ఉదంతం చెప్పారు. ఒక మహాకవి వెళ్తుంటే (పేరు మరిచాను :( ) ఒక మహారాజు ఎదురుపడి, "ఏమోయ్ కవివృషభ, ఎక్కడికి వెళ్తున్నావు?", అన్నారు. "కవివృషభ" అంటే "కవులలో ఎద్దువంటి వాడా", అని అర్థం. "ఎద్దు" అంటే "గొప్ప బలం కలిగిన వాడు", అనే ఉద్దేశంతో అన్నమాట. దానికి ఆ కవి, "తమబోటి కామధేనువు కోసం వెతుక్కుంటూ వెళ్తున్నాను అండీ", అన్నాడుట. ఇక్కడ "కామధేనువు" కి రెండు అర్థాలు ఉన్నాయి. "అడిగిన వరాలిచ్చే వేల్పు", అని ఒక అర్థం. (అంటే ఆ రాజు కవికోవిదులను ఆదుకునేవాడు అని అర్థం). మరొక నిగుఢార్థం: "అందమైన ఆవు", అని. అంటే, "నేను ఎద్దునే, నీ బోటి ఆవును వెతుక్కుంటూ వెళ్తున్నాను", అని. దెబ్బకి రాజుకు నోట మాటలేదు :)

Thursday, October 23, 2008

హైదరాబాద్లో ఏడో ఇల్లు, లక్ష్మి ఔట్లు...

నేను, అమ్మ మొన్న హైదరబాద్ వెళ్ళాము. డాక్టర్ ని కలవడానికి. అడ్రస్ చెప్పమని అడిగితే - స్ట్రీట్ అడ్రస్ దాక చెప్పి "అందులో ఏడో ఇల్లురా", అంది. నేను, "అమ్మ, ఏడో ఇల్లు అంటే కళత్రస్థానం ((జాతకచక్రంలో). అక్కడ మా ఆవిడ కనబడుతుందేమోనమ్మా", అన్నాను.
~

మీ ఆవిడ దీపావళికి లక్ష్మి ఔట్లు కొనమంటోందిరా", అంది మా అమ్మ ఎవరో చుట్టంతో.
"పెళ్లిఖర్చులకే లక్ష్మి ఔట్ అయ్యింది. ఇంక మళ్ళీ లక్ష్మి ఔట్ లు ఎందుకు?", అన్నాడు.
~

Tuesday, October 7, 2008

జానకి కల గనలేదు...

ఎవరేమన్నా సరే సంసారం అంటే అంతా సులువైన విషయం కాదు అన్నది సత్యం. ఇది అన్ని పురాణాలు, స్మృతులు, ఉపనిషత్తులు ఘోషిస్తున్న సత్యం. అసలు ఒక్కసారైనా కొట్టుకొని భార్యాభర్తలు ఉండరు అన్నది నా ప్రఘాఢ విశ్వాసం. అప్పుడప్పుడు ఇలాంటి పాటలు వింటే, నాకు కూడా ఒక రకమైన నమ్మకం ఏర్పడుతుంది, "అంత కంగారు పడాల్సింది ఏమి లేదు. ఇందులో తలనొప్పి కంటే అమృతాంజనమే ఎక్కువ ఉంటుంది ఏమోలే" అని :)

భార్యాభర్తలు అనగానే మనం చెప్పుకొనే రెండు జంటలు ఉన్నాయి. అవి: పార్వతీపరమేశ్వరులు , సీతారాములు.
అర్థనారీశ్వరుడు శివుడు ఖ్యాతికి ఎక్కితే, ఏకపత్నివ్రతుడు రాముడు ఖ్యాతికి ఎక్కాడు. వీరు ఇరువురు నాకు జీవితంలో ఆదర్శం (ఒక్క విషయంలోనే కాదు సుమీ :) ). వీళ్ళు కూడా కొట్టుకున్న సందర్భాలు మనం పురాణాల్లోచదివాము [ శివపురాణం, వాల్మీకి రామాయణం ]. కానీ, "కోపం ఉండటం వేరు. ఇష్టం లేకపోవడం వేరు. ", అని నానమ్మకం.

ఇక అసలు విషయానికి వస్తే ఈ పాట "రాజ్కుమార్" సినిమాలో ఇళయరాజా స్వరపరచిన పాట. ఇది వ్రాసింది ఆచార్యఆత్రేయ. చక్కని సాహిత్యమ, సుమధురమైన సంగీతం రెండూ కలిపితే నిజంగా
పార్వతీపరమేశ్వరులు చూసిన భావమేకలుగుతుంది.


జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు
రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు

రాముడు పద్దెనిమిది ఏళ్ళ వయసులో అడవులకు వెళ్ళేటప్పుడు అసలు అందరూ "వీడు మళ్ళీ వెనక్కి వస్తాడా?", అనేభయంతోటే ఉండి ఉంటారు. అలాటిది, అనుకున్న దానికంటే ఎక్కువ దానవసంహారం చేసి, అహల్యను అనుగ్రహించి, పెళ్లికూడా చేసుకుని వస్తాడు అని ఎవరూ అనుకోలేదేమో, ఒక్క వశిష్టుడు, విశ్వామిత్రుడు తప్ప - వారు బ్రహ్మర్షులు. వారికిజరిగేది, జరిగింది, జరగబోయేది అన్నీ తెలుస్తాయి. "Marriages are made in heaven",
అంటారు. అలాగ, అనుకోకుండానే ఒకరికి ఒకరు జతపడ్డారు సీతారాములు. ఈ జంట పరవశంలో అలాగే వారి వలె వీరు కూడా కలిసారుఅని సంతోషిస్తోంది.

ఇక్కడ పారాయణం అనే పదం చక్కగా అమరింది. పారాయణం అంటే మొదటినుండి చివరిదాకా శ్రద్ధగా చదవటం. పూర్వం భాగవతపారాయణం అని చదివేవారు. అంటే, మొత్తం భాగవతం కూర్చుని శ్రద్ధగా చదవడం. వీరి జీవితాలనుచూస్తేకనుక ఆ రామాయణం లాగే ఉంది అని వీరి భావం.


చెలి మనసే శివధనుసైనది; తొలిచూపుల వశమైనది
ఆత్రేయ గారు మహానుభావుడు. మనసు కవి ఆత్రేయ అంటారు. అలాగ, చక్కనైన ప్రయోగం చేసారు. ఎక్కడైనా కొంచంసిగ్గు, బెట్టు, జాగ్రత్త అన్నీ ఆడవాళ్ళకే ఎక్కువ ఉంటాయి. ఆమె చేత అవుననిపించడమే అసలు ఒక పెద్ద విషయం. అలంటి ఆ స్త్రీ మనసే, శివధనుస్సు అంత బలమైనది అని చెప్పటం నాకు నచ్చింది. వారి చూపులు కలిసినప్పుడే అదిలొంగిపోయిందిట.


తొలిచుక్కవు, నీవే చుక్కానివి నీవే
ఎవరైనా ఉపవాసం/నక్తం చేసేవాళ్ళు ఉంటే, వారికి ఈ తోలిచుక్క విలువ తెలుస్తుంది. పొద్దున్న లేచినప్పటినుండి రాత్రిఒక చుక్క కనబడేవరకు భోజనం చెయ్యరు. అది కనబడ్డాక "బ్రతుకు జీవుడా" అనుకుని తినేవాళ్ళు కొంతమందిఉంటారు :) ఆ తోలిచుక్కతో ఈమె తన ప్రియుణ్ణి పోల్చడం బాగుంది.

చుక్కాణి అంటే పడవకు దరి చూపేది (rudder). దారి చూపేది కూడా అతడే అని భావం. అతడితోనే, తన పయనం అనిపునరుద్ఘాటిస్తోంది. ఇలాంటి చక్కని పదాలు అప్పుడప్పుడు వేటూరి, సిరివెన్నెల ప్రయోగిస్తున్నారు. గోదావరి సినిమాలోవేటూరి "
చుక్కాణే చూపుగా..బ్రతుకు తెరువు ఎదురీతేగా...", అని టైటిల్ సాంగ్ లో వ్రాయడం నాకు భలే నచ్చింది.


సహవాసం మనకు నివాసం; సరిహద్దు నీలాకాశం
ప్రతిపొద్దు ప్రణయావేశం; పెదవులపై హాసం
నివాసం అంటే ఇల్లు. వారికీ ఇల్లు అంటే ఒకరితో ఒకరు కలిసి ఉండటమేనట. అందులో హద్దులేవి ఉండవు.

ఇక "ప్రతిపొద్దు
ప్రణయవేశం" అనే ప్రయోగం నాకు గొప్పగా నచ్చింది. ఆవేశం అంటే ఒక భావనకు లోను కావడం. సహజంగా మనం ఆ భావాన్ని కోపానికి మాత్రమే అపాదిస్తము. ఐతే, అది ప్రణయం మనోహరమైన భావాలకు వాడెకవులు తక్కువ. అందుకే నాకు చక్కగా అనిపించింది.

ఆ ఆవేశం వ్యక్తపరిచే విధానం కూడా చాల తేలిక మాటల్లో చెప్పారు - "హాసం". అంటే, చిరునవ్వుతోనే ఆ భావాలనుతెలుపుకున్తున్నారు!


సుమసారం మన సంసారం;
పువ్వులో ఉండే ముఖ్యమైన లక్షణాలు అన్నీ ఉన్నదిట వారి సంసారం. పువ్వులో ఉండే ముఖ్యమైన లక్షణాలు: రంగులు, సువాసన, తేనె, అందం. ఇవన్నీ, మన మనసుకు ఉల్లాసం కలిగించేవి. అలాంటివి అన్నీఉన్నాయి ఆసంసారంలో అని చక్కగా, తక్కువ మాటల్లో చెప్పాడు కవి.

అసలు ఇలాంటి ప్రయోగాలు (సుమసారం) చేసే కవులు ఇంకా ఎక్కడ మిగిలారు అనిపిస్తుంది నాకు. తెలుగుపాటల్లో కూడా ఇంగ్లీష్ పదాలే నిండిపోతున్న కాలంలో, ఇలాంటి చక్కని ప్రయోగాలు వింటే నాకు చెవుల్లో తేనే పోసినట్టు ఉంటుంది.


మణిహారం మన మమకారం
మణిహారంలో అనేక మణులు ఉంటాయి. అలాగే వారి మమకారంలో కూడా అనేక భావాలు ఉన్నాయి. అవసరాన్ని బట్టి, తల్లి, తండ్రి, స్నేహితులూ ఒకరికి ఒకరు అవుతారు కాబట్టి ఆ విభిన్నమైన రూపాలు ధరిస్తున్న అనురాగం మణిహారంలాగా ఉంటుంది.


గతమంటే నీవే కధ కానిది నీవే
ఆమె గతం మొత్తం చెరిపేసి అతడు అక్కడ నుంచున్నాడుట. గతం అంత తనే కనిపిస్తున్నాడు.
ఐతే, గతం సహజంగా కథగా మిగిలిపోతుంది. కానీ, ఇతడు కథ కాదు అని ఋజువు చేస్తూ ఆమె ఎదురుగుండా
నిలిచున్నాడు!

ఈ లైన్ వింటే నాకు చక్రం సినిమాలో సిరివెన్నెల "ఒకే ఒక మాట" అనే పాటలో చేసిన చక్కని ప్రయోగం
గుర్తుకొచ్చింది: "నువ్వు రాక ముందు జీవితం గురుతైన లేదనీ, నిను కలుసుకున్న ఆ క్షణం నను వదిలిపోదనీ"

ఇక ఈ పాటలో మనం మరిచిపోకూదనివి కొన్ని ఉన్నాయి. అవి సుశీల, బాలు చక్కగా పాడి పాటను రక్తి
కట్టించడం. అలాగే, background score కూడా చక్కగా కలిసింది. ఇళయరాజా లాంటి మెలొడీలు ఇచ్చే
సంగీతదర్శకులు ఇప్పుడు అరుదు. అడపోదడపో మణిశర్మ, దేవిశ్రీ కొన్ని చేస్తున్నారు అంతే. ఆంధ్ర అందగాడు
శోభన్ బాబు కెరీర్ లోనే ఇది ఒక గొప్ప యుగళగీతం అని నా అభిప్రాయం.

చిత్రం: రాజ్కుమార్


సంగీతం: ఇళయరాజ
పాడింది: బాలు, సుశీల


జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు
రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు
ఆనాడు ఎవరూ అనుకోనిదీ ఈనాడు మనకూ నిజమైనదీ
ఆ రామాయణం మన జీవన పారాయణం

చెలి మనసే శివధనుసైనది తొలిచూపుల వశమైనది
వలపు స్వయం వరమైనపుడు గెలువనిదీ యేదీ
ఒక బాణం ఒక భార్యన్నది శ్రీరాముని యశమైనది
శ్రీవారు ఆ వరమిస్తే సిరులన్నీ నావి
తొలిచుక్కవు నీవే చుక్కానివి నీవే
తుదిదాకా నీవే మరు జన్మకు నీవే

సహవాసం మనకు నివాసం; సరిహద్దు నీలాకాశం
ప్రతిపొద్దు ప్రణయావేశం; పెదవులపై హాసం
సుమసారం మన సంసారం మణిహారం మన మమకారం
ప్రతిరోజు ఒక శ్రీకారం పరవశశృంగారం
గతమంటే నీవే కధ కానిది నీవే
కలలన్నీ నావే కలకాలం నీవే

Monday, October 6, 2008

నేను హార్లిక్స్ తినను, త్రాగుతాను!

ఈ ఆదివారం నేను హోసూర్ వెళ్లాను. మా అన్నయ్య దగ్గర జ్యోతిష్యం నేర్చుకుందాం అని. గుండమ్మ కథ సినిమా వస్తుంటే చూస్తున్నాము. మధ్యలో ఒక హార్లిక్స్ యాడ్ వచ్చింది. "హార్లిక్స్ ఫర్ వొమెన్" అని. నాకు నవ్వు ఆగలేదు. అంతకు ముందు "జూనియర్ హార్లిక్స్", "హార్లిక్స్ ఫర్ మదర్స్" అని వచ్చినవి గమనించాను.

పక్కన ఉన్నా మా వదినని ఒక సందేహం అడిగాను, "వదిన, నువ్వు ఇప్పుడు మదర్ వి, ఎప్పటినుండో వొమెన్ వి కదా. నువ్వు ఏది తాగుతావు?". మా వదిన దానికి, "mothers హార్లిక్స్ అంటే అది గర్భిణులకు మాత్రామే", అంది. "ఓహో", అనుకున్నాను.

ఇలాగ ఇంక "horlicks for toddlers, vicenarians, tricenarian, quadragenarian, ... centenarian" అని ప్రొడక్ట్స్ వచ్చేస్తే ఎలాగా అనుకున్నాను. వెంటనే నాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. అది అందరి జీవితాలనీ మార్చేస్తుంది. భవిష్యత్తులోకి వెళ్లి ఒక దృశ్యం చూసాను.

C:కష్టమర్ S: షాప్ ఓనరు

C: హార్లిక్స్ ఇవ్వండి.
S: ఏ హార్లిక్స్ కావాలి సర్

C: అదేమిటి? హార్లిక్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి?
S: ఇరవై నాలుగు రకాలు ఉన్నాయి సార్. మీది ఏ లగ్నం, ఏ రాశి?

C: అదెందుకు?
S: అందులోనే ఉంది అసలు విషయం. మీ రాశిని, లగ్నాన్ని బట్టి మేము హార్లిక్స్ స్పెషల్ గా తాయారు చేస్తున్నాము. ఉదాహరణకి మీది కుంభ లగ్నం అనుకోండి, మీకు లగ్నాధిపతి శని. హార్లిక్స్ ఆయనకీ ప్రీతి కరమైన విధంగా చేస్తాము. అంటే ఇనుము ఎక్కువగా ఉంటుంది, హార్లిక్స్ నల్ల రంగులో ఉంటుంది. అలాగన్న మాట.

C: ఓహో, ఐతే నాది తుల రాశి.
S: మహాచిలిపి. మీ రాశికి అధిపతి శుక్రుడేనా? ఐతే, మీకు కొంచం ములక్కాడల లక్షణాలు ఎక్కువగా ఉండే తులరాశి హార్లిక్స్ ఇస్తాను.

C: మా ఆవిడది వృషభ లగ్నమయ్య...
S: అబ్బా...భలే అదృష్టవంతులు సర్. వృషభ లగ్నం భార్య ఉండటం గొప్ప అదృష్టం. అస్సలు బద్ధకం ఉండదు. ఓర్పు ఎక్కువ. అందులోనూ, నా లాంటి కుంభ లగ్నం బద్ధకిష్టులకి మరీ మంచిది :)

C: ఏంటో, నువ్వు మరీ పోగిడేస్తున్నావు. మా ఆవిడని పొగిడితే నేను పొంగిపోతానోయ్.
S: (మనసులో: ఐతే వీడు ఆవిడకి లొంగిపోయాడు అన్న మాట.) అదేమిటి సర్. ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి అన్నారు.

C: అదేమిటి, ఏమైనా కొత్త LIC పాలసీ నా?
S: (ఇలాంటి బుర్ర తక్కువ వాళ్ళు మా షాప్ కి వస్తే అదే చాలు) మీరు మంచి జోక్ లు వేస్తారు సర్.

C: (తను వేసిన జోక్ ఏమిటో తనకే అర్థం కాక) ఇంక వృషభ లగ్నం వల్ల గురించి చెప్పు.
S: వృషభ లగ్నం వాళ్ళకి నోటి దురుసు ఎక్కువ అంటారు సర్. అందుకే ఈ వృషభ లగ్నం హార్లిక్స్ కొంచం మనిషిని కూల్ చేసే విధంగా తయ్యారు చేసారు. అలాగే మంచి బలం కూడా ఇస్తుంది, వాళ్లు బాలు పని చేస్తారు కదా. అస్సలు బద్ధకం ఉండదు మరి.

C: (మనసులో: కెలికితే అసలు విషయం దగ్గరకు వచ్చేసింది.) బాగుంది అయ్యా. ఐతే తుల రాశి హార్లిక్స్, వృషభ లగ్నం హార్లిక్స్ ఇవ్వవయ్యా.
S: అలాగే సర్. అదే చేత్తో మీ లగ్నం, ఆవిడ రాశి కూడా చెప్తే, అవి కూడా ఇస్తాను. ఒక పూట రాశి, ఒక పూట లగ్నం బట్టి తాగచ్చు. ఏమంటారు?

C: అద్భుతంగా ఉందయ్యా నీ ఐడియా. నా జీవితాన్నే మార్చేస్తుంది ఇది. నాది మకర లగ్నం, మా ఆవిడది సింహ రాశి.
S: (అది సంగతి, ఇంట్లో వీళ్ళావిడ సింహం అన్న మాట). మకర లగ్నం అధిపతి కూడా శనే. ఐతే ఇదుగోండి మకర లగ్నం హార్లిక్స్.

C: ఇందులో శనికి నచ్చేవి ఉన్నాయా?
S: అయ్యో, అదేమీ మాట. అసలు శని మొత్తం ఇందులోనే ఉంది.

C: అదేమిటి?
S: అంటే, శనికి నచ్చేవన్నీ ఇందులోనే ఉన్నాయి.

C: మంచిది. మరి మా ఆవిడకి?
S: మీ ఆవిడకి సింహ రాశి హార్లిక్స్ ఇస్తాను సార్. దెబ్బకి ఆవిడ మేష రాశి అయిపోతుంది.

C: అదేమిటి?
S: అంటే, మేక లాగా మారిపోతుంది.

C: అబ్బే, మా ఆవిడ అంత గయ్యాళి కాదు కానీ, నాకు జాతకాలు అంటే ఉన్నా గురి కోసం తీసుకుంటున్నాను. (మనసులో: దేవుడా, ఈ హార్లిక్స్ ఐన మా ఆవిడనుండి నన్ను రక్షించేలాగా చూడు).
S: (మనసులో: నీ మొహం చూస్తుంటేనే తెలుస్తోంది బాబు నీ సంగతి.) మంచిది సర్. మీకు శని అంతా మంచిని చేస్తాడు సర్.

Thursday, October 2, 2008

నేను హార్లిక్స్ తినను, తాగుతాను.

మా చిన్నప్పుడు (అంటే ఇంకా స్కూల్ కి వెళ్ళకుండా ఇంట్లో అమ్మని సతాయించే వయసులో) మా నెల్లూరు అన్నయ్యలు సీతారామపురం వచ్చారు. వాళ్ళు మా కంటే ఆరేడు ఏళ్ళు పెద్దవాళ్ళు. అప్పుడు మాకు ఇంట్లో గంజి ఇచ్చారు. అది మేము తాగాట్లేదు అని, వాళ్లు దాన్ని "హార్లిక్స్" అని చెప్పారు. అంతే, ఇది టీవీ లో చొప్పించే హార్లిక్స్ అన్నా మాట. అనుకుని తాగేసాము.

నేను కొంచం అతిగా థింక్ చేసేవాడిని కాబట్టి, అది టీవీ లో చూపించే హార్లిక్స్ కాదు అని కొన్నాళ్ళకి తెలుసుకున్నాను. కానీ "మా అన్నయ్యలు ఎందుకు అబద్ధం ఆడతారు?", అనే అనుమనాంతో "ఐతే, ఇంగ్లీష్ లో గంజి ని హార్లిక్స్ అంటారు అన్నా మాట. హార్లిక్స్ కూడా చూడటానికి గంజిలాగా ఉంటుంది కాబట్టి దానికి ఆ పేరు పెట్టి ఉంటారు", అని ఒక నిర్ధారణ కి వచ్చాను. అది ఎప్పటిదాకా ఉండేది అంతే నేను పిలానికి వెళ్ళాకా కూడా నాకు అదే నమ్మకం :)

Wednesday, October 1, 2008

Secret of happiness

మా తమ్ముడు నేను చిన్నప్పటినుండి ఇంటర్ వరకు దాదాపు ఒకే టీచర్స్ దగ్గర చదువుకున్నాము. మాకు ఆ టీచర్స్ మేనరిసమ్స్, మా చిన్నప్పటి అల్లరి, అమాయకత్వం ఇంకా బాగా గుర్తున్నాయి. ఎప్పుడూ వీలున్నప్పుడు మేము వారిని తలుచుకుంటాము.

మా అన్నయ్యని మా తమ్ముడు ఏదో వెటకారం చేశాడు ఈవేళ. దానికి మా అన్నయ్య "మూసుక్కూర్చో రా పూల చొక్కా" అన్నాడు. నిజానికి మా తమ్ముడు నల్ల చొక్క వేసుకున్నాడు. దానికి వాడు - "సరిగ్గా చూడరా పొట్టి చొక్కా", అన్నాడు. నేను చొక్కా వేసుకుకుండా మా అక్కడ నిలబడ్డాను. "అందుకే నాయనా నా లాగా ఉండాలి", అన్నాను. "నీకు secret of happiness తెలుసునా?" అన్నాను. [ 8th class లో "The happy beggar" అని ఒక poem ఉండేది. అది గుర్తు చేస్తూ. ] దానికి మా తమ్ముడు: "నీకు A section లో ఆన్సర్ కావాలా? B section లో ఆన్సర్ కావాలా?" అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. "రెండూ చెప్పు", అన్నాను.

Section A: "According to the pandit, being satisfied with what we have is the secret of happiness."
Section B: "Being satisfied with what we have is the secret of happiness, according to the pandit."

[అప్పటిలో ఇది 2nd/3rd class English text book లో లెసన్ ]

నాకు నవ్వు ఆగలేదు. చిన్నప్పుడు మేము ఇలాగే చదువుకునేవాళ్ళం. "అమ్మో మన పేపర్ యే టీచర్ దిద్దుతారో, రెండు సెక్షన్స్ ఆన్సర్లూ చదువుకుందాం", అని. పైగా, ఏది కరెక్ట్ ఆన్సర్ అని దాని గురించి చర్చ, తర్కం. నా మెమరీ 8th class దాకా వెళ్తే మా తమ్ముడి మెమరీ 2nd class దాకా గుర్తుపెట్టుకుంది.

ఒక్కో రోజు మాకు తెంగ్లీష్ పిచ్చి పడుతుంది. అంటే "తెలుగు, ఇంగ్లీష్" కలిపి మాట్లాడటం. ఉదాహరణలు:

"What ra. What doing ra? No work aa? idiot fellow. always noise aa raa?"
"Oh - that aa? I think whaatO whaatu"

ఎంతలాగా ఆ పిచ్చి పడుతుంది అంటే మన్నాడు ఆఫీస్ లో కూడా ఇవే కూతలు వస్తాయి :)

Monday, September 15, 2008

సిరివెన్నెలలో చిలిపిదనం!

నాకు మొదటిసారి తెలుగు సినిమా పాట మీద ఇష్టం కలిగింది సిరివెన్నెల పాటలు వినడం వలన. ఆయన అంటే నాకు వల్లమాలిన అభిమానం. తరువాత నేను ఆయన ఇంటర్వ్యూ ఒకటి చదివాను. అందులో ఆయన, "నా హీరో వేటూరి. అసలు తెలుగు పాటకి ఉన్నా హద్దులు అన్నీ చెరిపేసి, తెలుగు పాటకే ఓనమాలు నేర్పించిన మహానుభావుడు వేటూరి", అని చెప్పడంతో నాకు వేటూరి గొప్పదనం అర్థమైంది. అప్పటినుండి, నేను వేటూరి పాటలను కూడా సీరియస్ గా ఫాలో అయ్యాను. ఆ తరువాత సిరివెన్నెల చెప్పినదాంట్లో ఏ మాత్రం అబద్ధం అని అర్థమైంది. ఐనప్పటికీ సిరివెన్నెల గొప్పదనాన్ని ఎవరూ కాదనలేరు. ఆయన పాట ఎంత నచ్చుతుందో, ముక్కుసూటిగా ఉండే ఆయన నైజం కూడా నాకు అంత నచ్చుతుంది.

[ మీ వయసు పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువైతే ఇక్కడితో చదవడం ఆపేయ్యండి :) ]

నాకు నవరసాల్లోనూ మహా నచ్చేవి మూడు: భక్తిరసం, హాస్యరసం, శృంగారరసం. [ ఎవరైనా అప్పుడే కళ్లు ఎర్ర చేస్తున్నారా? చేసుకోండి. I'm not here to impress. I'm here to express :) ] బహూశా అందుకేనేమో నాకు త్యాగయ్య, జంధ్యాల, వేటూరి అంటే చాలా ఇష్టం :) ఇక ఈ రసాలని mix and match చేసే వాళ్ళంటే భలే మక్కువ. ఉదాహరణకి అన్నమయ్య, జయదేవులు. వ్రాసేది మహాశృంగారభరితంగా ఉన్నా - భక్తిభావం మాత్రమె తోణికిసలాడుతుంది.

ఇక తెలుగు సినిమా పాటల్లో శృంగారరసం పండించటంలో ఒక lineage ఉంది. ఆత్రేయ, వేటూరి ఇందులో ఆద్యులు :) ఇక వేటూరి నా అంచనాలను అధిగమించి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆయనను బీట్ చెయ్యగలిగేవారు ఉన్నారు అంటే నేను ఒప్పుకోలేను. అసలు ఆయన పాటల్లో భావుకత మీద నేను ఒక పోస్ట్ వేరేగా వ్రాస్తాను.

సిరివెన్నెల విషయానికి వస్తే ఈయన కనబడరు కానీ మహాముదురె. కొన్ని పాటల్లో వేటూరిని తలపించి, తనకు తెలియనట్టు తలవంచుకుని వెళ్ళిపోతారు. అలాటి ఒక పాటే "కూలీ నెంబర్ ఒనె" లోని ఈ పాట. ఇందులో ఆయన చేసిన కొన్ని ప్రయోగాలు వేటూరి స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా ఉంటాయి. మరీ ముదురిపోయినవి నేను ఇక్కడ వర్ణించను కానీ, మిగతావి (నాకు నచ్చినవి) ఇక్కడ చెప్తాను.

నా చెంప సంపెంగలో కెంపు రంగాయే తోలిసంబరం

ప్రియురాలి చెంపను సంపెంగతో పోల్చడం కొత్తేమీ కాదు. బహుశా రంగులో ఉన్న సామ్యం వలన కావచ్చు. ఇక "తోలిసంబరం" అనే చక్కని తెలుగుసమాసం ఎందుకు వాడాడు అని ఆలోచించాలి. "కెంపు రంగు" అంటే ఎర్రటి ఎరుపు. ఆమె బుగ్గపైన ఎర్రటి ఎరుపు కలిగించింది ఏమయ్యుంటుందో!

ఉద్యోగామిప్పించావా సోకు ఉద్యానవనమాలిగా

రకరకాల చెట్లు ఉండేది ఉద్యానవనం. ప్రియురాలిని సోకు ఉద్యానవనం గా పిలిస్తే తనే ఉద్యానవనంలో పొడుగాటి చెట్టు ఎక్కేసే ప్రమాదం ఉంది. అయినా పొగడ్తలకు పాడిపోని ఆడవాళ్ళని నేను ఇప్పటిదాకా చూడలేదు! ఆ ఉద్యానవనానికి తోటమాలిగా ఉంటానని అప్లికేషను పెట్టాడు సిరివెన్నెల!

నాజూకు మందారమే ముళ్ళ రోజాగా మారే క్షణం

మందారానికి స్త్రీకి చాలా సార్లు పోలిక చెప్తారు. ఈ మధ్యన మన వేటూరి "మదిలోని ప్రేమ నీదే మాధవుడా! మందారపువ్వే నేను మనువాదరా", అని వ్రాసాడు. మందారపువ్వును చూస్తె ఒక పవిత్రమైన భావం కలుగుతుంది (పోనీ, మల్లెపూవుతో పోలిస్తే). అలాంటి అమ్మాయి, "ముళ్ళ రోజాగా" మారిందిట. అది ఎలాగ అని అనుమానం వచ్చి, నేను వెంటనే వేటూరి నిఘంటువు వెదికాను. అందులో "మొదటిరాతిరి సిగ్గు మొగలిపువ్వట. గుచ్చుకుంటూనే మొగ్గ విచ్చుతుందట", అని ఉంది. అప్పుడు అర్థమైంది. మందారానికి, రోజాకి ఉన్న తేడ మినీ కవులకు కూడా అర్థమవ్వాలి. మందారపువ్వును చూస్తె కలిగే భావం వేరు. రోజా పువ్వును చూస్తె కలిగే భావం వేరు.

కండల్లో వైశాఖమా, కైపు ఎండల్లో కరిగించుమా...

నేను జడ్జిని ఐతే, ఈ ప్రయోగానికి నూటికి రెండు వందల మార్కులు వేస్తాను. అసలు, దీనికి విలువ కట్టలేము అండి. ఇంతకీ అసలు వైశాఖం అంటే తెలుసునా? "ఎండా కాలం". కండల్లో ఎండా కాలం చూపిస్తున్నదుట మన హీరో. పేరుకు సిరివెన్నెల కానీ, గురూజీ అప్పుడప్పుడు ఇలాంటి తాపం కూడా కలిగిస్తూ ఉంటారు.

తీగమల్లికి నరాల పందిరి అందించుకోనా?

దీని గురించి చిన్నపిల్లాణ్ని నేను చెప్తే ఆట్టే బాగుండదు. ఆమెను అల్లుకునే పూలతీగాతో పోల్చడం ఒక ఎత్తైతే, తన నరాలతో పందిరి వేస్తాను అనడం అతడి ఔదార్యానికి నిదర్శనం, అతనికి నిద్రనాశనం :)

మొత్తం పాట:

కొత్త కొత్తగా ఉన్నది, స్వర్గం ఇక్కడే అన్నది
కోటి తారలే పూల ఏరులై నెల చేరగానే

నా కన్ను ముద్దాడితే కన్నె కులుకయే కనకాంబరం
నా చెంప సంపెంగలో కెంపు రంగాయే తోలి సంబరం
ఎన్ని పొంగులో కుమారి కొంగులో, ఎన్ని రంగులో సుమాల వాగులో
ఉద్యోగామిప్పించావా? సోకు ఉద్యానవనమాలిగా
జీతమియ్యగా లేత వన్నెలే చెల్లించుకోనా?

నీ నవ్వు ముద్దాడితే మల్లె పువ్వాయే నా యవ్వనం
నాజూకు మందారమే ముళ్ళ రోజాగా మారే క్షణం
మొగలి పరిమళం మగాడి కౌగిలి
మగువ పరవశం సుఖాల లోగిలి
కండల్లో వైశాఖమా కైపు ఎండల్లో కరిగించుమా
తీగమల్లికి నరాల పందిరి అందించుకోనా?

వీడియో:

Tuesday, September 9, 2008

ప్రాస దోస అప్పడం వడా...

నేను పొద్దున్నే టిఫిన్ తెద్దాం అని వీధి చివర్న కాంటీన్ కి వెళ్లాను. పార్సెల్ ఆర్డర్ చెప్పాను. అక్కడ పార్సెల్ కౌంటర్ లో ఇద్దరూ కొత్త కుర్రాళ్ళే. ఎలాగ తెలుసును అని అనుకుంటున్నారా? టోకెన్ స్లిప్ ఇచ్చాక నా మొహం కేసి చూస్తున్నారు. "సరే మనం స్నానం చెయ్యలేదు కదా...అందుకే అయ్యి ఉంటుంది", అనుకున్నాను. ఇంకా చూస్తూనే ఉన్నారు. అప్పటికి అర్థమైంది. వాళ్ళకి ఇంక అక్కడ పధ్ధతి అర్థం కాలేదు అని.

నేను ఆర్డర్ చదివాను. "ఒక ప్లేట్ పూరి. ఒక మసాలదోస without oil" అన్నాను. ఇదివరకుటి కుర్రాడు లేదు, వాళ్లు సొంతపెత్తనం చెయ్యడం ఎందుకు", అని మన పోరగాల్లు వెయిట్ చేసారు. అతడు వచ్చి - "వీళ్ళకి మనం చిన్న షో ఇద్దాం", అని ట్రై చేసాడు అనుకుంటాను. నేను "without oil", అన్నాను. అప్పుడతను - "ఏది?", అన్నాడు. నాకు వింతగా అనిపించింది. ఒక్క నిముషం ఆలోచించి - "పూరి oil లేకుండా అవ్వదు కదా!", అన్నాడు. అందరం ఒక్క రెండు నిముషాలు continuous గా నవ్వుకున్నాము :)

ఇంతలొ ఎవరో రవదోస ఆర్డర్ ఇచ్చారు ఎవరో. అది అంటే నాకు భలే ఇష్టం. కానీ దాని equation నాకు inefficient గా అనిపిస్తుంది. పదిహేను నిముషాలు కాలిస్తే రెండు నిముషాలలో తినేస్తాము. అందుకే ఆర్డర్ చెయ్యలేదు; ఇంట్లో మా అమ్మకి breakfast లేట్ అవుతుంది అని. అసలు రవదోస... దాని తస్సాదియ్యా - టూ మచ్. అది చూస్తూనే రెడీ అయిపోయి వెళ్లిపోతుంటే నాకు త్రివిక్రమ్ పూనాడు. "వదోస రం లాగుంటే, సాలదోస మంథర లాగా ఉంటుంది", అనిపించింది. ఇక ఎదురుగుండా అప్పడాలు, వడలు వేయిస్తున్నారు. అన్నీ ఇష్టమే :) మనసు గట్టి చేసుకుని పార్సెల్ పట్టుకుని ఇంటికి వచ్చేసాను.

ఇంతటితో ప్రాస దోస అప్పడం వడ" అనే అంకం సమాప్తం.

Monday, September 8, 2008

వెన్నెల చేత వేదం పలికించిన వేటూరి...

ఈ సారి మాత్రం వేటూరి పాట వ్రాయకూడదని చాలా ప్రయత్నించాను అండి. కానీ నా వల్ల కాలేదు. బహుశా, ఈ పాట భక్తీ, శక్తి, ముక్తి అన్నిటి గురించి మాట్లాడే పాట కావడం వలన కావచ్చు. ఈ పాట విని కళ్ళల్లో నీళ్లు రాని వారుండరేమో.

పాట గురించి చెప్పేముందు - రెండింటి గురించి చెప్పాలి. ఒక దేవుడు. మనల్ని చాలా మంది ప్రేమిస్తారు, ప్రేమించామన్నట్టు నటిస్తారు, ప్రేమించామనుకుంటారు. కానీ, నిజం గా ప్రేమించేది, ధర్మబద్ధమైన ప్రేమ చూపించేది ఒక్క దేవుడే. నేను ఎప్పుడూ అంటూ ఉంటాను: "దేవుడిని చూడలేమురా ఈ పాంచభౌతికదేహంతో! మన ఆత్మతో ఆరాధించాలి, అనుభవించాలి", అని. అలాగ అనుభవించలేని వాళ్లు ఏం కోల్పోతున్నారో వారికి తెలియదు.

రెండవది అమ్మ. దేవుడి ప్రేమ అతినిర్మలమైనది. దాని తరువాత అంత నిర్మలమైన ప్రేమ అమ్మదే అని నా అభిప్రాయం. మనలో చాలా మంది కూడుకీ గుడ్డకీ లోటు లేని వాళ్ళం అయ్యుండవచ్చు. మనకి కష్టం అంటే తెలియకపోవచ్చు. కానీ, మన దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఇంకా ఒక పూట కడుపు నిండా తింటే ఆనందపడే వాళ్లు అనేకులున్నారు. వారందరూ ఎలాగ బ్రతుకుతున్నారో తెలుసునా? త్యాగాలవలన. ఒక ఇంట్లో ఒక అమ్మ అన్నం తిన్నానని అబద్ధం చెప్పి పిల్లలకి అన్నం పెడుతుంది. ఒక ఇంట్లో నాన్నబట్టలంటే ఇష్టం లేదు అని చెప్పి పిల్లలకి మాత్రమే బట్టలు కొంటాడు. ఒక హాస్టల్ లో ఒక ఆన్న భోజనం చెయ్యడం మానేసి డబ్బులు దాచి తమ్ముడికి పంపిస్తున్నాడు. ఒక ఇల్లాలు రిక్షా ఎక్కితే ఎలాగ అని ఐదారు కిలోమీటర్లు నడిచు వస్తోంది. వీరందరూ త్యాగాలు చేస్తున్నామనుకోవట్లేదు. భోగాలు అనుభవిస్తున్నాము అనుకుంటున్నారు. ఎందుకు అంటే - "ఇవ్వడం లో ఉన్న తృప్తి తెలుసుకున్నారు". తన వారి కళ్ళల్లో కనబడే ఆనందం, వారి మనసు లోతుల్లోంచి వచ్చే నిట్టూర్పూ... ఇవి నిజమైన ఆనందాలు. కష్టాలు వస్తాయి, పోతాయి. కానీ, ఈ మమతలు బలపడిపోతాయి. ఈ సృష్టి నడుస్తోంది అంటే దానికి మూలం "ప్రేమ". ఆ ప్రేమ లేనప్పుడు సృష్టి, "ఆత్మ లేని శరీరం" లాంటిది. ఆ ప్రేమకు నిలువుటద్దము "అమ్మ". అమ్మ చెయ్యని త్యాగం ఉంది అంటే అది నేను నమ్మను.*

అలాంటి ఒక అమ్మ జీవితం ఎలాగ నడిచిందో చెప్పిన సినిమా "మాతృదేవోభవ". ఆ సినిమాలోని అమ్మ లాంటి అమ్మల్ని ఏ మిడిల్ క్లాసు ఇంటికి వెళ్ళినా చూడవచ్చు. "రేపు ఎలాగుంటుందో తెలియదు, ఈ రోజు సాగితే చాలు", అనిపించే ప్రతీ ఇంట్లోనూ ఏదో ఒక పరిమాణంలో జరిగే కథనే అది. ఇందులో ఒక ఇల్లాలికి మొదట భర్త అండగా నిలువడు. అతడు మనసు మారి దగ్గరయ్యే సమయానికి దేవుడికి తెగ నచ్చేసి తన దగ్గరకు తీసుకుపోతాడు. దేవుడికి ఎప్పుడు ఎవరి మీద ప్రేమ పుడుతుందో చెప్పలేము కదా! ఇంతలొ ఈ ఇల్లాలికి కూడా ప్రాణాలను హరించే రోగం ఉంది అని తెలుస్తుంది. అప్పుడు ఆ తల్లి తనకు ఉన్న పిల్లల్ని ఒక్కరోక్కర్నీ ఒక్కో గూటికి చేరుస్తుంది. చేర్చి - ఇక తనను తీసుకేల్లిపోమని దేవుడిని ప్రార్థిస్తూ పాడే పాట. ఇది అన్నమయ్య తన జీవితపు సాయమ్సంధ్యలో పాడిన ఒక పాట పల్లవిని తీసుకుని వేటూరి అల్లిన ఒక వేదం. ఆశావాదం, నిరాశావాదం, దేవుడి మీద ప్రేమ అన్నీ కలగలిపి ఒక అమ్మ చెప్పిన భగవద్గీత.

వేణువై వచ్చాను భువనానికి, గాలినైపోతాను aగగనానికి
మమతలన్నీ మౌనగీతం, వాంఛలు అన్నీవాయులీనం ||

ప్రతిమనిషీ ఈ భూమి మీదకు వచ్చేటప్పుడు ఏమి తెలియకుండానే వస్తాడు. వచ్చి - ఏదేదో చేస్తాడు. తన స్వార్థం తను చూసుకుని వెళ్ళిపోయేవాడు కర్రలాంటి వాడు. దానికి ప్రాణం ఉన్నంతకాలం చెట్టుతో ఊగుతుంది. ఏదో అనుభవిస్తున్నాను అనుకుంటుంది. దాని కాలం అయిపోయిన తరువాత తగలేస్తారు. తన గాయాలను లెక్క చెయ్యకుండా తనవారికి మంచి చేసేవాడు వేణువు లాంటి వాడు. "పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు. అల్లన మోవికి తాకితే గేయాలు", అన్నట్టు. ఈ సినిమాలో అమ్మ కూడా వేణువులాంటిదే...మనసులో ఎన్ని గాయాలున్నా తన పిల్లలకోసం ఇంకా పోరాడి, పోరాడి...బాధ్యతలని నెరవేర్చి ఆ గానాలు వారికి విడిచిపెట్టి గాలిగా మారిపోతోంది. వేణువు ఆలాపించేవాడు వెళ్ళిపోయినా, వేణువు వెళ్ళిపోయినా, ఆ వెదురు పాటలు మాత్రం మనసుని విడిచిపోవు.

ఈ ఇల్లాలి మమతలను పంచడానికి పిల్లలు దగ్గరలేరు. ఆమె మమత అంతా మౌనంగానే ఉండిపోయింది. ఆమె కోరికలన్నీ రాగాలుగా ఆ వాయులీనంలో పలికిస్తోంది. వాయులీనం అంటే "వాయువులో లీనమైనది" అనే భావం కూడా కనిపిస్తోంది. ఆమె కోరికలు గాలిలో కలిసిపోయాయి అన్నమాట.

ఏడుకొండలకైనా బండ తానోక్కటే, ఏడు జన్మల తీపి బంధమే
నీ కంటిలో నలక లో వెలుగునే కనక, నేను మేను అనుకుంటే ఎద చీకటే, హరి, హరి, హరి, హరి...
రాయినై ఉన్నాను నాటికీ రామపాదము రాక ఏనాటికీ ||

మనం ఏడు కొండలు అని వేరేగా చూసినా, అవన్నిటినీ కలిపేది రాయే. రాయినే మనం వేరే వేరే కొండలుగా చూస్తున్నాము. అలాగే మనం గుర్తించలేకపోయినా మన జన్మలనన్న్టినీ కలిపేది "ప్రేమ" అనే బంధమే. భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తాడు.

చాలా మంది కష్టాలు వస్తే దేవుణ్ణి తిట్టుకుంటారు. దేవుడికి మనసు లేదు అంటారు. కానీ, ఆ దేవుడు ఎక్కడో లేదు తమలోనే ఉన్నాడు అని గుర్తించలేరు. ఆ పరమాత్మ అనే వెలుగుని చూడకుండా ఉండేవాడు నిజంగా అంధుడు. అతడి మనసు గ్రుడ్డిది. దేవుడికి ధర్మం మాత్రమే తెలుసును. ప్రేమించడమే తెలుసును. ప్రేమించినవారిని ఆదరించడమే తెలుసును. ఇక్కడ వేటూరి "నేను మేను అనుకుంటే", అని చాలా గొప్పగా చెప్పాడు. "నేను" ఈ శరీరం కాదు. అది ఆత్మ. దానికి ఒక పరమార్థం ఉంది. అది తెలుసుకుని నడుచుకుంటే వచ్చే తృప్తి చిరకాలం ఉంటుంది. ఎందుకంటే మనలో ఉన్న పరమాత్మకి అది నచ్చుతుంది. మనం సినిమా చూస్తేనో, స్విట్జర్లాండ్ వేల్తేనో వచ్చే ఆనందంతో ఒకరి కళ్ళల్లో నీళ్ళను తుడిస్తేనో, ఒకరి కడుపులో మంటను చల్లార్చితెనో వచ్చే ఆనందంతో పోలిస్తే చాలా తక్కువ, తాత్కాలికం.

ప్రతి రోజూ "నా కష్టాలు తీరతాయి", అని ఆశించే ప్రతి మనిషి ఒక అహల్య. అలాంటి అహల్యలు ఈ లోకంలో ఇంకా ఎంతో మంది ఉన్నారు.

నీరు కన్నీరాయె, ఊపిరే బరువాయె, నిట్టు నిప్పుగా మారే నా గుండెలో...
నింగిలో కలిసే శూన్య బంధాలు, పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు...హరి, హరి, హరి, హరీ....
రెప్పనై ఉన్నాను నీ కంటికి, పాపని వస్తాను నీ ఇంటికీ ||

ఇలాంటి కష్టాలు భరించిన ఏ వ్యక్తీకి అయినా ధారాపాతంగా వచ్చేది కన్నీరే. "ఆగక పొంగే కన్నీరే నీ ఆకలి దప్తులు తీర్చాలమ్మా", అన్నాడు "స్వాతిముత్యం" సినిమాలో ఒక కవి. ఆ నిజాలని అనుభవిస్తూ బ్రతికే ప్రతి క్షణం మనసుని మండిస్తుంది.

చివరికి ఈ తల్లి హరిని తన తండ్రి గా భావించి తన చావుని కూడా "పుట్టిల్లుకి చేరుకోవడం" గా వర్ణిస్తూ ఉంది. జన్మలో తన పిల్లలకి "రెప్ప" గా ఉన్నా తల్లి, మళ్ళీ పిల్లల ఇంటికే పాపగా మారి వస్తాను అనే ఆశావాదం వ్యక్తం చేస్తోంది. అదే కదా మరి ఏడుజన్మల బంధం అంటే.

పాటలో లైన్ నచ్చింది అని అడిగితే ఏమిటి చెప్పను. "ఇలాంటి తల్లుల్ని చూసి, వారి వేదనని చూసి, వారి త్యాగాలను చూసి చమ్మగిల్లిన కళ్లు, తడి ఆరిపోయిన గొంతుతో మూగబోయాను", అని మాత్రమె చెప్పగలను. అలాగ త్యాగాల మధ్యలో తమ పిల్లల్ని పెంచిన తల్లితండ్రులకి నా ఈ కన్నీళ్ళతో పాదాలు కడుగుతూ శతకోటిప్రణామాలు చేస్తూ ఇక్కడితో ఆపేస్తున్నాను.

అసలు ఈ పోస్ట్ కి "వెన్నెలతో వేదం పలికించడం" అని ఎందుకు పేరు పెట్టావు అంటే. నాకు జాబిల్లి అంటే మా అమ్మ. ఇదే సినిమాలో వేటూరి అమ్మను, "వేకువలో వెన్నెలవై, జారిపడే జాబిలివై", అన్నాడు. అది నిజం! అమ్మ వేదం చెప్తే ఈ పాట లాగే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అందుకే ఈ పేరు!

ఈ పాట ఇక్కడ చూడవచ్చును. పూర్తిగా లేదు సుమీ!




* కొంతమంది exceptions ఉంటారు అని మీరు అనవచ్చు. అలాంటి వారిని "అమ్మ" అనే పదానికి ఆపాదిన్చవద్దు.

Saturday, September 6, 2008

ప్రాస సంచిక - 2

మరి కొన్ని త్రివిక్రమ్ టచ్లు:

రోమ్ నగరం లో రోమాన్చకంగా ఉండాలి.
వాడి సుడి సుదర్శనచక్రంలాగా తిరుగుతోందిరా బాబు.
ఇది కలియుగం బాబు. ఇక్కడ రాముడిలాగా ఉంటే రాంగ్, సీతలా ఉంటే సిన్....అసలు కాంగా ఉంటే క్రైం!

తళుక్కు బెళుక్కు గుళుక్కు అందాలు

మళ్ళీ వేటూరి పాటతోటే వచ్చాను. ఎందుకంటే వేటూరి నా అంచనాలను దాటినంతగా మరి ఏ కవీ దాటలేదు మరి. ఈ పాటలో తెలుగుతో తొక్కుడుబిళ్ల ఆడాడు. ఇది "కోకిల" అనే సినిమా లోని పాట. నరేష్, శోభన హీరో, హీరోయిన్లు. ఇక సంగీతం మేస్ట్రో ఇళయరాజా. పాట ఆయన స్టాండర్డ్ కి తగ్గట్టు లేదు అనే చెప్పుకోవాలి. కానీ, వేటూరి ఆ లోటి తెలియనివ్వలేదు తన పదాలగారడితో.

నాకు నచ్చిన కొన్ని ప్రయోగాలు ఇక్కడ చెప్తున్నాను.

గుమ్మెత్తు నీ సోకు, గుచ్చెత్తుకుంటేనే కోపాలా
ప్రియురాలిని పట్టుకుని - "నీ అందం నాలో చిలిపిదనంతో ఆడుకుంటుంటే నీకు కోపమెందుకు?", అని వేటూరి ఏంటో చిలిపిగా అడిగాడు. ఇలాంటి ప్రయోగమే నాకు భలే నచ్చింది "అతడు" సినిమాలో "నీతో చెప్పన్నా" అనే పాటలో: "సొంతసొగసు బరువేల సుకుమారికి" అని సిరివెన్నెల అన్నది. స్త్రీ అందాన్ని, తన నుండి విడదీసి దానిని ఆరాధిస్తే దాని వల్ల ఆ స్త్రీకే అసూయా వచ్చి మనకి ఇస్త్రీ అయిపోయే ప్రమాదం ఉంది :)

తెలుక్కు (తెలుగుకు) అందాలు తేవాలా; చేళుక్కు చేవ్రాలు చెయ్యాలా...
తెలుగే అందమైన భాష. దానికి అందం తీసుకురావడం ఏమిటా అనుకుంటున్నారా? వేటూరి పాట తెలుగు భాషకి ఎప్పుడో అందం తెచ్చింది. ఇక హీరో గారు ఆయన సంతకం అమ్మాయిపై వ్రాసి ఆ విధంగా తెలుగుకు అందం తెస్తాడుట. ఆ భాష వేరు, అందులో సంతకాలు అంతా ఈజీ గా అర్థం కావులెండి.

నీ పట్టు కొకట్టుకోవాలమ్మో...ఆ కట్టు ఆకట్టుకోవాలమ్మో...
ఆమె పట్టు చీర కట్టుకుంటే అది పట్టుకుని ఉండిపోతాదుట ఆ హీరో. పట్టు చీరలో ఉన్నా అందమే అది అనుకుంటాను. అసలు మగవాడికి పెద్దరికం తెలిసేదే తన భార్య చీర కట్టుకుని కనబడినప్పుడు అని ఎవరో అనుభవంతో చెప్పగా విన్నాను :) ఆ చీరకట్టు మన హీరోని ఆకట్టుకోవాలిట! (ఆ కట్టు ఆకట్టు అని మన వేటూరి చిన్న ప్రయోగం విసిరాడు అర్థమైందో లేదో).

నా లేఖ నీ కాటుకవ్వాలా; నీ కళ్ళ క్రావాళ్ళు దిద్దాలా...
తను వ్రాసిన లేఖ (కాలంతో కాదు అనుకుంటా) ఆమె కళ్ళకి వన్నె తీసుకురావాలిట. నిజమే, ప్రియుడు కనబడి కళ్ళతోనే లేఖలు వ్రాస్తుంటే అవి అందుకున్న అమ్మాయి కళ్ళకి అందం పెరుగుతుంది :) తెలుగు భాషలో "క్రావడి" అంటే "రా వత్తు". అది అర్థచంద్ర ఆకారంలో ఉంటుంది. ఆమె కళ్ళ కింద క్రావడి దిద్దినట్టు అతని లేఖ కాటుక దిద్దాలిట. ఇది కేవలం వేటూరి కి మాత్రమె సాధ్యమయ్యే ప్రయోగం అని నేను భావిస్తున్నాను. ఇంతటి ఊహాశక్తి బహుశా వేరే వారికి రాదేమో!

ఆగాలి గాలి జోరింక తగ్గాలి ముప్పొద్దులా...
"ఆగాలి ఈ గాలి" అనే ప్రయోగం చూసారా? అది వేటూరి మార్క్. "ఈ దేశం అందించే ఆదేశం" అని గోదావరి సినిమాలో విన్నారుగా. "ఓ చెలికాడా...ఈ చెలి కాడ" అని "మౌనమేలనోయి" సినిమాలో విన్నారా? ఇదే తెలుగుకు అందం చేకూర్చడం అంటే. ఇది నిజమైన తెలుగు కవిత్వం అని నా అభిప్రాయం. అంటే - ఇది తెలుగులో మాత్రమె అందంగా కనబడే ప్రయోగం. భాష మారిస్తే డబ్బింగ్ చెప్పలేని భావం.

మొత్తానికి వేటూరికి పరమసాధారణమైన ట్యూన్ ఇచ్చి, పరమ రొటీన్ సందర్భం ఇచ్చినా దానికి న్యాయం దాంట్లో ఒక చిన్న సంతకం చేసి పడి నిముషాల్లో వ్రాసి పాటేస్తాడు (పారెయ్యడం కాదు, పాట + వెయ్యడం) అని మరొక సారి రూఢీ అయ్యింది.


చిత్రం: కోకిల
దర్శకత్వం: గీతకృష్ణ
సంగీతం: ఇళయరాజ
గానం: బాలు, చిత్ర


తలుక్కు బెళుక్కు గులుక్కు అందాలు, తరుక్కు తరుక్కు కొరుక్కు తింటుంటే
దొరక్క దొరక్క ఉడుక్కు సందేళ, ఎరక్కమరక్క ఇరుక్కుపోతుంటే
గుమ్మెత్తు నీ సోకు, గుచ్చేత్తుకుంటేనే కోపాలా
గిన్నెత్తుకెల్లద్దు, నన్నెత్తుకొవద్దు గోపాలా

తెలుక్కు (తెలుగుకు) అందాలు తేవాలా; చేళుక్కు చేవ్రాలు చెయ్యాలా...
నీ దిక్కులేవేవో పాడాలా; మ్యుసిక్కు తో ముద్దులాదాలా...
నీ పట్టు కొకట్టుకోవాలంమో...ఆకట్టు ఆకట్టుకోవాలమ్మో...
నీ బొట్టు నేనేట్టుకున్న సరే...ఈ బెట్టు ఇట్టాగే సాగాలయ్యో
జాజుల్లో గంధాలు, గాజుల్లో నాదాలు రాబట్టనా?
శృంగారమంత్రాల, శ్రీవారి రాగాల జోకోట్టనా?
వెన్నెట్లో గోదారి కౌగిల్లకే దారి పట్టాలమ్మో...

మే నెల్లో లిల్లీసు పుయ్యాలా, ట్రంపెట్లో సన్నాయి మోగాలా...
నా లేఖ నీ కాటుకవ్వాలా; నీ కళ్ళ క్రావాళ్ళు దిద్దాలా...
న్యూయార్క్ లో మువ్వగోపాలుడే, బ్రేక్ ఆడుతూ వేణువు ఊదాలయ్యో...
మా కూచిపూడొచ్చి గోపెమ్మతో, మైఖేలు జాక్సన్నుఆడాలమ్మో ...
అట్టొచ్చిఇట్టొచ్చి అంటద్దు ముట్టద్దు చంపోద్దయ్యో...
బెట్టేక్కి గుట్టేక్కి చెట్టెక్కి కూకుంది నా కోకిల...
ఆగాలి ఈ గాలి జోరింక తగ్గాలి ముప్పొద్దులా...

సంబోధన...బోధన...

మా అన్నదమ్ములం అందరం డైలాగులకి ఫాన్స్. త్రివిక్రమ్, పూరి జగన్నాథ్, జంధ్యాల, శేఖర్ డైలాగులు మాకు అలాగా నోటి మీద తాండవం చేస్తూ ఉంటాయి. మేము పిలుచుకోవడం కూడా కొంచం informative గా ఉంటుంది. అది ఏ మూడ్ తో వచ్చేవాక్యమో ఆ సంబోధన బట్టే తెలిసిపోతుంది. ఉదాహరణలు చెప్తాను.

1. మణికంఠ

ఇప్పుడు ఒకడున్నాడు. చాలా నీట్ గా చెయ్యాల్సిన పని మెట్ట మెట్ట గా చేస్తున్నాడు. వాడిని ఏమి అనకూడదు. ఆ భావాన్ని వ్యక్తపరచడం ఎలాగా? how? వెధవ పని చేస్తున్న వాడిని - "నాన్న మణి" అని పిలిస్తే వాడికి ఆటోమాటిక్ గా ఏదో తేడ చేస్తున్నాను అని తెలిసిపోతుంది. ఎందుకో ఈ సీన్ చూస్తె తెలిసిపోతుంది.




2. బాలరాజు

ఒకడున్నాడు. వాడు బేవార్స్ గా ఉన్నాడు. మన పనికి అడ్డు తగుల్తున్నాడు లేదా పని ఉన్నా చెయ్యట్లేదు. అప్పుడు వాడికి ఆ విషయాన్ని ఎలాగ చెప్తాము. అప్పుడు వాడిని - "ఏంరా బాలరాజు. ఏమిటిరా నీవల్ల దేశానికి ఉపయోగం." అంటాము. అసలు "బాలరాజు" అని పిలువగానే మేటర్ అర్థం అయిపోవాలి.



3. బుజ్జా
ఒకడున్నాడు - వాడికి ఆవేశం ఎక్కువ మేటర్ తక్కువ. పోడిచేస్తా, చిమ్పెస్తా, తిరగేస్తా అంటున్నాడు. అసలు విషయం తెలియదు. అప్పుడు వాడికి ఎలాగ చెప్తాము. వాడిని "బుజ్జై" అని పిలుస్తాము. అప్పుడు వాడికి మేటర్ అర్థం కావాలి. ఈ సీన్ చూస్తె అయినా అర్థం కావాలి.



ఇంకా కొన్ని కామన్ dialogues:
"సో వాట్?" (చిరు ఇన్ చంటబ్బాయి)
"I'm coming" (మణికంఠ ఇన్ బద్రి)
"వద్దు. I'm happy" (కోటిగాడు (కుక్క) ఇన్ గోదావరి)

and so on...