మా మాతామహులు (సంసృతం ఆట్టే తెలియని తెలియనివాళ్ళకి: "మాతామహులు" అంటే "తల్లి యొక్క తండ్రి") విజయవాడలో గొప్ప పేరున్న సిద్ధాంతి. వాస్తు, జ్యోతిష్యం బాగా తెలిసి, అనుభవం ఉన్న మహానుభావులు. నాకు, నాలాంటి చాలా మందికి గురువు, మార్గదర్సకులు. తెలుగు సాహిత్యం పట్ల మంచి అభిరుచి కలిగిన వ్యక్తీ. తాతయ్య ఏది చెప్పినా గొప్ప అనుభవంతో, ముందు చూపుతో చెప్తారు. ఆయన చెప్పింది విని బాగుపడిన వాళ్ళు అనేకులు. ఆయన మంచి చతురత కలిగినవారు. ఆయన ఛలోక్తులు ఈ సంచికలో :)
~
మా తాతయ్య చిన్నదనంలో ఆయన స్కూల్ కి వెళ్లడానికి ఎనిమిది మైళ్ళు సైకిల్ ఐనా తొక్కాలి, లేకపొతే ఒక ఏటిని ఈదుకుంటూ వెళ్ళాలి. రెండూ ఉత్సాహంగానే చేసేవారు. మా తాతయ్యకి ఒక మారు అందరికంటే ఎక్కువగా వందకి తొంభై మార్కులు వచ్చాయి. తరువాతి మార్కు డబ్బై. ఎప్పుడు క్లాసు లో టీచర్ తో వాదిస్తూ, అప్పుడప్పుడు స్కూల్ కి డుమ్మా కొడుతూ ఉండే మా తాతయ్య కి అన్ని మార్కులు వస్తే ఆశ్చర్యపోయిన టీచర్, "ఏరా రామకృష్ణయ్య! ఎవరి దాంట్లో చూసి కాపీ కొట్టావురా?" అని అడిగారు. దానికి మా తాతయ్య తడుముకోకుండా..."నా కంటే ఎక్కువ
మార్కులు వచ్చినవాడి దాంట్లో అండీ", అని చెప్పారు. ఆ టీచర్ కి గొంతులో వెలక్కాయ పడినట్లయ్యింది.
~
అవిరామదీక్షతో, కఠోరమైన క్రమశిక్షణతో పొద్దున్న అయిదింటికి లేచి సంధ్యావందనం, సుర్యారాధానం చేసే మా తాతయ్య వ్యాపారంలో కూడా గొప్ప అభివృద్ది సాధించారు. అనకూడదు కానీ, వ్యాపారం అంటే మోసమే. మోసం చెయ్యకుండా, అన్నీ నిజాలే మాట్లాడి వ్యాపారం చేద్దాం అనుకుంటే కష్టం. అదే విషయం నాతో చెప్తూ, "తెల్లారితే తిమిరాన్తకుని ఆరాధన, మధ్యాహ్నం నుండి మాటలగారడి", అన్నారు. తాతయ్యకి కాస్త ఊరట కలిగిద్దాం అనే ఉద్దేశంతో, "అది ఆపత్ధర్మం తాతయ్య ", అన్నాను. దానికి మా తాతయ్య "పెళ్ళాం లేదని మరదలు చెయ్యి పట్టుకుని ఆపత్ధర్మం అంటావురా?", అన్నారు. నాకు ఒక్కసారి మతిపోయింది. "ఇంత మాటనేసారేటి?", అనుకుని నవ్వేసి ఊరుకున్నాను.
~
ఒక లక్ష జాతకాల దాక చూసిన మా తాతయ్యకి ఎంత పాండిత్యం ఉందొ, అనుభవం ఉందొ చెప్పడానికి నా మాటలు సరిపోవు. రోజూ కనీసం ఒక ఇరువై జాతకాలు చూస్తారు. అయినా ఎవరి దగ్గరా పొరబాటున కూడా డబ్బులు పుచ్చుకోరు. కొంతమందికి ఆటోకి చిల్లర లేకపొతే ఆయనే డబ్బులు చెల్లించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన జాతకాలు చెప్తుంటే ఎవరైనా నోరు వెళ్ళబెట్టుకుని చూడాల్సిందే.
నేను ఎప్పుడూ నా జాతకం గురించి అడిగే ధైర్యం చెయ్యలేదు. నా చిన్నప్పుడు ఎప్పుడో తప్పితే మా తాతయ్య నా జాతకం చూడలేదు అని నా నమ్మకం. ఈ మధ్యన, నేను జ్యోతిష్యం నేర్చుకుంటున్నాను అనే నెపంతో నా జాతకం చూపిస్తే, పది నిముషాలలో నా జీవితంలో ఏవేమి జరిగాయో, జరుగుతాయో, నా మనసులో ఏముందో చెప్పేశారు. షాక్ అయ్యాను :)
ఒక ప్రముఖ సినీగేయరచయిత జాతకం చూపించి ఇతని గురించి చెప్పండి అంటే, అది చూసి: "వీడు గొప్ప జ్ఞ్యానిరా, కానీ పచ్చి వ్యభిచారి", అన్నారు. ఆ రచయిత దగ్గర పని చేసిన మా ఫ్రెండ్ తాతగారు అది నిజమేనని చెప్పారు.
ఒకమారు ఎవరో వ్యక్తీ తన కూతురు పెళ్లి గురించి అడగటానికి వచ్చారు. అమ్మాయిది, అబ్బాయిది జాతకం చూసి మా తాతయ్య "చేసేయ్యవయ్యా...", అన్నారు. దానికి అతను నసిగాడు, "అతనికి ఉద్యోగం...", అన్నాడు. "ఫరవాలేదు. చేసేయ్", అన్నారు మా తాతయ్య. ఉద్యోగం లేకపోయినా అతనికే ఇచ్చి చెయ్యమన్నారు అంటే దాని అర్థం, ఆ అమ్మాయి జాతకానికి అతడి జాతకం చాలా బాగా నప్పింది అని. "అయ్యా...అది...పెద్ద అందగాడు కూడా...", మళ్ళీ నసిగాడు. మా తాతయ్యకి చిరాకు వచ్చింది. "పనికొస్తాడా?", అని అడిగారు. వచ్చిన ఆయన సిగ్గుతో, "హీ హీ హీ. ఆయ్", అన్నాడు. "ఐతే చేసెయ్యి", అన్నారు మళ్ళీ. మారు మాట్లాడకుండా వెళిపోయాడు అతను.
~
సాహిత్యమ్లో చమక్కులు చాలానే చదివిన మా తాతయ్య కొన్నిసార్లు అవి కూడా చెప్తారు. ఒకసారి ఒక ఉదంతం చెప్పారు. ఒక మహాకవి వెళ్తుంటే (పేరు మరిచాను :( ) ఒక మహారాజు ఎదురుపడి, "ఏమోయ్ కవివృషభ, ఎక్కడికి వెళ్తున్నావు?", అన్నారు. "కవివృషభ" అంటే "కవులలో ఎద్దువంటి వాడా", అని అర్థం. "ఎద్దు" అంటే "గొప్ప బలం కలిగిన వాడు", అనే ఉద్దేశంతో అన్నమాట. దానికి ఆ కవి, "తమబోటి కామధేనువు కోసం వెతుక్కుంటూ వెళ్తున్నాను అండీ", అన్నాడుట. ఇక్కడ "కామధేనువు" కి రెండు అర్థాలు ఉన్నాయి. "అడిగిన వరాలిచ్చే వేల్పు", అని ఒక అర్థం. (అంటే ఆ రాజు కవికోవిదులను ఆదుకునేవాడు అని అర్థం). మరొక నిగుఢార్థం: "అందమైన ఆవు", అని. అంటే, "నేను ఎద్దునే, నీ బోటి ఆవును వెతుక్కుంటూ వెళ్తున్నాను", అని. దెబ్బకి రాజుకు నోట మాటలేదు :)
No comments:
Post a Comment