Sunday, July 18, 2010

మీకు తెలిసిన బండి-ర (ఱ) ఉన్న పదాలు చెప్పండి!

నేను శాస్త్రీ శతకం పేరిట మూడున్నరసంవత్సరాల క్రితం నుండి వ్రాస్తున్న పద్యాలను నిన్న ఒక్క సారి తిరగేశాను. అందులో చాలా వ్యాకరణదోషాలు కనిపించాయి. వాటిలో ఒకటి: ర (సాధు రేఫ), ఱ (శకటరేఫ) కి భేదం చూపకుండా ప్రాస కలపడం. మన తెలుగు వ్యాకరణపుస్తకాలు నిశ్చయంగా చెప్తున్నది ఏమిటంటే, ఈ రెండింటికీ ప్రాస కుదరదు అని. దీన్నే ప్రాసవైరం అంటారు.

ఈ రెండింటికీ ఉచ్చారణలో భేదం ఉంది. అది ఎలాగ చెప్పలో నాకు తెలియదు కాని, 'ఱ' అన్నప్పుడు నాలుక ఇంకా బలంగా మూర్ధాన్ని (నోరు పై భాగాన్ని) తాకుతుంది అని నా నమ్మకం. ఏది ఎప్పుడు వాడాలో తెలుసుకుందామని సోదరుడు రాఘవని అడిగాను. ఆయన ఈ క్రింది విషయాలను తెలిపారు.

  • రఱల భేదాలు తెలుపుతూ సూత్రాలు ఏమీ లేవు. వాడుకని బట్టి గ్రహించటమే మార్గం. ఈ సూత్రాలభ్యం వల్ల పోతన కూడా ఎక్కడ ర వాడాలో ఎక్కడ ఱ వాడాలో సరిగా నిర్ధారించుకోలేక ఇబ్బంది పడ్డారని చెబుతారు.
  • ఉచ్చారణ విషయానికి వస్తే, 'ఱ' కొంచెం నొక్కినట్టుగా పలుకుతాం, 'ర' కొంచెం తేలికగా పలుకుతాం. ముఖ్యంగా ద్విత్వాలు వచ్చినప్పుడు ఈ భేదం ఇంకా బాగా తెలుస్తుంది. 
  • అప్పకవీయంలో ర-ఱ భేదం తెలుసుకోవటానికై ఉపయోగపడేలా రకారం వాడే పదాలూ, ఱకారం వాడే పదాలూ వేఱు వేఱు వర్గాలుగా ఇవ్వబడ్డాయి.

నాకు అప్పకవీయం చదవటానికి ఇంకా సమయం పడుతుంది. ఈ లోపల మన బ్లాగ్మిత్రులకు తెలిసిన 'ఱ' ఉన్న పదాలని సంగ్రహిద్దామని ఈ వ్యాసాన్ని వ్రాస్తున్నాను. నాకు తెలిసిన 'ఱ' ఉన్న పదాల జాబితా ఈ క్రింద ఉంది. మీకు తెలిసినవి కూడా వ్యాఖ్యల ద్వారా చెప్పగలరు.

కొన్ని ఉదాహరణలు:
మఱియు, ఇద్దఱు, ఆఱు, చిఱునవ్వు, ఎఱుగు, వఱకు, చెఱకు, తఱచు, మఱి, ఎఱుపు, పిఱికి, అఱుపు, కఱుకు, ఱొమ్ము, గఱి (గరుత్తుకు వికృతి, రెక్క అని అర్థం), చెఱువు

ద్విత్వం ఉన్న పదాలు:
జీలకఱ్ఱ, చిఱ్ఱెత్తు, ఎఱ్ఱని, జెఱ్ఱి, గుఱ్ఱము, కఱ్ఱ, వెఱ్ఱి, మఱ్ఱి, బుఱ్ఱ

కొన్ని పదాలు వస్తువుల చేసే శబ్దాన్ని అనుకరించే ప్రయత్నంలో వాడతాం. అలాంటి వాటిల్లో శకటరేఫం ఉండే పదాలు కొన్ని:
జఱ జఱ (ఈడ్చుట, జారుట)
కొఱ కొఱ (కోపంగా చూడటం)
కఱ కఱ (నవిలే విధానం)
కిఱ కిఱ (బండి చక్రం తిరిగే విధానం)
గఱ గఱ (గరుకుతనాన్ని తెలిపేది)
చొఱ చొఱ (నెత్తురు కారడం)
బిఱ బిఱ (తొందరగా నడవటం)
కిఱ్ఱు కిఱ్ఱు (తలుపు తెరిచేటప్పుడు వచ్చే శబ్దం)

14 comments:

రవి said...

తమిళ, మలయాళాల్లో ’ళ’ (zha) అనే అక్షరం ఒకటుంది. దీన్ని, య, ళ కు మధ్యమ స్థాయిలో పలకాలి. తమిళులనెవరినైనా అడిగితే చెబుతారు. మూల ద్రావిడ భాషలోని ఈ పదం తెలుగులో కాలక్రమేణ, ’ఱ’ గా మారిందని కొందరు భాషాశాస్త్రజ్ఞుల అనుకోలు.ఈ సారి జేసుదాసు పాటేదైనా వినండి. ఈయన ర ను ఱ గా పలుకుతాడని ఒక అపవాదు ఉన్నది.

ఱంపము
తెఱవ
బిఱ్ఱు (Tight)

ఇదివరకు బ్లాగులలో దీనిగురించిన వివరాలు చెదురుమదురుగా వచ్చాయి.

ఆ.సౌమ్య said...

అవును తమిళంలో, మళయాళంలోనూ ల, ళ, zha (ఱ కి ళ కి మధ్యలో ఉన్న ఉచ్చారణ) అని ఉన్నాయి. అదే మనకి ఱ గా రూపాంతరం చెంది ఉండవచ్చు.

ఱంపము
ఎఱుక
పాఱు (నిండు నదులు పాఱు నిల్చి గంభీరమై, వెర్రివాగు పాఱు వేగబొర్లి)
మఱి

వేమన, సుమతీ శతకాల్లో చాలా ఎక్కువగా ఈ "ఱ" ని వాడారు.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

నేనూ ప్రయత్నిస్తున్న విషయమే మీరూ చెప్తున్నారు.
ఇక మీరే నాకు గురువు.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

చెఱపకురా చెడేవు.
ఇది ఇలాగే చూసినట్టు గుర్తు. ఏమంటారు?

రాఘవ said...

ఱెక్క, ఱెప్ప.

ష్జ-ళ-ఱ వేఱ్వేఱు అక్షరాలు. ఉచ్చారణలో తేడా స్పష్టంగా కనబడుతుంది. తమిష్జ్ తమిళమయ్యింది. తమిష్జంలో ఏష్జు తెలుగులో ఏడు అయ్యింది. కాఱ్ఱు అని వ్రాసి తమిష్జులు కాట్రు అని చదువుతారు. ఉచ్చారణ కొంచెం తెలుస్తుంది ఇక్కడ.

నేను వేఱే టపా వ్రాయాలేమో! నాకూ నేర్చుకునే అవకాశం చిక్కింది :)

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

కొఱకు (కోసం)

.C said...

చేఱు (also చేఱ్చు), కొఱుకు, వాఱ్చు, పాఱు (also తెల్లవాఱు), పఱచు (spread, etc. also in తెలియబఱచు, మొదలైనవి), తుఱుము (పూవులు తుఱుముకోవటం), వఱలు (prevail), తెఱచు (also తెఱిపి), చెఱుపు (erase/deteriorate), కుఱియు (?), మెఱియు (also మెఱుపు), అఱయు (prevail?), , నెఱియు (to pale), దొఱకు, మెఱుగు, చేఱువ, ఎవఱు, ఒకఱు, దఱి, దాఱి, ఱెక్క, ఱాయి, ఱంకె, ఎఱ, వెఱ(పు), చెఱ, మఱ (?), తెఱ, మఱపు, పడమఱ, చెఱుగు (చెఱిగిపోవటం), చెఱగు [= winnowing/sifting? (v.), వైపు (n.)], కుఱుపు, కొఱకు, వఱకు, చెఱకు (sugarcane/firewood), మఱల, తెఱువు (habitat/abode/station, also in బ్రతుకు తెఱువు), నెనఱు, నెఱవు/నెఱ (= perfect/full, as in నెఱజాణ, నెఱకాడు, నెఱనమ్ము, నెఱవేఱు), గొఱ్ఱె, బఱ్ఱె, నెఱ్ఱ (crack), తొఱ్ఱ, పిఱ్ఱ, పుఱ్ఱె, పుఱ్ఱ (= ఎడమ), మొదలైనవి.

ఇవి కాక మఱి కొన్ని పదాలున్నాయి. ఇవి రెండు రకాల రేఫాలతోనూ ఉన్నాయి:

తీఱు ([as in చేసి తీఱతాను, ఋణం తీఱటం, మొదలైనవి); తీరు = manner; తీర- (తీరం) = ఒడ్డు
మాఱు [= change]; మారు = repeat (మారు వడ్డన, ముమ్మారు, మొదలైనవి)
ఆఱు [= dry (v.) (?), six]; ఆరు = గునపం కొన (n.)(?)
వేఱు = different; వేరు = root (?)
జాఱు = slide; జార = వ్యభిచార (?)
అమఱు = arrange/set (v.); అమర = దేవతలకు సంబంధించిన
మఱు = next/alternate; మరులు = మనుషులు, temptations/losing consciousness?
మీఱు = exceed/encroach/override; మీరు = you (pl./respectfully)
ఎఱుక = know/knowledge, ఎరుక = a sort of tribe
అఱ = shelf/rack; అర = half
వాఱ = corner; వారము = వీక్; వార (as in వారవనిత)

Disclaimer: "ఇవి నాకు తెలిసిన ప్రయోగాలు" అనే కన్నా... "ఇవి నేను ఊహించినవి, బహుశా ఎక్కడో చూసినవి" అనటం సబబు. Corrections are welcome.

Sandeep P said...

@అందరూ
మీకు తెలిసిన పదాలను తెలిపినందుకు ధన్యవాదాలు :)


@రవి
ఈ తమిష్జ "ష్జ" గురించి చాలా విన్నానండి. మాటాడితే, "అదిగో ష్జ, ఇదిగో ష్జ" అంటారు తమిష్జసోదరులు.

@సౌమ్య
అవునండి. సుమతీశతకంలో "ఏఱకుమీ కసుగాయలు" అనే పద్యాన్ని ఱ-ప్రాసతో వ్రాశారు. ఇదిగో లింక్.

@మందాకిని
గురువు వంటి పదాలు నాబోటి అల్పుడికి ఆపాదిస్తున్నారేమిటండి :) నాకు తెలిసినదంతా మనోనేత్రంలో వ్రాస్తూనే ఉంటాను. మీ అభిప్రాయాలను, సూచనలను, ప్రశ్నలను, సలహాలను వ్యాఖ్యల పెట్టెలో పడెయ్యండి :)

చెఱపకు, కొఱకు - రెండూ సరైనవేనని నా నమ్మకం.

@రాఘవ
స్వామీ, మీరే వ్రాస్తాను అంటే నేనీ టప వ్రాసే సాహసం చేసేవాణ్ణి కాదు. మీరు వ్రాసిన తఱువాత ఆ లంకెను ఇక్కడ పెట్టగలరు.

@.సి
చాలా పదాలను సేకరించావు సోదరా. బ్లాగ్మిత్రులకు బాగా ఉపయొగపడతాయి. థ్యాంకులు.

కామేశ్వరరావు said...

ఱ, ర తేడాలకి కొన్ని కొండ గుర్తులు:

సంస్కృత సమమైన పదాలలో అన్నిటా "ర"కారమే వస్తుంది. సంస్కృతంలో "ఱ" లేదు కాబట్టి. ఉదాహరణకి ఉదాహరణ, వారము, సారము, హారము, కరము, శరము ఇలా.
అచ్చ తెలుగు పదాల్లో మాత్రం కొన్ని చోట్ల ఱ, కొన్ని చోట్ల ర వస్తుంది. తెలుగు పదాల మూలాలు తెలిస్తే బహుశా ఈ భేదాన్ని గుర్తించ వచ్చు. మూల ద్రవిడ భాష నుంచి తెలుగులోకి వచ్చిన పదాలన్నిట్లోనూ బహుశా ఱ వస్తుందని నా ఊహ. అయితే వీటిల్లో వచ్చిన రూపాంతరాలు అస్పష్టంగానే ఉంటాయి. ఉదాహరణకి "గుఱి""లో ఉన్నది "ఱ". అందులోంచే వచ్చిన "గుఱుతు"లో కూడా "ఱ" నే. కాని అది పొట్టిదై, "గుర్తు" గా మారినప్పుడు "గుఱ్తు" అవ్వలేదు!

ద్విత్వం వచ్చిన పదాలన్నిట్లోనూ ఉండేది "ఱ" నే.

.C said...

<< ద్విత్వం వచ్చిన పదాలన్నిట్లోనూ ఉండేది "ఱ" నే. >>
ఇది నాకెప్పుడూ అనుమానమే... తీర్చినందుకు నెనఱ్లు! :-) "గుర్తు" గుఱించి ఉన్న అనుమానం కూడా తీఱ్చినందుకు కూడానూ.

మఱిన్ని పదాలు: బాఱు (queue/length), వీఱు/వాఱు, కొందఱు/అందఱు/ఎందఱు/ఇందఱు, గుఱించి...

అన్నట్టు... తమిళంలోని ఆ unique అక్షరం తెలుగులోనూ ఉండేదిట. దాన్ని శకటరేఫంలా పలకరు కానీ వ్రాసినప్పుడు శకటరేఫానికి మధ్యలో వచ్చే అడ్డగీత తీసేస్తే ఆ అక్షరం అవుతుంది. పలకటం తమిళంలో లాగానే. అది ఏనాడో వదిలేసినట్టున్నారు తెలుగులో. (http://tdil.mit.gov.in/TelugulScriptDetailsApr02.pdf లో 5వ పుటలో palatal retroflex lateral అన్న పేరుతో చూడవచ్చు, Special/ancient Characters అన్న శీర్షికలో.)

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

మీరన్నట్టు కిరణ్ గారు, కామేశ్వర్రావు గారు మంచి సమాచారం ఇచ్చారు.
ధన్యవాదాలు.

కాంత్ said...

తమిழம்లో, zha(ழ‌) తో పాటు, ర(ர‌), ఱ(ற‌), ళ(ள‌) - అన్నీ వేరే గా ఉన్నాయి. "ழ‌" అన్నది రూపాంతరం చెంది తెలుగులో "ఱ" అయిందని అనుకోను.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

గుఱ్ఱము, ఎఱ్ఱన

కామేశ్వరరావు said...

నచకి గారూ,
"నెనరు"లో ఉన్నది "ర" కారమే, "ఱ" కాదు. అంత సున్నితమైన భావాన్ని సున్నితంగానే కదా పలకాలి!:-)

పైన చెప్పిన "గుర్తు" విషయాన్ని సాధారణీకరించవచ్చు (generalize చెయ్యవచ్చు). ద్విత్వం కాని సంయుక్తాక్షరం ఏదైనా అందులో "ఱ" రాదు, "ర"కారమే వస్తుంది.