Sunday, July 11, 2010

ఉపమాలంకారము (Simile)

వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> ఉపమాలంకారము


అంత్యప్రాసాలంకారంతో శబ్దాలంకారాల గురించి చెప్పడం ముగిసింది. ఇక అర్థాలంకారాలు. 'అర్థమే' ప్రథానంగా గల అలంకారాలను అర్థాలంకారాలు అంటారు. ఇవి వందకు పైగా ఉన్నాయి అని కొందరు చెప్తారు, అంతకంటె తక్కువగానే ఉంటాయని మఱికొందరు చెప్తారు. సుమారుగా వంద ఉంటాయి అని అంటే తగువు ఉండదు. స్థూలంగా ఉన్న ఒక అలంకారాన్ని చిన్నచిన్న భేదాలతో విభజిస్తే అప్పుడు సంఖ్య పెరుగుతుంది. అలంకారాలను గురించి వివరించడానికి పూర్వీకులు పుస్తకాలను రచించారు. కానీ, నేను వ్రాస్తున్నది కేవలం అలంకారాలను పరిచయం చేయాలి అన్న ఉద్దేశంతో కాబట్టి, ముఖ్యమైనవి కొన్ని చూద్దాము.

కాళిదాసు ఉపమాలంకారాన్ని ఎక్కువ వాడేవాడని "ఉపమా కాళీదాసస్య" అని పెద్దలు చెప్తారు. అలాగే శ్రీనాథుడికి అర్థాంతరన్యాసాలంకారము, భాస్కరశతకం మారద వెంకయ్యకి దృష్టాంతాలంకారము, చేమకూర వేంకటకవికి శబ్దాలంకారాలు/శ్లేషాలంకారము, పోతనకి శబ్దాలంకారాలు ఇష్టమని వారి కావ్యాలు చదివితే తెలుస్తుంది(ట). అలాగ మీకు తెలిసిన కవులు ఎక్కువగా వాడిన అలంకారాలను గురించి వ్యాఖ్యల ద్వారా చెప్పగలరు.

ఈ అలంకారలకు చలనచిత్రగీతాలను చెప్పుకుంటూపోతే బోళ్ళు ఉదాహరణలు ఉంటాయి. కొన్ని అవి, కొన్ని పద్యాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. అర్థాలంకారాలు కర్ణాటక సంగీతంలోని కీర్తనలు కూడా ఎక్కువ వినబడతాయి. అవి కూడా చర్చించుకుందాము.

ఉపమాలంకారం

ఉపమాలంకారము అన్ని అర్థాలంకారాలలోకి ఎక్కువ ఉపయోగించబడుతున్నది అని నా నమ్మకం. దీన్ని ఆంగ్లంలో "simile" అంటారు.

లక్షణం: ఉపమాయత్ర సాదృశ్య లక్ష్మీరుల్లసతి ద్వయోః
వివరణ: ఉపమానానికి, ఉపమేయానికి సామ్యరూపమైన సౌదర్యాన్ని చెప్పడం "ఉపమా" అలంకారం అవుతుంది.

ఈ అలంకారానికి నాలుగు వస్తువులను మనం చూసుకోవాలి.
ఉపమేయం: దేని గురించి చెప్తున్నాము?
ఉపమానం: దేనితో పోలుస్తున్నాము?
సమానధర్మం: రెండింటికీ పోలిక ఏమిటి?
ఉపమావాచకం: ఏ పదాన్ని వాడి ఈ రెండింటికీ పోలికను వ్యక్తపరుస్తున్నాము?

ఉదా: (రఘువంశం, రచన: కాళిదాసు)
వాగర్థావివ సంపృక్తౌ, వాగర్థప్రతిపత్తయే
జగతఃపితరౌ వందే, పార్వతీపరమేశ్వరౌ ||

అర్థం: పదాలను (వాక్కులు), అర్థాలను నాకు ప్రసాదించమని - వాక్కు, అర్థం వలె కలిసి ఉండే పార్వతీపరమేశ్వరులకు నేను నమస్కరిస్తున్నాను.

ఉపమేయం: పార్వతీపరమేశ్వరులు; ఉపమానం: వాక్కు, అర్థం; సమానధర్మం: కలిసి ఉండటం; ఉపమావాచకం: ఇవ (సంస్కృతంలో), వలె (అనువాదంలో)

ఇక్కడ వాగర్థాలకు, పరమేశ్వరులకు సామ్యం చెప్పబడింది. శబ్దం లేకుండా అర్థం లేదు, అర్థం లేకపోతే శబ్దానికి విలువలేదు - ఇవి రెండూ ఎప్పుడూ కలిసే ఉంటాయి. అలాగ ఆ పార్వతీపరమేశ్వరులు కూడా కలిసే ఉంటారు. ఇది ఈ రెండు విషయాల మధ్యనా ఉన్న సామ్యం.

ఈ నాలుగు వస్తువులూ ఉన్న ఉపమాలంకారాన్ని పూర్ణోపమాలంకారం అంటాము. కొన్ని సందర్భాలలో వీటిలో కొన్నే ఉండవచ్చును. ఇలాంటివి మనం చలనచిత్రగీతాల్లో ఎక్కువ చూస్తూ ఉంటాము.

ఉదా: (భగవద్గీత, రచన: వ్యాసభగవానుడు)
బ్రహ్మణ్యధాయ కర్మణి సంగం త్యక్త్వా కరోతి యః
లిప్యతే న స పాపేణ పద్మపత్రమివాంభసా

అర్థం: పరమాత్ముడికి అన్నీ వదిలేసి, కర్మలను రాగద్వేషాలు లేకుండా ఎవరైతే ఆచరిస్తారో వారిని తామరాకులను నీరు అంటని విధంగా పాపం అంటదు.

ఉదా: (మంచి మనసులు, రచన: ఆత్రేయ (?) )
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

ఉదా: (ఆనంద్, రచన: వేటూరి)
మేఘమల్లె సాగివచ్చి, దాహమేదొ పెంచుతావు; నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావు

ఉదా: (యువరాజు, రచన: వేటూరి)
తొలివలపు వేదంలాగా లిపిలేనిది


తెలుగుకావ్యాలలో, చలనచిత్రగీతాల్లో ఈ అలంకారాన్ని గుర్తించిన చదువర్లు తప్పకుండా వ్యాఖ్యలద్వారా తెలుపగలరు.  ఇంతకన్నా మంచి ఉదాహరణలు చాలానే ఉన్నాయి.

6 comments:

.C said...

* ...కరికి లంఘించు సింగంపు కరణి... (కుప్పించి యెగసిన కుండలమ్ముల కాంతి... పద్యం - మహాభారతం యుద్ధపర్వం - తిక్కన)
* సింగంబాకటితో గృహాంతరమునన్ జేడ్పాటుమైనుండి మా
తంగస్ఫూర్జిత యూధదర్శన సముద్యత్‌క్రోధమై వచ్చు నోజన్... (మహాభారతం యుద్ధపర్వం - తిక్కన)
* తేనెపట్టు రేగినట్టు, వీణ మెట్టు వణికినట్టు అల్లుకుంది నా చుట్టూ నీ చిఱునవ్వు (మన్మథుడు - సీతారామశాస్త్రి)
* "శివసముద్రమూ, నయాగరా వలె ఉరకండీ ఉరకండీ ముందుకు" (మహాప్రస్థానం - శ్రీశ్రీ)
* "ఆకాశపుటెడారిలో కాళ్ళు తెగిన ఒంటరి ఒంటె లాగుంది జాబిల్లి" (ఒక రాత్రి - శ్రీశ్రీ)
* "నడిసముద్రపు నావ రీతిగ సంచరిస్తూ, సంచలిస్తూ", "గుండుసూదులు గుచ్చినట్లుగ శిరోవేదన అతిశయించగ, రాత్రి నల్లని ఱాతి పోలిక గుండె మీదనె కూరుచుండగ" (బాటసారి - శ్రీశ్రీ)
* "ఆరుతున్న కుంపటి విధాన కూర్చున్నది ముసల్దొకతె", "ముగ్గుబుట్ట వంటి తల" (భిక్షు వర్షీయసి - శ్రీస్రీ)


నాకు ప్రశ్నలెక్కువ అర్థాలంకారాల్లో. నేనూ నీతో నేర్చేసుకుందామని ఆశ. :-)

* "కొండగాలి మార్చింది కొంటె వాగు జోరు, కులుకులెన్నొ నేర్చింది కలికి యేటి నీరు" - ఇందులో పాత్రోచితమైన ఉపమానం సూచ్యంగా ఉంది. ఇది ఉపమాలంకారానికి ఉదాహరణ అవుతుందా?
* "మువ్వుల ఉరుముల సవ్వడులై, మెలికలు మెఱుపుల మెళకువలై, మేను హర్షవర్షమేఘమై, వేణి విసురు వాయువేగమై, అంగభంగిమలు గంగ పొంగులై, హావభావములు నింగి రంగులై..." - ఇది "అతిశయోక్తి" అవుతుందా, ఉపమాలంకారమవుతుందా? రెండూ అయ్యే అవకాశాలున్నాయా?
* "భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని, వైప్లవ్యగీతాన్ని నేను" - ఇది ఉపమాలంకారమవుతుందా? ("నేను" అనే ఈ శ్రీశ్రీ కవితలోనే మఱిన్ని ఉపమానాలు (?) కనిపిస్తాయి.)
* ఉపమానం వాడిన చోటనే మఱో అలంకారానికి (తగిన కారణాల వలన) ఆస్కారమున్నా కూడా అది తప్పనిసరిగా ఉపమానాలంకారం (కూడా) అవుతుందా?

కొత్త పాళీ said...

చాలా బావుంది సందీప్.

కిరణ్ మీ ప్రశ్నలకి సమాధానం కాదు గానీ నా ఆలోచనలు కొన్ని.
అసలు అన్ని అర్ధాలంకారాలూ ఉపమాలంకారపు రూపాంతరాలే (variations on the theme) అని ఒక లక్షణం ఉంది.

శాస్త్రోక్తమైన ఉపమాలంకారంలో సందీప్ చెప్పిన నాలుగు లక్షణాలూ ఉండాలి. చాలామంది కవులు ఉపమాన ఉపమేయాలకు మధ్యగల సమాన ధర్మాన్ని వదిలేస్తుంటారు. ఆ సమానధర్మం ఏంటో చెప్పకపోతే దాన్ని ఉపమ అనలేం.

"భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని, వైప్లవ్యగీతాన్ని నేను" - ఇది రూపకం. Metaphor.

>>>ఉపమానం వాడిన చోటనే మఱో అలంకారానికి (తగిన కారణాల వలన) ఆస్కారమున్నా కూడా అది తప్పనిసరిగా ఉపమానాలంకారం (కూడా) అవుతుందా?<<<
ఉపమలోనే ఇతర అలంకారాలు కూడా గర్భితమై ఉండొచ్చు.

శ్రీనివాసమౌళి said...

చినుకంటి జీవితాన...తడిజాడ నువ్వు అంటా!
--శ్రీనివాసమౌళి

శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వ
మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వా
నటరాజుకు జతిస్వరముల పరిమళమివ్వా
--సీతారామశాస్త్రి

గగన గళముండి అమరగానవాహిని
జాలువారుతోంది ఇలా అమృతవర్షిని..
--సీతారామశాస్త్రి

పైవి ఉపమాలంకారమవుతాయా?

and what about this one..

మేడిపండు లాంటి man వీడండో
manhole లాంటి మైండ్ వీడిదండో..
deep-అండో ..cheap-అండో
--కేదార్ నాథ్

Sandeep P said...

@.C & Mouli
మీ ఉదాహరణలకు ధన్యవాదాలు. నాకు వీటిల్లో ఏవి నిజమైన ఉపమాలంకారాలో తెలియడానికి మిగతా అలంకారాలపైన కూడా పట్టు ఉండాలి. అందుకని, ఇంకా కొన్ని అలంకారాలను చర్చించేంతవరకు ఏమీ చెప్పలేను.

@కొత్తపాళి
ధన్యవాదాలండి :) మీరు ఇదివరకు కూడా రెండు మూడు చోట్ల అలంకారాల గురించి వ్యాఖ్యలు వ్రాయడం నేను చదివాను. మీకు నచ్చిన ఉదాహరణలు ఉంటే తప్పక చెప్పగలరు.

Unknown said...

వేదం లా ఘోషించే గోదావరి అమర ధామం లా శోభిల్లే రాజమహేంద్రి.

చిత్రం: సీతారామయ్య గారి మనవరాలు

ఇది పూర్ణ ఉపమాలంకారం?

-సు రా

Sandeep P said...

"వేదంలా ఘోషించే" - ఈ పాట సీతారామయ్య గారి మనవరాలు చిత్రంలోనిది కాదు. ఆంధ్రకేసరి చిత్రం లోనిది.

మొదటి భాగం "వేదంలా ఘోషించే గోదావరి": ఇది ఉపమాలంకారం అనడానికి ఆధారం ఉంది. ఉపమానం (వేదం), ఉపమేయం (గోదావరి), సామ్యం (ఘోషించడం), ఉపమావాచకం (లా) ఉన్నాయి. అలాగే రెండవది కూడా.